koodali

Friday, March 30, 2012

కష్టకాలములో అండగా......శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఈ విధముగా చెప్పబడినది.


సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను........ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల మాయాశక్తి బారి నుండి తప్పించుకొందురు.................


పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఒకప్పుడు అతడనేక కష్టములు పాలయ్యెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు.


ఒకప్పుడు అతని స్థితి చాల హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయనిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండుమాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను.కొన్ని అడుగుల దూరమున ఒక హోటలుండెను. దాని యజమాని సగుణమేరునాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను పిలచి అక్కల్ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా ? అని అడుగుచూ పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కధ వచ్చెను. ...........


అక్కల్ కోట్ కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను.


బాధను సహించలేక నిరాశచెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. ...........గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తి , బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు ? గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము .సమయోచితమయిన ఈ కధను చదివి , అంబాడేకర్ చాలా ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో అతను చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును , దయాళుత్వమును చూచి అంబాడేకర్ కు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృడమయ్యెను.అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృధ్ధి పొందెను.


జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడపెను..ఈ కధలను చాలా మంది చదివే ఉంటారు. కాని మర్చిపోతూంటాము. కష్ట సమయములలో ఇలాంటి భక్తి కధలను గుర్తు తెచ్చుకొంటే ధైర్యముగా ఉంటుంది. . . ..


.......................

టపా ఇంతకు ముందు వేసినదేనండి.Wednesday, March 28, 2012

రామాయణంలోని కొన్ని విషయాలు....


ఓం.

రామాయణం లోని కొన్ని విషయాలు శ్రీ దేవీ భాగవతము గ్రంధములో చెప్పబడ్డాయి.సీతాదేవి అగ్ని పరీక్ష జరిగిన సందర్భంలో అగ్నిదేవుడు చాయా సీతను తీసుకుని అసలు సీతాదేవిని శ్రీరామునికి అప్పగించటం గురించి , వేదవతి గురించి శ్రీ దేవీ భాగవతము లో చెప్పబడింది.


వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు ....రామ కధ లోని కొన్ని విషయాలను .
చెప్పటం జరిగింది.దశరధుడు శ్రీ రామునికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారు. ఏర్పాట్లు అన్నీ జరిగాయి.


అయితే ఊహించని విధంగా ఎన్నో సంఘటనలు జరగటం, సీతారామలక్ష్మణుల వనవాసం, తరువాత సీతాపహరణం, హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవుని పరిచయం చెయ్యటం, రాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుని చెయ్యటం, ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి కదా !తరువాత సీతాన్వేషణ ,
తదుపరి యుద్ధప్రయత్నాలలో అవకాశం కొరకు ఎదురు చూస్తూ వర్షాకాలం గడిచేవరకూ ప్రస్రవణ గుహలో తలదాచుకున్నారు రామలక్ష్మణులు.అప్పుడు ఒక రోజు , తమ్ముడూ ! మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడూ దుఃఖభాజకుడూ మరొకడు గతంలో లేడు భవిష్యత్తులో ఉండడు.... అంటూ ........ రాముడు విలపిస్తూంటే లక్ష్మణుడికీ దుఃఖం ముంచుకొస్తుంది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చగా రాముడు శోకం నుంచి తేరుకున్నాడు.( మానవ జన్మ ధరించిన తరువాత అవతారమూర్తులైనా సంతోషం, శోకం వంటి మానుష లక్షణాలను ప్రదర్శించటం జరుగుతుందట.
)సరిగ్గా అదే సమయానికి నారదుడు ఆకాశం నుంచీ వచ్చాడు.


రామా ! అసలు నువ్వు జన్మించిందే రావణసంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. అంటూ ఇంకా ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ..... పూర్వ జన్మలో వైదేహి గొప్ప తపస్విని.
అని ,.(.... ఆమె పూర్వ జన్మ గురించి , ఆమె రావణుణ్ణి శపించటం గురించి చెప్పి ) .... అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది రమాంశ సంభూత.


( వొళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు రావణుడు. )మరో రహస్యం విను. నువ్వు సాక్షాతూ విష్ణుమూర్తివి. చావుపుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్ధనను మన్నించి రావణవధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవజన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు.అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ధర్మపరురాలై సాధ్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తోంది. ఇది అంతా దేవతల కోసం జరుగుతోంది కనక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలిదప్పికల బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. ( అని చెప్పి )
రావణాసురుడు మహాబలశాలి.. వరగర్వితుడు. అతణ్ణి సంహరించేదుకు నేనొక ఉపాయం చెబుతాను ..... ఆశ్వయుజమాసం వచ్చింది. దేవీ నవరాత్ర వ్రతం శ్రద్ధగా చెయ్యి . కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చెయ్యవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. తేలికగా విజయం పొందుతావు. ....నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను . దేవకార్యం కోసం ఈ పాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది..( అని రామునితో వ్రతాన్ని చేయించాడు. ) .

రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. మహావీరా ! రఘురామా ! నీ భక్తి శ్రధ్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో ఇస్తాను. . ..అని అనుగ్రహించటం జరిగింది. రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షగా పూర్తి చేశాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు.


(అయితే చాయా సీత అయినా అమ్మవారి అంశే కాబట్టి , ఆమెకు ఆకలిదప్పులు లేకుండా ఇంద్రుడు ఆమెకు అమృతాన్ని పంపించటం అనేది సముచితమే అని నాకు అనిపించింది..)


....................శ్రీ దేవీ భాగవతంలోనే ఇంకో దగ్గర వేదవతి గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి.నారాయణమహర్షి నారద మహర్షికి
వేదవతి గురించి, ఛాయా సీత గురించి చెప్పటం జరిగింది.కుశధ్వజ మహారాజుదంపతులు లక్ష్మీదేవిని ఉపాసించి ఆ తల్లి అనుగ్రహం వల్ల ఎన్నో వరములను పొందారు. లక్ష్మీదేవి అంశతో వారికి ఒక పుత్రిక కూడా కలిగింది. ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు.
వేదవతి శ్రీహరిని పతిగా పొందాలని తీవ్ర తపస్సు చేసింది. అప్పుడు, ఒక అశరీరవాణి వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు అని చెప్పగా వేదవతి మరల తపస్సు కొనసాగించింది.ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. ఆమె సౌందర్యాన్ని చూసి చలించి చెయ్యి పట్టుకుని కౌగలించుకోబోయాడు. వేదవతి కోపంతో కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్ణి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు.
వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది. రావణా ! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్రబాంధవంగా అంతరిస్తావు. అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది.వేదవతి జనకమహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఃఫలితంగా శ్రీరాముణ్ణి పరిణయమాడింది.తండ్రి మాట నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు.ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేషంలో వచ్చాడు. రామా ! ఒక నిజం నీకు చెప్పివెడదామని వచ్చాను. ఇది సీతాపహరణకాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. చాయా సీతను నువ్వు కాపాడుకో. పరీక్షా సమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను నేను. కేవలం విప్రుణ్ణి కాను. హుతాశనుణ్ణి.హుతాశనుడు తన యోగశక్తితో చాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదు.అగ్నిదేవుడు అటువెళ్ళాడో లేదో బంగారు లేడి రాముడి కంటబడింది. దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. (


రావణసంహారం అనంతరం సీతకు అగ్ని పరీక్ష పెట్టారు. . అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించారు. అసలు సీతను స్వీకరించి రాముడు అయోద్యకు తిరిగి వచ్చాడు.అవతార సమాప్తి అనంతరం రాముడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
లక్ష్మీదేవి అంశ అయిన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. .
(

Monday, March 26, 2012

దైవ విగ్రహాలు పెరగటం గురించి.....
కొన్ని దైవ విగ్రహమూర్తులలో కాలంతో పాటూ పెరుగుదల కనిపిస్తోంది.


ఉదా........కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇంకా, యాగంటి లోని నందీశ్వరుడు .


కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా చెబుతారు . శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి కొంత దూరంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది..,కాణిపాకంలో స్వామివారికి కొంతకాలం క్రిందట భక్తులు చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు.


కొంతకాలం క్రిందట యాగంటిలోని నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటానికి స్థలం సరిపడా ఉండేదట.


ఇప్పుడు అలా ప్రదక్షిణ చెయ్యటానికి , అంత స్థలం లేనంతగా నంది విగ్రహంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ దైవలీలలే.


హేతువాదులు ఏమంటారంటే, కొందరేమో రాళ్ళు పెరుగుతాయి అంటున్నారు.


కొందరేమో రాళ్ళలో జీవం ఉండదు కాబట్టి ఎలా పెరుగుతాయి ? అలాంటి పెరుగుదల అసంభవం.అంటున్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళకే తేలటం లేదు.


ఇంకా కొందరు .............ఒక్కోసారి భూమిలో వచ్చే మార్పుల వల్ల కొంతభాగం పర్వతాలు ఏర్పడుతాయి ,.అలాగే విగ్రహాలు పెరుగుతాయి అంటున్నారు.


పర్వతాలు ఏర్పడటానికీ, విగ్రహాలు పెరగటానికి పోలికే లేదు.


మరి , విగ్రహాలు పెరుగుతున్నా కూడా అవి ఒక పద్ధతిగా పెరుగుతున్నాయి.


అంటే వినాయకుని మూర్తి అలాగే చక్కగా ఒక పద్ధతిలో పెరుగుతోంది.


నందీశ్వరుని ఆకారం, ముఖకవళికలు ,చెవులు, పాదాలు ,ఇతర శరీరాకృతి చెక్కుచెదరకుండా చక్కగా అలాగే ఉండి పెరగటం జరుగుతోంది.


అంటే , ఇష్టంవచ్చినట్లు కాకుండా పూర్వపు ఆకారంలోనే పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి ఇదంతా దైవలీల.


సమాజంలో సవాలక్ష సమస్యలుండగా దేవుడు లేడని నిరూపించటానికి కొందరు ఎందుకు ఇంతగా తాపత్రయపడతారో అర్ధం కాదు.


సృష్టిలోని వ్యవస్థ పనిచేయటం గురించి కొద్దిగా తెలుసుకున్న శాస్త్రవేత్తలను ఎంతో గౌరవిస్తారు.

కానీ ఆ విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన మహాశక్తిని ఒప్పుకోము అని అగౌరవపరుస్తారు. ఇది చాలా అన్యాయం..


అంటే ;గాలిలో ఆక్సిజన్ ఉంటుందని కనిపెట్టిన శాస్త్రవేత్తను గౌరవించినంతగా,


గాలిలో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాటు చేసిన భగవంతుని గౌరవించరు కొందరు హేతువాదులు.,అంతటితో ఊరుకోకుండా, దైవం అంటూ ఎవరూలేరని కూడా చెప్పటానికి కొందరు చాలా తాపత్రయపడతారు..


ఎవరు ఎలాంటి పేరుతో పిలిచినా దైవము ఒక మహా శక్తి ..

............

కాణిపాకంలో స్వామి వారికి కొన్ని సంవత్సరాల క్రితం చేయించిన వెండికవచం ఇప్పుడు సరిపోవటం లేదు. ( స్వామివారి మూర్తి పెరగటం వల్ల. ).
Friday, March 23, 2012

అందరికి ఉగాది శుభాకాంక్షలండి.


