koodali

Tuesday, October 29, 2013

సామాన్యుల కన్నా మేధావులనబడే వారి వల్లే ......

ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
..................................  కొంతమంది  ఇళ్ళు  ఎలా  కడతారంటే,  వారి  మొదటి  అంతస్తు  నీళ్ళు  బయటకు  పోవాలంటే  పైపులు  నిర్మించరు.


  మొదటి  అంతస్తు  బాల్కనీ  కడిగిన  నీరు  అంతెత్తు  నుంచి  సరాసరి  రోడ్డు  మీదకు  పడుతుంటుంది.  


రోడ్డు  మీద  వెళ్ళే  మనుషుల  మీద  కూడా  ఆ   మురికి  నీరు  పడుతుంది. అలా  చిందకుండా  పైనుంచి  పైపులు  ఏర్పాటుచేయాలనే  కామన్ సెన్స్  కూడా  చాలా  మందికి  ఉండదు. 


ఇవన్నీ  గమనించే  మన  పూర్వీకులు  ప్రతి  చిన్నవిషయాన్ని  జాగ్రత్తగా  గమనించి  పద్ధతులను  ఏర్పరిచారు.  అందుకే  పూర్వం  ప్రపంచములో   ఇంత    మురికి   ఉండేది  కాదు.


...................................


  సామాన్యులు  వల్ల  జరుగుతున్న   మురికిని   చూసి  కొందరు  మేధావులు  ఏమంటారంటే  ,  ఎక్కువగా  చదువుకోని  సామాన్యుల  వల్లే  ప్రపంచం  మురికిగా  అయిపోతోంది.  అంటుంటారు.అయితే,  నాకు  ఏమనిపిస్తుందంటే,  సామాన్యులు  చేసే  మురికిని   శుభ్రం  చేస్తే  పోతుంది.  ఆధునిక  విజ్ఞానం  వల్ల  జరుగుతున్న  పర్యావరణ  కాలుష్యం  ఏవిధంగా  పోతుంది?  మేధావులు  అనబడే  వారు  కనుగొన్న  ప్లాస్టిక్  వంటి  వాటివల్ల  కూడా   ప్రపంచము   పొల్యూట్  అయిపోతోంది.  ఆధునిక  విజ్ఞానం  అందించిన  కొన్ని  ఆవిష్కరణల  వల్ల  ప్రపంచములో  జీవరాసుల  ఉనికికే  ప్రమాదం  జరిగేంతగా  పొల్యూషన్  పెరుగుతోంది.  ప్లాస్టిక్,   ఎలెక్ట్రానిక్  వ్యర్ధాలు,  అణు  వ్యర్ధాలు,  వాతావరణం  లోకి  విడుదలయ్యే  విషపూరిత  వాయువులు,  రసాయనాల  వల్ల  ప్రపంచానికి  ఎంతో  నష్టం  జరుగుతోంది. ఇవన్నీ  గమనిస్తే ,   సామాన్యుల  కన్నా  ఆధునిక  చదువులు  చదువుకున్న  వారి  వల్లే  ప్రపంచం  ఎక్కువ  మురికి  అవుతోంది ,  ప్రపంచానికి  ఎక్కువ  హాని  జరుగుతోంది...... అని  చెప్పక  తప్పదు. అందుకే,   పర్యావరణానికి  హానిని  కలిగించే  ఆవిష్కరణలను  ప్రపంచానికి  అందించవద్దు  మహా ప్రభో  ....అని  వేడుకుంటున్నాము


Wednesday, October 23, 2013

నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుంటే జరిగిన సంఘటన ఇది.


