koodali

Friday, July 29, 2011

.........అంటూ తమలో తాము వాదించుకుంటారు.

ఓం.
హిందువులలో కూడా చాలామంది మా దైవమే గొప్ప అంటూ తమలో తాము వాదించుకుంటారు.

శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, ఇలా .....అన్నమాట..


కానీ , బ్రాహ్మణులు అందరికీ సంధ్యోపాసన ముఖ్యమయినది. మరి శ్రీ గాయత్రీ మాత కూడా శక్తిరూపమే అని పెద్దలు చెబుతున్నారు కదా !


చాలామంది శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకుంటారు. వారు త్రిమూర్తి స్వరూపులే గదా !


గురుదేవులైన శ్రీ దత్తాత్రేయస్వామి వారు కూడా త్రిమూర్తి స్వరూపులే గదా !


తిరువనంతపురంలో శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని దర్శించేటప్పుడు త్రిమూర్తులు కనిపిస్తారట...


తిరుమల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తిని కొందరు శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరునిగా ఆరాదిస్తారు.


కొందరు శక్తి రూపమయిన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భావించి ఆరాధిస్తారట., ఈ విషయం గురించి ఆ మధ్య మీడియాలో చర్చ కూడా జరిగింది...శివకేశవులకు మధ్య భేదం చూపెడితే నరకానికి పోతారని పెద్దలే చెప్పినా కొంతమంది అంతగా పట్టించుకోరు.....ఏమిటో !

ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి.


Wednesday, July 27, 2011

ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.ఆదిపరాశక్తి అయిన పరమాత్మ విశ్వాన్ని సృష్టించారు.


ఈ విషయాలగురించి ఇప్పుడు నా బోటి సామాన్యులు అంతగా అర్ధం చేసుకోవటం కష్టం. అయితే నాకు తెలిసినంతలో చెప్పుకోవాలని.............సృష్టిలో , దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు , దానవులు, ఉన్నారు. దేవతలు, మానవులు, దానవులు,.............వీరందరి ధర్మాలు, గుణాలలో భేదం ఉంటుంది.విశ్వంలో ఎన్నో లోకాలున్నట్లు పెద్దలు తెలియజేసారు. "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో పెద్దలు ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తాము పరమపదించిన కొన్ని రోజుల తరువాత పునరుత్ధానం చెంది ఆయా లోకాల గురించి తమ శిష్యునికి చెప్పటం జరిగింది.అందులో కొన్ని విషయములు........


"సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి."


అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించిన వారు కారు: సూక్ష్మలోకవాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక ( అవయవ ) నిర్మాణమూ ,సూక్ష్మ శరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా , మానసికప్రసార ( టెలిపతీ ) సూక్ష్మదూరదర్శనాల ( ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది.మానవుడు ప్రధానంగా ఘన,ద్రవ,వాయు పదార్ధాల మీదా గాలిలో ఉన్న ప్రాణ శక్తి మీదా ఆధారపడి ఉన్నవాడు : కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం , అదృశ్యం చేయటం చేస్తూంటారు.సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ.ఇలా ఎన్నో విషయాలు శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యునికి చెప్పటం జరిగింది.

నాకు ఇలా అనిపించింది.......ఇతరలోకాల వారికి , మానవులకు ఇన్ని తేడాలు ఉన్నప్పుడు మరి మానవులకు దేవతలకు ఎన్నో తేడాలుంటాయి. మనం దేవతల చర్యలను మన ఆలోచనాకోణం నుండి మాత్రమే చూస్తాము.


కానీ, దేవతలకు మానవులకు ఉన్న రీతిలో రాగద్వేషములు ఉండవు.దేవతల చర్యలు మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. దేవతల చర్యలను మానవ ధర్మాలు,గుణముల కోణం నుండి చూడకూడదు.ఉదా....ఇంద్రుడు తపస్సు చేసే వారి వద్దకు అప్సరసలను పంపి వారి తపస్సులను భగ్నం చేయటానికి ప్రయత్నిస్తారు అని కొందరు అంటారు.కానీ ఇంద్రుడు అప్సరసలను పంపటం ద్వారా ...... తపస్వుల పట్టుదలను పరీక్షిస్తారు అని కూడా అనుకోవచ్చు.


ఇంకా , చంద్రునికి తన భార్యలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అని చెబుతారు.


చంద్రునికి ఉచ్ఛస్థానం వృషభరాశి . అందులో కృత్తిక ,మృగశిర నక్షత్రములు పూర్తిపాదములతో ఉండవు. రోహిణి నక్షత్రం మాత్రమే అన్ని పాదములతో ఉంటుంది.
అందుకని............చంద్రునికి ఉచ్ఛస్థానమయిన వృషభంలో రోహిణి నక్షత్రం పూర్ణంగా ఉంటుంది కాబట్టే.......... అని కూడా అర్ధం చేసుకోవచ్చు...అందుకే దేవతల చర్యలను మానవగుణముల కోణం నుండి చూడకూడదు.


దేవతలు మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము ,....... వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు అనిపిస్తుంది..


ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.ప్రతి
దాన్ని అపార్ధంచేసుకోవటం కాకుండా , దైవం దయ కోసం ప్రయత్నించాలి అందరూ .అప్పుడే ప్రశాంతత లభిస్తుంది.


ఇందులో పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి....


Monday, July 25, 2011

మూర్తిదేవి ధర్మపత్ని............

ఓం. శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రణామములు.

ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి నారాయణుడు నారదునితో చెప్పిన విషయాలు............


స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు.

దక్షిణా దేవి యజ్ఞపత్ని
.

స్వధాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి.

స్వస్తి దేవి వాయుపత్ని. ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది.


పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు.

తుష్టిదేవి అనంత పత్ని. సకలదెవతలూ సకల లోకాలూ సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే.


సంపత్తిదేవి ఈనాశ పత్ని.
ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి.

(( ఇలాగే ఉందండి . .) మరి ఈశాన పత్ని . సరైనదో . లేక ఈనాశ పత్ని. సరైనదో నాకు తెలియదండి. )

ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో వొణికిపోవాల్సివస్తుంది.


సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమై పోతుంది.

దయాదేవి మోహ పత్ని.

ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది.

కీర్తిదేవి సుకర్మ పత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది.

క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి.

మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.


శాంతదేవి లజ్జాదేవులిద్దరూ సుశీల పత్నులు. వారు లేకపోతే జగత్తు ఉన్మత్తమై పోతుంది.

బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది.మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప. మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ
కూడా నిరాధారుడై పోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీ రూప. మూర్తి రూప.మాన్య. ధన్య.


ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.


కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు.


క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది.


.తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు.

కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది.

నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు.

శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.
.........................................
ఇలా పెద్దలు చెప్పటం జరిగింది. నాకు అర్ధం అయినంతలో .................
౧. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు. ..............


అంటే ,
పుష్టిదేవితో కూడిన గణపతి దేవుని అనుగ్రహం వల్ల స్త్రీపురుషులు క్షీణించకుండా ఉంటారు....
( పుష్టిగా ఉంటేనే క్షీణించకుండా బలంగా ఉంటారు కదా !. )


౨. ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో
వొణికిపోవాల్సివస్తుంది.......

అంటే , (..ధృతి అంటే ధైర్యం .ధైర్యం లేకపోతే అధైర్యమే కదా !. )


౩ . ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది. ..................

అంటే ,( ..పుణ్యాలు చేస్తే ప్రతిష్ఠ పెరుగుతుంది. పుణ్యాలు చేసేవారు లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది కదా ! )


౪.కీర్తిదేవి సుకర్మ పత్ని.
ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది................

అంటే , (.మంచి కర్మలు చేసే వారు లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది కదా ! )


౫ . క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి. .............