ఓం.

అందరికి శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఆనందంగా ఉండాలని దైవాన్ని కోరుకుంటూ అందరికీ శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి.

షడ్రుచుల ఉగాది పచ్చడి రుచిగా బాగుంటుంది.

జీవితంలో సుఖం వచ్చినప్పుడు అతిగా పొంగిపోకుండా అంతా దైవం దయ అనుకోవాలి............. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా కష్టాల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి.


పెద్దలు ఏం చెపుతున్నారంటే సుఖాలు అనుభవించటం ద్వారా మనం సంపాదించుకున్న పుణ్యాలు ........... ఖర్చయి పోతాయట. . కష్టాలు అనుభవించటం ద్వారా మనం చేసిన పాపాలు ............. ఖర్చయి పోతాయట. .( తగ్గిపోతాయి. .)


అందుకని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా పాపభారం తగ్గిపోతోందని మనల్ని మనం ఓదార్చుకుంటూ ముందుకు సాగిపోవాలి.


పుణ్యాల బేలన్స్ తరిగిపోకుండా ఉండాలంటే మన జీవితము లో ఎప్పుడూ పుణ్యాలు చేస్తూనే ఉండాలి..


ఉగాది పచ్చడిలో వేపపువ్వు చేదుగా ఉన్నా..........శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. చేదు శరీరంలోని చెడు క్రిములను చంపి మనకు మంచి చేస్తుందట.


అలాగే జీవితంలో వచ్చే చిన్నచిన్న కష్టాల వల్ల ..............మనకు జీవితతత్వం బోధపడి మంచి జరుగుతుంది.

అంతా దైవం దయ. ....
Wednesday, March 21, 2012

ఎన్నో మహిమలు.......భౌతిక శాస్త్రం , జ్యోతిషం వంటి విషయాల గురించి చెప్పాలంటే ....


ఉదాహరణకు ......

శారీరిక నిర్మాణం గురించి ....... చెప్పాలంటే కొంచెం సులభంగా చెప్పగలరు. ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి.


మరి మనస్సు నిర్మాణం గురించి...... ఆలోచనలు ఎలా తయారవుతాయి ? వంటి విషయాల గురించి
చెప్పాలంటే అంత సులభంగా చెప్పలేరు......మనసు ప్రత్యక్షంగా కనిపించదు కాబట్టి.

...........................


లోకంలో భౌతికశాస్త్రానికి అంతుచిక్కని, అర్ధం కాని విషయాలు , ఎన్నో ఉన్నాయి.


కొందరు దైవము, మహిమలు ఇలాంటివన్నీ లేవంటారు కదా ! ఈ ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.ఈ భూమి మీది రహస్యాలు తెలుసుకోవటానికే మనకు ఎప్పటికీ సాధ్యం కాదు.......... ఇక అనంత విశ్వంలోని రహస్యాలు , కోటానుకోట్ల నక్షత్రాల గురించి తెలుసుకోవటం అసలెప్పటికీ సాధ్యం కాదు....


ప్రాచీనులు ఎన్నో మహిమల గురించి చెప్పటం జరిగింది.


మహిమలు అంటే కేవలం విభూతి సృష్టించటం ఇలాంటివి మాత్రమే కాదండి. ........... యోగులు కొందరు అణిమాది సిధ్ధులను పొందినవారు ఉన్నారట.............. శరీరాన్ని చిన్నదిగా , పెద్దదిగా చెయ్యగలగటం, పరకాయ ప్రవేశం, ఆకాశ గమనం, ఒక దగ్గర మాయమయ్యి......... ఇంకొక దగ్గర ప్రత్యక్ష మవ్వటం , దూరశ్రవణం, దూరదృష్టి కలిగిఉండటం ఇలా ................... ఎన్నో శక్తులు ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధించిన వారు ఉన్నట్లు ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
మహా భారతంలో సంజయుల వారు భారతయుధ్ధం జరుగుతున్న విధానాన్ని ......... ఎంతో దూరం నుంచీ చూసీ, అక్కడ జరిగే సంభాషణలు వినీ ........ధృతరాష్ట్రుల వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు అని అంటే ......... ఇదంతా అభూత కల్పన. ..... దూరం నుంచీ యుధ్ధం జరగటం చూడటం ఎలా సాధ్యం ? అని ఎగతాళి చేసిన వారు ఎందరో ఉన్నారు ........


మరి ఇప్పుడు టి.విలు, ఫోన్లు వచ్చాక దూరశ్రవణం, దూరదృష్టి అసాధ్యం కాదని తేలిపోయింది కదా !


.. ప్రపంచంలో సైన్స్ కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో ఇలాంటి మహిమలు స్వయంగా చూసినవారు.......... చెప్పిన మహిమల యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి.Mahavatar Babaji గారి శిష్యులు శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు.


Lahiri Mahasayulu ఒక మహా యోగి ,.వారు రాముడు అనే ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన విషయం ..గురించి....


ఆహారం తీసుకోకుండా ఎన్నో ఏళ్ళు జీవించిన ఒక మహా సాధ్వి గురించి,... . ఇలా ఎన్నో వివరాలు ఆ గ్రంధములో చెప్పబడ్డాయి.
ఒక యోగి ఆత్మ కధలో పెద్దలు అన్ని మతముల యొక్క గొప్పతనమును గురించి చెప్పటం జరిగింది. హిందు, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బౌధ్ధం , ఇలా అన్ని మతములు గొప్పవే. ఎందుకంటే అందరి దైవం ఒక్కటే కాబట్టి.అన్ని మతములలోను ఎన్నో మహిమలు చూపినవారు ఉన్నారు. ప్రపంచములో దైవశక్తి యొక్క గొప్పదనము ఇలాంటి వాటి ద్వారా నిరూపించబడుతుంది. ఒక యోగి ఆత్మ కధలో ఎంతోమంది హిందూ యోగులు చూపిన మహిమల గురించి చెప్పబడింది.Yogini Giri Bala....( గిరిబాల ) అనబడే ఒక సాధ్వి ఆహారం స్వీకరించక ఎన్నో సంవత్సరములు గడిపినారట. దాని గురించి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటారంటే ..... మానవుడు ఆత్మ అని నిరూపించటానికి , ఇంకా అతడు దివ్యమైన ప్రగతి సాధించటం ద్వారా , అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించటానికి ........ అని చెప్పటం జరిగింది. .ఇంకా మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో " ఆంరోహా " అన్న పట్టణానికి వెలుపలగా ఉండే " షర్ పుద్దీన్ షా దర్గా " లో తేళ్ళు ఎవరినీ కుట్టవట..ఈ దర్గాలోని మౌల్వీ గారి మహిమకు మరో నిదర్శనం ఏమిటంటే ................ఈ తేళ్ళను ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళేందుకు ఇక్కడి అధికారులు అనుమతిస్తారట.


అయితే........అధికారులు ఎంత సమయం వరకూ ఉంచుకోవచ్చని ఆ సమాధి దగ్గర అనుమతి తీసుకుని మీకు అనుమతిస్తారో ........ అంతవరకే ........ అవి ఎలాంటి హానీ చేయని సాధు జంతువుల్లా ఉంటాయట.నిర్ణీత సమయానికి ముందుగానే వాటిని మరలా దర్గా అధికారులకు అప్పగించాలట. ............ కేవలం సమాధిలోని ఆ మహిమాన్విత మహాపురుషుని దివ్య ఆత్మ యొక్క అద్భుత శక్తి కారణం గానే........... ఈ ఆలయ ప్రాంగణంలో తేళ్ళు ఎవరినీ కుట్టవట............ ఈ విషయం నేను ఒక పుస్తకంలో చదివానండి.
.కాణిపాకం లో కొలువున్న స్వయంభు వరసిద్ధి శ్రీ వినాయక స్వామి వారు పెరగటం గురించి అందరికీ తెలిసిందే.


ఇంకా, కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్య క్షేత్రంలో పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. .............. ఆ నందీశ్వరుని చుట్టూ కొంతకాలం క్రితం వరకూ కూడా ......... భక్తులు ప్రదక్షిణలు చేయటానికి స్థలం ఉండేదట.అయితే ఆ నందీశ్వరుడు పెరుగుతుండటం వల్ల .......... ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయటానికి అవకాశం లేనంతగా ........... నందీశ్వరుడు పెరగటం జరిగింది. మేము కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నాము.


ఈ విగ్రహమూర్తులు ఇలా పెరగటం దైవమహిమే.మన వాళ్ళకు విదేశాల వాళ్ళ గురించి చెబితే బాగా నమ్ముతారు. అలాంటి ఉదాహరణ చూడండి...........


" Edgar Cayce.....1877-1945 "" ..వైద్య ప్రపంచానికి అంతు చిక్కని అద్భుతం.........విచిత్ర శక్తుల వింత మనిషి......... ఈయన గురించి .......... నెట్ లో............ వివరంగా వ్రాయబడింది.ఈయన ఏసు క్రీస్తు భక్తుడు. వైద్యం గురించి ఏ మాత్రం తెలియని ఈయన ట్రాన్స్ లోకి వెళ్ళి , తనకు భగవదత్తమయిన శక్తి ద్వారా ............... గొప్ప డాక్టర్ గా మారి ఎన్నో క్లిష్టమయిన కేసులలో రోగాలను తగ్గించేవారట.


1910 లో డాక్టర్ వెస్లీ అనే ఆయన......... అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ రీసెర్చి వారికి ఎడ్గర్ ను ఓ మెడికల్ వండర్ గా పరిచయం చేశారట .
Bernadette Soubirous.......ఫ్రాన్స్ కు చెందిన బెరానాడెట్టే సాబిరస్ - అనే ఏసుక్రీస్తు భక్తురాలు మరణించిన తరువాత కూడా ఆమె శరీరం ఎన్నో సంవత్సరాలు శిధిలమవకుండా అలాగే ఉందట. మేరీమాత అనుగ్రహం వల్ల ఈమె వెలికితీసిన జలధార లోని నీటికి వ్యాధులను తగ్గించే శక్తి ఉందట.


కొన్ని విషయాలు ......


.Shirdi SaiBaba statue miracle - Talim interview .....


Mahavatar
Babaji......


Lahiri Mahasayulu ...


Yogini Giri Bala...


" Edgar Cayce....


Bernadette Soubirous..


.Cheiro .....అనే ఆయన హస్తసాముద్రికం చెప్పటంలో ఎంతో ప్రసిద్ధులు.


Scientific Miracles in Hindu Scriptures..must see!! - Religious ...


....................


ఈ రోజుల్లో కొందరు భక్తి పేరుతో ప్రజలను మోసం చేయటాన్ని, భక్తి పేరుతో మూఢత్వం పెరగటాన్ని ఖండించవలసిందే.......కానీ ఇలా ప్రపంచములో ఎన్నో వింతలు ఉండగా దేవుడు లేడు, మహిమలు లేవు అనటం మాత్రం అన్యాయం
.

Monday, March 19, 2012

కొన్ని విషయాలు......ఓం.....

ఈ రోజు జ్యోతిషం గురించి నాకు తెలిసినంతలో కొన్ని విషయాలను వ్రాద్దామనుకుంటున్నానండి. అలాగని
జ్యోతిషం గురించి నాకేదో బాగా తెలుసని కాదు. కొద్దిగా బేసిక్స్ మాత్రం తెలుసంతే.జ్యోతిష్యం నిజమైతే కర్మ సిద్ధాంతం తప్పు అవుతుంది. గ్రహ బలం నిజమైతే దైవ బలం శూన్యమవుతుంది. అని కొందరు భావిస్తున్నారు.


దైవబలమూ ( గ్రహబలమూ ) నిజమే. ... ..,,కర్మసిద్ధాంతమూ నిజమే...... అని నా అభిప్రాయం.పంచాంగం ప్రకారం లెక్కలు వేసి , ఎంతో ముందే గ్రహణం ఏర్పడే సమయాన్ని చెప్పగలుగుతున్నారు పంచాంగకర్తలు. గణిత శాస్త్రం ఆధారంగా చెప్పబడే పంచాంగం కూడా శాస్త్రమే.ఇక జ్యోతిషం విషయాని కొస్తే ఎవరైనా జ్యోతిష్యం ఎందుకు తెలుసుకోవటం ? అన్న ప్రశ్నకు నా అభిప్రాయం ఏమిటంటే...పూర్వజన్మలో మనం చేసిన కర్మను బట్టి ఈ జన్మలో కష్టసుఖాలు ఉంటాయి.... అని
ఆస్తికులు నమ్ముతారు కదా ! మనం గత జన్మలలో చేసిన కర్మను బట్టి ఈ జన్మలో మన జీవితం ఎలా ఉండబోతుందో జాతకచక్రం ద్వారా తెలుస్తుంది. ( జ్యోతిషం చక్కగా తెలిసిన పండితుని ద్వారా తెలుసుకుంటే ) .అయితే జాతకంలో ఉన్నదాన్ని మనం మార్చుకోలేము అని నిరాశ పడకూడదు అనీ ..... నాకు అనిపిస్తోంది.


మన జాతకాన్ని మనం ప్రయత్నిస్తే ( దైవానుగ్రహం వల్ల ) మార్చుకోవచ్చు........ అని శ్రీ
మార్కండేయుల వారు , సతీ శ్రీ సావిత్రీ దేవి వంటి .... గొప్పవారి కధల ద్వారా పెద్దలు మనకు తెలియజేసారు . అనిపిస్తుంది.
. అలాగే, వ్యక్తి తన జాతక చక్రాన్ని ముందే తెలుసుకోవటం ఎలాంటిదంటే ..... ఉదాహరణకు ....... ఒక వ్యక్తి హెల్త్ చెకప్ చేయించుకుని తన ఆరోగ్య పరిస్థితిని ముందే తెలుసుకున్నట్లు అన్నమాట.హెల్త్ చెకప్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటం వల్ల ఆ వ్యక్తి కి ఏ అనారోగ్యమూ లేనట్లు తెలిస్తే మంచిదే ( ఆరోగ్యం బాగుంది కదా అని .. చెడ్డ అలవాట్లు నేర్చుకుంటే అంతే సంగతులు. ) ,.....

..... ఒకవేళ ఏమైనా చిన్నా, పెద్దా అనారోగ్యాలు ఉన్నాయని పరీక్షలో తెలిస్తే ముందే తగు జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కదా !.
అంతేకానీ ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లు చెకప్ లో తెలిసినప్పుడు ...... అయ్యో ! ఇక నేను ఏంచేయగలను ? బాబోయ్ ! ........అని ఏడుస్తూ కూర్చోరు కదా !
అలాగే జాతకం గురించి ముందే తెలుసుకోవటం వల్ల..... అంతా మంచిగా ఉంటే సంతోషమే.( బాగుంది కదా అని ....పాపాలు చేయటం మొదలుపెడితే అంతే సంగతులు )......


.... ఒకవేళ ఏమైనా చిన్నపాటి తేడాలు ఉంటే భవిష్యత్తులో రాబోయే అపాయాలనుంచీ తప్పించుకోవటానికి ..... ముందే తగు జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.
అలాగే, మనం గత జన్మలలో చేసిన కర్మలు ...... వాటి ఫలితాలు ఇప్పటి జాతకం ద్వారా తెలుస్తాయి. రాబోయే కష్టాలను తప్పించుకోవటమన్నది..... మనం ఈ జన్మలో చేసే ప్రయత్నం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చు.వ్యక్తులు సరైన ఆహారం తీసుకోకపోవటం వంటి ఎన్నో కారణాల వల్ల అనారోగ్యం వస్తుంది.

..... ఆహారనియమాలను చక్కగా పాటించటం, మందులు వేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు .రోగం తక్కువగా ఉంటే ఔషధం కొద్దిగా తీసుకున్నా జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది...... బీపీ, సుగర్ వంటివైతే కొద్దిగా కంట్రోల్ అయినా కూడా జీవితాంతం మందులు వాడవలసి వస్తుంది, ......ఇంకా క్రానిక్ డిసీజెస్ అయితే, ఆ జబ్బు ఏ స్థాయిలో ఉందన్న దానిపై నివారణ ఆధారపడి ఉంటుంది.వ్యకులు పూర్వ జన్మలలో తాము చేసిన పాపకర్మకు ..... ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకోవటం , ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించటం ద్వారా సరిదిద్దుకోవచ్చు అనిపిస్తుంది.
పూజలు, శాంతులు, దానధర్మాలు వంటివి చేయటం ద్వారా రాబోయే కష్టాలను పూర్తిగా పోగొట్టుకోవటం , లేదా ఆ కష్టాన్ని కొద్దిగానైనా తగ్గించుకోగలగటం ....... ఇలా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి దైవానుగ్రహం ఉంటుంది.***********************


ఒకవేళ ఎవరైనా తమ . జాతకం తెలుసుకోకపోయినా జీవితంలో ఎక్కువగా మంచిపనులు చేస్తూ, .... దైవంపై భారం వేసి జీవించే వ్యక్తిని దైవమే సరైన దారిలో నడిపిస్తారు.

***********************


చెడ్డ పనులు చేసే వారు ఎన్ని తిప్పలు పడ్డా దైవం వారికి అనుకూలించటం జరగదు.


రావణాసురుడు తన కొడుకైన ఇంద్రజిత్తు మంచి ముహూర్తంలో పుట్టాలని భావించి గ్రహాలను మంచి స్థానాలలో ఉంచాలని ప్రయత్నించాడట.కానీ శ్రీ శనిదేవుని వల్ల రావణాసురుని ఆటలు సాగలేదు. శ్రీ రాముల వారు రావణాసురునితో చేసిన యుద్ధం సందర్భంలో శ్రీ లక్ష్మణుల వారి చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు కదా !
అందుకని జీవితంలో సత్ప్రవర్తన ముఖ్యం.శ్రీ హనుమంతుల వారు శ్రీ శనిదేవుని ఒక ఆపద నుంచి కాపాడారని అంటారు. అందువల్ల శ్రీరాముని భక్తులను , శ్రీ హనుమంతుని శనివారం నాడు పూజించిన భక్తులను శ్రీ శనిదేవుడు బాధించరని అంటారు. ఇలా ఎన్నో విషయాలను పెద్దలు చెప్పటం జరిగింది. ( నాకు తెలిసినంతలో వ్రాసానండి. )

*********************************


సమయం విషయంలో కూడా ఇప్పుడు మన గడియారాల్లో చూపించే సమయం కన్నా సూక్ష్మమైన లెక్కలు ఉన్నాయట.

Smallest Unit of Time1 paramanu 60,750th of a second
1 truţi = 29.6296 microseconds
1 tatpara = 2.96296 milliseconds
1 nimesha = 88.889 milliseconds
45 nimesha = 1 prāņa 4 seconds
6 prāņa = 1 vinādī 24 seconds
60 vinādīs = 1 nadī 24 minutes
60 nādīs = 1 ahorātra100 truti (atoms) = 1 tatpara (speck)
30 tatpara (specks) = 1 nimesha (twinkling)
18 nimesha (twinklings) = 1 kashtha (bit)
30 kashtha (bits) = 1 kala (~minute)
30 kala (minutes) = 1 ghatika (~half-hour)
2 ghatika (half hour) = 1 kshana/muhūrta (~hour)
30 kshana/muhūrta (hour) = 1 ahorātra (~day).

Truti is referred to as a quarter of the time of falling of an eye lid.


ఇలా అన్నమాట. ఈ లోకంలో బిడ్డ పుట్టినప్పుడు లెక్కించటానికి
సమయాన్ని ఈ లెక్కల ఆధారంగా ......చూస్తారో ? చూడరో ? నాకు తెలియదండి.

.....................


లోకంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి వ్యక్తి యొక్క వ్రేలి గుర్తులు వేరువేరు గానే ఉంటాయని అంటారు. ( అందుకే ముఖ్యమైన సందర్భాలలో సంతకాలతో పాటూ వ్రేలి ముద్రలూ తీసుకుంటారు కదా ! . ) ఇది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది .


ఈ రోజు జ్యోతిష్యం గురించిన టపా వ్రాయాలని నేను ముందే అనుకున్నానండి. . కొద్దిసేపటి ముందు చూస్తే జ్యోతిశ్శాస్త్రం గురించిన శ్యామలీయం వారి వ్యాసం కనిపించింది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది . శ్యామలీయం గారు నన్ను అపార్ధం చేసుకోరని అనుకుంటున్నాను...........


వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Friday, March 16, 2012

కుటుంబవ్యవస్థ కుదురుగా ఉండాలంటే...... ....వివాహం జరిగి అత్తవారింటికి వచ్చే కొత్త కోడలికి ఎన్నో భయాలు ఉంటాయి. ........ క్రొత్త వ్యక్తులు, క్రొత్త వాతావరణం , అలవాట్లు, ఆంక్షలు ఎలా ఉంటాయోనని భయం ఉంటాయి.ఈ రోజుల్లో ఆధునిక పోకడలతో పెరిగిన పిల్లలు తమతో అడ్జస్ట్ అవగలరా ? అని అత్తవారికీ ఆందోళనగానే ఉంటుంది.ఇక , ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఎటూ ఉండనే ఉంటారు. ...


కోడలికి చనువిస్తే నెత్తికెక్కుతుంది. జాగ్రత్తమ్మా ! అని ఒకామె అత్తగారితో అంటే ...