నా  ప్రక్క  సీటులో    ఒక  నడి  వయస్సు   ఆమె   కూర్చున్నది.  మనిషి  చదువుకున్న  ఆమెలాగే  ఉంది.  చక్కటి   దుస్తులు  కూడా  వేసుకుంది.  ఆమెకు  జలుబు  చేసినట్లుంది.  పదేపదే  ముక్కు  చీదుతోంది.  అలా  చీదుతూ  వచ్చిన  పడిశాన్ని  బస్సుకు  రాసేస్తోంది.  ప్రక్క  నుంచి  ఇదంతా  గమనిస్తున్న  నాకు  చాలా  కోపం  వచ్చింది. 
  పడిశాన్ని  బస్సుకు    రాయటమేమిటి  ? 


  మన  ప్రజలెందుకు  ఇలా  అశుభ్రంగా  తయారయ్యారు  ?  అని  నాకు  చాలా  బాధ  కలిగింది.  కోపం  కూడా  వచ్చింది.

ఇక  ఉండబట్టలేక  ..... పడిశాన్ని  బస్సుకు  ఎందుకు  రాస్తున్నారు  ?   మీ    దుస్తులకు  రాసుకోవచ్చు  కదా  !  ఇలా  అంటున్నందుకు  ఏమీ  అనుకోవద్దు.  అని  చెప్పి    బస్సు  దిగి  వచ్చేశాను.  


ఇలాంటి  ప్రజలను  చూస్తుంటే .... దేశం  ఎప్పటికి   బాగుపడుతుందో   ?  అని  విరక్తి  వస్తోంది.


Monday, October 21, 2013

ఉమ్మడి రాజధాని...........

 ఒక  విషయం  గురించి  తీర్పు  చెప్పే  న్యాయమూర్తి  ప్రాంతీయ  అభిమానం,  బంధుప్రీతి  ఇలాంటివి  ప్రక్కన  పెట్టి   తీర్పును  ఇవ్వవలసి  ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్  విషయంలో  తెలంగాణా .... సీమాంధ్ర  అనే  భావనలను  ప్రక్కన  పెట్టి  ఆలోచిస్తే   ఎన్నో  సందేహాలు  వస్తాయి.

...............................................రాష్ట్రాన్ని  విభజించాలి  అని  కొందరు  అంటున్నారు.   అయితే   ఏ  ప్రాతిపదికన   విభజిస్తారో    తెలియటం  లేదు.

 ఆంధ్రప్రదేశ్  భాషాప్రయుక్త  రాష్ట్రాల  ప్రాతిపదికన  ఏర్పడింది. మరి  ఇప్పుడు   ఏ ప్రాతిపదికన  క్రొత్త  రాష్ట్రాన్ని  ఏర్పాటు  చేస్తారు  ?

 వెనుకబడిన  ప్రాతిపదిక  అనుకుంటే  రాయలసీమ,  ఉత్తరాంధ్ర  కూడా  వెనుకబడిన  ప్రాంతాలే  కదా  !

...............................................


  సీమాంధ్రలో    మూడుప్రాంతాలు  ఉన్నాయంటున్నారు. 


ఒకవేళ  రాష్ట్రం  విభజన  జరుగుతుంది.  అనుకుంటే   భవిష్యత్తులో   మళ్ళీ  విభజన ఉద్యమాలు   రావని  ఎవరైనా   గ్యారంటీ  ఇవ్వగలరా  ? 


