koodali

Friday, November 29, 2013

సరిదిద్దే ప్రయత్నం చేసేవాళ్ళు గొప్పవారు.


పూర్వం  రోజుల్లో  చెరువులలో  నీరు  తగ్గితే    చేపలు  ఒడ్డుకు  కొట్టుకు  వచ్చేవి.


 ఈ  రోజుల్లో  అయితే  చెరువుల్లో  నీరు  తగ్గుముఖం  పడితే  చేపలకు  బదులు  ప్లాస్టిక్  కవర్లు    ఒడ్డుకు  తేలి  వచ్చి  కుప్పలుగా  పడి  ఉంటున్నాయి. 


ఈ  ప్లాస్టిక్  త్వరగా   భూమిలో  కలిసిపోదన్న  విషయం  చాలామందికి  తెలుసు.  అయితే  నీటిలో  పడినా  ఆ  నీరు  కలుషితం  అవుతుందంటున్నారు.  ఇక  ఎలెక్ట్రానిక్  చెత్త   మరియు  పరిశ్రమలు  వదిలే  వ్యర్ధాలు  వంటి  వాటివల్ల   వల్ల  కూడా  నేల,  నీరు  కలుషితం  అవుతున్నాయట. 


 వీటన్నింటి  ఫలితంగా  విషవాయువులు  వెలువడి  ,  భూమిపై  ఉష్ణోగ్రతలు  పెరిగి  ధ్రువ  ప్రాంతాలలో  మంచు  కరగటం  మొదలయ్యిందట.....ఇలా   ఎన్నో  నష్టాలు  జరుగుతున్నాయని  ఎందరో   శాస్త్రవేత్తలు  కూడా  బాధపడుతున్నారు.  ప్లాస్టిక్  కనుగొని  ప్రపంచానికి  పరిచయం  చేసేటప్పుడు  ప్లాస్టిక్  గురించిన  లాభాలే  తప్ప  నష్టాల  గురించి   శాస్త్రవేత్తలకు  తెలిసి  ఉండకపోవచ్చు. ఎంత  శాస్త్రవేత్తలు   అయినా   ముందే  అన్నీ   ఊహించలేరు   కదా  !


ఆధునిక  ఆవిష్కరణలలో  కొన్ని  ప్రపంచానికి  హానికరంగా  పరిణమించాయి. ఈ  మాట అంటే  కొందరికి   కోపం  వస్తుంది. ( అయితే  అందరికి  కోపం  రాదు  లెండి.) 

 

  కొన్ని  ఆవిష్కరణల  వల్ల   జరుగుతున్న   హాని  గురించి   కనిపెట్టి    ప్రపంచానికి   తెలియజేస్తూన్న  శాస్త్రవేత్తలు  ఎంతో  గొప్పవారు.భేషజాలకు   పోకుండా, పొరపాట్లను   సరిదిద్దే  ప్రయత్నం  చేస్తున్న  ఇలాంటి  గొప్ప
శాస్త్రవేత్తలకు  చేతులెత్తి  నమస్కరించాలి .

 


Wednesday, November 27, 2013

ఇతర గ్రహాలపై ఇంధనాలు, ఖనిజాలు....


ఇతర  గ్రహాలపై   ఇంధనాలు,  ఖనిజాలు  ఉన్నాయంటున్నారు.  అక్కడ    ఏమి   ఉన్నా  మనకేమిటి  లాభం  ? ఇతర  గ్రహాల  నుంచి  ఇంధనాన్ని  తెచ్చి  వాడుకోవాలంటే  చాలా  డబ్బు  ఖర్చవుతుంది.   ఇతర  గ్రహాల  నుంచి  ఖనిజాలను  భూమి  పైకి  తెచ్చి   వస్తువుల  తయారీలో  వాడితే  అలా  తయారైన   వస్తువు   ఖరీదు  ఎంతో    ఎక్కువగా  ఉంటుంది  .  అంత  ఖరీదైన   వాటిని  ఎవరు  కొనగలరు  ?  ఎంతో  డబ్బు  ఖర్చు  పెట్టి  ఇతర  గ్రహాల  పైకి  వెళ్ళి  అక్కడ  కృత్రిమ  వాతావరణం  సృష్టించి  ప్రజలు  నివాసం  ఉండాలనే  ఆలోచనలు   ఎందుకు  ?  అంత  డబ్బే  ఉంటే  భూమి  మీదే  ఎన్నో  సౌకర్యాలు  ఏర్పరుచుకోవచ్చు  కదా  !దైవం   మనకు   ప్రసాదించిన  చక్కని  గాలి,  నీరు,  చక్కటి  వాతావరణం,  పచ్చని  చెట్లు,  పువ్వులు,  పండ్లు  .......అన్నీ  ఉన్న  భూమిమీదే  హాయిగా  జీవించటం    చేతకాక   ఎన్నో  సమస్యలను  సృష్టించుకుంటున్నాము.ఇక  గాలి,  నీరు,  ఇవన్నీ  లేని  గ్రహాల  మీద  కెళ్ళి  ఎంతో  డబ్బును  ఖర్చుపెట్టి   కృత్రిమ  వాతావరణాన్ని  సృష్టించటం   అవసరమా ?భూమిపై  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  దేశాలకు   ఇదంతా  అవసరమా ?   అనిపిస్తుంది.  కడుపు  నిండిన  తరువాతే  విజ్ఞానమైనా,  వినోదమైనా.అభివృద్ధి  చెందిన  దేశాలు   అని  మనం  భావిస్తున్న   చాలా   దేశాలు   కూడా    ఇప్పుడు  ఆర్ధిక ,  నిరుద్యోగ   సమస్యలతో  సతమతమవుతున్నాయి.   దేశాల  మధ్య   ఈ  పోటీ  లేకపోతే  ఆ  డబ్బుతో  ప్రజల   ఆర్ధిక  పరిస్థితిని   చక్కదిద్దవచ్చు.  తోటి  వాళ్ళు  తొడకోసుకుంటే  మనం  మెడ  కోసుకోవాలనే  ఆరాటం  ఎందుకు  ? విజ్ఞానం  అనేది  ప్రజల  కనీస అవసరాలన్నా    తీరటానికి  ఉపయోగపడితే  చాలా  బాగుంటుంది.