భర్తను కొంగున ముడి వేసుకోవటం నేర్చుకో. లేకపోతే నీ పని అంతే అని . కోడలితో అంటుంది ఒక ఆమె. ...ఇక ఈ ఇంట్లో నీ అధికారం తగ్గిపోతుంది జాగ్రత్త అమ్మాయ్! అని
ఆడపడుచుతో వేళాకోళంగా ( ? )అంటుంది ఇంకొక ఆమె.ఈ అమ్మలక్కలు కొందరు తెలిసి అంటే , కొందరు తాము ఇతరుల మనస్సులను నొప్పిస్తున్నామని తెలియకుండానే అంటారు.తెలిసి అన్నా తెలియక అన్నా అత్తాకోడళ్ళ మనస్సులలో అనుమాన బీజాలను వేసేస్తారు. ఇలాంటివారి మాటలతో జాగ్రత్తగా ఉండాలి...........( నేను కూడా ఇలా వ్రాయకూడదేమో ? కానీ, ఈ క్రింది విషయాలు వ్రాయటానికి ఇలా వ్రాయవలసి వచ్చింది. )అత్తగారు తానూ ఒకప్పుడు కొత్త కోడలిగా అడుగుపెట్టిన రోజులను గుర్తు తెచ్చుకోవాలి.కొత్తకోడలు తానూ భవిష్యత్తులో అత్తగారు అవుతాను కదా ! అని అనుకోవాలి..ఆడపడుచులు తమ అత్తవారింట్లో తాము ఎంత ఆప్యాయతను ఆశిస్తారో గుర్తుతెచ్చుకోవాలి.


అప్పుడు వారి మధ్య గొడవలు రావు.


బయట కష్టపడి ఇంటికి వచ్చిన మగవారికి , ఇంట్లో అత్తాకోడళ్ళు తిట్టుకోవటం ...... వంటి గొడవలు ఉంటే ఇద్దరికీ సర్ది చెప్పలేక, బయటే ఎక్కువగా తిరుగుతుంటారు.


భర్త ఎంతో కష్టపడి ఇంటికి వచ్చి, ఆ అలసటలో నాలుగుమాటలు అంటే చాలు ...... ఇక భర్తను మనసులో తిట్టుకుని , నాకు ఇంట్లో గుర్తింపు లేదు, బయటి వాళ్ళు నన్ను ఎంతో పొగుడుతారు..... అని తెగ ఫీలయిపోయి బాధలు కొనితెచ్చుకుంటుంది భార్య,.
ఇంటిపని, పిల్లల పనితో అలసిపోయి ఆ అలసటతో భార్య ఏదైనా నోరు జారితే,...... భర్త ఆమెను నాలుగు తిట్టి ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు. నా భార్య గయ్యాళి, ఎప్పుడూ సాధిస్తుంది. అని , బయట నన్ను ఎంతో గౌరవిస్తారు
అంటూ,.... బయటకు వెళ్ళిపోయి బాధలు కొనితెచ్చుకుంటాడు భర్త. .భార్య తన భర్త నుంచీ ప్రేమను ,...... జీవితాంతం అతను తనను చక్కగా చూసుకోవాలని అతనినుంచి భద్రతను , ...... కష్టసుఖాలలో తోడునీడగా కడవరకూ కలిసి జీవించాలని ఆశిస్తుంది..... భర్త ఆప్యాయంగా నాలుగు మంచిమాటలు మాట్లాడితే చాలు భార్య పొంగిపోతుంది.భర్త తన భార్య నుంచీ ప్రేమను,.... కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలనీ, ....... తన గొప్పదనాన్ని భార్య ప్రశంసించాలని ,....... కష్టసుఖాలలో తోడునీడగా కడవరకూ కలిసి జీవించాలని ఆశిస్తారు..... భార్య భర్త గొప్పదనాన్ని
ప్రశంసించి నాలుగు మంచిమాటలు మాట్లాడితే చాలు భర్త పొంగిపోతాడు.మనము ఇంటాబయటా ఎందరినో పొగుడుతూ ఉంటాము. అలాంటప్పుడు తనకోసం, పిల్లల కోసం కష్టపడుతున్న భర్తను భార్య....భార్యను భర్తా పొగిడితే తప్పేమిటి ?బయటివాళ్ళు ఎప్పుడో మనకు చిన్న సహాయం చేసినా , వాళ్ళు మనల్ని కొద్దిగా పొగిడినా ఉబ్బితబ్బిబ్బయిపోతాము. మనమూ వాళ్ళను ఎంతో పొగుడుతాము.కానీ, .ఇంట్లో వాళ్ళు మనకోసం ఎంత కష్టపడినా , ఎంత సహాయం చేసినా పెద్దగా పట్టించుకోము...... ఆ ! ఏముందిలే, తన బాధ్యత కాబట్టి చేస్తున్నారు ....... అని తేలిగ్గా తీసుకుంటాము.
బయటి వారు మనకు చేసిన సహాయాన్ని గుర్తించినంతగా ...... కుటుంబసభ్యులు మనకు చేస్తున్న సహాయాన్ని గుర్తించము.అయితే, ఇంట్లోవాళ్ళకు రోజూ అదే పనిగా ఒకరినొకరు పొగుడుకోవటానికి కుదరదని అందరూ గుర్తించాలి.అయితే మానవమాత్రులన్నాక చిరాకులు పరాకులు సహజం. ఆ గొడవలను తెగేదాకా లాగకుండా జాగ్రత్తపడాలి.


అప్పుడే వారి పిల్లలకు కూడా సర్దుకుపోవటం తెలుస్తుంది.


కుటుంబంలో అందరూ కలుపుగోలుగా , సందడిగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది


ఇంట్లో అందరూ ఒకరినొకరు చక్కగా అర్ధం చేసుకుని జీవిస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది..
సమాజంలో కొన్ని విపరీత పోకడలు......బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికీ అనేక కృతజ్ఞతలండి.


......................................

ఈ రోజుల్లో సమాజంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం, అక్రమ సంబంధాలు వంటివి పెరిగినట్లు అనిపిస్తోంది. ఆశ్చర్యమేమిటంటే , ఈ రోజుల్లో ఇవి మామూలే ...అనే నిర్లిప్త ధోరణిని ప్రజలు వ్యక్తపరచటం.కొన్ని విదేశాల్లో , కొందరు భార్యాభర్తలకు .నీ పిల్లలు....నాపిల్లలు, ..... మన పిల్లలు...అనే విధంగా పరిస్థితి ఉంటుందట. మన దేశంలో కూడా అలాంటి విపరీత పోకడలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇది ఎంతో విచారించవలసిన విషయం.విడాకులు, అక్రమసంబంధాల వల్ల ...... కుటుంబవ్యవస్థ కూలిపోవటం, భార్యాభర్తల మధ్యన పరస్పర అనుమానాల వల్ల .... హత్యలు, ఆత్మహత్యలు,...... తద్వారా వారి పిల్లలు అనాధలు కావటం వంటి విషాదకర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ...
.ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా ! పాతకాలంలో అయితే ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాట్లాడినా అన్నా అనో, తమ్ముడూ అనో, బాబాయ్ గారూ అనో చక్కటి వరసలు కలిపి మాట్లాడేవారు.
( ఈ రోజుల్లో మాట్లాడుకోకుండా కుదరదు లెండి. హుందాగా మాట్లాడుకోవచ్చు.)కొంతకాలం క్రిందట ఒక వార్తా పత్రికలో ఒక ఆర్టికల్ వేసారు. ఒక ఉద్యోగి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏమిటంటే ...ఈ ఉద్యోగిని తోటి మహిళా కొలీగ్స్ .....లిఫ్ట్ అడిగి వారి ఇంటివద్ద డ్రాప్ చెయ్యమంటారట.


( పురుషాహంకారం నశించాలి .............అని నినాదాలు చేసే ఆడవాళ్ళు కూడా తమ రక్షణ కోసం ....... మగవారి సహాయం తీసుకుంటారు కదా ! . )మొహమాటం వల్ల ఈ ఉద్యోగి " నో " అని చెప్పలేకపోయాడట. ..... ఇరుగుపొరుగు వారు చూసి విషయాన్ని ఆ అబ్బాయి భార్యకు అందించగా ఇద్దరి మధ్యన గొడవ అయిపోయిందట,. ఇదంతా చెప్పి ఆ అబ్బాయి ఏమన్నాడంటే , పూర్వం మహిళలు మగవాళ్ళతో మాట్లాడటానికి బిడియపడేవారని, , ఈ రోజుల్లో కొందరు ఆడ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారని , కామెంట్ చేసాడు.మగవారు కూడా తమ భార్య ఇతరుల వాహనం మీద తిరగటాన్ని అంతగా ఇష్టపడరు. .


ఇలాంటి ఎన్నో విషయాల గురించి ....... చాలా కుటుంబాలలో అపార్ధాలు వస్తున్నాయి.


వార్తా పత్రికల్లో సైకాలజిస్టులను సలహాలు అడుగుతుంటారు కొందరు. అవి చదివినప్పుడు ప్రపంచం ఎటు పోతోందో ? అనిపిస్తుంది.ఒకామెకు వివాహం అయిందట. కానీ ఈమె సహోద్యోగిని కూడా ప్రేమిస్తోందట. ఏం చేయాలో సలహా చెప్పమని సైకాలజిస్టులను సలహా అడిగింది.మరి కొందరు ఆడవాళ్ళు అక్రమసంబంధాలు ఉంటే తప్పేమిటి. ? అని కూడా ప్రశ్నిస్తున్నారు ........


ఇలా అడిగే ఆడవాళ్ళ గురించి వార్తాపత్రికల్లో చదువుతుంటే .......


ఇందుకే కాబోలు పూర్వీకులు ఆడవాళ్ళని బయట తిరగటానికి అంతగా ప్రోత్సహించలేదు అనిపిస్తుంది.ఒక ఆమె ఏమని అన్నదంటే ....... తన భర్త తప్పు చేసినప్పుడు అతనికి బుద్ధి రావటానికి తానూ అలా ప్రవర్తిస్తే తప్పేమిటని ప్రశ్నించింది.తోటివాళ్ళు తొడకోసుకుంటే తాను మెడ కోసుకోవటమంటే ఇదే మరి.. పోటీ అనేది మంచి విషయాల్లో ఉండాలి గానీ ఇలాంటి విషయాల్లో కాదు. .............

ఇల్లు అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. పూర్వం అయితే ఆడవాళ్ళు తమ బాధలను పొరుగింటి పిన్నిగారికో, వదినగారికో చెప్పుకునేవారు. మగవాళ్ళయితే తన బాధల్ని స్నేహితులతో చెప్పుకునేవారు.ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు మగస్నేహితులతో ........కొందరు మగవాళ్ళు ఆడస్నేహితులతో తమ ఇంట్లోని బాధలను చెప్పుకోవటం వల్ల ...... కొన్నిసార్లు ఆ చనువు ,సానుభూతి హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతోంది.ఈ రోజుల్లో స్త్రీ పురుషుల అతి చనువు వల్ల అనేక కుటుంబాలలో అపార్ధాలు వస్తున్నాయి.


నాకు తెలిసిన ఒక ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు అపార్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ భార్య కు ఉద్యోగరీత్యా మగ కొలీగ్స్ తో టూర్స్ వెళ్ళవలసి వచ్చేది. అలా వెళ్ళటం ఆమె భర్తకు నచ్చలేదు. ఆమె ఏమంటుందంటే , నేను తప్పేమీ చేయలేదు. నాకు కెరీర్ ముఖ్యం . అని విడాకులు తీసేసుకుంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు.
ఇంకొక కుటుంబంలో భర్త యొక్క వివాహేతర సంబంధం వల్ల నలుగురు పిల్లల తల్లి ఒకామె ఆత్మహత్య చేసుకోగా , ఇప్పుడు పిల్లలే వండుకు తింటున్నారు.భర్త తనకు అన్యాయం చేశాడని ఆమె చనిపోయింది కానీ, ఆమె చనిపోకుండా ఉండి , పిల్లలను చక్కగా చూసుకుంటే పిల్లలైనా సంతోషంగా ఉండేవారు కదా ! .