అంటే ,. (. పద్ధతిగా పనులు చేసేవారులేకపోతే లోకాలన్నీ సోమరులతో నిండి విధిహీనాలైపోతాయి కదా ! )


౬ .
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది .......

అంటే ,. ( మిధ్యావాదులైన అధర్మపరులయిన ప్రజల వల్ల సృష్టి
విచ్ఛిన్నమవుతుంది కదా !. )


౭ . శాంతాదేవి లజ్జాదేవులు సుశీల పత్నులు.........వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. .........

అంటే , ( శాంతం, లజ్జ ( సిగ్గు ) లేని ........ సుశీలత లేని వ్యక్తుల వల్ల జగత్తు ఉన్మత్తమైపోతుంది కదా !. )


బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. ..............

అంటే ,....( బుద్ధి మేధా ధృతి కలిగిన జ్ఞానులు లేని లోకం మూఢులతో నిండిపోతుంది కదా !.)


౯ .. మూర్తిదేవి ధర్మపత్ని........

అంటే ,...( ధర్మం , ధర్మమూర్తులు లోకంలో పెరిగినప్పుడు లోకంలో ధర్మానికి బలం పెరిగి , అధర్మానికి బలం తగ్గిపోతుంది . అప్పుడు
పరమాత్మ కృపకు పాత్రులమవుతాము కదా ! )


౧౦ . క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది.............

అంటే , (.క్షుత్పిపాసలతో కూడిన లోభబుద్ధి కలవారి వల్లే లోకం చింతాతురమవుతోంది కదా ! )౧౧. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. ..........

అంటే ,...( జరా ( ముసలితనం )మృత్యువు వల్లనే జీవులు మరణిస్తారు. అలా జగత్తు క్షీణిస్తోంది కదా !. )


౧౨. నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు..........

అంటే ,....(. నిద్రా ......... సుఖం వల్ల అలసటనుంచి తేరుకుంటారు కదా ! )


౧౩. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.................

అంటే ,. ( శ్రద్ధా భక్తులు ఉన్నవారికి వైరాగ్యం కుదురుకుంటుంది. వారికి మోక్షం లభించే అవకాశం ఉంది కదా !.)


ఇలా నాకు అర్ధమయింది వ్రాసానండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి.... 


Friday, July 22, 2011

చెప్పిన సందర్భంలో.............

*బ్రహ్మ దేవుడు , నారదునితో పరమాత్మను గురించి చెప్పిన సందర్భంలో...........


*సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి-ఆదిపురుషుల తత్వం.అది తేజస్సు.........ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు.సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రాభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ.పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. అంటూ ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.ప్రాచీన గ్రంధాలలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పబడ్డాయి.


నాకు అవన్నీ పూర్తిగా అర్ధం చేసుకునే పాండిత్యం లేదు గానీ, నాకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో చెప్పుకోవాలని అంతే.నా అభిప్రాయాలు అన్నీ సరైనవే అని నేను చెప్పటం లేదు....... కొన్ని పొరపాట్లూ ఉండవచ్చు.


అయితే పెద్దలు ఎన్నో పాత్రలు సృష్టించి , వాటి ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలియచెప్పారని నా అభిప్రాయం.


ఉదా....... భారతంలో శంతన మహారాజు గురించి చెప్పబడింది... వారి పుత్రుడు గాంగేయుడు ( భీష్ముడు. )


శంతన మహారాజు సత్యవతీదేవిని వివాహం చేసుకోగోరిన సందర్భంలో .......సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు ,........... శంతనునితో,

" మా అమ్మాయికి పుట్టే కొడుకు మాత్రమే మీ తరువాత పట్టాభిషిక్తుడు కావాలి.
అలా అయితేనే ఈ వివాహానికి ఒప్పుకుంటాను " ..... అంటారు .అది విని శంతన మహారాజు విచారంగా తిరిగి వచ్చేస్తారు.


జరిగిన విషయాన్ని మంత్రుల ద్వారా తెలుసుకుని, గాంగేయుడు ( భీష్ముడు ),........దాశరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యాన్ని స్వీకరించబోను. అని చెప్పగా .......దాశరాజు " నీ మాట నమ్ముతాను ,.కానీ నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యాన్ని లాక్కుంటే ఎలా " ?....... అని సందేహం వ్యక్తం చేస్తారు కదా !


అప్పుడు గాంగేయుడు తాను " రాజ్యాన్ని చేపట్టబోను , వివాహం చేసుకోను " అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు .......

(
భీష్ముడు., ఒక శాపం వల్ల భూమిపై జన్మించారు. )


దాశరాజు తన కుమార్తె ఎంతో సంతోషంగా ,గొప్పగా ఉండాలని అలా కోరి ఉంటారు.

కానీ ఇతరులను కష్టపెట్టి తాము గొప్పవాళ్ళం అయిపోవాలని కోరుకోవటం ...... అన్యాయం కదా !


దాశరాజు అంత తాపత్రయపడినా సత్యవతీదేవికి జీవతంలో ఎక్కువ భాగం సంతోషం లేదనే చెప్పుకోవాలి.శంతనుడుసత్యవతీదేవులకు కలిగిన కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు చిరకాలం రాజ్యాన్ని పాలించలేకపోయారు.


చిత్రాంగదుడు ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించారు.


విచిత్రవీర్యుడు అంబ, అంబాలికలను వివాహమాడిన కొంతకాలానికి వ్యాధి వల్ల మరణించారు.


ఇక దృతరాష్ట్రుల వారు అంధులు, పాండురాజు, వారిది కూడా అకాల మరణమే.

ఇవన్నీ
సత్యవతీదేవికి బాధను కలిగించే విషయాలే.


ఇవన్నీ చూస్తే .......

దాశరాజు భీష్ములవారికి రాజ్యాధికారం, వివాహం లేకుండా అడ్డుకున్నా కూడా ........


సత్యవతీదేవి జీవితంలోకి కష్టాలు రాకుండా విధికి అడ్డంపడలేకపోయారు.
* భీష్ముడు రాజ్యాధికారం చేపట్టటం ,వివాహం చేసుకోవటం జరిగితే మహాభారత గాధ ఎలా ఉండేదో ?.............


* అయితే ,మహాభారతయుద్ధం జరగాలని ఒక ప్రణాళిక ,ముందే దైవం ద్వారా నిర్ణయించబడింది........


అందుకే దాశరాజు వారి నోట విధి అలా పలికించి ఉంటుంది అనుకోవచ్చు.* కానీ మనం ఏం తెలుసుకోవాలంటే,...........

మన సంతోషం కోసం ఇతరులను కష్టపెట్టినంత మాత్రాన మన జీవితంలో సంతోషాన్ని పొందలేము.........


అలా ఇతరులను కష్టపెడితే వారి ఉసురు మనకు తగిలి మరిన్ని కష్టాలు వచ్చే అవకాశం కూడా ఎంతో ఉంది.అని..
ఇంకా, దృతరాష్ట్రులవారి మితిమీరిన పుత్ర ప్రేమ కూడా........... భారత యుద్ధం జరగటానికి ,తద్వారా ఎక్కువ జననష్టం జరగటానికి , ఒక కారణమని అంటారు.


అయితే దృతరాష్ట్రుడు మంచి చెబితే దుర్యోధనుడు వినే పరిస్థితి ఉందా ? అంటే అది వేరే విషయం.


కనీసం 5 ఊళ్ళు ఇస్తే చాలు .అని పాండవులు అడిగినా కూడా వినని అధికారదాహం, అసూయ గల వ్యక్తి దుర్యోధనుడు.


