koodali

Wednesday, January 28, 2015

షిర్డి సాయి మహిమలు ఎన్నో...

ఓం,

దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంలోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)

 షిర్డి సాయి లీలలు  ఎన్నో  నా  జీవితంలో  అనుభవానికొచ్చాయి. మమ్మల్ని  ఎన్నో సార్లు  కష్టాల  నుండి  కాపాడారు.

శ్రీపాద శ్రీవల్లభస్వామి సంపూర్ణ చరితామృతము… గ్రంధములో షిర్డి సాయి గురించిన ఎన్నో వివరములు ఉన్నాయి. ఆ వివరాలు చదివితే షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

9 వ  అధ్యాయము,  మరియు  45  వ  అధ్యాయములో  ఈ  వివరములు  ఉన్నవి .  

 ఈ విషయాలను  తెలుసుకుంటే  షిర్డిసాయిని  గురించి  అనేక  సందేహాలకు  సమాధానాలు  లభిస్తాయి.

 అంతా  దైవం  దయ.


Monday, January 26, 2015

ఓం.. సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ...


దైవాన్నిచూపించండి .. అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు.

సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.


శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.
ఈ  లింక్ వద్ద..  

Friday, January 23, 2015

బస్సు లో నుంచి ప్రయాణీకులు జారి రోడ్ పైన పడకుండా కొన్ని జాగ్రత్తలు..

  బస్ ప్రయాణం సురక్షితం అనుకుంటారు కానీ, జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 

ఉదా.. బస్సు వెళ్తుంటే  రోడ్ కు  అడ్డంగా ఎవరైనా మనుషులు గానీ పశువులు గానీ  పరిగెత్తినప్పుడు  డ్రైవర్ సడన్ బ్రేక్ వేయవలసి వస్తుంది. 


సడన్ బ్రేక్  వేసినప్పుడు  బస్సులోని ప్రయాణికులు  ముందుకు తూలి పడే ప్రమాదముంది.


బస్సు వెళ్తున్నప్పుడు  టర్నింగ్స్ లో  కుదుపులు వస్తే  కూడా  ప్రయాణీకులు  అదుపు తప్పి క్రింద పడే అవకాశం ఉంది.


ముందు సీటుకు దగ్గరగా డోర్ ఉంటుంది. సడన్ బ్రేక్ వేసినప్పుడు  ముందు సీట్లో కూర్చున్నవాళ్ళు  సీట్ నుంచి క్రింద పడి తలుపు నుంచి  జారి  రోడ్ పైన పడే ప్రమాదముంది.  

లేక ,
వెనుక సీటుకు దగ్గరగా ఇంకో డోర్ ఉంటుంది.  కుదుపులు వచ్చినప్పుడు వెనుక సీట్లో కూర్చున్నవాళ్ళు  సీట్ నుంచి  జారి  తలుపు నుంచి జారి  క్రింద పడే  అవకాశం ఉంది.

 ప్రయాణీకులు పడిపోకుండా వెనుక సీట్ మరియు  ముందు సీట్ల ముందు  సేఫ్టీ రాడ్లు అమర్చాలి. 


బస్సు దిగే స్టాప్ వచ్చినప్పుడు ప్రయాణీకులు దిగటానికి  బస్ డోర్ వద్ద  నిలుచుంటారు.   ఇలాంటప్పుడు  కూడా  ప్రయాణీకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


బస్సు తలుపుకు దగ్గరగా  నిల్చోకూడదు. కొంచెం దూరంగా నిల్చోవాలి. నిల్చున్నప్పుడు సేఫ్టీరాడ్  పట్టుకోవాలి. 

..................

 ఇంకో ముఖ్యమైన విషయం  ఏమిటంటే, బస్సులలో ఎడమవైపు  మొదటి  సీట్  వికలాంగులకు  కేటాయిస్తారు. 


 అయితే ఎడమవైపు సీట్ , బస్ తలుపుకు  దగ్గరగా  ఉంటుంది.  కుదుపు  వస్తే  పట్టుకోవటానికి   ముందు  సీట్ లో కూర్చున్న వారికి  ఎలాంటి సదుపాయమూ  ఉండదు . 


