koodali

Friday, April 28, 2017

అక్షయ తృతీయ...
అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని చేస్తారు.
.....................


అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .


అక్షయతృతీయ పండుగ వేసవిలో వస్తుంది. అప్పుడు మంచినీరు, గొడుగు, విసనకర్ర ..వంటివి దానం చేయటం వల్ల ఎందరికో ఉపయోగం కలుగుతుంది.


దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి జరుగుతుందని, ఆహారం, గృహం …వంటివి కొరత లేకుండా లభిస్తాయని అంటారు.
................


అక్షయతృతీయ రోజున బంగారం కొనుక్కోవటం మంచిదని కూడా పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని కూడా చెప్పారు.


అయితే ఇప్పుడు ఇతరులకు దానం చేయవలసిన విషయాలను వదిలేసి , అక్షయతృతీయ అంటే బంగారం కొనుక్కోవటమే ..అన్నట్లుగా జరిగిపోతోంది.
..........


పూర్వీకులు సమాజంలో అందరికీ ఉపయోగపడేవిధంగా ఎన్నో చక్కటి ఆచారాలను ఏర్పాటుచేసారు.
 
అయితే కాలక్రమేణా కొన్ని ఆచారాలు మార్పులుచేర్పులను సంతరించుకుని పూర్వీకుల అసలు ఉద్దేశ్యాన్ని మరుగునపరచే విధంగా తయారవుతున్నాయి.
..............


అంతా బాగుండాలి. అంతా దైవం దయ.
.................


నేను ఈ మాత్రం బ్లాగ్ వ్రాస్తున్నానంటే అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

Monday, April 24, 2017

జీవుల మంచి కోసమే...


 ప్రాచీన కాలంలో జరిగినట్లుగా అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రాచీనులు తెలియజేసినవి కాకపోవచ్చు. కాలక్రమంలో గ్రంధాలలో వచ్చి చేరి ఉండవచ్చు. ఏవి నిజమో? ఏవి కల్పితాలో? భగవంతునికే తెలియాలి.


 ఒకప్పుడు శివుడు శనిదేవుని ప్రభావానికి భయపడి శనైశ్చరునికి కంటబడకుండా ఉండటం కోసం మారువేషంలో దాక్కోవటం జరిగిందనే విధంగా కొన్ని కధలు ప్రచారంలో ఉన్నాయి.

 ఈ కధలు కల్పితం కావచ్చు, కల్పితం కాదనుకున్నా కూడా , ఈ కధలను కొన్ని కోణాలలో ఇలా కూడా భావించవచ్చు .

 శివుడు శనైశ్చరునకు గురువు. శివుడే శనైశ్చరునికి న్యాయాధిపతి పదవిని ఇచ్చారంటారు.

 తన గురువైన శివుడంటే శనైశ్చరునికి ఎంతో గౌరవం. శివుని కష్టపెట్టాలని శనైశ్చరుడు అనుకోవటం జరగదు.

 శనైశ్చరుని ప్రభావం గురించి భయపడి శివుడు మారువేషం ధరించటం అనే విధంగా ఉండదు.

 శివుని అంశ అయిన హనుమంతులవారు ఒకప్పుడు శనైశ్చరునికి సహాయం చేయటం వల్ల, శనివారం హనుమంతుని పూజించిన భక్తుల పట్ల శనైశ్చరుని దయ ఉంటుందని చెప్పినట్లు అంటారు.


 ఈ విషయాన్ని గమనిస్తే , శివుని అంశ అయిన హనుమంతుడు శనైశ్చరునికి సహాయం చేసినప్పుడు ....శివుడు శనైశ్చరుని ప్రభావం గురించి భయపడి మారువేషం ధరించటం అనే విధంగా ఉండదు. అయితే, శనైశ్చరుని ప్రభావం నుంచి శివుడు కూడా తప్పించుకోలేదు..అని చెబితే, ఆ భయం వల్ల ప్రజలు ఏలినాటి శని కాలంలోనైనా ధర్మబద్ధమైన పనులు చేసే అవకాశం ఉంది. అందువల్ల కూడా ఆ దైవలీల అలా జరిగి ఉండవచ్చు. కొందరు మనుషులు గతకాలంలో పాపాలు చేసి ,తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ.. ప్రస్తుత కాలంలో మంచి  పనులు చేస్తుంటారు. ఏలినాటి శని కాలంలో కలిగే కష్టాలకు భయపడేవాళ్ళలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు.


