koodali

Wednesday, January 29, 2014

పిల్లల హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాము ?

 
ఈ  రోజుల్లో  సమాజ  వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.  పిల్లల  పరిస్థితి  మరీ  అయోమయంగా  ఉంది .  పెద్దవాళ్ళు  తమ  స్వేచ్చ  గురించి,  తమ  హక్కుల  గురించి  మాట్లాడుతున్నారే  గానీ  పిల్లల  హక్కుల  గురించి   మనం  ఏం  చేస్తున్నాము ? 

పూర్వం  మగవాళ్ళు  కుటుంబం  కోసం  డబ్బు  సంపాదించటం,  ఇంటికి  కావలసిన  సరుకులను   తేవటం  వంటి  పనులను  చేస్తే ,  స్త్రీలు  ఇంటిని  చక్కదిద్దుకునేవారు.  అయితే  ఇప్పుడు  పరిస్థితి  మారింది. 



ఇప్పటి    స్త్రీలు  ఇంటిపనులతో  పాటు  సంపాదన..  వంటి  బాధ్యతలను  కూడా  నెత్తినేసుకుని  ఎంతో  కష్టపడుతున్నారు.  


ఇదే   సమయమని   కొందరు  పురుషులు  ఇంటి  బాధ్యత  అంతా     స్త్రీల  నెత్తిన  వేసి  తాము  పనుల  నుంచి  తప్పించుకు  తిరుగుతున్నారు .


ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేయటం,   బయటకెళ్ళి  సరుకులను  తెచ్చుకోవటం..వంటి   ఎన్నో   పనుల  వల్ల    స్త్రీలకు  ఇంటిపట్టున  ఉండే  సమయం  తగ్గిపోయింది. 

బయట  పనులను  చక్కబెట్టుకుని   తల్లి   ఇంటికి  వచ్చేసరికి    కొన్నిసార్లు  రాత్రి    అయినా  అవవచ్చు. 


ఇలాంటప్పుడు   పిల్లలను    చూసుకోవటంలో  ఎన్నో  ఇబ్బందులు  వస్తున్నాయి.   
.................. 

పూర్వపు  ఆడపిల్లలకు   ఎక్కువగా   బయట  తిరగవలసిన  అవసరం  ఉండేది    కాదు.

 ఇప్పుడు   మారిన   వ్యవస్థలో   పిల్లల   జీవనవిధానం  ఎలా  ఉందన్నదానికి...ఒక  ఉదా..

కొంతకాలం  క్రిందట  పసిపిల్లలు  అమ్మ  జోకొడితే  హాయిగా  నిద్రపోయేవారు.  అమ్మ  కబుర్లు  చెబుతూ 
చందమామ  రావే  అంటూ..అన్నం  తినిపిస్తుంటే  చక్కగా   తినేవారు. 

 ఇప్పుడు   అవన్నీ  గతకాలపు  ముచ్చట్లు  అయిపోయాయి.  ( చాలామంది  పిల్లల  విషయంలో .)

ఇప్పుడు  తల్లులు  బిజీ  అయిపోయారు.   పిల్లలను   ఉదయాన్నే   ఆదరాబాదరాగా  తయారుచేసి       ఏడుస్తున్న  పిల్లలను   హడావిడిగా  ఏ  క్రెచ్ లోనో  వదిలి  పరిగెడుతుంటారు. 


  ఇక   ఏ  సాయంత్రానికో  పిల్లలు   ఇంటికి  తేబడతారు.  అప్పటికే  పగలంతా  ఆఫీసు  పనితో  అలసిపోయి  వచ్చిన  తల్లికి ..  ఇంట్లో  పని  చేసుకుని  ఇంకా  పిల్లలతో  తీరికగా  ముచ్చట్లాడటానికి  ఓపిక  ఉంటుందా  ?
...................... 


  పిల్లలు  కొంచెం   పెద్దయి   ప్లే   స్కూల్ కు  పంపబడతారు.  ఆ  స్కూల్స్  మధ్యాహ్నం  వరకే  ఉంటాయి  కాబట్టి  మధ్యాహ్నం  పిల్లలను  స్కూల్  నుంచి   పికప్  చేసుకుని  మళ్ళీ  ఏ  క్రచ్ లోనే  వదలాలి.  

..................

ఇక  పిల్లలు  సాయంకాలం  వరకూ  స్కూలులో  ఉండే  వయస్సు  వస్తుంది. 


  పిల్లలు  స్కూల్  నుంచి  అలసి  ఇంటికి  వచ్చినా  ఇంట్లో  పెద్దవాళ్ళు   ఎవరూ  ఉండరు  కాబట్టి ...  పిల్లలు    కోచింగ్  క్లాసులలో  చేరతారు. 


 వారికి  అవన్నీ  నేర్చుకోవటం  ఇష్టం  ఉన్నా  లేకపోయినా  వారి  ఇష్టానికి  ప్రాధాన్యత   ఇచ్చే  పెద్ద  వాళ్ళు  తక్కువ  కాబట్టి  కోచింగులు  తీసుకోవాలి. 


  ఈ  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవాలంటే  సినిమా  పాటలు,  డాన్సులు  వంటివి  కూడా  నేర్చుకోవాలి   అంటారు .

కోచింగ్  క్లాసుల  తరువాత   ఇంటికి  వచ్చి  తాళం  తీసుకుని , స్నాక్స్  ఏమైనా  ఉంటే  తిని  కాసేపు  రెస్ట్  తీసుకుని    బోర్ గా  అనిపిస్తే   ప్రక్క  ఇంటి  పిల్లలు  తో  ఆడుకుంటారు. 


 ఆటలు  అయిపోయి   పక్క  పిల్లలు   వెళ్ళిపోతే  ..  ఇంటికి  వచ్చి   టీవీ    లేక  కంప్యూటర్  చూడటం  చేస్తారు. 


 నెట్  ఉంటే  ఇక  బోలెడు  సమయం  గడిచిపోతుంది.  నెట్లో  చాలా  చూడవచ్చు.  అవన్నీ  చూస్తుంటే   సమయమే  తెలియదు ? 

................. 

ఇక   రాత్రి  సమయంలో  ఉద్యోగాలు  చేయవలసిన   తల్లులకు,   వారి    పిల్లలను  వదిలి  పనికి  వెళ్ళటం  అనేది  పెద్ద  సమస్య.  
 ........................ 

ఈ  కాలంలో  తల్లితండ్రులు  పిల్లలు   కలిసి   ఇంట్లో  గడిపే   సమయం  తగ్గిపోయింది.  ఎవరి  బిజీ  వారిది . ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు  అభద్రత  భావంతో   జీవిస్తున్నారు . 

ఇవన్నీ  ఆలోచిస్తే   నేటి  సమాజంలో  పిల్లల  పరిస్థితి  అయోమయంగా  తయారయింది  అనిపిస్తోంది .


2 comments:

  1. పిల్లల పరిస్థితి గురించి చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete