koodali

Friday, March 27, 2015

ఓం... శ్రీ రామనవమి..

రేపు శ్రీరామ నవమి సందర్భంగా..


శ్రీరామరామరామేతి  రమేరామే  మనోరమే
సహస్రనామ తత్ తుల్యం రామనామ  వరాననే .
...........................


సీతారాముల వార్లకు అనేక నమస్కారములు.
ఊర్మిళాలక్ష్మణుల వార్లకు అనేక నమస్కారములు.
..........................

 శ్రీ  సీతారామ  స్తోత్రము.


అయోధ్యాపుర నేతారం మిధిలాపుర నాయికాం
రాఘవాణా మలంకారం వై దేహానా  మలంక్రియాం      1

రఘూణాం  కులదీపం చ నిమీనాం  కులదీపికాం
సూర్యవంశసముద్భూతం  సోమవంశసముద్భవాం    2

పుత్రందశరధస్యాపి  పుత్రీంజనకభూపతేః
వశిష్టానుమతాచారం శతానంద మతానుగాం            3

కౌసల్య గర్భసంభూతం  వేదగర్భోదితాం స్వయం
పుండరీక  విశాలాక్షం  స్ఫురది  దీవరేక్షణాం              4

మత్తమాతంగ గమనం మత్తసారసగామినీం
చందనార్ద్రభుజామధ్యం కుంకుమాంక భుజాంతరాం    5

చాపాలంకృత హస్తాబ్జాం పద్మాలంకృత పాణికాం
సర్వలోక విధాతారం సర్వలోక విధాయినీం                6

లోకాభిరామం శ్రీరామ మభిరామాం చ మైధిలీం
దివ్యసింహాసనారూఢం  దివ్యస్రగ్వస్త్ర భూషణాం           7

అనుక్షణం కటాక్షాభ్యాం  అన్యోన్యేక్షణ కాంక్షిణౌ
అన్యోన్య సదృశావేతౌ  త్రైలోక్య  గృహాదంపతీం             8

ఇమౌ యువాం  ప్రణమామ్యహం భజామ్యతికృతార్ధ తాం
అనయాస్తౌతియ స్తుత్యా రామం సీతాం చ భక్తితః          9

తస్యతౌ తను తాం  ప్రీతౌ సంపద స్సకలా  అపి
ఇతీదం రామచంద్రస్య జానక్యాశ్చ విశేషితః                 10

కృతం  హనుమతాం  పుణ్యం  స్తోత్రం  సద్యోవిముక్తిదం
యః పఠేత్ప్రాతరుత్ధాయ సర్వాన్ కామానవాప్నుయాత్ 11

య ఇదం పఠతిస్తోత్రమ్  మైధిలీ  రామచంద్రయోః
శ్రీ వైకుంఠమవాప్నోతి న నరో హతకిల్బిషః                  12

 ఇతి  శ్రీమత్  హనుమద్విరచితం  సీతారామస్తోత్రమ్
 ఫలం : శ్రీ సీతారామాంజనేయుల సంరక్షణ.
 ......................

ఆంజనేయ  స్తుతి.


ఆంజనేయ  మతిపాటలాననం
కాంచనాద్రి  కమనీయ విగ్రహమ్
పారిజాత  తరుమూలవాసినం
భావయామి  పవమాననందనమ్ .

మనోజవం  మారుతతుల్య  వేగం
జితేంద్రియం  బుద్ధిమతాం వరిష్ఠమ్
 వాతాత్మజం  వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.

సువర్చలాదేవి ఆంజనేయస్వామి వార్లకు  అనేక నమస్కారములు.
.............................................

* పైన  వ్రాసిన విషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు ఉన్నచో,  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Saturday, March 21, 2015

ఓం...

ఓం
  శ్రీ మన్మధ నామ సంవత్సరము సందర్భముగా........  
 అందరికి ఉగాది శుభాకాంక్షలండి.

వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి.


Wednesday, March 18, 2015

తెలివితేటలు...

ఈ  రోజుల్లో  డిజైనర్ బేబీస్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

డిజైనర్ బేబీస్ ప్రక్రియ  ద్వారా జన్మించిన సంతానానికి పెద్దవాళ్ల తేలివితేటలు పూర్తిగా వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు .   