ఒకవేళ   విజయవాడ   రాజధానిగా   సీమాంధ్ర   ఏర్పడిన  కొంతకాలం  తరువాత  రాజధానితో  సహా    కోస్తా    విడిపోతే   మిగతా  రెండు  ప్రాంతాల  ప్రజలు  మళ్ళీ  కొత్త  రాజధానిని  వెదుక్కోవాలా  ?   లేక   కర్నూలు  రాజధానిగా   సీమాంధ్ర  ఏర్పడిన  కొంతకాలం  తరువాత  రాజధానితో  సహా  రాయలసీమ    విడిపోతే   మిగతా  రెండు  ప్రాంతాల  ప్రజలు  మళ్ళీ  కొత్త  రాజధానిని  వెదుక్కోవాలా  ? లేక    విశాఖపట్నం   రాజధానిగా  సీమాంధ్ర  ఏర్పడిన  కొంతకాలం  తరువాత  రాజధానితో  సహా  ఉత్తరాంధ్రా   విడిపోతే   మిగతా  రెండు  ప్రాంతాల  ప్రజలు  మళ్ళీ  కొత్త  రాజధానిని  వెదుక్కోవాలా  ?  ప్రజల    సమస్యలను    ఎక్కడివి  అక్కడే  ఉంచి   విభజన,  సమైక్యం  అంటూ   పదేపదే  ఉద్యమాలు  చేసే  ఓపిక  ప్రజలకు  లేదు.  చిన్న  రాష్ట్రాల  వల్ల  దేశం  అభివృద్ధి  బాటలో  పరుగులు  తీయటం  ఖాయం...  అంటూ  జనాన్ని  నమ్మిస్తున్న  పార్టీల  వారు  ఇప్పుడే  ఆంధ్రప్రదేశ్  ను   నాలుగు  లేక  అయిదు  రాష్ట్రాలుగా  విభజించటానికి  ఒప్పుకుంటారా  ?

...................................సీమాంధ్ర  ఏర్పడితే  మా  ప్రాంతంలోనే   రాజధానిని  ఏర్పాటు  చేయాలి ... అని  కొందరు   సీమాంధ్ర వాళ్ళు  పోటీలు  పడుతున్నారు.


(  రాజధాని  ఏర్పడితే  తమ  ప్రాంతం  అభివృద్ధి  చెందుతుందని  ఇలా  పోటీలు  పడుతున్నారు.  ) అయితే   రాజధాని  ప్రాంతం  కోరుకునే  వారు  కొన్ని    త్యాగాలు  చేయవలసి  ఉంటుంది.  ఉమ్మడి  రాజధాని   అంటే  అన్ని  ప్రాంతాల  వారికి  హక్కు  ఉంటుంది.  అన్ని ప్రాంతాల  వారు  ఉపాధి  కోసం   రాజధానికి   వస్తారు.   ఇతర  ప్రాంతాల  వారు  రాజధానికి  రాకూడదు  అనకూడదు.   


   ఉమ్మడి  రాజధానికి  ఒప్పుకున్నప్పుడు  కొన్ని   విషయాలకు  కట్టుబడాలి.    ఉమ్మడి  రాజధాని  ఏర్పాటు  చేసుకునే  వారు  ఉమ్మడి బాధ్యతలకు  కూడా  కట్టుబడాలి.అంతేకాని    మొదట   ఉమ్మడి  రాజధానికి  ఒప్పుకుని ,  ఉమ్మడి  రాజధాని  బాగా  అభివృద్ధి  జరిగిన  తరువాత    రకరకాల   కారణాలతో.... 


   రాజధాని  మా  ఒక్కరిదే,  ఉమ్మడి  రాజధానితో  సహా  మేము  విడిపోతాము  .... అనటం  న్యాయంగా ఉంటుందా ?


ఇలాంటి  ఆలోచనలు  ఉన్నవాళ్ళు   ఉమ్మడి  రాజధానికి  ముందే  ఒప్పుకోకూడదు. (  మాకు  ఇష్టం  లేకపోయినా  ఇతరుల  బలవంతం  వల్ల  ఒప్పుకున్నాము ... వంటి  కారణాలు  చెప్పకూడదు. )
.......................................దాదాపుగా  ఒంటరి  వాళ్ళయిన  సీమాంధ్రులు.
 

ఏ  విషయంలోనూ  ఏకాభిప్రాయం  కలవని  జాతీయపార్టీలు    సీమాంధ్ర  ప్రజల  అభిప్రాయానికి  వ్యతిరేకంగా   మాత్రం   ఒక్కతాటి  మీద  నిలబడటం  బాధాకరం.

(  సి.పి.యం  వాళ్ళు  మాత్రం  మొదటి  నుంచి  భాషాప్రయుక్త  రాష్ట్ర  వాదానికే  కట్టుబడ్డారు.)చాలా  రాజకీయ  పార్టీల  వారు  తెలంగాణా  గురించి  లేఖలు  ఇచ్చారు  కాబట్టే  విభజన  చేయవలసి  వస్తోంది  అంటున్నారు.  విభజన  లేఖలు  ఇచ్చిన   పార్టీలు  ఉమ్మడి  రాజధానితో  సహా    తెలంగాణా  ఇవ్వాలని  కూడా  లేఖలలో  రాశారా  ? 
 

ఏ  ప్రాతిపదిక  లేకుండా  రాష్ట్రాలను  విభజిస్తే  భవిష్యత్తులో  అడిగిన    ప్రతి  ఒక్కరికీ    రాష్ట్రాలను  విభజించి   ఇస్తారా  ?  ఇలా  ఎన్నో  ప్రశ్నలు  మొదలవుతాయి.


 ....................................

సీమాంధ్ర  వాళ్ళను    దోపిడీదారులు,  స్వార్ధపరులు     అనటం  దారుణం.

తెలంగాణాలో వెనుకబడిన  ప్రాంతాలు  ఉన్నట్లే   రాయలసీమ  ,  ఉత్తరాంధ్ర,  కోస్తాలలో  కూడా     చాలా    ప్రాంతాలు   అభివృద్ధికి    దూరంగా  వెనుకబడి  ఉన్నాయి.   సీమాంధ్ర   ప్రజలు    చాలామంది   పేదరికం   వల్ల    ఎన్నో  బాధలు  పడుతున్నారు.  ఇలాంటి  ప్రజలను  దోపిడీదారులు ,  స్వార్ధపరులు   అనటం  ఏం  న్యాయం  ?  అన్ని  ప్రాంతాలకూ  చెందిన   కొందరు  పెట్టుబడిదారులు    వందలకోట్ల  సొమ్మును  పోగేస్తున్నారు. వీళ్ళను  దోపిడీదారులు  అనవచ్చు.  అంతేకానీ   సీమాంధ్రకు  చెందిన  అందరిని  దోపిడీదారులు  అనటం    అన్యాయం.


సీమాంధ్ర  వాళ్ళు  దోచుకునే  వారు,  స్వార్ధపరులు   అయితే  హైదరాబాదులోనే   వరుసగా  ఎన్నో  కేంద్ర   ప్రభుత్వ  సంస్థలను  ఏర్పాటు  చేస్తుంటే   చూస్తూ  ఊరుకోరు  కదా  !  సీమాంధ్రులు   స్వార్ధపరులు   అయితే   ఇతర  ప్రాంతంలో  రాజధానిని  ఏర్పాటు  చేయనిస్తారా  ?  సీమాంధ్రులు   తమ  ప్రాంతాలను  ఎక్కువగా   అభివృద్ధి  చేసుకోకుండా   ఉమ్మడి  రాజధాని  అయిన    హైదరాబాద్  అభివృద్ధికే  ప్రాముఖ్యత  ఇచ్చారు.   సీమాంధ్రులు స్వార్ధపరులు   అయితే  తమ  ప్రాంతాలు  మాత్రమే  అభివృద్ధి  చేసుకునేవారు  కదా  !  అన్ని  ప్రాంతాలకు  చెందిన  తెలుగువాళ్ళు   ఉపాధికోసం  ఇతర  దేశాలకు  కూడా  వెళ్తున్నారు. ఒకే  భాష  మాట్లాడే  వాళ్ళు  ఉపాధికోసం  రాజధానికి  వస్తే  తప్పు  అంటున్నారు.   ఇలా  మాట్లాడే  వాళ్ళు    ఉపాధి  కోసం  ఇతర  దేశాలకు  వెళ్ళటం,  తమ  పిల్లలను  ఇతరదేశాలకు  పంపటం  మానేస్తారా  ?

................................................

