koodali

Monday, February 28, 2011

దైవ భక్తులు ఇతరవిషయాల గురించి మాట్లాడకూడదా ?


ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారంటే.....

ఎవరైనా దైవభక్తులు , స్వాములు దేశంలో జరుగుతున్న.........అవినీతి, అన్యాయాలను గురించి మాట్లాడితే ....... వాళ్ళు, భక్తిగురించి తప్ప ఇతరవిషయాలు మాట్లాడటమే తప్పు ........... అన్నట్లు మాట్లాడుతున్నారు.


వారూ ఈ దేశ పౌరులే కదా ! అలాంటప్పుడు వారికీ మాట్లాడే హక్కు ఉంటుంది.


ఈ రోజుల్లో మతం పేరుతో ప్రజలను మోసం చేసే మోసగాళ్ళు ఉన్నమాట నిజమేకానీ .......... అందరూ అలా చెడ్డగా ఉండరు కదా..........


పూర్వం రాజులకు గురువులు ఉండేవారు ........ రాజ్యపాలనలో సలహాలను ఇవ్వటానికి. ఉదా... దేవతలకు ఏదైనా సమస్య వస్తే దేవేంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని సలహా అడగటం మనం గ్రంధాలలో చదువుకున్నాము.


దశరధులవారికి వశిష్టులవారు గురువుగా ఎన్నో సలహాలను ఇస్తుండేవారు.

ఇలా వారు రాజ్యరక్షణ విషయంలో, ప్రజల బాగోగుల విషయంలో రాజులకు సలహాలను ఇస్తుండేవారు. రాజులు అవి పాటించేవారు.


రాజులు కూడా తమకు అన్ని విషయములు తెలిసినా గురువులను గౌరవించేవారు. గురువులు కూడ వారికి తమ సహకారాన్ని అందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకునేవారు...


ఈ మధ్య కాలంలో చూస్తే........


విజయనగరసామ్రాజ్య స్థాపనలో శ్రీ విద్యారణ్య స్వాముల వారి పాత్ర ఎంత ముఖ్యమయినదో మనకు తెలిసినదే.


శ్రీ సమర్ధ రామదాసులవారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువుగా ఎన్నో సలహాలను ఇచ్చి ముందుకు నడిపించారు.ఇంతేకాదు,...............


మన పూర్వ ఋషులు, ఉపనిషత్ ద్రష్టలు దైవభక్తి వల్లనే ఎన్నో వైజ్ఞానిక విషయాలను కనుగొని ప్రపంచానికి అందించారు.


గణితశాస్త్రం, ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, అర్ధశాస్త్రం, జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలను ప్రపంచానికి అందించారు.

అప్పుడు అంత గొప్ప ఆధ్యాత్మికవాదులు ఉండేవారు.


ఈ రోజుల్లో కూడా దైవభక్తులైన శాస్త్రవేత్తలు ,
మరియు ఇతరులు ఎందరో ఉన్నారు.


ఇంకా,ప్రపంచంలోని సర్వమతప్రజలకోసం తాపత్రయపడే మహానుభావులు ఎందరో ఉన్నారు........," ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో మహా గురువులు ప్రపంచంలోని సర్వమతములకు చెందిన ప్రజల బాగోగులకోసం తాపత్రయపడటం స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా
,..........


శ్రీ రామకృష్ణులవారు.......వివేకానందులవారి గురించీ మనకు తెలుసు. శ్రీ రామకృష్ణమఠం వారు పేదవారికి ఎంతో సహాయం చేస్తున్నారు.

శ్రీ రామకృష్ణమఠం లో అన్ని మతముల
వారికి ప్రవేశం ఉంది.


ఎందుకంటే.......... పేర్లు, వేషభాషలు ఎన్ని రకాలుగా ఉన్నా ........... దైవం ఒక్కరే. ప్రపంచ మానవులందరూ వారి సంతానమే.


దైవభక్తులైన వారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అసలు ప్రతి మనిషికి దైవ భక్తి ఉండటం అవసరం.

అంతేగానీ దైవభక్తులైన వారిని .......... మీకు ఇతరవిషయాలు గురించి ఎందుకు ? అనటం తగనిపని...............
Friday, February 25, 2011

పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......

భగవంతుని నమ్మే అందరూ తాము పూజిస్తున్న దైవం విశ్వాన్ని సృష్టించారనే నమ్ముతారు. అంటే ప్రపంచంలో ఉన్న అందరు మానవులనీ తాము నమ్ముతున్న దైవమే సృష్టిస్తారని నమ్ముతాము.


అలాంటప్పుడు మన ప్రక్కవాళ్ళు కూడా ఆ దైవం సృష్టించిన వాళ్ళే కదా ! వారియందు మనకు భేద భావం ఎందుకు ?


ఇంకా,..........సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో ఒక్కరే.


సూర్యుని కొందరు సన్ అంటారు, కొందరు సూర్యుడు అంటారు.......... అలాగే చంద్రుని కొందరు మూన్ అంటారు, కొందరు చంద్రుడు అంటారు.


ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ ' చంద్రుడు ' ఒక్కరే. మానవులందరికీ ' సూర్యుడు ' ఒక్కరే.


చంద్రుని, సూర్యుని అన్ని మతములవారు వారివారి పధ్ధతులలో పూజించుకుంటారు.


రంజాన్ పండుగ సమయాలలో చంద్రోదయానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ముస్లిం మతమును అనుసరించేవారు,.............పండుగలలో పూజలలో చంద్రునికి ఇంపార్టెన్స్ ఇస్తారు హిందూ మతమును అనుసరించేవారు..


మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు ..........అలాగే మా సూర్యుడు మాత్రమే గొప్ప అని కొందరు........ మా సన్ మాత్రమే గొప్ప అని కొందరు వాదించుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎందుకంటే సూర్యుడు , చంద్రుడు ఎవరికయినా ఒకటే కదా.........


అలాగే మానవులందరూ ' దైవం ' ' మతం ' విషయాలలో
ఎవరి ఆచారాలను వారు పాటించుకుంటూ ......ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ........... ఇతరుల మతములను గౌరవిస్తూ గొడవలు లేకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు.


ఏకత్వంలోనే భిన్నత్వం............భిన్నత్వంలోనే ఏకత్వం అన్న మాట.. ......
అంటే......... ఒకే దైవంలో అన్ని దేవుళ్ళరూపాలను దర్శించగలగటం...........అన్ని దైవరూపాలలోనూ ఒకే దైవాన్ని దర్శించగలగటం అన్నమాట. ..............

Wednesday, February 23, 2011

భగవంతుని అగౌరవించటం తగని పని.......