 బస్సు  కుదుపు  వచ్చినప్పుడు  వికలాంగులు  పట్టుతప్పి  ముందుకు  పడే  ప్రమాదం  ఉంది.


 అందుకని  వికలాంగులకు బస్సుకు  కుడిప్రక్కన, అంటే  బస్ తలుపుకు దూరంగా , డ్రైవరుకు వెనక  ఉండే  సీటును కేటాయిస్తే  సురక్షితంగా ఉంటుంది. 


 ఒకసారి  బస్సు  కుదుపుకు  వికలాంగుల  సీట్లో  కూర్చున్న వ్యక్తి  క్రింద పడటం జరిగింది. అతను  బస్సు  తలుపు  నుండి  క్రిందకు  పడే  ప్రమాదం  కొద్దిలో  తప్పింది.  


ఎడమవైపున  ఉండే మొదటి  సీటు  కండక్టరుకు  కేటాయించి, సీటుకు ముందు  సేఫ్టీ  రాడ్  ఏర్పాటు  చేస్తే  కండక్టర్ కు సురక్షితంగా  ఉంటుంది.


 చిన్నపిల్లలను  ఎత్తుకుని  పెద్దవాళ్ళు ముందు  సీట్లో  కూర్చుంటే,  బస్సు కుదుపులకు  పిల్లలు  చేతిలోనుంచి  జారే  ప్రమాదముంది  కాబట్టి , ముందు సీట్లో కాకుండా ప్రక్క సీట్లో కూర్చోవటం మంచిది . Thursday, January 22, 2015

స్వైంఫ్లూ వంటివి రాకుండా ముందస్తుగా తులసి ఆకులను తీసుకుంటే ..

గాలి, నీరు,  వాతావరణం  కలుషితం అవుతున్న  ఈ రోజుల్లో  చిత్ర విచిత్రమైన వ్యాధులు  ప్రబలుతున్నాయి.  స్వైన్ ఫ్లూ  వాక్సీన్  ఉందంటున్నారు.  హోమియోలో  స్వైన్ ఫ్లూ కు  మందు  ఉందో లేదో తెలియటం  లేదు.

స్వైన్ ఫ్లూ  వంటి రోగాలు  భయపెడుతున్న ఈ రోజుల్లో   తులసి ఆకులను  రోజూ  కొద్దిగా  తింటుంటే  మంచిదేమో..అనిపిస్తోంది.  


తులసి దళాలను  దేవాలయాల వద్ద అమ్ముతుంటారు.  లేకపోతే దైవానికి అలంకరించి తీసిన తరువాత  ప్రసాదంగా  ఇచ్చిన 
 దళాలను , దండలను  కూడా  తీసుకోవచ్చు.


స్వైంఫ్లూ వంటివి  రాకుండా  ముందస్తుగా  తులసి ఆకులను  తీసుకుంటే మంచిదేమో  అనిపిస్తోంది..


అలాగని తులసి మొక్కలమీదపడి  ఇష్టారాజ్యంగా ఆకులను ఎడాపెడా తుంపి, కొన్ని పారవేసి వేస్ట్ చేయకూడదు. తులసి కులను  తక్కువగా మాత్రమే తీసుకోవాలి. తులసిమొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. 


 ఒకేసారి ఎక్కువ తులసి దళాలను తెచ్చుకుంటే ఎండిన తరువాత పారవేయకుండా పొడిలా నలిపి వాడుకోవచ్చు. 
................ మనుషులు  కోరికలను, అత్యాశను తగ్గించుకోవాలి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయటాన్ని మానుకోవాలి.  అప్పుడు  రోగాలు రావటం తగ్గుతాయి.

షిరిడి సాయిబాబా గురువుకాదు, దేవుడుకాదు అనటం అన్యాయం..

ఎన్నో చక్కని బోధలు చేసిన  సాయిబాబా గురువు కాదనటం అన్యాయం. సమాజంలో పెరుగుతున్న మతఘర్షణలను నివారించే విధంగా బోధనలు చేసిన సాయిబాబాను తప్పుపట్టటం సమంజసం కాదు. 

సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అని సాయి బోధ. సబ్ కా మాలిక్ ఏక్ హై..

సాయిబాబా అల్లామాలిక్ అనటం వల్ల హిందువు కాదు అంటున్నారు. మరి, సాయి హిందువులలాగ ధునిని వెలిగించారు, విబూదిని(ఊదీని)   పంచేవారు.
సాయి ఇచ్చిన సలహాలో కొంత భాగము..
హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు.అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు ?.. 

.....................


 శారీరికంగా, మానసికంగా ధృఢత్వం తక్కువ ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న సమాజంలో  యజ్ఞయాగాదులు వంటివి కుదురుగా చేయటం అనేది అందరివల్లా కాదు. కలికాలంలో నామజపం సరైనది అని పెద్దలు తెలియజేసారు.

......................

సాయిపూజా విధానంలో , సరళమైన విధివిధానాలు  ..వంటివెన్నో  ప్రజలను ఆకర్షించాయి. క్రమంగా ఎందరో ప్రజలు  సాయిబాబాను గురువుగా, దైవంగా ఆరాధించటం మొదలుపెట్టారు. 


సాయిని ఆరాధించటానికి  మతం మారాలన్న ఆంక్షలు లేవు. సాయిని ఏ మతం వారైనా ఆరాధించుకోవచ్చు. హిందూమతస్తులకు  సాయి..రాముడుగా, కృష్ణుడుగా, శివునిగా దర్శనమిచ్చారని అంటారు. 


తాము ఆరాధించే దైవం రూపంలో సాయి దర్శనమిచ్చారని భక్తులు తమ అనుభవాల ద్వారా చెప్పిన సంఘటనలు ఉన్నప్పుడు సాయి గురువూ కాదు, దైవమూ కాదు అని ఎలా అంటారు ? 


పశుపక్ష్యాదులనే గురువులుగా స్వీకరించవచ్చని సాక్షాత్తూ దత్తాత్రేయుల వారే తెలియజేసినప్పుడు సాయి వంటి గొప్ప వ్యక్తిని గురువుగా భావించకూడదని ఎందుకంటున్నారు ?

.........................

 సాయి గురువూ కాదు దైవమూ కాదు అనటం వల్ల  హిందూ సమాజానికి  ఎంతో నష్టం జరుగుతుందని గ్రహించాలి. ఇప్పటికే హిందూ సమాజం ముక్కలుముక్కలై  బలహీనమయ్యింది. బుద్ధుని  వ్యతిరేకించిన  వారివల్ల హిందూసమాజం  చీలిపోయి  బౌద్ధమతం ఏర్పడింది. మరికొన్ని కారణాల వల్ల ఇంకొకసారి హిందూసమాజం  చీలిపోయి సిక్కుమతం ఏర్పడింది . ఇప్పుడు సాయిబాబాను వ్యతిరేకించటం అనేది మరింత పెద్దతప్పు. ఇలా అందరినీ వ్యతిరేకిస్తూ ,   తమలో తాము కలహించుకుంటూ చీలిపోతున్నందువల్ల నష్టమే తప్ప లాభమేమీలేదని  గ్రహించాలి.

............................

 హిందువులకు పూజించుకోవటానికి ఎందరో దేవతలు ఉన్నారు.  సాయిని కూడా ముక్కోటిదేవతలలో ఒకరిగా భావించి పూజిస్తున్నారే తప్ప సాయిని పూజించటానికి  వేరే మతంలోకి మారటం లేదు కదా ! ఇక సమస్య ఏమిటి ? 

.................................. 

సాయి ముస్లింలకు  సంబంధించిన  విధంగా అల్లామాలిక్  అనేవారు  అలాగే   హిందువులకు   సంబంధించిన  విధంగా ధునినీ వెలిగించేవారు, ఊదీని(విభూతిని) పంచేవారు.సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అన్నదే సాయి బోధ.