 

Monday, November 25, 2013

ఓం,శ్రీ విశ్వనాధాష్టకము.శ్రీ అన్నపూర్ణాష్టకము......

ఓం.
శ్రీ విశ్వనాధాష్టకము.


గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర  విభూషిత  వామభాగం
నారాయణ ప్రియ  మనంగ  మదాప  హారం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వాచామ  గోచర మమేయ  గుణస్వరూపం
వాగీశ  విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన  విగ్రహవరేణ  కళత్రవంతం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

భూతాధిపం  భుజగభూషణ  భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం  జటిలం  త్రినేత్రం
పాశాంకు  శాభయవరప్రద  శూలపాణిం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

శీతాంశుశోభిత  కిరీట  విరాజమానం
ఫాలేక్షణాచల  విశోషిత  పంచబాణం
నాగాధిపా  రచిత  భాసుర  కర్ణపూరం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

పంచాననం  దురిత  మత్తమదంగజానాం
నాగాంతకం  దనుజపుంగవ  పన్నగానాం
దావానలాం  మరణశోక  జరాటవీనాం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

తేజోమయం  సగుణ  నిర్గుణ  మద్వితీయం
ఆనందకంద  మపరాజిత  మప్రమేయం
నాదాత్మకం  సకల  నిష్కళ  మాత్మరూపం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

ఆశాం  విహాయ పరిహృత్య  పరస్య  నిందాం
పాపేరతించ  సునివార్య  మనస్సమాధౌ
ఆదాయ  హృత్కమల  మధ్యగతం  పరేశం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

రాగాదిదోష  రహితం  స్వజనానురాగం
వైరాగ్య  శాంతినిలయం  గిరిజా సహాయం
మాధుర్య ధైర్య  సుభగం  గరళాభిరామం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వారాణసీ  పురపతేః స్తవం  శివస్య
వ్యాసోక్త మష్టక మిదం  పఠతే  మనుష్యః
విద్యాం శ్రియం  విపులసౌఖ్య  మనంతకీర్తిం
సంప్రాప్య  దేహవిలయే  లభతేచ  మోక్షం .

 విశ్వనాధాష్టక  మిదం  పుణ్యం  యః  పఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి  శివేన  సహమోదతే.

ఫలం..ధనధాన్యాలూ,  విద్యా  విజయాలూ,  ఇహపర  సర్వ సౌఖ్యాలు.

శ్రీ  అన్నపూర్ణాష్టకము.

 
నిత్యానందకరీ  వరాభయకరీ  సౌందర్య  రత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర  పావనకరీ  ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల  వంశపావనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

నానారత్న   విచిత్ర  భూషణకరీ    హేమాంబరాడంబరీ
ముక్తాహార  విడంబమాన  విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు  వాసితాంగ  రుచిరే  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

యోగానందకరీ  రిపుక్షయకరీ  ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ  త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ  తపఃఫలకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

కైలాసాచల కందరాలయకరీ  గౌరీ  ఉమా శాంకరీ
కౌమారీ  నిగమార్ధగోచరకరీ  ఓంకార  బీజాక్షరీ
మోక్షద్వార  కవాట  పాటనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

దృశ్యాదృశ్య  విభూతి  పావనకరీ  బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక  సూత్రఖేలనకరీ  విజ్ఞాన  దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః  ప్రమోదనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

ఆదిక్షాంత  సమస్త  వర్ణనకరీ  శంభుప్రియే  శాంకరీ
కాశ్మీరే  త్రిపురేశ్వరీ  త్రినయనీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
స్వర్గద్వార  కవాటపాటనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ 
మాతాన్నపూర్ణేశ్వరీ .