 అయితే, గతంలో తాము చేసిన పాపాలకు పడే శిక్ష గణనీయంగా తగ్గాలంటే.. ఏలినాటి శని అంటే విపరీతంగా భయపడటం తగ్గించుకుని .. శనైశ్చరుని, హనుమంతుని, ఇంకా వారికి తోచిన దేవతలను పూజిస్తూ, చెడ్డపనులు చేయటాన్ని మానటం, మంచిపనులు చేయటం..ద్వారా దైవకృప కొరకు ప్రయతించవచ్చు. వారి ప్రయత్నాన్ని బట్టి దైవకృపను పొందవచ్చు .


ఈ విధంగా కొంచెం దయ, కొంచెం కఠినత తో సమతుల్యత ఉండేటట్లుగా   పెద్దలు  విషయాలను తెలియజేసి ఉండవచ్చు. సామాన్యంగా ఏలినాటిశని జీవితంలో మూడుసార్లు వస్తుందంటారు.ఈ విషయాన్ని గమనిస్తే శనైశ్చరుని ప్రభావం వ్యక్తి జీవితంపై ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది.మంచి పనులు చేస్తే శనైశ్చరుని కృప కలుగుతుంది. 
...............

 శనైశ్చరుడు లోకాన్ని న్యాయబద్ధంగా నడిపించటానికి న్యాయమూర్తి పాత్ర నిర్వహిస్తారంటారు. ఇక్కడ కొన్ని విషయాలను చెప్పుకోవాలి.


 ప్రజలు అందరూ ధర్మబద్ధంగా ప్రవర్తించాలంటే దయగా ఉండటం తో పాటూ కొన్నిసార్లు కొంత కఠినంగా ఉండటమూ అవసరమే.

 లౌకిక జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటేనే కొన్ని కష్టాలు, కొన్ని త్యాగాలు అవసరమవుతాయి...

 .అలాంటప్పుడు మనిషి జీవితలక్ష్యమైన దైవాన్ని పొందటానికి కొంతయినా నియమాలు, కష్టాలు ఉంటాయి కదా!

 కొందరు ఏమనుకుంటారంటే, శనిదేవుడు ప్రజలను శిక్షిస్తారు అంటారు. అలా అనుకోవటం తప్పు.

 శనిదేవుడు న్యాయ పరిరక్షకుడు. కాబట్టి , ఎవరైనా పాపాలు చేస్తే వారికి తగ్గ శిక్షను విధించి, తద్వారా వారిని మంచి మార్గానికి తీసుకు వస్తారు.

 లోకంలో శిక్షలంటూ లేకపోతే ప్రజలలో పాపభీతి తగ్గిపోతుంది కదా ! న్యాయస్థానాలలో జడ్జీలు కూడా శిక్షలను విధిస్తారు .

 శనైశ్చరులు.. మనుషుల పరిస్థితిని బట్టి దయను, కొంత కఠినతను చూపిస్తూ మనుషులు జీవితంలో పూర్తిగా భోగాలలో మాత్రమే మునిగిపోకుండా,  జీవిత లక్ష్యమైన దైవాన్ని పొందాలని గుర్తు చేస్తూ,  మనుషులు సరైన మార్గంలోకి రావాలని హెచ్చరిస్తూ నడిపించే దైవము.


 పిల్లల పట్ల ప్రేమ ఉన్న తల్లిదండ్రులు, గురువులు కూడా , కొందరు పిల్లలు తప్పు దారిలో వెళ్తూ, ఎన్నిసార్లు హెచ్చరించినా విననప్పుడు పిల్లల మంచి కోసం పెద్దవాళ్ళు కొన్నిసార్లు కొంత కఠినంగా వ్యవహరించవలసి రావచ్చు.


 దైవం కూడా కొందరు జీవులను సరైన మార్గంలోకి తేవటానికి దయతో పాటూ కొన్నిసార్లు కొంత కఠినంగా ఉండవలసి రావచ్చు.అది జీవుల మంచి కోసమే.

 ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ వద్ద కూడ చూడగలరు.
 


Friday, April 21, 2017

జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ? చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.


( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)

ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************


రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం  ? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.


 దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..


ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.


 భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.


*********


జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని,  దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.


పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.


*************

ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!


************


భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.


