koodali

Friday, August 26, 2011

దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని..........2 వ భాగం.

ఇంతకు ముందు టపాలో దైవం వల్ల సంహరించబడ్డ రాక్షసుల గతి గురించి వ్రాయటం జరిగింది.


ఇంకా, మహిషాసురుని సంహారానంతరము దేవతలు అమ్మవారిని స్తుతించిన సందర్భంలో , అలా సంహరించబడ్డ రాక్షసులను అమ్మవారు స్వర్గానికి పంపుతారని దేవతలు అన్నట్లుగా ఉన్నది.


అమ్మవారు దయాళువు కాబట్టి , దేవతలు అలా అని ఉంటారు.


అయితే దేవతలు అన్నట్లుగా ఆ రాక్షసులను సంహరించటమే వారికి మేలు చెయ్యటం.

(అంటే, వారు మరిన్ని పాపాలు చేసి మరింత పాపం మూట కట్టుకోవటం జరగదు కాబట్టి, ) .


నేను ఈ రోజు శ్రీ దేవీ భాగవతము చదివినప్పుడు అందులో మహిషాసుర వధ జరగటానికి ముందు భాగం కొంత చదివాను. అందులో ..


మహాదేవి ,మహిషాసురునితో యుద్ధం చేయబోయే ముందు ....... మహిషాసురుడు మొదలు తాను యుద్ధానికి రాకుండా తన మంత్రిని అమ్మవారి వద్దకు రాయబారిగా పంపుతాడు.


* ఆ రాక్షస మంత్రి మాటలను వింటూనే మహాదేవి విరగబడి నవ్వి, కొన్ని మాటలు అతనితో మాట్లాడుతూ,


* ఇంకా కొన్ని మాటలను చెప్పి వాటిని మహిషాసురునికి చెప్పమని చెప్పటం జరిగింది.

* అందులోని కొన్ని మాటలు. .............. సర్వ దైత్యులను సంహరించడం కోసం వచ్చాను.

* మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్ధిస్తే వచ్చాను....... (అంటూ ) .........వెళ్ళు నీ ప్రభువుతో చెప్పు. నా మాటగా చెప్పు.


* రాక్షసాధమా ! జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో . లేదంటే ప్రాణాలను కోలుపో . ఎన్నో పాపాలు చేశావు . అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను . బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను. యమలోకానికి పంపిస్తాను .


* ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకుని వెంటనే పాతాళానికి పారిపో . ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది.


* ఈ స్వర్గాన్నీ ఈ భూమినీ ఈ సముద్రాన్నీ విడిచిపెట్టి పారిపో . పాతాళానికి పారిపో . యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరి రా . మహావీరులతో మహాబలాలతో తరలిరా.


* అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను.

* ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతోమందిని సంహరించాను. .....అంటూ ఇలా ఎంతో చెప్పటం జరిగింది.


ప్రాణాలను దక్కించుకోవాలంటే పాతాళానికి పారిపొమ్మని అమ్మవారు దయతో ఎన్నిసార్లు చెప్పినా వినక మహిషాసురుడు యుద్ధం చేసి ప్రాణాలను కోల్పోయాడు.


ఇక్కడ అమ్మవారి మాటలను విశ్లేషించే శక్తి నాకు అంతగా లేదు . కానీ , నాకు తెలిసినంతలో ఇలా అనిపిస్తోంది. .......


* ఆ రాక్షసులు చనిపోయాక స్వర్గానికి వెళ్ళరనీ, యమలోకానికే వెళ్తారనీ తెలుస్తోంది.


అమ్మవారి చేతిలో ప్రాణాలు విడిచినా కూడా , పాపాలు చేశారు కాబట్టి యమలోకానికే వెళ్ళవలసి వచ్చినప్పుడు,


మరి ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో పాపాలు చెసేసి పాప పరిహారార్ధం కొన్ని పూజలు చేస్తే చాలు . ఇక పాపం పోతుందనే భ్రమలో ఉన్నారు.


ఆ భ్రమతో దండిగా మళ్ళీ పాపాలు చేస్తున్నారు. ఎన్ని పాపాలు చేసినా అమ్మవారు క్షమించేస్తారులే అని.అయితే కొన్ని గ్రంధాలలో పాపపరిహారార్ధం ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డ నిజమే.


కానీ అవి ఎవరికొరకంటే, తెలిసోతెలియకో పాపాలు చేసి తరువాత చేసిన పాపాలకు విపరీతంగా బాధపడుతూ పశ్చాత్తాపపడుతున్న వారి కొరకు మాత్రమే ఈ ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి.


అంతేకానీ , ఎప్పటికప్పుడు పాపాలు చేయటం, ఆనక ప్రాయశ్చిత్తాలు చేసుకోవటం, మళ్ళీ పాపాలూ చేయటం ఇలా అతితెలివిగా ప్రవర్తించే వారికోసం ప్రాయశ్చిత్తాలు, పూజలు చెప్పబడలేదు.


అందుకని ఇటువంటివారు పాపాలు చేయటం మానుకోవాలి. ఇలాంటి కొందరు దైవాన్ని కూడా ఏమార్చగలమనే భ్రమలో ఉన్నారు.


ఇక, రేపు శనిత్రయోదశి. గత కొంతకాలంగా " మా " టివిలో శనిదేవుని కధలు సాయంకాలం 6 గంటలకు వస్తున్నాయి. బాగుంటున్నాయి.


"మా " టివిలో కొన్ని ప్రొగ్రాంస్ నాకు నచ్చవు. కానీ ఈ ప్రొగ్రాం ,ఇంకా కొన్ని ప్రోగ్రాంస్ బాగుంటాయి.


వ్రాసినదానిలో పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. అంతా దైవం దయ.......

Wednesday, August 24, 2011

దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని..........

పెద్దలు చెప్పిన ప్రకారం , భగవంతుడు భక్తులకు తన దర్శనభాగ్యాన్ని , ఒకోసారి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు.


ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే , వారు భక్తులు కాబట్టి.


కానీ , ఒకోసారి రాక్షసులను వధించేసమయంలో వారికి కూడా భగవంతుని దర్శనభాగ్యం లభిస్తుంది కదా ! మరి వాళ్ళకు కూడా మోక్షం వస్తుందా ? అని నాకు సందేహం కలిగింది.అయితే , రాక్షసులలో కూడా ఎన్నో కష్టాలకు తట్టుకుని గొప్ప తపస్సులను చేసిన తరువాతే వారికి దేవతల దర్శనం , వరాలు లభించాయి.ఆ తరువాత వరగర్వంతో రాక్షసులు విర్రవీగి లోకాలను పీడించినప్పుడు దేవతల చేత సంహరించబడ్డారు అది వేరే విషయం. .


దేవతలు చేసిన దేవీ స్తుతి చదివిన తరువాత నా సందేహాలకు సమాధానాలు లభించాయని నాకు అనిపించింది. ( నాకు అర్ధమయినంతలో ).* వృత్రుణ్ణి సంహరించేందుకు సహాయం కోరి , దేవతలు చేసిన దేవీ స్తుతిలో కొంత భాగం........అమ్మా ! వృత్రుడి మీద నీకు దయ ఉండవచ్చు. అతడికి మేలు చెయ్యాలని నువ్వు భావించవచ్చు. నిజానికి ఇప్పుడు వెంటనే సంహరించడమే అతడికి మేలు చెయ్యడం. లేకపోతే ఆ జన దుఃఖకరుడు, ఖలుడు, పాపాత్ముడు, దుష్టబుద్ధి ఇంకా, ఇంకా పాపకూపంలో కూరుకుపోతాడు. అందుచేత ఉద్ధరించు. నీ బాణాలతో పవిత్రుణ్ణి చెయ్యి. నువ్వు రాక్షసులను సంహరించడమంటే వారిని పరిపూతులను చేసి నందనవనానికి పంపడమే కదా ! ...........* ఇంకా , బ్రహ్మాదిదేవతలు చేసిన మహిషాసుర మర్దనీ స్తుతిలో కొంత భాగం........ అమ్మా ! నీ హృదయం దయా సముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులనూ అలాగే పోషిస్తున్నావు. సకలచరాచర సృష్టి జాతమూ నీ అంశయే కదా ! నీ సృజనయే కదా ! పెంచిన వనంలో అన్ని చెట్లూ ఉంటాయి. చేదు విషం లాంటి వృక్షాలుంటాయి. ఎందుకూ పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికిపారేస్తామా ? అలాగే నువ్వూ దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గ నివాసం ప్రసాదించి , అప్సరసలపై వారికున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాము. అదీ - కాక నువ్వు తలుచుకుంటే చాలు దనుజులు సర్వనాశనమైపోతారు. వారిని సంహరించడంకోసమని నువ్వు ఇలా రూపం ధరించడం, రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం. .......


అంటూ ఇంకా,.........

* నువ్వు దయార్ద్ర హృదయవు కనక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయుండేవారు. ....
అంటూ అలా స్తుతించటం జరిగింది.* శ్రీ రాముని, శ్రీ కృష్ణుని ఆ నాటి వారు ఎందరో చూశారు. వారిలో కొందరు మాత్రమే వారిని దైవాంశసంభూతులుగా గుర్తించారు.* మనము ప్రత్యక్ష భగవంతుడైన సూర్యుని రోజూ చూస్తూనే ఉన్నాము.


మహా భక్తులు దైవం యొక్క విశ్వరూపసందర్శన భాగ్యాన్ని పొంది, దైవం యొక్క అపార అనుగ్రహానికి పాత్రులవుతారు.రాక్షసులు వంటివారు దైవం యొక్క దర్శనాన్ని పొందినా , వారి అపార అనుగ్రహాన్ని మాత్రం పొందలేరు.అయితే దైవం యొక్క దర్శనాన్ని పొందాలన్నా ఈ రాక్షసుల వంటివారు క్రితం జన్మలో ఎంతో కొంత కష్టతరమైన తపస్సులను చేసినవారై ఉంటారు.రాక్షసులలో కూడా వివిధ రకాల వారు ఉంటారు.


రావణాసురుడు , మొదటి నుంచీ రాక్షసుడు కాదు. వైకుంఠంలోని ద్వారపాలకులైన జయవిజయులలో ఒకరు. కొన్ని కారణాల వల్ల రావణాసురునిగా జన్మించవలసి వచ్చింది.


శంఖచూడుడు అనే అసురుడు, గోలోకం లో సుదాముడు అనబడే గోపకుడు. శ్రీ కృష్ణుని అంశను కలిగినవాడు. కొన్ని కారణాలవల్ల శంఖచూడునిగా జన్మించవలసి వచ్చింది..వీరు కొన్ని పొరపాట్లు చేసి దైవం చేతిలో సంహరించబడి తిరిగి దైవసాన్నిధ్యాన్ని ( మోక్షాన్ని ) పొందటం జరిగింది.


ఇక.....ఇతరుల విషయానికి వస్తే,


* దైవం చేతిలో చంపబడ్డ రాక్షసులు స్వర్గాన్ని పొందుతారని ఇంతకు ముందు దేవతలు చేసిన స్తుతిని చదివితే తెలుస్తుంది.


* దీనిని బట్టి నాకు అర్ధమయింది ఏమంటే , దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని , వారు స్వర్గానికి వెళతారనీ. ........... ( యుద్ధంలో మరణించే సైనికులు స్వర్గానికి వెళ్ళినట్లు. )


* దైవభక్తులకు మాత్రం దైవానుగ్రహం, ఇంకా మోక్షం కూడా లభించే అవకాశం ఉంది అని.......


స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గానికన్నా మోక్షం ఉత్తమమైనది.


* ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి.....


Monday, August 22, 2011

కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నిన్ననే వచ్చామండి.


తమిళనాడు టూరిజం వాళ్ళది 108 అమ్మవారి దేవాలయముల సందర్శన యాత్ర ఉందండి.

ఈ యాత్ర సంవత్సరానికి ఒక నెల రోజుల చొప్పున , తమిళ ఆడి మాసంలో ఎక్కువగా ఉంటుంది.

నాకు మూడు సంవత్సరాల క్రితం ఈ యాత్ర గురించి తెలుసు. అప్పటి నుంచీ వెళ్ళాలని ప్రయత్నం.


కానీ దైవం దయ వల్ల ఇన్నాళ్ళకు అనుకోకుండా సడన్ గా వెళ్ళిరావటం జరిగింది.

యాత్ర బాగా జరిగింది. మొత్తం 5 రోజుల యాత్ర. .

వారానికి రెండు సార్లు చెన్నై నుంచి యాత్ర మొదలవుతుంది. ( చెన్నై లో మాకు చాలా దగ్గరి బంధువులు ఉన్నారులెండి. .)


యాత్రకు బయల్దేరేముందు నాకు చాలా సందేహాలు కలిగాయి.

అయిదు రోజుల్లో ఇన్ని దేవాలయాలు ఎలా చూపిస్తారు ? బాగా అలసిపోతామేమో ? అని.కానీ ఒకో రోజు 28 , 20 , చొప్పున ఇలా ముందే ఒక ప్రణాళిక ప్రకారం వీలయినంత వరకు బాగా దర్శనం చేయించారు.70 ఏళ్ళ వయసు బామ్మగారు కూడా వచ్చారు. ఆమె 5 రోజులు ఎలా యాత్ర చేస్తారో ? అని నాకు అనిపించింది. కానీ , ఆమె చక్కగా అందరితో మాట్లాడుతూ చాలా ఉత్సాహంగా తిరిగారు.


మద్యాహ్నం సమయంలో కొన్ని దేవాలయాల్లో దర్శనం ఉండదు గదా ! అలాంటివి చాలా కొన్ని తప్పితే మిగతావన్నీ బాగా చూపించారు.మద్యాహ్నం దేవాలయాల్లో దర్శనం ఉండని సమయంలో కొన్నిసార్లు మాకు రెస్ట్ ఇచ్చేవారు. విశ్రాంతి తరువాత బయలుదేరి దేవాలయాలను చూడటం జరిగింది.


యాత్రకు వెళ్ళే ముందు భయపడ్డాను . వానాకాలం కదా ! ఎలా జరుగుతుందో యాత్ర అని.

కానీ, ఒకటిరెండుసార్లు చిరు జల్లులతో కురిసిన వాన తప్పితే, దైవం దయవల్ల యాత్ర మధ్యలో వానలు ఇబ్బంది పెట్టలేదు..


రాత్రి పూట మంచి వసతి సదుపాయం కల్పించారు.


అసలు అంత యాత్ర చేసినా 5 రోజుల సమయం ఎలా గడిచిపోయిందో అలసటే అనిపించలేదు.

ఈ అమ్మవారి దేవాలయాల యాత్ర లో శ్రీరంగం, చిదంబరం, వైదీశ్వరన్ కోయిల్, ఇలా ఎన్నో దేవాలయాలు చూపించారు.


సమయపురం, మేల్ మరువత్తూర్ కూడా చూపించారు.


ఇంకా, చిదంబరం లోని ఒకే దేవాలయ సముదాయంలో పరమ శివుని ఆలయం ఇంకా విష్ణుమూర్తి ఆలయం కూడా ఉన్నాయి.


నాగపట్నం, మధురై వరకూ వెళ్ళాము.ఇది చదివి మీరు నాకు భక్తి చాలా ఎక్కువ అనుకోకండి.


నిజమైన భక్తి ఉన్నవారు భగవంతునిపై భారం వేసి నింపాదిగా తమ స్వధర్మాన్ని తాము నిష్కామముగా నిర్వహించుకుంటూ ఉంటారు. వారు కష్టాలకు భయపడరు. అని నాకు అనిపిస్తుంది.నాకు భక్తి ఉంది కానీ ,అంత గొప్ప భక్తి ఇంకా కుదురుకోలేదండి. చాలామంది గొప్ప భక్తులతో పోల్చుకుంటే , కోరికలతో భగవంతుని పూజించే నేనెంత.


నిజం చెప్పాలంటే నాకు భక్తిని ఆడంబరంగా పైకి ప్రదర్శించుకోవటమంటే అంత ఇష్టముండదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి.


కొంతకాలం క్రితం కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక , నాకు వీలయితే ఇలా దేవాలయాలకు వెళ్ళివస్తానని అనుకోవటం జరిగింది.దైవం దయ వల్ల కష్టాలు తీరాయి కాని దేవాలయాలను దర్శించటం అంత త్వరగా కుదరలేదు.


నాకు అనిపిస్తుంది , అలా కష్టాలు రావటం వల్లనేనేమో ! నేను జీవితంలో వెళ్ళగలనని ఎప్పుడూ అనుకోని అమరనాధ్, వైష్ణవీదేవి యాత్రలు, ఇలా 108 అమ్మవారి దేవాలయాల యాత్ర వంటి వాటి భాగ్యం కలిగిందేమో నని అనిపిస్తుంది.


అదండి సంగతి. అంతా దైవం దయ..

Friday, August 12, 2011

భగవంతునికి అసాధ్యం అన్నదే ఉండదు.

ఓం.

వరలక్ష్మీ వ్రతము సందర్భంగా
శుభాకాంక్షలండి .


రామాయణ,భారతములు ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని చెప్పుకున్నాము. మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే . .. ( క్లుప్తంగా. )


ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు ........... దేవతలు మరియు భూదేవి ...... ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.


అప్పుడు అమ్మవారు ......... దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.


శ్రీకృష్ణ జననం గురించి ,పాండవుల జననం గురించి ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.

ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.


అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.

ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.

కానీ, దేవతలు నిమిత్తమాత్రులుగా అమ్మవారు నడిపించిన చరిత్ర ఎన్నో కధలు, ఉపకధలతో రసవత్తరంగా నడిచింది.


ఆ విధంగా , పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ....... లోకానికి ఎన్నో గొప్ప విషయాలు అందించబడ్డాయి.


సామాన్యులమైన మనము పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా చక్కగా అర్ధం చేసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు , ఆ పరిష్కారం ద్వారా ప్రజలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకునే విధంగా సమస్యను పరిష్కరించటం దైవానికే సాధ్యమవుతుంది...

ఇంకా,


( పిల్లలకు నీతి కధలు బోధించేటప్పుడు కొన్నిసార్లు , పెద్దవాళ్ళు ఆ కధలలోని పాత్రధారులుగా తాము అభినయించి చూపిస్తారు కూడా .)


ఇంకా,

దేవతల గురించి పెద్దలు చెప్పిన విషయాల్లో అర్ధాలు నిగూఢంగా ఉంటాయట. మనం వాటి గురించి పైపై విషయాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చెయ్యకూడదు.


గోలోకానికి అధిపతులు .... శ్రీకృష్ణుడు రాధాదేవి. . అక్కడ శ్రీకృష్ణుడురాధాదేవి దంపతులు.


ఒక సందర్భంలో శ్రీకృష్ణుని లీలల గురించి రాధాదేవి శ్రీ కృష్ణుని అడుగుతూన్న సందర్భంలోని కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. .......


శోభ అనే గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి వెళ్ళిపోగా ...... శ్రీకృష్ణుడు ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, బంగారానికి, స్త్రీల ముఖాలకీ, చిగుతాకులకీ, పువ్వులకీ, పక్వ ఫలాలకీ, పంటలకీ, రాజదేవమందిరాలకీ, శిశువులకీ, క్షీరానికీ, పంచిపెట్టారట.ప్రభ అనే గోపిక సూర్యమండలానికి వెళ్ళిపోయింది..... ఆ ప్రభను కృష్ణుడు కొంత తన కన్నులలో దాచుకున్నారట. కొంత అగ్నికీ., యక్షులకీ, పురుష సింహాలకీ, దేవతలకీ, విష్ణుజనులకూ, నాగజాతికీ, బ్రాహ్మణులకూ, మునులకీ, తపస్వులకూ, సౌభాగ్యవతులకూ, యశస్వంతులకూ విభజించి ఇచ్చారట.శాంతి అనే గోపిక శరీరాన్ని విడిచి కృష్ణునిలో లీనమయ్యిందట. .......... శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత రాధాదేవికీ, లక్ష్మీదేవికీ, కృష్ణుని మంత్రోపాసకులకూ, శాక్తేయులకూ, తపస్వులకూ, ధర్ముడికీ పంచిపెట్టారట.


క్షమ అనే గోపిక ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయిందట. ............... అప్పుడు కొంత భాగాన్ని విష్ణువుకీ, వైష్ణవులకీ, ధార్మికులకీ, ధర్ముడికీ, దుర్బలులకీ, తపస్వులకూ, వేదపండితులకూ, పంచి ఇచ్చినట్లు చెప్పబడింది.ఇవన్నీ చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.


ఈ విషయములలోని అంతరార్ధములు నాకు అంతగా తెలియవు కానీ , శోభ కూ ప్రభకూ ఉండే తేడా....ఏవి ఎక్కడ ఉంటాయి అనే విషయాలు మనము కొద్దిగా తెలుసుకోవచ్చు .


ఉదా... చంద్రునికి ఉండే గుణాన్ని శోభ అంటారనీ, సూర్యునికి ఉండే గుణాన్ని ప్రభ అంటారని తెలుస్తోంది.ఇంకా, ,


శాంతి అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ,క్షమ అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది. ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.


ఇంకా, కొందరు ఏమంటారంటే, ప్రాణం లేని గ్రహాలు ఆలోచించినట్లు పురాణాల్లో చెబుతారు. అవి ఎలా ఆలోచించగలవు ? ? అవి ఏమన్నా జీవులా ? అంటారు.

కానీ గ్రహాధిదేవతలు ఉంటారు. మనకు గ్రహదోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహాధిదేవతలను పూజించటం జరుగుతుంది.


" శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము. "ఈ గ్రంధములో విశేషమైన విషయాలు చెప్పబడ్డాయి. వీలయితే తప్పక చదవండి.

ఇంకా...


" శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో మణిద్వీపవర్ణనలో షోడశశక్తుల పేర్లు చెప్పబడ్డాయి.

ఆ పేర్లు............కరాళి,వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీ , దుర్గ, ఉష, లక్ష్మి,శ్రుతి, స్మృతి,ధృతి,శ్రద్ధ, మేధ,మతి, కాంతి,ఆర్య వీరు జగన్మాతకు సేనానులు. అని చెప్పబడింది.
ఇంకా,

చింతామణి గృహంలో భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. అని చెప్పబడింది.
ఇంకా,


లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి, వీరు అక్కడుండే దేవాంగనలు అని ..... అని చెప్పబడింది.


ఇంకా,
సృష్టిలో సకల సప్తకోటి మహామంత్రాలూసకల మహావిద్యలూ రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను ఆ శివను ఆ కారణబ్రహ్మరూపను ఆ మాయా శబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి.

ఇలా ఎన్నో విషయాలు కూడా చెప్పబడ్డాయి.


నాలాంటి సామాన్యులకు ఇలాంటి విషయాల అంతరార్ధాల గురించి అంతగా తెలియకపోయినా పురాణేతిహాసముల గొప్పదనం తెలుస్తోంది.విశ్వంలో.... భావాలూ, గుణాలు , నదులూ కూడా రూపాన్ని పొంది పరమాత్మను ప్రార్ధిస్తాయట. మనకు ఇలాంటివి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది..ఇలాంటి అద్భుతాలెన్నో విశ్వంలో ఉన్నాయని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది. ...

విశ్వంలో అంతటా పరమాత్మ ఉంటారు.

ఒక రూపాన్ని చేసి , ప్రాణం పోసి ఆలోచనా శక్తిని ,గుణాలనూ ఇచ్చిన పరమాత్మకు ...........


ఆలోచనా శక్తికి ,గుణానికి ,నదులకూ ..... తిరిగి రూపాన్ని , ప్రాణాన్ని ఇవ్వటం కూడా చేతనవుతుంది. ..


భగవంతునికి అసాధ్యం అన్నదే ఉండదు...........ఏది చెయ్యటానికైనా సర్వసమర్ధులు వారు.


అందుకని, అంతులేని ,మనకు అంతుపట్టని విషయాల గురించి అతిగా ఆలోచించి ఆయాసపడేకన్నా ........ అన్నిటికి ఆది అయిన పరమాత్మనే శరణు వేడితే చాలు కదా ! అనిపిస్తుంది.


.కలియుగంలో నామస్మరణం సులభమయిన ఉపాయమని పెద్దలు చెప్పటం జరిగింది.


అందుకే , వీలయినంతవరకూ నామస్మరణం చెయ్యటానికి ప్రయత్నిస్తే మంచి జరుగుతుంది.

ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నానండి.

ఈ మాత్రం వ్రాయించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.


అంతా దైవం దయ.. .. .


ఇందులో ఒప్పులను దైవం దయగా, తప్పులను నావిగా గ్రహించాలని మనవి.


Wednesday, August 10, 2011

సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !

.ఓం.

రామాయణం, భారతం ..........ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం ఈ కధలు నడిపించారని పెద్దల ద్వారా తెలుసుకున్నాము.

భూమిపై పాపుల భారం తగ్గించుటకై భారతయుద్ధం జరిగిందని, రావణాసురుని వధ కొరకు రామావతరణం జరిగిందని పెద్దలు చెబుతారు.


రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది. ( అవన్నీ నాకు అంతగా తెలియవు . ) తోచినంతలో , ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి .........


భూమిపై దుష్టులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.

దైవం తలచుకుంటే రామాయణంలో సీతాపహరణం .........భారతంలో కురుక్షేత్రం సంగ్రామం జరగవలసిన అవసరం లేదు.


శ్రీరామునికి, శ్రీ కృష్ణునికి కూడా దుష్టులను సంహరించటం పెద్ద పనేమీ కాదు.

రాజ్యవిస్తరణ మిషతో రాములవారు రావణాసురుని చంపవచ్చు.

శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసి దుష్టులైన రాజులను చంపవచ్చు.

( పరశురాముడు ఒక్కరే ఎందరో క్షత్రియులను చంపటం జరిగింది కదా ! )

కానీ, రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది.

( అవన్నీ నాకు అంతగా తెలియవు . )

అయితే, ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి.......

ఈ కధలలోని పాత్రధారుల పూర్వ కర్మలు ఒక కారణం. , ఇంకా ఈ కధల ద్వారా, అందులోని వారి జీవితాల ద్వారా రాబోయే తరాలవాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.


విష్ణుమూర్తి భృగు మహర్షి శాపం వల్ల ఎన్నో అవతారాలు ధరించవలసి వచ్చింది . తద్వారా దుష్ట శిక్షణ జరిగింది కూడా. .


ఇంకా , విష్ణుమూర్తి సతీవియోగం అనుభవించాలన్నది కూడా ( కొంతకాలం ) భృగు మహర్షి శాపం.


ఇంకా, మనం ఈ కధల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలు, మనస్తత్వాలకు సంబంధించిన విషయాలు, న్యాయశాస్త్ర సంబంధ విషయాలు కూడా తెలుసుకోవచ్చు.


ఎన్నో ఉపకధల ద్వారా మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదా.శకుంతల కధ.


తెలిసీతెలియని యుక్తవయసులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా పిల్లలకు చెప్పటానికి పెద్దలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.


శకుంతలా దుష్యంతుల వంటి కధల ద్వారా పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. .

ఇవేకాక , కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో తప్ప , ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.


ఉదా... రామాయణంలో కైకేయికి మంధర ప్రబోధం వల్ల రామాయణం ఒక పెద్ద మలుపు తిరిగింది.


భారతంలో సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు కోరిన కోరికల వల్ల భీష్ముడు రాజ్యాధికారానికి , వివాహానికి దూరంగా ఉండటం భారతంలో ఒక పెద్ద మలుపు.

( శంతనుని భార్య గంగాదేవి ఆయనను వదలి వెళ్ళిన తరువాతే సత్యవతీదేవిని వివాహమాడటానికి నిశ్చయించుకున్నాకూడా .........)


.ఇక రామాయణంలో ........ సవతులంటే సుమిత్రాదేవి వంటి మంచి వారూ ఉంటారు. ( కానీ అరుదుగా ఉంటారు. )


లోకంలో మంధర వంటివారి మాటలు విన్న కైకేయి లాంటివారే ఎక్కువగా ఉంటారు.


ఇవన్నీ చూశాక నాకు అనిపించింది. ఒక వివాహంతోనే సంసారంలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి.

మనలాంటి సామాన్యులు ఒక్క వివాహంతో సరిపెట్టుకుంటే చాలు.


బోలెడు పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు , కొత్త లంపటాలూ సృష్టించుకునేకన్నా , ఉన్న జీవితాన్ని తృప్తిగా గడిపితే చాలు అని కూడా ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు అనిపించింది.


మంచివారైనా, చెడ్డవారైనా , ఎవరికయినా తన జీవితభాగస్వామి ఇంకో వివాహాన్ని చేసుకోవటమనే విషయం అత్యంత బాధను కలిగిస్తుంది.


స్త్రీలకు సవతులు ఉండటం అనే విషయం వైధవ్యాన్ని మించి బాధను కలిగిస్తుందని హయగ్రీవుని చరిత్రలో చెప్పబడింది.

ఇంకా,


ధర్మరాజుకు జూదం ఆడటం వల్ల కష్టాలు వస్తాయని తెలుసు. ( వారు రాజ్యాన్ని కోల్పోయారు కదా !. )

దైవం నడిపించిన వీరి జీవితాల ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, ఉదా..........మనలో కొందరు ఉంటారు.

వాళ్ళకి అన్నీ మంచి అలవాట్లే ఉంటాయి. కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంటుంది.


ఇక వారు ఏమనుకుంటారంటే ...........నాకు ఉన్నది ఒక్క చెడ్డ అలవాటే కదా ! దీనివల్ల నష్టమేమిటి ? అనుకుంటారు.

కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు వల్ల కూడా ఎన్ని నష్టాలు జరగవచ్చో ధర్మరాజు పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

తెలివి గలవాళ్ళు అలా తెలుసుకుని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

వితండవాదులు ధర్మరాజంతటివారే జూదం ఆడగాలేంది నేను ఆడితే తప్పేంటి ? అని జీవితాన్ని నష్టపోతారు.

ఎవరి తలరాతను బట్టి వారి బుద్ధి ఉంటుంది మరి. అంతా దైవం దయ.


ఇంకా,


(ఇక్కడ దేవలోకాలలోని దేవతల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే, దేవతల ధర్మాలు వేరు. మానవుల ధర్మాలు వేరు. దేవతలకు మానవుల వంటి శరీరాలు ఉండవు. దేవతలకు సంబంధించిన విషయాల్లో పైకి కనిపించేవి కాకుండా అసలైన అంతరార్ధాలు ఎన్నో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. వారి శరీరాలు మనలా ఉండవు. అయితే, వారు ఎలాంటి రూపమైనా ధరించగలరు. వారు తమ శక్తితో ఎన్నో అద్భుతాలు చెయ్యగలరు. ఒక టపాలో చెప్పుకున్నాము.

వారి విషయాలను మానవసంబంధ దృష్టితో చూసి అపార్ధం చేసుకోవటం తెలివితక్కువతనం.

( ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్లో చాలావరకూ భూమిపై మానవులుగా జన్మ ఎత్తినవారి గురించి చెప్పబడ్డాయి
. )


ఇంకా,


శ్రీ కృష్ణుల వారు కూడా కొన్ని సాంసారిక కష్టాలను అనుభవించినట్లుగా లోకానికి కనిపిస్తుంది. ( శ్రీ కృష్ణుల వారు విష్ణుమూర్తి అంశావతారం. )


రుక్మిణీదేవికి సంతానం కలిగారు. కానీ జాంబవతికి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు.


అందువల్ల తనకీ సంతానం కావాలని ఆమె కోరగా కృష్ణుడు శివుని గురించి తపస్సు చేస్తారు.


అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు.

అప్పుడు కృష్ణుడు వారితో తన కోరికను వెల్లడించి, తాను లౌకిక కోరికలతో తపస్సు చేసినందుకు బాధపడతారు.


పార్వతీపరమేశ్వరులు ఎన్నో వరాలను ప్రసాదించి ..

ఇంకా, యాదవుల ప్రవర్తన వల్ల ముని శాపం, తద్వారా చాలావరకూ యాదవ వంశ నాశనం, ఇంకా ఎన్నో విషయాలను చెప్పి అంతర్దానమవుతారు.


ఈ టపా వ్రాయటానికి బాగానే గాభరా పడ్డానండి.

సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !

* దైవం దయవల్ల ఈ మాత్రం వ్రాయగలిగానండి. ఎప్పుడయినా నేను వ్రాస్తున్న విషయాల్లో ఒప్పులను దైవం దయగానూ, తప్పులను నావి గానూ పాఠకులు గ్రహించవలసినదిగా కోరుతున్నాను.
ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని ప్రార్దిస్తున్నానండి.Monday, August 8, 2011

రామసేతు ఆనవాళ్ళు, సముద్రంలో మునిగి ఉన్న ద్వారకా నగరం ఆనవాళ్ళు...........

ఓం, రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

సీతారాములు ... ఆదర్శదంపతులు. . కొంతకాలం ముందు రామాయణం గురించి వ్రాసిన టపాలలోని కొన్ని విషయాలను కూడా
ఇక్కడ జత పరుస్తున్నానండి..


సీతారామలక్ష్మణులు తాము రాజభోగాలు వదిలి అరణ్యాలలో కష్టాలు పడుతున్నా....... అక్కడి ప్రజలను, మునులను పీడిస్తున్న రాక్షసులను సంహరించి ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించారు.


సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు. .......


ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.


అగ్ని
పరీక్ష గురించి...( నిజమైన సీతాదేవికి బదులు మాయాసీతను రావణుడు తీసుకెళ్ళటం జరిగిందట. అగ్నిపరీక్ష జరిపినప్పుడు అసలు సీతాదేవిని అగ్నిదేవుడు రాములవారికి అప్పగించటం జరిగిందట. ఇవన్నీ రాములవారికి ముందే తెలుసట. )ఇలా నేను ఒక దగ్గర చదివాను.* ఇక సీతమ్మను అడవులకు పంపించటం. .........అగ్ని
పరీక్ష లో నెగ్గిన తరువాత, సీతాదేవిని ఇంటికి తెచ్చుకున్నా కూడా ........ కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు. .


