koodali

Friday, January 31, 2014

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ? రెండవ భాగం.


ఈ రోజుల్లో  దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము.  పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది.


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.


( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )

అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు.   కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి.    పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.  


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా.


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.


చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.   ఇప్పుడు  సెల్ ఫోన్స్  లో  కూడా  అసభ్యకరమైన దృశ్యాలు   చూసే  వీలు  వచ్చేసింది. అనభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల   ప్రభావం  ఎంతో  ఉంటుంది. 
 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళయిన    ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల    రక్షణ   గురించి  కూడా  ఆలోచించండి.

.........................విచిత్రం ఏమిటంటే  ఈ మధ్య  కొందరు  ఆడవారు  కూడా  మత్తు  పదార్ధాలను   తీసుకుంటున్నారు . ఈ  మధ్య  ఒక  అమ్మాయి  మత్తులో  రోడ్డుపై  పడి  గొడవ  చేసిన  విషయాన్నీ  మీడియాలో  చూసాము కదా ! 


ఇది  మరింత  ప్రమాదకరం .

Wednesday, January 29, 2014

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

 ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? 


పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  


ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు .


ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది. 


బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
.................. 

పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.

 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ 
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 


 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)


ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  క్రెచ్ లోనో  వదిలి  పరిగెడుతుంటారు.   ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 


  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  క్రచ్ లోనే  వదలాలి.  


..................

ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 


  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 


 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి.   ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .


కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు.  ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు.  నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ? 

................. 


ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  

 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 


ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .


Monday, January 27, 2014

సతీ సుమతి...మరి కొన్ని విషయాలు .విశ్లేషణ ..


సుమతీదేవి  ఎంతో  ఓపికతో, సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.ఆమె భర్త అనారోగ్యంతో  ఉండి కూడా  భార్యనే  కోరరాని  కోరిక  కోరాడు. 


  భార్య   అనుకూలవతి  అయినా  పర  స్త్రీల  పట్ల  మోజుపడే   వారు  ఉంటారు . 

  తన  ప్రియురాలి  వద్దకు    తీసుకెళ్ళమని  భార్యను  కోరాడు. ఏ  స్త్రీకయినా  ఇలాంటివి  తట్టుకోవటం  కష్టమే. 


 ఇలాంటి  భర్తను  కఠినంగా  శిక్షించాలని  చాలామంది   అంటారు . ఇలాంటివి  విన్నప్పుడు   అంతటి  బాధ  కలిగే  మాట  వాస్తవమే.   


అయితే,  వ్యసనపరుడైన  భర్తను  శిక్షించాలని  ఆవేశపడే  వాళ్ళు  తమ  పిల్లలు  లేక  అన్నదమ్ములు   వ్యసనపరులైనా  ఇలాగే  శిక్షించాలని కూడా అనగలరా ?

 శిక్షకన్నా   ముందు    నేరస్తులలో  పరివర్తన  తేవటానికి    ప్రయత్నించవచ్చు.

...............

 సుమతీ  సాధ్వి  తన  భర్త  కోరికను తీర్చటానికి  సిద్ధమవటానికి ఎంతటి  మానసిక  వ్యధను  అనుభవించిందో కదా !

  రోగిష్టి  అయిన  తన  భర్త  కోరికను  తీర్చటానికి   అతని  ప్రియురాలు    ఒప్పుకోదని  సుమతి  భావించి  ఉండవచ్చు.   ఆ  నమ్మకంతోనే  భర్తను  ఇతరుల  వద్దకు  తీసుకెళ్ళటానికి  ఒప్పుకుని  ఉండవచ్చు. 
........................................వ్యసనపరులను  మంచి  మార్గంలోకి  తేవాలంటే   ఎంతో  ఓర్పు,  నేర్పు ఉండాలి. ఈ  రోజుల్లో  వ్యసనపరులను  మార్చటానికి  సైకాలజిస్టుల వద్దకు  తీసుకువెళ్తున్నారు.

 వ్యసనపరులను  మార్చాలంటే  సైకాలజిస్టులు  కూడా  ఎంతో  సహనంతో   ప్రయత్నించవలసి  ఉంటుంది. సుమతి  ఎంతో  సహనంతో .... వ్యసనపరుడయిన  తన  భర్తను  తానే  సరిదిద్దుకుంది.

....................
 
సుమతి ఎంతో  సహనంతో  తన  కాపురాన్ని  చక్కదిద్దుకుంది.  అందుకు  ఆమె   ఎంతో  అభినందనీయురాలు. ఆ విధంగా  సమాజానికి  ఒక  చక్కటి  మేలును  చేసింది.

సుమతి చేసిన  దానిలో  తప్పేమిటి ? ఎవరి ఇల్లును  వారు  సరిదిద్దుకుంటే దేశమే  బాగుపడుతుంది కదా!

  అయితే  ఇలా  సరిదిద్దటం  తేలికయిన  పనేమీ  కాదు.  అందుకు  ఎంతో  సహనం  అవసరం. 


  (  జీవితభాగస్వామి  మరీ  శాడిస్టు   అయినా  సర్దుకుపోవాలని  నా  అభిప్రాయం  కాదు. అయితే  ఈ  కాలంలో  కొందరు  జీవిత  భాగస్వామిలో  చిన్న  లోపాలున్నా  శాడిజం  అనేస్తున్నారు. అది  తప్పు.  )

.....................

సుమతిలాంటి   అత్యంత  సహనశీలురకు   న్యాయం  చేయటానికి  సూర్యుడు , అనసూయాదేవి  వంటి   వారు  కూడా తమ  సహకారాన్ని  అందిస్తారు.
.......................వ్యసనపరులను, చెడ్డపనులు   చేసేవారిని 
చెంపపగలగొట్టాలని కొందరు   అంటారు .అయితే,  చెంపపగలగొట్టటం  వల్ల  మళ్ళీ   చెడ్డపనులను   చేయరని   నమ్మకమేమిటి ?

