koodali

Friday, June 30, 2017

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు ప్రోగేసుకోవటం కన్నా..


 ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలా డబ్బు  సంపాదించి, వస్తువులను కొనటం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. 

దుస్తుల కోసం, ఫర్నిచర్ మరియు  కార్లు..వంటి వాటి విషయంలో అవసరానికి మించి ఖర్చుపెడుతున్నారు. 

ఈ రోజుల్లో చాలామందికి నెలకే వేలు లేక లక్ష వరకు  ఆదాయం వస్తోంది. ఈ డబ్బుతో విపరీతంగా వస్తువులను కొనిపడేస్తున్నారు.

మనిషి  సౌకర్యంగా జీవించాలంటే కొన్ని వస్తువులు చాలు. 
 ఉదాహరణకు దుస్తుల విషయంలో చూస్తే..

 ఒక మనిషి ఒక సంవత్సరానికి.. రోజువారీ ధరించే దుస్తులు అరడజను( సుమారు 1000  రూపాయల లోపు ), వారాంతాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ధరించటానికి  నాలుగు దుస్తులు ( సుమారు 1000 నుంచి 2000 ధరలో ) ఫంక్షన్స్లో  ధరించటానికి (2000 నుంచి  5000 ధరలో)  రెండు ఖరీదైన డ్రస్సులు కొనుక్కోవచ్చు. 


ఈ విధంగా ఒక  మహిళకు  సంవత్సరానికి సుమారు  సుమారు  10,000 లేక  25,000 ఖర్చు చేస్తే 12 చీరలు లేక డ్రస్సులు వస్తాయి.. వచ్చే సంవత్సరం మళ్లీ కొత్తవి కొనుక్కోవచ్చు. 

  అయితే, ఈ రోజుల్లో చాలామంది ఒక్కో డ్రస్సుకే 20 వేలు, 50 వేలు, ఒక లక్ష..ఆపైన కూడా ఖర్చు చేసి కొంటున్నారు.

 ( సొంత ఫంక్షన్స్ కొరకు అయితే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి  దుస్తులు కొనుక్కోవచ్చు. )

డబ్బు ఎక్కువఉన్న వారు కూడా  పరిమితమైన ధరలో వస్తువులు కొనుక్కోవచ్చు.

కోటి రూపాయల కారు కన్నా 10 లక్షల కారును కొనుక్కోవచ్చు.

 (పైన వ్రాసిన ధరలను కొంచెం ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు.)

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నవవన్నీ కొనాలని ఆశపడకుండా ఏది అవసరమో అవే కొనుక్కుంటే బాగుంటుంది. 

 బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి బోలెడు వస్తువులను కొనటం కన్నా, తగుమాత్రం వస్తువులను కొనుక్కుని,  తమ ఉద్ద ఉన్న డబ్బుతో.. డబ్బు బాగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది.

 ఉదా.. డబ్బు లేక  వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నవారికి, డబ్బు లేక చదువుకు దూరమవుతున్నవారికి..ఇలా సహాయం చేయవచ్చు.

ఊళ్ళలో నీటిశుద్ధి కేంద్రాలను  ఏర్పాటుచేయవచ్చు. ఉచిత అన్నదానం, వైద్యకేంద్రాలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. 


ఐశ్వర్యాన్ని అతి ఆడంబరంగా ప్రదర్శించేవారికి ఇతరుల నుండి దృష్టి ( నెగటివ్ శక్తి..) తగిలి కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు  ప్రోగేసుకోవటం కన్నా, మనతో పాటు ఇతరుల జీవితాలు బాగుపడటంలో  సహాయపడటం ఎంతో మంచిది.Wednesday, June 28, 2017

కొన్ని విషయములు..

శుభకరమైన ఈ సంవత్సరపు శ్రీ అమరనాధ్ యాత్ర ప్రారంభమైనది.
***************
మరి కొన్ని విషయములు..

పరిమితమైన కోరికలు... పరిమితమైన వస్తు వినియోగం...పరిమితమైన జనాభా...వల్ల ఎన్నో లాభాలున్నాయి.

పరిమితమైన కోరికలు...
పరిమితమైన కోరికలతో తృప్తి చెందితే ఎన్నో లాభాలున్నాయి.