* ఇక్కడ గమనించవలసినది ఏమంటే, ఒక పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు.


*ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....


అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను,........ ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు ముందుతరాలవారిని దృష్టిలో ఉంచుకొనే సీతారాములు తమ జీవితంలో అలా త్యాగాలు చేశారనిపిస్తుంది.


రామాయణం జరిగి ఎంతోకాలం గడిచినా ,ఇప్పటి వాళ్ళు కూడా ఆ నాటి వారి ప్రవర్తనను గురించి చర్చిస్తున్నారు కదా !.


ఇవన్నీ ఆలోచించి ముందుతరాలవారిని దృష్టిలో ఉంచుకొనే సీతారాములు తమ జీవితంలో అలా త్యాగాలు చేశారనిపిస్తుంది.


సీతమ్మవారిని అడవులకు పంపిన తరువాత రాములవారు ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా.........తాను రాజభోగాలకు దూరంగా సామాన్యంగా జీవించారు .


( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ .! .).......( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా అతి సామాన్యమైన తల్పంపైన శయనించటం లాంటివి.) ( దర్భలతో అమర్చిన శయ్య వంటిది .)ఇక సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది............
సీతారాముల వియోగం అత్యంత బాధాకరమైన విషయం. ,


రాములవారు సీతాదేవిని , లవకుశులను కలుసుకున్న తరువాత అందరూ అయోధ్యకు తిరిగి వచ్చి సుఖంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.సీతాదేవి భూమాతను ఆశ్రయించకుండా, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నా బాగుండేది అనిపిస్తుంది..


ఇంకా..ఇప్పుడు లవకుశులతో పాటు సీతాదేవి కూడా రాజ్యానికి తిరిగివస్తే,.............ఒకవేళ , మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే ..........అప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,.............రాములవారికి ఆ ఇబ్బంది ఎదురుకాకుండా సీతమ్మవారు అలా త్యాగం చేసి ఉంటారు.*తన ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి.............. సీతమ్మది.తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది.............. ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )


* సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో రాములవారు అంతకన్నా త్యాగమూర్తి. ఇద్దరూ ఆదర్శ దంపతులు.


కొందరు రాములవారు సీతాదేవిని అడవులకు పంపివేశారని అంటారు.
కానీ, అడవులకు రాములవారు పంపలేదు. కొందరు ప్రజలు అన్న మాటల వల్ల తప్పనిపరిస్థితిలో మాత్రమే అలా చేయవలసివచ్చింది.రాముల వారే అటువంటివారయితే అన్ని కష్టాలుపడి సీతాదేవిని తెచ్చుకుంటారా ?


అశ్వమేధయాగం సందర్భంలో శ్రీరాముని ఇంకో వివాహం చేసుకొమ్మని కొందరు సలహా ఇచ్చినట్లు నేను ఒక దగ్గర చదివాను. కానీ రాములవారు అలా ఇంకో వివాహం చేసుకోలేదు.


ఒక బంగారు సీతాదేవి విగ్రహం తయారుచేయించి ఆ మూర్తినే సీతాదేవిగా భావించి యజ్ఞం పూర్తి చేయించారట.


* అలా సీతాదేవే తన భార్య . అని శ్రీరాముల వారు లోకానికి తెలియచేశారు. సీతాదేవిని అడవులకు పంపినా తన హృదయంలో ఆమె స్థానం ఏమిటో రాములవారు లోకానికి తెలియచెప్పారు.
* రామాయణంలో హనుమంతులవారి పాత్ర ఎంతో గొప్పది.
ఇంకా,
ఒక మంధర, ఒక శూర్పణఖ, ఒక రావణుడు ........... ఇలాంటి స్వార్ధపరులు, అత్యాశ గలవారివల్ల మంచి వారు ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో మనకు తెలుస్తుంది.


ఇంకా
,
రామాయణం
లో ......... రాములవారు జటాయువుకు అంత్యక్రియలు కూడా నిర్వహించారని నేను ఒకదగ్గర చదివానండి .


ఇంకా, .
గుహునితో అప్యాయంగా స్నేహం చేయటం ద్వారా అందరూ సమానమేనని చెప్పటం, శబరిని అనుగ్రహించటం ద్వారా ప్రేమతో కూడిన నిరాడంబరమైన భక్తి ఉన్నా చాలు , ఆడంబరాలు అవసరం లేదు అని తెలుసుకోవచ్చు.
ధర్మమూర్తి అయిన శ్రీ రాముడు సామాన్యులైన వానరులను వెంటబెట్టుకుని క్రూరులైన రాక్షసులను అంతమొందించటం ద్వారా .....అధర్మపరులైన రాక్షసుల వంటి వారికి ఎంత బలమున్నా అంతిమ విజయం ధర్మానికే అని తెలుసుకోవచ్చు.


ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.


* రామాయణం, భారతం నిజంగా జరిగిన సంఘటనలే అనటానికి . రామసేతు ఆనవాళ్ళు, సముద్రంలో మునిగి ఉన్న ద్వారకా నగరం ఆనవాళ్ళు శాటిలైట్ సహాయంతో కనుగొన్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి కూడా.


( నేను వాల్మీకి వారి రామాయణం చదవలేదు. ) ( కొద్దిభాగం నెట్లో చదివాను, ఇంకా కొంత పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను అంతే. )

ఏమైనా పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నానండి.

అంతా భగవంతుని దయ. ......


 

Sunday, August 7, 2011

నేడు చేనేత దినోత్సవం కూడానట......

నేడు చేనేత దినోత్సవం కూడానట...... ..ఫ్రెండ్ర్షిప్ డే , సిస్టర్స్ డే, చేనేత దినోత్సవం........ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలుఅండి.

Friday, August 5, 2011

సవరణ....మరియు , కొన్ని విషయాలు.....సుఖాలు పుణ్యక్షయం కోసం......దుఃఖాలు పాప క్షయం కోసం.

* ఓం.

*సవరణ ...నేను ఇంతకు ముందు ఒక టపాలో....

సుఖాలు పుణ్యక్షయం కోసం.....దుఃఖాలు పాప క్షయం కోసం . అన్న విషయాలు ........ ఇంద్రుడు శచీదేవితో చెప్పారని వ్రాయటం జరిగిందండి.కానీ ఇవన్నీ , దేవగురువైన బృహస్పతి ఇంద్రునితో చెప్పిన సంగతులు. ( మహిషాసురుడు ఇంద్రునితో యుద్ధానికి సిద్ధమయినప్పుడు . )


వారు చెప్పిన దాంట్లో కొంత భాగం........


*సుఖాలు పుణ్యక్షయం కోసం. .దుఃఖాలు పాప క్షయం కోసం. సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవరూపంలో ఖర్చయిపోతాయి. సంచిత పాపాలు దుఃఖానుభవరూపంలో ఖర్చయిపోతాయి.........అంటూ చెప్పటం జరిగింది.

....................................


ఇంకా ,వృత్రుని సంహరించిన తరువాత , ఇంద్రుడు మనశ్శాంతిని కోల్పోయి దేవలోకాన్ని వదిలి మానససరోవరం ప్రాంతానికి వెళ్ళటం జరిగింది.


అనంతరం కొన్ని సంఘటనల తదుపరి, శచీదేవి దేవగురువైన బృహస్పతి సలహాతో , అమ్మవారిని ఆరాధించి ఇంద్రుని వద్దకు రావటం జరుగుతుంది.


అప్పుడు దేవేంద్రుడు శచీదేవిని ఓదార్చుతూ చెప్పిన కొన్ని సంగతులు .....* జగన్మాత పాదపద్మాలను ధ్యానించేవారికి ఏ సంకటాలూ రావు. ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించినా అది నీ శ్రేయస్సుకే అవుతుంది.అని కొన్ని విషయములను తెలిపి ..... . ఇంకా భువనేశ్వరిని ఉపాసించమని చెప్పటం జరిగింది.


తరువాత కొంతకాలానికి అమ్మవారి దయవల్ల ఇంద్రుడు తిరిగి దేవలోకానికి రావటం జరిగింది...................................


ఇంకా రామాయణంలో .......

లంకలో సీతమ్మ జాడను కనుగొన్న హనుమంతుడు .....ఏదైనా ఒక సంఘటనను ( గుర్తుగా .) రాములవారికి చెప్పటానికి చెప్పమన్నప్పుడు. .....


ఈ సంఘటనను సీతాదేవి హనుమంతునికి చెప్పటం జరిగింది.


.ఒకసారి సీతారాములు ఒక పర్వతప్రాంతములో ఉన్నప్పుడు, ............


ఒక కాకి తన ముక్కుతో పొడిచి , రక్తం వచ్చేంతగా సీతాదేవిని గాయపర్చటం జరుగుతుంది.


అప్పుడు శ్రీరాముడు ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించగా , ఆ కాకి లోకాలన్నీ తిరిగి , మరల వచ్చి రక్షించమని రాములవారిని శరణు కోరుతుంది.

( ఈ కాకి ఇంద్రుని సంతతికి చెందినదిగా చెప్పబడింది.అంటే ,మామూలు కాకి కాకపోవచ్చు.? )


అప్పుడు , శ్రీరాముడు బ్రహ్మాస్త్రప్రయోగం వృధాపోరాదని చెప్పి, , ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. అనగా ........

అప్పుడు కాకి తన ప్రాణాలకు బదులుగా ఒక కన్ను కోల్పోతుంది.


ఈ కధలో ఆ కాకి చేసినది చిన్న తప్పు కాదు.


అయినా పక్షి కాబట్టి ,. సీతారాములు దయగలవారు కాబట్టి , అంతగా గాయపరిచిన కాకిని చంపకుండా వదిలేశారు.


జీవించిఉన్న మానవులను అలా రక్తం వచ్చేవరకు గాయపరచటం కాకుల సహజలక్షణం కాదు.


చీమ గానీ, దోమ గానీ మనల్ని కుడితే ,....... పాపం అల్పజీవి కదా ! కుట్టనీ ! అని జాలిపడము కదా ! నలిపేసి చంపేస్తాము.


కానీ, సీతారాములు దయగలవారు కాబట్టి , వారు దానిని చంపకుండా వదిలేశారు.ఇంకా, ఎన్నో తెలిసిన రావణుడు సీతాదేవిని అపహరించిన పాపానికి తగ్గ శిక్షే పడింది....


తను చేసిన అధర్మానికి ఫలితంగా ఎందరో బంధువుల, మిత్రుల , ప్రజల మరణానికి కారణమయ్యాడు.


ఆఖరికి తన వారసులతో సహా మరణించాడు...

.ఈ విషయాల ద్వారా ఎన్నో తెలుసుకోవచ్చు.

.................................................

ఇంకా, మనలో చాలా మందిమి ఏమనుకుంటామంటే,

పెద్దవాళ్ళు పుణ్యకార్యములు చేస్తే ఆ పుణ్యఫలం వారి కుటుంబానికి, ఇంకా తరువాతి తరాలకూ కూడా వస్తుందని అనుకుంటాము.


మరి అలాగే , పెద్దవాళ్ళు పాపాలు చేస్తే వారి తరువాతి తరాలకు ఆ పాపఫలితాలు రావా ? అన్న సందేహం వచ్చింది నాకు.


ఉదా. మనకు ఎవరైనా సొమ్ము
బాకీ ఉన్నారనుకోండి .వారు ఆ బాకీని తీర్చలేకపోతే ఆ సొమ్మును వారి వారసుల వద్ద వసూలు చేస్తాము కదా !


తల్లిదండ్రుల ఆస్తులకే కాదు........ అప్పులకూ పిల్లలు వారసులే కదా !


రావణాసురుడు, దుర్యోధనుడు కుటుంబాలు ఏమయ్యాయో తెలుసుకున్నాము కదా !


* మరి కష్టాలు అనుభవించినా సీతారాముల వారసులు సుఖంగా ఉన్నారు.* ఇతరులను కష్టపెట్టి వారి కష్టాల పునాదులపై తమ కలల సౌధాలు నిర్మించాలనుకునేవాళ్ళ కుటుంబాలు .... కష్టాల పాలయ్యే అవకాశం ఉంది.


( దుర్యోధనుని ,రావణుని వంటి వారి కుటుంబంలా ).


అందుకే పెద్దవాళ్ళు పాపాలు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాలి.....అని తెలుసుకోవచ్చు.

* ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నయెడల క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను....

Wednesday, August 3, 2011

ప్రహ్లాదునికి అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ఏమని చెప్పారంటే,

ఓం.
పురాణేతిహాసములలోని కధలను కొందరు విమర్శిస్తారు.


అందులోని నీతిని గ్రహించకుండా పైపై విషయాన్ని చూసి వితండవాదాలు చేస్తారు.


పిల్లలకు పంచతంత్రము వంటి కధల
ద్వారా ,

పెద్దవారికి పురాణేతిహాసములు, ఇంకా ఇతర ప్రాచీనగ్రంధముల ద్వారా దిశానిర్దేశం చేశారు పెద్దలు.పిల్లలకు ఎన్నో కధలు చెప్పారు పెద్దలు. ,

ఉదా........... పంచతంత్రము లోని కధలలో జంతువులను ప్రధాన పాత్రలుగా చేసి లోకంలోని ఎన్నో విషయాలను బోధించారు .


జంతువులను పాత్రలుగా పెట్టి కధలు చెబితే పిల్లలు ఇష్టంగా కధలు వింటారు కాబట్టి ........


అలా జంతువులు పాత్రలుగా కధలు చెప్పటం జరిగింది.


తెలివిగల పిల్లలు ఆ కధల ద్వారా అందులోని నీతిని నేర్చుకొని . జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.వితండవాదులైన పిల్లలు ఆ కధలలోని నీతిని వదిలేసి ....... అసలు జంతువులు ఎక్కడయినా మాట్లాడుతాయా ?

