koodali

Monday, June 26, 2017

దైవము దయామయులు.



చిన్నపిల్లలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చక్కగా ఆటలు ఆడతారు. పెద్దపిల్లలు గెలుపు ఓటమి పోటీలు పెట్టుకుని ఆటలు ఆడతారు. సహజంగా గెలిచినవారికి సంతోషం, ఓడినవారికి బాధ ఉంటుంది. ఆటలలో దెబ్బలు తగలవచ్చు. అయినా ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. అలాగే ప్రపంచంలో కష్టాలు, బాధలు అనేవి ఉండటాన్ని కొందరు కోరుకుంటారేమో? స్వర్గములా..అంతా సుఖమే ఉండేటట్లు దైవం సృష్టించగలరు.
 
 
 జీవితం అంతా కూర్చుని తినటం కాకుండా, కొద్దిగా కష్టపడి తెచ్చుకోవటంలో ఒక సంతోషం ఉండవచ్చు. అందుకే సృష్టిలో సుఖము, కష్టము రెండు ఉన్నాయేమో? అయితే, ఏ జీవికైనా తట్టుకోగలిగినంత కష్టం ఉంటే ఫరవాలేదు కానీ, తట్టుకోలేనంత కష్టం ఉండకూడదనిపిస్తుంది. జీవులు చేసే కర్మలను బట్టి ఫలితాలుంటాయి. ఏది..ఎందుకు..ఎలా జరుగుతుందో? దైవానికే తెలుస్తుంది.
 


దైవము దయామయులు.  దైవము.. ప్రపంచంలో క్రూరజంతువులను ఎందుకు సృష్టించారని చాలామందికి సందేహంగా ఉంటుంది.  దైవసృష్టి పద్ధతిగా ఉంటుంది. ఉదా..గాలిలో ఎగరటానికి అనువుగా పక్షులకు రెక్కలను సృష్టించారు. నీటిలో ఈదటానికి అనువుగా జలచరాల శరీరాలను సృష్టించారు. 
 
 
 
మనుషుల ప్రమేయం లేకుండానే శ్వాసప్రక్రియ జరుగుతుంది. ఆహారం జీర్ణమవుతుంది. ఇలా ఎంతో పద్ధతిగా సృష్టించిన దైవం .. సాటిజీవులను ఆహారంగా తీసుకునేవిధంగా క్రూరజంతువులను సృష్టించటం అనేది ఎందుకో?  కారణాలు మనకు తెలియవు.


పర్యావరణ సమతుల్యత వల్ల అలా సృష్టి జరిగిందని కొందరు అంటారుకానీ, దైవం తలచుకుంటే, పశుపక్ష్యాదుల సంఖ్య ఎక్కువగా  పెరగకుండా, వాటికి తక్కువ సంతానం ఉండేలా, అన్ని పశుపక్షాదులు శాకాహారమే తినేటట్లు కూడా సృష్టించగలరు. ఇంకా ఎలాగైనా సృష్టించగలరు. 
 
 
స్వర్గం వంటి లోకాలలో భూమిమీదలా సృష్టి ఉండదు. అక్కడ రోగాలు..వంటివి ఉండవని, చాలా బాగుంటుందని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. సృష్టిలో ఏది ఎందుకు జరుగుతుందో దైవానికే తెలుస్తుంది. సామాన్య మనుషులకే ఎంతో దయ ఉన్నప్పుడు, దైవానికి మరెంతో దయ ఉంటుంది.  దైవము దయామయులు. 
 

No comments:

Post a Comment