 పరిమితమైన వస్తు వినియోగం .........
తక్కువ వస్తువులున్న ఇల్లు నీట్ గా ఉంటుంది.శుభ్రం చేయటమూ తేలిక. 

ఈ రోజుల్లో చాలామంది తమకు అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొంటున్నారు. 

వీటికి తోడు గిఫ్టులుగా వచ్చే వస్తువులు. వీటితో ఇళ్లన్నీ నిండిపోతున్నాయి.  వాడకపోయినా సంవత్సరాల తరబడి  అల్మారాలా పడేసి ఉంచేస్తారు.

 యంత్రాల వల్ల వస్తువుల తయారీ తేలికయ్యింది. విచ్చవిడిగా వస్తువులను ఉత్పత్తి చేసి వాడిపడేస్తున్నారు.

 ఎక్కడచూసినా చెత్తకుప్పలు ప్రోగులుపడుతున్నాయి. విపరీతమైన వస్తూత్పత్తి, వాడకం వల్ల సహజవనరులు వేగంగా తరిగిపోతాయి.

పరిమితమైన జనాభా  ..........

 జనాభా విపరీతంగా పెరగటం వల్ల  చాలా కష్టాలున్నాయి.  జనాభా బాగా పెరిగితే ఆహార సమస్యలు, నిరుద్యోగ సమస్యలూ పెరుగుతాయి.

మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అనే సామెత అందరికీ తెలిసిందే.   జనాభా ఎక్కువయ్యేకొద్దీ  సౌకర్యాలు  తగ్గిపోతాయి.

కొన్ని విదేశాల్లో భూమి విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండి జనాభా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ శుభ్రత కూడా బాగుంటుంది. 

 కొన్ని విదేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో భూమి విస్తీర్ణం తక్కువ... జనాభా ఎక్కువ . 

క్రిక్కిరిసిన జనాభా ఉండే  దేశాల్లో  శుభ్రత  విషయంలో కూడా అనేక సమస్యలు వస్తాయి. 

 భారతీయులు ఎన్నో దేశాలకు వలసవెళ్లి ఉంటున్నా కూడా ఇంకా దేశంలో జనాభా పెరిగిపోతోంది. 

పరిమితమైన కోరికలు, పరిమితమైన వస్తు వినియోగం...పరిమితమైన జనాభా..వల్ల ఎన్నో లాభాలున్నాయి. 

Monday, June 26, 2017

అందరికీ Ramazan (Ramadan) సందర్భంగా శుభాకాంక్షలండి.అందరికీ  Ramazan (Ramadan) సందర్భంగా శుభాకాంక్షలండి.

Friday, June 16, 2017

పిల్లలు ఏడవటానికి ఎన్నో కారణాలుంటాయి..


పసి పిల్లలు ఏడవటానికి ఎన్నో కారణాలుంటాయి.
**********


కడుపునొప్పి, ఆకలివేయటం..వంటి అనేకకారణాల వల్ల ఏడుస్తారు.


 కొన్నిసార్లు పిల్లలను చీమలు వంటివి కుట్టే అవకాశం ఉంది.


చీమ కుడుతున్నా మాటలు రాని పిల్లలు చెప్పలేరు కాబట్టి,  గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్లు గమనించుకోవాలి.
**************


చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు, ముఖము కడిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


పిల్లలకు స్నానం చేయించే ముందు పెద్దవాళ్లు పచ్చిమిరపకాయలు తరగటం, కారం వంటలు కలపటం ..వంటివి చేసి, వెంటనే పసిపిల్లలకు స్నానం చేయించితే .... పసిపిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి, మంట అనిపించే అవకాశం ఉంది. కళ్ళు కూడా మంట అనిపించే అవకాశం ఉంది.


 పిల్లలు తమ బాధ చెప్పలేరు కాబట్టి ఏడుస్తూ ఉంటారు.


మిరపకాయలు తరిగిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కున్నా కానీ,కొంతసేపు వరకూ  చేతులకు ఆ కారం ఉంటుంది.


 అందువల్ల పిల్లలకు స్నానం చేయించే ముందు పెద్దవాళ్లు మిరపకాయలు వంటివి కోయకూడదు.
 

Wednesday, June 14, 2017

పిల్లలు విలువైన వాళ్ళు కారా ?

