koodali

Wednesday, January 30, 2013

* దైవమే అందరికీ అండ.

* మణిద్వీపవాసులైన ఆదిశక్తి అయిన పరమాత్మకు అనేక వందనములు.


* దైవాన్ని ఏ పేరుతో, ఏ రూపంతో ఆరాధించినా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.


లోకంలో గొప్పవారితో పరిచయం పెంచుకోవాలని ఎందరో ప్రయత్నిస్తుంటారు.


కొద్దిమంది ప్రముఖులు మనకు పరిచయమైనా కూడా, మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాము.


* అలాంటిది,  విశ్వానికంతటికీ అధిపతి అయిన దైవంతోనే మనము పరిచయాన్ని పెంచుకుంటే అది ఎంతో గొప్ప విషయం కదా ! అప్పుడు మనకే మంచి జరుగుతుంది.


దైవానికి మనం అందరూ పరిచయమే కదా !మనమే లోకమాయలోపడి అప్పుడప్పుడూ భగవంతుని మరిచిపోతుంటాము.


అలా కాకుండా మన స్వధర్మాన్ని మనం నిర్వహిస్తూనే , సర్వత్రా దైవాన్ని తోడునీడగా భావించాలి.


* మనకు భగవంతుని అండ ఎంతో అవసరం. మనకు ఆసరాగా ఉండి మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి.కొందరు ఏమని అంటారంటే, విధిరాతను ఎవరూ తప్పించలేరు, మనం చేయగలిగింది ఏముంది ? అంటారు .* కానీ, సతీ సావిత్రి, మార్కండేయుల వంటి వారు దైవాన్ని మెప్పించి తమ జీవితాల్లోని ఆపదలను తొలగించుకున్నారు కదా !


యమధర్మరాజు రావద్దు అన్నా కూడా ఆయన వెంటపడి , యముని అనుగ్రహాన్ని పొంది సతీసావిత్రి తన పతి ప్రాణాలను దక్కించుకుంది.


జీవులకు పూర్వపాపకర్మల వల్ల ఇప్పుడు కష్టాలు వస్తాయి.


కానీ, ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించటం వల్ల ఆ పాపకర్మ యొక్క ఫలితాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.


* ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నా కూడా , సత్ప్రవర్తన కలిగిఉండి దైవాన్ని మెప్పించితే పాపకర్మఫలితాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అనీ పెద్దలు చెప్పటం జరిగింది.


కొందరు ఎన్నో మంచిపనులు చేస్తున్నా కూడా , వారి జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి.


అది వారు పూర్వం చేసిన పాపకర్మ ఫలితం వల్ల కావచ్చు. .
* అంటే , ఇప్పుడు వారు చేస్తున్న పుణ్య కర్మ కన్నా , పూర్వపు పాపకర్మ అంత ఎక్కువగా ఉందన్న మాట.


* ( ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అవి భగవంతునికే తెలుస్తాయి. )


ఇప్పుడు వారు చేస్తున్న పుణ్యకర్మ వృధా పోదు. ఎప్పటికయినా ఆ పుణ్యఫలం అనుభవంలోకొస్తుంది.


* భగవంతుని ఆరాధించాలంటే ధనం, విద్య ఉండితీరాన్న నియమమేమీలేదు. నిర్మలమైన ప్రేమ భక్తితో భగవంతుని ఆరాధించినా చాలు.


కొందరు ఆడంబరంగా పూజలు చేస్తారు. కొందరు భక్తి ఉన్నా కూడా అంత ఆడంబరంగా పూజలు చెయ్యకపోవచ్చు. ఏమైనా భక్తిని కలిగిఉండటం ముఖ్యం.


* నిర్మలమైన భక్తిని కలిగిన వారు ఎవరైనా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అలాంటి నిర్మలమైన భక్తిని ఇవ్వమని మనము భగవంతుని ప్రార్ధించాలి.


* నాకు విషయపరిజ్ఞానం అంతగాలేదండి. అయినా , బ్లాగులో ఈ మాత్రం విషయాలు వ్రాస్తున్నానంటే ,
* ఇది అంతా దైవం వేసిన భిక్షయే. అంతా దైవం దయయే.

నూతిలోని కప్ప అదే పెద్ద ప్రపంచమనీ, తనకు విశ్వం గురించి అంతా తెలుసనీ,అలా అనుకుంటుందట.


మానవులు కూడా తమకు తెలిసిన గోరంత విజ్ఞానం చూసి మిడిసిపడటం తగదు. మనకు తెలిసిన విజ్ఞానం అతి తక్కువ.

*
దైవమే అందరికీ అండ.

* ఇవి   ఇంతకు  ముందు వేసిన  టపాలోని  విషయాలే.

Monday, January 28, 2013

హోదాను బట్టి మాత్రమే గౌరవమా....


*  ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


కొన్ని  సంవత్సరాల  క్రిందట  జరిగిన  విషయమిది. 

 ఒక  భాషను  నేర్చుకోవాలని  భావించి , ఒక  గొప్ప   సంస్థలో   జాయిన్  అయ్యాను. 

(  అయితే, కొద్దికాలం  మాత్రమే  వెళ్ళాను. పూర్తిగా  నేర్చుకోలేదండి.)

  కొత్తగా చేరిన  విద్యార్ధినీ  విద్యార్ధులకు  అక్కడి  హాల్ లో  పరిచయ  సభను  నిర్వహించారు. ఉపాధ్యాయులను , ఇతర   స్టాఫ్ ను   స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తున్నారు.  ఒక్కొక్కరు   స్టేజ్  మీదకు  వచ్చి  తమ  గురించిన  వివరాలను  చెబుతున్నారు.  ఒక్కొక్కరి  పరిచయాలు  జరుగుతుంటే  నూతనంగా  చేరిన   స్టూడెంట్స్  చప్పట్లు  కొడుతున్నారు.  


ఇలా  అక్కడి  స్టాఫ్ ను  స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తూ,  అక్కడి  వాచ్ మన్ ను  కూడా   స్టేజ్  పైకి  పిలిచి   అతని  పేరు  చెప్పి  పరిచయం  చేసారు. 

(  ఈ  సంస్థ  చాలా  గొప్పది.  ఇక్కడ  పేద,  ధనిక  అనే తారతమ్యం లేదు. ) 


అప్పటి  వరకు  ప్రతి  ఒక్కరి  పరిచయానికి  క్లాప్స్  కొట్టిన  స్టూడెంట్స్ , వాచ్ మన్  యొక్క   పరిచయం   తరువాత   క్లాప్స్  కొట్టలేదు.  నిశ్శబ్దంగా  ఊరుకున్నారు.  నేను  క్లాప్స్  కొట్టబోయి  ఆగిపోయాను.  అంతా  నిశ్శబ్దంగా  ఉన్నప్పుడు ,  నేను   చప్పట్లు  కొడితే  బాగుండదేమోననే  సంశయంతో  ఆగిపోయాను.  


అయితే,  తరువాత  చాలాకాలం  ఈ  విషయం  నన్ను  ఆలోచింపజేసింది.


  ఎవరు  క్లాప్స్  కొట్టకపోయినా  , నేను  క్లాప్స్  కొట్టి  ఉండవలసింది. అనిపించింది. 


అందరికి  క్లాప్స్  చేసి,  వాచ్ మన్  పరిచయం  అప్పుడు    క్లాప్స్  కొట్టకపోవటం  వల్ల ,  ఆ  వాచ్ మన్  ఎంత  చిన్నతనంగా  ఫీలయ్యారో  కదా  !  అనిపించింది. 

