శ్రీ గాయత్రీ మాతకు వందనములు.
ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు.
దైవం కనిపించలేదని ఎవరైనా ఎందుకు బాధపడాలి ? వేలాదిసంవత్సరములనుంచి వెలుగులు విరజిమ్ముతూ జీవులకు ప్రాణాధారమైన సూర్యభగవానుడు దేవుడే కదా..
శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి అమ్మవారు సూర్యమండలమధ్యస్థ అని పెద్దలు చెబుతున్నారు.
రామాయణంలో........... ఆదిత్యహృదయము యొక్క గొప్పదనమును అగస్త్యుల వారు రామచంద్రుల వారికి వివరించగా వారు సూర్యుని ఆరాధించి ఫలమును పొందారు. భారతంలో.......... ధర్మరాజు సూర్యుని ఆరాధించి ఫలమును పొందారు.
ఈ రోజు రధసప్తమి. సూర్యుని ఆరాధించటం వల్ల మంచి ఆరోగ్యం సిధ్ధిస్తుంది.
భగవంతుని దయవల్ల మాకు పెద్దగా అనారోగ్యాలు రాలేదు. అలాంటిది.......... ఒకసారి రధసప్తమికి కొన్ని రోజులముందు నాకు సడన్ గా నడుం పట్టేసిందండి. విపరీతమైన బాధ.
ఒక పుస్తకంలో చదివానండి. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబునికి కొన్నికారణాలవల్ల కుష్ఠు వ్యాధి సంక్రమించిందట. అప్పుడు వారు 12 శ్లోకములతో సూర్యుని ఆరాధించారట. అప్పుడు వారు ఆరోగ్యవంతులయ్యారట. ఆ శ్లోకములు నేను పుస్తకంలో చదివి వ్రాసుకున్నాను.
కష్టాలు వచ్చినప్పుడు మనకి భక్తి బాగా పెరుగుతుందికదా ..... రధసప్తమి రోజున వాటిని ఒక్కసారి చదువుకున్నానండి.
ఆ తరువాత ఆ నొప్పి చాలా విచిత్రంగా ఏ మందూ వాడకుండానే తగ్గిపోయింది. అప్పటినుంచి వీలుకుదిరినంతలో రధసప్తమి రోజున సూర్యుని పూజించటం చేస్తున్నాను.
ఉదయం, సాయంత్రపు లేత ఎండ ఆరోగ్యానికి ఎంతో మంచిదట. మనమేమో వీలయినంత వరకూ సూర్యరశ్మి, చంద్రుని కాంతి తగలకుండా ఏ. సి గదుల్లో జాగ్రత్తగా ఉంటున్నాము. లేకపోతే కిటికీలు, అవి ఎప్పుడూ మూసి ఉంచుతాము.
ఇలా క్రమంగా ప్రకృతికి దూరమవుతూ ఎన్నో కోల్పోతున్నామని అందరూ ఆలోచించాలి.
మనకు ప్రొద్దున్నే నిద్ర లేవాలంటే ఎంతో బధ్ధకంగా ఉంటుంది. కొంచెంసేపు అయ్యాక లేవచ్చులే అనుకుంటాము. మరి సూర్యుడు కూడా ఇలా బధ్ధకించి ఏ మధ్యాహ్నమో ఉదయించాడనుకోండి... మన పని అంతే.
సూర్యుడు, చంద్రుడు, వీరందరూ క్రమం తప్పకుండా సమయానికి వస్తూ తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. మనం కూడా ఇలా పధ్ధతిగా ఉండటానికి ప్రయత్నించాలి.
మీ పోస్ట్ చదివిన తరువాత ఇప్పుడే ఉదయం కిటికీ లో నుండి చూశాను.
ReplyDeleteతెల్లటి మంచు(స్నో) రాసులు వాటిమీద ధగధగ మెరుస్తున్న బంగారు సూర్య కాంతులు. ఇంటావిడ "రధసప్తమి" పాలతో పొంగలి చేస్తోంది. జిల్లేడు ఆకులతో స్నానం చేసే వాళ్ళుట కానీ ఇక్కడ కుదరదు. మీ పోస్ట్ వీటన్నిటికీ అందం చేకూర్చింది.
ధన్యవాదములండి. మీకు మేడంకు మీ కుటుంబసభ్యులకు మరియు అందరికి రధసప్తమి శుభాకాంక్షలండి.
ReplyDelete