దత్త దిగంబర ! దత్త దిగంబర ! శ్రీ పాదవల్లభ ! దత్త దిగంబర.

ఎట్టకేలకు కలెక్టర్ మరియు ఇంజనీర్లను విడిచిపెట్టటం సంతోషకరమైన విషయం. ( అయ్యో ! సారీనండి. కలెక్టర్ గారు విడుదల అవలేదంట. నేను న్యూస్ సరిగ్గా చూడకుండా రాసాను. పేదలకు మంచి జరగాలని పనిచేస్తున్న వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.. )


ఇంకో విషయమండి...... బ్లాగ్ మొదలుపెట్టినప్పట్నించి నన్ను ప్రత్యక్షంగా , పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికినా కృతజ్ఞతలను చెప్పుకుంటున్నానండి.

నాకు ఇలా అభిప్రాయములు చెప్పుకునే అవకాశం వస్తుందని ఎప్పుడూఅనుకోలేదు.

భగవంతునిదయవల్ల
మరియు మీ అందరి దయవల్ల ఇప్పుడు ఇలా చెప్పుకోగలుగుతున్నాను..

మనం అందరం బ్లాగుల్లోరాస్తున్న మంచి విషయాలు కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలని భగవంతుని కోరుకుంటున్నానండి.


ఇంకో విషయం.....నిన్న వార్తల్లో చెప్పిన విషయం ఇది.." శ్రీ కూర్మం " ప్రసిద్ధి చెందిన దేవాలయం.

అక్కడ గుడిపరిసరాల్లో ఎన్నో తాబేళ్ళు తిరుగుతుంటాయి. వాటిని భక్తులు పవిత్రంగా భావిస్తారు.

ఇక ఇప్పుడు వీటి గురించి చర్చమొదలయ్యింది.

వాటిలో
నక్షత్రపు తాబేళ్ళు ఉన్నాయట. రకం తాబేళ్ళను అలా పెంచకూడదట. అందుకని వాటిని పట్టుకెళ్ళి జూలోవదిలెయ్యాలని కొందరు అంటున్నారు. అలా చెయ్యటానికి వీల్లేదని భక్తులు అంటున్నారు.

అసలు
తాబేళ్ళు అక్కడ చక్కగా తిరుగుతుంటే వాటిని పట్టుకెళ్ళి జూకి తరలించి కష్టపెట్టడం ఎందుకో ? అర్ధంకావటంలేదు.....


మేము ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని చూశాము. అక్కడ తిరుగుతున్న వాటిలో ఒక దానికి నేను అరటిపండుఇవ్వగా , కొద్దిగా తీసుకుంది. మేము దేవుడే స్వీకరించినట్లు భావించి సంతోషించాము.


అవి
కూడా అందరిమధ్య అలవాటుగా ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రాబ్లం ఏమిటో ?


( అయితే వీటికి జంక్ ఫుడ్ అయిన చిప్స్, పాప్ కార్న్ ఇలాంటివి తినిపించకూడదు. అలాంటి ఆహారం వల్ల జబ్బు చేస్తుంది. అందుకని దయ చేసి జంక్ ఫుడ్ వాటికి ఇవ్వకండి. ). .


ఇంకో విషయమండి................


తెలుగు
సినిమాల్లో కూడా దేవుళ్ళని ................... రకరకాలుగా చూపిస్తోంటే మనమూ విరగబడి చూస్తున్నాము.

దేవుళ్ళని ఇలా అగౌరవంగా చూపించటమనేది తెలుగుసినిమాల్లో తప్పితే ఎక్కడా జరగదేమో............

ఏమైనా
అంటే జనాలు చూస్తున్నారు కాబట్టే మేమూ తీస్తున్నాము అంటారు వాళ్ళు.


ఇందులో తప్పెవరిది ? ఇలాంటివితీస్తున్నవాళ్ళదా ? వాటిని ఎగబడి చూస్తున్నవాళ్ళదా ? లేకపోతే చాదస్తంగా ఆలోచిస్తున్నానని అనిపించుకుంటున్ననాలాంటివాళ్ళదా ?


అలాంటి
సినిమాలని ప్రజలు చూడకపోతే ఇంకోసారి అలాంటి సినిమాలు తీసే సాహసం వాళ్ళు చేయగలరా ??

భగవంతుడు మన కోసం ఎన్నో అమర్చిమన ఆనందం కోసం ఎంతగానో తాపత్రయపడతారు........... అలాంటి దైవాన్ని అవమానించటం ఎవరు చేసినా.......... అది మహాద్రోహం..

Monday, February 21, 2011

రైతులూ ఆత్మహత్యలు వద్దు...............ఆత్మబలమే ముద్దు. మీకు ఎవరైనా కష్టాల్లో ఉన్న రైతులు కనిపిస్తే ఈ కధ చెబుతారు కదూ.!...................


రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి చిన్నపిల్లలు అనాధలవటం చూసాక బాధతో ఇలా రాయాలనిపించింది..........

పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేముందు ఆలోచించాలి. తమకే బ్రతకటం చేతకాక చనిపోతే చిన్నపిల్లలు ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలుపడతారు ? అదే ఆడపిల్లలయితే వారికి ఇంకా ఎన్నో బాధలు.

ఇవన్నీ ఆలోచించి పిల్లలకోసమైనా ధైర్యముగా బ్రతకటం నేర్చుకోవాలి.

ఇప్పుడు ఏం జరుగుతోందంటే............. రైతులు తమవద్ద మిగిలిన విత్తనాలు సరిపోక అప్పు చేసి విత్తనాలు కొంటారు. మళ్ళీ అప్పుచేసి ఎరువులు కొంటారు. ఆఖరికి గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు.

* మొదలు ఈ కాన్సెప్ట్ ను కొన్నాళ్ళు పక్కన పెట్టండి. మొదలు ఆకలితో చావటం కాకుండా బ్రతికి ఉండటం అన్నది ముఖ్యం.

మీ కుటుంబంలో పదిమంది సభ్యులు ఉన్నారనుకోండి. కొంతకాలం మీవరకు బ్రతకటానికి సరిపడా ఆహారసంపాదన గురించి మాత్రమే ఆలోచించండి.

ఎలా అంటే........... ఇక్కడ ఒక కధ చెబుతాను. ఒక రెండు ఎకరాల పొలం ఉన్న రైతు బాగా నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆఖరు నిమిషంలో ఆలోచించారు......ఎలాగైనా బ్రతికి తీరాలని.