షిరిడి సాయిబాబా .. భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ, ఆ జాతకాలను ప్రక్కన పెట్టి, తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.


 ఇంకా, శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము గ్రంధములో భీమాజీపాటీలు కధ వద్ద , షిరిడి సాయి భక్తుడు తన  స్వప్నములో బాధలుపడటం ద్వారా...  సాయి అతని జబ్బును పోగొట్టడం గురించి తెలుసుకోవచ్చు.


 (.గతజన్మలోని పాపకర్మల ఫలితముగా జబ్బు రాగా దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను.కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. భక్తుడు స్వప్నములో బాధలుపడటం .. సాయి అతని జబ్బును పోగొట్టడం జరుగుతుంది.)ఎందరో పూజ్యులు.. తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాలనుండి రక్షించిన సంఘటనలు గ్రంధాలలో చెప్పబడ్డాయి.


**************


కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)

అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి  నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
****************


 దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం  దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు.  ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

**********


* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.Wednesday, April 19, 2017

అయితే, చాలామంది ..ఏసుక్రీస్తు లోకరక్షణ కొరకు శిలువనెక్కారని అంటారు.


విష్ణుమూర్తి  లోకరక్షణ కొరకు ఎన్నో అవతారాలను ధరించారంటారు.


శివుడు లోకరక్షణ కొరకు హాలాహలాన్ని కంఠంలో నిలిపారని అంటారు.


ఈ విషయాలను గమనిస్తే, దైవం లోకరక్షణ కొరకు ఎన్ని చేసారో తెలుస్తుంది.


 అయితే, చాలామంది మనుషులు  చేస్తున్నదేమిటి ?


 లోకరక్షణ మాట అటుంచి తమ స్వలాభం కోసం లోకాన్ని కష్టపెడుతున్నారు. 


 తమ అంతులేని కోరికల కొరకు పర్యావరణం  పాడు అవుతున్నా పట్టించుకోవటం లేదు.


మనుషుల  అంతులేని కోరికల కోసం ఎన్నో మూగజీవాలు బలైపోతున్నాయి.


సాటి మనుషులు పేదరికంలో మగ్గుతున్నా కూడా,   తాము మాత్రం విలాసాల కోసం అంతులేని సంపదను పోగేసుకుంటున్నారు.


ఇప్పుడు సమాజాన్ని గమనించితే, చాలామంది ఎన్నో పాపాలు చేస్తూ, తాము చేసిన పాపాలను క్షమించాలని దైవాన్ని కోరుతూ, పాపప్రక్షాళన కోసం పూజలు చేస్తున్నారు.


ఎవరైనా తాము  చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, తమ స్వార్ధాన్ని తగ్గించుకుని, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. అలాంటప్పుడు దైవకృపను  పొందే అవకాశం ఉంది. చేసిన పాపాలకు పడే శిక్ష  తగ్గే అవకాశం ఉంది.


అంతేకానీ, మళ్ళీమళ్ళీ పాపాలు చేస్తూనే  తమ పాపాలను క్షమించాలని కోరుకోవటం సరైనది కాదు.Monday, April 17, 2017

దైవం దయచెసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను... ఏ మతమైనా దైవం అందరికీ దైవమే.

 ఇంతకు ముందు టపాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలని వ్రాసాను. ఇలా వ్రాయటం తప్పే. 

అలా  వ్రాసినందుకు దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. 


విన్నకోట నరసింహా రావు గారు వ్రాసిన వ్యాఖ్యను చదివిన తరువాత నేను వ్రాసిన తప్పు తెలిసింది.


 ఏసుక్రీస్తు సమాధి నుండి పునరుత్థానం  చెందిన రోజు గుడ్ ఫ్రైడే కావచ్చు..అని అనుకున్నాను. అందుకే శుభాకాంక్షలు అని వ్రాసాను.


మరిన్ని వివరముల కొరకు అంతర్జాలంలో చదివితే, ఏసు ప్రభువును శిలువ వేయటం జరిగిన రోజు శుక్రవారం అని, సమాధి నుండి పునరుత్థానం జరిగిన  రోజు ఈస్టర్ ఆదివారం అని తెలుస్తోంది.. .

.కొన్నిదేశాలలో గుడ్ ఫ్రైడే ను వేరే పేర్లతో కూడా పిలుస్తారని తెలుస్తోంది. 