జంతువులు ఎక్కడయినా మనుష్యుల్లా ఆలోచిస్తాయా ?నిరూపించండి. అని, ఇంకా,అంతా ట్రాష్. మూఢత్వం, పెద్దలు చెప్పటం మీరు వినటమూ ........ అంటూ వితండవాదాలు లేవదీస్తారు.


అలాగే , పురాణేతిహాసములలోని నీతిని నేర్చుకోవాలి అంతేకానీ , వితండవాదం చెయ్యటం సరి కాదు.


ఆ కధల ద్వారా మంచి పనులు చేసే వాళ్ళు తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా , చరిత్రలో గొప్పవారిగా చిరకీర్తిని సంపాదించుకుంటారు. అని,


చెడ్డపనులు చేసేవాళ్ళు తమతో పాటు ఇతరులను కూడా కష్టాలపాలు చేసి చెడ్డవాళ్ళుగా చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు . .అని తెలుస్తుంది.దుర్యోధనుడికి రాజ్యభోగములు ఎన్నో ఉన్నా కూడా ఎప్పుడూ ......పాండవులను ఏ విధంగా కష్టాలపాలు చెయ్యాలి ?


ఒకవేళ పాండవులు వనవాసం మధ్యలో మానేసి తనమీదకు దండయాత్రకు వస్తారేమో ?

ఇంకా ఇలాంటి ఆలోచనలతోనే జీవితం తెల్లారిపోయింది.


అష్టైశ్వర్యాలు చుట్టూ ఉన్నా ఇలాంటివారు ఏమీ మనశ్శాంతిగా ఉండలేరు.

మనశ్శాంతి లేనప్పుడు అష్టైశ్వర్యాలూ ఉన్నా ఏం లాభం?


పాండవులు వంటి వారు ఉన్నంతలోనే సంతోషంగా ఉంటారు. ( వారికి అత్యాశలు ఉండవు కాబట్టి ).


ఒక సందర్భంలో ,ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ఏమని చెప్పారంటే,


* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.* అమ్మవారు చెప్పిన విషయాన్ని అంతగా వివరించే శక్తి నాకు లేదు .


ఈ రోజుల్లో కూడా చూడండి.


తగినంత సంపాదన ఉండి ,
సంగీతాన్ని నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా , తమకు వచ్చిన పాటలు హాయిగా పాడుకుంటూ జీవితాన్ని గడిపేసేవారూ,తమకు ఇష్టమయిన వ్యాపకంతో, ఉన్నంతలో సంతోషంగా ,తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నవారూ ఎందరో ఉన్నారు.


ఇంకా, బోలెడు అక్రమ సంపాదన ఉన్నా కూడా అసహనంతో, అభద్రతతో మనసంతా అల్లకల్లోలంగా ఉండే వారూ ఉన్నారు. .


అందుకే మనం తెలుసుకోవలసింది ఏమంటే ......


* దైవం దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.....అని.

Monday, August 1, 2011

దైవానికి, అందరికి క్షమాపణలు చెబుతున్నానండి .....పొరపాట్లు ఉంటే..


భగవంతునికి సంబంధించిన విషయములలో నా అభిప్రాయములు వ్రాస్తున్నాను కదండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. నాకు సంస్కృతము కూడా రాదు.


అయితే తెలిసినంతలో నా అభిప్రాయములు వ్రాయాలని నా తాపత్రయం.వీటిలో పొరపాట్లు కనిపిస్తే , దయచేసి తెలిసిన వాళ్ళు చెప్పగలరు. ( మీకు ఇబ్బంది లేకపోతే )


ఇక,. కొందరు ఏమంటారంటే , దేవుడు వేరు ..... జీవుడు వేరు అంటారు.


కొందరేమో దేవుడు జీవుడు ....... వేరు కాదు , ఒకటే అంటారు.


నాకు ఏమనిపిస్తుందంటేనండి. రెండు అభిప్రాయములు కూడా సరైనవే అని.


1. ఉదా...............పిల్లలు తల్లిదండ్రుల నుంచీ పుట్టడం జరుగుతుంది.
అలా చూస్తే, తల్లిదండ్రులూ పిల్లలూ ........ వేరువేరు కాదు అనిపిస్తుంది..కానీ , పిల్లలు జన్మ ఎత్తిన తరువాత తల్లిదండ్రులు, పిల్లలు ....... వేరే గదా అనిపిస్తుంది. !
2. ఉదా................ఒక పెద్ద మొక్క నుంచి విత్తనముల ద్వారా గానీ ,అంటు కట్టడం ద్వారా గానీ పిల్ల మొక్క ఏర్పడుతుంది .


ఇక్కడ పెద్ద మొక్క నుంచే పిల్ల మొక్క ఏర్పడుతుంది.కాబట్టి,.


ఒక కోణం నుంచీ చూస్తే ,పెద్దమొక్క పిల్ల మొక్క ....... వేరు వేరు కాదు., రెండూ ఒకటే అనిపిస్తుంది..కానీ ,
ఇంకో కోణం నుంచీ చూస్తే, పెద్ద మొక్క నుంచీ విడిగా ఏర్పడిన తరువాత ,
పెద్దమొక్క పిల్లమొక్క ....... వేటికవి వేరే కదా ! అనిపిస్తుంది.


ఇలాగే భగవంతుని నుంచే జీవులు ఏర్పడ్డారు.


ఆ విధంగా చూస్తే ....... దేవుడు జీవుడూ వేరువేరు కాదు అనిపిస్తుంది..కానీ జన్మ ఎత్తి జీవుడుగా ఏర్పడిన తరువాత .... జీవుడూ దేవుడూ ....... కొద్దిగా వేరు . అని కూడా అనిపిస్తుంది.

(
అదే సమయంలో జీవునిలో దేవుడు ఉన్నాడని కూడా అనిపిస్తుంది. ).ఈ ఉదాహరణలతో దేవుని జీవుని ............ పూర్తిగా పోల్చలేము కానీ కొంతవరకూ పోలిక కనిపిస్తుంది.


ఆత్మలో పరమాత్మ ఉంటారని కొందరు అంటున్నారు.


* అయితే , ........... తాను కానిదేదీ ఈ సృష్టిలో లేదని దైవం చెప్పటం జరిగింది.


* ఇంకా,............. జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారం ప్రేరేపిస్తూ ఉంటానని కూడా దైవం చెప్పటం జరిగింది.


అందుకే అనిపిస్తుంది..........


తల్లిదండ్రులకు పిల్లలకు , పెద్దమొక్కకు పిల్లమొక్కకు ఉండే బంధం ఒక జన్మవరకో కొన్ని జన్మల వరకో మాత్రమే ఉంటుంది.


* కానీ దైవానికి జీవులకు ఉన్న బంధం విడదీయరానిది. అంతం లేనిది.


జీవులందరూ ఎప్పటికయినా తిరిగి భగవంతుని చేరవలసినవారే.ఇందులో పొరపాట్లు ఉంటే క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.....