తనకున్న రెండు ఎకరాల మొత్తం పొలంలో పంట వెయ్యలేదు. ఆ పొలంలో మట్టితో చిన్న గుడిసె వేసుకున్నారు. చేను గట్లమీద ఉన్న కొబ్బరి, తాటి చెట్ల ఆకులతో గుడిసెను కప్పుకున్నారు.

ఒక ఎకరం పొలంలో కొద్దిభాగం వరి, మిగతాభాగంలో కొద్దికొద్దిగా జొన్నలు, మినుములు, శెనగలు పంటలు వేశారు. ఇవన్నీ వారి కుటుంబానికి సరిపోయేంతలో.

గుడిసె చుట్టూ రకానికి ఒకటి ,రెండు చొప్పున అన్నిరకాల పండ్లమొక్కలు నాటారు. ఆకుకూరలమడులు, కాయగూరలుమొక్కలు , పూలమొక్కలు వేశారు.


వర్షపు నీరు వృధా పోకుండా పొలంలోని బావిలోకి చేరేటట్లు ఏర్పాటు చేసారు. పంటలకు బిందు సేద్యం పధ్ధతిలో నీటి వసతి ఏర్పాటు చేసారు.

రెండు ఆవులు, రెండు ఎడ్లు కొనుక్కున్నారు. దూడలు త్రాగగా మిగిలినవి పాలు వారి కుటుంబానికి సరిపోయేవి. పేడ, ఆకులపచ్చిరొట్ట, వేప వీటితో సేంద్రియ ఎరువులు పంటకు వాడారు.

మంచిపంట పండింది. ఇలాంటి సహజసిధ్ధమైన ఆహారం తినటం వల్ల జబ్బులు పెద్దగా రావుగదా ! పెరటివైద్యం, ఆయుర్వేదం వాడుకునేవారు.

పిల్లలను అదే ఊరిలో గవర్న్ మెంట్ బడిలో చేర్పించారు.

తమ దుస్తులకొరకు పొలంలో ప్రత్తి మొక్కలు పెంచారు. వాటినుంచీ వచ్చిన దూదితో మగ్గంపైన నూలుతీసి దుస్తులు వారే నేసేవారు.

ఇవన్నీ అమర్చి కష్టపడేసరికి చక్కటి పంట చేతికొచ్చింది. , ఆకుకూరలు , కూరగాయలు వారికి సరిపోగా మిగిలినవి అమ్మటం మొదలుపెట్టారు. సంతలో వస్తుమార్పిడిపద్ధతిలో ఇవి ఇచ్చి తమకు కావలిసిన ఇతర దినుసులు తెచ్చుకునేవారు.

క్రమంగా పండ్ల చెట్లు పెద్దవయి అన్ని సీజన్లలోనూ అన్నిరకాల పండ్లు విరగకాసేవి. వాటిలో కొన్నిటిని ఇరుగుపొరుగు వారికి ఇచ్చేవారు.


ఇలా చుట్టుప్రక్కలవారితో స్నేహంగా ఉంటూ, నెమ్మదిగా నిలదొక్కుకుని అందరికి చేదోడువాదోడుగా ఉండేస్థాయికి వచ్చారు.

పూరి గుడిసె స్థానంలో ఇటుకగోడలతో పెంకుటిల్లు ఏర్పాటుచేసుకున్నారు. అలా రెండుఎకరాలు అయిదుఎకరాలకు పెంచుకున్నారు.

అలా అలా సంపద ఇంకొంచెం పెంచుకుని ఇక చాలు అని తృప్తిపడి , అనవసరమైన వస్తువులకోసం వెంపర్లాడకుండా ఉన్నదాంట్లోనే పొదుపుగా తృప్తిగా జీవిస్తున్నారు.


ఏదో నాకు తోచింది రాసాను. ఇదంతా చదివి చాలామంది నవ్వుతారేమో.

మన పాతకాలంలో ఇలాగే జీవించి ..... సుఖంగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే తప్పేమీలేదు.


పురుగుమందులు త్రాగి ప్రాణాలు తీసుకునేకంటే ప్రకృతి ఒడిలో పచ్చగా బ్రతకటం మేలు కదూ....

మీకు ఎవరైనా కష్టాల్లో ఉన్న రైతులు కనిపిస్తే ఈ కధ చెబుతారు కదూ.!..................
...

Friday, February 18, 2011

భగవంతు డిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది.

శ్రీ రామకృష్ణపరమహంస వారికి శ్రీ శారదా మాతకు, శ్రీ వివేకానందుల వారికి ప్రణామములు.

శ్రీ శిరిడి సాయిబాబాకు ప్రణామములు.


ఈ క్రింద వ్రాసిన సంఘటనలు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము నుంచి తీసుకున్నవండి.


దాము అన్నా ( దామోదర్ సావల్ రామ్ రాసనె ) అనబడు సాయి భక్తుడు ఉండేవారు.

దాము అన్నా జట్టి వ్యాపారములు 1. ప్రత్తి.

బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు , ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్తుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను.

దాము అన్నా యాబేరమును చేయుటయా ? మానుటయా ? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము వ్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను.

ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచారమేమనెను ? శ్యామా అహమద్ నగర్ నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను.

బాబా యిట్లనెను. " ఏమి వ్రాయుచున్నాడు ? ఏమి యెత్తు వేయుచున్నాడు ? భగవంతు డిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము ."

బాబా చెప్పినదే ఆ యుత్తరములో గల సమాచారమని , శ్యామా " దేవా ! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులు లగుటతో, వారినిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు ?" అనెను.

బాబా యిట్లనియె; " ఓ శ్యామా ! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు ?"

అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. " సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము."


శ్యామా జవాబును పంపెను. దానికొర కాతురతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాశ యైనదనుకొనెను.

కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా శిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను.

అందుచే శిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను.

బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను.

బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు.

బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృధ్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తులు భవిష్యత్ వర్తమానములు లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు.


దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. " ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు. " బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము

పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ యాలోచన కూడ బాబా గ్రహించి యిట్లనెను. " నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను " మనెను.


కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను.


ప్రత్తి జట్టీ వ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను.


బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని , దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను.

బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు......

Wednesday, February 16, 2011

అన్నదాత ఆవేదన .......... కారాదు అరణ్య రోదన...............


రైతులు రెక్కలుముక్కలు చేసుకుని పంటలు పండిస్తారు. ఇతరులు ఆ పంటను తక్కువధరకు కొని తెలివిగా ఆ సరుకులతో వ్యాపారం చేసుకుని తమ బ్రతుకులను పండించుకుంటున్నారు.

