koodali

Wednesday, January 7, 2015

నిద్రతో లభించే శాంతికీ మోక్షంతో లభించే పరమశాంతికీ..


జీవితంలో ఏదో అనుభవించేయాలనే తాపత్రయంతో  ఏవేవో పనులు చేస్తుంటారు  కొందరు. అయితే, ఎంత అనుభవించినా మనసుకు తృప్తి అనేది ఉండదు. 

అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనుభవించిన కొద్దీ కోరికలు మరింత పెరుగుతాయే తప్ప తరగవంటారు.   


 ఎంతో డబ్బు ఉంటేనే తప్ప సుఖసంతోషాలు లభించవనుకుంటారు చాలామంది.


 ఎప్పటికప్పుడు కొత్తకొత్త వస్తువులను కొనుక్కుంటేనే సంతోషం అనుకుంటూ అందుకు అవసరమైన డబ్బు సంపాదించటం కోసం జీవితాంతమూ కష్టపడుతూనే ఉంటారు మరికొందరు.


ఇవేవీ లేకపోయినా, చేతనైనంతలో  కష్టపడి పనిచేసి  ఒళ్ళెరగకుండా ఆదమరిచి  హాయిగా, ప్రశాంతంగా   నిద్రపోయే వాళ్ళూ ఉంటారు.


ఎన్నో ఖరీదైన వస్తువులు చుట్టూ ఉన్నా కూడా నిద్ర పట్టక అల్లాడిపోతూ నిద్రమాత్రలను ఆశ్రయించే.. డబ్బున్న అభాగ్యులెందరో కూడా సమాజంలో ఉంటారు. 


 నిద్ర దైవం ప్రసాదించిన వరం. నిద్రలో బాహ్యప్రపంచం గురించి తెలియదు. నిద్ర వల్ల విశ్రాంతి లభిస్తుంది. ఆ స్థితి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.


 నిద్ర లేవటానికి ఇష్టపడక మరి కొంతసేపు పడుకుంటే బాగుంటుందనిపిస్తుంది. మరికొంతసేపు నిద్రపోతే బాగుండు అనుకోవటంలోనే నిద్రలో ఉన్న సుఖం తెలుస్తోంది కదా! 


 నిద్రతోనే ఇంత ప్రశాంతత లభిస్తుంటే ఇక మోక్షాన్ని పొందిన వ్యక్తికి ఎంత గొప్ప ప్రశాంతత లభిస్తుందో .. 


నిద్రతో లభించే శాంతికీ మోక్షంతో లభించే పరమశాంతికీ  పోలిక లేకపోవచ్చు.


 అయితే, నిద్రతో లభించే శాంతే ఇంత గొప్పగా ఉంటే ఇక మోక్షాన్ని పొందిన వారు పొందే పరమశాంతి ఎంత గొప్పగా ఉంటుందో ఊహకు కూడా అందదేమో.


అందుకేనేమో జన్మ పరంపర నుండి బయటపడి మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంటారు ఎందరో.


No comments:

Post a Comment