 ఉదా..ఒకే తల్లితండ్రికి జన్మించిన పిల్లలలో కూడా..  తెలివిగలవాళ్ళు, అంతగా తెలివిని కనబరచని వారూ కూడా ఉంటారు.

.......................... 

తెలివితేటలు పెరగటానికి, తగ్గటానికి , కొన్ని సమయాలలో అటూఇటూ కావటానికి..అనేక  కారణాలుంటాయి.

...................... 

 అమ్మవారి దయవల్ల కాళిదాసు గొప్ప  పండితుడయ్యాడంటారు. 

ఇలాంటి సంఘటనలలో వారసత్వ ప్రతిభ అవసరం లేదు.  

మూలికల  ద్వారా తెలివితేటలను   పెంచుకోవచ్చని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది. ఉదా..బ్రాహ్మి..

............................. 

 కేవ్యక్తి అన్ని  విషయాలలోనూ తెలివిగా ప్రవర్తిస్తారనీ చెప్పలేము. 


ఉదా..ఒక గొప్ప శాస్త్రవేత్త  తాను పెంచుకునే పెంపుడు పిల్లులు ( చిన్నది, పెద్దది) తన గదిలోకి వచ్చిపోవటానికి వీలుగా..  తలుపుకు ఒక పెద్దరంధ్రం, ఒక చిన్న రంధ్రము  ఏర్పాటు  చేసాడట. 


చిన్నపిల్లి కూడా పెద్ద పిల్లి వెళ్లే రంధ్రం నుంచీ దూరగలదని...  రెండు రంధ్రాలు అవసరం లేదని ఆ గొప్ప  శాస్త్రవేత్తకు తట్టలేదు మరి. 

................

 దైవప్రార్ధన చేయటం , ధర్మబద్ధంగా జీవించటం  ..వలన  తెలివితేటలు  పెరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం.


ఎంత తెలివిగలవాళ్ళయినా ..  పాపపు పనులు చేయటం  అధర్మమార్గంలో   జీవించటం వలన తెలివి నశించి పొరబాట్లు  చేసే  అవకాశం  ఉందని నా అభిప్రాయం. 

...................................

ఇది ఊహించి చెప్పటం కాదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను.


 నేను ఎప్పుడైనా  ఇతరులను నిష్కారణంగా  బాధపెట్టటం  వంటివి చేసినప్పుడు,  కొన్ని పొరపాట్లు చేయటం జరిగింది.

...................

 తెలివితేటలకు స్త్రీలు, పురుషులు..అనే తేడా ఏమీలేదు. 


కొందరు స్త్రిలు తెలివిగా ప్రవర్తిస్తే .. ఇక , స్త్రీలందరూ తెలివిగలవాళ్ళే అనుకోనవసరం లేదు. 


అలాగే కొందరు పురుషులు తెలివిగా ప్రవర్తిస్తే ..ఇక , పురుషులందరూ తెలివిగలవాళ్లే అనుకోనవసరం లేదు.


 స్త్రీలైనా, పురుషులైనా   తెలివితేటలు పెరగాలంటే  ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

...............

అంతా దైవం దయ.


Monday, March 16, 2015

సహజవనరులను విచక్షణతో....

కొన్ని సంవత్సరాల క్రిందట , కేజీ బేసిన్లో  పెట్రోల్, సహజవాయువు  వంటి  ఇంధన వనరులు  ఉన్నాయని తెలిసినప్పుడు....  

 ఇక,  తమ ప్రాంతాలు అభివృద్ధి లో ఎక్కడికో వెళ్లి పోతాయని  అక్కడి వాళ్లు కలలు కన్నారు .. అయితే,  ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది . 


 కొన్ని చోట్ల  పొలాల్లో నుంచి  గ్యాస్  పైపులైన్లు వేయటం  వంటి .. ఎన్నో సమస్యలు ఉన్నాయి . 


ఇంధనం విషయంలో చూస్తే ,  స్థానిక అవసరాల కోసం   కొంత ఇంధనాన్ని వినియోగించినా , ఎక్కువ భాగం ఇతరప్రాంతాలకు ( అంటే ఇతర రాష్ట్రాలకు..  ) తరలిపోతోంది.