(  బహుశా  నా  లాగే   మిగతా  స్టూడెంట్స్  కూడా   క్లాప్స్  కొట్టబోయి  సంశయంతో   ఊరుకున్నారేమో ? తెలియదు...)  సమాజంలో  పెద్ద  స్థాయిలో  ఉన్నవారిని,  చిన్న  స్థాయిలో  ఉన్నవారిని  చూసే  విధానంలో  ఎంతో  భేదం  ఉంటోంది.  ఇది  ఎందుకో  అర్ధం  కాదు.  డబ్బు,  చదువు,  హోదా, ...... ఎక్కువగా   ఉన్నవారిని  ఎక్కువగా  గౌరవిస్తున్నాం.  ఇవి  తక్కువగా  ఉన్నవారంటే  చిన్నచూపు  చూస్తున్నాం. 


ఇలా  కాకుండా ,  తక్కువ  డబ్బు,  తక్కువ  చదువు,  తక్కువ  హోదా .... ఉన్నవారిని  కూడా    గౌరవించటమనేది  సరైన  పద్ధతి. 


అందరినీ  సమానంగా  గౌరవించాలి.  చిన్న  వృత్తి,  గొప్ప  వృత్తి  అనే  భేదాలు  ఉండవు. న్యాయంగా  చేసే  ఏ వృత్తి  అయినా  గొప్పదే. 


డబ్బు,  చదువు,  హోదాలను  బట్టి  కాకుండా ,  వ్యక్తుల  యొక్క    వ్యక్తిత్వాలను  బట్టి  వారిని  గౌరవించటమనేది  మంచి  పద్ధతి.Friday, January 25, 2013

కొన్ని విషయాలు.


 మీలాద్- ఉన్- నబి......... సందర్భంగా  శుభాకాంక్షలండి.  

.....................

 కొన్ని  విషయాలు.........

ఈ  రోజుల్లో  ఎక్కువమంది  బియ్యం,  లేక  గోధుమతో  చేసిన  ఆహారాన్ని  వాడుతున్నారు,. ఇప్పుడు  పొట్టు  తీసి  బాగా  పాలిష్  చేసిన  తెల్లబియ్యన్నే  ఆహారంగా  వాడుతున్నారు,  ఈ  తెల్ల  బియ్యం వాడకం  వల్ల  మధుమేహం  వంటి  వ్యాధులు  పెరుగుతున్నాయట.  ఇలా  బాగా  పాలిష్  చేయటం  వల్ల  పోషకాలు  కూడా  ఉండవు.  


పాలిష్  చేయని  బియ్యం  ఆరోగ్యానికి  మంచిది.  అయితే,   ఈ  బియ్యంతో  వండిన   అన్నాన్ని   ఎక్కువమంది  ఇష్టపడరు.   పాలిష్  చేయని  బియ్యాన్ని  ఇడ్లీలకు,  దోసెలకు  వాడుకోవచ్చు. పాలిష్  చేయని  బియ్యాన్ని  పిండి  పట్టించి  జంతికలు  వంటివి  చేసుకోవచ్చు.

    కొంతకాలం  క్రిందట  చిరుధాన్యాలైన  రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటివి  కూడా  ఎక్కువగానే  వాడేవారట.   వరిని  పండించటానికి  చాలా  నీరు  అవసరం. ఈ  తృణధాన్యాలను  పండించటానికి  ఎక్కువ  నీరు  అవసరం  లేదు.  తృణధాన్యాలతో  కూడా   ఎన్నో  రకాల  వంటలను  చేస్తున్నారు.  జొన్న  రవ్వతో  ఉప్మా  చేసుకోవచ్చు.  
 మినప్పప్పు +  బియ్యం + గుప్పెడు  జొన్నలు  నానబెట్టి  రుబ్బి  దోసెలు  వేసుకోవచ్చు. 
రాగి  పిండితో  సూప్  తయారుచేసుకోవచ్చు. 
 గోధుమ  పిండితో  పాటు రెండు,  మూడు   రకాల  తృణధాన్యాలను  కలిపి  పిండి  పట్టించి , చపాతీలను  తయారుచేసుకోవచ్చు.
పకోడీ, సజ్జబూరెలు .... వంటివి కూడా  చేసుకోవచ్చు.


 వరి,  గోధుమతో  పాటు  చిరుధాన్యాలను  వాడటాన్ని  అలవాటు  చేసుకుంటే    ఎన్నో  ఉపయోగాలున్నాయి. 


 ఆరోగ్యం  బాగుంటుంది  +  వరిని  పండించటానికి  అవసరమయ్యే  నీటి  వాడకం  తగ్గుతుంది  +  వర్షాధార  ప్రాంతాలలో  చిరుధాన్యాలను  పండించే  రైతులకు  ప్రోత్సాహం  లభిస్తుంది. 

రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటి  చిరుధాన్యాల   మొక్కలకు  ఎక్కువగా  చీడపీడలు  ఆశించవట.  

ఇలా  ఎన్నో  ఉపయోగాలున్నాయి  కాబట్టి,   తృణధాన్యాలను  కూడా   వాడటం  అలవాటుచేసుకోవాలి.Wednesday, January 23, 2013

అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...


* కొంత  కాలం  క్రిందట  ఒక  టీవీ  చానల్ లో  ఒక  ప్రోగ్రాం  చూసాను. పెద్ద  స్టార్  హోటల్  వాళ్ళు  తమ  హోటల్లో  టాయిలెట్స్ ను  ఎంత  శుభ్రంగా  ఉంచుతామో  చూపించారు. . 


 అక్కడ  కమోడ్స్  కూడా   చేతిలో  ఒక బట్ట ముక్కను  పట్టుకుని  దానితో  శుభ్రంగా  తుడుస్తున్నారు.  ఆ  శుభ్రం  చేసే  వాళ్ళు  మంచి  దుస్తులు  వేసుకుని , చక్కటి  భాష  మాట్లాడుతున్నారు.  వాళ్ళకు   ఎక్కువ   జీతం  ఇస్తారట.

* ఇదంతా    చూసిన  తరువాత  నాకు   ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.
..........................


*  పూర్వకాలంలో   కొందరు    ప్రజలు,  ఇతరుల  మలినాలను  శుభ్రపరిచేవారు .  ఇది  ఎంతో  బాధాకరమైన  విషయం . 


* అయితే,  ఈ  రోజుల్లో  అలాంటివి   జరగటం  లేదా  ?   అనే   విషయాన్ని   గమనిస్తే,   ఇలాంటి    చర్యలు  అప్పటి  కన్నా,  ఇప్పుడే  ఎక్కువగా  జరుగుతున్నాయని  తెలుస్తుంది.

 *   ఈ  రోజుల్లో  కూడా  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులే  శుభ్రం  చేయటం  చూస్తూనే  ఉన్నాము.


* ఉదా...చాలామంది  ఇళ్ళలో ,  గదికో   టాయిలెట్,  గదికో  వాష్ బేసిన్  కట్టించుకుంటున్నారు.  అయితే,  వాటిని  ఇంటి  యజమానులు  శుభ్రం  చేయరు.  పనివాళ్ళతో  శుభ్రం  చేయిస్తారు.   ఈ  రోజుల్లో  చాలామందికి  ఇంటిపని  చేయటానికి  పనివాళ్ళను  ఏర్పాటుచేసుకుంటున్నారు  కదా  !   వాళ్ళు  యజమానులు  తిన్న  ఎంగిలి  పాత్రలను  శుభ్రం  చేస్తారు. టాయిలెట్స్  శుభ్రం  చేస్తారు. 

అంతేకాదు,  వాటిని   గాఢమైన  రసాయనాలతో  శుభ్రం  చేయవలసి  వస్తుంది.  ఆ  ఘాటు  వల్ల  వాళ్ళ  చేతులకు,  కళ్ళకు  అనారోగ్యం  కలిగే  అవకాశం  కూడా  ఉంది.


*   ఇళ్ళల్లోనే  టాయిలెట్స్, వంటగదిలో  సింకులు    వల్ల    డ్రైనేజ్  సమస్యలు   వచ్చినప్పుడు  కూడా  పారిశుద్య  కార్మికులు  వచ్చి   మలినాలను  శుభ్రం  చేసి  వెళ్తారు.

* పూర్వం    ఇలా  గదికో  టాయిలెట్ ను   శుభ్రం  చేసే  అవసరం  ఉండేది  కాదు. రసాయనాల  బాధ  కూడా  ఉండేది  కాదు.

.......................................


* ఇప్పుడు  చాలా  మంది   సరదాగా  కుటుంబసమేతంగా  హోటల్స్ కు  వెళ్ళి   భోజనం  చేస్తున్నారు. . వాళ్ళు  తిన్న  పళ్ళేలను  అక్కడ   వదిలి  వచ్చేస్తారు  గానీ,  కడగరు  కదా  ! వాటిని  అక్కడి పనివాళ్ళే  కడుగుతారు.

* పూర్వ  కాలం    కుటుంబసభ్యులు  హోటల్స్ కు  వెళ్ళి  తినటం  అనేది  తక్కువగా  జరిగేది.  ఒకవేళ  బయట  తిన్నా , ఆ  రోజుల్లో  భోజనం  చేయటానికి  అరటాకులు  వంటి  ఆకులను  ఉపయోగించేవారు. 


భోజనం  తరువాత  అరటాకులను   ఇతరులు   శుభ్రం  చేయనవసరం  లేదు,  వాటిని  బయట  పారేస్తే  పర్యావరణానికి  హాని  లేకుండా  చక్కగా  మట్టిలో  కలిసిపోయేవి. 
...................................

*  అప్పటి  వాళ్ళు  సరుకులు  తెచ్చుకోవటానికి  కిరాణా  కొట్టుకు  వెళ్తే  ఇంటినుంచి  సంచిని  తీసుకు  వెళ్ళేవారు. 


పూర్వకాలంలో  ఇప్పుడు  ఉన్నన్ని  రకాల  వస్తువులు  లేవు  కాబట్టి ,  ఇంత  చెత్త  ఉండేది  కాదు.   ఆ  చెత్త కూడా  పర్యావరణానికి  హాని  కలిగించకుండా  మట్టిలో  కలిసిపోయేది. 

 * పూర్వకాలం  వాళ్ళు  ఇంత  చెత్తను  బయట పారబోసేవారు  కాదు.  అంటే, 


ఉదా... ఇంట్లో  మిగిలిన  వ్యర్ధ పదార్ధాలైన  కూరగాయల తొక్కలను , వేరుశనగ  తొక్కలు,  మొక్కజొన్న  పై  తొక్కలు ,  అరటి  వంటి  పండ్ల  తొక్కలు,.... వంటివాటిని  చెత్తలో  వేయకుండా  పశువులకు  మేతగా  వేసేవారు.  మరికొన్ని  పదార్ధాలను  బయట  పారవేస్తే  కాకులు  వంటి  పక్షులు  తిని  పర్యావరణాన్ని  శుభ్రం  చేసేవి.

 * ఇప్పుడు  పెరిగిన  వాతావరణ  కాలుష్యం  వల్ల  కాకులు,  పిచ్చుకలు  వంటి  పక్షులు  ఎక్కువగా  కనిపించటం  లేదు  కదా  ! 


 ఈ  రోజుల్లో  చెత్త  బుట్టల  వద్ద  టన్నుల  కొద్దీ  చెత్త   పోగవుతోంది.  కుళ్ళిపోయిన  ఆ  చెత్తను  సాటి  మనుషులే  శుభ్రం  చేస్తుంటారు. ఈ  పారిశుద్య  కార్మికులు   డ్రైనేజ్  కాలువలను  కూడా  శుభ్రం  చేస్తుంటారు.
....................


* పూర్వకాలంలో   ఎవరి  ఇంటిముందు  వీధిని  వాళ్ళే   ఊడ్చి,  కళ్ళాపి   జల్లి, ముగ్గులు  పెట్టుకునే  పద్ధతి  ఉండేది.  దీనివల్ల  వీధులను  శుభ్రం  చేసే   పారిశుధ్య కార్మికులకు  చాలా  పని తప్పుతుంది.

* ఈ  రోజుల్లో  ఎవరి  ఇంటి ముందు  చెత్తను   వారు  శుభ్రం  చేసే  పద్ధతి  తగ్గిపోయి ,  బాధ్యతంతా  పారిశుధ్య  కార్మికులపై  పడుతోంది.
..............................


* ఇవన్నీ  గమనిస్తే  పూర్వకాలంలో  కన్నా,  ఈ  కాలంలోనే  ఇతరుల  మలినాలను  సాటి  మనుషులు  శుభ్రం  చేసే  పని  ఎక్కువగా  జరుగుతోంది ... అనిపించింది.
..................................


* పూర్వం  ఈ  దేశంలో  టాయిలెట్స్  ఉండేవి  కాదని, అప్పటి  వాళ్ళు  ఆరుబయటకు  వెళ్ళేవారని  ఇప్పటివారంటారు. ఆరుబయట  కాలకృత్యాలకు  వెళ్ళినా  ఆ  వ్యర్ధాలు  మట్టిలో  కలిసి  ఎరువుగా  మారేవి.

* ఈ  రోజుల్లో అయితే, టాయిలెట్స్  ద్వారా    వచ్చే   వ్యర్ధాలను   పైపుల  ద్వారా, మురుగు కాలువల  ద్వారా......    డైరక్టుగా  నదులలో,  సముద్రాలలో  కలిపేస్తున్నారు. 


ఇలా  కాకుండా   గోబర్  గేస్  ప్లాంట్స్  ఏర్పరిచి ,  ఈ  వ్యర్ధాలను విద్యుత్ గా మార్చి , వీధి  దీపాలు  వెలగటానికి , ఇంకా  ఇతరత్రా  విద్యుత్  అవసరాలకు  వాడుకుంటే  బాగుంటుంది. ( ఇలా  వచ్చిన  గేస్ ను   వంటకు  ఉపయోగించటానికి  ఎక్కువమంది  ఇష్టపడరు  లెండి..  )

*   చాలా  కాలానికి  పూర్వమే ,  భారతదేశంలో   విలసిల్లిన   సింధు  నాగరికత  యొక్క పురావస్తు  త్రవ్వకాలలో  చక్కటి  మురుగునీటిపారుదల  ఏర్పాట్లు  ఉన్న  వ్యవస్థ  బయటపడింది.  దీన్నిబట్టి  చూస్తే  అప్పటి  వాళ్ళకు  ఎంతో  టెక్నాలజి  తెలుసు . అని  తెలుస్తుంది. 


* ఒకప్పుడు  భారత దేశం  ఎంతో  సిరిసంపదలతో  విలసిల్లేది.  ఇక్కడి  వైభవాన్ని గురించి  ఎందరో  విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాలలో  వర్ణించారు.  అయితే,  తరువాత  క్రమంగా  భారతదేశం  పేద  దేశంగా,  మురికితో  నిండిన  దేశంగా  తయారయింది.  

* తిరిగి  ఈ  దేశం   సిరిసంపదలతో, పరిశుద్ధంగా విలసిల్లాలని  ఆకాంక్షిస్తూ .....Monday, January 21, 2013

సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీవిస్తున్న వారిని గౌరవించటం నేర్చుకోవాలి.

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
.............................

*  కాలేజీల్లో  చదివి  బయటకు  వచ్చిన   తరువాత   చాలాకాలం  ఉద్యోగాలు  రాకపోతే , యువకులు  ఎంతో  నిరాశానిస్పృహలకు  లోనవుతారు . 


*  ఇలాంటప్పుడు వారి  మనస్తత్వం  ఎలా   ఉంటుందంటే,   ఇంటాబయటా  అందరూ  తమను  తక్కువగా  చూస్తున్నారని  ఫీలవుతుంటారు.   అందరూ  తన  నిరుద్యోగాన్ని  వేలెత్తి చూపినట్లుగా  భావించి  మానసికంగా  క్రుంగిపోతారు. ఉదా... తల్లితండ్రి ,అబ్బాయిని  షాప్ కు వెళ్లి   ఏమైనా సరుకులు  తెమ్మని  అడిగితే,  తాము ఉద్యోగం  లేక   ఖాళీగా  ఉన్నాము  కాబట్టే , ఇంట్లో  వాళ్ళు  పనులు  చెబుతున్నారు,  అనుకుని  పెద్దవాళ్ళమీద  విసుక్కునే  అవకాశముంది.

 (పిల్లలు  చదువుకునే  రోజుల్లో విసుక్కున్నా కూడా అప్పటి  విసుగుకి, ఇప్పటి విసుగుకి  తేడా ఉంటుంది.)


* ఇలాంటప్పుడు,  ఇంట్లోని  పెద్దవాళ్ళు  పిల్లలను  తిరిగి  విసుక్కోకుండా,  వాళ్ళ   మానసిక  పరిస్థితిని  అర్ధం  చేసుకుని ,  వాళ్ళకు  మానసికస్థైర్యాన్ని  అందించాలి. వాళ్ళకు  సరైన  సూచనలను,  సలహాలను   తెలియజేసి  సరైనదారిలో  నడిపించాలి.* యువకులు  కూడా  కుటుంబంలోని   పెద్దవాళ్ళను   అపార్ధం  చేసుకోకూడదు.*  మనదేశంలో  కొందరు  యువత   ఉద్యోగం  దొరకకపోతే,   వేరే  రంగాలలో   ఉపాధిని  పొందటాన్ని  నామోషీగా  భావిస్తారు.   అంత  చదువు  చదివి  వేరే  పనులు  చేయటమెలా ?  అనుకుంటారు.  ఇలా  అనుకోకూడదు.

*  భారతదేశంలో   ఉన్నతస్థానాలలో  ఉన్న  వాళ్ళలో,  పేదరికం  నుంచి  ఎంతో  కష్టపడి  ఉన్నత  స్థానాలకు  వచ్చిన  వాళ్ళెందరో  ఉన్నారు. * నా  అభిప్రాయం  ఏమిటంటే,  ఏ  పనీ  తక్కువది  కాదు.  అన్ని  పనులూ  గొప్పవే. *  యువత  తమకు  ఉద్యోగం  దొరకనప్పుడు  డీలా  పడిపోకుండా   ధైర్యంగా   నిలదొక్కుకోవాలి. మేం  ఎక్కువగా  చదువుకున్నాం  కదా  ! తక్కువ  ఆదాయం  వచ్చే  ఉద్యోగాన్ని  లేక  వ్యాపారాన్ని  లేక  వ్యవసాయాన్ని  లేక  చేతి  వృత్తులను   చేస్తే  ఎవరైనా  నవ్వుతారేమోననే  భావజాలాన్ని  విడనాడాలి. * తల్లితండ్రి  కూడా ,  పిల్లలు  ఎక్కువ  జీతం  వచ్చే  ఉద్యోగమే  చేయాలని  కండిషన్స్  పెట్టకూడదు.* భారతదేశం  నుంచి  విదేశాలకు  వెళ్ళిన  వారిలో  కొందరు ,  అక్కడ  ఇతరత్రా  చిన్న  ఉద్యోగాలను  చేస్తూ  డబ్బు  సంపాదించుకుంటూ  కూడా  చదువుకుంటారట. * పురాణేతిహాసాల్లో  గొప్పగొప్ప  వాళ్ళే  ఎన్నో  పనులను  చేసారు. హరిశ్చంద్రుడు  అంతటి  మహారాజే  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.  నేను   గొప్ప  చక్రవర్తిని  కాటికాపరిగా  ఎందుకు  చేయాలి  ?  అని  ఆయన  వెనక్కి  తగ్గలేదు.   సత్యవాక్కు  కోసం  ఆయన  రాజ్యభోగాలను  విడిచిపెట్టి  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.*  శ్రీరాముడు  సాధారణ  వ్యక్తిగా  అడవుల్లో  జీవించారు. ......తాను  గొప్ప  రాజ్యానికి  యువరాజును  మరి,  సామాన్యుడిగా  ఎందుకు  అడవుల్లో  కష్టాలు  పడాలి  ?  అని  వెనక్కితగ్గలేదు. * పాండవులు  వనాల్లో  సాధారణంగా  జీవించారు,   కొంత కాలం  విరాటుని  కొలువులో  సామాన్య  వ్యక్తులుగా  ఉద్యోగాలను  చేసారు.  *  అంత   గొప్పవాళ్ళే   పరిస్థితులు  అనుకూలించనప్పుడు  సాధారణజీవితాలను  గడిపారు. వాళ్ళనుంచి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  
*  సమాజం కూడా  ఎంతో  మారాలి.  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  విలాసంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటాన్ని  మానుకోవాలి.   న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  సాధారణంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటం  నేర్చుకోవాలి.*  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పంచభక్ష్యపరమాణ్ణాలను  తినే  వారికన్నా , న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పచ్చడి  మెతుకులు  తినే  వారే  గొప్పవారు.

Friday, January 18, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో... నిరుద్యోగ సమస్య కోణం ..

ఈ  సినిమాలో  ఇద్దరు  సోదరులు  నిరుద్యోగ  సమస్యతో  ఇబ్బందులు  పడుతుంటారు.

  ఈ  అన్నదమ్ములు  ఉపాధి  కోసం  పట్నం  వెళ్ళి , అక్కడ  ఉపాధి   దొరకక  బాధ  పడుతుంటారు.  సరైన  ఉపాధి  లేక  వాళ్ళ  బాధ  వాళ్ళు  పడుతుంటే ,  ఏం  పని  చేస్తున్నావు  ? అంటూ ఇతరులు  వాళ్ళను  పదేపదే   పరామర్శిస్తుంటారు  .


నాకేమనిపించిందంటే ,  ఈ  అన్నదమ్ములు  పట్నంలో  ఉపాధి  దొరకలేదని  బాధపడటం  కన్నా, తాము ఉన్న  పల్లెలోనే   సొంత పోలంలోనో   లేక  కౌలుకు  తీసుకున్న  పోలంలోనో  చక్కగా  వ్యవసాయం  చేసి , మంచి  దిగుబడులను  సాధించి , నలుగురికీ  ఆదర్శంగా  ఉండవచ్చు  కదా  ! అనిపించింది. లేకపోతే,  కొందరు  నిరుద్యోగులు  కలిసి  లోన్ తీసుకుని , వాళ్ళు  చదువుకున్న  చదువుకు సంబంధించిన విధంగా ఉపాధికోసం ప్రయత్నించవచ్చు. ( అయితే, లోన్  దొరకటం వంటి విషయాలు  అంత  తేలిక  కాదు....)
 

................

ఈ  రోజుల్లో బయట  సమాజంలో  కూడా  ఎందరో  యువకులు  నిరుద్యోగ  సమస్యతో  ఇబ్బందులు  పడుతున్నారు.


 ఇంట్లోని  తల్లితండ్రులు ,  అయ్యో  ! ఇంకా  ఉద్యోగం  రాలేదా  ? అంటూ    బాధపడుతుంటారు. 

 బయట  వాళ్ళు ,  ఏం  చేస్తున్నావురా ?  ఇంకా  పని  దొరకలేదా  ?  అని  పరామర్శిస్తుంటారు .


 ఈ  బాధలు  పడలేక, ఎందరో యువకులు  ఏదో ఒక పట్నం చేరి  గదులు  అద్దెకు  తీసుకుని, చిన్న ఉద్యోగం  దొరికినా చాలనుకుని,   సరిగ్గా  తినీతినకా  ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ  అలసిపోతుంటారు.