అక్రమసంబంధాలు అంటే ఇంట్రస్ట్ ఉండే ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా వారు వివాహం చేసుకోకుండా ఉండిపోవటమే ఉత్తమం. వివాహం చేసుకుని భాగస్వామిని ఎందుకు బాధపెట్టడం ?వివాహం అనేది ఒక పవిత్ర బంధం . కష్టంలోనూ సుఖంలోనూ కడవరకూ కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేసి నిలుపుకోవలసిన పవిత్ర బంధం. .తన భార్య పరాయి పురుషునితో చనువుగా మాట్లాడితేనే పురుషులకు ఎంతో బాధ కలుగుతుంది.


తన భర్త పరాయి స్త్రీ తో చనువుగా మాట్లాడితే భార్యకు కూడా అంతే బాధ కలుగుతుందని పురుషులు ఎందుకు గ్రహించరో ?


. మిగతా విషయాలలో స్త్రీ పురుషుల స్వభావాలలో కొద్దిగా తేడాలున్నా ఈ విషయంలో మాత్రం ఇద్దరి స్వభావమూ ఒకలాగే ఉంటుంది...... ..( స్త్రీల స్వభావం ఎలా ఉంటుందంటే......వైధవ్యం కన్నా సపత్నీ దుఃఖం ఎక్కువ అనుకుంటారట. అలాగని హయగ్రీవవృత్తాంతము లో చెప్పటం జరిగింది. )అయితే ప్రపంచంలో చెడ్డ వాళ్ళూ ఉంటారు. మంచి వాళ్ళూ ఉంటారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా ...... అన్నట్లు ...... స్త్రీలలో ఎందరో పుణ్యస్త్రీలు ఉంటారు.ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్న ఈ రోజుల్లో కూడా ...... ఎంతో హుందాగా , నిబ్బరంగా తమ విధులను నిర్వర్తిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది..ఏమైనా ఈ రోజుల్లో పాతకాలం నాటి పద్ధతులను మెచ్చుకునేవారిని చాలామంది ఎగతాళి చేస్తున్నారు.


దయచేసి కామెంట్స్ కూడా చదువుతారా....Wednesday, March 14, 2012

బ్రతకటం కోసం ఉద్యోగమా ?...ఉద్యోగం కోసం బ్రతకటమా ?ఈ రోజుల్లో జీవితంలో పెరిగిపోయిన పనివత్తిడి వల్ల కుటుంబాలలో అనేక సమస్యలు వస్తున్నాయి.


కుటుంబసభ్యులకు ఒకరితో ఒకరికి సరిగ్గా మాట్లాడుకోవటానికే సమయం చాలటం లేదు.

ఎవరికి వారు . ఉదయాన్నే లేచి హడావిడిగా పనిచేసుకుని ఏదన్నా తిని బయటకు వెళ్ళిపోతారు. ఇక రాత్రికి ఇంటికి చేరతారు.


ఇంటికి వచ్చాక కూడా పిల్లలకు చదువే సరిపోతుంది. ( హాస్టల్స్లో లేకుండా ఇంట్లో ఉంటే ) పెద్దవాళ్ళకు ఇంటి పనే సరిపోతుంది.


(
టీవీ చూడటం, నెట్ చూడటం ఎలాగూ ఉంటాయి....... ఏ కారణం చేతనయినా టీవీ పనిచెయ్యకపోతే ఆక్సిజన్ అందనట్లు అల్లాడిపోవటం ( మరీ అంతలా కాదు లెండి. )..... ఈ రోజుల్లో పిల్లా పెద్దా అందరికీ అనుభవమే. అందులో వచ్చే కొన్నిప్రోగ్రాంస్ నచ్చకపోయినా తిట్టుకుంటూ చూడటమే మన బలహీనత. )

తెల్లవారితే ఉరుకులుపరుగులు. ఇదంతా దేనికోసమో ఎవరికీ అర్ధం కాదు....


కానీ పరుగు అపితే ఎక్కడ వెనకపడిపోతామో ? అని జీవితంలో అలా పరిగెడుతూనే ఉంటారు పాపం.


పేరుకి కుటుంబసభ్యులే కానీ , ఈ రోజుల్లో వారి మధ్య కమ్యూనికేషన్ గాప్ బాగా పెరిగిపోతోంది.


కుటుంబసభ్యుల కన్నా బయటి వాళ్ళే ఎక్కువసేపు మాట్లాడుకోగలుగుతున్నారు. .( రోజులో ఎక్కువభాగం కలిసి పనిచెయ్యటం వల్ల., )


అందుకే ఈ రోజుల్లో కుటుంబసభ్యులు అపరిచితుల్లా ...... బయటివాళ్ళు చిరపరిచితుల్లా( సుపరిచితుల్లా ) మాట్లాడుకోవటం ఎక్కువవుతోంది.


భార్యకు ఒక ఊరిలో ఉద్యోగం, భర్తకు ఒక ఊరిలో ఉద్యోగం, పిల్లలు హాస్టల్లో ఉంటూ అందరూ అప్పుడప్పుడూ ఇంటికి ( ?) వస్తూ ఉంటారు.


ఆడవాళ్ళు వంట చేయటమే తప్పు , ....అంటున్నారు కొందరు . తన కుటుంబసభ్యులకు, తనకు వంట చేసుకోవటం అవమానం అనుకుంటే ఎలా ?


ఇంటి ఇల్లాలు వంట చేయటం , కుటుంబసభ్యులు వంట బాగుందని మెచ్చుకుంటూ భోజనం చేస్తుంటే ఆ ఇల్లాలికి ఎంతో సంతోషంగా ఉంటుంది. .


వంట చేయటానికి సమయం సరిపోక హోటల్ వంట తింటున్నప్పుడు , అందరూ హోటల్ వారిని మెచ్చుకుంటూ భోజనం చెయ్యాలి మరి.


వంట చేసే వ్యక్తి యొక్క ఆలోచనల ప్రభావం ....... ఆ వంట తిన్న వ్యక్తి మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే కొందరు , వంట చేసేటప్పుడు దైవనామస్మరణ చేస్తుంటారు.


యాడ్స్ లో చూపిస్తారు కదా... ..ఒక భార్య దుస్తులను తెల్లగా ఉతికితే ఆమె భర్త మెచ్చుకున్నట్లు అలా ......

ఒకరోజు , నా భర్త ,.... దుస్తులు తెల్లగా ఉతికానని నన్ను మెచ్చుకున్నారు.


నేను ఏదో ఆలోచిస్తూ...... ఆ దుస్తులు నేను ఉతకలేదు. మెషీన్లో వేసాను. మీ ప్రశంసలు మెషీనుకే చెందుతాయి అనేసాను.


అన్న తరువాత నాలుక కర్చుకున్నాను. . ( అందుకే బొత్తిగా నాకు లౌక్యం తెలియదని మా పెద్దవాళ్ళు నన్ను కోప్పడతారు. )


కుటుంబంలోని వారు ఒకరికొకరు సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకోవటం వల్ల వారి మధ్యన అన్యోన్యత , అనుబంధం పెరుగుతుంది. రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో ఇలా తోడునీడగా ఉండటం తగ్గిపోతోంది....


ఈ రోజుల్లో
కొందరు తల్లులు తమ చంటి పిల్లల్ని కూడా పెంచుకోవటానికి సమయం లేనంతగా బిజీ జీవితాలు అయిపోయాయి.


పూర్వం చేతి వృత్తులు మంచి స్థితిలో ఉన్న కాలంలో ఎవరింట్లో వారు వస్తువులను తయారు చేసేవారు. ( ఇప్పటిలా కర్మాగారాలు లేని కాలంలో ) అప్పుడు భర్తకు భార్య కూడా సహాయం చేసేది. అలా భార్యాభర్తలిద్దరూ చేదోడువాదోదుగా ఉండేవారు.... .

ఏమిటో ! ఈ రోజుల్లో ఆడా..మగా..పిల్లా...పెద్దా అంతా విరగబడి పనిచేస్తూ ..... ప్రపంచాన్ని ఇరవై అయిదో శతాబ్దంలోకి ఈడ్చుకుపోదామని ప్రయత్నిస్తున్నారుగానీ , అదేమో . ...... ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది ...


ప్రపంచమంతా పేదరికం, నిరుద్యోగం, విడాకులు, అక్రమసంబంధాలూ ఇలా ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. ...ఇదే కాబోలు అభివృధ్ధి అంటే..

కొన్ని సంస్థల యాజమాన్యం వారు తమ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గటానికి ..... ఆటలుపాటలు, సరదా ప్రోగ్రాములు , వంటివి నిర్వహిస్తూ ఉత్సాహపరుస్తుంటారు.


కొంతకాలం క్రిందట ఉత్తరభారతదేశానికి చెందిన ఒక ఆమె , సెలవు రోజుల్లో కూడా ఆఫీసులోనే పనులు ఉండటం వల్ల , తన భర్త ఇల్లు గురించి పట్టించుకోవటం లేదని మొరపెట్టుకోవటం గురించి ...... వార్తాపత్రికల్లో వచ్చింది కదా !


పూర్వం బ్రతకటం కోసం ఉద్యోగాలు చేసేవారు. ........ ఇప్పుడు ఉద్యోగాలు చెయ్యటం కోసమే బ్రతుకుతున్నారనిపిస్తోంది.


ఏంటో ! ఇవన్నీ తెలియక పాతకాలం వాళ్ళు పాపం అమాయకంగా జీవించారు. వాళ్ళను తల్చుకుంటే జాలిగా ఉంది ??


*****************

కొందరు ఏమంటారంటే...
ఆడవారి కష్టాలకు పురుషాధిక్య సమాజం కారణం అని అంటారు.


పురుషాధిక్య సమాజం అన్నది కొంతవరకూ నిజమే కానీ , ఆడవారి కష్టాలకు చాలా వరకూ .... సాటి స్త్రీలే .... సూత్రధారులూ, పాత్రధారులూ అని కూడా...అనిపిస్తుంది.

.నేను వ్రాసిన పాత టపాను కామెంట్స్ సెక్షన్లో వేసానండి. దయచేసి చదవగలరు....


Monday, March 12, 2012

కొన్ని విశేషాలు....విషయాలు......ఈ రోజు ఉదయం T.T.D . .వారి చానల్లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ఉపన్యాసం ప్రసారం అయ్యింది. వారు చతురాశ్రమ ధర్మాలను గురించి ఎన్నో విశేషాలను అద్భుతంగా తెలియజేశారు. .


..........................


ఇంకో విషయంలోకి వద్దాము....


మా మామ గారికి అత్తగారికి నేనంటే అభిమానమే. . మా మామగారి యొక్క తల్లి గారు కొద్దికాలం క్రిందటి వరకూ జీవించే ఉన్నారు. ఆమె కూడా నేనంటే అభిమానంగా ఉండేవారు. .