ఇలాంటి కొందరి వ్యక్తుల వల్ల చుట్టూ ఉన్న బంధువులకు, దేశంలోని ప్రజలకూ కష్టాలు తప్పవు. వారి స్వార్ధానికి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తారు.అలా జరగకుండా ఉండాలంటే, పిల్లలను చిన్నతనం నుంచే నయానో, భయానో మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి తల్లిదండ్రులు .చేతనయినంత వరకు ప్రయత్నించాలి .


తల్లిదండ్రులు కూడా తమ స్వార్ధాన్ని తగ్గించుకోవాలి....... లేకపోతే చివరికి చింతించవలసిందే.ఇంకా, .దుర్యోధనుడు అలా తయారవటానికి శకుని కూడా ఒక కారణమని కొందరు అంటారు.


* ఏమైనా ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక ఎన్నో కారణాలుంటాయి.


అతని పూర్వజన్మ కర్మ,ఇప్పుడు చేస్తున్న కర్మ, తల్లిదండ్రుల ప్రవర్తన,సమాజం,
స్నేహితులు, బంధువులు,.............

ఇలా ఎన్నో కారణాలు కలిసి ....... ఒక వ్యక్తి ప్రవర్తనకు కారణాలుగా చెప్పుకోవచ్చు..


వ్రాసిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉన్నచో భగవంతుడు క్షమించాలని ప్రార్ధిస్తున్నానండి.


Wednesday, July 20, 2011

పురాణేతిహాసాల నుంచీ మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది. ..........

ఓం.

ప్రాచీన గ్రంధాలలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.


ఖగోళం, ఆయుర్వేదం, విశ్వం గురించి ,ఇంకా విశ్వంలోని ఇతర లోకాలగురించి ఎన్నో గొప్ప విషయాలను పెద్దలు ఈ గ్రంధాల ద్వారా మనకు అందించారు.


ఇవే కాకుండా ...... సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి,ఏది ధర్మం, ఏది అధర్మం
.......ఇలా ఎన్నో విషయాలను పురాణేతిహాసాల లోని కధల ద్వారా తెలియజేసారు.


ధర్మానికి, అధర్మానికి మధ్యన సన్నని గీత మాత్రమే ఉంటుంది.


అవన్నీ తెలియాలనే,
దైవము, పెద్దలు మనకు........... ఎన్నో కధలను, ఉప కధలను, రకరకాల సంఘటనలను, వ్యక్తులను....సృష్టించి ,
వాటి ద్వారా రాబోయే తరాలకు దిశానిర్దేశం చేశారు.కొందరు ఏమనుకుంటారంటే ,పవిత్రమైన గ్రంధాలలో ఇలా చెడు సంఘటనలు, చెడ్డ వ్యక్తులు గురించిన విషయాలు ఉన్నాయి.


ఇలాటివి తెలుసుకొమ్మని పెద్దలు ఎందుకు చెప్పారో? అని అపార్ధం చేసుకుంటారు.


నాస్తికులయితే ఇవన్నీ చదివి వేళాకోళం చేస్తారు కూడా.


కానీ, చూడండి. ఆ కధలలో అంతా మంచే ఉంటే ........,ఉదా........ ఒక వ్యక్తి బాల్యదశ ఏ కష్టాలు లేకుండా గడిచి,.......
యవ్వనం ఇబ్బందులు లేకుండా గడిచి,...... వృద్ధాప్యం సుఖంగా గడిపి......
జీవితాన్నీ చాలించారు. ....... అని కధ చెప్పారనుకోండి.కధ బాగుంటుంది. కానీ అందరి జీవితాలు అలా ఉండవు కదా !సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు. ,


ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.


ఇప్పుడు సమాజంలో చూడండి ........ ఎన్నో నేరాలు.ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.మంచివారూ ఉన్నారు ........ చెడ్డవారూ ఉన్నారు.


* మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా ,* దైవం, పెద్దలు .......... పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ,.......ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , .......ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో .......మనకు దిశానిర్దేశనం చేశారు అనిపిస్తుంది. .
అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.

* ఇంకా, పురాణేతిహాసాలలో గమనించితే ........ఎంత గొప్ప వ్యక్తి అయినా , అధర్మంగా ప్రవర్తించినప్పుడు .... ..... .
పర్యవసానంగా వారు ఎంతో కొంత బాధను అనుభవించటాన్ని మనం గమనించవచ్చు.


* సకలచరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే .......అని పెద్దలు తెలియజేసారు.దేవతలు అంటే వారికి రాగద్వేషాలు ఉండవని మనకు ఒక అభిప్రాయం.


కానీ దేవతలు త్రిగుణాతీతులు కాదు. అయితే దేవతలు సత్వగుణ సంభవులు.మానవులు రజోగుణ సంభవులు. అంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.


రాక్షసులు, పశుపక్షాదులు తమోగుణ సంభవాలు. అంటే వారిలో ఆ గుణం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.


* పరబ్రహ్మ అయిన పరమాత్మ మాత్రమే త్రిగుణాతీతులు, వారు సగుణ గానూ ఉండగలరు........ నిర్గుణ గానూ ఉండగలరు.* అందుకే , మనల్ని సరైన దారిలో నడిపించమని పరమాత్మను శరణు వేడాలి.

ఒక న్యాయవాది న్యాయశాస్త్రాన్ని చదివేటప్పుడు , అందులో ఎన్నో రకాల నేరాల గురించి నేరస్తుల గురించీ తెలుసుకోవసి ఉంటుంది.* అంతే కాకుండా, తప్పు చేయని వారిని ఎలా రక్షించాలో కూడా నేర్చుకోవలసి ఉంటుంది.అంతే కానీ, నేను మంచివ్యక్తిని .కాబట్టి, నేరాలు వంటి చెడ్డ విషయాలు నేను వినను, చదవను . అంటే కుదరదు కదా !అలాగే మనం కూడా ధర్మం అధర్మం గురించి తెలుసుకునే క్రమంలో ....రాక్షసుల గురించి , అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల గురించి ,....వారు మంచివారిని వేధించిన సంఘటనల గురించి,.......మానవ మనస్తత్వంలోని బలహీనతల గురించి కూడా ........పురాణేతిహాసాలలోని కధలలో తెలుసుకుంటాము.ఒకోసారి మంచి వ్యక్తులు కూడా ఎన్నో కారణాల వల్ల అధర్మంగా ప్రవర్తించటం........ దాని ఫలితంగా బాధలు పడటం వంటి సంఘటనలూ ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు.


ఇవన్నీ చదివితే మనుష్యుల్లో ఇలా విభిన్న స్వభావాలు ఉంటాయా ! అని ఆశ్చర్యం వేస్తుంది కూడా .*ఈ కలికాలంలో పెరిగే అధర్మాన్ని పెద్దలు ఎప్పుడో ఊహించారు.* కాబట్టే , ఇప్పుడు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, తప్పులు,........ వ్యక్తుల మధ్య అసూయ,లోభం, ....... అధికారంకోసం ఆరాటం, కీర్తి, డబ్బు,....... వీటికోసం ఎంతకయినా తెగించటం....... ఇవన్నీ పురాణేతిహాసాల కధల
ద్వారా తెలియజేసారు.ఆ విధంగా లోకంలోని మోసం , అధర్మం నుంచీ జాగ్రత్తపడమని మనలను హెచ్చరించటానికే ........
లోక హితం కోసం ఆ కధలను అలా వివరంగా చెప్పటం జరిగింది.
*
పురాణేతిహాసాల ద్వారా ........ అధర్మానికి తాత్కాలిక విజయం........ధర్మానికి అంతిమ విజయం లభిస్తుందని మనం గ్రహించగలం.


చరిత్ర నుంచీ మనం పాఠాలు నేర్చుకోవలసి ఉంది .భగవంతుని తీర్పు మనుష్యులు ఇచ్చే తీర్పులా సాక్ష్యం మీద ఆధారపడి మాత్రమే ఉండదు.