  రెచ్చిపోయిన  వాళ్ళు   మరింతగా   చెడ్డపనులను  చేసే  ప్రమాదం  కూడా  ఉంది.

అయితే ,  అలాగే  వదిలేస్తే  వారు  సమాజం  మీద  పడి  ఇతరులకు  హాని  చేసే  అవకాశం 
కూడా  ఉంది.

 అందుకని,   వారిని  మంచివారి గా  మార్చటానికి  ప్రయత్నించటంలో  తప్పులేదేమో...అనిపిస్తోంది.

ప్రయత్నించినా  మారకపోతే  అప్పుడు  కఠినంగా  శిక్షించవలసిందే.  మరీ  క్రూరమైన  నేరాలను  చేసిన  వారి  విషయంలో  మాత్రం  వారిని  మార్చటానికి  ప్రయత్నించటం  కన్నా .....  వెంటనే  కఠినంగా  శిక్షించటమే  మంచిదనిపిస్తోంది.  ఆ  శిక్షలు  ఎలా ఉండాలంటే, ఇతరులు  మళ్ళీ  తప్పు  చేయటానికి  భయపడేంత  కఠినంగా  శిక్షించాలి.  


నేరస్తులకు   కఠినశిక్షలు  వేసిన  తరువాత  ,  అటువంటివారు    తయారుకావటానికి    గల  మూల  కారణాలను  గుర్తించి   వ్యవస్థను   మార్చటానికి  ప్రయత్నించాలి.

..............................

మన  పూర్వీకులైన  భార్యాభర్తలు  ఇప్పటి  కాలపు  భార్యాభర్తలలా .......నా హక్కులే  నాకు  ముఖ్యం...అంటూ   విడిపోయి  ఉంటే  ఈ దేశంలో  కుటుంబవ్యవస్థ  ఎప్పుడో  మాయమై  ఉండేది. 

 ......................

   మనుషుల  మధ్య  ఎన్నో  భేదాభిప్రాయాలు  ఉంటాయి.  తల్లిబిడ్డల  మధ్య  కూడా   అభిప్రాయ  భేదాలు  వస్తుంటాయి.  ఎక్కడో  పుట్టిపెరిగిన  భార్యాభర్తల  మధ్య  అభిప్రాయభేదాలు  ఉండటం  అత్యంత  సహజం.  

అందుకే  మన  పెద్దవాళ్ళు  సర్దుకుపోతూ  సంసారాలు  చేసారు. తమ  సుఖసంతోషాలను   కొద్దిగా  తగ్గించుకుని  అయినా పిల్లలను  సంతోషంగా  ఉంచారు.

...................

ఎన్నో  కష్టాలను  సహించి   కుటుంబవ్యవస్థను  నిలబెట్టిన  ఈ  దేశపు  పెద్దవాళ్ళకు  శిరస్సు  వంచి  నమస్కరిస్తున్నాను. 


 Sunday, January 26, 2014

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ...ఈ  దేశ  స్వాతంత్ర్యం  కోసం  ఎందరో   ఎన్నో  త్యాగాలు  చేసారు.

ఇప్పటికీ  దేశాన్ని  రక్షించటం  కోసం  సరిహద్దులలో  ఎందరో  సైనికులు   ఎన్నో  కష్టాలకోర్చి   దేశ  రక్షణ  బాధ్యతలను  నిర్వర్తిస్తున్నారు. 


  విధినిర్వహణలో  కొందరు  సైనికులు    ప్రాణాలను  కోల్పోయారు .   సైనికుల  కుటుంబసభ్యులు  కూడా  త్యాగమూర్తులే.  

దేశం  కోసం  శ్రమించిన  మరియు  శ్రమిస్తున్న   ప్రతి  ఒక్కరి   శ్రమ   వెలకట్టలేనిది.  అందరికీ  కృతజ్ఞతలను  తెలియజేసుకుంటున్నాను. 


Friday, January 24, 2014

పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుందో ...

ఈ  మధ్య  సమాజం  గందరగోళంగా  తయారయ్యింది.  నైతికవిలువలకు  ప్రాముఖ్యత  తగ్గిపోవటం  బాగా  కనిపిస్తోంది.  టెక్నాలజీ   వల్ల  అశ్లీల  దృశ్యాలు  అరచేతిలో    చూడటానికి   అందుబాటులోకి  వచ్చాయి.

 భారతీయ  సంస్కృతి  గొప్పది  అంటూ  పైకి  చెప్పటమే  కానీ   విదేశీ  సంస్కృతి  అంటే  మోజు పడుతున్న  ప్రజల  సంఖ్య  పెరుగుతోంది.  సమాజంలో  నేరాలు  ఘోరాలు  జరుగుతున్నాయంటే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి.  పిల్లలను  చక్కటి   పౌరులుగా  తయారుచేస్తే  సమాజంలో  నేరాలు  ఘోరాలు  గణనీయంగా  తగ్గుతాయి.  అందుకు  తల్లితండ్రుల   బాధ్యత  ఎంతో  ఉంటుంది. 


 * తల్లితండ్రులు  పిల్లలను  ప్రేమగా,  బాధ్యతగా  పెంచాలి.   మంచి  పౌరులుగా  తయారుచేయాలి.   క్రమశిక్షణ పేరుతో  అతిగా  ఆంక్షలు  విధించటము...అతి  స్వేచ్చనిచ్చి  వదిలేయటం  రెండూ  తప్పే.  


సంపాదన  కోసం  అంటూ  కుటుంబసభ్యులు  ఎవరిదారిన  వాళ్ళు  పోతున్న  వ్యవస్థ   పెరిగిన   ఈనాటి  సమాజంలో  పిల్లలు   ప్రవర్తనలో  గణనీయమైన  మార్పులు  వస్తున్నాయి. కొందరు  పెద్దవాళ్ళు  తమ  విలాసాల  మోజులోపడి  కుటుంబాన్ని  నిర్లక్ష్యం  చేస్తుంటారు.  బాధ్యతారాహిత్యంగా  తిరిగే  తల్లితండ్రుల  పాపం  ఎప్పుడు  పండుతుందో...