 దైవం ఒక్కరే  అన్నది  ఏ మతం వారు  అయినా అంగీకరించవలసిన విషయం. ఏ మతం వారైనా విశ్వాన్ని తాము పూజించే దైవమే సృష్టించారని నమ్ముతారు. విశ్వం మొత్తాన్నీ ఒకే దైవం సృష్టించారనే  మాటను గమనిస్తే  అన్ని మతాల ప్రజలనూ సృష్టించిన దైవం  ఒక్కరే అవుతారు  కదా ! 


ప్రతి మతానికీ  వేరువేరు  దైవాలున్నారని  అనుకుంటే వారివారి  దైవాల  గొప్పతనాన్ని  వారు  తక్కువ  చేసుకున్నట్లే. నా దృష్టిలో  దైవం  ఒక్కరే. సూర్యుని  కొందరు సన్  అంటారు, కొందరు సూర జ్ అంటారు..కొందరు సూర్యుడు అంటారు..


అలాగే ఏ మతం వాళ్ళయినా పూజించే దైవశక్తి ఒక్కటే. కొందరు క్రీస్తు అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు 
దుర్గమ్మా శివా కేశవా..  అంటారు..కొందరు  దైవాన్ని నిరాకారంగా ఆరాధిస్తారు.హిందూ మతంలో కూడా నిరాకార ఆరాధన ఉంది. 

......................... 

 శ్రీ దత్తాత్రేయస్వామి  అవతారమయిన శ్రీపాదశ్రీవల్లభస్వామి  గురించిన  శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము  గ్రంధములో  షిరిడి సాయిబాబాను  గురించిన  వివరములున్నవి. సాయిబాబా గురించి  సందేహములున్నవారు  ఈ గ్రంధమును  చదివి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. 

................................ 

బీబీనాంచారమ్మ  విగ్రహం శ్రీరంగం దేవాలయంలో ఉందని అంటారు.. అయ్యప్పస్వామి  వద్దకు వెళ్ళేవారు వావర్ అనే వారిని దర్శించుకుంటారని అంటారు. అమరనాధ్ గుహ ఒక ముస్లిం వ్యక్తి ద్వారా  కనుగొనబడింది. 


రామలక్ష్మణులు మారువేషాల్లో వచ్చి భక్తరామదాసును  రక్షించిన సందర్భంలో తానీషా అనే ముస్లిం రాజుకు దర్శనమిచ్చిన సంగతి అందరికీ  తెలిసిందే. 


 ఏసుక్రీస్తు  భారతదేశంలో కొంతకాలం  సంచరించి ఇక్కడి యోగులతో కలిసి సంచరించారని  అంటున్నారు. ఇవన్నీ  ఇతర మతస్తులతో సంబంధమున్న విషయాలే కదా. సాయి విషయంలోనే గొడవ ఎందుకు ?

.......................

 ఇప్పటికే హిందూ మతం ఎన్నో ఆటుపోట్ల మధ్య నలిగిపోతోంది. సాయిని వ్యతిరేకించి, హిందువుల మధ్య చీలికలు తెచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోవటం సమంజసం కాదు.   


సాయిని ఆరాధించేవారు  మతమేమీ మారటం లేదే.  హిందూమతంలో ఉంటూనే తాము ఆరాధించే  దేవతలతో పాటూ..  సాయిని కూడా ఆరాధిస్తున్నారు. పెద్దవాళ్ళమని చెప్పుకునేవారు  దయచేసి  ఈ విషయాలను గమనిస్తే బాగుంటుంది.

.....................

 హరిని ప్రార్ధించకూడదని  ప్రహ్లాదుని ఆదేశించారు  అతని తండ్రి  మరియు గురువు. కానీ ప్రహ్లాదుడు గురువు మాటను తండ్రిని మాటను పాటించలేదు . దైవమే ప్రహ్లాదుని ఆదుకున్నారు.  పెద్దవాళ్లు   మొండిగా ప్రవర్తిస్తే  దైవమే  తమ  భక్తులను ఆదుకుంటారు.   Sunday, January 11, 2015

అందరికి శుభాకాంక్షలు.

 సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది. 

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత. సూర్యరశ్మి వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది.  

 రామకృష్ణపరమహంస శారదాదేవిల శిష్యులైన   వివేకానందుని  జయంతి , జనవరి  12 న . 