* ఒక వ్యక్తి పూర్వ జన్మ కర్మలు, ఇప్పడు చేస్తున్న కర్మలు , ఇంకా ఇతరత్రా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని భగవంతుని తీర్పు ఉంటుంది.* పురాణేతిహాసాలలోని పాత్రల
ను , వారి పూర్వ కర్మ........ ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఎన్నో కోణాల నుంచీ ఆలోచించి రచించారు.అందుకే పురాణేతిహాసాలు అపార్ధం చేసుకోవటం తప్పు.


* ( ఇలాంటి విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవటం తప్ప నాకు పెద్దగా పాండిత్యం లేదు.

అయితే మా ఇంట్లో వచనరూప " శ్రీ దేవీ భాగవతము." గ్రంధము ఉందండి. నాకు తెలిసినంతలో ఏదో ఇలా వ్రాస్తుంటాను.

ఇంతకుముందు కూడా కొన్ని టపాలు ( జూలై 5, 2010 )వ్రాశాను. ఇందులో పొరపాట్లు ఉంటే క్షమించవలెనని దైవాన్ని కోరుకుంటున్నానండి...).


Monday, July 18, 2011

స్త్రీకి స్త్రీయే శత్రువా ? కాదా ?..

స్త్రీలు చాలా మంది పురుషాధిక్య ధోరణి వల్లే తమకు కష్టాలు వస్తాయి అనుకుంటారు.


సరే, స్త్రీలు అంటే గౌరవం లేకుండా స్త్రీలను పీడించే పురుషులు చాలా మంది ఉన్నమాట నిజమే.


కానీ, కేవలం మగవారి వల్లే స్త్రీలకు కష్టాలు వస్తున్నాయంటారా ?


స్త్రీల వల్లే తోటి స్రీలకు వచ్చే కష్టాల మాటేమిటి ?


అత్తా, కోడళ్ళ గొడవల్లో పోటీపడేది స్త్రీలే గదా !


ఒక స్త్రీ గర్భం ధరించటం కొంతకాలం ఆలస్యమయితే చాలు, ఇక గొడ్రాలు అంటూ విసిగించి వేధించేది అత్తగారు, ఆడపడుచులు, తోటిస్త్రీలు.... వారూ స్త్రీలే గదా !
పిల్లలు పుట్టి వారు అందరూ ఆడపిల్లలయితే , అందుకు కోడలినే తప్పుపట్టి కొడుకుకు ఇంకో పెళ్ళి చేయటానికి సిద్ధపడే అత్తగార్లు కూడా ఉంటారు.
స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలిస్తే కడుపులో పిండాన్ని, వీలుకాకపోతే పుట్టిన తరువాత ఆ పిల్లను చంపేసే వాళ్ళలో ఆ ఇంటి ఆడవాళ్ళు కూడా పాత్రధారులే. .ఇక కట్నం వేధింపులు, చావులు విషయంలో చెప్పనే అక్కర్లేదు.........

ఆ విషయంలో ఇంటి కోడలిని వేధించే వారిలో అత్తగారూ, ఆడపడుచుల పాత్ర ఎంతో ప్రధానమైనది. . .ఇక కొందరు కోడళ్ళు కూడా తక్కువ వారేమీ కాదు.పెళ్ళి అయిన మరుక్షణం నుంచీ ....... ఇక అత్తగారి మీద భర్తకు చాడీలు చెబుతూ భర్తను వారి తల్లిదండ్రులకు దూరం చేయటానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎందరో ఉన్నారు.
ఇక కోడళ్ళు కూడా తమ తల్లి కోప్పడితే అంతగా బాధపడరు ..... అదే అత్తగారు కోప్పడితే సీరియస్ గా తీసుకుంటారు.


ఇక అత్తగారేమో తన కూతురుకు ఒక న్యాయం ....... కోడలికి ఒక న్యాయంగా ప్రవర్తిస్తారు.అత్తగార్లు తాము ఒకప్పుడు కోడళ్ళమే అనీ......కోడళ్ళు తామూ కాబోయే అత్తలమే అని గుర్తు పెట్టుకున్న రోజున ఇంట్లో అందరికీ సుఖంగా ఉంటుంది.అత్తాకోడళ్ళ మధ్యన ఈ గొడవలకు అభద్రతా భావం, తన చెయ్యే పైన ఉండాలనే పోటీ మనస్తత్వం ఇలా ఎన్నో కారణాలు.కోడలికి అత్తగారు, అత్తగారికి కోడలు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది !ఇవన్నీ కాకుండా కొందరు మగవాళ్ళ వివాహేతర సంబంధ కారణంగా బాధలు పడేది ...... మళ్ళీ స్త్రీయే.


ఇలా స్త్రీ కష్టాలకు ....... తోటి స్త్రీయే కారణమవుతోంది.స్త్రీలలో త్యాగమూర్తులూ ఉన్నారు.........తనకు లభించని అదృష్టం ఇంకొక స్త్రీకి లభిస్తే అసూయతో కాపురాలు కూల్చే పడతులూ ఉన్నారు...సెలెబ్రిటీలు అనే వారి విషయంలో చూస్తున్నాము కదా ! మగవారు భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.


కొన్ని సార్లు భార్య కూడా తాను ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.


ఇలా పిల్లలు పుట్టాక బాధ్యత లేకుండా...... ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.


అలాంటి పిల్లలు వివాహవ్యవస్థ అంటేనే నమ్మకాన్ని కోల్పోతున్నారు.


పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు ........ ఇలాంటి పిల్లల సమస్య గురించి కూడా ....... గొప్ప సినిమా తీస్తే ఎంతో బాగుంటుంది మరి.ఇక, పిల్లలను పెంచేది
చాలా వరకూ తల్లులే గదా !


వారు పిల్లలను పెంచేటప్పుడు అమ్మాయి అయినా........ అబ్బాయి అయినా సమానమే అని పెంచాలి.అంతే కానీ ఆడవారిని చెప్పుచేతలలో అణచి ఉంచాలని అబ్బాయికి చెప్పకూడదు.....మగవారిని ద్వేషించేటట్లు అమ్మాయిని పెంచకూడదు.ఇలా ....... స్త్రీలు తోటి స్త్రీలను కష్టపెట్టకపోతే అదే చాలు. స్త్రీల బాధలు చాలా వరకూ తగ్గుతాయి..

Friday, July 15, 2011

ఆది అయినా .....అంతమయినా.......,అంతులేని వేదాంతమయినా.....అంతా నీవన్నావు.....


ఓం.

ఈ రోజు గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఇంకా, ...... ఆదిపరాశక్తిపరమాత్మను........... గురువుగా కూడా భావించవచ్చు .


శ్రీ దత్తాత్రేయుని ఒక అవతారమే శ్రీ శిరిడి శాయి బాబా అంటారు.


నాకు ఏమనిపిస్తుందంటే............


మతాలు వేరైనా భక్తులు పూజించే దైవం యొక్క పేర్లలో చాలా పోలిక కనిపిస్తుంది అని.......... ఇంకా, .పేర్లలో చిత్రమయిన పోలికలు, విశేషాలు చూడండి.


మనకు ఎన్నో మతాలున్నాయి. ఒకే మతంలో కూడా భేదాలు ఉన్నాయి.


ఉదా.. హిందూ మతంలో శైవులు, వైష్ణవులు ఉంటారు. వారు పూజించే భగవంతుని పేరులో పోలిక చూడండి.


" శివుణ్ణి ............ ఈశా " అని కూడా అంటారు.


" విష్ణువును ......... వటపత్ర శాయి " అని కూడా పిలుచుకుంటారు.శాయీ అన్న పేరును త్రిప్పి పలికితే ఈశా అని వస్తుంది.


ఈశా........శివుడు .......
త్రిప్పి పలికితే .......
శాయీ.......విష్ణువు...........


