koodali

Monday, June 29, 2015

తెలుగువాళ్ళు....

 కొందరు ఏమంటారంటే, తెలుగువాళ్లు కలుపుగోలుగా ఉండరు అంటారు..  అయితే, అది నిజం కాదు.

తెలుగువాళ్ళు ఇతరులతో సర్దుకుపోతారు కాబట్టే ఇతరరాష్ట్రాల లోనూ, ఇతరదేశాలలోనూ చక్కగా ఉండగలుగుతున్నారు.

అయితే, సమస్య ఏమిటంటే వాళ్లల్లో వాళ్లకు ఐక్యత అంతగా ఉండదు.

తెలుగురాష్ట్రంలో నివసించటానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అయినా తెలుగు నేర్చుకునే అవసరం అంతగా రాకపోవచ్చు.

 ఎందుకంటే మనమే వాళ్ళ భాషలో వాళ్ళతో  కలుపుగోలుగా మాట్లాడతాము. అదే  తోటి తెలుగువాళ్ళతోయితే  మనము సరిగ్గా మాట్లాడము.
 ............

ఇంకో సమస్య ఏమిటంటే, తెలుగువాళ్లకు ఆడంబరత్వం ఎక్కువ. అంటే తమకు ఉన్న సంపదను అందరికీ తెలిసేలా ఆడంబరంగా ప్రదర్శించటం.ఇందువల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

మేము  వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు గమనించిన విషయం ఏమిటంటే, వాళ్ళలో  ధనవంతులు కూడా ఎక్కువమంది ఆడంబరంగా ఉండరు. 

షాపింగ్కు వచ్చిన స్త్రీలలో తెలుగువాళ్ళను తేలికగా గుర్తుపట్టవచ్చు అన్నది నా అభిప్రాయం.

షాపింగ్ కూడా పెద్ద  ఫంక్షన్ కు  వచ్చినట్లు ఆడంబరంగా వెళ్లే కొందరు స్త్రీలను చూసి వీళ్లు తెలుగువాళ్లు కావచ్చు... అనుకుంటే చాలాసార్లు నా అంచనా తప్పలేదు.

ఒకరిని చూసి ఒకరు ఆడంబరంగా జీవించటం నేర్చుకుంటున్నారు. 

తెలుగువాళ్ళు ఇతరుల నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడంబరాన్ని  తగ్గించుకోవాలి. ఐకమత్యాన్ని పెంచుకోవాలి.
 ...................

 తెలుగు వాళ్ళలో  చాలామంది జీవనవిధానం ఆడంబరంగా తెలుస్తూనే ఉంటుంది.

మాకు తెలిసిన వాళ్లు విదేశాలలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొందరు  ఇండియా నుంచి వడ్డాణాలు వగైరా ఆభరణాలు చేయించుకుని వెళ్తుంటారు. విదేశాల్లో జరిగే వేడుకలలో ఈ ఆభరణాలు ధరిస్తారట.

 ఇవన్నీ గమనించితే నాకు ఏమనిపించిందంటే,  విదేశాల్లో కూడా వీళ్ళకు సమస్యలు మొదలయ్యే రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు..అనిపించింది.

బంగారం , ఆస్తిపాస్తులు ఏర్పరుచుకోవటం..భారతీయుల్లో ఎక్కువ.తెలుగువాళ్లలో మరీ ఎక్కువ. విదేశాల్లో కొందరు భారతీయులపై దాడులు జరగటానికి ఆస్తులు దాచుకోవటం కూడా ఒక కారణమంటున్నారు.
...............

ఆస్తిపాస్తుల విషయం చూస్తే, తెలుగు ప్రాంతంలో  ఎందరో ఇతరరాష్ట్రాల వాళ్లు ఉన్నారు. వాళ్లూ ఇక్కడ ఎంతో ఆస్తి సంపాదించుకుంటున్నారు. 

అయితే, తాము ఎంతో ఆస్తిపరులైనప్పటికీ సాధారణమైన ఇళ్లలోనే నివసిస్తారు.

వీళ్ళు  తమ సేఫ్టీ కోసమో లేక మరెందుకో తెలియదు కానీ  ఎక్కువ ఆడంబరంగా జీవించరు. ఎంతో సంపద ఉన్నా సాధారణంగా జీవిస్తారు.

 మరి  సంపాదించిన  డబ్బంతా ఏం చేస్తారు ? అనే సందేహం వస్తుంది. ఇక్కడ తాము సంపాదించుకున్న సంపదను తమ మాతృరాష్ట్రాలలో దాచుకుంటారేమో ? అనిపిస్తుంది.
..................

ప్రాచీన భారతదేశ సంపద విదేశీయులను ఆకర్షించింది. వ్యాపారం అంటూ భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఇక్కడ ఎంతో సంపదను ఆర్జించారు. 

అయితే వాళ్లు పొందిన  సంపదను భారతదేశంలో ఉంచకుండా తమ దేశాలకు తరలించుకుపోయారు.
..............

