koodali

Friday, October 20, 2017

కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా వత్తిళ్ళ మధ్య ....

మాకు తెలిసిన ఒకామెకు తన కొడుకు విదేశాలకు వెళ్లాలని ఎంతో కోరిక. 

అయితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లటం అసలే ఇష్టం లేదు. ఆ తల్లి నాతో ఏమన్నదంటే, పక్కింటి వాళ్ల అమ్మాయి విదేశాలకు వెళ్లి చదువుకుని, ఉద్యోగంలో చేరి తల్లితండ్రికి బోలెడు డబ్బు పంపిస్తుందట. ఆ డబ్బుతోనే ఇక్కడ వాళ్లు పెద్ద బిల్డింగ్ కట్టారనీ, ఇంకా బోలెడు నగలు కొన్నారని చెప్పింది. 


ఆ అమ్మాయి తల్లి వేసుకు తిరిగే నగలన్నీ కూతురు విదేశాల నుంచి పంపిన సొమ్ముతో కొన్నవేనట. 


ఇవన్నీ చెప్పి, తన కొడుకు వెళ్ళటం లేదంటూ చెప్పి వాపోయింది.నేను ఏమన్నానంటే, ఇప్పుడు విదేశాల్లో కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరకటం లేదు, అయినా అక్కడ వస్తువులు ధరలు ఎక్కువగా  ఉంటాయి.ఇండియాలో  రేట్లు  తక్కువ.
 విదేశాలలో నెలకు మూడు లక్షలు ఆదాయం వచ్చినా, ఇండియాలో నెలకు ఒక లక్ష ఆదాయం వచ్చినా ఒకటే. అని చెప్పాను.


విదేశాలలో కొందరు పిల్లలు పడుతున్న కష్టాల గురించి కూడా వార్తలు వచ్చాయి ..


 విదేశాల్లో ఈ మధ్య పరిస్థితి అంత బాగోలేదు కదా! అని చెప్పినా ఆమె అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు.  ఎంతసేపూ..విదేశాలకు వెళ్తే బోలెడు డబ్బు సంపాదించవచ్చు కదా! అంటుంది. 


మొత్తానికి ఏం చెప్పారో కానీ, ఆమె కొడుకు విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకున్నాడట. వెళ్ళటానికి ముందు విదేశీ భాష నేర్చుకుంటే అవకాశాలు బాగుంటాయంటూ, ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పూర్తయిన అబ్బాయిని విదేశీభాష నేర్చుకోవటం కొరకు వేరే ఊర్లో చేర్పించారు.విదేశాల్లో చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్దపడాలి. 
ఒకవేళ ఏదైనా  సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఇంకో సంవత్సరం చదవాలంటే మరింత డబ్బు ఖర్చవుతుంది. 


తరువాత ఉద్యోగం వస్తే ఫరవాలేదు. 
ఉద్యోగం రాకుంటే,  బోలెడు డబ్బు వృధా అయిందంటూ సూటిపోటి మాటలు అంటే పిల్లలు తట్టుకోలేరు.


 అందువల్ల పిల్లలను విదేశాలకు పంపాలనుకునేవారు ముందే అన్నివిషయాలను అర్ధం చేసుకోవాలి. అంతేకాని, 
ఇరుగుపొరుగుతో పోల్చి పిల్లలపై ఒత్తిడి తేవటం సరైనది కాదు. 

***********

అయితే కొందరు పిల్లలేమో పెద్దవాళ్లు వెళ్ళమనకపోయినా , 


విదేశాలకు వెళ్ళటం మాకూ ఇష్టం లేదు  కానీ , ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి , కొంతకాలం విదేశాలకు వెళ్ళి వస్తాం. అని అంటారు.అది వేరే విషయం.  


***************


ఈ రోజుల్లో ఎంత చదివినా ఉద్యోగాలు లభించటం కష్టంగా ఉంది.