విష్ణుమూర్తి పేరు ....... శివుని పేరులో ఎంత పోలిక ఉందో. కదా !


తిరగవేసి అంటే . .ఉదా...మనం " శాయీ శాయీ " అని గబగబా పలికితే " ,ఈశా ఈశా " అనిపిస్తుంది.

అలాగే ......" ఈశా ఈశా " అని గబగబా పలికితే " శాయీ శాయీ " అని కూడా వస్తుంది....( వాల్మీకి మహర్షిగా మారకముందు " .రామ నామాన్ని మరామరా " అని పలికినట్లు. ఇంతకు ముందు ఒక టపాలో వ్రాశానండి. )ఇంకా , పేర్లలో చిత్రమయిన విశేషాలు చూడండి.

రామ.....అంటే విష్ణుమూర్తి

రమా....అంటే లక్ష్మీదేవి.
.

ఇంకా , కొన్ని ప్రధాన మతముల వారు దైవాన్ని పిలిచే పేర్లలో కూడా చాలా పోలిక కనిపిస్తుంది.


" కబీరు దైవాన్ని సాయీ " అని పిలిచేవారట.


అందుకే మహల్సాపతి షిరిడి సాయిని ......... సాయీ అని పిలిచారట.


ఆ పిలుపును మనము " శాయీ,,,...లేక సాయీ" అని కూడా వ్రాసుకోవచ్చు.


శాయి అన్న నామంలో విష్ణువు, శివుడు ఉన్నారు ఇక అమ్మవారిని కూడా చూడొచ్చు." శాయి " లో " ఐ " అన్న ధ్వని
, ఇంకా " యి " కారము అమ్మవారికి ప్రతీక. అలా ధ్వనిస్తోంది కదూ !


ఇంకా " ఈశా" అంటే శివుడు " అంట " ఈశి " ........ అంటే అమ్మవారు అని " విన్నట్లు గుర్తు. ఈవిధంగా " శాయి " నామంలో అమ్మవారిని అయ్యవారిని ........ భావించవచ్చు.

ఇక " సాయే " అన్న పదాన్ని తిరగవేస్తే " యేసా " ( " ఏసు " ) అని వస్తుంది.


" యేసా " అన్న పిలుపును తిరగేసి పిలిచితే,......... "సాయే " అని వస్తుంది.


అంటే " యేసే ......... సాయి " . "సాయే ........
యేసు " . ఏ పేరుతో పిలిచినా దైవం ఒకరే అనిపిస్తోంది కదూ !


పరమేశా ! అన్నపిలుపులో యేసా ! అన్న పిలుపు కూడా వినవచ్చు.


ఇంకా , " రహీం " అన్న పదాన్ని గబగబా పలికితే.... " హ్రీం " అన్నట్లు అనిపిస్తుంది.రాముడు అయినా , రహీము అయినా ,.......... క్రీస్తు అయినా,కృష్ణుడు అయినా,...........
యేసు అయినా ఈశుడు అయినా ,..........
సాయి అయినా , యేసు అయినా ......

దైవం ఒక్కరే.....
అన్ని మతాల వారు పూజించుకునే సూర్యుడు, చంద్రుడు అందరికీ ఒకరే . అలాగే ఎన్ని పేర్లతో పిలుచుకున్నా అందరికీ దైవం ఒకరే.శ్రీశ్రీ మహావతార్ బాబాజీ,శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ కబీరు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, వంటి ఎందరో పెద్దలు ............ పరమత సహనాన్ని బోధించారు.ఈ కలికాలంలో ఎందరో హిందువులకు దొరకని శ్రీరామలక్ష్మణుల అద్భుత దర్శనం తానీషా
కు లభించింది.


ఇంకా ఈ కాలంలో అమరనాధ్ గుహను ముస్లిం మతము వారే కనిపెట్టడం జరిగింది.అలాగే కొందరు హిందువులు, ఇతర మతస్థులు కూడా , తమకు ఏసుక్రీస్తు కలలో కనిపించినట్లు, దర్గాలను కలలో చూసినట్లు , దుర్గా దేవి కలలో కనిపించినట్లు ,చెబుతుంటారు.


అందుకని దైవం ఒక్కరే.


ఒకే మతంలో కూడా గొడవలు పడుతుంటారు.

అలా కాకుండా ఎవరి మతాన్ని , ఆచారాలనూ వారు గౌరవించుకుంటూ ............ ఇతరుల మతాలనూ వారి ఆచారాలను గౌరవిస్తే, సమాజంలో గొడవలు ఉండవు." ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో .........బాబాజీ, క్రీస్తు , వీరిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసని చెప్పబడింది.


వీరిద్దరూ ప్రపంచంలో యుద్ధాలు, జాతి విద్వేషాలు, మతపరమయిన పక్షపాతాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారట.


ఇంకా, "శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో ఎన్నో గొప్ప విషయాలున్నాయి.


అందరూ ప్రశాంతముగా జీవించాలని కోరుకుంటూ.......


వ్రాసిన దానిలో తప్పులు ఉంటే క్షమించమని దైవాన్ని కోరుకుంటూ.......


ఇంకా,
మనకు దైవ భక్తి, శ్రద్ధ తగ్గినప్పుడు, అహంకారం ,కోపం వంటి దుర్లక్షణాలు పెరిగినప్పుడు మన ఆలోచనల్లో పొరపాట్లు వస్తాయి.


అలా కాకుండా మనం సత్ప్రవర్తనను పెంచుకుంటే దైవమే మనకు పొరపాట్లు లేని ఆలోచనలు కలిగిస్తారు.

అలా ప్రవర్తించటానికి ప్రయత్నిద్దాం..

Wednesday, July 13, 2011

ఎన్నో కుటుంబాల , వ్యక్తుల సమాహారమే కదా సమాజం అంటే ....... .. . ........ ...మన సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి.

ఇప్పుడు అన్ని వృత్తులలోనూ పని వత్తిడి బాగా పెరిగిపోయింది.

వైద్యులను ప్రాణదాతలుగా దేవునితో సమానంగా గౌరవిస్తాము.

వైద్యుల వలెనే విమానం నడిపే పైలట్లు , బస్సు రైళ్ళ డ్రైవర్లు , పడవ నడిపేవారు
కూడా గొప్పవారే.* సమాజంలో ధర్మబద్ధంగా చేసే ఏ వృత్తి అయినా గొప్పదే.


పనిలో వత్తిడి వల్ల వైద్యులు ఏదైనా పొరపాటు చేస్తే రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది.( వైద్యులు కూడా రోగుల నుంచి రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి .)


వాహనాలు నడిపే డ్రైవర్లు ఏదైనా పొరపాటు చేస్తే అందులో ప్రయాణించే ప్రయాణీకులతో పాటూ వాహనాన్ని నడిపేవారి ప్రాణాలకు కూడా ప్రమాదమే.ఒక బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగా గుండెనొప్పి వచ్చిందట. అలాగే బస్సును రోడ్ ప్రక్క ఆపిన తరువాత ఆయన ప్రాణం విడిచారట. ప్రాణం మీదకు వచ్చిన సమయంలో కూడా ప్రయాణీకుల క్షేమం గురించి ఆలోచించిన ఆ డ్రైవర్ గురించి ఈ మధ్య వార్తాపత్రికలో వేశారండి.
ఇంకా గనులు, పెద్దపెద్ద యంత్రాల వద్ద పనిచేసేవారు అజాగ్రత్తగా ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం.


రక్షణ రంగంలో పనిచేసేవారి జీవితాలు ........... సైనికులు, పోలీసులు, అటవీ సంరక్షణ అధికారులు, ఇలా రక్షణకు సంబంధించిన ఏ రంగమైనా , వారి జీవితాలు ప్రమాదభరితమైనవే.


ఇళ్ళ వద్ద వాచ్ మాన్ లుగా పనిచేసే వారివి కూడా ప్రమాదభరితమైన జీవితాలే.