ఈ రోజుల్లో  చాలామంది పెద్దవాళ్ళు ఉపాధి కొరకు బైటకు వెళ్ళటం వల చిన్నపిల్లలను వేరే వారి వద్ద ఉంచి వెళ్తున్నారు.

 బయటివాళ్ళు పిల్లలను జాగ్రత్తగా చూడనూవచ్చు లేక కొందరు సరిగ్గా చూడకపోనూ వచ్చు.

**************

 పిల్లలను బయటివారి వద్ద ఉంచి వెళ్ళటం గురించి ఈ మధ్య ఒక వీడియో గురించి విన్నాను.

అందులో విషయమేమిటంటే, ..అమ్మా! విలువైన నగలు బయట వారి వద్ద  ఉంచి వెళ్తారా ? అని అడిగితే..

 ఒక తల్లి ఏమంటుందంటే, విలువైన వాటిని  పని వారి వద్ద, బయటవారి వద్ద ఎలా ఉంచుతాము? అంటుందట.

  ..అయితే,  పిల్లలు విలువైన వాళ్ళు  కారా  అమ్మా? అంటారట.
ఈ వీడియోను నేను చూడలేదు. వీడియోలో విషయాల గురించి ఎవరో చెబుతుంటే విన్నాను. అందువల్ల డైలాగులు ఉన్నవి ఉన్నట్లు రాయలేకపోయాను.
వీడియో  తయారు చేసిన  వారికి ధన్యవాదాలు.

***************

వస్తువుల విషయంలోనే ఎంతో జాగ్రత్తగా ఉంటున్నప్పుడు.. పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కదా!

పెద్దవాళ్లు తమ కష్టాల గురించీ, హక్కుల గురించి గట్టిగా మాట్లాడగలరు.

పిల్లలు తమ కష్టాల గురించీ, హక్కుల గురించి  మాట్లాడలేరు కదా!


  పెద్దవాళ్ళ హక్కుల గురించి  మాట్లాడే పెద్దమనుషులు ..మరి , చిన్నపిల్లలు  కూడా బాధపడకుండా వారిని  దగ్గరుండి పెంచాలని తల్లితండ్రులకు కూడా చెప్పవచ్చు కదా!


***************
 ఈ రోజుల్లో చాలా దారుణాలు వింటున్నాము. అందర్నీ నమ్మి, చిన్నపిల్లలను వారి వద్ద ఉంచే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.


పిల్లలు బాధపడుతుంటే తరువాత ఎంత డబ్బు ఉన్నా ఫలితమేముంటుంది.


పిల్లలకు తల్లితండ్రి వద్ద పెరగాలని ఉంటుంది. అది పిల్లల హక్కు.
 
పిల్లలు ఎదిగే వయస్సులో చక్కటి పౌష్టికారాన్ని ఇస్తూ, అనారోగ్యం వస్తే దగ్గరుండి చూసుకుంటూ, ఏది తప్పో, ఏది ఒప్పో చెపుతూ  పిల్లలను చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యంతో పెంచటం పెద్దవారి  బాధ్యత. కెరీర్ మరియు డబ్బు సంపాదనే ముఖ్యం కాదు.

Monday, June 12, 2017

మాకు తెలిసిన ఒక అమ్మాయి చదువు కోసం...

మాకు తెలిసిన ఒక అమ్మాయి చదువు కోసం వేరే ఊళ్ళో సీట్ రావటం వల్ల తల్లితండ్రికి దూరంగా హాస్టల్లో ఉంటోంది. 

ఆ అమ్మాయికి కొంతకాలం క్రిందట బాగా జ్వరం వచ్చి కొన్నాళ్ళు నీరసంగా ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని మందులు వేసుకుంటే జ్వరం తగ్గింది .

అయితే , అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు కదా! 

ఇంట్లో అయితే, పిల్లలకు అనారోగ్యం వస్తే పెద్దవాళ్లు వారికి పధ్యం ఆహారం వండి,  జాగ్రత్తగా చూసుకుంటారు. 

హాస్టల్స్లో అయితే , వందల మంది పిల్లలు ఉంటారు.  ఒక్కొక్కరికి అవసరమైన విధంగా ఆహారం కొన్నిసార్లు  లభించకపోవచ్చు. 

అనారోగ్యంగా ఉన్నప్పుడు ,అక్కడి  భోజనం తినలేక ఆ అమ్మాయి  ఒక రైస్ కుక్కర్ కొనుక్కుని,  హాస్టల్ రూంలో తనే ఆన్నం కూర వండుకునేదట. 

బజారుకు వెళ్ళి పండ్లు కొని తెచ్చుకుని తింటుందట.

 తల్లితండ్రి ఒకటి, రెండుసార్లు వచ్చి చూసి వెళ్ళారనుకుంటా.

కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి వచ్చిందట. ఎక్కువ రోజులు ఇంటి వద్ద ఉంటే క్లాసులు పోతాయని వచ్చేసింది.  

ఈ మధ్య మళ్ళీ అప్పుడప్పుడు జ్వరం వస్తుందట.  ఆ అమ్మాయి తల్లితండ్రి ఏమంటున్నారంటే, వాతావరణంలో మార్పు వల్ల అలా జరుగుతుంది తగ్గిపోతుందిలే అంటున్నారట.

 ప్రస్తుతం జ్వరం తగ్గిందట.

 నాకు తెలిసినంతలో హాస్టల్లో కొందరు పిల్లలు అక్కడి ఆహారం నచ్చకపోతే బయటకు వెళ్ళి తినటం లేక నూడుల్స్ వండుకోవటం లేక పస్తు ఉండటం చేస్తుంటారు. 

అనారోగ్యంతో ఉన్నప్పుడు  తనే వండుకుని క్లాసులకు వెళ్తూ చదువుకోవటం ఎంతో కష్టం.  ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లల చదువులు,వారి కష్టాలు. 

ఇక ర్యాగింగ్ వంటివి ఉంటే అవన్నీ మరిన్ని కష్టాలు. 

ఏం చదువులో? ఏమిటో ? ఈ రోజుల్లో జీవితాలు చాలా టెన్షన్ గా ఉంటున్నాయి.

టీనేజ్ పిల్లల విషయాల సంగతి అలా ఉంచితే, తల్లితండ్రి ఉద్యోగానికి వెళ్తూ వేరే వారి  వద్ద ఉండే పసిపిల్లల విషయాలు మరెన్నో ఉంటాయి. 


Friday, June 9, 2017

పిల్లల జీవితాల్లో టెన్షన్ ....


 ఈ రోజుల్లో చాలామంది పిల్లల జీవితాల్లో టెన్షన్  బాగా పెరిగింది.

 డబ్బు ఉన్న వారి పిల్లలు కూడా చదువులు, ఉద్యోగాల వల్ల బయట ఉండటం వల్ల సరైన పౌష్టికాహారాన్ని తినటం లేదు.

ఇంట్లో అయితే పెద్దవాళ్ళు బ్రతిమాలో, కోప్పడో పౌష్టికహారాన్ని తినేలా చేస్తారు.

( అయితే, ఈ రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా,  కొందరు పెద్దవాళ్ళు బిజీగా ఉండటం వల్ల గబగబా ఏదో ఒకటి వండేసి  పెట్టేస్తున్నారు. పిల్లలు  సరిగ్గా తింటున్నారో లేదో పట్టించుకునే సమయం  పెద్దవాళ్ళకు లేదు.)
..............


  ఒక సంఘటన గురించి రాస్తాను.
మాకు తెలిసిన వారి పిల్లవాడు  హాస్టల్లో ఉండి చదువుకునే వాడు.

 ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించారట. టెస్ట్  చేస్తే  కాన్సర్ జబ్బు చివరి స్టేజ్ లో ఉందని తెలిసిందట. కొద్దిరోజులు వైద్యం చేసినా అబ్బాయి దక్కలేదు.

ఈ విషయం విన్నాక బాధ మరియు ఆశ్చర్యం అనిపించింది. కాన్సర్ ముదిరే వరకూ ఏమీ లక్షణాలు తెలియకపోవటమేమిటి? అనిపించింది.

 నాకు ఏమనిపించిందంటే, ఆ పిల్లవాడికి అంతకు ముందు కూడా (హాస్టల్లో ఉన్నప్పుడు) అప్పుడప్పుడు జ్వరం వచ్చేదేమో? 

జ్వరం ఎందుకు వస్తుందో? అనారోగ్యం వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ..వంటి విషయాల గురించి  పిల్లలకు ఏం తెలుస్తుంది ?

ఏదో ఒక జ్వరం టాబ్లెట్ వేసుకుని గడిపేసి ఉంటాడు. క్రమంగా ఆరోగ్యం  క్షీణించి ఉంటుంది.
..................

 ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు చదువుల ఒత్తిడితోనూ, పెద్దవాళ్ళకు  పని వత్తిడితోనూ జీవితాలు గడిచిపోతున్నాయి.

ప్రపంచంలో బాగా పెరిగిన కాలుష్యం, రేడియేషన్ వల్ల కూడా అనారోగ్యాలు ఎక్కువవుతున్నాయి.

చదువు, కెరీర్, డబ్బు సంపాదనలో మునిగి జీవితాల్నే కోల్పోతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. 

 ఇవన్నీ గమనిస్తే , జీవితాలు బాగుపడాలంటే తాపత్రయాలు తగ్గించుకోవాలని  అనిపిస్తోంది.


Wednesday, June 7, 2017

చాలామంది మనుషుల మనస్సుల కల్తీ పెరిగిన ఈ రోజుల్లో ..


ఈ రోజుల్లో కల్తీల సమస్య ఎక్కువగా ఉంది.


చాలామంది మనుషుల మనస్సులలోనే స్వచ్చత తగ్గి, మనస్సుల కల్తీ పెరిగిన ఈ రోజుల్లో పరిస్థితి ఇలా కాక ఇంకెలా ఉంటుంది ? 

  చాలామంది లో డబ్బు యావ బాగా పెరిగింది. ఇలాంటి ప్రపంచంలో  ఇతరులను దోచుకోవటం, అన్యాయం, అధర్మం, మోసం, కల్తీలు వంటివి పెరుగుతాయి. 


  మనుషుల స్వభావాలు మంచిగా మారనంత కాలం సమాజంలో కల్తీలు, అవినీతి, అక్రమాలు, లంచాలు, నేరాలు, ఘోరాలు ..వంటివి జరుగుతూనే ఉంటాయి.ఈ రోజుల్లో కుటుంబవ్యవస్థ, చదువు, ఉద్యోగాలు, సంస్కృతి.... ఎన్నో మార్పులు చెందాయి.


 చదువులు, ఉద్యోగాలు...వంటి కారణాల వల్ల ..పిల్లలు, పెద్దవాళ్ళు  ఎవరికి వారు విడిగా ఉండవలసి రావటం  జరుగుతోంది.బయట వండినవి తినవలసి వస్తోంది. ఏది కల్తీనో ఏది కాదో తెలుసుకోవటం కష్టంగా ఉంది.


చెడ్దపనులు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. అయితే,సమాజంలో మంచి మార్పు రావాలంటే మనుషులు నైతిక విలువలను పాటించాలి.


చాలామంది పెద్దవాళ్ళు కెరీర్ మరియు డబ్బు సంపాదనే ముఖ్యంగా భావిస్తున్నారు.  తమ పిల్లలు కూడా బాగా చదివి, బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు .


పెద్దవాళ్ళు కెరీర్, డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా పిల్లలను ఆదర్శంగా పెంచి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.


 నైతిక విలువలు కలిగిన వాళ్ళు కల్తీలు చేయరు. ఇంకొకరి సొమ్ముకు ఆశపడరు. ఇతరులను పీడించరు. ప్రపంచంలో ఉన్నవన్నీ తమకే చెందాలని అత్యాశ  చెందరు.ఇలాంటి మనుషులున్న ప్రపంచం చక్కగా ఉంటుంది.
 
అభివృద్ధి అంటే నైతికవిలువలున్న మనుషులు సంఖ్య పెరగటం. అంతేకానీ, నైతిక విలువలను పాటించటం తగ్గి..సౌకర్యాలు పెరగటం అభివృద్ధి కాదు. 

Saturday, June 3, 2017

కొన్ని విషయాలు ..


ఈ మధ్య మేము యాత్రకు వెళ్ళివచ్చాము.

 యాత్ర చక్కగా జరిగినందుకు దైవానికి కృతజ్ఞతలు మరియు వందనములు.