అయితే ఇప్పుడు విదేశాలకు వలస వెళ్లిన భారతీయులలో ఎక్కువమంది అక్కడ తాము సంపాదించిన సొమ్ముతో అక్కడే ఆస్తిపాస్తులు కొనుక్కుంటూ స్థిరపడుతున్నారు. విదేశాలే తమ మాతృదేశంగా భావించి అక్కడ స్థిరపడిపోవటానికి ఇష్టపడుతున్నారు.

 అయితే, మనం ఎంత కలుపుకుపోదామన్నా అవతలి వాళ్ళకూ  మనతో కలసిఉండాలనే   ఉద్దేశమూ, ఆ ఉబలాటమూ  ఉండాలి కదా! వాళ్ళ మనసులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పగలరు ?
........................

ఇతర ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో సమస్యలు వస్తే ఆస్తిపాస్తులను వదిలి కట్టుబట్టలతో మాతృదేశానికి తిరిగిరావలసి ఉంటుంది. 

అలాంటి పరిస్థితి వస్తే ఎలా ? అని ఆలోచించి అక్కడ కష్టపడి కూడబెట్టుకున్న సంపదలో కొంత భాగాన్ని అక్కడ పెట్టుబడి పెట్టుకుని, కొంత భాగాన్ని మాతృప్రాంతంలో పెట్టుబడులు పెట్టుకుంటారు  కొందరు.

 అయితే, స్వదేశంలో ఆస్తిని సురక్షితంగా ఎవరు చూస్తారు ? అనే ప్రశ్న ఎదురైతే విదేశాల్లోనూ ఆస్తి ఎంతవరకు సురక్షితం ? అనే ప్రశ్నా ఉంటుంది.
..............

కోరికలను అదుపులో పెట్టుకుని, అవసరమైనవరకే  సంపదను  కూడబెట్టుకోవటం మంచిది. 

సంపద ఎక్కువయ్యే కొద్దీ మాతృదేశంలో అయినా, విదేశంలో అయినా శత్రువులు  పెరుగుతారు.

 అతిగా ఆస్తులను కూడబెట్టుకోవటం అనేది అనేక సమస్యలకు కారణం. పరాయి దేశాలకు వెళ్లి ఆస్తులను కూడబెట్టుకోవటం మరిన్ని సమస్యలను తెస్తుంది.

ఆస్తి , అధికారం ..అనేవి సొంత అన్నదమ్ముల మధ్యే చిచ్చు పెడతాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మాతృదేశంలో నివసిస్తూ తృప్తిగా జీవించటం అన్నింటికన్నా మంచిది.అలా  కుదరనప్పుడు కనీసం మాతృదేశానికి  రాకపోకలు కొనసాగిస్తూ సంబంధభాంధవ్యాలను కొనసాగించాలి. Friday, June 26, 2015

స్వదేశం..విదేశం..


ఈ మధ్య కాలంలో విదేశాలలో స్థిరపడుతున్నభారతీయుల సంఖ్య పెరిగింది.

చదువుకోసమో లేక ఉద్యోగరిత్యానో కొంతకాలం విదేశాలకు వెళ్లటం అన్నది ఫరవాలేదు. అయితే అక్కడే స్థిరపడిపోవటం అంటే ఎన్నో విషయాలను ఆలోచించుకోవలసి ఉంటుంది.
........................

ఇప్పుడు తెలుగువాళ్ల మధ్య జరుగుతున్న గొడవలు చూస్తున్నాము  కదా!  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కానీ, ఒకప్పుడు  తరతరాలుగా తెలుగువాళ్లు అందరికీ చెందిన ప్రాంతం.

తెలుగువాళ్ళు  సాటి తెలుగువాళ్ళనే భరించలేకపోతున్నారు. మా ప్రాంతంలోకి  వచ్చి మా  ఉద్యోగావకాశాలను తీసుకోవద్దు .. అంటున్నారు.

 ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్యే ఇన్ని గొడవలు ఉన్నప్పుడు, మరి భారతదేశం నుంచి  విదేశాలకు  వెళ్లి  అక్కడ  స్థిరపడే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?
........................

విదేశాల్లో స్థానికులకు, వలసవాదుల వల్ల  తమకు ఉపాధీ అవకాశాలు తగ్గుతున్నాయనే  ఆలోచనలు బలపడినప్పుడు అక్కడకు వెళ్లిన స్థిరపడిన భారతీయుల పరిస్థితి ఏమిటి ?

 ( బహుశా వాళ్లు  అక్కడ రెండవతరగతి పౌరులుగా రాజీపడిపోయి బ్రతకవలసి ఉంటుందేమో.)

ఒకే భాష మాట్లాడే ప్రజలే తమలో తాము  సర్దుకుపోలేక  రాష్ట్ర విభజన వరకు పరిస్థితి వెళ్ళినప్పుడు,  విదేశాల వాళ్ళు పరాయి దేశాల వాళ్ళతో ఎందుకు సర్దుకుంటారు ?
...............