ఉదా.."Big Friday"  అని కూడా అనవచ్చేమో? అనిపిస్తోంది.( నాకు అర్ధమయినంతలో..).. 


ఏసు క్రీస్తును శిలువ వేయటం అత్యంత బాధాకరమైన సంఘటన. మరి అలాంటి రోజును గుడ్ ఫ్రైడే అని అనటం సరిగ్గా అనిపించటం లేదు.


 ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే అని కాకుండా వేరే పేరుతో అనటం సరైనదనిపిస్తోంది.  


వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. Wednesday, April 12, 2017

ఓం..

శ్రీ దేవీభాగవతము( తెలుగు వచనం)లో నారాయణమహర్షి నారదమహర్షికి తెలియజేసిన విషయములలో ..కొన్ని విషయములు.

. రాత్రి వేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం, యాభైఏడు ఘటికలు అరుణోదయం, యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని అరవై ఘటికలకు సూర్యోదయం. 
( సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు).

*********
ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన ప్రాణాయామం చేయటం గురించి కూడా తెలియజేసారు. 
ఈ విషయాన్ని గమనిస్తే, బ్రాహ్మీ ముహూర్తం ప్రాతఃకాలంలో ఉంటుందని తెలుస్తోంది.Friday, April 7, 2017

ముహూర్తములు కొన్ని విషయములు..నాలుగవభాగము..


గ్రహణాలను మనం గమనించగలం.
సూర్యోదయం నుండి కాలాన్ని లెక్కించినప్పుడు, గ్రహణకాలం తేడా లేకుండా సరిగ్గా సరిపోతే సూర్యోదయం నుండి కాలాన్ని లెక్కించటం సరైనదే అనిపిస్తుంది.

అయితే, రజస్వల సందర్భంలో రాత్రి అయినచో,  రాత్రిని మూడుభాగములు చేసి, రెండు భాగముల కాలము పూర్వ దినము, మూడవ భాగకాలము పరదినమునకు చెందును.అని అంటున్నారు. 

ఇలాంటప్పుడు, సూర్యోదయానికి ముందే పరదినము అని ఎందుకు భావిస్తున్నారో తెలియటం లేదు.


సూర్యోదయానికి ముందే పరదినముగా లెక్కించటం?  జరిగే  సందర్భాలు ఇంకా కూడా ఏమైనా ఉన్నాయో ఏమో ? తెలియటం లేదు.

**************

 గొప్ప ముహూర్తాలు కనుగొనటం అంత తేలిక కాదనిపిస్తుంది. 

అయితే,గొప్ప ముహూర్తాలు కనుగొనటం అంత తేలిక కాకపోవటమే మంచిదనిపిస్తుంది. 

మంచి ముహూర్తాలు కనుగొనటం చాలా తేలికయితే, చెడు పనులు చేసేవారు కూడా ఆ ముహూర్తాలను తెలుసుకుని పనులు మొదలుపెడతారు.


మనుషులు జీవితంలో సుఖంగా ఉండాలంటే ధర్మాన్ని ఆచరించటం మంచిది.  

ధర్మాన్ని ఆచరించేవారికి దైవకృప లభిస్తుంది. గ్రహాలు అనుకూలస్థానాలలో ఉండగా జన్మను పొందుతారు.


ఎవరు చేసిన ధర్మమే వారిని రక్షిస్తుందని పెద్దలు తెలియజేసారు.
 ధర్మో రక్షతి రక్షితః.

ధర్మాన్ని ఆచరించటానికి ప్రయత్నించండి. దైవకృపను పొందండి. అప్పుడు మంచి ముహూర్తాలు చక్కగా లభిస్తాయి.

ముహూర్తములు..కొన్ని విషయములు.మూడవభాగము..


ఇంకో విషయము  ఏమిటంటే, హిందువులు కాలాన్ని సూర్యోదయం నుంచి లెక్కిస్తారంటారు.

ఉదా..సూర్యోదయం నుండి మరుసటి రోజు అని చెబుతారు.
గౌరీ పంచాంగం, రాహుకాలం, యమగండం..మొదలైనవి సూర్యోదయం నుండి లెక్కిస్తారనుకుంటున్నాను.( నాకు తెలిసినంతలో..)

 అయితే, కొన్ని పంచాంగములలో ..రజస్వల ..మొదలైన సందర్భాలలో రాత్రి ఆఖరి జాము సమయాన్ని మరుసటి దినం అని లెక్కిస్తారనుకుంటున్నాను.