ఉర్వీసర్వజయేశ్వరీ  దయాకరీ  మాతాకృపాసాగరీ
నారీ  నీలసమానకుంతలధరీ  నిత్యాన్న  దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి   కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

దేవీసర్వవిచిత్రరత్న  రచితా  దాక్షాయణీ  సుందరీ
వామాస్వాదుపయోధర  ప్రియకరీ  సౌభాగ్య  మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ  దశాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

చంద్రార్కానల  కోటికోటి  సదృశా  చంద్రాంశు  బింబాధరీ
చంద్రారాగ్ని  సమాన  కుండలధరీ  చంద్రార్క  వర్ణేశ్వరీ
మాలాపుస్తక  పాశాంకుశధరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

క్షత్రత్రాణకరీ  సదాశివకరీ  మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశివకరీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
దక్షాక్రందకరీ  నిరామయకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

అన్నపూర్ణే  సదాపూర్ణే  శంకర  ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య  సిద్ధ్యర్ధం  భిక్షాం  దేహీ చ  పార్వతి
మాతా చ పార్వతీ  దేవీ  పితా  దేవో  మహేశ్వరః
భాందవా  శ్శివభక్తాశ్చ  స్వదేశో  భువనత్రయమ్ .

ఫలం..ఇహానికి  ఆకలిదప్పులూ..పరానికి  ఏ కలి  తప్పులూ  కలగకపోడం.

............
వ్రాసిన  విషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు  వచ్చినచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.  Wednesday, November 20, 2013

ఈ నాటి ప్రజల పంజరపు బ్రతుకులు. ( చాలా మంది విషయంలో )


కొన్నాళ్ళ  క్రితం  వరకూ  కూడా  ప్రపంచంలో  ఇంత  పరుగు  లేదు.    ఇంత  పోటీ  లేదు. 


 ఇప్పుడు  జీవితాల్లో  వేగం  పెరిగిపోయింది.  తెల్లవారి  లేస్తే  పరుగేపరుగు.  ఎందుకో  తెలియని  పరుగు.

మా  చిన్నతనంలో  వేసవి  సెలవుల్లో  కొన్ని రోజులు   మా  తాతగారింటికి  వెళ్ళే  వాళ్ళం.   పల్లెటూరి  జీవితం  పరుగు  లేకుండా  ప్రశాంతంగా  ఎంతో  బాగుండేది.   


పచ్చటి  పొలాలు,  దేవుని  ఆలయాలు,  ఆలయాల  వద్ద  చెరువు,  చెరువులో  తామరపువ్వులు  ఇవన్నీ  ఎంతో  బాగుండేవి. 


తాటి  ముంజెలు,  ఈతపళ్ళు  తినటం,  పెరట్లోని  చెట్ల  పండ్లు  కోసుకు  తినటం,  పెరట్లోని  కమ్మని  కూరలతో  భోజనం  ఎంతో  బాగుండేవి.  రాత్రయితే  వేడివేడి  పప్పుచారులో  నేయి  వేసుకుని  పిల్లలందరం  వెన్నెలలో  కూర్చుని  భోజనాలు  చేసేవాళ్ళం. 
  వెన్నెలలో  ఎన్నో  ఆటలు  ఆడుకునేవాళ్ళం.  ఎన్నో  కధలు  చెప్పుకునే  వాళ్ళం.

 పిల్లలం  ఇలా  ఆడుకుంటుంటే  మా  పెద్దవాళ్ళు  అరుగుల  మీద  కూర్చుని  కబుర్లు  చెప్పుకునే  వాళ్ళు.  ఆ  రోజులే  వేరు. ఇప్పుడు  పిల్లలకు  ప్రకృతితో  సంబంధమే  తగ్గిపోయింది.   ఇప్పుడు    ఎన్నో   సరదాలు   డబ్బుతోనే  ముడిపడి  ఉన్నాయి. ఇప్పటి  పెద్దవాళ్ళకు  తీరిక   లేదు.  పిల్లలకు  తీరిక  లేదు.  పిల్లలకు  బండెడు  సిలబస్ తోనే  బాల్యం  గడిచిపోతోంది.  ఇక  ఆటలకు  సమయమెక్కడ  ? 


పిల్లలకు   కొంచెం  సమయం  దొరికితే   టీవీలు,  కంప్యూటర్  గేంస్  ఆడటానికే  ఇష్టపడుతున్నారు.   ఒకవేళ  తల్లితండ్రులకు  తీరిక  దొరికితే  షాపింగ్  మాల్స్ కు  పిల్లలను  తీసుకువెళ్ళటమే    గొప్ప  అనుకుంటున్నారు.   అలా  అనుకునేటట్లు  పరిస్థితులు  ఉన్నాయి. 
 