పెద్దవాళ్లతో మంచిగా ఉంటే వారి ఆశీర్వాదాలు లభించి .... పిల్లలకు మంచి జరుగుతుందని ..... నాకు జీవితంలోని కొన్ని అనుభవాల ద్వారా తెలిసింది.అయితే , నేను పెద్దవాళ్ళతో మంచిగా ఉండటాన్ని కొందరు బంధువులు ఎలా అర్ధం చేసుకున్నారంటే ....... ఆస్తిలో ఎక్కువ వాటా రావటం కోసమే నేను పెద్ద వారిని అలా కాకా పడుతున్నానని కామెంట్ చేసారట. .


ఈ విషయాలు మా అత్తగారు మామగారే మాతో చెప్పారు. చూశారా ! లోకం ఎంత చిత్రమైనదో ! అయితే ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోకూడదు .(ఎదుటి వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటే చూడలేని వారు లోకంలో చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మేము అనుకున్నాము..)ఈ విషయాలను బ్లాగులో వ్రాయటం నాకు ఇష్టంలేదు. కానీ , మనుషులు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో, ఎలా అపార్ధం చేసుకుంటారో తెలియటానికి ..... ఇదంతా వ్రాయవలసి వచ్చింది.ఈనాటి పిల్లలను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే,....... పెద్దవాళ్ళు ఆస్తిపాస్తులను పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళు తమ అవసరాలకూ .... కొంత భాగాన్ని అట్టేపెట్టుకోవాలి అనిపిస్తుంది.

........................


ఇంకో విషయంలోకి వద్దాము....


ఈ రోజుల్లో నడుస్తున్న కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని విషయాలను వ్రాద్దామనుకుంటున్నాను.


మనిషికి పుట్టినదగ్గర నుంచి చనిపోయేవరకూ ఇతరులతో సర్దుకుపోవటం, జీవితంలో రాజీపడటం తప్పదు.

ఉదాహరణకు ...... చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఆకలి వేసి ఏడ్చినా తల్లి వచ్చి పాలు పట్టేవరకూ వేచి ఉండక తప్పదు.


వృద్ధులైన తరువాత ఓపిక లేక ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. అప్పుడూ ఇతరులతో అడ్జస్ట్ అవ్వవలసే ఉంటుంది.


ఇక నడి వయసులో ఇంటా బయటా ఎందరితోనో అడ్జస్ట్ అయితేనే జీవితం సాగుతుంది.


ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు అడ్జస్ట్ అవలేక విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్నారు....... . కానీ వారు ఇతరులతో అయినా అడ్జస్ట్ అయ్యే జీవించవలసి ఉంటుంది.


ఉదాహరణకు..... ఒకామె తన భర్తతో విడిపోయి ఉద్యోగం చేసుకుని జీవిస్తుంది అనుకుందాము. ఆమె తన ఇంట్లో పనిచేసే పని అమ్మాయితో అడ్జస్ట్ అవ్వక తప్పదు.ఎందుకంటే , ఇంటి పనిచేసే అమ్మాయి మనం చెప్పిన సమయానికి వస్తుందన్న నమ్మకం లేదు. మనం చెయ్యమన్న పనీ సరిగ్గా చేస్తుందన్న నమ్మకం లేదు.అయినా వారిని గట్టిగా ఏమీ అనటానికి లేదు. గట్టిగా కోప్పడితే పని మానేస్తారు కదా ! ...... . అందుకని వేళకు రాకపోయినా, చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోయినా ......
నోరు మెదపకుండా భరించవలసి వస్తుంది మరి .ఇక ఆఫీసులో పై అధికారులు ఏమైనా కోప్పడినా , నిశ్శబ్దంగా భరించాలేగానీ నోరెత్తితే ఉద్యోగం ఊడిపోతుంది. కదా !


తోటి ఉద్యోగులు ఏమైనా కామెంట్ చేసినా మనసులో తిట్టుకోవటమే కానీ .... పైకి వాళ్ళని ఏమీ అనలేరు.


మగవాళ్ళ పరిస్థితీ డిటోనే.

ఇలా బయట అందరితోనూ అడ్జస్ట్ అయినప్పుడు ...... భార్య భర్తలు అహం తగ్గించుకుని .....ఒకరితోఒకరు సర్దుకుపోతే వారికీ , ఇంట్లో అందరికీ ..... జీవితం సుఖంగా ఉంటుంది కదా !బైటవాళ్ళ వల్ల ఎంత బాధ కలిగినా వాళ్ళను ఏమీ అనలేని మగవాళ్ళు ఇంటికొచ్చి తమ కోపాన్ని, చిరాకును భార్యా, పిల్లల మీద చూపిస్తారు....... వాళ్ళయితే
నోరు మెదపకుండా ఉంటారని .ఆడవాళ్ళేమో తమ కోపాన్ని ,చిరాకును పిల్లల మీద ప్రదర్శిస్తారు. ...... . వాళ్ళయితే ఎదురు చెప్పలేక
నోరు మెదపకుండా ఉంటారని .


ఇలా ప్రతివాళ్ళు తమకన్నా చిన్న వారిపై తమ కోపాన్ని ప్రదర్శిస్తారు..నేను భర్త మాట ఎందుకు వినాలి ? అని ప్రశ్నించే స్త్రీలు ..... తమ పిల్లలు మాత్రం తమ మాట తప్పక విని
తీరాలనుకుంటారు...


... మేము పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలని పిల్లలు ప్రశ్నిస్తే ?


ఇలా ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ..... కుటుంబం ... తద్వారా సమాజం అస్తవ్యస్తమవుతుంది....(ఇప్పుడు జరుగుతోంది అదే. )
కుటుంబసభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే , ఇల్లు అన్నాక ......ఆర్ధిక సమస్యలు, బంధువులతో సమస్యలు,......ఇలా అనేక సమస్యలు ఉంటాయి.అందుకే కుటుంబసభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ..........బయట వారికి ఈ సమస్యలు ఉండవు . కాబట్టి , బయటివారితో గొడవలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ..


అంతేకానీ ఇంట్లో వాళ్ళకన్నా బయటి వారు గొప్పవాళ్ళేమీ కాదు. వారికీ వారింట్లో అలాగే సమస్యలు ఉంటాయి.


అయితే బయటి వారి విషయంలో అందరమూ మర్యాద పాటిస్తాము. .....బయటవాళ్ళ మీద కోపమొచ్చినా ఓర్చుకుంటాము.ఇంట్లో వాళ్ళ మీద కోపమొస్తే ఓర్చుకోము ..... వాళ్ళని చెఢామఢా తిడతాము.


అందుకే కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి...
Friday, March 9, 2012

మన పూర్వీకులు ఎంతో దూరదృష్టి కలవారు.ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.


ఈ టపా ఇంతకుముందు వ్రాసిన " ఇంటింటికో కధ " టపా కన్నా ముందు వేస్తే బాగుండేది . ఒకోసారి అంతే.
..............


తమ మాట వినని ,తమను గౌరవించని పిల్లల గురించి అదేపనిగా ఆలోచిస్తూ ...... పెద్దవాళ్ళు తమ ఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకోవాలి ?


కొంతకాలం క్రిందట మేము ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో పెద్దవయస్సు గల భార్యాభర్తలు ఉండేవారు . ఆయనకు డెబ్భైఅయిదు ఏళ్ళకు పైనే వయస్సుంటుంది. ఆమెకు అరవై అయిదుకు పైనే వయస్సు ఉంటుంది. .


ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైరయ్యారు. మితభాషి . ఎక్కువగా ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేవారు. ఆమె చుట్టుప్రక్కల అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరికీ సాయం చేస్తూ ఉండేవారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. ఆమె ఆ వయసులో కూడా పనులన్ని చేసుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు.మేము అక్కడకు వెళ్ళక ముందు ... వారి కొడుకు కోడలు వారితో కలిసి ఉండేవారట. అత్తాకోడళ్ళకు అభిప్రాయాలు కలవక కొడుకు వాళ్ళు .... అదే ఊరిలో వేరే ఇంట్లో ఉంటున్నారట.
పిన్నిగారి కొడుకుకి తల్లితండ్రులంటే బాగా అభిమానం. తరచుగా వచ్చి పోతూ వారి బాగోగులు చూస్తుంటారు...పిన్నిగారు నాకు కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆమె ఇంట్లోనే రకరకాల వంటలు వండేవారు. భార్యాభర్తలు బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారు కాదు. ( ఆరోగ్యానికి మంచిది కాదని ).అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఆమె కొడుకు వాళ్ళ విషయాల గురించి అతిగా .
ఆలోచిస్తుండేవారు. అవన్నీ ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు.... అని ఆమె భర్త చెప్పినా పిన్నిగారు మనస్సును నిగ్రహించుకోలేకపోయేది.అంకుల్ ఎక్కువగా మెడిటేషన్ చేస్తుండేవారు. పిన్నిగారు పూజలు చేసేవారు .......... కానీ కొడుకు కోడలు గురించే ఎక్కువగా ఆలోచిస్తుండేవారు. ఉదాహరణకు మా ఇంటికి వచ్చి గంటసేపు కూర్చుంటే ఎక్కువ సమయం కోడలికి తనకు ఎందుకు గొడవయ్యిందో లాంటి విషయాలే చెప్పేవారు.చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె చెప్పేవి విని , ఆమె దగ్గర అయ్యో !
అంటూనే గొడవ పెరేగేవిధంగా మాట్లాడేవారు. సానుభూతి చూపటం అవసరమే కానీ , ఇద్దరిమధ్యన సమస్య వున్నప్పుడు..... వారి మధ్యన గొడవను తగ్గించాలి కానీ , గొడవ పెరిగేటట్లు మాట్లాడకూడదని నా అభిప్రాయం.
వారి కోడలు ఉద్యోగం చేసేవారు. ఆ అమ్మాయి కూడా ఆఫీసులో అందరితో కలుపుగోలుగా అందరికీ సాయం చేస్తూ మంచిపేరే తెచ్చుకుందట. . ఇక్కడ నాకు అర్ధం కాని విషయమేమిటంటే అత్తగారికి, కోడలికి ఇద్దరికీ కలుపుగోలు మనుషులుగా బయట మంచి పేరు ఉంది కదా ! మరి వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు కలుపుగోలుగా ఉండలేకపోయారో? అన్న విషయం నాకు అర్ధం కాలేదు.అత్తగారి వాదన అత్తగారిది........ కోడలి వాదన కోడలిది. ఎవరి కోణం నుంచి చూస్తే వారికి .... వారి వాదన కరెక్ట్ అని అనిపిస్తాయికదా ! ,. నాకు అయితే ఇద్దరిలోనూ తప్పొప్పులు ఉన్నాయి అనిపించింది.
పాత గొడవల గురించి చెబుతూ అత్తగారు నాకు ఒక సంఘటనను చెప్పారు. కోడలు ఇంట్లోని గొడవలన్నీ ఆఫీసులో తోటి కొలీగ్స్ కు చెపితే .... ఆమె ఫ్రెండ్స్ కొందరు అత్తగారికి ఫోన్ చేసి మీరు కోడలిని ఎందుకు బాధ పెడుతున్నారని అడిగారట. బయటి వాళ్ళు అలా అడగటం అత్తగారికి ఆగ్రహాన్ని తెప్పించగా గొడవ మరింత పెద్దదయ్యిందట. ఇంటి గొడవలో బయటి వారు దూరటం పిన్నిగారికి నచ్చలేదు.పిన్నిగారి కోడలు కూడా ఆఫీసులోని వారికి .... తన అత్తగారిని తిట్టేంత చనువు ఇవ్వటం తప్పు అని నాకు అనిపించింది.అయితే, నేను ఆమెతో ఏమన్నానంటే ....." ఇప్పుడు మీరు నాతో చెప్పినట్లే మీ కోడలు కూడా తన ఫ్రెండ్స్ తో చెప్పిందేమో పిన్నిగారూ ! అయితే బయటివాళ్ళు మీకు ఫోన్ చేయటం చాలా తప్పు. వాళ్ళు మీకు ఫోన్ చేసిన సంగతి మీ కోడలికి తెలిసి జరిగినా ... తెలియక జరిగినా అది చాలా తప్పు " అన్నాను...... ఇలా నేను కోడలివీ , అత్తగారివీ ఇద్దరి తప్పులు ఎత్తిచూపించి మీరు ఇద్దరూ సర్దుకుపోయినట్లయితే బాగుండేది. అన్నాను.( నిష్పక్షపాతంగా న్యాయం చెప్పాలనుకుని అలా అన్నాను అంతే. . తరువాత కొన్నాళ్ళు ఆమె నాతో మాట్లాడలేదన్నది పాఠకులు గ్రహించగలరు. నేను ఇప్పటికీ మారలేదు కదా ! బ్లాగుల్లో ఉన్నదన్నట్లు నాకు తోచింది వ్రాసి ఇతరులకు కోపం తెప్పిస్తుంటాను కదా ! )


కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఆమె నాతో మాట్లాడారులెండి.


పిన్నిగారు ..వారి కోడలు మధ్య జరిగిన గొడవలు వింటే మనకు తెలిసేది ఏమంటే....అవన్నీ అందరి ఇళ్ళలో ఉండే గొడవలే.


ఈ అత్తాకోడళ్ళ గొడవలన్నీ చూసి కొడుకు .. తాను పెళ్లి అనేది చేసుకోకుండా ఉంటే బాగుండేది అన్నాడట. అత్తాకోడళ్ళు గొడవ పడితే ఇంట్లో అందరికీ సమస్యే కదా మరి !
చాలా మంది పెద్దవాళ్ళు ..... తమ . పిల్లలకు పెళ్లి అయేవరకు పెళ్లి చేసుకొమ్మని గొడవ చేస్తారు. . ఇక పెళ్లి అయిన తరువాత ....... తమ పిల్లలు తమకు దూరం అవుతారేమో ? అని భయపడతారు. .

పెళ్లి తరువాత పిల్లలు...... తమ అమ్మానాన్నతో పాటు........ అత్తా మామ గారిని కూడా గౌరవించవలసి ఉంటుంది.
...... ఇది అందరు అర్ధం చేసుకున్నప్పుడు గొడవలు పెరగవు..
పిన్నిగారు .... కొడుకు కోడలు గురించి వర్రీ అవుతుంటే ఆమెకు నచ్చచెప్పటానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. పిన్నిగారూ ! ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యనే అభిప్రాయభేదాలు వస్తున్నాయి. కోడలు... మీలా ఆలోచించటం లేదని అదేపనిగా చింతించటం వల్ల వాళ్ళు మారకపోగా.... మీ ఆరోగ్యమే పాడవుతుంది .అని చెప్పేదాన్ని... .
అయితే ఇతరులకు చెప్పుకోవటం వల్ల మనస్సుకు కొంచెం ఉపశమనం కలుగుతుందని పిన్నిగారు అలా చెప్పేవారు.ఎక్కువగా వర్రీ అయితే అల్సర్స్ వస్తాయని వైద్యులు అంటారు కదా ! .తరువాత ఆమెకు అల్సర్ వచ్చి బాధ పడ్డారు.


తరువాత కొంతకాలానికి మేము కొద్దిదూరంలో వేరే ఇంటికి మారాము. ఇంక పిన్నిగారి కబుర్లు అంతగా తెలియలేదు.ఒకరోజు సడన్ గా మాకు తెలిసిన కబురు ఏమిటంటే ..... పిన్నిగారికి లైట్గా పక్షవాతం వచ్చిందని, హాస్పిటల్లో ఉన్నారని. తెలిసి నాభర్తా నేనూ వెళ్ళి చూసివచ్చాము అంతే . (
ఇరుగుపొరుగు వారు ఎన్ని కబుర్లు చెప్పినా ..... అనారోగ్యం వస్తే కుటుంబసభ్యులే కదా దిక్కు. )పిన్నిగారి భర్తకు చాలా విషయపరిజ్ఞానం ఉంది. పెరాలసిస్ వచ్చినవారిని వీలయినంత త్వరగా హాస్పిటల్లో చేర్పిస్తే కోలుకునే అవకాశాలు ఉన్నాయట.ఆమె అదృష్టం వల్ల స్ట్రోక్ వచ్చిన గంట లోపే భర్త గమనించి ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఇక పిల్లలు వచ్చారు. కోడలు కూడా వచ్చి కొంతకాలం చూసింది. పిన్నిగారి భర్త పిన్నిగారిని చూసుకోవటానికి .... ఇంట్లోనే ఉండే ఒక నర్సును ఏర్పాటు చేసారు.... వంటకు ఒక ఆమెను ఏర్పాటు చేసారు...... , ఇంటిపనికి అదివరకే ఒక ఆమె ఉంది. ఇలా ఇల్లంతా గజిబిజి అయిపోయింది. ఇంటి ఇల్లాలు మూలన బడితే ఇల్లు అలాగే అయిపోతుంది మరి.ఒకరోజు నేను ఆమెను పలకరించటానికి వెళ్ళాను.... ఆమె పరిస్థితి బాగా మెరుగయింది .బాగానే మాట్లాడుతోంది . చిత్రమేమిటంటే ఆమెకు అన్ని విషయాలూ పూర్వంలానే గుర్తున్నాయి. , నర్స్ ఆమెను బాత్రూంకు తీసుకువెళ్ళటం, స్నానం చేయించటం.....ఇవన్నీ చేసేది. . ఒక ఫిజియోధెరపిస్ట్ ఇంటికి వచ్చి చికిత్స చేసేవారు. .నేను వెళ్ళినప్పుడు పిన్నిగారు ఏం చెప్పారంటే ... ఆ నర్సు అందరి ముందు బాగానే ఉంటుందట. ఎవరూలేనప్పుడు ఈమెను కొద్దిగా గదమాయిస్తుందట. ఈ విషయాలను నర్సు దూరంగా వెళ్ళినప్పుడు చూసి
పిన్నిగారు రహస్యంగా నాతో చెప్పారు. ఇవన్నీ చూసి నాకు బాబోయ్! .... జీవితమంటే ఇలా కూడా ఉంటుందా ? ఇందుకే కాబోలు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అనిపించింది.( మనలో మాట....పెద్దవాళ్ళకు అనారోగ్యం వచ్చి మంచాన పడితే చూసుకోవటానికి ..... సొంత పిల్లలకే అంత ఓపిక ఉండటం లేదు. .ఇక నర్సు అలా విసుక్కోవటంలో అంత ఆశ్చర్యం ఏముంది .. అనిపించింది . )


ఇంతలో నర్సుకు వివాహం నిశ్చయం అయి వెళ్ళిపోవటంతో , క్రొత్త నర్సును వెతికి ఏర్పాటుచేసారట. ఇలా రోజులు భారంగా గడుస్తుండగా ..... సరిగ్గా తినీతినకా పెద్దాయన ఆరోగ్యం పాడయింది. విరోచనాలు, వాంతులతో తేరుకోలేక నీరసించిన పెద్దాయన వారం రోజులు హాస్పిటల్లో చికిత్స తరువాత పరమపదించారు.పిన్నిగారికి ఇక అసలు కష్టాలు మొదలయ్యాయి.కొన్నాళ్ళ తరువాత ఆమెను కూతురు తన ఇంటికి తీసుకెళ్ళిందట. ప్రస్తుతం పిన్నిగారు కూతురు వద్దనే ఉంటోంది........ కూతురు ,అల్లుడు , కూతురు అత్తగారు .... బాగా చూసుకుంటారట. ( నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది. )
కానీ ఆమెకు తన ఊరు వచ్చేసి ఉండాలని ఉంది. కూతురును ఎందుకు ఇబ్బంది పెట్టాలి . అని ఆమె అభిప్రాయం. కూతురి అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనీ కూడా పిన్నిగారికి మొహమాటం.


తనకు తోడుగా ఇంతకు ముందు తమ ఇంట్లో పనిచేసిన అమ్మాయిని పనిలో కుదుర్చుకుని..... పాత ఇంట్లో తాను ఉండటం తనకు ఇష్టం . అని ఆమె అంటున్నారు. అయినా మన ఇష్టాఇష్టాలు నెరవేరటం అన్నది ....... మన చేతుల్లో ఉందా ఏమిటి ? అనిపిస్తుంది ఇలాంటివి వింటుంటే.
పిన్నిగారి అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఈ మధ్యనే ఫోన్ చేసాను. పిన్నిగారు నెమ్మదిగా నడవగలుగుతున్నారట,.... ఎంతైనా ఆమె మాటలో పూర్వపు స్పష్టత రాలేదు. ఆమెకు ఇప్పటికీ పాత సంగతులన్నీ చక్కగా గుర్తున్నాయి.