పంట పండించిన రైతు మాత్రం గిట్టుబాటు ధర చాలక పురుగుల మందులు తాగి తమ బ్రతుకులను బ్రద్దలు చేసుకుంటున్నారు.


అతివృష్టి..........అనావృష్టి మధ్య నలిగి కొన్ని నెలలు కష్టపడి ఒళ్ళుహూనం చేసుకుని రైతులు పంటలు పండిస్తే.................1.కిలో టమేటో,, 1..కిలో పొటేటో రెండు రూపాయలకు ఇస్తావా ? ఒక రూపాయకు ఇస్తావా ? అని అడుగుతారు అందరూ............

అదే టమేటోలను ఒక రూపాయ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొని ........... వాటికి కొన్ని ఇతర దినుసులు కలిపి టమేటో సాసులు, కెచప్ లు, ఆలూ చిప్స్ తయారుచేసి అందమైన పాకెట్స్ లో పెట్టి వ్యాపారస్తులు సంవత్సరం పొడుగూతా అమ్మితే ........పెదవికదపకుండా వారు చెప్పిన రేటుకు 20.......30 రూపాయలు పెట్టి కొంటారు అందరూ.............


ఇతర ఆహారపదార్ధాలు కూడా వండినవి చాలా రేట్లుంటాయి. తాను పండించిన పంటకు తనకు ఇష్టమయిన రేటును నిర్ణయించుకునే హక్కు రైతుకు లేదు.

ఆ పంటలతో చేసిన పదార్ధాలను మాత్రం ఎంతైనా రేటు నిర్ణయించుకుని అమ్ముకునే హక్కు మాత్రం వ్యాపారస్తులకు ఉంది. అన్నీ ఆహారపదార్ధాలే. కానీ తేడా ఎక్కడుంది ?ఇదెక్కడి న్యాయం ?


మనము ఏదైనా పెద్ద షాపుకు వెళ్తాము. అక్కడ బేరం అడగటానికి అవకాశం ఉండదు. వారు చెప్పిన రేటుకు కొనవలసిందే. అదే రైతుల విషయంలో వేరే న్యాయం ఎందుకు ?........

కొంతమంది ఉద్యోగస్తులకు నెలకు 40 వేలరూపాయల ఆదాయం వస్తే కొందరు చిన్న రైతులకు సంవత్సరానికి 40 వేల ఆదాయం రావటమే కష్టం..


ఒక్క ఆహార రంగమే కాదు ........ పరోక్షంగా ఈ రైతులు పండించిన ఉత్పత్తుల పై ఆధారపడి ఎందరో బ్రతుకుతున్నారు..


ఇంకా ,.కొందరు వ్యాపారస్తులు సరుకులు దాచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తారు. వేసవిలో టమేటో 40 రూపాయలు ఉన్నప్పుడు కూడా రైతుకు అతి తక్కువ ధర చెల్లించి వినియోగదారుల వద్ద ఎక్కువ ధర తీసుకుంటారు. అటు రైతు.............ఇటు వినియోగదారులు ఇద్దరికీ నష్టం.


పూర్వం ఎక్కువమంది వ్యాపారస్తులు ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. వారికి పాపభయం ఉండేది. ఇప్పుడు అత్యాశతో ఎక్కువ లాభాలకు ఆశపడుతున్నారు.

రైతుల పంటకు తగ్గ న్యాయమయిన గిట్టుబాటు ధర చెల్లించి .......మధ్య దళారులు, వ్యాపారస్తులు న్యాయమయిన లాభాన్ని మాత్రమే తీసుకుంటూ ...........ఆ వస్తువులు వినియోగదారులకు అందిస్తే రైతు.......వ్యాపారి ........వినియోగదారులు అందరికీ న్యాయం జరుగుతుంది......... అదే ధర్మబద్ధమైన వ్యాపారం.
.ఇంకా..........
1. రైతులకు తమ పంటను ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించాలి.

2.రైతులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటానికి సోలార్ డ్రైయ్యర్లు అందించాలి.

3. తగినన్ని గిడ్డంగులను నిర్మించాలి.

4. ఈ దేశప్రజల సొమ్మును ఎందరో తింటున్నారు. అందరికీ ఆహారాన్ని అందించే అన్నదాతకు తన పంటకు ధరను నిర్ణయించుకునే హక్కును కల్పిస్తే ........ తద్వారా .అన్నదాత కుటుంబాలు బాగుపడితే దేశానికి లాభమే కానీ నష్టమేమీ లేదు.


ప్రపంచంలో తెలివి, కలిమి, బలిమి ఉన్నవాళ్ళు అమాయకులను అన్యాయం చేస్తున్నారు. భగవంతుడు మనకు తెలివిని, బలాన్ని ఇచ్చింది ............మనము బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతకనివ్వాలని.అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆనందంగా ఉండాలని కోరుకుందాము.............

రైతులకు వద్ద పంటను కొనేటప్పుడు గీచిగీచి బేరమాడకుండా సరి అయిన ధర ఇచ్చి కొంటే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆ పుణ్యంవల్ల వ్యాపారస్తుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి.........................

Monday, February 14, 2011

చేనేత నేతన్నల వెతలు తీరేదెన్నడు ?


మానవులకు దుస్తులు ధరించటం అవసరమని దైవం" ప్రత్తి".మొక్కను సృష్టించటం జరిగింది. ఈ దూదితో దీపాలు కూడా వెలిగించుకోవచ్చు.


పాతకాలంలో ఎక్కువగా నూలుదుస్తులే ధరించేవారు. అవి చెమటను చక్కగా పీల్చుకుంటాయి. సహజమైన చల్లదనాన్ని కలిగిస్తాయి.

* పాలియెస్టర్ దుస్తులవలె కొందరికి ఎలర్జీలను కలిగించవు.

ఈ రోజుల్లో కంప్యూటర్ సహాయంతో క్రొత్త డిజైన్స్ కనుక్కోవటం, యంత్రాలపైన దుస్తులను విరివిగా తయారుచెయ్యటం వచ్చాక సాంప్రదాయ చేనేత మగ్గాల వారి పరిస్తితి దయనీయంగా తయారయింది.

యంత్రాలతో పోటీకి తట్టుకోలేక వారు వెనుకబడిపోతున్నారు. కుటుంబానికి జరుగుబాటు లేక నేతన్నలు ఎందరో ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది.


ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. ఆ మధ్యన చెన్నైలో మా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా బంధువుల అబ్బాయి ఒక బనీను లాంటి " టీ షర్ట్ " వేసుకున్నాడు.