కొందరు  తల్లితండ్రులు  కూడా   పిల్లలతో,  ఇంట్లో  ఖాళీగా ఉండి  ఏం  చేస్తావు  ? ఎక్కడికయినా  పోయి  పని  వెదుక్కో ... అని  అంటారు..  ఇంటా,  బయటా  ఈ  పోరు   పడలేక  విరక్తితో  కొందరు   యువకులు  మత్తుపదార్ధాలకు  అలవాటుపడటం,  కొందరు  ఆత్మహత్యా  ప్రయత్నాలు ..వంటివి  చేసే  అవకాశం  ఉంది.

  కొంత  కాలం  క్రిందట,  కూరలను  అమ్మే  ఒకామె  తన  ఇంటి  విషయాలను   చెప్పింది. 


  వాళ్ళ  కొడుకు  ఇంజనీరింగ్  చదివాడట.   ఎంత  ప్రయత్నించినా  ఎక్కడా  ఉద్యోగం  దొరకక,  ఇంట్లోనే  ఉన్నాడట. 


ఇంట్లోనే  ఖాళీగా  ఉండకపోతే,  ఎక్కడికయినా  వెళ్ళి  ఉద్యోగం  సంపాదించవచ్చు  కదా  ! అని   తల్లి   అబ్బాయిని  కోప్పడిందట. 


  కొడుకును  కోప్పడినందుకు  బాధపడుతూ  ఆ  వివరాలన్నీ  నాతో  చెప్పి  బాధపడింది. 


 ఇప్పుడు  ప్రపంచమంతటా  నిరుద్యోగ  సమస్య  ఉంది. అబ్బాయి ఏం  చేయగలడు ?  కొన్నాళ్ళు  ఇంట్లో  ఉంటే  తప్పేమిటి ? నెమ్మదిగా  ఉద్యోగం  దొరుకుతుందిలే,  పిల్లవాడిని    కోప్పడవద్దని  నేను  ఆమెను  మందలించాను.

ఇవన్నీ  చూస్తుంటే, పూర్వకాలంలో ఇంత  నిరుద్యోగ  సమస్య   ఉండేదికాదేమో   ? అనిపిస్తుంది. 


పూర్వం  పిల్లలు  తమకు  పరంపరగా  వస్తున్న  వృత్తివిద్యలలోని   మెళకువలను   పెద్దవాళ్ళ  వద్దే   నేర్చుకుని  ఉపాధిని  పొందేవారు.


   అప్పటి వాళ్ళకు , ఇప్పటిలా  చిన్నతనం  నుంచి  మార్కుల  కోసం,  తరువాత  ఉద్యోగం  కోసం   ఇతరులమీద  ఎక్కువగా  ఆధారపడే   అవసరం  ఉండేదికాదేమో  అనిపిస్తుంది.


 పూర్వపు  రోజుల్లో   విద్య,  ఉపాధి  వంటివి  వ్యక్తుల  చేతులలో  ఉండేవి.    ఇప్పుడు  విద్య  కోసం  ,  ఉపాధి కోసం   కొన్ని  సంస్థలపై  ఆధారపడవలసి  వస్తోంది.  ఇప్పటి  వాళ్ళకు  ఉద్యోగభద్రత   కూడా  తక్కువే. 

ఈ  రోజుల్లో  యంత్ర వినియోగం  అతిగా  పెరిగిపోవటం  కూడా  నిరుద్యోగం  పెరిగిపోవటానికి  ఒక  ముఖ్యమైన  కారణమనిపిస్తుంది. అంటే,  కొన్ని  కష్టమైన పనులకు   యంత్రాల  వినియోగం  అవసరమే  కానీ,     నిరుద్యోగసమస్య  పెరిగిపోయేంతగా  మితిమీరిన   యంత్రవినియోగం  అనవసరం.  అనిపిస్తుంది. 


 అన్ని  పనులను  యంత్రాలే  చేసేస్తే, ఇక  మనుషులకు  చేయటానికి  పనేముంటుంది ?ఇలాంటప్పుడు  నిరుద్యోగం  పెరుగుతుంది.

........................................

 పెద్దవాళ్ళ  ఆర్ధిక  పరిస్థితి మెరుగ్గా  ఉన్న నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి   నగరాల్లో  ఒక  ఇల్లు  అద్దెకు  తీసుకుని,  కుక్కర్లో  అన్నం  వండుకుని  ,  బయట నుంచి  వండిన  కూరలను  కొనుక్కుని  తింటూ  కాలం  గడుపుతారు.  ఈ  యువకులు   కూడా  ఉద్యోగం  లేకుండా  ఎక్కువకాలం  గడపాలంటే  తల్లితండ్రి  వద్ద  డబ్బు  అడగటానికి  సిగ్గుపడి , తినితినకా  ఉద్యోగాన్వేషణలో    తిరుగుతుంటారు.

 ఇక   తల్లితండ్రి  యొక్క  ఆర్ధిక  పరిస్థితి   సరిగ్గాలేని  యువకులు   చిన్న  గదులను  అద్దెకు  తీసుకుని  ఒకే ఇరుకు  గదిలో  10  మంది వరకూ  ఉంటూ,  తినితినకా  ఉద్యోగాన్వేషణలో    తిరుగుతుంటారు.

 ఇలా  ఈ  రోజుల్లో  ఎందరో  యువకులు  నిరుద్యోగ  సమస్యతో  బాధలు  పడుతున్నారు. సమాజంలో    నిరుద్యోగం  వంటి సమస్యలకు  పరిష్కారాలను     సీరియస్ గా  ఆలోచించి  చర్యలు  తీసుకునే  శ్రద్ధ ,సహనం ,సమయం   ఎక్కువమంది  మేధావులలో   కనిపించకపోవటం  బాధాకరం.
Wednesday, January 16, 2013

పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......


భగవంతుని నమ్మే వాళ్ళందరూ   తాము పూజిస్తున్న దైవం విశ్వాన్ని సృష్టించారని  నమ్ముతారు. అంటే , ప్రపంచంలో ఉన్న అందరు మానవులనీ  తాము నమ్ముతున్న దైవమే సృష్టిస్తారని నమ్ముతాము.


అలాంటప్పుడు మన ప్రక్కవాళ్ళు కూడా ఆ దైవం సృష్టించిన వాళ్ళే కదా ! వారియందు మనకు భేద భావం ఎందుకు ?

సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో ఒక్కరే.  అయితే, సూర్యుని కొందరు సన్ అంటారు, కొందరు సూర్యుడు అంటారు. అలాగే చంద్రుని కొందరు మూన్ అంటారు, కొందరు చంద్రుడు అంటారు.* ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ ' చంద్రుడు ' ఒక్కరే. మానవులందరికీ ' సూర్యుడు ' ఒక్కరే.  అలాగే
ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ  దైవం  ఒక్కరే.
 

చంద్రుని, సూర్యుని అన్ని మతములవారు వారివారి పధ్ధతులలో పూజించుకుంటారు.ముస్లిం మతస్తులు ,రంజాన్ పండుగ సమయాలలో చంద్రోదయానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. హిందూ మతస్తులు , పండుగ సమయాలలో, పూజలలో చంద్రునికి ఇంపార్టెన్స్ ఇస్తారు .


మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .అలాగే మా సూర్యుడు మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటే ........ మా సన్ మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటూ   వాదించుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎందుకంటే సూర్యుడు , చంద్రుడు ఎవరికయినా ఒకటే కదా.అలాగే మానవులందరూ ' దైవం ' ' మతం ' విషయాలలో ఎవరి ఆచారాలను వారు పాటించుకుంటూ ......ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ........... ఇతరుల మతములను గౌరవిస్తూ,  గొడవలు లేకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు.  ఏకత్వంలోనే భిన్నత్వం............భిన్నత్వంలోనే ఏకత్వం అన్న మాట..


 అంటే,   ఒకే దైవంలో అన్ని దేవుళ్ళరూపాలను   దర్శించగలగటం...........అన్ని దైవరూపాలలోనూ ఒకే దైవాన్ని దర్శించగలగటం ..అన్నమాట. 


