koodali

Thursday, January 22, 2015

షిరిడి సాయిబాబా గురువుకాదు, దేవుడుకాదు అనటం అన్యాయం..

 
ఎన్నో చక్కని బోధలు చేసిన  సాయిబాబా గురువు కాదనటం అన్యాయం. సమాజంలో పెరుగుతున్న మతఘర్షణలను నివారించే విధంగా బోధనలు చేసిన సాయిబాబాను తప్పుపట్టటం సమంజసం కాదు. 

సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అని సాయి బోధ. సబ్ కా మాలిక్ ఏక్ హై..

సాయిబాబా అల్లామాలిక్ అనటం వల్ల హిందువు కాదు అంటున్నారు. మరి, సాయి హిందువులలాగ ధునిని వెలిగించారు, విబూదిని(ఊదీని)   పంచేవారు.
సాయి ఇచ్చిన సలహాలో కొంత భాగము..
హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు.అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు ?.. 
.....................

 శారీరికంగా, మానసికంగా ధృఢత్వం తక్కువ ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న సమాజంలో  యజ్ఞయాగాదులు వంటివి కుదురుగా చేయటం అనేది అందరివల్లా కాదు. కలికాలంలో నామజపం సరైనది అని పెద్దలు తెలియజేసారు.

......................

సాయిపూజా విధానంలో , సరళమైన విధివిధానాలు  ..వంటివెన్నో  ప్రజలను ఆకర్షించాయి. క్రమంగా ఎందరో ప్రజలు  సాయిబాబాను గురువుగా, దైవంగా ఆరాధించటం మొదలుపెట్టారు. 


సాయిని ఆరాధించటానికి  మతం మారాలన్న ఆంక్షలు లేవు. సాయిని ఏ మతం వారైనా ఆరాధించుకోవచ్చు. హిందూమతస్తులకు  సాయి..రాముడుగా, కృష్ణుడుగా, శివునిగా దర్శనమిచ్చారని అంటారు. 


తాము ఆరాధించే దైవం రూపంలో సాయి దర్శనమిచ్చారని భక్తులు తమ అనుభవాల ద్వారా చెప్పిన సంఘటనలు ఉన్నప్పుడు సాయి గురువూ కాదు, దైవమూ కాదు అని ఎలా అంటారు ? 


పశుపక్ష్యాదులనే గురువులుగా స్వీకరించవచ్చని సాక్షాత్తూ దత్తాత్రేయుల వారే తెలియజేసినప్పుడు సాయి వంటి గొప్ప వ్యక్తిని గురువుగా భావించకూడదని ఎందుకంటున్నారు ?

.........................

 సాయి గురువూ కాదు దైవమూ కాదు అనటం వల్ల  హిందూ సమాజానికి  ఎంతో నష్టం జరుగుతుందని గ్రహించాలి. ఇప్పటికే హిందూ సమాజం ముక్కలుముక్కలై  బలహీనమయ్యింది. బుద్ధుని  వ్యతిరేకించిన  వారివల్ల హిందూసమాజం  చీలిపోయి  బౌద్ధమతం ఏర్పడింది. మరికొన్ని కారణాల వల్ల ఇంకొకసారి హిందూసమాజం  చీలిపోయి సిక్కుమతం ఏర్పడింది . 


ఇప్పుడు సాయిబాబాను వ్యతిరేకించటం అనేది మరింత పెద్దతప్పు. ఇలా అందరినీ వ్యతిరేకిస్తూ ,   తమలో తాము కలహించుకుంటూ చీలిపోతున్నందువల్ల నష్టమే తప్ప లాభమేమీలేదని  గ్రహించాలి.

............................

 హిందువులకు పూజించుకోవటానికి ఎందరో దేవతలు ఉన్నారు.  సాయిని కూడా ముక్కోటిదేవతలలో ఒకరిగా భావించి పూజిస్తున్నారే తప్ప సాయిని పూజించటానికి  వేరే మతంలోకి మారటం లేదు కదా ! ఇక సమస్య ఏమిటి ? 

.................................. 

సాయి ముస్లింలకు  సంబంధించిన  విధంగా అల్లామాలిక్  అనేవారు  అలాగే   హిందువులకు   సంబంధించిన  విధంగా ధునినీ వెలిగించేవారు, ఊదీని(విభూతిని) పంచేవారు.సాయికి మతం లేదు. దైవం ఒక్కరే అన్నదే సాయి బోధ.