 గోదారంగనాధుల కల్యాణం..  ( భోగి పండుగ). 

సంక్రాంతి,  అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం .

  అందరికి  శుభాకాంక్షలు.


Friday, January 9, 2015

దేహస్వరూపం గురించి కొన్ని విషయాలు మరియు ..


కొందరు ఏమనుకుంటారంటే .. మరణించిన తరువాత అనుభవించటానికి ఏముంటుంది? అప్పుడు భావాలు( ఫీలింగ్స్) ఉండవు కదా..అనుకుంటారు. అయితే , తరువాత కూడా భావాలు ఉంటాయని గ్రంధాల ద్వారా తెలుసుకోవచ్చు.
.....................

శ్రీ దేవీ భాగవతము గ్రంధము ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు...


 యమధర్మరాజు ను  సావిత్రీదేవి..  ఎన్నో విషయాల గురించి  అడగటం  జరిగింది .


నరకబాధలు దరిచేరకుండా ఉండాలంటే ఏమేమి సత్కర్మలు చేయాలి..వంటి సందేహాలతో పాటూ అనేక విషయాలను అడుగుతుంది సావిత్రి.  


భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. ఆ పైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది ?...


 అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తోంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏమిటి ? ..అంటూ ఎన్నో విషయాలను అడగటం జరిగింది.

అప్పుడు  యమధర్మరాజు సావిత్రికి ఎన్నో విషయాలను తెలియజేస్తూ.. దేహస్వరూపం  గురించి  కూడా  వివరిస్తారు. 


కొన్ని విషయాలు..  


స్థూలశరీరం పంచభూతాత్మకం.అది కృత్రిమదేహం.కనక నశ్వరం - బూడిద అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి...


అటుపైని అంగుష్ఠప్రమాణంతో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దానితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు.  శిధిలం కాదు.అగ్నిదగ్ధం కాదు...

 శస్త్రాస్త్రాలకు లొంగదు.తప్తద్రవ తప్తతైల తప్తపాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తూంటుంది...అంటూ ఎన్నో విషయాలను తెలియజేస్తారు యమధర్మరాజు.

................. 


ఒక యోగి ఆత్మ కధ గ్రంధము నుంచి ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు..


మానవుడి ఆత్మ, ఒకటో రెండో మూడో-శరీరమనే సీసాల్లో బంధించి ఉండి, అజ్ఞానమూ కోరికలూ అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు, పరమాత్మ సాగరంలో లీనం కాలేడు... 

చావు అనే సుత్తిదెబ్బతో స్థూలభౌతికకాయం బద్దలయిపోయినప్పుడు సూక్ష్మ, కారణశరీరాలనే తక్కిన తొడుగులు రెండూ , సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనం కావడానికి వీలులేకుండా ఆత్మను నిరోధించడానికి, ఇంకా మిగిలి ఉంటాయి... 

జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు , దాని శక్తి తక్కిన కోశాల్ని రెండిటినీ ఛిన్నాభిన్నం చేసేస్తుంది. చివరికి, స్వల్పమైన మానవాత్మ విముక్తమయి , అమేయసమృద్ధమయిన పరమాత్మతో ఐక్యమవుతుంది. 


Wednesday, January 7, 2015

నిద్రతో లభించే శాంతికీ మోక్షంతో లభించే పరమశాంతికీ..


జీవితంలో ఏదో అనుభవించేయాలనే తాపత్రయంతో  ఏవేవో పనులు చేస్తుంటారు  కొందరు. అయితే, ఎంత అనుభవించినా మనసుకు తృప్తి అనేది ఉండదు. 

అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనుభవించిన కొద్దీ కోరికలు మరింత పెరుగుతాయే తప్ప తరగవంటారు.   


 ఎంతో డబ్బు ఉంటేనే తప్ప సుఖసంతోషాలు లభించవనుకుంటారు చాలామంది.


 ఎప్పటికప్పుడు కొత్తకొత్త వస్తువులను కొనుక్కుంటేనే సంతోషం అనుకుంటూ అందుకు అవసరమైన డబ్బు సంపాదించటం కోసం జీవితాంతమూ కష్టపడుతూనే ఉంటారు మరికొందరు.