ఇక బక్క రైతులు ........ వీరి గురించి చెప్పటానికేముంది. అందరికీ పంచభక్ష్యపరమాణ్ణాలు అందించి అప్పుల వల్ల తాము పస్తులుండే జీవులు. వారు పండించిన పంటలు ఎంత రేటుకు అమ్ముకోవాలో నిర్ణయించుకునే హక్కు వారికి లేదు కదా మరి.ఇక ఎన్నో రంగాల్లో కార్మికులు, రోజంతా ఎండలో ,వానలో ఎంత రెక్కలుముక్కలు చేసుకుని పనిచేసినా వారికి దక్కేది కొద్ది సంపాదనే.


ఇలా చెప్పినట్లు రకరకాల వృత్తులవారు సమాజంలో ఉన్నారు.అర్చకత్వం వృత్తి అనటం సబబు కాదు. పండితులు, అర్చకులు ... వీరు , ,ప్రాచీన విజ్ఞానాన్ని తరతరాల నుంచీ ఎంతో బాధ్యతగా కాపాడి , ఈ నాటి వారికి అందించారు. ప్రాచీన సంస్కృతి, ఇంకా, దేవాలయాల ఆలన, పాలన , రక్షణ కోసం వీరు ఎన్నో త్యాగాలు చేశారు. ...
* అందరిదీ ఒకటే కష్టం. కానీ మనం కొన్ని వృత్తుల వారినే బాగా గౌరవిస్తాము. కొందరిని తక్కువ గౌరవిస్తాము .


ఈ తేడా ఎందుకో నాకు అర్ధం కాదు.


అది అలా ఉంచితే పని వత్తిడి తగ్గాలంటే, హాస్పిటల్స్ లో ఎక్కువమంది వైద్యులను నియమించుకోవాలి.


విమానాల్లో అయితే ఒకరి కంటే ఎక్కువ పైలట్లు ఉంటారు.


బస్సులలో కూడా రాత్రి సమయాల్లో దూరప్రయాణం వెళ్ళేటప్పుడు ఇద్దరు డ్రైవర్లను నియమిస్తారు.


కానీ కొన్ని రూట్లలో ఒక డ్రైవరే 10 గంటలు కన్నా ఎక్కువ సమయం బస్సును నడపటం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదం.నేను కొన్నిసార్లు బస్సు దిగివెళ్ళేముందు డ్రైవర్ కు కృతజ్ఞతలు చెప్పాను ,( వైద్యుల లానే వీరు కూడా ప్రాణదాతలే కదా మరి.)
అయితే
, కొన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాక ఇక చెప్పటం మానేశాను. ఓవర్ యాక్షన్ లాగ ఉంటుందేమో, ఎందుకొచ్చిన గోల అనిపించింది.


ఇప్పుడు అన్ని వృత్తులలోనూ పని వత్తిడి బాగా పెరిగిపోయింది.కానీ, తల్లిదండ్రులు తమ కుటుంబావసరాలకు తగినంత సమయం కేటాయించటం కూడా ముఖ్యమే.


*
కానీ, కొన్ని వృత్తుల వారికి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించటం కుదరదు.


ఉదా...... సైనికులకు కుటుంబంతో ఎప్పుడూ ఉండటం కుదరదు కదా !

ఇలాంటి వారి కుటుంబసభ్యులది కూడా త్యాగమయమయిన జీవితమే అనిపిస్తుంది.


* ఇంటి యజమాని ఉద్యోగ నిర్వహణలో సమాజానికి చేసే సేవ వల్ల ..... వారి కుటుంబానికి ఎంతో పుణ్యం వస్తుంది అన్నది నిజమే అయినా ........


* సమాజానికి సేవ చేయటానికైనా చక్కటి ఆరోగ్యం ఉండాలి కదా !అందుకే వీలయినంతవరకూ పని వత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.


* ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం ద్వారా పనిని ఎక్కువమంది పంచుకుంటే కొంతయినా పని వత్తిడి తగ్గుతుంది.


నిరుద్యోగమూ తగ్గుతుంది.


ఇంకా కుటుంబ అవసరాలను చూసుకోవటానికి వీలు కుదురుతుంది.


* తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ,పర్యవేక్షణ లోపించిన పిల్లలు సంఘ విద్రోహులుగా మారే అవకాశముందని మానసికశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో కుటుంబాల , వ్యక్తుల సమాహారమే కదా సమాజం అంటే ....... .. . ........ .....


Monday, July 11, 2011

దేవుని సొమ్మును బయటకు తీయాలనే అర్హత మనకుందంటారా ?

ఇంతకు ముందు టపాలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద గురించి వ్రాశాను.


స్వామి సంపద గురించి మాట్లాడేంత శక్తి నాకు లేకపోయినా ఏదో నాకు తోచినట్లు ఇంకొంచెం వ్రాయాలనిపించింది.


ఇంకా , మరి కొన్ని విషయాలు కూడా ........


దేని గురించి అయినా ఆశపడితే దాన్ని పొందే అర్హత మనకుందా ? అని ఆలోచించుకోవాలి.

లేకపోతే ఆ అర్హతను సంపాదించుకోవాలి.శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఇంకా తెరవని గదిలో ఇంకెంతసంపద ఉందో అని జనాల ఆశ.


ఆ సంపదను కూడా బయటకు తీయాలంటున్నారు. మనకు అలా అడిగే అర్హత ఉందంటారా ?మనకు పెద్దల నుంచీ అందిన ఎన్నో అపురూప వస్తువులను మనం కాపాడుకోలేకపోయాము.


అందులో చాలా వరకూ విదేశీ దాడులవల్ల విదేశాలకు తరలి వెళ్ళిపోయాయి. ఇప్పటికీ వెళ్ళిపోతూనే ఉన్నాయి.


స్వదేశీయులు కూడా తక్కువవాళ్ళేమీ కాదు.

దేవుని పేరిట ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా కాపాడుకోవటం మనకు కుదరటం లేదు.సమాజంలో అవినీతి, ఇంకా విదేశాలకు తరలిస్తున్న నల్లడబ్బును ఆపటం మన చేతకావటం లేదు.,


ఇవన్నీ ఇలా ఉంటే మరి, దేవుని సొమ్మును బయటకు తీయాలనే అర్హత మనకుందంటారా ?


ఇంతకాలం ఈ సంపద యొక్క రహస్యాన్ని గుట్టుగా కాపాడిన రాజవంశీకులకు ఈ దేవాలయాన్ని గురించి ,అక్కడి సంపద గురించి మాట్లాడి, నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి.


వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది.ఈ సంపద నేలమాళిగలో ఉన్నంతమాత్రాన అవి పాడయ్యే వస్తువులు కాదు.

వజ్రాలు, మణులు భూమిలో ఎంతకాలం ఉన్నా ఏమీకావు. బంగారం కూడా అంతే.


మహా అయితే వేల సంవత్సరాలు దాటితే ముద్దగా అవుతుందేమో ( నాకు సరిగ్గా తెలియదు. ) అంతేకానీ దానికి వచ్చే నష్టమేమీ లేదు.


అలాంటప్పుడు వాటిని బయటకు తీసి అపాత్రుల చేతిలో పొయ్యటం కన్నా.........వాటిని అలా ఉంచెయ్యటమే మంచిది.


ఒక వార్తా పత్రికలో చదివానండి.

ఇలాంటి నిధుల ప్రచారం పుణ్యమా అని...........


ఒక ఊరిలో
దేవాలయంలో నిధులున్నాయని ప్రచారం జరుగుతోందట.


ఆ గుడికి కూడా కాపలా పెట్టవలసి వచ్చిందట. ఈ అతి ప్రచారం ఎక్కడికి దారి తీస్తుందో !