పైన  వ్రాసిన  విషయాలలోని   కొన్ని  విషయాలు   ఇంతకు  ముందు   వేసినవే.
.............


అయితే,    మరికొన్ని  అభిప్రాయాలను  కూడా  చెప్పాలనిపించి  వ్రాస్తున్నాను.

ప్రపంచంలో ఎన్నో  రకాల  ప్రాంతాలున్నాయి.   వివిధ  రకములైన  వాతావరణపరిస్థితులున్నాయి.   వాటిని  బట్టి,  ప్రజలలో  వివిధరకములైన  ఆచారవ్యవహారాలున్నాయి.  దైవం  ఒకరే  అయినా,   ఒకే  దైవాన్ని  ఎవరి  పద్ధతిలో  వారు   భావించి,   ఆరాధించుకుంటారు.  కొందరు  నిరాకారంగా  ఆరాధిస్తే ,  కొందరు  సాకారంగా   భావించి  దైవాన్ని   ఆరాధిస్తారు. 

అన్ని మతాలలోనూ  ఎందరో  పేదవాళ్ళున్నారు.  అన్ని  మతాలవారు  ఒకరితో  ఒకరు  గొడవలు  పడటం  మాని,  తమ  మతాలలోని  పేదవారి  కష్టాలను  తీర్చగలిగే  విధంగా   చర్యలు  చేపడితే  ఎంతో బాగుంటుంది.  మానవసేవే  భగవంతుని సేవ  అని  కూడా  చెబుతున్నాయి   కదా  !  అన్ని మతాలు.

Friday, January 11, 2013

కొన్ని విషయములు ..


సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు. 


    సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు  సరైన ,
హేతుబద్ధమైన  జవాబు  చెప్పలేరు. 


క్రితం  ఆదివారం  ఈ .. టీవీలో  ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  (
శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం )  ప్రసారమయ్యింది. 


 ఆ  కధలో,    ఒక  రాజుగారు  నాస్తికులు. 

ఆ  రాజు  ,  ఆస్తికులను ,  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.   సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు  ప్రశ్న  అడుగుతారు.  అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...,  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.  అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు.  (  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )


విష్ణుచిత్తుల  వారు  చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు  తోచినంతలో  కొన్ని  అభిప్రాయాలు... 
         
ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.  అలాగే,  

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం  నిత్యం.  దైవానికి  ఆది అంతమూ  లేదు. అని  చెప్పటం   విష్ణుచిత్తుల వారి  అభిప్రాయం  కావచ్చు .   అనిపిస్తోంది . 


 ............................... 

  సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు. ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదానితరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !

............................    దైవానికి  ఆది,  అంతమూ  అనేవి  లేవు . అని కూడా   మనకు  తెలుస్తుంది.  ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు. 


............................


అసలు  ప్రతిదానికి    ఆది ,  అంతమూ  ఉంటుందని   ,  ఉండాలని  మనం  ఎందుకు  అభిప్రాయపడాలి  ? 


సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే, 
మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా.  


  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
...............................

 రామకృష్ణపరమహంస  శారదాదేవిల   శిష్యులైన   వివేకానందుని  జయంతి ,  జనవరి  12 న . 

 గోదారంగనాధుల   కల్యాణం జనవరి  13  న. ( భోగి పండుగ).

సంక్రాంతి,  అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం ..జనవరి  14  న.
  అందరికి  శుభాకాంక్షలు.

Wednesday, January 9, 2013

ఈ రోజుల్లోని విపరీతమైన సమాజపోకడల వెనుక ...కొన్ని కారణాలు.

 సమాజంలో నేరస్తులు  తయారవటానికి , నేరాలు  జరగటానికి   వెనుక ఎన్నో సామాజిక కారణాలు కూడా ఉంటాయి.
  ఈ రోజుల్లో , నైతికవిలువలకు   ప్రాధాన్యత ఇవ్వటం   తగ్గిపోయింది.   పూర్వపు సమాజంలో, త్రాగుడు వంటి చెడ్డ వ్యసనాలు ఉన్నవారికి సమాజంలో అంత గౌరవం లభించేది కాదు. ఇప్పటి సమాజంలో, త్రాగుడు వంటి చెడ్డ వ్యసనాలు లేనివాళ్ళను , నాగరికత   తెలియని  వారిగా చూసే చిత్రమైన వ్యవస్థ నెలకొంది.  మద్యనిషేధాన్ని   ప్రభుత్వం   అమలుచేస్తే,   ఎన్నో  కుటుంబాలు  బాగుపడతాయి.

పాపపు పనులు చేసైనా సరే , ఎక్కువగా డబ్బు సంపాదించి విలాసంగా జీవించాలి. అనుకునేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు.


పూర్వపు సమాజంలో, శృంగారం వంటి దృశ్యాలు చిన్నపిల్లల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు   రోజంతా  మీడియా ద్వారా … ( పత్రికల్లోనూ, టీవీచానల్స్ లోనూ, సినిమాల్లోనూ, అంతర్జాలం , సెల్ ఫోన్స్.. ద్వారా, ) శృంగారపరమైన చిత్రాలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తూ పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలు శీలానికి ( సత్ప్రవర్తనకు ) పెద్దగా విలువ ఇవ్వక్కర్లేదు అనుకునే ప్రమాదముంది.

  సమాజంపై  మీడియా  ప్రభావం  చాలా  ఉంటుంది.  మీడియాలో  కొన్ని  చక్కటి  ప్రోగ్రాంస్  వస్తున్నాయి.    సమాజాన్ని  తప్పుదోవపట్టించే 
ఎన్నో  ప్రోగ్రాంస్  కూడా  వస్తున్నాయి.  మంచిసినిమాలు  వస్తున్నాయి.  చెడ్డసినిమాలు  వస్తున్నాయి.   చెడ్డ సినిమాలు  తీసేవారు  ఏమంటారంటే,  ప్రజలు  చూస్తున్నారు   కాబట్టి   మేము  తీస్తున్నాము  అంటారు.    పిల్లలు  తప్పులు  చేస్తుంటే  సరిదిద్దవలసిన  బాధ్యతాయుతమైన  స్థానాల్లో  ఉన్న  పెద్దవాళ్ళు  ఇలా  అనటం  న్యాయం  కాదుకదా  !

ఇక ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళకు, తమ పిల్లలను తామే దగ్గరుండి పెంచుకోవటానికి గానీ, పిల్లలతో సరిగ్గా మాట్లాడటానికి గానీ, పిల్లలకు జీవితం గురించి తెలియచేయటానికి గానీ, తగిన సమయం లేనంతగా పెద్దవాళ్ళు బిజీ అయిపోతున్నారు.

ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల యువతకు వివాహం జరగటం ఆలస్యమవుతోంది. వివాహం జరిగినా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వేరు కాపురాలు, విడాకులు, ఎక్కువయ్యాయి. కుటుంబవాతావరణం సరిగ్గా లేని సమాజ వాతావరణంలో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా పిల్లల మనస్తత్వం గందరగోళంగా తయారవుతుంది.


నేరాలు జరగటానికి ఇలా ఎన్నో కారణాలున్నాయి. నేరస్తులకు కఠినశిక్షలు వెయ్యటం అవసరమే. అయితే, నేరాలను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే భావించి , పోలీసులపైనే పూర్తి భారం వేసెయ్యటం కాకుండా, సమాజంలో సమూలంగా మార్పులు వస్తే , నేరాలు   తగ్గుతాయని అనిపిస్తోంది.

పోలీసుల   కష్టాలు  పోలీసులకు  ఉంటాయి.  కొందరు  పోలీసులు  తక్కువ   జీతాలతో ,  కుటుంబాలకు  దూరంగా  ప్రమాదకరమైన  పరిస్థితిలో  పనిచేయవలసి  వస్తుంది. ఎందరో  కరడుగట్టిన  నేరస్తులను  చూసి చూసి ,  వారికి  విసుగ్గా  ఉంటుంది.   ప్రజలు  తమ  వంతు  బాధ్యతను 
చక్కగా  పాటించితే,  పోలీసులు  కూడా  తమవంతు  బాధ్యతను  చక్కగా  చేయగలరు. 

ఆర్ధికపరమైన అసమానతలు  కూడా  నేరాలు  జరగటానికి  ఒక  ముఖ్యమైన  కారణమే. . కొందరి  దగ్గర  విపరీతమైన  డబ్బు  ఉంటే,   కొందరికి  తినటానికి  కూడా  సంపాదన  చాలదు.  కొందరు  ఇంట్లో  ఉన్న  కుటుంబసభ్యులందరూ  ఉద్యోగాలు   చేసి ,  బోలెడు  డబ్బు  సంపాదించి  , ఖరీదైన  దుస్తులు,  నగలు,  కార్లతో ...... ఆడంబరంగా  జీవిస్తుంటారు.  కొందరికి  ఇంట్లో  ఒక్కరికి   కూడా  ఉద్యోగం  దొరకక  బాధపడుతుంటారు. 

  సమాజంలో  కొందరు,   అందిన   సంపదను   అందినట్లు    దోచుకుని  పదితరాలకు  సరిపడా   కూడబెడుతుంటారు. కొందరు  చేయటానికి  పనిదొరకక,  తినటానికి  తిండి  కూడా  లేక  ఆత్మహత్యా ప్రయత్నాలు  కూడా  చేస్తారు. ఈ  ఆర్ధిక  అసమానతలు  కూడా  ఎన్నో  నేరాలు  జరగటానికి  కారణమవుతున్నాయి.


సమాజంలో  నేరాలు జరగటానికి  ఇలా....ఎన్నో కారణాలున్నాయి. చిన్నతనం నుండి నైతికవిలువలతో కూడిన విద్యను అందించటం, చక్కటి కుటుంబ, సమాజ వాతావరణం ఉన్నప్పుడు సమాజంలో చక్కటి పౌరులు తయారవుతారు.Monday, January 7, 2013

పిల్లల హక్కులు...పెద్దవాళ్ళ హక్కులు.

*ఈ  మధ్య విదేశాల్లో  , తమ  పిల్లవాడిని  కొట్టారని  తల్లితండ్రులను  శిక్షించిన  సంఘటన  గురించి  విన్నాం.  ఆ  పిల్లవాడు స్కూల్  వాన్లో  మూత్రవిసర్జనను  ఆపుకోలేకపోవటం  వల్ల , విషయాన్ని  స్కూల్  వాళ్ళు  చెప్పటం ...తల్లితండ్రులు  పిల్లవాడిని   దండించటం  జరిగిందని  వార్తలు  వచ్చాయి. ( అసలు  ఏం  జరిగిందో  మనకు  సరిగ్గా  తెలియదు.  )


* పిల్లలు   అలా   చేయటానికి ఎన్నో కారణాలుండవచ్చు.   పిల్లలకు  ఏదైనా  అనారోగ్య సమస్య   ఉన్నప్పుడు కూడా   టాయిలెట్ కు   వెళ్ళేలోపు  ఆపుకోలేకపోతారు.    ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించి   ట్రీట్మెంట్ చెయ్యించాలి.  అంతేకానీ,  పిల్లలను   కొట్టటం    తప్పు.* కొన్ని  స్కూల్స్ లో కూడా , అర్జంట్ గా   బాత్రూం కు  వెళ్ళాలని   పిల్లలు  ప్రాధేయపడినా , కొందరు  టీచర్లు  పర్మిషన్  ఇవ్వరు.   పాఠం పూర్తయిన   తరువాత  మాత్రమే  వెళ్ళటానికి  పర్మిషన్ ఇస్తారు.   అంతవరకు  ఆపుకోలేని పిల్లలు  క్లాస్ రూంలోనే   మూత్రవిసర్జన  చేస్తారు.    అప్పుడు మళ్ళీ  పిల్లల్నే చితకబాదుతారు  టీచర్లు.*  కొందరు    ఆకతాయి పిల్లలు టాయిలెట్ పేరు చెప్పి బయటకు వెళ్ళి   కాలక్షేపం చేసే మాట నిజమే కానీ, అటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని , నిజంగా టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం ఉన్న విద్యార్ధులను  కూడా ఆపటం న్యాయం కాదు కదా ! * కొన్ని సార్లు విపరీతమైన ట్రాఫిక్ వల్ల, స్కూల్ నుంచి ఇంటి కెళ్ళేవరకూ   కాలకృత్యాలను ఆపుకోలేని పిల్లలకు కూడా   ఇలా జరిగే   అవకాశం ఉంది. ఇలాంటప్పుడు   పెద్దవాళ్ళదే  తప్పు  కదా  ! స్కూల్  బస్  లో  కూడా 
టాయిలెట్  సౌకర్యం  ఉండాలి. 


* కొన్నిదేశాల్లో అయితే ,   పెద్దవాళ్ళు కూడా   నాప్కిన్స్  వేసుకుంటారట.
( లోకల్ ట్రైన్స్ లో   టాయిలెట్స్   ఉన్నా కూడా,  టాయిలెట్ కు   వెళ్ళటానికి కూడా   వీలులేనంత రష్ ఉంటుందట ట్రయిన్స్లో. )* ఈ అబ్బాయి కేసులో తల్లితండ్రులను   జైల్లో పెడితే , మరి ఆ బాబును ఎవరు చూసుకుంటారు ? ఆ పిల్లవాడు   తల్లితండ్రులు  కావాలని   ఏడిస్తే   ఏం  చేస్తారు ?      పిల్లవాడికి తల్లితండ్రులను దూరం చేయటం కూడా పిల్లల హక్కుకు భంగం కలిగించటమే కదా !* నిజంగా పిల్లలను శాడిజంగా హింసించే తల్లితండ్రులను జైల్లో పెట్టవలసిందే. కానీ, ఈ తల్లితండ్రులు తాత్కాలిక ఆవేశంలో పిల్లవాడిని శిక్షించారే కానీ, అబ్బాయి అంటే ప్రేమ ఉన్నవారిగానే కనిపిస్తున్నారు. దీనిని  మొదటి తప్పుగా భావించి, తల్లితండ్రులను విడిచిపెడితే బాగుంటుందనిపిస్తోంది. *  మనదేశంలో  అయితే,  సమావేశాలంటూ  స్కూల్  పిల్లలను   గంటలతరబడి  ఎండలో  నిలబెట్టేస్తారు. కొన్నిసార్లు    రోడ్ల   వెంబడి  ఊరేగింపులంటూ   తిప్పుతారు.   ఆ  సమయంలో   పిల్లలకు  టాయ్ లెట్ కు  వెళ్ళటానికి  కూడా  అవకాశం  ఉండదు.  అంతసేపు   ఎండలో  నిలబడి ,  నడిచి ,   పెద్దవాళ్ళు  చెప్పే  స్పీచులు   వినలేక  పిల్లలు  కళ్ళుతిరిగి  పడిపోతారు  కూడా. * చదువు  పేరుతో  గంటల  తరబడి  కూర్చోబెట్టి,  ప్రపంచంలో  జరిగే   విషయాలన్నీ   పిల్లల  మెదళ్ళలో  కూరటం  వల్ల    కూడా,   పిల్లలకు  ఆటలాడుకునే  సమయం  లేక,  తమ  బంగారు  బాల్యాన్ని  కోల్పోయి , యంత్రాల్లా  తయారవుతున్నారు.*  పిల్లలను  పెంచటానికి  కూడా  సమయం  లేని  తల్లితండ్రులు ,  ఏడుస్తున్న   చంటిపిల్లలను  కూడా  క్రెచ్లో  వదిలి  వెళ్తారు . * తల్లితండ్రులతో  కలిసి  జీవించటం  పిల్లల  జన్మహక్కు....  అయితే,  తల్లితండ్రులు  తమలోతాము కొట్లాడుకుని  విడిపోవటం  వల్ల  పిల్లలకు  ఆ  ఆశ  తీరదు. ఇలాంటివాళ్ళు   విడాకులు  తీసుకోవటంతో  ఆగకుండా,  తమకు  నచ్చిన  వాళ్ళను  మళ్ళీ  పెళ్ళి  చేసుకుని ,  పిల్లలకు   కొత్త  తల్లితండ్రులను  తెస్తారు. ఇది  పిల్లలను  మానసికంగా  ఎంత  బాధ పెట్టినా  పట్టించుకోరు. *  పిల్లలు  స్కూల్  నుంచి   ఇంటికి  వెళ్ళగానే , సొంత  అమ్మకు  బదులు  కొత్త  అమ్మ,  సొంత నాన్నకు  బదులు  కొత్త  నాన్న  ఉంటే....  ఆ  బాధ  ఎలా  ఉంటుందో  ఊహించుకుంటేనే  బాధగా  ఉంటుంది. ఆడపిల్లలు  ఉన్న తల్లి    మళ్ళీ  పెళ్ళి  చేసుకుంటే , వచ్చే  కొత్తనాన్న  వల్ల ,  ఆ  పిల్లలకు  కొత్తరకం  సమస్యలు  వచ్చే  అవకాశం  కూడా  ఉంది. * ఇలా.... ఈ  రోజుల్లో  ఎందరో   పిల్లలు  ఎన్నో  కష్టాలను  అనుభవిస్తున్నారు.  పిల్లల  భావాలకు  సమాజంలో  విలువ  ఇస్తున్నట్లుగా  అనిపించటం  లేదు.   పెద్దవాళ్ళు తమ హక్కులను  గోల చేసి సాధించుకుంటారు.  పిల్లలకూ హక్కులుంటాయి. అని అందరూ గుర్తించాలి.
Friday, January 4, 2013

కొన్ని విషయాలు.


ఓం.
శ్రీ  అనంతలక్ష్మీసత్యవతీదేవి సమేత శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీర  వేంకట  సత్యనారాయణ స్వామి వారికి  నమస్కారములు. 


 శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.పురాణేతిహాసాలలోని  వారి  చరిత్రల  ద్వారా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు. శ్రీ  సత్యనారాయణ స్వామి వారి  వ్రత మహాత్మ్యంలో  చెప్పే  కధల  ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

ప్రసాదం  అంటే, భగవంతుని   అనుగ్రహం.

శ్రీ సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  గురించి  సినిమా  కూడా  వచ్చింది. 


 ఈ  సినిమా  యొక్క  లింక్  ఇక్కడ  ఇస్తున్నానండి.

Sri Satyanarayana Swamy - YouTube.

 

 

Wednesday, January 2, 2013

చరిత్రలో ఎందరో మహానుభావులైన స్త్రీపురుషులున్నారు.

* ఓం.

*ఈమధ్య  ఒక బ్లాగ్ లోని  టపాకు  నేను  వ్రాసిన   వ్యాఖ్యలో.............

* ..జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది... అని  వ్రాసాను.

* తరువాత  ఆలోచిస్తే,   ధర్మరక్షణ  కోసం   జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  ఎందరో  మహానుభావులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో   ఉన్నారు.  అందుకని    పైవిధంగా  నేను  వ్రాయటం  తప్పని  నాకు  అనిపించింది.  * తెల్లవారితే  పట్టాభిషేకానికి  బదులు  వనవాసానికి  వెళ్ళవలసివచ్చినప్పుడు  సీతారాములు  ఎంతో  నిబ్బరంగా  వ్యవహరించారు. *
నేను  వనవాసానికి  వెళ్ళను.....  అని  రాముడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.  అయితే,   శ్రీ రాముడు  అడవులకు  వెళ్ళకపోతే  ,  కైకేయికిచ్చిన  మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  దశరధునికి  వచ్చి  ఉండేది.


* నేను  రాజ్యాన్ని దానంగా  ఇవ్వను....అని  హరిశ్చంద్రుడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.   అయితే, రాజ్యాన్ని
దానంగా ఇవ్వకపోతే,   విశ్వామిత్రునకు  ఇచ్చిన   మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  హరిశ్చంద్రునకు  వచ్చి  ఉండేది.

 * వాళ్ళు   ధర్మపరిరక్షణకు  ఎంతో  ప్రాధాన్యతను  ఇచ్చేవారు.


* సమాజంలో  బాధ్యతాయుతస్థానాల్లో  ఉన్నవారు  అసత్యవాదులు,  అధర్మపరులు  అయితే ,   ప్రజలు  కూడా  అసత్యం,  అధర్మం  చేయటానికి  వెనకాడరు.    అప్పుడు  సమాజమంతా  అబద్ధాలకోర్లు,  మోసగాళ్ళతో  నిండిపోయి   అస్తవ్యస్తమవుతుంది.      అధర్మం  పెరిగిపోతుంది.     సమాజంలో   ఎన్నో  నేరాలు  జరుగుతాయి.*  అందుకే  సత్య  హరిశ్చంద్రుడు,  శ్రీరాముడు, వంటి  వారు  లోకహితం  కోరి,  ధర్మ  పరిరక్షణ  కొరకు  రాజభోగాలను   కూడా   అవలీలగా  త్యజించి , ఎన్నో  కష్టాలను  సహించారు.  వారి  భార్యలు  కూడా  ఎన్నో  కష్టాలను  భరించారు.* రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు...  వారి  భార్యలు  ...  రాజ్యాధికారం  కోసం  తమలో  తాము  
కలహించుకోకుండా  ప్రజలకు  శాంతినిచ్చి  తాము  కష్టాలను  భరించారు.


* భారతంలో  భీష్ములవారు  రాజ్యాధికారాన్ని,  వివాహాన్ని  అవలీలగా  త్యజించి  జీవితాంతం  తాను  చేసిన  ప్రతిజ్ఞకే  కట్టుబడ్డారు.* లోకక్షేమం  కోసం  వెన్నెముక  కావాలని   దేవతలు   అడిగితే  అవలీలగా  అర్పించారు  దధీచి  మహర్షి.*  ఇలా    ధర్మరక్షణ  కోసం  జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  స్త్రీలు,  పురుషులు   పురాణేతిహాసాలలో  ఎందరో   ఉన్నారు. * పురాణేతిహాసాల  ద్వారా  వీరి  చరిత్రలను  తెలుసుకుని ,  స్వార్ధాన్ని  తగ్గించుకుని  జీవితాలను  తీర్చిదిద్దుకున్న  వారెందరో   తరువాత   కాలంలో  కూడా   ఉన్నారు.* ఇంత  మంది  మహనీయులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో  ఉన్నప్పుడు ,  జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది...... అని  నేను  వ్రాయటం  ఎంతో  తప్పే  . * అలా  వ్రాసినందుకు  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


.................................
* ఈ  మధ్య   నేను  కురువపురం  వెళ్ళి  శ్రీపాదశ్రీవల్లభుల  వారి  దర్శనం  చేసుకు  వచ్చాను.

* ఇంతకుముందు  కూడా  ఒకసారి  కురువపురం  సందర్శన  భాగ్యం  కలిగింది.   మళ్ళీ  నాకు   కురువపురం  సందర్శన  భాగ్యం   కల్పించినందుకు  దైవానికి  అనేక  నమస్కారములు.


* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  అనేక  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  అనేక నమస్కారములు.

........................

 * ఆంగ్ల  నూతన సంవత్సర  సందర్భంగా .... ప్రపంచమంతటా  శాంతిభద్రతలు  విలసిల్లాలని  ఆకాంక్షిస్తున్నాను.