ఇవేవీ లేకపోయినా, చేతనైనంతలో  కష్టపడి పనిచేసి  ఒళ్ళెరగకుండా ఆదమరిచి  హాయిగా, ప్రశాంతంగా   నిద్రపోయే వాళ్ళూ ఉంటారు.


ఎన్నో ఖరీదైన వస్తువులు చుట్టూ ఉన్నా కూడా నిద్ర పట్టక అల్లాడిపోతూ నిద్రమాత్రలను ఆశ్రయించే.. డబ్బున్న అభాగ్యులెందరో కూడా సమాజంలో ఉంటారు. 


 నిద్ర దైవం ప్రసాదించిన వరం. నిద్రలో బాహ్యప్రపంచం గురించి తెలియదు. నిద్ర వల్ల విశ్రాంతి లభిస్తుంది. ఆ స్థితి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.


 నిద్ర లేవటానికి ఇష్టపడక మరి కొంతసేపు పడుకుంటే బాగుంటుందనిపిస్తుంది. మరికొంతసేపు నిద్రపోతే బాగుండు అనుకోవటంలోనే నిద్రలో ఉన్న సుఖం తెలుస్తోంది కదా! 


 నిద్రతోనే ఇంత ప్రశాంతత లభిస్తుంటే ఇక మోక్షాన్ని పొందిన వ్యక్తికి ఎంత గొప్ప ప్రశాంతత లభిస్తుందో .. 


నిద్రతో లభించే శాంతికీ మోక్షంతో లభించే పరమశాంతికీ  పోలిక లేకపోవచ్చు.


 అయితే, నిద్రతో లభించే శాంతే ఇంత గొప్పగా ఉంటే ఇక మోక్షాన్ని పొందిన వారు పొందే పరమశాంతి ఎంత గొప్పగా ఉంటుందో ఊహకు కూడా అందదేమో.


అందుకేనేమో జన్మ పరంపర నుండి బయటపడి మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంటారు ఎందరో.


Friday, January 2, 2015

ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..

నిష్కామ కర్మ గురించి భగవద్గీత నుంచి చక్కగా తెలుసుకోవచ్చు.  

నిష్కామకర్మ యోగం ఆచరించే వ్యక్తి.. ప్రతి జీవికి పరమ లక్ష్యమైన మోక్షాన్ని అందుకోగలరు.


జీవితంలో నిష్కామ కర్మయోగం ఎంతో అవసరం... స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఫలితాన్ని గురించిన తాపత్రయాన్ని వదిలేస్తే  ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది.

................

ఈ రోజుల్లో నిష్కామకర్మను హేళన చేస్తున్న వారు  కొందరు ఉన్నారు. అలా హేళన చేయటం వారి దురదృష్టం. 


నిష్కామకర్మ అంటే దేనిపైనా శ్రద్ధ లేకుండా నిస్సారంగా జీవించటం కాదు.


జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవటానికి శక్తిని అందిస్తూ ..ఆటుపోట్లకు క్రుంగిపోని చక్కటి జీవితాన్ని పొందటానికి అద్భుతమైన మార్గమిది.


( అతిసంతోషం కలిగించే వార్త కాని అతివిచారం కలిగించే వార్త కానీ సడన్ గా  వింటే .. గుండెపై  ప్రభావం పడే అవకాశం కూడా ఉందట. ఎక్కువ సంతోషమైనా, ఎక్కువ విచారమైనా..  ఒకేలా ప్రభావాన్ని చూపించటం ఆశ్చర్యకరం.) 


జీవితంలో  నిష్కామకర్మను  ఆచరించే వారు దేనికీ  పొంగరు, దేనికీ క్రుంగరు కాబట్టి  వారికి ఈ బాధలుండవు .

..................... 

ఏ పని ఆచరించినా కూడా చక్కటి ఫలితాలు  లభించాలని  ఆచరిస్తాము. చక్కటి  ఫలితాలు  రావాలని  కోరుకోవటంలో తప్పు   లేదు.


 అయితే, ఎప్పుడూ ఆశించిన ఫలితాలు  లభించకపోవచ్చు. అలాంటప్పుడు నిష్కామకర్మయోగి నిరాశతో క్రుంగిపోవటం ఉండదు.


ఉదా.. చక్కగా చదివి పరీక్షలు వ్రాయటం వరకు విద్యార్ధి వంతు.


చక్కగా చదివి ఫలితాన్ని గురించి ఆందోళన చెందకుండా పరీక్ష వ్రాస్తే చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంది.


 ఫలితం గురించి అదే పనిగా  వర్రీ అయితే  పరీక్ష సరిగ్గా వ్రాయలేకపోవచ్చు,
 వర్రీవల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా ఉంది. శక్తికి మించి ప్రయత్నించినా , కొన్నిసార్లు ఫలితం విద్యార్ధి  చేతుల్లో  పూర్తిగా ఉండకపోవచ్చు.


ఈ రోజుల్లో పోటీపరీక్షలలో అతిపోటీ  వల్ల  కొద్దిపాటి తేడావల్ల  కూడా ఉన్నత విధ్యాభ్యాసం చేయటానికి అవకాశాన్ని కోల్పోతున్న విధ్యార్ధులెందరో ఉన్నారు. 


 ఇంటర్వ్యూకు ఎంతముందు  బయలుదేరినా ట్రాఫిక్ జాం వల్ల  సకాలంలో  చేరలేకపోవచ్చు.  

( నిష్కామ కర్మతో నిబ్బరంగా ఉండటానికి  ప్రయత్నిస్తే ,తిరిగి మళ్ళీ  ప్రయత్నించి  చక్కటి ఫలితాన్ని పొందే అవకాశమూ ఉంది. )

 మరి కొన్నిసంఘటనలను పరిశీలిస్తే ..  అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ప్రయాణంలో ఆపదలో చిక్కుకున్నవారు ఉంటారు. కొన్ని కారణాల వల్ల , కొనుక్కున్న టెకెట్ ను కాన్సిల్ చేసుకుని జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకునే వారూ ఉంటారు. అత్యంత ప్రమాదకరమైన సంఘటనలో కూడా అత్యంత ఆశ్చర్యకరంగా సురక్షితంగా బయటపడినవారూ ఉంటారు. 


( ఏది ఎందుకు ఎలా జరుగుతుందో ? అలా జరగటానికి వెనుక ఉన్న కారణాలేమిటో భగవంతునికే తెలుస్తాయి.)


 సమాజంలో ఎన్నో సంఘటనలను పరిశీలిస్తే, జీవితంలో మనిషి చేతిలో లేని  సంఘటనలు కూడా  జరిగే అవకాశముందని అర్ధమవుతుంది. 


అయితే, నిష్కామకర్మ ఆచరించే వారికి క్రుంగుబాటు దరిచేరదు.


సంసార జీవితంలో  స్త్రీలకు, పురుషులకు  ఎదురయ్యే  సమస్యలకు కూడా నిష్కామకర్మ  అనేది  అద్భుతమైన  పరిష్కారమార్గం.

....................... 

జనకమహారాజు  సంసారంలో ఉంటూ రాజ్యపాలన చేస్తూనే నిష్కామయోగిగా జీవించారని పెద్దలు తెలియజేసారు.


అయితే, మనస్సును అదుపులో ఉంచుకోవటం, చుట్టూ సమాజంలో ఉన్న పరిస్థితుల మధ్య నిష్కామకర్మయోగాన్ని ఆచరించటం అనేవి అంత తేలికయిన పనులు కావు.


 నిష్కామయోగాన్ని ఆచరించటం అనేది సాధ్యమవ్వాలంటే దైవకృప  ఎంతో అవసరం. 


 దైవకృపను పొందాలంటే దైవానికి నచ్చిన మార్గంలో ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. ఆ శక్తిని  ప్రసాదించమని దైవాన్ని శరణు వేడాలి.Thursday, January 1, 2015

అందరికి.. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

అందరికి.. వైకుంఠ  ఏకాదశి,ద్వాదశి  మరియు  ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.