ఏది ఎంతవరకో అంతవరకే ఉండాలి. అతి అనర్ధదాయకం.


మన పెద్దవాళ్ళు మనకు కొద్దిగా బంగారాన్ని ఇస్తేనే భద్రంగా దాచి వారసత్వ సంపదగా పిల్లలకు అందిస్తాము. .


అలాంటిది ఇంత గొప్ప అపురూప వారసత్వసంపదను ఎంత అపురూపంగా దాచుకోవాలి !


మన ఖర్మ కొద్ది కొందరు ఈ సంపదను ఎలా ఖర్చుపెట్టాలీ ? అని ఆలోచిస్తున్నారు.


విదేశాల వాళ్ళు వారి పురాతన కట్టడాలను కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకొంటారు.ప్రజా సంక్షేమం కొరకు డబ్బు కావాలంటే మన దేశంలో బంగారపు నిల్వలు బాగానే ఉన్నాయట. (
ఒక వార్తా పత్రికలో చదివానండి. ) వాటిని వాడుకోవచ్చు.అంతేకానీ, పెద్దల ద్వారా వచ్చిన వారసత్వ సంపదను అమ్ముకుని తినేస్తే బాగోదు కదా !ఒక జమీందారు దగ్గర బోలెడు ఆస్తి ఉన్నా వారు ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారనుకోండి ఎవరూ తప్పు పట్టరు.

ఆయన ఎంత నిరాడంబరుడో అని .............. అందరూ మెచ్చుకుంటారు.
వారు ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టేస్తే ఎవరూ మెచ్చుకోరు.


ఆ సంపదను బయటకు తీయకుండా అలాగే ఉంచితే రక్షణ ఎలా ? అనుకోనవసరం లేదు.


పెద్దలు బాగా కట్టుదిట్టంగానే రక్షణ కల్పించారంటున్నారు.
మనకు చేతనయినంత వరకూ రక్షణ ఏర్పాటు చేసి ,


ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందని.............. ఇక భగవంతుని మీదనే భారం వేయటం ఉత్తమం.సామాన్య వ్యక్తిని నాకు తోచింది వ్రాయాలనిపించి వ్రాశానండి. తప్పులుంటే దైవం క్షమించవలెనని కోరుకుంటున్నాను.......


రాజకుటుంబీకులు, పండితులు, పామరులు ఏం నిర్ణయిస్తారో ?

ఇంతకీ భగవంతుడు ఏం చేయదలుచుకున్నారో ?


ఇవే కాదు,


ఈ తరం వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న సహజవనరులను కూడా వేగంగా ఖాళీ చేస్తున్నారు .ఈ సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట.


అలాంటిది గత 200 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరుతో, వనరులు అన్నీ ఖాళీ అయ్యే పరిస్థితిని తెచ్చాము.


ఇలా ఎంతకీ పెద్దలు మనకు ఇచ్చిన వాటిని వాడుకోవాలన్న తాపత్రయమే కానీ ..........


మనం మన ముందు తరాల వాళ్ళకు ఏం ఇస్తున్నాము ? అంటే జవాబు ఉండదు.మన పెద్దలు పచ్చటి ప్రపంచాన్నీ మనకు ఇచ్చి వెళ్ళారు. మరి మనము ?


ముందు ఆలోచన లేకుండా ఎంతకీ మన స్వార్ధం, మన అవసరాలు ఇదే గోల.ఈ నాటి వారికి....... ఇంకా ,ఇంకా కావాలీ అన్నదే ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తోంది.


ఈ నాటి తరాలు చరిత్రలో అత్యంత స్వార్ధపూరిత తరాలుగా మిగిలిపోతాయేమో ?

అలా కాకుండా ఉండాలని ఆశిస్తూ..........

Friday, July 8, 2011

శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి సంపద.


* శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద గురించి గురించి వింటున్నాము కదా !

* ఆ సంపద గురించి ఇంతకాలంగా బయటి ప్రపంచానికి తెలియకుండా రక్షించిన వారిని ఎంతో అభినందించాలి.నాకు ఏమనిపించిందంటే ఇదంతా బయటకు రాకుండా అలాగే ఉంటే బాగుండేదేమో అని. ఎందుకంటే ఈ సంపదను ఎలా కాపాడుతారు ?


దేశంలో అందినది అందినట్లు దోచేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సంపదను సం రక్షించటం ఎలా ?


కొంతలో కొంత నయం ..... ఇంకా తెరవని ఒక గదినీ ప్రస్తుతానికి తెరవకూడదని భావించటం మంచి పని.
ఆ గదిని తెరిస్తే ప్రమాదం అని పెద్దలు చెబుతున్నప్పుడు , వారి ప్రకారం చెయ్యటమే మంచిది.


* ఇప్పటికే బయటకు తీసిన సంపదను ......... ఆ దేవాలయ ప్రాంగణంలోనే గట్టి భవనం నిర్మించి ఈ సొమ్మును అందులో ఉంచి గట్టి భద్రత ఏర్పాటు చేసి సం రక్షించాలి.ఇక నుంచీ ఆ దేవాలయం వద్ద పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు ఎలాగూ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఈ సంపదను మరల ఆ స్వామి వారి చెంతనే భద్రపరిస్తే బాగుంటుంది....


దేవునిపై భారం వేసి , మానవ ప్రయత్నం చెయ్యాలి గదా !


ఇలాంటి అపురూప ప్రాచీన సంపదను భావి తరాలకు గొప్పగా చూపించటానికైనా వాటిని జాగ్రత్తగా అట్టిపెట్టాలి.


ఇలాంటి అపురూపమైన వస్తువులను సంపాదించటం ఇప్పటి వారికి ఎంతో కష్టమయిన పని.

పెద్దలు ఇచ్చిన సంపదను మొత్తంగా ఖాళీ చేయకుండా ముందు తరాలవారికి అందించవలసిన బాధ్యత అందరిదీ.
ఒకాయన ఏమన్నారంటే, వారి ఊరిలో ఉన్న దేవాలయంలో కూడా నిధులుండే అవకాశం ఉందని చెబుతూ, ప్రజలు తట్టుకోలేని కష్టాలలో ఉన్నప్పుడు , ఆ నిధిలో కొంత భాగాన్ని వినియోగించుకోవచ్చని పెద్దలు చెప్పారంటూ అలా చెప్పటం జరిగింది.

నాకు ఏమనిపిస్తుందంటే , ఒకోసారి తీవ్రమయిన కరువు, కాటకాలు వచ్చినప్పుడు కొంత సొమ్మును వాడుకోవచ్చు అని పెద్దల అభిప్రాయమయి ఉంటుంది.


కానీ మనకు దేవుని దయవల్ల అలాంటి పరిస్థితి లేదు.


మనకు చిత్తశుద్ధి లేకపోవటం వల్ల మాత్రమే మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది .సోమాలియా వంటి దేశాల వారితో పోలిస్తే మనం ఎంతో అదృష్టవంతులం...అయితే ఇప్పుడు కూడా బంగారునాణేల వంటివాటిలో కొంత భాగాన్ని సంక్షేమానికి ఉపయోగించవచ్చేమో !* కానీ విగ్రహాలు, వజ్రాలు, ఆభరణాలు వంటి అపురూపమైన వాటిని అలా భద్రపరిస్తేనే బాగుంటుంది .కొంత మంది ఉత్సాహం పట్టలేక ఇంకా ఫలానాఫలానా దేవాలయాల దగ్గర బోలెడు సంపద ఉంటుంది అంటూ ప్రకటిస్తున్నారు.


ఇదంతా అమాయకత్వం అనుకోవాలో ఏంటో అర్ధం కావటం లేదు.


ఇప్పుడు బయటకు తీసిన సంపదనే ఎలా జాగ్రత్త చేయాలో తెలియటం లేదు గదా ! మరి వాళ్ళు ఎందుకు అలా ప్రచారం చేసుకుంటున్నారో ?


