సమాజంలో అందరూ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తేనే సమాజంలో కష్టాలునష్టాలు తగ్గుతాయి....నైతికవిలువలకు, క్రమశిక్షణకు, శుభ్రతకు..అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి.
ఈ రోజుల్లో చాలామంది మనుషుల్లో పాపభీతి తగ్గింది. మద్యం, మత్తుపదార్ధాల వాడకం పెరిగింది.
కుటుంబ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. చాలామంది స్త్రీలు, పురుషులు బాధ్యతలు లేకుండా స్వేచ్చగా జీవించడానికి ఇష్టపడుతున్నారు.
కొన్ని సినిమాలు, సీరియల్స్ వల్ల సమాజానికి చాలా హాని జరుగుతోంది.
అసభ్యకరమైన దృశ్యాలకు, రెచ్చగొట్టే వార్తలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. వీటిని అరికట్టాలి.
మద్యం, మత్తు పదార్ధాలు, అసభ్య, అశ్లీలచిత్రాలు..వంటి వాటివల్ల ఎన్నో నేరాలుఘోరాలు జరుగుతున్నాయి. వీటిని ఆపాలి.
ఇప్పుడు సెల్ఫోన్లు అందరికీ వచ్చి, సోషల్మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక మంచితో పాటు చాలా చెడు జరుగుతోంది.
టెక్నాలజి పేరుతో మంచి కొంతయితే, చెడు చాలా జరుగుతోంది.
ఆధునికత పేరుతో పర్యావరణాన్ని ఎంతో పాడు చేస్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయటం, అన్ని ప్రదేశాలను మురికిచేయటం..వంటివి లేకుండా బాధ్యతగా ఉండాలి.
***********
చాలామంది ప్రజలకు బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ, దేవాలయాలకు వెళ్లినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు..ఇలా చాలాచోట్ల నెట్టుకుంటూ వెళ్లటం అలవాటయింది. చక్కగా ఒకరితర్వాత ఒకరు క్యూలో వెళ్తే మంచిది.
బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడూ....లోపలి వాళ్లు క్రిందకు దిగకముందే బయట ఉన్నవాళ్లు లోపలికి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణీకులు నెట్టుకోకుండా ఉండాలంటే, ప్రభుత్వాలు సరిపడినంత బస్సులు, రైళ్ళు వేయాలేమో...
అయితే, కొన్ని బస్సులకు ఎక్కువమంది ప్రయాణీకులు ఉండరు. ప్రయాణీకులు లేక నష్టాలు వస్తున్నాయంటారు. కొన్ని బస్సులు కిక్కిరిసి ఉంటాయి. అలాంటప్పుడు ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఎక్కుతారు .రద్దీ ఎక్కువున్న రూట్లలో ఎక్కువ బస్సులు నడపాలి.
*************
నైతికవిలువలను పాటించకుండా జీవించటం, ఎన్నో పాపాలు చేయటం..ఇలా సమాజం ఎలాగో ఉంది. అధికారం, సంపద కొరకు ఎంతకైనా దిగజారుతున్నారు.
సమాజం బాగుండాలంటే, చిన్నతనం నుంచే పిల్లలకు నైతికవిలువలను పాటించటం నేర్పించాలి. మంచి పౌరులుగా తయారుచేయాలి.
చాలామంది అధికారులు తమ పనిని తాము సక్రమంగా చేయటం లేదు. సమాజంలో అవినీతి, లంచగొండితనం, సోమరితనం, కుల, మత, ప్రాంతీయ..ద్వేషాలు ఎక్కువయ్యాయి.
రాజకీయులను గమనిస్తే, అధికారం లోకి ఎలా రావాలా? అని కొందరు, అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో ? అని కొందరు, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా? అని కొందరు,...
ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చి, వెంటనే తరువాత జరిగే ఎన్నికల్లో ఎలా గెలవాలో? అనే ఆలోచనలతో కొందరు..ఇలా ఎవరికి వారు పొద్దుపుచ్చటంతోనే కాలం గడిచిపోతోంది. ఇక ప్రజల కొరకు ఏమైనా చేయడానికి ఎవరికీ సమయం సరిపోవటం లేదు మరి.
***********
మనశ్శాంతి కొరకు దైవపూజ చేసుకుందామంటే.. కొందరు, ప్రతిదానికి అలా చేయకూడదు..ఇలానే చేయాలంటూ.. .లేదంటే అష్టకష్టాలు వస్తాయంటూ భయం కలిగేలా చెప్పేస్తుంటారు. ఇవన్నీ విని జనాలు అయోమయం అయిపోతున్నారు.
దేనికైనా నియమాలు తప్పకుండా ఉండాలి. అయితే, అవి అతిగా ఉంటే కష్టం.
ఇప్పటి సమాజంలో మనకు ఏం చేయాలన్నా అన్నీ సమస్యలు, సందేహాలు ఎక్కువైపోయాయి.
అయితే, కొందరు సమాజక్షేమం కొరకు ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తారు.
*****************
ఈ రోజుల్లో చాలామంది మాంసాహారాన్ని తినడం ఎక్కువయ్యింది. మనుషులకు చిన్న దెబ్బ తగిలినా, కష్టం వచ్చినా..తట్టుకోలేరు.
మరి పశుపక్ష్యాదులవి ప్రాణాలు కావా? వాటికీ నొప్పి, బాధ, భయం..ఉంటాయి కదా. మరి మనుషులు ఇతర జీవులను హింసించినప్పుడు వాటికి బాధలు కలుగుతాయి కదా..
పశుపక్ష్యాదులు మూగజీవులు, బలహీనమైనవి కాబట్టి , మనుషులకు ఎదురుతిరగలేవు.
అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది.