చిన్నతనం  నుంచి  పంజరంలో  బ్రతకటం  అలవాటయిన  పక్షులను    ఒక్కసారిగా  బయటకు  వదిలితే  వెంటనే  అవి   విశాలమైన  ప్రకృతిలోకి  ఎగిరిపోవటానికి  ఆసక్తిని  చూపించవట.  వాటికి  పంజరం  బ్రతుకు  అలవాటవటం  వల్ల  ఆ  బ్రతుకే  బాగుంది  అనుకుంటాయేమో  ? 


ఇప్పటి  పిల్లలు  కూడా  చిన్నతనం  నుండి  ప్రకృతికి  దూరంగా  జీవించటానికి  అలవాటుపడటం  వల్ల    ప్రకృతికి  దూరంగా  నాలుగు  గోడల  మధ్య  
టీవీలు చూడటం,  కంప్యూటర్  ఆటలకే  ఇష్టపడుతున్నారేమో ?   అనిపిస్తోంది.
Monday, November 18, 2013

ఓం నమఃశ్శివాయ.ఓం.
కార్తిక  సోమవారం  సందర్భంగా....

లింగాష్టకం.


1..బ్రహ్మమురారి సురార్చితలింగం

....నిర్మల భాసితశోభితలింగమ్
జన్మజదుఃఖవినాశకలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం

....కామదహనకరుణాకరలింగమ్
రావణదర్పవినాశకలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం

....బుద్ధివివర్ధనకారణలింగమ్
సిద్ధసురాసురవందితలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం

....ఫణిపతివేష్టితసేవితలింగమ్
దక్షసుయజ్ఞవినాశనలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందనసేవితలింగం

....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం

....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం

....సర్వసముద్భవకారణలింగమ్
అష్టదరిద్ర వినాశనలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం

....సురవనపుష్పసదార్చితలింగమ్
పరమపదం పరమాత్మక లింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం

....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి

....శివేన  సహ  మోదతే.
గౌరీస్తుతి 

 
నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

Friday, November 15, 2013

ఓం.

ఓం...దైవానికి  అనేక  నమస్కారములు.

అగ్ని  లింగ  క్షేత్రమైన   తిరువణ్ణామలైలో  వెలిగించే  కార్తిక  దీపదర్శనం  ఎంతో  పుణ్యప్రదం.   

తిరువణ్ణామలై  విశేషాలను  ఈ  లింక్ ల లో  చూడవచ్చు.


::: Om Arunachala ::: - Tiruvannamalai, Deepam, Girivalam ...


Thiruvannamalai Deepam - 2012 - YouTubeకార్తిక  పౌర్ణమి  రోజున కొందరు,   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  చేసుకుంటారు. త్రిమూర్తి  స్వరూపులైన   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారికి  అనేక  నమస్కారములు.

Monday, November 11, 2013

సీతాఫలాన్ని చేతికి అంటకుండా తినాలనుకుంటే.....


ఇప్పుడు  సీతాఫలాలు  వచ్చే  కాలం.  తియ్యగా  ఉండే  సీతాఫలాలంటే  చాలామంది  ఇష్టపడతారు. సీతాఫలాన్ని    కొంచెంకొంచెం  ఒలుచుకు  తింటే   కూడా  బాగానే  ఉంటుంది.  అయితే, కొన్ని    సీతాఫలాలపైన    దుమ్ము,  తెల్లటి  బూజు  ఉండే  అవకాశం  ఉంది. *  సీతాఫలాలను   ఒలుచుకుని   తినేటప్పుడు    గుజ్జు  చేతికి  అంటకుండా,  ఇంకా  పండుపై  ఉండే  దుమ్ము,  తెల్లటి  బూజు   నోట్లోకి  వెళ్ళకుండా  ఉండాలంటే   ఇలా  తినవచ్చు.*  సీతాఫలాన్ని  రెండు    భాగాలుగా  చేయాలి.

*  అప్పుడు  రెండు  కప్పులుగా  కనిపిస్తుంది.

*  ఒక  చిన్న  స్పూన్  తీసుకోవాలి.

*  స్పూనుతో  సీతాఫలములోని  గుజ్జును  నిదానంగా  తినాలి.  


*  అంటే, కప్పు  నుంచి    స్పూనుతో  ఐస్  క్రీమును  తిన్నట్లు  అన్నమాట.

(గింజలను  ఊసేయాలి.)

  *  తిన్న  తరువాత  ఖాళీ  అయిన  సీతాఫలపు    రెండు   కప్పులను  పడేయవచ్చు.

*  ఇలా  తినటం  వల్ల     తినేసిన  సీతాఫలపు    తొక్కను పారవేయటం  కూడా  తేలిక.
Friday, November 8, 2013

అసలే తెలుగు వారికి ( కొందరికి ) ఆడంబరత్వం ఎక్కువ.


ఈ  మధ్య  కాలంలో  తెలుగువారికి  ఆడంబరత్వం    మరీ   ఎక్కువైందనిపిస్తుంది.


  ఆడంబరంగా  ఖర్చు  పెట్టడం  వల్ల    అనేక  నష్టాలున్నాయి.


 వివాహాలు  మొదలైన  ఫంక్షన్స్  జరిగినప్పుడు  విచ్చలవిడిగా  ఖర్చు  చేస్తున్నారు.  అతిధులకు  ఎన్ని  ఎక్కువ  పదార్ధాలుతో  భోజనం  వడ్డిస్తే  అంత  గొప్ప  అనుకుంటున్నారు.  అతిధులు  కూడా    చాలా  ఆహారాన్ని  వేస్ట్  చేస్తుంటారు. 


బోలెడు  డబ్బు  ఖర్చు  చేసి   గిఫ్ట్స్  పేరుతో  స్టీలు  వస్తువులు,  ప్లాస్టిక్  మొదలైన  వస్తువులను  అతిధులకు  ఇస్తున్నారు.    ఇలా    అందరి  ఇళ్ళనిండా  వస్తువులు  నిండిపోతున్నాయి.  వాటిని  బయటపారవేయలేము.   


మా  ఇంట్లో  కొన్ని  వస్తువులు  ఎప్పటినుంచో  వాడకుండా  అలమరాలో  పడి  ఉంటున్నాయి.   ఇంట్లో   తక్కువ  వస్తువులు  ఉంటేనే  ఇల్లు  శుభ్రంగా  ఉంటుంది.ఇవన్నీ  గమనిస్తే,  నాకు  ఏమనిపిస్తుందంటే,   ఇలా  ఇచ్చే  గిఫ్ట్స్  తీసుకోకుండా  ఉంటే  బాగుంటుందేమో  అనిపిస్తుంది.  
అతిధులకు    ఏమైనా   ఇవ్వాలనుకుంటే,   పండ్లు,  స్వీట్స్   వంటివి  ఇస్తే  బాగుంటుంది  కదా  !  అనిపిస్తుంది. 
 

   మన  పూర్వీకులు  ఇంతలా  వస్తువులను  వినియోగించేవారు  కాదు.పూర్వీకులు  అతిధులకు  తాంబూలం  పండ్లు  వంటివి  మాత్రమే  ఇచ్చేవారు. అందువల్ల    ఇళ్ళు  మరియు  వీధులు     తక్కువ  చెత్తతో   శుభ్రంగా  ఉండేవి.  

తక్కువ  వస్తువులను  వాడితే   ప్రపంచములో   సహజవనరులు    కూడా  వేగంగా  వేగంగా  తరిగిపోవు. 

 

   వస్తువులను  తయారుచేయాలంటే  స్టీలు,  అల్యూమినియం,  ప్లాస్టిక్  వంటి  ఎన్నో  సహజవనరులు  అవసరమవుతాయి. 

 భూమిలో  ముడి  ఖనిజం  ఏర్పడాలంటే  ఎన్నో  వేల  సంవత్సరాల  కాలం  పడుతుందట.  వస్తువులను  తయారుచేయటానికి   అవసరమైన  ఒక  కిలో  ముడిపదార్ధం  కావాలంటే  ఎన్నో  టన్నుల  మట్టిని    తవ్వాలట. 

  ఈ  రోజుల్లో  యంత్రాల  వినియోగం  పెరిగిన  తరువాత  విచ్చల  విడిగా  ఖనిజాలను  త్రవ్వేసి  , టన్నుల  కొద్దీ  వస్తువులను  తయారుచేసి  వాడుతున్నారు.  వాడుకున్న  ఖనిజాలను  రీసైక్లింగ్  చేసినా  ఎంతో  వ్యర్ధాలుగా  అయిపోతాయి  తప్ప,  ఖనిజముగా  మిగిలేది  తక్కువ.    అందుకే  ఇంకాఇంకా  ఖనిజాలకోసం  గనులను    త్రవ్వుతున్నారు.      పూర్వీకులు  ఒకసారి  తయారుచేసిన  వస్తువులను   ఎన్నో  సంవత్సరాలు  వాడేవారు.

  ఇప్పుడు  యూస్ అండ్  త్రో  అంటూ  వస్తువులను  ఎక్కువకాలం  వాడటం  లేదు  .  ఇలా  పారవేసిన  చెత్త  వస్తువుల  వల్ల  ప్రపంచమే    చెత్తబుట్టలా  తయారవుతోంది.  

 

 ఇప్పటి    తరాల  వాళ్ళము  ఇలా  ఖనిజాలను  ఖాళీ  చేస్తూ  పోతే    రాబోయే  తరాల  వాళ్ళకు  ఖనిజాలు  కరువై  ,  పొల్యూషన్ తో   కూడిన  ఖాళీ    ప్రపంచమే    మిగులుతుంది.మా  డబ్బు  మా  ఇష్టం.  మా  డబ్బుతో  ఇష్టం  వచ్చిన  వస్తువులను  కొనుక్కుంటాం.  అనటానికి  లేదు.

   డబ్బు  మనదే  అయినా ,   సహజవనరులను    విపరీతంగా  వాడేయటానికి,  ప్రపంచాన్ని  చెత్తబుట్టలా  చేయటానికి   మనకు  హక్కు  లేదు  కదా  ! Wednesday, November 6, 2013

మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉంటుందా ?

ఈ  రోజుల్లో  చాలామంది   జనం   ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించటమే  జీవిత ధ్యేయంగా  బ్రతుకుతున్నారు.

డబ్బున్నవాళ్ళు  తమ గొప్పలను    అతిగా  ప్రదర్శించటం  వల్ల  సమాజానికి  హాని  జరుగుతోంది.


  కొందరు  జరుపుకునే  అట్టహాసమైన  ఫన్క్షన్స్  చూసి   చాలా  మంది  తామూ  అలా  ఆడంబరంగా  జీవించాలని   ప్రయత్నిస్తున్నారు.  ఎలాగైనా  డబ్బు  సంపాదించాలనే  తాపత్రయంలో  కొందరు  అడ్డదారులలో  డబ్బును  సంపాదించటానికి  ప్రయత్నిస్తున్నారు.ఇంతా  చేసి  డబ్బున్నవారు  అందరూ  నిజంగా  సుఖంగా  ఉన్నారంటారా  ?
 


 డబ్బున్నవారిలో  చాలామందికి  మనశ్శాంతి  లేకపోయినా ..... తమకు  ఉన్న  సొమ్మును  ఇతరులకు  ప్రదర్శిస్తూ  తృప్తి  పడటానికి  ప్రయత్నిస్తుంటారు.
.............................

డబ్బున్నవారు కూడా  కొన్ని  విషయాలను  గ్రహించాలి.  సమాజంలో  పేదవారు  లేనప్పుడు  డబ్బున్నవారు  తమ  గొప్పలను  ప్రదర్శించుకోవచ్చు. అంతేకానీ,  సమాజంలో  మన  ప్రక్కనే  ఎందరో  పేదవారు   అష్టకష్టాలు  పడుతుంటే  మనం  మాత్రం  మన  గొప్పలను  అదేపనిగా  ప్రదర్శించుకోవటం  మానవత్వం  అనిపించుకోదు. ప్రపంచంలోని  సంపద  అందరిదీ..  అయితే  కొందరు  తమ  తెలివి,  బలం,  అధికారంతో    అతిగా  డబ్బును  పోగేసి  విలాసవంతంగా  జీవిస్తున్నారు. ఒక  స్థాయికి  మించి  డబ్బును   కూడబెట్టుకోవటం  అంటే  ఇతరుల  సొమ్మును  దొంగిలించినట్లే.  సమాజంలోని  ఆర్ధిక  అసమానతల  వల్లే  సమాజంలో  ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరుగుతున్నాయి.  తెలివి,  బలం,  అధికారం  ఉన్నవాళ్ళు  తమ  తెలివిని,  బలాన్ని,  అధికారాన్ని  కేవలం  తమవరకు  డబ్బు  సంపాదించటానికి  మాత్రమే  కాకుండా ,   సమాజంలోని  తోటి  నిస్సహాయుల  కోసం  కూడా  ఉపయోగించాలని  దైవం  ఆశిస్తారు. ప్రక్కవాళ్ళు  ఆకలితో  అల్లాడుతుంటే  విచ్చలవిడిగా  విందు  భోజనాలు  చేయటం,  తోటివాళ్ళు  కొంపాగోడులేక  అల్లాడుతుంటే  కోట్లాది  డబ్బుతో  విలాసవంతమైన  బంగళాలను  నిర్మించుకోవటం....ఇవన్నీ  ఏం  బాగుంటాయి. సమాజంలోని  ఎందరో  బడుగుజీవులు  అనారోగ్యంతో  అల్లాడుతున్నారు.  మనం  కోటి  రూపాయల  కారులో  తిరిగితే   పొందే  ఆనందం  కన్నా  10  లక్షల  రూపాయల  కారు  కొనుక్కుని  మిగిలిన  90  లక్షలను  అనారోగ్యంతో  అల్లాడుతున్న  పేదవారికి  సహాయం  చేస్తే   వచ్చే  ఆనందం  ఎన్నో  రెట్లు  ఎక్కువ.   


తెలివి  ఉన్నా  చదువుకోవటానికి  డబ్బు  లేక  బాధపడుతున్న  పేద  విద్యార్ధులు  ఎందరో  ఉన్నారు.  అలాంటి  పేద  విద్యార్ధులకు  సాయం  చేస్తే  పొందే  ఆనందం  ఎంతో  తృప్తిని  ఇస్తుంది. 


  డబ్బున్న  వారు  కొందరు  కలిసి  పేదరికాన్ని  పోగొట్టే  కార్యక్రమాలకు  సహాయం  చేయవచ్చు.  మనవల్ల  ఏ  ఒక్కరి  జీవితం  బాగుపడినా  ఆ  ఆనందం  వర్ణనాతీతం.అయితే,  మనం  ఎంత  మంచి  చేసినా  కొన్నిసార్లు  ఇతరులు  మెచ్చుకోరు.  అయినా    ఫరవాలేదు.  మనలను  మెచ్చుకోవలసింది  దైవం.

.................................. 


 ఈ  రోజుల్లో  టీవీలు  వంటి  ప్రసారమాధ్యమాల్లో  వచ్చే  సీరియల్స్  ,  సినిమాలలో  కనిపించే  ఇళ్ళలోని  వస్తు  సామాగ్రిని   చూసి  తామూ  అలా  విలాసవంతమైన  వస్తువులను  కొనుక్కోవాలని  చాలామంది    తాపత్రయపడుతున్నారు. 


ఇలాంటి  విలాసవంతమైన  ఇళ్ళలో  జీవించేవారందరూ   నిజంగా  ఆనందంగా  జీవిస్తున్నారా  ?  అని  ప్రశ్నించుకుంటే   లేదనే  చెప్పుకోవచ్చు.
  ఎంత  డబ్బున్నా,  ఎన్ని  విలువైన  వస్తువులు  చుట్టూ  ఉన్నా  మనస్సులో  సంతోషం  లేనప్పుడు   సుఖమెలా  ఉంటుంది  ?


  డబ్బు  వల్ల  కొన్ని  సౌకర్యాలు  ఉండే  మాట  నిజమే.  అయితే  మనశ్శాంతి  అనేది  మాత్రం   డబ్బుతో  మాత్రమే  లభించేది   కాదు. 

 ఉదా...కుటుంబసభ్యుల  వల్ల  మనశ్శాంతి  కరువైతే  బోలెడు   డబ్బున్నా  సంతోషం   ఉంటుందా  ?


ఎంత  డబ్బున్నా    మనశ్శాంతి  లేక  అల్లాడే  వారు  ఎందరో  ఉన్నారు.  ఉన్న  దానితోనే   తృప్తి  పడి  సంతోషంగా  జీవిస్తున్నవారు  కూడా  ఎందరో  ఉన్నారు. 
...........................చెడ్డవాళ్ళు  సుఖపడటం,  మంచివారు   కష్టాలు  పడటం   కూడా  ప్రపంచంలో  అప్పుడప్పుడు  కనిపిస్తుంది.  ఇది  చూసి  కొందరు  ఏమంటారంటే,  ఇతరులకు  సాయం  చేసేవాళ్ళకు  కూడా  కష్టాలు  వస్తున్నాయి  కదా  !  అంటారు.  ఇలా  ఆలోచించటం  సరైనది  కాదు. మనం  క్రితం  జన్మలలో  చేసిన  పాపపుణ్యాల  ఫలాలను   ఇప్పుడు  అనుభవిస్తున్నాము.  ఇప్పుడు  చేసిన  పుణ్యఫలాలు  ఎక్కడికీ  పోవు.
 
 

Friday, November 1, 2013

అతి ఆడంబరంగా ఖర్చుపెట్టడం వల్ల దిష్టి తగులుతుందట............

 

 

కొంతమంది విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఆడంబరంగా ఫంక్షన్స్ చేస్తారు. ఫంక్షన్స్ సందడిగా, సంతోషంగా గుర్తు ఉండేలా చేసుకోవాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు.

ఆ చేసే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే ఆ ఫంక్షన్ వారికే కాక సమాజంలో మరికొందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపుతుంది.

కొందరు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇతరుల కళ్ళు చెదిరేలా ఫంక్షన్ చేస్తారు.

50 రకాల పదార్ధాలతో భోజనం వడ్డిస్తారు. అతిధులు చాలా మంది వాటిని సగంసగం తిని ఫలానా దానిలో ఉప్పు తక్కువగా ఉంది........ఫలానా దానిలో కారం ఎక్కువయ్యింది అంటూ...........కామెంట్స్ చేస్తారు.


ఇంకా, మా ఇంట్లో అయితే ఇంతకన్నా గొప్పగా ఫంక్షన్ చేశాము............ అని పెదవి విరిచే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము.


కొందరేమో, పైకి అబ్బో ఎంత బాగా చేశారో ఫంక్షన్ అంటూ,. మనస్సులో వీళ్ళకి ఇంత వైభోగమా ! అని కుళ్ళుకునేవాళ్ళూ ఉంటారు.

కొందరు తమకు ఎంత ఆస్తి ఉన్నా ఇతరులకు ఉంటే భరించలేరు.

మరికొందరు వీళ్ళకు ఇంత వైభోగం ఉంది మనకి లేదే అని బాధ పడతారు.

ఇలా ఎదుటివారి నుంచి నెగెటివ్ తరంగాలు తగలటం వల్ల చాలా కష్టాలు వస్తాయట. దీన్నే దిష్టి తగలటం అనవచ్చేమో !