 దైవం ఒక్కరే  అన్నది  ఏ మతం వారు  అయినా అంగీకరించవలసిన విషయం. ఏ మతం వారైనా విశ్వాన్ని తాము పూజించే దైవమే సృష్టించారని నమ్ముతారు. విశ్వం మొత్తాన్నీ ఒకే దైవం సృష్టించారనే  మాటను గమనిస్తే  అన్ని మతాల ప్రజలనూ సృష్టించిన దైవం  ఒక్కరే అవుతారు  కదా ! 


ప్రతి మతానికీ  వేరువేరు  దైవాలున్నారని  అనుకుంటే వారివారి  దైవాల  గొప్పతనాన్ని  వారు  తక్కువ  చేసుకున్నట్లే. నా దృష్టిలో  దైవం  ఒక్కరే. సూర్యుని  కొందరు సన్  అంటారు, కొందరు సూర జ్ అంటారు..కొందరు సూర్యుడు అంటారు..


అలాగే ఏ మతం వాళ్ళయినా పూజించే దైవశక్తి ఒక్కటే. కొందరు క్రీస్తు అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు 
దుర్గమ్మా శివా కేశవా..  అంటారు..కొందరు  దైవాన్ని నిరాకారంగా ఆరాధిస్తారు.హిందూ మతంలో కూడా నిరాకార ఆరాధన ఉంది. 

......................... 

 శ్రీ దత్తాత్రేయస్వామి  అవతారమయిన శ్రీపాదశ్రీవల్లభస్వామి  గురించిన  శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతము  గ్రంధములో  షిరిడి సాయిబాబాను  గురించిన  వివరములున్నవి. సాయిబాబా గురించి  సందేహములున్నవారు  ఈ గ్రంధమును  చదివి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. 

................................ 

బీబీనాంచారమ్మ  విగ్రహం శ్రీరంగం దేవాలయంలో ఉందని అంటారు.. అయ్యప్పస్వామి  వద్దకు వెళ్ళేవారు వావర్ అనే వారిని దర్శించుకుంటారని అంటారు. అమరనాధ్ గుహ ఒక ముస్లిం వ్యక్తి ద్వారా  కనుగొనబడింది. 


రామలక్ష్మణులు మారువేషాల్లో వచ్చి భక్తరామదాసును  రక్షించిన సందర్భంలో తానీషా అనే ముస్లిం రాజుకు దర్శనమిచ్చిన సంగతి అందరికీ  తెలిసిందే. 


 ఏసుక్రీస్తు  భారతదేశంలో కొంతకాలం  సంచరించి ఇక్కడి యోగులతో కలిసి సంచరించారని  అంటున్నారు. ఇవన్నీ  ఇతర మతస్తులతో సంబంధమున్న విషయాలే కదా. సాయి విషయంలోనే గొడవ ఎందుకు ?

.......................

 ఇప్పటికే హిందూ మతం ఎన్నో ఆటుపోట్ల మధ్య నలిగిపోతోంది. సాయిని వ్యతిరేకించి, హిందువుల మధ్య చీలికలు తెచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోవటం సమంజసం కాదు.   


సాయిని ఆరాధించేవారు  మతమేమీ మారటం లేదే.  హిందూమతంలో ఉంటూనే తాము ఆరాధించే  దేవతలతో పాటూ..  సాయిని కూడా ఆరాధిస్తున్నారు. పెద్దవాళ్ళమని చెప్పుకునేవారు  దయచేసి  ఈ విషయాలను గమనిస్తే బాగుంటుంది.

.....................

 హరిని ప్రార్ధించకూడదని  ప్రహ్లాదుని ఆదేశించారు  అతని తండ్రి  మరియు గురువు. కానీ ప్రహ్లాదుడు గురువు మాటను తండ్రిని మాటను పాటించలేదు . దైవమే ప్రహ్లాదుని ఆదుకున్నారు.  పెద్దవాళ్లు   మొండిగా ప్రవర్తిస్తే  దైవమే  తమ  భక్తులను ఆదుకుంటారు.   



No comments:

Post a Comment