 అయితే, ఉద్యోగం లేక ఇంటి పట్టున ఉండే పిల్లల పట్ల కొందరు తల్లితండ్రులు తమకు తెలియకుండానే పిల్లలు బాధపడేలా మాట్లాడతారు. ఇంకా ఉద్యోగం రాలేదు, తిని ఇంట్లో ఖాళీగా కూర్చోకుంటే ఏదైనా పనికోసం గట్టిగా ప్రయత్నించవచ్చు కదా! అంటారు. 


ఇలా అనటం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారని కొందరు తల్లితండ్రి సమర్ధించుకుంటారు. అసలే ఉద్యోగాలు లేక పిల్లలు బాధపడుతుంటే తల్లితండ్రి కూడా అలా ప్రవర్తిస్తే  పిల్లలకు ఏం దిక్కు ?


****** ********


ఈ రోజుల్లో కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా వత్తిళ్ళ మధ్య పెరుగుతున్నారంటే అతిశయోక్తి లేదు.


 ఉదా..ఈ రోజుల్లో చాలామంది  పసిపిల్లలు, తల్లి వద్ద పెరగవలసిన సమయంలో బాటిల్ పాలు త్రాగుతూ ఎక్కువ సమయం బేబీ కేర్ సెంటర్లలో పెరుగుతున్నారు.మాకు తెలిసిన ఒక అమ్మాయి డెలివరి తరువాత నెలలోపే కెరీర్ ముఖ్యం.. అంటూ పసిపాపను పెద్దవాళ్ళ వద్ద వదిలి విదేశాలకు వెళ్ళి జాబ్లో చేరిపోయింది.


 ఆ పెద్దవాళ్లు ఇంటి పనిలో సహాయం కొరకు కొందరు సహాయకులను నియమించుకున్నారు.సహాయకులు రానిరోజున ఇబ్బంది ఉంటుంది. 

*************

ఒకవేళ పెద్దవాళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉంటే పిల్లల్ని  బేబీ కేర్ సెంటర్లలో పెంచుతారు కాబోలు. 


ఏంటో పాపం ఈ రోజుల్లో చాలామంది పిల్లల పరిస్థితి ఇలాగైపోయింది.


*************


పెద్దవాళ్ళను పిల్లలు సరిగ్గా చూడాలంటూ చట్టాలున్నాయి.  


మరి, చిన్నపిల్లలను పెద్దవాళ్ళు  దగ్గరుండి సరిగ్గా చూసుకోవాలంటూ చట్టాలు లేవా?


పెద్దవాళ్ళు తమ హక్కుల గురించి మాట్లాడతారు. 


 బాల్యంలో  తల్లితండ్రి ఆలనాపాలనాతో పెరిగే హక్కు పిల్లలకూ ఉంటుంది కదా! 


తల్లితండ్రి.. కెరీర్ కు, సంపాదనకు  మొదటి ప్రాధాన్యత, పిల్లల పెంపకానికి రెండో ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా.. పిల్లల పెంపకానికి చక్కటి ప్రాధాన్యతనివ్వాలి. 


పిల్లలు అందరూ చక్కగా హాయిగా  ఉండాలి.

కొన్ని సంఘటనలను రాస్తాను. ..

 కొందరు పేరెంట్స్ పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నారనేది నిజం. ఇలా అనటం వల్ల కొందరికి బాధ కలగవచ్చు. 

కొన్ని సంఘటనలను రాస్తాను. 


మా పిల్లల చిన్నతనంలో పేరెంట్స్ మీటింగ్ కు వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. 


ఒక బాబుకు 90 కన్నా కొంచెం ఎక్కువ మార్కులే వచ్చాయి.


 అయితే, 99 శాతం వరకు రాలేదని ఆగ్రహించిన బాబు తల్లి, పిల్లవాడిని అందరిముందు చెంప దెబ్బ కొట్టింది. 


పేరెంట్స్  ఇలా చేయటం సరైనది కాదు. చిన్న పిల్లలకు మార్కుల ప్రాముఖ్యత గురించి ఏం తెలుస్తుంది.


 పిల్లలను మందలించటం,  కొట్టడం  పిల్లల మంచి కొరకే, వారికీ బాధ్యత నేర్పటం కొరకే  .. అని కొందరు పెద్దవాళ్ళు అంటారు. 


పెద్దవాళ్ళను  తిట్టి,  కొడితే తేలిగ్గా తీసుకుంటారా?  


బాధ్యతలు నేర్పటానికి  ఒక పద్ధతి ఉంటుంది. 


అంతేకానీ, పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం సరైనది కాదు.

1.ఉదా.. ఇంట్లో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని భర్త భార్యను మందలించి, ఒక చెంపదెబ్బ కొడితే భార్యకు చాలా బాధ కలుగుతుంది. 


భర్తపై కోపం కూడా వస్తుంది. విషయం మహిళా హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది. 


భార్యను మందలించటం ఆమె మంచికొరకే , ఆమెకు మరింతగా బాధ్యత మరియు పనిలో మెళకువలు  నేర్పటం కోసమే..అని భర్త అంటే ఊరుకుంటారా?


బలహీనులను బలవంతులు అణచివేయకూడదంటూ మాట్లాడతారు.


2.ఉదా.. ఆఫీసులో ఏదైనా పని బాధ్యతగా చేయలేదని మగవారిని పై ఆఫీసర్ మందలించి , చెంపదెబ్బ కొడితే అతనికి చాలా బాధకలుగుతుంది.


 పై ఆఫీసర్ పై కోపం కూడా వస్తుంది. విషయం హక్కుల గురించి మాట్లాడే వరకూ వెళ్ళే అవకాశం కూడా ఉంది.


  ఆఫీసులో మగవారిని మందలించటం అతని మంచికొరకే ,  అతనికి మరింతగా 
బాధ్యత మరియు పనిలో మెళకువలు నేర్పటం కోసమే..అని పై ఆఫీసర్ అంటే ఊరుకుంటారా?

మరి, లోకజ్ఞానం తెలిసిన పెద్దవాళ్లు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోయినా.. గట్టిగా నిలదీసే హక్కు ఎవరికీ లేదంటున్నప్పుడు, 


. లోకజ్ఞానం సరిగ్గా తెలియని పిల్లల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసం? 


బలహీనులను బలవంతులు అణచివేయకూడదన్నప్పుడు,   పిల్లల పట్ల కూడా కఠినంగా ప్రవర్తించకూడదు కదా! 


****************


 మరి కొందరు తల్లితండ్రులు ఎలా ప్రవర్తిస్తారంటే, పిల్లల పట్ల భేదభావాన్ని చూపిస్తారు. 


ఉదా..తల్లికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం , తండ్రికి తన పిల్లలలో ఒకరంటే ఎక్కువ ఇష్టం, మరొకరంటే కొంత తక్కువ ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తారు. 


కొందరు తాతబామ్మలు కూడా పిల్లల పట్ల వ్యత్యాసాలను చూపిస్తుంటారు.


 ఇలాంటి విషయాలు పిల్లలను చాలా బాధకు గురి చేస్తాయి.


 ఒక పిల్ల పుట్టిన తరువాతే నాకు బాగా కలిసివచ్చిందని .. కొందరు పేరెంట్స్ ఇతరులతో చెపుతుంటే వింటున్న  మిగిలిన పిల్లలకు మనస్సు చాలా బాధగా ఉంటుంది. 


తనంటే తన పేరెంట్స్ కు అంత ఇష్టం లేదు కాబోలు అనుకుంటారు.


పిల్లల పట్ల పక్షపాతంగా ప్రవర్తించకూడదు.
Wednesday, October 18, 2017

నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా..

నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

  కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, జీవితంలో దీపావళి వెలుగులు విరబూస్తాయి.

Monday, October 16, 2017

విద్యార్ధుల ఆత్మహత్యలు...


ఈ మధ్య వరుసగా కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలు జరగటం అత్యంత బాధాకరం. 

వీటిని ఆత్మహత్యలు అనేకంటే సమాజం చేసిన హత్యలు అన్నా తప్పులేదు. 

ఇలా జరగటానికి ఎన్నో కారణాలున్నాయి. 

కొందరు తల్లితండ్రులు  తాము పొందలేని వాటిని పిల్లల నెత్తిమీద రుద్దుతున్నారు. 

ఉదా..నేను డాక్టర్ చదవలేకపోయాను కాబట్టి నువ్వు చదవాలి అంటుంటారు కొందరు తల్లితండ్రులు. 


ఇరుగుపొరుగు పిల్లలు పైచదువులు చదివారు కాబట్టి, తామూ గొప్పలు చెప్పుకోవాలంటే తమ పిల్లలూ పై చదువులు చదివి తీరాల్సిందే..అనే మంకుపట్టు కొందరికి . 

ఇరుగుపొరుగు పిల్లలు విదేశాలకు వెళ్లారు కాబట్టి తమ పిల్లలూ వెళ్ళాలి, 

అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయి చదివి, ఉద్యోగం సంపాదించాలి, అక్కడ నుండి డబ్బు పంపిస్తే ఇక్కడ ఆస్తులు , ఆభరణాలు కొని గొప్పలు చెప్పుకుంటారు.


 పిల్లలు విదేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో? అనేది అంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు ఉంది.. కొందరి పెద్దవాళ్ళ ప్రవర్తన.

 ఇలా రకరకాల మనస్తత్వాలు. 

ఇదంతా పిల్లల మంచి కోసమే అంటారు కొందరు. 

అయితే, వారి శక్తిని బట్టి, పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి కానీ , మొండిగా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరిపై రుద్దటం  మంచిది కాదు.

*****************

 మా ఇంటి దగ్గరలో ఒక ట్యూషన్ ఉంది. అక్కడకు ట్యూషన్ కొరకు బోలెడు మంది చిన్నపిల్లలు వస్తారు.


ఉదయమూ ట్యూషన్, తరువాత స్కూల్,  మళ్ళీ ట్యూషన్..రాత్రికి ఇంటికి తిరిగివెళ్తారు చిన్నపిల్లలు. 

ఆదివారం కూడా ట్యూషన్ చెప్పమని తల్లితండ్రులు వత్తిడి చేస్తున్నారని టీచర్ చెప్పారు. 

 మార్కులు తక్కువ వస్తే పిల్లలను కొట్టయినా చదివించమని టీచర్లతో చెప్పే పేరెంట్స్ కూడా ఉంటారు.


కన్నతల్లితండ్రికే పిల్లలంటే జాలి లేనప్పుడు బయట వాళ్లయిన కాలేజీ వాళ్ళను అని ఏం లాభం.

*******************

ఈ రోజుల్లో డాక్టర్, ఇంజనీరు కాకుంటే, బతకడానికి ఇక వేరే మార్గమే లేదనట్లు భావిస్తున్నారు కొందరు. 


ఈ చదువులకు  సీట్లేమో వేలల్లో ఉంటాయి. పోటీ లక్షల మంది మధ్య ఉంటుంది. 

ఇలాంటప్పుడు పరిస్థితి..  లైఫ్ అండ్ డెత్..  సమస్యలా ఉంటుంది.  

పోటీచదువులంటూ చిన్నతనం నుంచే పిల్లల్ని హాస్టల్స్లో వేయటం జరుగుతోంది. 

హాస్టల్స్లో కొన్నిసార్లు ర్యాగింగ్ వంటివి కూడా ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ? 


హాస్టల్లో ఉండలేను.. అంటే కూడా కొందరు తల్లితండ్రి అర్ధంచేసుకోకుండా హాస్టల్ కు వెళ్లితీరాలి, సర్దుకుపోవాలి, లేకుంటే జీవితం వృధా అంటారు. 


అక్కడ సర్దుకుపోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు తల్లితండ్రి ఏడవటం మొదలెడతారు.

***********

కొందరు  పిల్లలు మత్తుమందులకు అలవాటు పడుతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.  ఈ విషయాల గురించి  కొంతకాలం చర్చలు జరిగాయి. 


 ఇప్పుడు వరుసగా కొందరు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ సద్దుమణుగుతుందేమో .... 


ఇప్పుడు ఎవరికీ దేన్నీ పట్టించుకునే సమయం లేదు.

 చాలామంది తల్లితండ్రులకు తమ పిల్లల గురించి పట్టించుకునే సమయమే లేదు.

*******************

కాలేజీల వాళ్ళు తమకు ర్యాంకులే ముఖ్యం అన్నట్లు కాకుండా పిల్లల జీవితాలు కూడా ముఖ్యంగా పిల్లలను చూసుకోవాలి. 

తల్లితండ్రికి దూరంగా , తమను నమ్మి వచ్చిన పిల్లలను చక్కగా చూసుకోవాలి.

 ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, పిల్లలకు చదువు మధ్యలో ఆటవిడుపు ఇవ్వటం వంటి చర్యలు తీసుకోవాలి.  

**************

ఇక ప్రభుత్వాలు,   ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, చదువుకోవటానికి ప్రవేశసీట్ల కొరకు పెద్ద ఎత్తున పోటీ లేకుండా కాలేజీలలో సీట్ల సంఖ్య పెంచటం ..వంటి చర్యలు తీసుకోవాలి. 


ఎవరు  ఎన్ని చర్యలు తీసుకున్నా విషాద సంఘటనలు  జరగకుండా ఉండాలంటే   సమాజంలో నైతికవిలువలు పెరగాలి.

*******************


చక్కగా జీవించటానికి ఎన్నో వస్తువులు అవసరం లేదు. 

మన పాతకాలంలో ప్రజలు ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. 

అయితే, ఇప్పుడు ప్రపంచం అనేక  భ్రమల్లో పయనిస్తోంది. 

పరిస్థితి చక్కబడాలంటే, భ్రమలనుండి బయటపడి సరైన దారిలోకి రావటం తప్ప వేరే దారిలేదు.  


Friday, October 13, 2017

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ? రెండవ భాగం.

ఈ రోజుల్లో  దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము.  పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.


( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )

అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  


ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 


  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి.    పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.   


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా. 


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.


చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.   ఇప్పుడు  సెల్ ఫోన్స్  లో  కూడా  అసభ్యకరమైన దృశ్యాలు   చూసే  వీలు  వచ్చేసింది. అనభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల   ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.


 పెద్దవాళ్ళయిన    ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల    రక్షణ   గురించి  కూడా  ఆలోచించండి.

.........................


విచిత్రం ఏమిటంటే  ఈ మధ్య  కొందరు  ఆడవారు  కూడా  మత్తు  పదార్ధాలను   తీసుకుంటున్నారు . ఈ  మధ్య  ఒక  అమ్మాయి  మత్తులో  రోడ్డుపై  పడి  గొడవ  చేసిన  విషయాన్నీ  మీడియాలో  చూసాము కదా ! 

ఇది  మరింత  ప్రమాదకరం . (Friday, January 31, 2014)


పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

 ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? 


పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. 


ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  

ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు . 


ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది. 


బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. 


ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
..................  

పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.

 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ  
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 


 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)


ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  కేర్ సెంటర్  లోనో  వదిలి  పరిగెడుతుంటారు. 


  ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 

  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  
కేర్ సెంటర్  లోనే  వదలాలి.  

..................

ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 

  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 


 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి. 


  ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .


కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు. 


 ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు. 


 నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ?  

................. 

ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  
 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 

ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .

(Wednesday, January 29, 2014)

Wednesday, October 11, 2017

ఓం. .అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేసిన కొన్ని విషయములు ....


శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుసుకున్న విషయములు .....

ఒక సందర్భంలో, ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి.... 

* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.