ఇంధనం  వెలికితీత  ప్రక్రియలో  వచ్చే దుమ్ము,  ధూళి..వగైరా  కాలుష్యం  మాత్రం  స్థానికులకు  మిగులుతోంది.


 మరికొన్ని సమస్యలూ వచ్చాయి.  ఉదా..ఆ మధ్య జరిగిన ఒక గ్యాస్ పైపు లైన్ ప్రమాదంలో కొందరు  చనిపోవటం ఎంతో బాధాకరమైన విషయం. 


ఇలాంటి పరిస్థితిలో ..  ఎప్పుడు , ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలకు భయంగానే ఉంటుంది. 
........................... 

ఇంధనం  వెలికితీత  ప్రక్రియ వల్ల  కలిగే  కాలుష్యం  స్థానికులకు ఎంతో  సమస్యగా  ఉంటుంది


ఇదిలా ఉంటే,  కృష్ణా - గోదావరి ప్రాంతంలో అపారమైన బొగ్గు..నిక్షేపాలున్నాయని ఎవరో కనిపెట్టారట.   ఇక ముందుముందు ఏం జరుగుతుందో ?

.....................

 విచ్చలవిడి వాడకాల  వల్ల  పెట్రోల్, సహజవాయువు వంటి ఇంధన వసరులు  త్వరగా తరిగిపోతున్నాయంటున్నారు.


 ఇంధన అవసరాల కోసం సోలార్ ఎనర్జీ వంటి వాటిని వాడితే మంచిది. సూర్యరశ్మి తక్కువగా ఉండే దేశాల వాళ్ళు కూడా సోలార్ ఎనర్జీని వాడటానికి ప్రయత్నిస్తుంటే , సూర్యరశ్మి ఎక్కువగా లభించే మనదేశంలో .. ధర్మల్ , అణు విద్యుత్...వంటి వాటికోసం తాపత్రయపడటమేమిటో అర్ధం కాదు.

...................

సోలార్ ఎనర్జీ దండిగా లభించినా కూడా కొంత లిమిట్ పాటించాలి. 


విద్యుత్ బాగా లభిస్తుందని కదా ! అని అదేపనిగా వస్తువులను తయారుచేసి పడేస్తే ఖనిజ వనరులు త్వరగా తరిగిపోతాయి.


 విచ్చలవిడి పారిశ్రామీకరణ వల్ల  వాతావరణంలో కాలుష్యమూ ఎక్కువవుతుంది.

..............

సహజవనరులను విచక్షణతో,   అవసరమైనంతవరకే  పొదుపుగా, ఒక పద్ధతిగా  వినియోగించుకోవాలి.

.....................

పేదరికం తగ్గి ఆర్ధికాభివృద్ధి జరగాలంటే సహజవనరులను విచ్చవిడిగా తవ్వేసి వాడుకోవటం  మార్గం కాదు. 


 సమాజంలో సంపద కొంతమంది వద్దే పోగుపడి ఉంది.  నల్లడబ్బు , అవినీతి వంటి వాటిని నిర్మూలిస్తే , ఆర్ధిక అసమానతలు  తగ్గి ..  పేదరికం గణనీయంగా తగ్గుతుంది.  

...........................

ప్రకృతి పర్యావరణ రక్షణ అంటే చాలామంది తేలిగ్గా భావిస్తారు. అదొక సమస్య కాదంటారు. 

 ఆధునిక అవసరాల కోసం  సహజవనరులను విపరీతంగా వాడుతుంటారు. తద్వారా కాలుష్యం పెరిగి గ్లోబల్ వార్మింగ్  పెంచేస్తారు. 

 ఇప్పుడు చూస్తున్నాము కదా ! అతివృష్టి లేకపోతే అనావృష్టి. 

సరిగ్గా వర్షాలు పడి చాలాకాలమైంది.   పంటలు  ఎండిపోతున్నాయి. 

విదేశాల్లో కూడా ప్రకృతి  సమతుల్యత కోల్పోయి విపరీతమైన మంచు తుఫాన్లు వస్తున్నాయి.


  ప్రకృతిని నిర్లక్షం చేస్తే మానవమనుగడకే  ప్రమాదమని గ్రహిస్తే మంచిది. 