ఉదా..రాత్రి వేళ నిర్ణయం..రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడుభాగములు చేసి, రెండు భాగముల కాలము పూర్వ దినము, మూడవ భాగకాలము పరదినమునకు చెందును.అని వ్రాసారు.

ఇలాంటప్పుడు, కొన్ని సందర్భాలలో సూర్యోదయం నుంచీ రోజు ప్రారంభమవటం, కొన్ని సందర్భాలలో సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమవటం అని ఉంటుందా ? అనేది తెలియటం లేదు.

***************

 సూర్యోదయం విషయంలో.. ఉషః కాలం, అరుణోదయకాలం, ప్రాతః కాలం..అని చెబుతారు కదా!

మరి అరుణోదయకాలం అంటే సూర్యకాంతి కనిపిస్తుందని అర్ధమా? అలాంటప్పుడు అప్పటినుంచే మరుసటి రోజు లెక్క వేసుకోవచ్చా?

ఒకవేళ  సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమయినట్లు లెక్క వేస్తే, గౌరీ పంచాంగంలో ముహూర్తములు సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అలా లెక్క వేసుకోవచ్చా?లేక 

 గౌరీ పంచాంగం సూర్యోదయం నుంచే లెక్క వేసుకోవాలా?
***************

 ఇవన్నీ గమనిస్తే,  కొన్ని సందర్భాలలో సూర్యోదయం నుంచీ రోజు ప్రారంభమవటం, కొన్ని సందర్భాలలో సూర్యోదయానికి ముందే మరుసటి రోజు ప్రారంభమవటం అని ఉంటుందా ? అనేది తెలియటం లేదు.

ముహూర్తములు కొన్నివిషయములు ..రెండవ భాగం..


గౌరీ పంచాంగం అంటే సూర్యోదయ కాలం నుండి లెక్కిస్తారు. గౌరీ పంచాంగం ఒకటే విధంగా ఉంటుందని అనుకున్నాను.

అయితే, ఈ మధ్య ..  గౌరీ పంచాంగంలో గమనించిన కొన్ని విషయాలను వ్రాస్తాను.  

ఉదా..గౌరీ పంచాంగంలో ఒక దగ్గర శనివారం ఉదయం రెండవ ముహూర్తం జ్వరం...అని ఉంటే...

.గౌరీ పంచాంగం ఇంకో దగ్గర రెండవ ముహూర్తం ఉతి..అని ఉంది.( ఉతి..అంటే శుభముహూర్తం అంటున్నారు).    

.మూడవ ముహూర్తం విషం అని ఉంటే, ఇంకో దగ్గర మూడవ ముహూర్తం ఉద్యోగం అని ఉంది.
ఇలాంటప్పుడు ఏది పాటించాలో అని అయోమయం కలుగుతుంది. 

ముహుర్తములు..కొన్నివిషయములు .. ఒకటవ భాగము ..


ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా కొన్ని సందేహాలు నెలకొన్నాయి.
కొందరు 28న అని, మరికొందరు 29న అని అంటున్నారు.


 కొందరేమో 29న సూర్యోదయానికి ముందే పాడ్యమి ముగుస్తున్నట్లు అంటున్నారు.
కొందరేమో సూర్యోదయం తరువాత కూడా కొంతసేపు పాడ్యమి ఉన్నట్లు అంటున్నారు.
హిందువులు సూర్యోదయం ప్రకారం లెక్క చూస్తారు.

ఇప్పుడు వసంతనవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు.నవరాత్రులు అనటంలోనే రాత్రి అనే పదం ఉన్నది. 


మరి, 29న సూర్యోదయానికి పూర్వమే పాడ్యమి ముగిస్తే, 29 న పాడ్యమి అని అనుకోవచ్చో లేదో అని సందేహం అనిపిస్తుంది. ...
.ఈ విధంగా గమనిస్తే, 28న రాత్రి పాడ్యమి తిధి ఉంది కాబట్టి, 28న ఉగాది పండుగ చేసుకోవచ్చనిపిస్తోంది.

ఎక్కువ సందేహం ఉన్నవారు 28 మరియు 29 కూడా ఉగాది పండుగ జరుపుకోవచ్చేమో ?
*************

ఇంకో విషయం ఏమిటంటే,ఒకే రాష్ట్రంలో సూర్యోదయం విషయంలో విపరీతమైన తేడా ఉండదు.