  విదేశాల్లో ప్రస్తుతం  అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు.  అయితే, భవిష్యత్తులో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. 

విదేశాల్లో కొన్నిసార్లు  అంతర్యుద్ధాలు సంభవించినప్పుడు...  అక్కడి భారతీయులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకురావటం జరిగింది . 
......................

ఇంకో విషయం ఏమిటంటే, ఒక దేశానికి ఇంకో దేశానికీ మధ్య ఏమైనా సంఘటన జరిగి స్నేహం చెడిపోయి శత్రుత్వం పెరిగినప్పుడు, అక్కడ స్థిరపడ్ద వలసవాదులను అడ్దుపెట్టుకుని వలసవాదుల మాతృ దేశాన్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలూ ఉన్నాయి.

అలాగని చెప్పి విదేశాల్లో స్థిరపడ్ద కొద్దిమంది కోసం స్వదేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టలేరు . 
.............

విదేశాల వారు తమకు  పనిచేసే వ్యక్తులు అవసరం అయినప్పుడు వలసలను వారే ప్రోత్సహిస్తారు. వలస వచ్చిన వారిని బాగానే ఆదరిస్తారు.

 కాలం గడిచేకొద్దీ  అక్కడి  స్థానికులలో వలసవాదుల పట్ల అసహనం పెరగనూ వచ్చు. ఎక్కడి నుంచో   మా ప్రాంతం వచ్చి , ఆస్తులు కొనుక్కుని సుఖపడుతున్నారని స్థానికులలో అక్కసు పెరిగే అవకాశమూ ఉంది. 
........................

 పరాయి ప్రాంతానికి వెళ్లినప్పుడు  చిన్నపాటి ఉపాధి చూసుకుని బ్రతికితే ఎక్కువ సమస్యలు రాకపోవచ్చు.

 అక్కడ స్థిరపడి, ఆర్ధికంగా పుంజుకుని ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటం మొదలుపెడితే మాత్రం స్థానికులలో వలసవాదుల పట్ల నిరసన మొదలయ్యే అవకాశం ఉంది.

ఇలాంటప్పుడు..వలసవాదుల సంతతి వాళ్లు తమ పెద్దవాళ్ల మాతృ దేశానికి తిరిగివెళ్లలేక , తాము పుట్టి, పెరిగిన దేశంలో రెండవ తరగతి పౌరులుగా జీవించలేక నలిగిపోతుంటారు. 
 ............

మాతృదేశంలో సౌకర్యాలు లేవని చెప్పి పరాయి దేశం  వెళ్లి అక్కడే స్థిరపడటం కన్నా, ఎవరి దేశాన్ని వాళ్లు చక్కదిద్దుకోవటం సరైన పని.
ఈ నిర్ణయం ..  మన ఇల్లు బాగోలేదని చెప్పి , పొరుగు ఇల్లు చక్కటి సౌకర్యాలతో ఉందని చెప్పి అక్కడే ఉండిపోవాలి...  అనుకోవటం లాంటిది .    
...................

పొరుగువాళ్లకు మనతో అవసరం ఉన్నంతవరకూ మనతో మంచిగా ఉంటారు. 
ఇంకో దేశం నుంచి వచ్చి మా ఉపాధులను లాక్కుంటున్నారు ..అనే అభిప్రాయం పెరిగినప్పుడు వలసవెళ్లిన వాళ్లు అక్కడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కూడా వదిలి  కట్టుబట్టలతో స్వదేశానికి తిరిగివచ్చే పరిస్థితి కూడా రావచ్చు.
.........

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు భారతదేశంలో తమకున్న సంబంధాలను కొనసాగిస్తూ ఇక్కడ కూడా ఆస్తిపాస్తులను ఏర్పరుచుకుంటే మంచిది. 

 ఎప్పుడయినా భవిష్యత్తులో విదేశాల్లో  పరిస్థితి తారుమారైతే స్వదేశంలో మన కంటూ ఒక  స్థానం ఉంటుంది కదా!Monday, June 22, 2015

యోగా ..


యోగాను అందించిన అందరికీ వందనములు.

యోగా అందరికీ అందాలన్నది మంచి ఉద్దేశ్యమే. అయితే, యోగాసనాలు ఎలా పడితే అలా చేయటం కాకుండా , యోగాసనాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారి వద్ద నేర్చుకుని చేయటం మంచిది.

తెలిసితెలియని వారివద్ద నేర్చుకోవటం లేకపోతే పుస్తకాలు చూసి ఆసనాలను చేయటం వల్ల అంత మంచిఫలితాలు రాకపోగా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలూ వచ్చే అవకాశం ఉంది.

సరైన విధివిధానాలు తెలిసిన వారి ద్వారా నేర్చుకుని  పాటించినప్పుడు తేడాలు రాకుండా చక్కటి ఫలితాలను పొందవచ్చు.

అనారోగ్యం ఉన్న వ్యక్తి మెడికల్ షాపుకు వెళ్లి మందులు వేసుకోవటం కన్నా,  వైద్యుని సలహా తో మందులు వేసుకోవటం  మరింత మంచిది కదా!
............................

యోగా అన్నది కేవలం శారీరిక ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కాదు ... .యోగా ద్వారా  వ్యక్తులు శారీరికంగానూ, మానసికంగానూ కూడా ఉత్తమ వ్యక్తులుగా తయారుకావాలి.

యోగా అంతిమలక్ష్యం....  ఉన్నతమైన వ్యక్తిగా తయారుకావటం..ముక్తిని పొందటం.

అంతేకానీ,  ఆసనాలు నేర్చుకుని ఆరోగ్యాన్ని పొంది,  ఆ ఆరోగ్యంతో  విచ్చలవిడిగా విలాసంగా జీవించటం కోసం యోగా నిర్దేశించబడలేదు.
......................

యోగా అంటే కేవలం ఆసనాలు వేయటం మాత్రమే కాదు. అహింస, సత్యం, ....వంటివీ ఉన్నాయి.

   ఈ విషయాలను పాటించటం గురించి ఎక్కువమంది ఎక్కువ  ఆసక్తి చూపించటం లేదు కానీ,  శారీరికఆరోగ్యం కోసం మాత్రం ఆసనాలను నేర్చుకుంటున్నారు.
 
యోగా ద్వారా శారీరిక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పొంది,   వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులుగా తయారుకావాలి. నైతికవిలువలు పెంపొందించుకుని  మంచి వ్యక్తులుగా ఎదగాలి . 

  

Wednesday, June 17, 2015

అనుబంధాల కన్నా....

వ్యక్తుల  మధ్య,  ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య , దేశాల మధ్య గొడవలు  ఎక్కువయ్యాయేమో .. అనిపిస్తోంది .
......................  

కుటుంబంలో ఒక వ్యక్తికీ ఇంకొక వ్యక్తికీ మధ్య గొడవ...


 కుటుంబ సభ్యుల  మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు.  

................. 

ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికీ ఇంకొక ప్రాంతానికీ గొడవ... 

 ప్రాంతాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు. 

................... 

ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికీ  గొడవ...   


రాష్ట్రాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు. 

....................... 

ఒక దేశానికి ఇంకొక దేశానికి గొడవ... 


 దేశాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు. 

...............

అనుబంధాల  కన్నా  అధికార బంధాలు,  ఆర్ధికబంధాలే   ముఖ్యం...  అనే  విధమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.   

..........................

 దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు. 

 వాతావరణం, గాలి, నీరు, ఆహారం..ఇలా ఎన్నింటినో సృష్టించి ఇచ్చారు. 


వీటితో హాయిగా కాలం గడపటం చేతకాక  లోభం, మోహం, అసూయాద్వేషాలతో సమాజంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇలాంటివారు దైవం నుంచి తప్పించుకోలేరు.


Monday, June 15, 2015

వేయికాళ్ళమండపము..


తిరుమల వేయి కాళ్ళ మండపము  గురించి నాకు అంతగా  వివరాలు  తెలియదు. 

 కొందరు.. వేయి కాళ్ళమండపాన్ని తిరిగి నిర్మిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.


 కొందరు ..వేరే విధంగా అభిప్రాయపడుతున్నట్లు  తెలుస్తోంది. 

ఎలా జరిగితే మంచిదో.. దైవమే దారి చూపించాలి.

 అంతా దైవం దయ.Saturday, June 13, 2015

ఆంధ్రప్రదేశ్..తెలంగాణా..

ఆంధ్రా వాళ్లు విదేశాల్లో చాలామంది  ఉన్నారు. అక్కడ ఎంతో కష్టపడి అభివృద్ధి లోకి వస్తారు..ఆ దేశాల అభివృద్ధిలో భాగస్వామ్యులవుతారు.

ఆంధ్రా వాళ్లు పరాయి రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అక్కడి అభివృద్ధి పనులలో ఆంధ్రుల పాత్ర ఎక్కువగానే ఉందట.  ఉదా.. గుజరాత్ లో సోలార్ విద్యుత్ అభివృద్ధి చెందటంలో ఆంధ్ర వాళ్ల పాత్ర ముఖ్యమైనదని వార్తలు వచ్చాయి.


 నిజమే, ఆంధ్ర వాళ్ళు ఇతర ప్రాంతాల అభివృద్ధిలో ఎంతో కృషి చేయటం బాగానే ఉంది. మరి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటంలో ఎందుకు కృషి చేయరో అర్ధం కావటం లేదు.


 ఇక్కడ సౌకర్యాలు లేవంటారు. వేరొక దగ్గరకు వెళ్లి అష్టకష్టాలు పడి పైకి  రావటానికి ఇష్టపడతారు కానీ, సొంత రాష్ట్రం అభివృద్ధి చెందటానికి వాళ్లకు ఉత్సాహం లేకపోవటం చాలా బాధాకరం.


 ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వనరులు ఉన్నాయి. డెల్టా భూములున్నాయి. సముద్రప్రాంతం ఉంది. పోర్టులు అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే ఎంత బాగుంటుంది.


ఆంధ్రుల కష్టంతో  తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్న వాళ్లు కొందరు  ఆంధ్రులను తిడుతుంటే బాధగా అనిపించటం లేదా ? మన ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవాలనే ఆరాటం కలగటం లేదా? ఆత్మాభిమానం అనిపించటం లేదా? 


వీటన్నింటికీ ముఖ్యకారణం..ఆంధ్రులకు తమ ప్రాంతం అంటే చిన్నచూపు ఎక్కువ అనిపిస్తుంది. మాతృభాష అంటే మమకారం అంతగా ఉండదు, ఐకమత్యం కూడా తక్కువే.అనిపిస్తుంది.

................

ఉమ్మడిరాష్ట్రంలో ఆంధ్రప్రాంతము నిరాదరణకు గురయ్యింది.


 డెల్టాభూములు, ఎన్నోవనరులు, సముద్రతీరం, అరకు వంటి శీతల ప్రదేశాలు, ఉండి కూడా  ఏ అభివృద్ధి జరగలేదు. ఆంధ్రప్రాంతం వాళ్లు చాలామంది  తమ పెట్టుబడులను హైదరాబాద్ ప్రాంతం వద్ద పెట్టడం జరిగింది. 


గత ప్రభుత్వాలు  ఆంధ్రప్రాంతాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్నే అభివృద్ధి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు.  మన రాజధానే కదా అనుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది...ఇదంతా మా ప్రాంతం, మీ రాజధాని కాదు పొమ్మన్నారు.

......................

ఇప్పుడు రాజధాని లేక లోటు రెవెన్యూతో నడిరోడ్దు మీద ఉన్నాము. విభజన సందర్భంగా పార్టీలు  పార్లమెంట్ సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు. 


ప్రత్యేక హోదానూ ఇస్తాము, రాయలసీమ, ఉత్తరాంధ్రా అభివృద్ధి చేస్తాము, రాజధాని కట్టిస్తాము..అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు.


రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రులకు అన్యాయం చేసాయి.. అని జాతీయపార్టీలను తిడుతున్నాము కానీ, 


  విభజనకు ముఖ్య కారకులు సాటి తెలుగువాళ్ళే కదా!

..................

ఎలాగైతేనేమి రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ  వాళ్ళు మిగులు ఆదాయంతో ఉన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నారు.


 మరి ఇంతకాలమూ..ఆంధ్రాదోపిడీ వల్ల తెలంగాణా వెనుకబడిపోయింది..అన్నారు. విభజన జరిగిన వెంటనే ధనిక రాష్ట్రంగా మారిపోయింది కాబోలు. 


 తెలంగాణా సంపదను ఆంధ్రావాళ్లు దోచుకోవటమే నిజమయితే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో పేద రాష్ట్రంగా ఎందుకు ఉంటుంది. దోచుకున్న సొమ్ముతో మిగులు రాష్ట్రంగానే ఉండేది కదా !

....................

 విభజన తరువాతైనా మనశ్సాంతి ఉంటుందిలే అనుకుంటే,  విభజన తరువాత కూడా ఎప్పుడూ గొడవే. నీళ్లు, విద్యుత్.. ఆంధ్రావాళ్ళు దోచుకుంటున్నారో అని ఇంకా ఒకటే గొడవ.


రాజధానితో సహా రాష్ట్రం వచ్చినా తృప్తి లేదా ? ఇంకా ఏం కావాలి ?


విభజన హామీ అయిన ప్రత్యేక హోదా ఇవ్వమని ఆంధ్రా వాళ్లు కేంద్రాన్ని అడగటం మొదలుపెట్టగనే,  వెంటనే తెలంగాణా వాళ్లు రంగంలోకి దిగి తెలంగాణా కూడా వెనకబడి ఉంది. మాకూ ప్రత్యేక్ హోదా ఇవ్వాల్సిందే అంటారు.


 ఒక ప్రక్క ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం తెలంగాణా కూడా పేద రాష్ట్రం అని చెప్పేస్తారు. 


ఇదంతా ఎంత ఘోరం అంటే, ఆంధ్రవాళ్ళు అభివృద్ధి చెందకూడదని కొందరు తెలంగాణా వాళ్ల అభిప్రాయంగా అనిపిస్తోంది.


మిగులు రాష్ట్రం తెలంగాణాకు ఆర్ధికంగా లోటు లేదు. హైదరాబాద్ ఆదాయంతో వాళ్లు మిగిలిన తెలంగాణా అభివృద్ధి చేసుకోవచ్చు.  ప్రత్యేక హోదా ఎందుకు?

..............

ఆంధ్రావాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగతా రాష్ట్రాల వాళ్లుకూడా అడుగుతారు కాబట్టి  ఇవ్వలేమేమో..అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో కొందరు. ఎప్పటికైనా ఇస్తాము...అంటూ మభ్యపెడుతున్నారు కొందరు.


ఆంధ్రవాళ్లు మెతకమనుషులు , వాళ్లకు ఐకమత్యం ఉండదు,  రోడ్దెక్కి గొడవలు చేయరులే  అని వాళ్ల అభిప్రాయమేమో? 


అయితే, ఆంధ్రవాళ్లకు అన్యాయం చేసిన  కాంగ్రెస్ పని ఏమయిందో అందరికీ తెలుసు.


కేంద్రం వాళ్లు ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. 


 మంచిగా అడిగితే పనులు కానప్పుడు, ఇక అప్పుడు మన హక్కుల కోసం పోరాటం చేయవలసివస్తుంది.

ప్రస్తుతానికి ఆంధ్ర వాళ్లు  ప్రత్యేక హోదా సంగతి పక్కన పెట్టి అందుకు ప్రతిఫలంగా  ఎన్నో రాయితీలను , మరెన్నో సౌకర్యాలను రాబట్టుకోవటం ప్రస్తుత పరిస్థితిలో తెలివైన పని అనిపిస్తోంది..
 

..............

కొందరు ఏమంటున్నారంటే, విభజన అనేది మాప్ మీద మాత్రమే జరిగింది. నిజంగా తెలుగు ప్రజలలో విభేదాలు లేవు అంటున్నారు. విభేదాలు లేనప్పుడు విభజన జరిగేదే  కాదు. 


 హైదరాబాద్లో ఉండే ఆంధ్రావాళ్లు కొందరు , అక్కడ తమకు ఇబ్బందులు రాకుండా ఇలాంటి మాటలు  చెబుతుంటారు.


 ఇలాంటి  వారికీ  ఒక విజ్ఞప్తి ఏమంటే.. మీ స్వంత ప్రయోజనాల కోసం ఆంధ్రరాష్ట్ర  ప్రయోజనాలను బలిచేయకండి.అని. 

.................

మరికొందరు తెలంగాణా వాళ్ళు,  ఆంధ్ర ప్రజల పట్ల మాకు కోపం లేదు. అంటారు. మీరు వేరు.. మేము వేరు అంటూ అన్యాయంగా విభజించి ఇప్పుడిలా కబుర్లు చెప్పటం ఆశ్చర్యం కదా ! 

.................... 
అయితే, తెలంగాణాలో.. డబ్బే సర్వస్వం అనుకోకుండా న్యాయానికి విలువ ఇచ్చే వ్యక్తులూ ఉన్నారు.   
.............

ఇక నీటి సంగతి. ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణాకైనా మరే రాష్ట్రానికైనా 
 నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. అది ఎవరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడి వచ్చినవి కాదు.


 నదుల పరీవాహక ప్రాంతాల వారికి ఆ నీటిపై హక్కు ఉంటుంది. ఎవరి వాటాను వారు వాడుకోవటంలో తప్పు లేదు.


అయితే, ఎగువ ప్రాంతాల వాళ్లు  అన్నీ మేమే వాడుకుంటాము అంటే ఎవరూ ఒప్పుకోరు. తీర్పు చెప్పటానికి న్యాయస్థానాలున్నాయి. ప్రజలు ఎవరైనా ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లవచ్చు.
............

తెరాసా పార్టీ వాళ్లు ఆంధ్రా వాళ్లను దొంగలు, దోపిడీదార్లు, ఇంకా చాలా రకాలుగా తిట్తారు. వాళ్లకు అభివృద్ధిపనులలో వాడుకోవటానికి ఆంధ్ర వాళ్ళ సహాయం కావాలి.అవసరం తీరిన తరువాత మళ్లీ తిట్టిపోస్తారు.


 ఉమ్మడి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ ని వాడుకున్నారు. విభజన జరిగిన తరువాత ఆంధ్రపార్టీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు ..అంటున్నారు.


 ఆంధ్రప్రజలకు  రాష్ట్ర విభజన జరగటం ఇష్టం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ వాళ్లు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు. అయినా ఆంధ్రప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించారు.


 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కష్టంలో ఉంది. 
కొంతకాలం వరకు ..తెలుగుదేశం పార్టీ చాలా ఎక్కువ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించవలసి ఉంది. ఆంధ్రను అశ్రద్ధ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ఇక తరువాత మీ ఇష్టం.

............

 గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రాంతాలలో పరిస్థితి గందరగోళంగా ఉంది. 

తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాలు తెలివిగా జీవిస్తున్నారు. తెలుగువాళ్లే ఇలా తయారయ్యారు.
 భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

Wednesday, June 10, 2015

.యధారాజా..తధాప్రజా..యధాప్రజా..తధా రాజా...


ఇప్పటి సమాజంలో నైతిక విలువలు తగ్గిపోయాయి.

యధారాజా..తధాప్రజా..యధాప్రజా..తధా రాజా.. అన్నట్లు పరిస్థితి ఉంది. ఇవన్నీ మారాలంటే సమాజంలో సమూలంగా మార్పులు రావాలి. నైతిక విలువలు పెరగాలి.

ప్రలోభాలు అనేవి అనేక విధాలుగా ఉండే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వజూపటం, ఖరీదైన వస్తువులను ఇవ్వజూపటం, పదవులను ఇవ్వజూపటం, ఆస్తిపాస్తులను ఇవ్వజూపటం ..వంటివి ఎన్నో ఉంటాయి.

ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ప్రజలకు ప్రలోభాలు ఆశ చూపి ఓట్లు అడిగే సంఘటనలు ఉంటాయని అంటారు.

కొందరు ప్రజలు కూడా  తమకు అలా ఇచ్చిన వాళ్ళకే  ఓట్లు వేస్తామని అడిగే సందర్భాలూ ఉంటాయంటారు.

మరి కొందరు ప్రజలు తమ పనులు ఏ మాత్రం ఆలస్యం కాకుండా త్వరగా జరగటం కోసం ఆఫీసులలో పనిచేసేవారిని  ప్రలోభపెడుతుంటారు.

 కొన్ని ఆఫీసులలో అయితే త్వరగా పని జరగాలంటే  తమకు లంచం ఇవ్వాలని  కొందరు ఉద్యోగులు డిమాండ్ చేయటమూ ఉంటుంది.

ఇలా జరిగే  ఎన్నో సంఘటనల గురించి వార్తల ద్వారా వింటున్నాము.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. .అందరిలో  నైతికవిలువలు పెరగాలి 
.....................

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో  జరుగుతున్న సంఘటనలు ఎంతో బాధను కలిగిస్తున్నాయి.

కొందరు, మీది తప్పంటే మీది తప్పంటూ నిందలు వేసుకుంటున్నారు.

మీరు ఇతరపార్టీల వాళ్ళకు డబ్బు ఇచ్చి ప్రలోభపరచాలని చూసారు. మీరు చేసింది తప్పు.. అని కొందరు అంటుంటే....

మీరు పదవులతో ఇతర పార్టీల వాళ్లను ప్రలోభపెట్టారు. మీరు చేసింది తప్పు.. అని మరికొందరు అంటున్నారు.

ఇలా ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నారు.

ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో వాళ్ళకే తెలియటంలేదనిపిస్తోంది.

ఇతరులను  ప్రలోభపెట్టే అంశం  విషయంలో చాలా రాజకీయ పార్టీల అభిప్రాయాలలో  దగ్గర సంబంధం ఉంటుంది. 
................

వ్యక్తులు తమ ఆధిపత్య ధోరణులు వల్ల గొడవలు పడేటప్పుడు ఆ ఆవేశం  అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. ఆవేశం తగ్గిన తరువాత ఆలోచించుకుంటే తాము ఎంత నష్టపోయామో తెలుస్తుంది.  

ఆధిపత్య ధోరణితో సాధించే సంతోషం తాత్కాలికమైనది.

పదవిలో ఉండి, ప్రజలకు సహాయం  చేసే అవకాశం అందరికీ లభించదు. 

ఆధిపత్య ధోరణి వల్ల లభించే తాత్కాలిక సంతోషం కన్నా....  ప్రజలకు సహాయం చేసి వాళ్ళ  జీవితాలను మెరుగుపరిచితే లభించే సంతోషం ఎంతో గొప్పది.

తప్పులు చేసినవాళ్లు ఇప్పుడు తప్పించుకున్నా భగవంతుని న్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు.... అని గుర్తుంచుకోవాలి.

  ఏది ఒప్పు ఏది తప్పు అనే విషయాలలో ఎన్నో ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ దైవానికి తెలుస్తాయి.


Tuesday, June 9, 2015

ఓం..అమరావతి..ఆంధ్రప్రదేశ్..

రాష్ట్రంలో  అభివృద్ధికి  అపారమైన  అవకాశాలున్నాయి.. .ఇంతకుముందు  ఇవన్నీ   నిరాదరణకు  గురయ్యాయి.  అభివృద్ధి  చేయబడలేదు.

 వేసవిలో  చల్లదనం  కోసం  ఊటీ  వెళ్తారు  కొందరు. అయితే  ఆంధ్రప్రదేశ్లో  కూడా  అరకు,  తలకోన  వంటి  చక్కటి  ప్రదేశాలున్నాయి.  వీటిని  అభివృద్ధి  చేసుకోవాలి .


ఆంధ్రప్రదేశ్లో  ఎంతో  తీరప్రాంతం  ఉంది.  నదీ  తీరాలున్నాయి.  కాలువలూ  ఉన్నాయి....రాష్ట్రంలో  ఎన్నో  బీచ్ లు  ఉన్నాయి.  పర్యాటక  రంగానికి  అద్భుతమైన  అవకాశాలున్నాయి.