Wednesday, March 4, 2015

హోలీ సందర్భంగా సహజసిద్ధమైన రంగులు వాడితే మంచిది..ఒక సంఘటన..

పాతకాలంలో హోలీ రంగులను సహజసిద్ధమైన పదార్ధాలతో తయారుచేసేవారట. ఉదా..మోదుగ పూలు,కరక్కాయ, పసుపు..వంటి వాటితో చేసేవారు. 

 ఈ రోజుల్లో హోలీ రంగులలో కెమికల్స్ కలుస్తున్నాయనీ, ఆ రంగులు పిల్లల కళ్లలో పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ వైద్యులు అంటున్నారు.  


అంతేకాక కొన్ని రంగులు ఎంత శుభ్రం చేసినా త్వరగా వదలవు. శుభ్రం చేయటానికి కిరోసిన్ వంటివీ వాడుతుంటారు..వీటితో రుద్దటం వలన చిన్నపిల్లల చర్మం కమిలి రంగు మారే ప్రమాదమూ ఉంది. 

...............

హోలీ అందరూ ఆడుతుంటే పిల్లలకూ వెళ్ళాలని సరదా ఉంటుంది. అలాంటప్పుడు వారిని వారించి ఇంట్లో కూర్చోపెడితే ఉసూరుమంటారు.


 అలా కాకుండా సహజసిద్ధమైన రంగులు తెప్పించి ఇస్తే వారికీ ఆనందంగా ఉంటుంది.

..............

మా పిల్లల చిన్నతనంలో మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అందరూ హోలీ ఆడేవారు. అందరితో పాటూ మా పిల్లలు కూడా ఆడారు. 


ముందే వంటికి కొబ్బరినూనె వ్రాసుకుంటే తరువాత రంగులు శుభ్రం చేయటం తేలిక.. అని ప్రక్కవాళ్ళు చెబితే అలాగే వ్రాసి పిల్లలను పంపించాను. అయినా రంగులు ఒక పట్టాన వదలలేదు. గట్టిగా రుద్దితే రెండురోజులకు తగ్గాయి. 


ఇకమీదట , పిల్లలకు  కెమికల్  రంగులు పూయకుండా   జాగ్రత్రగా ఉండాలనుకున్నాను.

.................

 మరుసటి సంవత్సరం...  మా అపార్ట్మెంట్ వాళ్ళు రంగులు చేత్తో పట్టుకుని ప్రతి ఇంటికి వచ్చారు . మా ఇంటికి వచ్చి నాకు రంగులు పూసారు. 


పిల్లలకు  పూయబోతుంటే.. చిన్నపిల్లలు కదా ! ఎక్కువగా రంగులు వద్దండి,  చర్మం  కమిలిపోతుందని వారించాను.


నా మాట వినిపించుకోకుండా పిల్లలకు కూడా పూస్తామని  చేతుల నిండా రంగు పట్టుకుని వస్తుంటే, నేను గట్టిగా వద్దన్నాను. కొందరు సరే , అని ఊరుకున్నారు. 


 వెళ్తూ..వాళ్ళలో ఒకరిద్దరు  ఏమన్నారంటే..


 ఈమె  పిల్లలే  సుకుమారమా?... మనవి  దున్నపోతు చర్మాలా ? మనం రంగులు పూసుకోవటం లేదా ?.. అంటూ రఫ్ గా మాట్లాడారు. నాకు చాలా బాధ కలిగింది.


నేను,  మా పిల్లలకు చిన్నతనంలో  నలుగుపెట్టి స్నానం చేయించేదాన్ని.


అలాంటప్పుడు కెమికల్ రంగుల వల్ల చర్మానికి హాని కలుగుతుందని భయంతో అలా అన్నాను.  అందులో తప్పేమిటి ?

................

 అయితే, అందరూ సరదాగా ఆడుకుంటుంటే పిల్లలను ఆటలకు దూరం చేయకూడదు. సహజసిద్ధమైన రంగులను కొని ఇరుగుపొరుగు పిల్లలను కూడా పిలిచి ఆడిస్తే బాగుంటుంది.


 హోలీ రంగుల విషయంలో అలా అన్నాను కానీ, ఇరుగుపొరుగు పిల్లలు మా పిల్లలు కలిసి చాలాసేపు ఆడుకునేవారు. 


పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలూ అంతే ముఖ్యమని నా అభిప్రాయం. 


Monday, March 2, 2015

ఆధునిక కాలం కన్నా ఆటవిక కాలం నయమేమో.. అనిపిస్తోంది.

ఈ రోజుల్లో , చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరుగుతున్న కొన్ని వార్తలను వింటున్నాము.

 5 సంవత్సరాల పాప పట్ల 50 సంవత్సరాల పక్కింటి వ్యక్తి అసభ్య ప్రవర్తన, పాఠశాలలో చిన్నపాప పట్ల అసభ్య ప్రవర్తన..వంటి వార్తలు వింటుంటే, ఆధునిక కాలం కన్నా ఆటవిక కాలం  నయమేమో.. అనిపిస్తోంది.

.......................... 

ఆర్ధిక అవసరాలు అంటూ, కంటిపాపలా పెంచుకోవలసిన పిల్లల్ని పరాయి వాళ్ళ దగ్గర వదిలి  పనికి వెళ్తున్నారు  కొందరు పెద్దవాళ్ళు.  

.......................
ఉత్తరభారత దేశంలోని ఒక సెలెబ్రెటి కుమార్తె  తాను చిన్నతనం నుండి లైంగిక వేధింపులకు గురయినట్లు తెలియజేసింది. వాళ్ళు తమ కుటుంబస్నేహితులని..  అయితే, ఈ విషయం తన పేరెంట్స్ కు తెలియదని చెప్పి ఆవేదన చెందింది.
.....................

ఎప్పుడయినా  పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి . ఇక, తల్లులు రాత్రి సమయంలో కూడా ఉద్యోగాలకు వెళ్తే, ఆడపిల్లలను బంధువుల దగ్గరో, ఇరుగుపొరుగు వారి దగ్గరో, పనివారి వద్దో వదిలి వెళ్తే ఎంతవరకూ రక్షణ ఉంటుందో ఎవరు చెప్పగలరు ? 


మద్యం మత్తు కావచ్చు, అసభ్య చిత్రాల వీక్షణం కలిగించిన చిత్తచాంచల్యం కావచ్చు లేక మరి ఏదైనా కారణం  
కావచ్చు... ఎవరు, ఎప్పుడు, ఎలా.. ప్రవర్తిస్తారో ? ఎవరికి తెలుసు ?


తమకు  ఆపద వస్తే చిన్నపిల్లలు  ఏం చేయగలరు? ఎవరికి చెప్పుకోగలరు ?

.................... 

 మాటలు కూడా రాని చిన్నపిల్లలు తమ బాధను చెప్పుకోలేరు.. ఉదా. వీపుపై చీమ కుడుతుంటే గుక్కపట్టి ఏడవటం తప్ప మాటలు రాని పిల్లలు ఏం చెప్పగలరు ? 


 పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తల్లే తెలుసుకోవలసి ఉంటుంది. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో  కొన్నిసార్లు తల్లికి కూడా అర్ధం కాదు.


చిన్నపిల్లల పెంపకం అంటే సులువుకాదు. కొన్నిసార్లు తల్లికి కూడా విసుగొచ్చే అవకాశం ఉంది. ఇక బయట వాళ్ళు ఓపికగా ఎంతవరకూ చూడగలరో ?


చంటిపిల్లలను కొందరు ఆయాలు హింసిస్తున్న వీడియోలను చూస్తే గుండె జలదరిస్తుంది.CCTV: CRUEL Caretaker beaten up to 11- Months old boy ...


......................... 


 హాస్టల్స్లో పిల్లలకు వారి కష్టాలు వారికుంటాయి. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్లు,  కొందరు  జూనియర్లను  లైంగికంగా వేధించిన  సంఘటనలూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళూ ఉన్నారు.


హాస్టల్స్లో ర్యాగింగ్ గురించిన వ్రాసిన టపా  లింక్ ఇక్కడ నొక్కి చదవవచ్చు.   హాస్టల్లో ర్యాగింగ్ ..