ఆ షర్ట్ ధరించి బైటకు వెళ్తోంటే నేను ఉండబట్టలేక ............. అదేమిటి ? బనీను వేసుకుని బైటకు వెళ్తున్నావు.... అని అడిగాను. దానికి తను నన్ను ఒక అజ్ఞానిని చూసినట్లు చూసి వివరాలు చెప్పాడు.

ఆ షర్ట్ ఒక పేరున్న పెద్ద కంపెనీ తయారు చేసినదట. ఆ షర్ట్ కు ఒక మూల బ్రాండ్ పేరు చూపించాడు. దాని రేటు విని నేను నోరెళ్ళబెట్టాను. 2000 రూపాయలు పోసి కొన్నాడట. అది చూడటానికి అంత ఖరీదులా అనిపించటంలేదు అనుకుని.... ఇక చేసేదేమీలేక నేను నోరు మూసుకున్నాను.


మనం పెద్దపెద్ద షాప్స్ కు వెళ్ళి కాటన్ చీరలు, షర్ట్స్ అవి వేల రూపాయలు ఖరీదుచేసి కొంటాము. అదే చేనేతదుస్తులు నేసే షాప్స్ కు వెళితే మాత్రం........... గీచిగీచి బేరం ఆడి ఇష్టమయితే కొంటాము లేకపోతే లేదు.

వారికి జరుగుబాటు లేక తక్కువరేటుకు ఇచ్చేస్తారులే అన్న ధీమా. వారికి ఫ్యాషన్ టెక్నాలజీలు, మార్కెటింగులు తెలియవుగదా మరి.....


ఈ చేనేతల వారు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరూ కలిసి సంఘాలుగా ఏర్పడి క్రొత్త డిజైన్స్ తెలుసుకుని , మార్కెట్ మెళకువలు నేర్చుకుంటూ జీవితాలు బాగుచేసుకోవాలి. ఇది చెప్పినంత తేలికకాదులెండి.


ప్రభుత్వపరంగా కూడా జౌళి పార్కుల పధకాలు, సమగ్ర చేనేత అభివృద్ధి పధకం, నేత బజార్లు, సహకారసంఘాలు ఇలా ఎన్నో పధకాలు ఉన్నాయంట. సమస్యల్లా........అవి సమర్ధవంతంగా అమలుకు నోచుకోలేకపోవటం.


చేనేత నేతన్నల వెతలు తీరాలంటే ప్రజలు కూడా తమ వంతు సహకరించాలి. తమిళనాడులో కాలేజీ విద్యార్ధినులు కూడా వారంలో ఒక రోజు విధిగా చేనేతదుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నారు.


బ్రాండెడ్ దుస్తులంటే ఎంత మోజున్నా చేనేతసహకారసంఘాలవాళ్ళు తయారుచేసిన దుస్తులను కూడా కొంటూ ప్రజలు వారికి తోడ్పాటుని అందించాలి. ఊరికే వారిని చూసి బాధపడికన్నీరు కార్చటం వల్ల ఏం లాభం ?


ఫాషన్ టెక్నాలజీ నేర్చుకున్న యువత, ఇంకా మార్కెటింగ్ వ్యవహారాలు తెలిసిన యువత ఈ చేనేత నేతన్నలకు తమ సలహాలను అందించాలి.


ఈ బడా వ్యాపారప్రపంచంలో బడుగులు కూడా బ్రతకాలంటే ఒక్క ప్రభుత్వం వల్లేకాదు.......అందరూ తలొకచెయ్యీ వేసి తమవంతు సాయం తాము చేస్తేనే మన ప్రాచీన చేనేత కళ అంతరించకుండా ఉంటుంది........ ....

Saturday, February 12, 2011

ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను వీలయినంతవరకూ తగ్గించటం...........


ప్లాస్టిక్ కవర్స్ ను వాడి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడవేయటం వల్ల అవి గాలికి కొట్టుకుపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. అవి శిధిలం అవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందట.

ఇంకా, ఈ మధ్య ముంబయి లాంటి ఊర్లలో వరదలు వచ్చి రోడ్లు మునిగిపోవటానికి ......... ఇలా నీళ్ళు పోకుండా ప్లాస్టిక్ కవర్స్ అడ్డంపడి డ్రైనేజీలు బ్లాక్ అవ్వటమే కారణమంటున్నారు.


* ఇంకా, మనం తినగా మిగిలిన ఆహారపదార్ధాలు ప్లాస్టిక్ కవర్స్ లో కట్టి పారవెయ్యటంవల్ల జంతువులు ఆహారంకోసం ............. ఆ కవర్స్ ను మ్రిగటంవల్ల .............. అవి చనిపోతున్నాయట.

ఇలాంటి వాటిని వీలయినంతవరకు తగ్గించుకోవాలి.

* ప్లాస్టిక్ కవర్స్ ను పారవేయటానికి ప్రభుత్వం రోడ్ల ప్రక్కన ప్లాస్టిక్ కవర్లను మాత్రమే పారవేయటానికి ప్రత్యేకంగా చెత్తకుండీలను ఏర్పాటు చెయ్యాలి.


ప్లాస్టిక్ సంబంధిత వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ విసిరెయ్యకుండా వాటిల్లో మాత్రమే పారవేయాలి. దీనికి ప్రజలు అలవాటుపడాలి.

* ఇలా చెయ్యటం వల్ల ఈ కవర్స్ గాలికి ఎగిరిపోకుండా ఉండి ............... రీసైక్లింగ్ కి సేకరించటం సులభంగా ఉంటుంది. మట్టిక్రింద కప్పబడితే తీయటం కష్టం కదా.........


* ఇక కొందరు షాప్స్ వాళ్ళు వస్తువులను ప్లాస్టిక్ కవర్స్ లోనే పాక్ చేస్తారు. మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే ..............ఇలా వచ్చిన కవర్స్ ను ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్లో వేస్తూంటాము. నెలకొకసారి దాన్ని అలాగే క్లోస్ చేసి బైట పడ వేస్తాము.


ఇంట్లో కూడా ఒక మూల ఒక డస్ట్ బిన్ అమర్చుకుని బిస్కట్, వేఫర్ పైన వచ్చే కవర్స్ ను ఆ డస్ట్ బిన్లో వేసేలా పిల్లలకు అలవాటు చెయ్యాలి. ( 25 రూపాయలతో నెట్టెడ్ బాస్కెట్స్ అమ్ముతున్నారు విడిచిన బట్టలు వెయ్యటానికి..........ఇలాటి బాస్కెట్ ) .

పాల కవర్స్ కడిగి ఎండలో పెట్టాలి.

* ఇక హోటల్ నుండి టిఫిన్స్, భోజనం పార్సిల్ తెచ్చుకోవటానికి రెండు స్టీలు కారియర్లు కొనుక్కుంటే సరిపోతుంది.