****************
బ్లూ జోన్ అనే ప్రాంతాలలో కొందరుప్రజలు నూరేళ్ళు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నారట. అక్కడవారిని పరిశీలిస్తే ..వాళ్లు రోజులో చాలా భాగం ఆరుబయట పనిచేసుకుంటారట. అక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి, పర్యావరణం బాగుండి శుభ్రమైన నీరు, గాలి, ఆహారం ఉంటుంది.
కుటుంబసభ్యులు గొడవలు లేకుండా చక్కగా ఉంటారట. అక్కడివాళ్ళు ఆధునిక టెక్నాలజీ వాడరట. చక్కగా సులభంగా..హాయిగా దైవాన్ని ప్రార్ధించుకుంటారు కావచ్చు....
అందరూ నా మాటే వినాలని పట్టుదలలు, అధికారం కావాలని, బోలెడు డబ్బు సంపాదించాలని, బోలెడు వస్తువులు కొనాలని, కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోవాలని..ఇలా అక్కడివారు తాపత్రయపడరేమో?
అక్కడివారు..డబ్బు, సంపద, అధికారం కొరకు ఆరాటం లేకుండా జీవిస్తారు కావచ్చు. పంతాలు, పట్టింపులు, కుల, మత, ప్రాంతీయ గొడవలు లేకుండా హాయిగా, సహజంగా జీవిస్తారు కావచ్చు. ...
ఆధునికులు అక్కడికి వెళ్ళి అక్కడివారిని పాడు చేయకుండా ఉంటే
చాలు.
******************
ప్రాచీన సనాతన భారతదేశంలో నైతికవిలువలతో కూడిన చక్కటి జీవనవిధానముండేది. చాలామంది వంద సంవత్సరాల పైన ఆరోగ్యంగా, చక్కగా జీవించేవారు.
చెడ్డవాళ్ళు కొద్దిగా మాత్రమే ఉండేవారు.
*************
మనం చక్కగా జీవించడానికి దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు. ఎన్నో మొక్కలు, కాయలు, పండ్లు, వరి, గోధుమ....వంటివి ఎన్నో సృష్టించారు. ....
ఎన్నో పువ్వులు, ప్రకృతి సుందర దృశ్యాలను కూడా సృష్టించారు. వీటన్నింటితో హాయిగా జీవించటం చేతకాక చాలామంది కష్టాలు పడుతున్నారు.
**************
లాస్ ఏంజలెస్ లో కార్చిచ్చు మండుతోంది. అంత పెద్ద దేశమైనా కూడా కార్చిచ్చు రగలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటం, వెంటనే ఆర్పటం చేయలేకపోతోంది..టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చని కొందరు మాట్లాడతారు కానీ, టెక్నాలజీతో కొంతవరకే చేయగలం.... ప్రకృతి ముందు మనుషులెంత..
*****************
ఎక్కడైనా ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలుంటాయి. ఉదా..సరైన ప్రణాళిక లేక పోవటం వల్లగానీ, కొన్నిసార్లు వేసిన అంచనాలు తప్పటం వల్లకానీ, కొందరికి క్రమశిక్షణ..బాధ్యత సరిగ్గా లేకపోవటం వల్లకానీ, సమన్వయలోపం వల్ల కానీ, ఊహించని విధంగా అప్పటికప్పుడు సంఘటనలు జరగటం వల్లకానీ, ఎవరైనా కుట్ర చేయటం వల్లకానీ, కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల కానీ, ఇంకా మనకు తెలియని అనేక కారణాల వల్లకానీ..ప్రమాదాలు జరగవచ్చు. సరిగ్గా ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
లోకంలో పాపాలు పెరిగితే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటారు.
**************
యజ్ఞయాగాదులు చేసి ప్రపంచంలో చెడును తగ్గించవచ్చని పండితులు అంటున్నారు. ప్రపంచశాంతి కొరకు ఆ విధంగా కూడా ప్రయత్నించవచ్చు.
**********
చాలామంది డబ్బు, అధికారం..వంటివాటి కొరకు తాపత్రయపడుతూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
లోకంలో సంపదంతా కొందరు తమవద్దే ఉండాలని తాపత్రయపడుతుంటారు. ఒక్క కుటుంబమే వందలకోట్లు ఏం చేసుకుంటారో? సమాజంలో సంపద అందరూ పంచుకుంటే లోకంలో పేదరికం ఉండదు కదా..
ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అధికారం, సంపద, మతాల కొరకు.. కొట్టుకు చస్తున్నారు.
**********
చాలామంది మనుషులు చేస్తున్న పాపాలు చూసి దైవానికి విసుగు కలిగి, ఎవరికర్మ వారిదని ఊరుకుని ఉంటున్నారేమో?
అందరూ జాగ్రత్తగా మనస్సును అదుపులో ఉంచుకుంటూ జీవించడానికి ప్రయత్నించాలి.
కొందరు మేము ఏ పాపాలు చేయలేదంటారు. కొందరికి తాము చేసే తప్పులు తప్పులుగా అనిపించవు.
**********
అయితే, ప్రపంచంలో ఎంతో మంచిచేసేవాళ్లు కూడా ఎందరో ఉన్నారు. చెడ్డగా ప్రవర్తించినా కూడా తప్పు తెలుసుకుని మంచిగా మారుతున్నవారూ ఉన్నారు. అందరూ మంచిగా ఉంటారని ఆశిద్దాము.
***********
అందరూ నీతిగా జీవిస్తే ప్రపంచంలో ఇన్ని నేరాలు..ఘోరాలు ఎందుకుంటాయి?
దైవాన్ని నమ్మి భక్తితో ఉండేవారు ఎవరైనా మంచిగా జీవించాలి. దైవభక్తి కలిగి ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి...అప్పుడే దైవకృపను పొందగలరు.
లోకం అంతా ఎప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment