koodali

Wednesday, August 24, 2011

దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని..........

 

పెద్దలు చెప్పిన ప్రకారం , భగవంతుడు భక్తులకు తన దర్శనభాగ్యాన్ని , ఒకోసారి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు.

ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే , వారు భక్తులు కాబట్టి.

కానీ , ఒకోసారి రాక్షసులను వధించేసమయంలో వారికి కూడా భగవంతుని దర్శనభాగ్యం లభిస్తుంది కదా ! మరి వాళ్ళకు కూడా మోక్షం వస్తుందా ? అని నాకు సందేహం కలిగింది.


అయితే , రాక్షసులలో కూడా ఎన్నో కష్టాలకు తట్టుకుని గొప్ప తపస్సులను చేసిన తరువాతే వారికి దేవతల దర్శనం , వరాలు లభించాయి.

ఆ తరువాత వరగర్వంతో రాక్షసులు విర్రవీగి లోకాలను పీడించినప్పుడు దేవతల చేత సంహరించబడ్డారు అది వేరే విషయం. .


దేవతలు చేసిన దేవీ స్తుతి చదివిన తరువాత నా సందేహాలకు సమాధానాలు లభించాయని నాకు అనిపించింది. ( నాకు అర్ధమయినంతలో ).


* వృత్రుణ్ణి సంహరించేందుకు సహాయం కోరి , దేవతలు చేసిన దేవీ స్తుతిలో కొంత భాగం........


అమ్మా ! వృత్రుడి మీద నీకు దయ ఉండవచ్చు. అతడికి మేలు చెయ్యాలని నువ్వు భావించవచ్చు. నిజానికి ఇప్పుడు వెంటనే సంహరించడమే అతడికి మేలు చెయ్యడం. లేకపోతే ఆ జన దుఃఖకరుడు, ఖలుడు, పాపాత్ముడు, దుష్టబుద్ధి ఇంకా, ఇంకా పాపకూపంలో కూరుకుపోతాడు. అందుచేత ఉద్ధరించు. నీ బాణాలతో పవిత్రుణ్ణి చెయ్యి. నువ్వు రాక్షసులను సంహరించడమంటే వారిని పరిపూతులను చేసి నందనవనానికి పంపడమే కదా ! ...

 
* ఇంకా , బ్రహ్మాదిదేవతలు చేసిన మహిషాసుర మర్దనీ స్తుతిలో కొంత భాగం... అమ్మా ! నీ హృదయం దయా సముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులనూ అలాగే పోషిస్తున్నావు. సకలచరాచర సృష్టి జాతమూ నీ అంశయే కదా ! నీ సృజనయే కదా ! పెంచిన వనంలో అన్ని చెట్లూ ఉంటాయి. చేదు విషం లాంటి వృక్షాలుంటాయి. ఎందుకూ పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికిపారేస్తామా ? అలాగే నువ్వూ దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గ నివాసం ప్రసాదించి , అప్సరసలపై వారికున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాము. అదీ - కాక నువ్వు తలుచుకుంటే చాలు దనుజులు సర్వనాశనమైపోతారు. వారిని సంహరించడంకోసమని నువ్వు ఇలా రూపం ధరించడం, రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం. .......

అంటూ ఇంకా,...

* నువ్వు దయార్ద్ర హృదయవు కనక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయుండేవారు. .... అంటూ అలా స్తుతించటం జరిగింది.


* శ్రీ రాముని, శ్రీ కృష్ణుని ఆ నాటి వారు ఎందరో చూశారు. వారిలో కొందరు మాత్రమే వారిని దైవాంశసంభూతులుగా గుర్తించారు.

* మనము ప్రత్యక్ష భగవంతుడైన సూర్యుని రోజూ చూస్తూనే ఉన్నాము.

మహా భక్తులు దైవం యొక్క విశ్వరూపసందర్శన భాగ్యాన్ని పొంది, దైవం యొక్క అపార అనుగ్రహానికి పాత్రులవుతారు.


రాక్షసులు వంటివారు దైవం యొక్క దర్శనాన్ని పొందినా , వారి అపార అనుగ్రహాన్ని మాత్రం పొందలేరు.

అయితే దైవం యొక్క దర్శనాన్ని పొందాలన్నా ఈ రాక్షసుల వంటివారు క్రితం జన్మలో ఎంతో కొంత కష్టతరమైన తపస్సులను చేసినవారై ఉంటారు.


రాక్షసులలో కూడా వివిధ రకాల వారు ఉంటారు.

రావణాసురుడు , మొదటి నుంచీ రాక్షసుడు కాదు. వైకుంఠంలోని ద్వారపాలకులైన జయవిజయులలో ఒకరు. కొన్ని కారణాల వల్ల రావణాసురునిగా జన్మించవలసి వచ్చింది.


శంఖచూడుడు అనే అసురుడు, గోలోకం లో సుదాముడు అనబడే గోపకుడు. శ్రీ కృష్ణుని అంశను కలిగినవాడు. కొన్ని కారణాలవల్ల శంఖచూడునిగా జన్మించవలసి వచ్చింది..


వీరు కొన్ని పొరపాట్లు చేసి దైవం చేతిలో సంహరించబడి తిరిగి దైవసాన్నిధ్యాన్ని ( మోక్షాన్ని ) పొందటం జరిగింది.


ఇక..ఇతరుల విషయానికి వస్తే,

* దైవం చేతిలో చంపబడ్డ రాక్షసులు స్వర్గాన్ని పొందుతారని ఇంతకు ముందు దేవతలు చేసిన స్తుతిని చదివితే తెలుస్తుంది.

* దీనిని బట్టి నాకు అర్ధమయింది ఏమంటే , దైవం చేతిలో చంపబడ్డా సరే, అందరు రాక్షసులకు మోక్షం ఉండదని , వారు స్వర్గానికి వెళతారనీ. .. ( యుద్ధంలో మరణించే సైనికులు స్వర్గానికి వెళ్ళినట్లు. )

* దైవభక్తులకు మాత్రం దైవానుగ్రహం, ఇంకా మోక్షం కూడా లభించే అవకాశం ఉంది అని.......

స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గానికన్నా మోక్షం ఉత్తమమైనది.

* ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి.

 

No comments:

Post a Comment