* టెక్నాలజీ  ద్వారా   విచ్చలవిడిగా  వ్యాపిస్తున్న  అశ్లీలతకు  అడ్దుకట్ట  వేయవలసిన  అవసరం  ఉంది. కొన్ని   సినిమాలు,  సీరియల్  కధలు  మరియు  మీడియా  ద్వారా  ప్రసారమయ్యే  అసభ్య  కార్యక్రమాలు  సమాజంపై  చాలా  ప్రభావాన్ని  చూపిస్తున్నాయి.  ఇలాంటి  కార్యక్రమాలను  ప్రసారం  చేస్తున్న  వారికి,  పత్రికలలో  అశ్లీల  చిత్రాలు  వేసి  డబ్బు  సంపాదిస్తున్న  వారికి  పాపాలు  పండే  రోజు  ఎప్పుడు  వస్తుందో ...* మద్యం  వల్ల    ఎన్నో   కుటుంబాలు  ఆర్ధికంగా  చితికిపోతున్నాయి.  ఆరోగ్యాలు  పాడవుతున్నాయి.  ఆ  మత్తులో  నేరాలూ    చేస్తున్నారు.      మద్యం  వల్ల   డబ్బు  సంపాదిస్తున్న  వారికి   పాపాలు  పండే  రోజు  ఎప్పుడు  వస్తుందో ...   ప్రజల  సంరక్షణను  చూడవలసిన   ప్రభుత్వాలే  ఆదాయం  కోసం  అంటూ  మద్యాన్ని   ప్రోత్సహిస్తున్నప్పుడు  ఇక  చెప్పటానికి  ఏముంది ?*   ప్రభుత్వాలు  ,  తల్లితండ్రులు,   విద్య  నేర్పించే వ్యవస్థ  , పటిష్టంగా  అమలవుతున్న   చట్టం...  ..ఇలా  వ్యవస్థ  అంతా   కలిసికట్టుగా  పనిచేస్తేనే  నేరాలు...ఘోరాలు  తగ్గుతాయి.


 
 
 

Wednesday, January 22, 2014

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం.


ఆధునికవిజ్ఞానం..".Matter and energy cannot be created or destroyed "....  అని  వివరించటం  జరిగింది.

 సృష్టిలోని  పదార్ధాల   రూపం  మారే   అవకాశం  ఉంది  గానీ   మూల శక్తి    నాశనం  కాదు.  ఉదా..ఆవిరి  నీరుగా  రూపాంతరం  చెందుతుంది.  నీరు  మంచు గా  రూపాంతరం  చెందుతుంది ,  మంచు  నీరుగా,  నీరు  ఆవిరిగా  మారే  అవకాశం  ఉంది    గానీ    మూలశక్తి  ఎప్పుడూ  ఉంటుంది. దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం   నిత్యమూ  ఉండే  శక్తి.    దైవానికి  ఆది అంతమూ  లేదు.     మొదలైన  విషయాల   గురించి   విష్ణుచిత్తుల వారు  మరియు  ఎందరో  మహానుభావులు  తమ    అభిప్రాయాలను    తెలియజేసారు.   ఈ మధ్య   టీవీలో  ప్రసారమైన  ఒక    కార్యక్రమంలో   శ్రీ  సామవేదం  షణ్ముఖశర్మ  గారు   కొన్ని  విషయముల  గురించి  తెలియజేస్తూ....మర్రి  విత్తనంలో  ఉండే  శక్తి  గురించి  తెలియజేశారు.   నిజమే,  మర్రి  విత్తనాన్ని  చూసిన  వారికి  పెద్ద  కాండము,  శాఖోపశాఖలు  కనిపించవు.  అంత  చిన్న  విత్తనంలో    మహావృక్షం    దాగుంది.

  చిన్న  విత్తనం  నుంచి  మహావృక్షం  రావటం   అనేది  సృష్టిలో  ఒక    అద్భుతం.  సృష్టిలో  ఇలాంటి  అద్భుతాలెన్నో  ఉన్నాయి.

..............


ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) 


అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు.  దైవానికి  అనేక  వందనములు.

Monday, January 20, 2014

* అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా సృష్టించారు....* కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....


దైవం, ఈ భూలోకంలో మానవులను , వారి ఆహారానికి అవసరమైన మొక్కలనూ సృష్టించారు.


మొక్కలను సృష్టించటానికి ముందే , సూర్యుడిని, గాలినీ, నీటినీ , సృష్టించారు.

ఇలా ఒక పద్ధతి ప్రకారం అన్నీ సృష్టించబడ్డాయి.


ఇదంతా చూస్తేనే తెలుస్తోంది. అనంతమైన గొప్ప ఆలోచనా శక్తి గల మహాశక్తి వల్లనే , అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని.దైవం పచ్చటి ప్రకృతిని, పసిడిపంటలనూ, , పైరగాలినీ, రసభరిత ఫలాలనూ, సుగంధ పుష్పాలనూ .... ఇలా ఎన్నింటినో సృష్టించి మనకు ఇచ్చారు.


ఇంకా, మహా అగ్నిపర్వతాలనూ, మంచుపర్వతాలనూ, మహా సముద్రాలనూ కూడా సృష్టించారు.


సునామీలనూ, సుడిగాలులనూ, సుడిగుండాలనూ కూడా సృష్టించారు.


తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ సౌకర్యాలు అమర్చి ఇచ్చినా ...


తామంటే కొద్దిగా భయభక్తులు ఉండటానికి అప్పుడప్పుడు పిల్లల పట్ల..... కోపాన్ని, గాంభీర్యాన్నీ , ప్రదర్శిస్తారు. అది పిల్లల మంచికోసమే.


వారు తప్పుదారి పట్టకుండా ఉండటానికి అలా చేస్తారు అంతే. .