సీమాంధ్ర  ఉద్యోగులు  తమ  శక్తికి  మించి  సమైక్య  ఉద్యమాన్ని  నడిపించారు.Monday, October 14, 2013

ఆది పరాశక్తి కధలు... దసరా...

 ఆది పరాశక్తి కధలు...
ఓం....
 దుర్గమ్మకు  అనేక   వందనములు.

మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం
  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.. .
........................

ఈ  కధలను  ఇంతకు  ముందు  కూడా బ్లాగులో   ప్రచురించానండి.

  దేవీనవరాత్ర  వ్రతకధ  ....వంటి  పుస్తకాలలో  ఈ  కధలను  పండితులు  క్లుప్తంగా  వ్రాసారు.

  పండితులందరికి  కృతజ్ఞతలు.

..............................

 దసరా...
ఓం ..                                           

సాయి సాయి.


శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,
 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ   భైరవీ
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ
  జాజీపంకజ  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనే  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వాలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

6. అంబా  సృష్టివినాశ  పాలనకరీ  ఆర్యా  విసంశోభితా
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ

7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  

8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా  ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ


   ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
Wednesday, October 9, 2013

ఆదిపరాశక్తి కధలు.... 2..వ్యాసమహర్షి , జనమేజయ మహారాజుకి దేవీ అవతారగాధలను తెలియజెప్పటం జరిగింది. కొన్ని కధలను క్లుప్తముగా ..........................

ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు ................. ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని .......... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 
అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది. కొంతమంది విద్యాధరులకు.జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలు- ఓహ్! రణరంగం మహా భయంకరంగా ఉంది.ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.
కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.

నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.


Monday, October 7, 2013

ఆదిపరాశక్తి కధలు.

ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 

 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.


 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు. 


విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది. 

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సం హరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.


 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.


యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది. 


ఆ చూపులకు మధుకైటభులు    తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.


పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.


 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సం హరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.


మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.
..............
Thursday, October 3, 2013

ప్రజల సమస్యలను పరిష్కరించండి....

రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలు  అభివృద్ధి  అయి  ఉంటే   ఇప్పటి  పరిస్థితి  వచ్చేది  కాదు. 

 దోపిడీదారులు  అన్ని  ప్రాంతాలలోనూ   ఉంటారు. .  సీమాంధ్ర  మరియు  తెలంగాణాలో  పేద  ప్రజలు  అష్టకష్టాలు  పడుతుంటే  ..  కోట్లాది  రూపాయల  సొమ్మును   అక్రమంగా   కూడబెట్టుకుంటున్నవారు   అందరూ    అటువంటి  వారే.

గత  కొన్ని  సంవత్సరాల  నుంచి  ఆంధ్రప్రదేశ్ లో   అయోమయ  పరిస్థితి  నెలకొంది.  అభివృద్ధి  ఆగిపోయింది.  ప్రజల  సమస్యలు  ఎక్కడివి  అక్కడే  ఉన్నాయి..... ప్రజలంటే  అభిమానం  ఉన్న  నాయకులయితే  ప్రజల  కష్టాలను  తీర్చాలి.  అంతేకానీ  వాళ్ళ  ఖర్మకు  వాళ్ళను  వదిలి  ఊరుకోరు.ప్రజలంటే  అభిమానం  ఉన్న  నాయకులయితే  కాళ్ళు,  కీళ్ళు  కొంకర్లు  పోయి  కష్టాలు  పడుతున్న  ఫ్లోరైడ్  బాధితుల  కష్టాలను  తీర్చలేదెందుకని  ? 


అప్పులను  భరించలేక  ఆత్మహత్యలు  చేసుకుంటున్న  రైతుల,  చేనేత  కార్మికుల  కష్టాలను  తీర్చలేదెందుకని  ?

పనులు  దొరకక  పస్తులుంటున్న  కార్మికుల  కడగండ్లను  పట్టించుకోలేదెందుకని  ? పదవులు, అధికారం  లేకపోయినా  పుట్టి  పెరిగిన  ఊరిని  అభివృద్ధి   చేస్తున్న    సామాన్యుల  కధలెన్నో  పత్రికలలో  వస్తున్నాయి.  అధికారం,  డబ్బు,  పలుకుబడి  అంతగా  లేని  వ్యక్తులు  పట్టుదలతో  ప్రజల  సమస్యలను  తీర్చుతున్నప్పుడు....అధికారం  ఉన్నవారికి  ప్రజల  సమస్యలు  పరిష్కరించటం  సాధ్యమే  కదా  !   
 

గత  కొన్ని  సంవత్సరాలుగా  విభజన  అని  కొందరు ..... సమైక్యం  అని  కొందరు  వాదులాడుకుంటూ  ప్రజల  సమస్యలను  పట్టించుకోవటమే  మానేశారు. 

 ప్రజల  సమస్యలను  పరిష్కరించి  అప్పుడు  విభజన  అనో  లేక  సమైక్యం  అనో  తీరికగా  వాదులాడుకోవచ్చు. 


 అంతే  కానీ ,  అనేక   దైనందిన   సమస్యలతో  అలసిపోతున్న  ప్రజలను  మరింతగా  కష్టపెట్టవద్దు....


విభజన,  సమైక్యం  గొడవలు  ప్రక్కనపెట్టి    ముందు  ప్రజల  సమస్యలను  పరిష్కరించాలి. 

రాయలసీమలో  ఎందరో  పేదవారున్నారు.  తెలంగాణాలో  ఎందరో  పేదవారున్నారు. ఉత్తరాంధ్రాలో ఎందరో  పేదవారున్నారు.  కోస్తాలో     ఎందరో  పేదవాళ్ళున్నారు.  

  రాజధాని  ఉన్న  ప్రాంతంలో    అభివృద్ధి  జరుగుతుందని  అందరికి  తెలుసు.  సీమాంధ్ర  వాళ్ళు   అందరూ  డబ్బు  కోసం  ఆశపడేవాళ్ళు,  ఇతరులను  దోచుకునే  వాళ్ళు   అయితే    రాజధానిని  హైదరాబాద్ లో  పెట్టడానికి  ఒప్పుకోరు  కదా  !  రాజధాని  తమ  ప్రాంతంలోనే  ఏర్పాటు  చేసుకునేవారు. 

........................


అయితే,   అక్రమంగా  సమాజంలోని  సంపదను  దోచి  దాచుకునే  దోపిడీదారులు   అన్ని  ప్రాంతాలలోనూ  ఉంటారు.
.............................

అన్ని  రాజకీయ  పార్టీలను  సంప్రదించిన  తరువాతే    విభజన  ప్రక్రియ  ప్రకటన  వచ్చిందని ,  తాము  మాట  తప్పే  వాళ్ళం  కాదని  కొందరు  అంటున్నారు. 


రాజకీయపార్టీలు  ప్రజల  అభిప్రాయలను  సరిగ్గా  తెలుసుకోలేదు  కాబట్టే  ప్రజలందరి  అభిప్రాయం  కనుక్కుంటామని  చెప్పి  శ్రీ  కృష్ణ  కమిటీని  వేశారు.


 శ్రీ  కృష్ణ  కమిటీకి   తమ  అభిప్రాయాలు    తెలియజేయాలని   ఎన్నోసార్లు  ప్రజలను  కోరారు.  

 అన్ని  ప్రాంతాల  ప్రజలు  తమ  అభిప్రాయాలను  శ్రీ  కృష్ణ  కమిటీకి  తెలియజేశారు.  


ఇప్పుడేమో   రాజకీయపార్టీల  అభిప్రాయం  ప్రకారమే   చేస్తామంటున్నారు.  

మరి,   ఎంతో  ఖర్చుపెట్టి  శ్రీ  కృష్ణ  కమిటీని  వేయటమెందుకో  ?  ఆ  కమిటీకి  ప్రజల  అభిప్రాయాలను  తెలియజేయమనటం  ఎందుకో  ?