పిన్నిగారిని తలచుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ......ఆమె కుటుంబసభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించి వర్రీ అవకుండా ఉన్నట్లయితే ఆమెకు అలాంటి అనారోగ్యం వచ్చేది కాదేమో ? అనిపిస్తుంది.
ఇంకో విషయం ఏమంటే పిన్నిగారితో మాటపట్టింపులు వచ్చి వెళ్ళిపోయిన కోడలికి ఏదో అనారోగ్య కారణాల వల్ల ఇప్పటివరకూ సంతానం కలగలేదు.పెద్దవాళ్ళూ పిల్లలూ సర్దుకుపోయి .... సరిపెట్టుకుని జీవించినప్పుడే కుటుంబంలో అన్నీ మంచిగా కలిసివచ్చి .....సంతోషం వెల్లివిరుస్తుంది . అలాకాకుండా అందరూ ఒకరి మనసును ఒకరు కష్టపెట్టుకోవటం వల్ల ..... అందరికీ కష్టాలు కలిగే అవకాశం ఉంది. అనిపిస్తుంది.
అత్తగారు కోడలిని కోప్పడితే .....తన తల్లి అయినా తనను కోప్పడుతుంది కదా ! అని కోడలు సర్దుకు పోవాలి. కోడలు ఏమైనా పొరపాటు చేస్తే..... తన కూతురు అయినా పొరపాట్లు చేస్తుంది కదా ! అని అత్తగారూ సర్దుకు పోవాలి. ఇవన్నీ చెప్పటానికి తేలికగానే ఉంటాయి. ఆచరించటం కష్టమేలెండి.ఏమిటో జీవితం. బంధాలూ అనుబంధాలూ...ఇవన్నీ కొందరి విషయంలో బందిఖానాలూ...మనశ్శాంతి కోసం మన శ్రేయోభిలాషులతో ..... మనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవటం మంచిదే . దానివల్ల గుండెబరువు తగ్గుతుంది, అలా చెప్పటం వల్ల మంచి వారి నుంచి చక్కటి సలహాలూ లభిస్తాయి. అయితే వాటితో పాటూ మనకు మనస్సుని నిగ్రహించుకునే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.... .
ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే...... మన పూర్వీకులు ఎంతో దూరదృష్టి కలవారు. ఇవన్నీ ఆలోచించే కాబోలు.... తామరాకుమీద నీటిబొట్టులా జీవించ గలిగితే అందరికీ మంచిది అని చెప్పారు .పూర్వీకులు నాలుగు రకాల ఆశ్రమధర్మాలను చెప్పారు. రోజుల్లో ఆశ్రమధర్మాలను ఆచరించగల మహానుభావులు అరుదుగా ఉంటారేమో ? అనిపిస్తుంది. మనలాంటి సామాన్యులు అవన్నీ ఆచరించలేకపోయినా ....... తాపత్రయాలను కొద్దిగానైనా తగ్గించుకోవటానికి ...... అలా తగ్గించుకోవటానికి .......కనీసం ప్రయత్నించగలిగితే మనకే మంచిది అనిపిస్తుంది..Wednesday, March 7, 2012

ఇంటింటికో కధ....
ఒకటవ కధ........మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు. వారు అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా వారితోనే ఉంటారు. మనుమలు, మనుమరాండ్రు అందరితో సందడిగా ఉంటుంది వారి ఇల్లు. తల్లిదండ్రులకు కూడా ఒక గది వేరేగా ఉంది. తల్లిదండ్రులను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, సంసారంలో ఉంటూనే తామరాకుమీద నీటిబొట్టులా జీవించటం అంటారే ........ అలా ఉంటారు వాళ్ళు.


యిలా
కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసిమెలిసి ఉంటూనే తామరాకుమీద నీటిబొట్టులా చక్కగా జీవిస్తారు. వారి జీవితంలో అనుభవంతో వచ్చిన పెద్దరికంతో ఇతరులకు సలహాలనూ, సూచనలనూ , ఇస్తూ ...దైవం మీద భారం వేసి చక్కగా జీవిస్తుంటారు.


**********************


మనుషులన్నాక బేధాభిప్రాయాలు సహజం. సర్దుకుపోతేనే కదా జీవితం సవ్యంగా సాగుతుంది. అయితే అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా ! అందరి జీవితాలూ సవ్యంగా ఉంటే ఇక చెప్పుకోవటానికి ఏముంటుంది ?మనం ఎంత బాగా ఉన్నా అవతలి వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే కష్టాలే.
రెండవ కధ.......ఇంకొక కుటుంబం ఉన్నారు. వారిది జాయింట్ ఫామిలీయే. కొడుకుకోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అత్తగారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఆవిడ చెప్పిన విషయాలు ఏమంటే .....ఆ పెద్దవాళ్ళకు ఉదయాన్నే మెలకువ వచ్చేస్తుందట. వారికి టీవీలో భక్తి కార్యక్రమాలు చూడాలనిపిస్తుందట. కానీ ప్రొద్దున్నే టీవీ పెడితే టివీ సౌండ్ వల్ల కొడుకు కోడలు ఏమైనా అనుకుంటారేమోనని వీళ్ళు ఫీలవుతుంటారట. అంటే కొడుకు వాళ్ళు కొంచెం లేటుగా నిద్ర లేస్తారట. .


ఇంకా సాయంత్రం పూట పెద్దవాళ్ళకేమో పండ్లు లేక ఏదైనా లైట్గా తింటే చాలు అనిపిస్తుందట. పెద్దవాళ్ళకు బీపీ, సుగర్ .....వంటి అనారోగ్యాలు ఉంటే దానికి తగ్గట్లుగా ఉప్పు, కారం, పంచదార వంటివి తగ్గించి తీసుకోవాలి కదా ! కొడుకు వాళ్ళకేమో స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమట. ఇలాంటి సమస్యలతో సర్దుకుపోలేక వారు ఏం చేశారంటే.......వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఒక భాగంలోనేమో పెద్దవాళ్ళు ఉంటే , ఇంకో భాగంలో కొడుకు వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారట. ఇప్పుడు వాళ్ళకు బాగానే ఉందట. పెద్దవాళ్ళు వాళ్ళకు ఇష్టమయినట్లు ఉదయాన్నే భక్తి ప్రోగ్రాంస్ చూడటం ...తమకు నచ్చినట్లుగా వంట చేసుకుంటున్నారట.తమకు ఏమైనా అనారోగ్యం వస్తే దగ్గరలో పిల్లలు అండగా ఉన్నారని పెద్దవాళ్ళకు
ధైర్యంగా ఉంటుంది ....... కొడుకు వాళ్ళకేమో, తాము ఉద్యోగం నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చినా లేక ఏదైనా ఊరెళ్ళినా పిల్లలను చూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ............ మొత్తానికి ప్రస్తుతం బాగానే ఉందని ఆవిడ చెప్పుకొచ్చారు. ఇలా ఉండే కుటుంబాలు ఈమధ్య మరికొన్నింటిని చూసాను.


**********************


ఇంటిపనీ, ఆఫీసు పనితో సతమతమయ్యే కోడళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఉద్యోగం చేసే కోడలికి ఇంటిపనిలో ఇష్టంగా సహాయం చేసే అత్తగార్లూ ఉన్నారు కానీ ........వారి సంఖ్య తక్కువ.మూడవ కధ........అలాంటి ఒక అత్తగారి కధ....... కోడలికి వంట రాదని అత్తగారే ఉదయం పూట వంట చేసి భోజనం బాక్సులో పెట్టి కోడలికి ఇచ్చేవారట. వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట. సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం , ఇంటిపని పట్టించుకోకపోవటం .......అలా అత్తా కోడళ్ళకు గొడవలు అయిపోయాయి. ఇలాంటి అత్తకు ఇలాంటి కోడలు రావటమే వింత .


***********************

కొందరు పెద్దవాళ్ళు పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు.


నాలుగవ కధ........నాకు తెలిసిన ఒక పెద్దామె కూతురు ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక పాప. కెరీర్ పోతుందని చెప్పి ఆ అమ్మాయి తన నెలల వయస్సున్న చంటిపాపను తల్లిదండ్రుల దగ్గర విడిచి ఉద్యోగంలో చేరిపోయింది. . పెద్దవాళ్ళకు సాయానికి పనివాళ్ళున్నారు. ఎంతైనా చంటిపిల్లల పని అంటే శ్రమే కదా ! . పనివాళ్ళు రానిరోజున పెద్దవాళ్ళ పని చాలా కష్టమైపోయేది. చంటిపాపను
క్రెచ్ అంటూ పరాయి వారి పెంపకంలో వదలలేక ఆ పెద్దవాళ్ళు అలాగే ఇబ్బందులు పడ్డారు. ఇదంతా చూసి వారి అమ్మాయి పాపను క్రెచ్ లో వేసింది.ఇలాంటివారిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, వారు వారి అమ్మాయిని చదివించి ఉద్యోగంలో చేర్పించటానికి ముందే సమస్యల గురించి ఆలోచించుకుంటే బాగుండేది. .ఇప్పుడు చంటిపాపను క్రెచ్లో చేర్పించటం కన్నా.... ఓపిక తెచ్చుకుని పెద్దవాళ్ళే పాపను పెంచటం న్యాయం అన్నది నా అభిప్రాయం.


*********************


అయిదవ కధ.....అయితే మరి కొందరు పెద్దవాళ్ళకేమో తమ మనుమలను,మనుమరాండ్రను పెంచిపెద్దచేయాలని ఎంతో సరదాగా ఉంటుంది. కానీ ఆ పిల్లల తల్లిదండ్రులేమో తమ చంటి పిల్లలను పెద్దవాళ్ళ దగ్గరకు పంపరు . తామే పెంచుకుంటాము అని క్రెచ్లలో వేస్తుంటారు.


అక్కడ సరిగ్గా చూసినా చూడకపోయినా నోరులేని చంటిపిల్లలు తమ అభిప్రాయాలను పెద్దవాళ్ళకు చెప్పలేరు కదా పాపం !


చంటిపిల్లలను పెంచే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి దగ్గరే పెంచటం మంచిది.*********************


కొందరు పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉందామని వచ్చి తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే ,..... మేము మా పిల్లలను పెంచి పెద్దచేసి ఇప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండాలనీ , నాలుగు ఊళ్ళు తిరిగిరావాలనీ అనుకున్నాము. కానీ , పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు.


అప్పటివరకూ జీవితంలో కష్టపడి మళ్ళీ పిల్లల వద్ద ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనీ నెత్తినేసుకుని చెయ్యాలంటే పెద్దవయస్సు వాళ్ళకి ఇబ్బందే మరి.( పూర్వం అంటే కోడళ్ళు ఇంటిపనీ, వంటపనీ, చంటి పిల్లల పనీ చేసుకుంటే ....తాత బామ్మలు తమ మనుమలు, మనుమరాండ్రతో ఆడుకోవటం, వారికి కధలు చెప్పటంతో కాలక్షేపం చేసేవారు.
)


యిలా రకరకాల కారణాల వల్ల ....కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడటం లేదు. వారికి పిల్లలతోనూ, మనుమలు, మనుమరాళ్ళతో కలిసి జీవించాలని ఉన్నా కూడా .... విడిగా ఉంటున్నారు.ఇంకొక పెద్ద కారణం ఏమంటే ...... పెద్దవయస్సులో పనిభారం పెరిగి ఏమైనా అనారోగ్యం వచ్చి మూలన బడితే వాళ్ళను చూసేవాళ్ళు ఎవరు ? అన్నది కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య అయిపోయింది కదా! .


*******************


ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చంటిపిల్లలను సంరక్షించటానికి..... వృద్ధులను సంరక్షించటానికి ,.....కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు వారిని సంరక్షించటానికి ......మరిన్ని రోబోట్లను శాస్త్రవేత్తలు తయారుచేయాలేమో !!..( మనుషులు బిజీ అయిపోయారు కదా !)


*******************


పైన వ్రాసిన విషయాలు చదివి నావి అన్నీ నెగెటివ్ ఆలోచనలు అని చాలామంది విమర్శిస్తారు. చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసే వ్రాసానండి. . రోజూ వార్తాపత్రికల్లో ఇంతకంటే చిత్రమైన జీవితకధలను చదువుతున్నాము.


భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విడాకులు, టీనేజీ పిల్లలలో పెరుగుతున్న దురభ్యాసాలు, సమాజంలో పెరుగుతున్న అక్రమసంబంధాలు , ఇవన్నీ చూస్తూ కూడా సమాజం అంతా బాగుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే..


దురదృష్టమేమిటంటే మద్యపానం, అర్ధనగ్నంగా దుస్తులు ధరించటం , ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి సమాజంలో గౌరవం లభించటం....