*ఇలా అట్టహాసంగా ఫంక్షన్స్ చేసిన చాలా కుటుంబాల వాళ్ళకి తరువాత ఎన్నో కష్టాలు రావటం, పైకి కనిపించకపోయినా కుటుంబసభ్యుల మధ్య కలతలు రావటం చాలా మంది విషయంలో జరుగుతుంటుంది.

ఇదంతా డబ్బు తగలేసి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

అందుకని ఈ విధానాన్ని కొద్దిగా మార్చుకుని ఒక లిమిట్ వరకూ ఫంక్షన్ కు ఖర్చుపెట్టి మిగతా సొమ్మును పేదవారికి ఉపయోగపడేటట్లు చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది .

ఉదా......కోటి రూపాయల కారు బదులు .............10 లక్షల కారుతో సరిపెట్టుకోవచ్చు. 50 వేల చీర బదులు.............10 వేల చీరతో సరిపెట్టుకోవచ్చు. 2 లక్షల నెక్లెస్ బదులు............1 లక్ష నెక్లెస్ ......... ఇలా ఈ ఖర్చు వారి తాహతును బట్టి మార్చుకోవచ్చు.


కోటి రూపాయల కారులో మిగిలిన సొమ్మును ఇతరుల సహాయానికి వినియోగించవచ్చు.

నేను ఒక దగ్గర చదివానండి. ఒక కుటుంబం ప్రతి సంవత్సరం తమ పిల్లల పుట్టిన రోజు నాడు. ఏం చేస్తారంటే.............ఒకసారి ఒకఅనాధశరణాలయానికి వంటపాత్రలు, కొనుక్కొచ్చిన వాటర్ టాంక్ దానంగా ఇచ్చారట. ఒక సంవత్సరం ఒక పాఠశాలకు ఒక కొత్త గదిని కట్టించటానికి డబ్బు ఇచ్చారట . .


ఇలా ఎన్నో చేయవచ్చు. ఎక్కువగా ధన సహాయం చేయగల కొందరు కలసి ఒక ఫ్లోరైడ్ బాధిత ప్రదేశంలో ఫ్లోరైడ్ శుధ్ధి ప్లాంట్ కట్టించి ఇస్తే ప్రజలు త్రాగు నీటికి వాడుకుంటారు.


కొందరు నెలనెలా అనాధలకు బియ్యం, పప్పులు ఇస్తూంటారు. ఇంకా, చేనేతవారికి కొత్తరకం మగ్గాలు ఇవ్వచ్చు. రైతులకు పనిముట్లు కొని ఇవ్వచ్చు.


కొన్ని హాస్టళ్ళకు వంటకు ...... సోలార్ సిస్టం ఏర్పాటుచేయచ్చు.(
తిరుమలలో సోలార్ సిస్టం ఉంది. ).


కొందరు నిజాయితీ గల వ్యక్తులు పేదవారి కొరకు ట్రస్టులు ఏర్పాటు చేసి సేవ చేసేవారి గురించి పత్రికలలో చదువుతుంటాము.. వారికి మన సొమ్మును అందచేయవచ్చు.


ఇంకా, డబ్బు లేక రోగాలకు చికిత్స చేయించుకోనివారు ఎందరో ఉన్నారు. ఇలా మనసుంటే ఎన్నో మార్గాలున్నాయి.


అదే కోటి రూపాయల కారు కొంటే ఆ లాభమంతా మళ్ళీ డబ్బున్న వారికే చెందుతుంది. అలాంటి కార్లు, నగలు అమ్మేవారు డబ్బున్న వారే అవుతారు సహజంగా.


ఇక కోటికారు తయారు చెయ్యాలన్నా............10 లక్షల కారు తయారుచేయాలన్నా ఉద్యోగస్తుల సంఖ్యలో తేడా ఏమీ ఉండదు. ఉదా.......... 2లక్షల నెక్లెస్ ను తయారు చేయాలంటే ఇద్దరు వ్యక్తులు అవసరమైతే.........1లక్ష నెక్లెస్ చేయటానికి కూడా ఇద్దరు సరిపోతారు.

అందుకని ఇలా కాకుండా .......... ధనవంతులు ఖర్చుపెట్టే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే ఆ సొమ్ము సమాజంలో ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.


ఆ సహాయం పొందినవారి దీవెనల వల్ల ఆ ధనవంతుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. వారికి కష్టాలు రావు.

ఒకవేళ సహాయం పొందినవారు మరిచిపోయినా భగవంతుడు వీరిని మెచ్చుకుంటారు.


అందువల్ల ధనవంతులు తమ దగ్గరున్న సొమ్ములో కొంత భాగాన్ని దయచేసి సమాజానికి ఖర్చు పెట్టటం వల్ల వారి కుటుంబాలకు సుఖసంతోషాలు కలుగుతాయి. అలాగే సమాజానికి సుఖసంతోషాలు కలుగుతాయి........