* పాతకాలంలో ఇడ్లీలు, దోసెలు........... అరటి ఆకులు, తామరాకులు, మర్రి ఆకులు ఇలాంటి వాటిలో పెట్టి పేపర్ తో పొట్లం కట్టేవారు. సాంబారుకు చిన్న డబ్బాలు తీసుకెళ్ళేవారు. ఆ వేడి ఇడ్లీ అరటి ఆకులో కట్టడం వల్ల ,ఆ వేడికి ఆకు మగ్గి ......... పొట్లం అంతదూరంలో ఉండగానే కమ్మటి సువాసన వచ్చేది.


* ఇప్పుడు వేడి సాంబారును ,వేడి కూరలను ప్లాస్టిక్ కవర్స్ లో కడుతున్నారు. ఆ వేడికి కవర్ నెమ్మదిగా కరిగి మన పొట్టలో ప్లాస్టిక్ పేరుకుపోయి పేగులకు పట్టేస్తుంది.


ఇక బైట తయారుచేసే ఆహారపదార్ధాలు తినకూడదంటే ఈ రోజుల్లో వినేవారు చాలా తక్కువ. కదా..................


ఇప్పుడు కొన్ని ఊర్లలో ప్లాస్టిక్ ను నిషేధించి విజయవంతమయినట్లు వార్తలు వస్తున్నాయి.
అక్కడి అధికారులు ఈ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరించారట.. . అక్కడి ప్రజలు కూడా మొదలు ఇబ్బంది పడినా నెమ్మదిగా పాతకాలంలా చేతిసంచులు తీసుకువెళ్ళటానికి అలవాటుపడటం శుభపరిణామం .


ఇంకా , మందపు పేపర్ సంచులు వాడుకోవచ్చు. లోపల దారాలతో గట్టిగా ఉండే పేపర్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా వాడవచ్చు.


మిగిలిపోయిన ఆహారపదార్ధాలు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా మందపాటి కాగితపు కవర్లలో వేసి బయట పడవెయ్యాలి. దానివల్ల జంతువులకు హాని ఉండదు..


* ఇలా నెమ్మదిగా ప్లాస్టిక్ ను పూర్తిగా వాడటం మానివెయ్యాలి.ఎప్పటికయినా ప్లాస్టిక్ ను వాడటం పూర్తిగా మానేయాలి. మనం వాడి పారేసిన వస్తువులు రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ వాడటం తలుచుకుంటేనే వాంతి వస్తోంది...


* ఒకవేళ శాస్త్రవేత్తలు తామరాకును పోలిన పదార్ధాన్ని కనిపెట్టినా మానవులు కనిపెట్టిన ప్రతి కృత్రిమవస్తువుకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయి. ఎంతయినా ప్రకృతిలో సహజంగా దొరికిన వాటిని వాడుకుంటే అంతా మంచి జరుగుతుంది........

Thursday, February 10, 2011

ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు.

శ్రీ గాయత్రీ మాతకు వందనములు.

ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు.

దైవం కనిపించలేదని ఎవరైనా ఎందుకు బాధపడాలి ? వేలాదిసంవత్సరములనుంచి వెలుగులు విరజిమ్ముతూ జీవులకు ప్రాణాధారమైన సూర్యభగవానుడు దేవుడే కదా..

శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి అమ్మవారు సూర్యమండలమధ్యస్థ అని పెద్దలు చెబుతున్నారు.


రామాయణంలో...........
ఆదిత్యహృదయము యొక్క గొప్పదనమును అగస్త్యుల వారు రామచంద్రుల వారికి వివరించగా వారు సూర్యుని ఆరాధించి ఫలమును పొందారు. భారతంలో.......... ధర్మరాజు సూర్యుని ఆరాధించి ఫలమును పొందారు.


ఈ రోజు రధసప్తమి. సూర్యుని ఆరాధించటం వల్ల మంచి ఆరోగ్యం సిధ్ధిస్తుంది.


భగవంతుని దయవల్ల మాకు పెద్దగా అనారోగ్యాలు రాలేదు. అలాంటిది.......... ఒకసారి రధసప్తమికి కొన్ని రోజులముందు నాకు సడన్ గా నడుం పట్టేసిందండి. విపరీతమైన బాధ.


ఒక పుస్తకంలో చదివానండి. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబునికి కొన్నికారణాలవల్ల కుష్ఠు వ్యాధి సంక్రమించిందట. అప్పుడు వారు 12 శ్లోకములతో సూర్యుని ఆరాధించారట. అప్పుడు వారు ఆరోగ్యవంతులయ్యారట. ఆ శ్లోకములు నేను పుస్తకంలో చదివి వ్రాసుకున్నాను.కష్టాలు వచ్చినప్పుడు మనకి భక్తి బాగా పెరుగుతుందికదా .....
రధసప్తమి రోజున వాటిని ఒక్కసారి చదువుకున్నానండి.


ఆ తరువాత ఆ నొప్పి చాలా విచిత్రంగా ఏ మందూ వాడకుండానే తగ్గిపోయింది. అప్పటినుంచి వీలుకుదిరినంతలో రధసప్తమి రోజున సూర్యుని పూజించటం చేస్తున్నాను.


ఉదయం, సాయంత్రపు లేత ఎండ ఆరోగ్యానికి ఎంతో మంచిదట. మనమేమో వీలయినంత వరకూ సూర్యరశ్మి, చంద్రుని కాంతి తగలకుండా ఏ. సి గదుల్లో జాగ్రత్తగా ఉంటున్నాము. లేకపోతే కిటికీలు, అవి ఎప్పుడూ మూసి ఉంచుతాము.


ఇలా క్రమంగా ప్రకృతికి దూరమవుతూ ఎన్నో కోల్పోతున్నామని అందరూ ఆలోచించాలి.


మనకు ప్రొద్దున్నే నిద్ర లేవాలంటే ఎంతో బధ్ధకంగా ఉంటుంది. కొంచెంసేపు అయ్యాక లేవచ్చులే అనుకుంటాము. మరి సూర్యుడు కూడా ఇలా బధ్ధకించి ఏ మధ్యాహ్నమో ఉదయించాడనుకోండి................. మన పని అంతే.


సూర్యుడు, చంద్రుడు, వీరందరూ క్రమం తప్పకుండా సమయానికి వస్తూ తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. మనం కూడా ఇలా పధ్ధతిగా ఉండటానికి ప్రయత్నించాలి... .
...

Monday, February 7, 2011

మన పెరట్లో కూడా చిన్నపాటి బిగ్ బాంగ్ లాంటి........