ఈ మధ్య కాలంలో గమనిస్తే, కొన్ని క్యాలెండర్లలో  నక్షత్రాలు, తిధుల కాలం విషయంలో చాలా తేడాలు వ్రాస్తున్నారు . ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.
ఇవన్నీ గమనిస్తే, చాలా అయోమయంగా ఉంటుంది.

ఒకే రాష్ట్రంలో కూడా తిధులు, నక్షత్రాల విషయంలో క్యాలెండర్లో ఎక్కువ తేడాలు ఉన్నప్పుడు ముహూర్తాలు , జాతకాలలో కూడా అయోమయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది.
********

ఇక, పండుగ రెండురోజులు అనే సందేహం వచ్చినప్పుడు కొందరికి లాభం కూడా ఉంటుంది.

ఉదాహరణకు.. స్త్రీలకు నెలసరి వచ్చే సందేహంగా ఉన్నప్పుడు 28న ఉగాది జరుపుకోవచ్చు.

ఇక 4 లేక 5వరోజు సమస్య ఉన్నవారు నెలసరి తరువాత తలస్నానం చేసి 29న దైవానికి నమస్కారం చేసుకోవచ్చు.
******
పంచాంగం గురించి నాకు తెలిసిన విషయాలు తక్కువ. తెలిసినంతలో వ్రాసాను.
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
************
పండుగ ఎప్పుడు చేసుకోవాలి ? అనేది ముఖ్యమే కానీ , పండుగ ఎంత భక్తితో చేసుకున్నారనేది మరింత ముఖ్యం.
 

Wednesday, April 5, 2017

ఓం..శ్రీ రామ నవమి సీతారాముల కల్యాణం..సందర్భముగా అందరికి శుభాకాంక్షలండి.


దైవానికి వందనములు.

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

. అనేది గొప్ప శ్లోకము.

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రము ఫలశ్రుతిః లో.. పార్వతీదేవి ఈశ్వరుని సంభాషణలో ఈ విషయముల గురించి తెలియజేసారు. 
పార్వత్యువాచ:-
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు మిచ్చామ్యహం ప్రభో.
పార్వతి చెప్పింది :-
ప్రభో! జ్ఞానులైన పండితులు నిత్యం ఏ ఉపాయం చేత సులభంగా శ్రీవిష్ణుసహస్రనామాన్ని పారాయణ చేస్తున్నారో ఆ సహస్రనామాన్ని వినగోరుతున్నాను. 
ఈశ్వర ఉవాచ:-
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
ఈశ్వరుడు చెప్పాడు:-
సుందరవదనా! శ్రీరామరామరామయని మనోహరుడైన రామునిలోనే నేను రమిస్తున్నాను. ఆ రామనామం సహస్రనామానికి సమానమైంది.
(చారువదనా!రామనామమే సహస్రనామానికి సమం.ఓం నమస్కారం.)

.అని ఈ విషయముల గురించి చెప్పటం జరిగినట్లు తెలియజేసారు. 
*****************
వ్రాసిన విషయాలలో ఎక్కడైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
************ 

మనస్సు ఎప్పుడైనా అశాంతిగా గందరగోళంగా ఉన్నప్పుడు ,  పై  శ్లోకాన్ని కొంతసేపు  అనుకుంటే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.

Monday, April 3, 2017

ఆదిపరాశక్తి కధలు..మూడవ భాగము . . మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

 ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

 మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.

 ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.

 రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.

 చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుద్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు. జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.


 ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.
 ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.

 మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.

 మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.

 అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి.

 తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.

 మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

 మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !

 దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.


*****************

ఈ  కధలను  ఇంతకు  ముందు  కూడా బ్లాగులో   ప్రచురించాను .
  దేవీనవరాత్ర  వ్రతకధ....వంటి  పుస్తకాలలో  ఈ  కధలను  పండితులు  క్లుప్తంగా  వ్రాసారు.
  పండితులందరికి  కృతజ్ఞతలు.ఆదిపరాశక్తి కధలు.. రెండవ భాగము..ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. 


ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 


అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది  కొంతమంది విద్యాధరులకు.


జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో   రణరంగం మహా భయంకరంగా ఉంది.ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.


ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .


రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.


దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.