అలాగే జీవులకు అన్నీ అమర్చి ఇచ్చిన దైవం భూకంపాలు, సునామీలను ఎందుకు సృష్టించారు అంటే ,


మానవులు మరీ అహంకరించకుండా భయభక్తులతో ఉండటానికి ,లోకంలో ధర్మం క్షీణించినప్పుడు ,జీవులను హెచ్చరించటానికి.. ఇంకా ,భూమిపై జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సమపాళ్ళలో ఉండటానికి, ..... ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.


జంతువులకు భూకంపాలు వంటి వాటిని గ్రహించే శక్తి ఉందట.


పూర్వం ప్రజలు జంతువుల ప్రవర్తన ఆధారంగా తామూ భూకంపాలు రావటాన్ని కొద్దిగా ముందే తెలుసుకుని జాగ్రత్త తీసుకునేవారట.


కొందరు , ఈ సునామీలూ, భూకంపాలను తప్పించుకోవటానికి మహిమలు తెలిస్తే బాగుండు అనుకుంటారు.

ఇక్కడ ఒక్క విషయం.


భూకంపాలు, సునామీలూ వచ్చినప్పుడు కూడా కొందరు ఏ హానీ లేకుండా బయటపడతారు.


ఒక పెద్ద ప్రమాదంలో అందరూ చనిపోగా ఒక పసిబిడ్డ చిన్న దెబ్బ తగలకుండా బయటపడిన వార్త ఆ మధ్య చదివాను.


ఇదంతా వారివారి పూర్వసుకృతంపై ఆధారపడి ఉంటుంది. . కాలం కలిసివస్తే ఎంత గొప్ప ప్రమాదం నుంచి అయినా బయటపడతారని తెలుస్తోంది కదా !


లోకంలో ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటేనే కొందరు మానవులు విశ్వంలో తామే గొప్ప అంటున్నారు.


ఇక ఏ భయమూ లేకపోతే మనుష్యులు మరీ అహంకరించే అవకాశం ఉంది.,


మనం తెలుసుకోవలసింది ఏమంటే, ఇవన్నీ పరీక్షలు.


ఈ పరీక్షలకు తట్టుకుని ఈ లోకంలో సత్ప్రవర్తనతో జీవించిన వారికి బాధలు లేని ఉత్తమలోకాలకు వెళ్ళటానికి అర్హత లభిస్తుంది.


అందుకే, ఈ భూకంపాలు వంటి వాటికి భయపడకుండా , సత్ప్రవర్తనతో జీవితాన్ని సాగించటానికి ప్రయత్నించాలి .

అదే మనం చేయవలసింది......


...............................


 కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....


కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది.


అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.


కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.* పెద్దలు చెప్పిన స్వర్గం వంటి ," ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం, వంటి ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.


కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.


* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.

ఇంకా,

* ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువమార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు భయపడకుండా కష్టపడాలి.


మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కష్టపడకుండా ఎలా ?


* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.


* జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే.....ప్రపంచాన్ని
జయించినట్లే అని.


* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.


గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు. అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు. రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ......... జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.


ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.


* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.


* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.


* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.


* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.


* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి..Friday, January 17, 2014

పరిపూర్ణత్వం అంటే దైవం మాత్రమే.

 పరిపూర్ణత్వం  అంటే  దైవం  మాత్రమే.

  దైవ  సృష్టిలో  మంచి  ఉన్నది.   దైవ  సృష్టిలో  నెగటివ్  కూడా  ఉన్నట్లు  మనకు  తెలుస్తుంది.  ఇదంతా   భగవంతుని  లీలలో  భాగమే.


  నెగటివ్  అంటే  అంతా  చెడే  అనుకుంటాము  కానీ  నెగటివ్  వల్ల  మంచి  కూడా  జరిగే  అవకాశముంది. 


 ఉదా..  శరీరంలో  రోగకారక  క్రిములు  ప్రవేశించినప్పుడు  వాటిని  బయటకు  పంపటానికి  శరీరంలోని  రోగనిరోధక  వ్యవస్థ....   రోగకారక  క్రిములతో  పోరాడుతుంది.  ఇదంతా  జ్వరం... మొదలైన  చర్యల  ద్వారా బయటకు    తెలుస్తుంది.  అప్పుడు  జ్వరం  వచ్చిన  వ్యక్తి  జాగ్రత్తపడి  అనారోగ్యం  తగ్గటానికి  మందులు  వాడతారు.  ఇక్కడ  జ్వరం  మొదలైన  లక్షణాలు  బాధాకరమే  అయినా  వాటివల్ల  శరీరంలో  ప్రవేశించిన  అనారోగ్యాన్ని  గమనించి  జాగ్రత్తపడే  అవకాశం  కలుగుతోంది  కదా  !   పర్యావరణాన్ని  కలుషితం  చేస్తుంటే  వాతావరణంలో  విపరీతమైన  మార్పులు  వచ్చి  అకాల  వర్షాలు,  వరదలు,   మొదలైనవి   వస్తుంటాయి.   ఇవన్నీ    పర్యావరణం  కలుషితమైన  దానికి  చిహ్నాలుగా  గుర్తించి  పర్యావరణాన్ని  కలుషితం  చేయటాన్ని  తగ్గించుకుంటూ  జాగ్రత్త  పడాలి. ఎవరైనా  చెడ్డ పని  చేస్తే  వారు  దానికి  తగిన  ఫలితాన్ని  అనుభవిస్తారు.    రాక్షసులు  మొదలైన  వారు   చెడ్డ పనులను  చేసినప్పుడు  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించినట్లు  పురాణేతిహాసాల  ద్వారా  తెలుస్తుంది.    చెడుగా  ప్రవర్తిస్తే  శిక్ష  పడుతుందని  గమనించి,   మనము   చెడ్దగా  ప్రవర్తించకూడదనే  నీతిని  నేర్చుకోవచ్చు. ఈ  విధంగా  సృష్టిలోని  నెగటివ్   క్రియల  నుంచి  కూడా   మంచిని  అభివృద్ధి  చేసే  విధానాలను  తెలుసు కోవచ్చు.

.................................... 

Sri Satyanarayana Swamy - YouTube 

  .....  చిత్రం  ద్వారా   ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.  

  పై  చిత్రం  లోని పాట..... 

 Sri Satyanarayana Swamy Video Songs - Bhagwan Hey ... - YouTube  .....

 ఈ పాటలోని  కొన్ని  భావాలు ..... 

ఆకలి  అన్నది  లేకుంటే  ఆశలు  పుట్టే  తావేది..


చీకటి  అన్నది  రాకుంటే  వెలుగుకి  విలువే  ఉంటుందా..


శోకం  లేని లోకంలో  సుఖమెక్కడ  కలిగేది  ...

............................................

దైవం   అంటే  మూర్తీభవించిన  పాసిటివ్  శక్తి. 


  దైవం  ఈ  సృష్టిలో  అంతా  మంచినే   ఉంచవచ్చు  కదా  !  చెడును  కూడా  ఎందుకు  సృష్టించారు  ?  అని  మనకు  సందేహం  వస్తుంది. 

ఆటలలో  ప్రత్యర్ధులు  ఉంటారు.   గెలుపు,  ఓటములు   ఉంటాయి  కదా  !

 ఈ  జగన్నాటకమనే  ఆటలో   నెగటివ్  లక్షణాలను  జయిస్తూ  ఉన్నత  స్థానానికి  ఒకో  మెట్టూ   ఎక్కుతున్నప్పుడు     దైవత్వానికి  దగ్గరవుతూ  ఉంటారు  జీవులు. 


   చెడుపై  గెలుపును  సాధిస్తూ  దైవమనే  పరిపూర్ణత్వాన్ని   పొందటమే మానవ  జీవితమనే  ఆటలో  గెలుపు.Wednesday, January 15, 2014

ప్రత్యక్ష పరమాత్మ సూర్య భగవానుడు.

  సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది.

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత.  సూర్యరశ్మి  వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది. 

సూర్యనమస్కారములు  చేయటం   ఎంతో  మంచిదని  పెద్దలు  చెబుతారు.   


  ఈ  రోజుల్లో  మనుషులు  సూర్యరశ్మికి  దూరంగా  ఏసీ  గదుల్లో  గడుపుతున్నారు. 

 అందువల్ల  ఇప్పటి  వాళ్ళకు   చిన్నతనంలోనే  బీపీ,  సుగర్..వంటి  జబ్బులు  వస్తున్నాయంటున్నారు.  


ఉదయం,  సాయంత్రం  కొంతసేపు   తగుమాత్రం  సూర్యరశ్మి  శరీరానికి  తగిలేలా  చూసుకుంటే  ఆరోగ్యానికి  మంచిది.
 
 ప్రత్యక్షపరమాత్మ  అయిన  సూర్యునికి  అనేక  ప్రణామములు.


Monday, January 13, 2014

దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.. మరియు..


సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.


    సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు  సరైన , హేతుబద్ధమైన  జవాబు  చెప్పలేరు. కొంతకాలం  క్రిందట   టీవీ చానల్ లో  ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం ) 
సినిమాగా  ప్రసారమయ్యింది. అందులోని కొన్ని  విషయాలు..

 ఆ  కధలో,    ఒక  రాజుగారు  నాస్తికులు.

ఆ  రాజు  ,  ఆస్తికులను ,  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.   


సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు ...  ప్రశ్న  అడుగుతారు.


 అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.


 అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు.  (  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )

 
విష్ణుచిత్తుల  వారు  చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు  తోచినంతలో  కొన్ని  అభిప్రాయాలు... 

         
ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.  అలాగే,  

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం  నిత్యం.  దైవానికి  ఆది అంతమూ  లేదు. అని  చెప్పటం   విష్ణుచిత్తుల వారి  అభిప్రాయం  కావచ్చు .   అనిపిస్తోంది . 

 ............................... 


 సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు. 


ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదాని  తరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !


.............................


   ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు.అసలు  ప్రతిదానికి    ఆది ,  అంతమూ  ఉంటుందని   ,  ఉండాలని  మనం  ఎందుకు  అభిప్రాయపడాలి  ?


సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా. 


  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

...............................

 రామకృష్ణపరమహంస  శారదాదేవిల   శిష్యులైన   వివేకానందుని  జయంతి ,

సంక్రాంతి  పండుగ  రోజుల లో  సూర్యారాధన  ,

 గోదారంగనాధుల   కల్యాణం  ( భోగి పండుగ),


 సంక్రాంతి, 
మీలాదున్నబి ,  అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం.... 

అన్నింటి   సందర్భంగా    అందరికి  శుభాకాంక్షలు.

Friday, January 10, 2014

.పూజలు చేయటంతో పాటు పర్యావరణం విషయంలో జాగ్రత్తలు....

     ఈ  మధ్య  కాలంలో  శ్రీశైలంలో   శివలింగమూర్తికి  వచ్చిన  తేడా  గురించి  వార్తలు  వస్తున్నాయి.  లోకంలో    పాపం  పెరిగితే  ఇలాంటివి  జరుగుతాయేమో ?
................................. 


  ఇంతకుముందు  కూడా  పంచారామక్షేత్రాలలో  ఒక  శివలింగము   యొక్క  మూర్తిలో  తేడాలు  కనిపించాయని ,  అప్పుడు   కొంతకాలం  అభిషేకాల  విషయంలో  జాగ్రత్తలు  తీసుకున్నారని  విన్నట్లు  గుర్తు.

కొంతమంది  ఏమంటున్నారంటే ,  అభిషేకాలకు  వాడే  పాలు,  నీళ్ళు  వంటివి   శుద్ధమైనవి  కానప్పుడు    ఇలా  జరిగే  అవకాశం  ఉంది  అంటున్నారు.

 శివలింగమూర్తి  విషయంలో  అభిషేకాల  విషయంలో   బయట  నుంచి  తెచ్చిన  పాలను  కాకుండా  దేవస్థానం  వద్ద    పెంచిన  ఆవుల  పాలనే  వినియోగిస్తే  బాగుంటుందని   టీవీ  చర్చలలో  ఒకరు    చక్కటి  సూచనను  చేసారు.

........................................ 


  ఒకప్పుడు     దేశవాళీ  ఆవుపాలను  వాడేవారు.    ఇప్పుడు   అంతా  కల్తీ  ఎక్కువయ్యింది.  నీళ్ళు  కల్తీ,  పాలు  కల్తీ,  గాలిలో  పొల్యూషన్.. 


  రసాయనాలతో  కలుషితమైన  జలాలతో  పెరిగిన  గడ్డిని  తిన్న  పశువుల  పాలను  త్రాగినా  ప్రమాదమేనని    పరిశోధకులు  హెచ్చరిస్తున్నారు.

పెరిగిన  కాలుష్యం  వల్ల   మనుషులలో  కూడా  కాన్సర్  వంటి  జబ్బులు  ఎక్కువగా  వస్తున్నాయి.  కొంతకాలం  క్రిందట  కాన్సర్  వంటి  జబ్బులు  తక్కువగా  ఉండేవి.

......................... 


పూర్వం  తలస్నానం   చేయాలంటే  కుంకుడురసం,  శీకాయ  వంటి  సహజసిద్ధమైనవి  వాడేవాళ్ళం.  ఇప్పుడు  షాంపూలు  వాడుతున్నాము. అందువల్ల  ఇప్పుడు  కొందరు   పిల్లలలో  చిన్న  వయసులోనే    వెంట్రుకలు  నెరవటం  వంటి  సమస్యలు  వస్తున్నాయి.

పాత్రలు,  ఇల్లు  శుభ్రం   చేసుకోవాలంటే  పూర్వం  ఆసిడ్లు  వాడేవారు  కాదు.  ఇప్పుడు  ఇళ్ళు  శుభ్రం  చేయాలన్నా,  బాత్రూంస్  శుభ్రం  చేయాలన్నా    రసాయనాలను ( యాసిడ్స్ )  వాడుతున్నారు.

 శుభ్రం  చేయటానికి  వాడే  ఈ  యాసిడ్స్  మురికి  నీటితో  పాటు  బయటకు  పోయి  భూమిలో   ఇంకుతాయి.   వర్షం  నీటితో  పాటు  చెరువుల్లో,   నదుల్లో  కలిసిపోతాయి.  ఆ  నీటినే   త్రాగటానికి , పంటలు  పండించటానికి   వాడుతారు.

 ఇలా  రసాయనాలతో  కలుషితమైన  భూమిలో,  నీటితో   పెరిగిన  ఆహారపదార్ధాలలో  కూడా    రసాయనాల  అవశేషాలు  ఉంటున్నాయంటున్నారు.   నిస్సారమైన   ఇలాంటి  ఆహారాన్ని  తీసుకోవటం   వల్ల  కాబోలు   ఇప్పటి  మనుషులు   ఎంత  తిన్నా  కూడా   నీరసంగానే  ఉంటున్నారు.

  పర్యావరణం  బాగుంటే  శుద్ధమైన  నీళ్ళు,  పాలు    లభిస్తాయి.

............................ 


ఇవన్నీ  గమనించితే  ఏమనిపిస్తుందంటే,   శివలింగము మూర్తి  విషయం    మానవులకు  హెచ్చరికగా  భావించి,  పర్యావరణాన్ని  కాపాడుకోవాలి.    


రేపు  వైకుంఠ  ఏకాదశి ..........  .పూజలు  చేయటంతో   పాటు    పర్యావరణం  విషయంలో  జాగ్రత్తలు   తీసుకుంటే   దైవకృప    లభిస్తుంది . దేవాలయాల  వద్ద  ప్లాస్టిక్   కవర్లను  ఎక్కడపడితే  అక్కడ  పడేయవద్దు.
Wednesday, January 8, 2014

స్థానికతను ఎలా నిర్ణయిస్తారో దయచేసి తెలియజేయండి .వెనకటికి  ఒక  ఈగ  ఇల్లిల్లు  తిరుగుతూ  తన  పేరు  మర్చిపోయి  అందరిని  అడిగిందట.   బదిలీల  వల్ల  ఊర్లు  తిరిగే  మాకు   మా  సొంత  ఊరు  ఏదో     దయచేసి  చెబుతారా  ?
...............................


* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ బంధువులున్నారు. మాది బదిలీలతో కూడిన ఉద్యోగము. ఈ బదిలీల వల్ల మంచీ ఉంది. చెడూ ఉందనిపిస్తుంది.ఒకసారి బదిలీ వల్ల ఒక ప్రాంతానికి వెళ్ళాము. యధాప్రకారం చుట్టుప్రక్కల వారితో పరిచయాలు అయ్యాయి.కొంతకాలం తర్వాత , ఒకరోజు మా పొరుగామె ఒకామె మా ఇంటికి వచ్చారు.ఆమెతో నాకు మంచి స్నేహమే ఉంది. నాకన్నా వయసులో పెద్ద. అలా మాటల్లో ఇళ్ళ అద్దెలు, స్థలాల రేట్ల ప్రసక్తి వచ్చింది.నేను, ఇక్కడ వాటి రేట్లు ఎలా ఉంటాయండి ? అని అడిగాను.అంతే, అప్పటివరకు చక్కగా కబుర్లు చెబుతున్న ఆమె ఒక్కసారిగా .* ఏం ? కొంటారా ? బదిలీపై వచ్చారు. అద్దెకుండి మీ పని అయ్యాక వెళ్ళిపొండి. అంతే. ఇక్కడ రేట్లతో మీకేం పని ?  అనేసింది.నేను ఒక్క క్షణం బిత్తర పోయి, అబ్బే నేను కొనాలని అడగలేదండి. అన్నాను.* నిజంగానే , నేను కొనే ఉద్దేశంతో అడగలేదు. నాకు అలా విషయసేకరణ చేయటం అలవాటు.విషయ పరిజ్ఞానం పెంచుకుందామని పనీపాటా లేక అలా అడిగానంతే.కానీ, ఆమె ముఖం మీదే అలా అనేస్తుందని అనుకోలేదు. ఇంకొకామె   ఇతరప్రాంతం   వాళ్ళు   తమ  ప్రాంతానికి  వచ్చి స్థిరపడుతున్నారని   వారిని  తిట్టారు. ఇతర ప్రాంతాల నుంచీ వలసలు మితిమీరి పెరిగితే స్థానికులు ఆందోళన పడటం , వలసలవల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడటం జరుగుతుంది.* ఈ భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే  ఎక్కడివాళ్ళు అక్కడే జీవించటం వల్ల ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది  అనిపిస్తుంది. సరే, అప్పుడు వాళ్ళు నాతో అలా అన్నందుకు నాకు బాధతో పాటు ఆశ్చర్యము,    ఎన్నో   ఆలోచనలు కూడా కలిగాయి.* ఎందుకంటే , నన్ను అలా అడిగిన   వాళ్ళ యొక్క   పిల్లలు,  బంధువులు ..   ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాల్లోనూ,   ఇతరదేశాల్లోనూ  ఉద్యోగ, వ్యాపార రీత్యా ఉంటున్నారు.వారు అక్కడ ఆస్తులూ కొనుక్కుంటున్నారు.అలాంటప్పుడు ఆమె నన్ను అలా అడగటం న్యాయమా?* కొందరు తమకొక నీతి ఇతరులకు ఒక నీతిగా ప్రవర్తిస్తుంటారు.* మా ఊరు ఎవరూ రాకూడదు అనేవారు ఇతరుల ఊళ్ళు కూడా వెళ్ళకూడదు కదా !* అయినా ఆమె నన్ను పరాయి ప్రాంతం వాళ్ళగా భావించింది కానీ, మాకు ఆ ప్రాంతం వారితో వివాహబంధుత్వాలు కూడా ఉన్నాయి.* మాకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారు.


......................................... 


భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ స్థానికత అనే విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
.............................


*  విదేశాలకు  వెళ్తే  స్థానికులు .. వలసదారులు  అనే  తేడా  ఉందంటే  ఆశ్చర్యం  అనిపించదు.  స్వదేశంలోనే  వలసదారులు.. దోపిడిదారులు..  అంటుంటే  ఎంతో  అవమానంగా,  బాధగా  ఉంది. *   స్థానికులు..వలసవాదులు ...  అంటూ  ఉద్యమాలు  చేస్తున్న  స్టూడెంట్స్   భవిష్యత్తులో ఉద్యోగాలు ,  వ్యాపారాలు కొరకు ఇతర రాష్ట్రాలు,  దేశాలు  వెళ్ళకుండా ఉంటారా ? బదిలీలవల్ల   మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది.
............................ 


*  మేధావులు ఇవన్నీ ఆలోచించి కొన్ని ఊళ్ళు   ఒక ప్రాంతంగా  నిర్ణయించి (  జోనల్  సిస్టం లా )..ఇక అక్కడి వాళ్ళు బయటికి పోకుండా అక్కడనే జీవించేటట్లూ ఉపాధి అవకాశాలు కల్పించాలి.బదిలీలు కూడా ఆ పరిధిలోని ఊళ్ళలోనే జరగాలి.

* ఇదంతా సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయని ఇలా చెబుతున్నాను.బదిలీల   ఉద్యోగాలు   చేసేవారు  ఆస్తిపాస్తులను  కొనుక్కోవాలన్నా   ఎక్కడ  కొనాలనే  సమస్య  ఎదురవుతుంది.  


* ఇది మన రాష్ట్రం అనుకునేంతలో మీ రాష్ట్రం కాదంటున్నారు. మన ప్రాంతం అనుకుంటే  మీ  ప్రాంతం కాదంటున్నారు. ఇలాంటి   పరిస్థితిలో   స్థానికత   గురించి  అయోమయంగా  ఉంటుంది .


.......................... 

*    స్థానికతను   భాష  ఆధారంగా   కూడా   నిర్ణయిస్తారని  ఇంతకుముందు  అనుకునేవారం.  ఒకే  భాష  వాళ్ళ  మధ్య    కూడా  స్థానికులు..వలసవాదులు  అనే  తేడాలు  వచ్చిన  ప్రస్తుత  పరిస్థితిలో  అసలు స్థానికత అంటే ఏమిటో తెలియటం  లేదు.


* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తారని కొందరు  అంటున్నారు. 


అలా  అయితే,  బదిలీల వల్ల  ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాల్లో చదివితే .... ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది  కదా !

ఏమిటో..స్థానికత  విషయం   ప్రస్తుత పరిస్థితిలో గందరగోళంగా  ఉంది .

............................. 


* మేము  ఇక్కడ  స్థానికులం  అని    మనము,  మన  తరువాతి  తరాల  వాళ్లు  కూడా  చెప్పుకుని  ప్రశాంతంగా  జీవించాలంటే  అసలు  స్థానికత  అనేది  ఎలా  నిర్ణయిస్తారో  తెలియాలి. 


*  స్థానికత అనే విషయం గురించి మేధావులు గట్టిగా ఆలోచించి  దయచేసి    తెలియజేయండి .Monday, January 6, 2014

మిగతా రాష్ట్రాల ప్రజలు అయినా.......


గత  కొంతకాలంగా  రాష్ట్రంలో   అంతా  అయోమయం,  గందరగోళం.  తెల్లవారితే  ఒకళ్ళనొకళ్ళు   తిట్టుకోవటం  తప్ప,   ప్రజల  సమస్యల  పరిష్కారం  గురించి  ఎంత  తక్కువగా  మాట్లాడుకుంటే  అంత  మంచిది అన్నట్లు  ఉంది  పరిస్థితి.
రాష్ట్రంలోని  ప్రజల  మధ్య  విభేదాలు,  ఆవేశకావేషాలు  రావటం  అత్యంత  బాధాకరం.   ప్రజల  మధ్య  విభేదాలు,  ఆవేశకావేషాలతో   పబ్బం  గడుపుకునే  వారికి ..... వారి  కుటుంబసభ్యుల  మధ్య    విభేదాలు  వచ్చినప్పుడు  ఆ  బాధ  తెలుస్తుందేమో  ?దేశంలో  మన  రాష్ట్రంలో   వలె    అస్థిర  పరిస్థితులు  రాకూడదని,  మన  రాష్ట్రంలో  జరుగుతున్న   దిక్కుమాలిన  పరిస్థితి  ఏ  రాష్ట్రంలోనూ  రాకూడదని,


  మన  రాష్ట్ర  ప్రజలలా  ఏ రాష్ట్ర  ప్రజల  మధ్య  విభేదాలు  రాకూడదని  , 


 మిగతా  రాష్ట్రాల  ప్రజలు  అయినా   అపార్ధాలు , విభేదాలు  లేకుండా    కష్టసుఖాలలో  కలిసిమెలసి   అన్యోన్యంగా  ఉండాలని   కోరుకుంటూ....

Friday, January 3, 2014

నిజాయితీపరులు, నిరాడంబరులు అయిన నిజమైన నాయకులు..


  కేజ్రీవాల్  గారు  ప్రభుత్వాన్ని  ఏర్పాటుచేసారు.  అవకాశం  వచ్చిన  వెంటనే  ప్రభుత్వాన్ని  ఏర్పాటు  చేయటం  కోసం  హడావుడి  పడకుండా    ప్రజల  అభిప్రాయాన్ని  అడగటం  వంటి  పద్ధతులను  గమనించితే   కేజ్రీవాల్   గారి  వ్యవహారశైలి  బాగుందనిపిస్తోంది.అయితే,   కేజ్రీవాల్కు  ఓట్లేసాము  కాబట్టి    ఇక   సమాజ  ప్రక్షాళన   అంతా   ఆయనే  చూసుకుంటాడులే ....  మనం  కాళ్ళు  బారజాపుకుని  సరదాగా  వినోదకార్యక్రమాలు  చూస్తూ  పొద్దుపుచ్చుదాం  ..... అని    ప్రజలు  అనుకోకూడదు.  సమాజం  కొంతయినా  బాగుపడాలంటే   ప్రజలు  కూడా  తమ  వంతు  సహకారాన్ని    అందించాలి. అప్పుడే  సమాజంలో  పెద్ద ఎత్తున  మార్పు  సాధ్యమవుతుంది.  

........................................


ఇక్కడ  మనం,   మరి   కొన్ని  విషయాలను  గురించి   ఆలోచించాలి.

స్వతంత్రంగా  ప్రభుత్వం  ఏర్పాటుచేయటానికి   కొన్ని  సీట్లు  తక్కువ  రావటం  వల్ల  కేజ్రీవాల్  పార్టీ  ఇతరపార్టీ  మద్దతు  తీసుకోవలసి  వచ్చింది.  (  తమకు  ఇష్టం  లేకపోయినా  ).* ప్రజలు తమకు నచ్చని వారికి ఓట్లు వేయకుండా తమ తిరస్కారాన్ని తెలియజేస్తారు……. అయితే ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలు … ప్రజలు తిరస్కరించిన పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అగౌరవపరచటం అవుతుంది కదా !* ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి చాలినన్ని సీట్లు రాకపోయినా , ఎన్నికలలో ఎక్కువ సీట్లను గెలుచుకున్న పార్టీ   ఇతరుల  మద్దతు  లేకుండా  స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇచ్చే విధంగా నియమాలను సడలించవలసిన  అవసరముంది.* నియమాలు మన బాగుకొరకు మనమే ఏర్పాటు చేసుకున్నవి. అవసరమైతే నియమాలను మార్చుకోవటం మంచిది.* ఎన్నికలు జరగటానికి ముందే పార్టీల మధ్య పొత్తులు ఉండటమనేది న్యాయం…. అప్పుడు ప్రజలు తమ ఇష్టాన్నిబట్టి తీర్పు చెబుతారు. అంతేకానీ , ఎన్నికల తరువాత పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు పొత్తులు పొట్టుకుంటే అప్పుడు ప్రజలను ఓట్లు వేయమని అడగటం ఎందుకు ?

 
................................

  అధికారం  కోసం ,  ధన వ్యామోహం  కోసం    కాకుండా  ప్రజాసేవ  కోసం  వ్యక్తులు  రాజకీయాలలోకి  వచ్చినప్పుడు    రాజకీయరంగంలో  మంచి  మార్పు  సాధ్యమవుతుంది. 

....................................
 

 ప్రజల  సమస్యలను  పరిష్కరించటం  చేతకాకపోయినా , ప్రజల  మధ్య  విభేదాలు  కల్పించే  వారు   నాయకులుగా  చెలామణి  అవుతున్న  ఈ  రోజుల్లో  ....    మాణిక్  సర్కార్   గారు,  కేజ్రీవాల్  గారు   వంటి  నిజాయితీపరులు,  నిరాడంబరులు   అయిన   నిజమైన  నాయకులు    రాజకీయాల్లో  ఉండటం  ప్రజలకు  శుభసూచకం.


Wednesday, January 1, 2014

శుభాకాంక్షలతో ...

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలు   మరియు  అందరికి  ఆంగ్ల  నూతన  సంవత్సర  శుభాకాంక్షలండి.

ఆసక్తి  ఉన్నవారు  ఈ  క్రింది  లింకులను  కూడా  చూడగలరు.Valley of Flowers National Park - Wikipedia, the free encyclopedia  


Flowers of Himalayas.