శ్రీ ఆంజనేయస్వామికి ప్రణామములు.

మనకు ఒకోసారి చెట్టు ముందా ? విత్తు ముందా ? అని సందేహం వస్తూంటుంది. ఈ రెండింటిని సృష్టించిన ఆ దైవశక్తి ముందని పెద్దలు చెబుతున్నారు. చెట్టులోనూ, విత్తులోనూ కూడా చైతన్య రూపంలో ఆ శక్తి ఉండటం జరుగుతుంది.

ఒకప్పుడు పెద్ద విస్ఫోటనం జరిగి దాన్నించి గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడ్డాయని అంటున్నారు కదా .....

అంటే........... ఒకప్పుడు పెద్ద విస్ఫోటనం జరిగి అందులోనుంచి గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాల కాలం గడిచాక ఆ గ్రహాలు, నక్షత్రాలు భూమి మరల నెమ్మదిగా కుంచించుకుపోతూ అతి సూక్ష్మ పరిమాణంలోకి మారిపోతాయట........


ఇలా ప్రళయం జరిగి కొంత కాలం గడిచాక దైవం మరల పునఃసృష్టిని సంకల్పించిన తరువాత భూమి అవి మరల తిరిగి ఆవిర్భవిస్తాయట. .......


ఇలాగే మన పెరట్లో కూడా ఇలాంటి పోలికలు గల విశేషాన్ని గమనించవచ్చు. ఉదా.......కొన్ని చెట్ల ఎండిన ఫలాలలో ఎన్నో విత్తనాలు ఉంటాయి. ఆ ఎండిన కాయ విస్ఫోటనం చెంది ఆ బీజాలు అంతా వెదజల్లబడి కొంతకాలానికి అవి మొలకెత్తి అందులోనించి మొక్క వస్తుంది. అది క్రమంగా పెరిగి కొమ్మలు, అలా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. కొన్నాళ్ళకు ఎండిపోతుంది.


దాన్నించి వచ్చిన ఫలాలు నెమ్మదిగా కుంచించుకుపోయి అంటే ఎండి చిన్నగా అయిపోతాయి.


కొంతకాలానికి ఆ ఎండిన ఫలం పగిలి మళ్ళీ మళ్ళీ మొక్క రావటం ఇలా నిరంతరంగా జరుగుతుంది.


అసలు అంత చిన్న విత్తనమ్నుంచి ............. పెద్ద చెట్టు కొమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరించటం ఇదంతా భలే ఆశ్చర్యంగా ఉంటుందండి.

అంత పెద్ద చెట్టు అంత చిన్న విత్తనంలో దాగుంటుంది . ఇది చాలా ఆశ్చర్యం కదండీ. అంతా దేవుని లీల...................

ఇందులో ఎన్ని తప్పులున్నాయో తెలియదు తోచింది రాశాను . దయచేసి భగవంతుడు క్షమించాలని కోరుకుంటూ.........
....

Friday, February 4, 2011

ఆనందనిలయవాసుని దర్శనం కొరకు.......


శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కొరకు ఎందరో భక్తులు తిరుమల వెళ్తుంటారు. చాలా రద్దీగా ఉంటుంది కదా ఎప్పుడూ.


ఈ మధ్య మాకు తెలిసినవారు ఇలా చెప్పారు........వారి బంధువులు తిరుమల వెళ్తే ఎంత రద్దీగా ఉందంటే .......గర్భగుడి వద్దకు వచ్చేసరికి వారి ప్రమేయం లేకుండానే నడవబడి (ఆ రద్దీవల్ల ) ఇంకా మూలవిరాట్టుని చూస్తాంచూస్తాం అనుకునేంతలో ......... తేరుకుని చూసేసరికి వారు వకుళాదేవి గుడికి కొద్ది దూరంలో తేలేరట......... గర్భగుడిలోని మూర్తిని చూడనేలేదంట............. ఇది వినటానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ...అక్కడ రద్దీ అలాగే ఉంటుంది లెండి..కొంతకాలం క్రితం మేము తిరుమల వెళ్ళామండి. పూజకు ముందే రిజర్వ్ చేయించుకున్నాము. ఆ పూజ పేరు సరిగ్గా గుర్తు లేదండి .ఆ............అదీ ........... సూర్యోదయానికి ముందే జరుగుతుంది పూజ ......... అర్చనా లేక అర్చనానంతరసేవనా అన్నది ఇప్పుడు సరిగ్గా గుర్తు రావటం లేదండి.


అయితే పూజ జరిగినంత వరకు చాలా సమయం భక్తులందరినీ మూలవిరాట్టు ముందు కూర్చోబెట్టారు. తనివితీరా దేవుని చూసే అవకాశం ..........అయితే అంతసేపు భగవంతుని ముందు కూర్చున్నాను కదా........... నా దృష్టి కొంతసేపు భగవంతుని పైనా......... కొంతసేపు చుట్టూ ఉన్న భక్తులను ,వారి కబుర్లను వినటం , పరిసరాలను గమనించటం . ఇదన్నమాట .రద్దీగా ఉన్నప్పుడు దేవుడు ఒక్క క్షణం కనిపిస్తే చాలని తాపత్రయపడినవాళ్ళమే........ తీరిగ్గా క్రింద కూర్చుని చూసే అవకాశం వచ్చేసరికి ఇక దేవుని చూడటం తక్కువా ........... .పరిసరాలను గమనించటం ఎక్కువగా అన్నట్లు అయింది నా పరిస్థితి.


అయితే అందరూ నాలానే ఉండరులెండి. భక్తిభావం ఎక్కువగా ఉండేవారు చాలామందే ఉంటారు. అందుకే భగవంతుడు అందరికీ ఎప్పుడుపడితే అప్పుడు దర్శనం ఇవ్వరు అనిపించింది.


సరే.........ఈ పూజకు చాలా డిమాండ్ ఉంది. కొన్ని నెలలకు ముందే రిజర్వ్ చేసుకోవాలి. రిజర్వ్ చేసుకున్నా ......... ఒకోసారి అనుకోని ఆటంకాలు వచ్చి వారు వెళ్ళకపోతే ........ ఆ టిక్కెట్స్ ఇతరులు వాడుకునే సదుపాయం ఉన్నట్లుంది. అయితే భగవంతుని దయవల్ల ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా దర్శనం చేసుకువచ్చాము.


