koodali

Monday, February 21, 2011

రైతులూ ఆత్మహత్యలు వద్దు......ఆత్మబలమే ముద్దు. మీకు ఎవరైనా కష్టాల్లో ఉన్న రైతులు కనిపిస్తే ఈ కధ చెబుతారు కదూ.......


రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి చిన్నపిల్లలు అనాధలవటం చూసాక బాధతో ఇలా రాయాలనిపించింది..........

పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేముందు ఆలోచించాలి. తమకే బ్రతకటం చేతకాక చనిపోతే చిన్నపిల్లలు ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలుపడతారు ? అదే ఆడపిల్లలయితే వారికి ఇంకా ఎన్నో బాధలు.

ఇవన్నీ ఆలోచించి పిల్లలకోసమైనా ధైర్యముగా బ్రతకటం నేర్చుకోవాలి.

ఇప్పుడు ఏం జరుగుతోందంటే...... రైతులు తమవద్ద మిగిలిన విత్తనాలు సరిపోక అప్పు చేసి విత్తనాలు కొంటారు. మళ్ళీ అప్పుచేసి ఎరువులు కొంటారు. ఆఖరికి గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు.

* మొదలు ఈ కాన్సెప్ట్ ను కొన్నాళ్ళు పక్కన పెట్టండి. మొదలు ఆకలితో చావటం కాకుండా బ్రతికి ఉండటం అన్నది ముఖ్యం.

మీ కుటుంబంలో పదిమంది సభ్యులు ఉన్నారనుకోండి. కొంతకాలం మీవరకు బ్రతకటానికి సరిపడా ఆహారసంపాదన గురించి మాత్రమే ఆలోచించండి.

ఎలా అంటే........... ఇక్కడ ఒక కధ చెబుతాను. ఒక రెండు ఎకరాల పొలం ఉన్న రైతు బాగా నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆఖరు నిమిషంలో ఆలోచించారు......ఎలాగైనా బ్రతికి తీరాలని.

తనకున్న రెండు ఎకరాల మొత్తం పొలంలో పంట వెయ్యలేదు. ఆ పొలంలో మట్టితో చిన్న గుడిసె వేసుకున్నారు. చేను గట్లమీద ఉన్న కొబ్బరి, తాటి చెట్ల ఆకులతో గుడిసెను కప్పుకున్నారు.

ఒక ఎకరం పొలంలో కొద్దిభాగం వరి, మిగతాభాగంలో కొద్దికొద్దిగా జొన్నలు, మినుములు, శెనగలు పంటలు వేశారు. ఇవన్నీ వారి కుటుంబానికి సరిపోయేంతలో.

గుడిసె చుట్టూ రకానికి ఒకటి ,రెండు చొప్పున అన్నిరకాల పండ్లమొక్కలు నాటారు. ఆకుకూరలమడులు, కాయగూరలుమొక్కలు , పూలమొక్కలు వేశారు.

వర్షపు నీరు వృధా పోకుండా పొలంలోని బావిలోకి చేరేటట్లు ఏర్పాటు చేసారు. పంటలకు బిందు సేద్యం పధ్ధతిలో నీటి వసతి ఏర్పాటు చేసారు.

రెండు ఆవులు, రెండు ఎడ్లు కొనుక్కున్నారు. దూడలు త్రాగగా మిగిలినవి పాలు వారి కుటుంబానికి సరిపోయేవి. పేడ, ఆకులపచ్చిరొట్ట, వేప వీటితో సేంద్రియ ఎరువులు పంటకు వాడారు.

మంచిపంట పండింది. ఇలాంటి సహజసిధ్ధమైన ఆహారం తినటం వల్ల జబ్బులు పెద్దగా రావుగదా ! పెరటివైద్యం, ఆయుర్వేదం వాడుకునేవారు.

పిల్లలను అదే ఊరిలో గవర్న్ మెంట్ బడిలో చేర్పించారు.

తమ దుస్తులకొరకు పొలంలో ప్రత్తి మొక్కలు పెంచారు. వాటినుంచీ వచ్చిన దూదితో మగ్గంపైన నూలుతీసి దుస్తులు వారే నేసేవారు.

ఇవన్నీ అమర్చి కష్టపడేసరికి చక్కటి పంట చేతికొచ్చింది. , ఆకుకూరలు , కూరగాయలు వారికి సరిపోగా మిగిలినవి అమ్మటం మొదలుపెట్టారు. సంతలో వస్తుమార్పిడిపద్ధతిలో ఇవి ఇచ్చి తమకు కావలిసిన ఇతర దినుసులు తెచ్చుకునేవారు.

క్రమంగా పండ్ల చెట్లు పెద్దవయి అన్ని సీజన్లలోనూ అన్నిరకాల పండ్లు విరగకాసేవి. వాటిలో కొన్నిటిని ఇరుగుపొరుగు వారికి ఇచ్చేవారు.

ఇలా చుట్టుప్రక్కలవారితో స్నేహంగా ఉంటూ, నెమ్మదిగా నిలదొక్కుకుని అందరికి చేదోడువాదోడుగా ఉండేస్థాయికి వచ్చారు.

పూరి గుడిసె స్థానంలో ఇటుకగోడలతో పెంకుటిల్లు ఏర్పాటుచేసుకున్నారు. అలా రెండుఎకరాలు అయిదుఎకరాలకు పెంచుకున్నారు.

అలా అలా సంపద ఇంకొంచెం పెంచుకుని ఇక చాలు అని తృప్తిపడి , అనవసరమైన వస్తువులకోసం వెంపర్లాడకుండా ఉన్నదాంట్లోనే పొదుపుగా తృప్తిగా జీవిస్తున్నారు.

ఏదో నాకు తోచింది రాసాను. ఇదంతా చదివి చాలామంది నవ్వుతారేమో.

మన పాతకాలంలో ఇలాగే జీవించి ..... సుఖంగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే తప్పేమీలేదు.

పురుగుమందులు త్రాగి ప్రాణాలు తీసుకునేకంటే ప్రకృతి ఒడిలో పచ్చగా బ్రతకటం మేలు కదూ....

మీకు ఎవరైనా కష్టాల్లో ఉన్న రైతులు కనిపిస్తే ఈ కధ చెబుతారు కదూ.

 

2 comments:

  1. నా ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ ఆచరణ సాధ్యమే. అసలు మొదట కనీసం తన మీద ఆధారపడే తలిదండ్రులు, భార్యా పిల్లల కోసం బ్రతికిఉండి బట్టకట్టాలనే ధైర్యం కోల్పోకూడదు. మంచి పోస్ట్. థాంక్స్.

    ReplyDelete
  2. సారీనండి. జవాబివ్వటం లేటయినందుకు. పని వత్తిడివల్ల బ్లాగ్ చూడటం కుదరలేదండి. ఈ పోస్ట్ నచ్చినందుకు కృతజ్ఞతలండి. కానీ మనం ఇక్కడ వ్రాయటమే కానీ ఇవి ఎవరైనా ఉపయోగించుకుని లాభపడితే బాగుంటుందండి.

    ReplyDelete