కోస్తా  ప్రాంతంలో  ఎన్నో  కాలువలున్నాయి. ఆ  కాలువలకు  చక్కటి   గట్లు,  మెట్లు  కట్టి , ఒడ్దున  కొబ్బరిచెట్లను  పెంచి  బోటింగ్  ఏర్పాటు  చేస్తే ఎంతో  బాగుంటుంది.(కేరళలోలా..)


  కాలుష్యాన్ని  కలిగించే  పరిశ్రమలను  ఎక్కువగా  నిర్మించి  ఉపాధి  అవకాశాలు  కల్పించటం  కన్నా  సేవారంగం,  పర్యాటకం  వంటివి  అభివృద్ధి  చేస్తే  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  కల్పించవచ్చు.


ఉపాధి  కోసం  పరిశ్రమలూ   అవసరమే  కానీ,   కాలుష్యం  తక్కువగా   ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి . వ్యవసాధారిత   పరిశ్రమలనూ   ఏర్పాటు  చేయవచ్చు.


రాష్ట్రమంతటా  అపారమైన  సహజవనరులున్నాయి.  వీటిని  విచ్చలవిడిగా   వాడెయ్యకుండా  తగుమాత్రం  వాడుకుంటూ  చక్కటి  అభివృద్ధిని  సాధించవచ్చు.

...............................

రాజధాని మరియు రాష్ట్రం అంతా అభివృద్ధి చేసుకోవటంలో ప్రభుత్వం, అధికారులతో పాటూ ప్రజలు కూడా ఉత్సాహంతో పాల్గొనాలి.


ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికి తగ్గ కృషి చేయాలి.


కృషిలో కొంత అలసట ఉన్నా కూడా , ఫలాలు అందినప్పుడు లభించే ఆనందము ముందు అలసట అంతా మర్చిపోతాము.  ఉత్సాహంతో అందరూ కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.


Friday, June 5, 2015

ఓం..ఆంధ్రుల రాజధాని అమరావతి ఆరంభము..అమరావతికి భూమిపూజ జరగబోతోంది.

ఆంధ్రుల రాజధాని అమరావతి అద్భుతముగా అభివృద్ధి చెందాలని,
 రాజధాని అమరావతితో పాటూ ఆంధ్రప్రదేశ్ అంతా అద్భుతముగా అభివృద్ధి చెందాలని అందరమూ ఆశిద్దాము.

Wednesday, June 3, 2015

ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ?

ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, పురుషులు  స్వేచ్చగా కలిసి జీవించటాన్ని ఇష్టపడుతున్నారు. 

అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ,...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి. 

 మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ?

 బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా? 

సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ? 

కొన్నిదేశాలలో అయితే, ఇలాంటి వాళ్లకు జన్మించిన  పిల్లల  బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయట. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభుత్వ సంరక్షణలో పెరుగుతారు. 

ప్రభుత్వాలే పిల్లల్ని పెంచాలి..అంటే ఇక ప్రజలు ఏం చేస్తారు? పిల్లల్ని కని సమాజం మీద వదిలేస్తారా? ఇలాంటి వాళ్లు పిల్లల్ని కనకుండా ఉంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

కుటుంబ సంబంధాలు లేని ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ? స్వేచ్చ అంటే ఇదేనా ?

Monday, June 1, 2015

బ్రహ్మి మొక్క..?

సరస్వతి మొక్క అంటే  బ్రహ్మి మొక్క అని.. ఈ  మొక్క  ఆకులను ఉపయోగించితే తెలివితేటలు పెరుగుతాయని అనుకుంటున్నాము .

 అయితే , మనలో చాలా మంది  బ్రాహ్మి  అంటే ఒకే  మొక్క అనుకుంటున్నాము.


ఇలా  ..  రెండు రకాల మొక్కలు ఉన్నట్లు తెలుస్తోంది.


( ఈ రెండు రకాల మొక్కలలో  దేనిని  సరస్వతి మొక్క అంటారో తెలియటం లేదు.)


ఈ రెండు రకాల మొక్కలకూ  తెలివితేటలను వృద్ధి చేసే గుణమున్నట్లు తెలుస్తోంది.


 అయితే, ఈ  రెండింటిలో Gotukola  అనబడే మొక్కను గర్భిణీ స్త్రీలు వాడకూడదని అంటున్నారు.


( ఈ విషయాలు నాకు ఇంతకు ముందు తెలియదు. నిన్ననే నెట్లో చూసాను .  )
.................... 

. ఈ విషయాల గురించి వివరంగా  తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.Comparing Ayurvedic Herbs Brahmi and Gotu Kola ...
Introduction, Bacopa monniera and Centella asiaticaవీడియోలు...ఈ లింక్స్..ద్వారా..Difference Between Gotukola and Bramhi - Health Benefits ...
Gotu Kola and Brahmi - YouTubeఇలా లింక్స్  ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా  అభ్యంతరం ఉంటే..   తెలియజేస్తే  డిలిట్  చేస్తాను .