ఓసారి మేము చెన్నైలో ఉన్నప్పుడు తిరుమల వెళ్ళాము. అప్పుడు ఏవో కారణాలవల్ల భక్తులు పెద్దగాలేరు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే..........తిరుమల భక్తులతో రద్దీగా ఉంటే కొందరు ఇబ్బందులు పడినా .......... అక్కడ భక్తులు నిండుగా ఉంటేనే కళకళలాడుతూ బాగుంటుంది అనిపించిందండి.. .
......


ఇంకో విషయమండి , ఈ తెల్లవారుఝామున పెద్దగా భక్తుల రద్దీ ఉండదు కదా ! తిరుమల వచ్చే వి.ఐ.పి లను ఈ సమయంలో మాత్రమే దర్శనం చేయిస్తే రోజంతా సామాన్యభక్తులకు ఇబ్బంది ఉండదు కదా ......అని అనిపించిందండి. ఆ సమయంలో దర్శనం వల్ల వారికీ మంచిదే....

Wednesday, February 2, 2011

.ఫ్లోరైడ్ నీటికి ఆయుర్వేద చిట్కా..........*ఇవన్నీ కుదరనప్పుడు కుటుంబానికి ఒక వాటర్ ఫిల్టర్ని ఉచితంగా పంపిణీ చేస్తే..........

చాలా ప్రాంతాలలో ఫ్లోరైడ్ నీరు త్రాగటం వల్ల ప్రజలకు చాలా రకాల జబ్బులు రావటం చూస్తున్నాము. మనం త్రాగటానికి, వంటలో వాడుకోవటానికి కావలసిన రెండు, మూడు బిందెల నీటిని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది.

దీనికి ఈ మధ్యన టి.విలో ఆయుర్వేదం వైద్యులు చెప్పిన చిట్కా రాయాలనిపించిందండి.

ముందు నీటిని కాచాలి.............
ఆ నీరు చల్లారాక పై నీళ్ళను జాగ్రత్తగా వంచుకోవాలి............
చిల్లగింజలు ( తెల్లని చిన్న గింజలు ) రాయి మీద అరగదీసి గంధము తీయాలి. .............
ఈ గంధమును ఒక బకెట్టుకు 2, 3 గింజల గంధమును కలుపుకోవాలి. ...........
ఈ గంధముతో పాటు అతి మధురం వేరు ముక్క కూడా ఆ నీళ్ళలో వేస్తే నీరు శుభ్రపడుతుంది.............


ఇలా చెప్పారండి వారు.

ఈ రోజుల్లో చాలామంది వాటర్ కాన్స్ పెద్దవి తెప్పించుకుంటున్నారులెండి. అలా తెప్పించుకోనివారు లేక ఆ కెమికల్స్ ఇష్టంలేనివారు ఇలా వాడుకోవచ్చు. పాతకాలంలో ఇలాంటి విధానాలతోనే నీటిని శుభ్రపరుచుకొనేవారు. ఈ ఫ్లోరైడ్ బాధితులను చూస్తే చాలా బాధగా ఉంటుంది.


స్నానానికి, ఇతర అవసరాలకు వాడే నీరు పెద్దమొత్తంలో శుభ్రం చేసుకోవటం కష్టమేకానీ............. ఈ జబ్బులు ఆ నీటిని............ త్రాగటం వల్లే వస్తాయి కాబట్టి......... రోజూ త్రాగే ఒకటి, రెండు బిందెల నీటిని ఇలా శుభ్రపరుచుకుని త్రాగితే రోగాలబారినుండి తప్పించుకోవచ్చు.


నేను ఒక దగ్గర చదివానండి సరిగ్గా గుర్తు లేదుగానీ, కొన్ని ములక్కాయ ఎండిన గింజలను నీళ్ళలో వేసినా నీరు శుభ్రపడుతుందట. ఇది మరింత సులభం.


ఇంకా ఇలాంటి చిట్కాలు ఆయుర్వేద వైద్యులైతే వివరంగా చెప్పగలరు.....

అయితే ఇవన్నీ చేసే ఓపిక అందరికీ ఉండదుకదా ! ఏదైనా ఒక చిటికెడు పొడి ( లేదా టాబ్లెట్ రూపంలో ) నీళ్ళలో కలపటం ద్వారా నీరు శుద్ధి అయ్యే విధానం ఉంటే బాగుంటుందండి.


ఇలాంటి ఆయుర్వేద చిట్కా పురాతన ఆయుర్వేద గ్రంధాలలో ఉన్నదేమో వైద్యులు కనుక్కుంటే బాగుండు. ములక్కాయల ఎండిన గింజలు నీటిని శుద్ధి చేస్తాయన్నది నిజమయితే అలాంటివి కూడా ఈజీనే. కొందరు పటిక కూడా వాడుతారు.


ఇలా ఈజీగా నీటిని శుద్ధి చేసే చిట్కా గనక ఉంటే ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తల ద్వారా పరిచయం చేయవచ్చు. అయితే ఇందులో నకిలీలు ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి.పాత రోజుల్లో నీటిలో ఇంత కాలుష్యం చేరేది కాదు. ఇప్పుడు రసాయనాలతో కలిసిన పారిశ్రామిక వ్యర్ధాలు ఇవన్నీ నదులలో ,ఇంకా కాలువలలో
కలుస్తుండటం వల్ల నీటిని శుద్ధి చేయటం కష్టమైన పనే. ..........


* కానీ కనీసం ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాలలో అయినా కుటుంబానికి రోజుకి రెండు బిందెల శుభ్రమయిన నీరు త్రాగటానికి, వంటలో వాడటానికి అందించగలిగితే ఈ ఫ్లోరైడ్ వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి,.....

*ఇవన్నీ కుదరనప్పుడు కుటుంబానికి ఒక వాటర్ ఫిల్టర్ని ఉచితంగా పంపిణీ చేస్తే మరీ మంచిది....

ఇలా ఫిల్టర్స్ ఇచ్చి ఊరుకోకూడదు. వాటికి అప్పుడప్పుడూ లోపల భాగాలు మార్చుకోవలసి ఉంటుంది. వాటిని కూడా పంపిణీ చేస్తూ ఉంటేనే మంచిఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఖరీదు ఉండవు. పేదవారు ఇవన్నీ సరిగ్గా ఉపయోగించేలా వారికి నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇవన్నీ అమలుపరచవచ్చు.


ఇదంతా అయ్యేపనేనా అని కొందరు సందేహపడతారు. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. ఫ్లోరైడ్ నీరువల్ల భయంకరమైన జబ్బులు వచ్చి ఇబ్బందులు పడేకంటే ముందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రభుత్వానికి కూడా ......... ప్రజలకు అనారోగ్యం వచ్చిన తరువాత పెట్టే ఖర్చు కన్నా ఈ ఖర్చు తక్కువే అవుతుంది. .