ఇక దేవుడిపై భారం వెయ్యటం తప్ప........ఎవరూ ఏం చెయ్యలేరు.


ఇప్పుడు బయటపడిన సంపదను సంక్షేమ పధకాలకు వినియోగించాలి అని కొందరు అంటున్నారు. మంచిదే, కానీ ,


ఇప్పటికే ఎన్నో లక్షల కోట్లు ....... సంక్షేమ పధకాల పేరుతో ఖర్చు అయ్యాయి. ఆ సొమ్ము ఎక్కడికి పోయిందో తెలియదు.


పేదరికం మాత్రం ఎక్కడిది అక్కడే ఉంది. ఏం జరుగుతోందో అందరికీ తెలుసు.


ఎక్కడ సొమ్ము దొరికినా ఇక దాన్ని సంక్షేమ పధకాలకు వినియోగించాలి అని బయలుదేరుతారు.


మన బ్రతుకులకు ఎక్కడి సొమ్మూ చాలదు. అవినీతి రూపంలో పొయేది బయటకు పోతూ ఉంటే ఎంత డబ్బు అయినా చాలదు.
ఇప్పుడు అన్నాహజారే గారు, ఇంకా ఇలాంటివారు ఉద్యమాలు చేస్తున్నారు గదా ! వారికి ప్రజలు ఇంకా ఎంతో సపోర్ట్ చేయాలి.


అంతేగానీ అన్నా హజారేకు పట్టువిడుపూ ఉండాలి, వారు రూల్స్, రెగ్యులేషన్స్ ఇంకా ఫాలో అవ్వాలి........ అని నిరుత్సాహంగా మాట్లాడితే ఎలా ?


రూల్స్, రెగ్యులేషన్స్ ప్రజల బాగు కోసం ఏర్పరిచారు.


పెద్దలు చెప్పినట్లు ............ రూల్స్ ఉండేది ప్రజల కోసం .......అంతేకాని ప్రజలు ఉండేది రూల్స్ కోసం కాదు.


* ఈ దేశం నుంచి విదేశాలకు తరలించబడిన సంపద 30 లక్షల కోట్లకన్నా పైనే ఉంటుందని చెబుతున్నారు.


అదంతా తిరిగి తెస్తే ప్రజల పేదరికం చాలా వరకూ తగ్గుతుంది కదా ! ఆ ప్రయత్నాలు చేస్తున్నవారిని నిరాశపరచకుండా ఉంటే అదే చాలు.


దొరికిన సొమ్మును దొరికినట్లు వాడేసుకుంటే ఆ సంపద అయిపోయిన తరువాత మళ్ళీ కధ మొదటికి వస్తుంది.


కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయంటారు.


అందుకని పేదరికం పోవాలంటే, ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం ముందు అవినీతిని గట్టిగా నిరోధించాలి.


ఇంకా, ప్రజలలో కూడా బాగా మార్పు రావాలి.


ఇకముందు ఇక్కడినుంచీ సొమ్ము విదేశాలకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇంకా మనకు దేవుని దయ వల్ల బోలెడు సహజవనరులు ఉన్నాయి.

అంటే నదులు, సముద్రాలు, పచ్చటి పంటలు పండే భూములు ఇలా ఎన్నో ఉన్నాయి.

వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పేదరికం ఎందుకుంటుంది ?


మనకు చిత్తశుద్ది లేకపోవటం, సరైన ప్రణాళిక పాటించకపోవటం వల్లే పేదరికం పెరిగిపోతోంది.


ఉదా... రైతులు పంటలు బాగా పండించారు. వాటిని దాచుకోవటానికి గోదాములు ఖాళీగా లేవు.


ఉన్న గోదాముల్లోని ఉత్పత్తులేమో పాడయిపోతున్నాయి. బయట చూస్తే ఆకలి కేకలు, పేదరికం, ఆహార కొరత.


పంటలు పండించిన రైతులకేమో గిట్టుబాటు ధర రాదు............. ప్రజలకేమో ఆహారం అందదు.


మన పద్దతులు ఇలా ఉంటే ఎన్ని లక్షల కోట్లు సంపద దొరికినా ఉపయోగమేమీ ఉండదు.


* అదలా ఉంచితే ఇప్పుడు బయటపడిన సంపద ద్వారా భగవంతుడు ఎన్ని కధలు నడిపిస్తారో ? ఎన్ని చిత్రవిచిత్రాలు జరిపిస్తారో !

Wednesday, July 6, 2011

పాపం .... పెద్దవాళ్ళు.


ఈ రోజుల్లో పెద్దవాళ్ళు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎందుకంటే, ఒక వేళ అనారోగ్యం వచ్చిందనుకోండి వారిని చూసేవాళ్ళు ఎవరు ? ఇంట్లో అందరూ బిజీ కదా !.


మా బంధువుల్లో ఒక బామ్మగారు ఉండేవారు. ఆమెకు 6 గురు సంతానం ఉన్నారు.


ఈమె భర్త మరణానంతరం 85 ఏళ్ళ వయసులో పల్లెటూరులో ఒక్కరే ఉండేవారు. అక్కడ అందరూ తెలిసిన వారు కాబట్టి ఇరుగుపొరుగు కొంచెం సహాయంగా ఉండేవారు.ఒకరోజు ఆమె బాత్రూంలో కాలుజారి పడటం వల్ల ఇక మంచానికే పరిమితం అయ్యారు. ఆమెకు సేవ చెయ్యటానికి పనివాళ్ళు దొరకలేదు.


అలా మంచం మీద ఉన్నవారికి స్నానం చేయించటం, ,శుభ్రం చెయ్యటానికి ఎక్కువ డబ్బు ఇచ్చినా .....వాళ్ళు రెండు రోజులు పనికి వచ్చేవారు. తరువాత పని మానేసేవారు.


ఇక ఆమె పిల్లలు ఆమెను ఒక పేరున్న వృద్దాశ్రమంలో వేయాలని అనుకున్నారు. నెలకు 5 వేలు ఇంకా, కొన్ని వేలు డిపాజిట్ వేసి చేర్పించాలనుకున్నారు.కానీ ఆ ఆశ్రమం వారు ఏమన్నారంటే , కొద్దిగా అయినా లేచి తమ పనులుతాము చేసుకునే వృద్దులనే వారు చేర్చుకుంటారట. ఇలా మంచంపై ఉండేవారిని వారు చేర్చుకోరట.ఎందుకంటే అలాంటి వారిని చూసుకోవటానికి వారికి మనుష్యులు దొరకరని చెప్పి ఈమెను జాయిన్ చేసుకోవటానికి నిరాకరించారు.


ఆమెకు ఒక 6 రోజులు కొద్దిగా సేవ చేయటానికి మాత్రమే నాకు వీలు కుదిరింది.
అలాంటి వారికి చెయ్యటం కష్టమే.


ఆమె పరిస్థితి చూసి నాకు జీవితమంటే ఇంతేనా అని అనిపించింది.


పెద్ద వయసు వచ్చాక ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ? అని భయం కూడా కలిగింది.
యవ్వనంలో ఆరోగ్యంతో ఉండగా మనకు ఏదో సాధించెయ్యాలని తపన తప్పితే ఇలాంటి కష్టాలు తెలియవు.వృద్దాప్యం అంటే రెండో బాల్యం అంటారు.
ఆ వయసు వచ్చి అనారోగ్యం ఉండేవాళ్ళకు అందరూ తమ దగ్గర కూర్చుని కొద్దిసేపయినా ఆప్యాయంగా మాట్లాడాలని ఉంటుంది.
కానీ..........

మనకేమో వీర బిజీ కదా ! మనకు భోజనం చెయ్యటానికే సమయముండదు.వారికి ఏమీ తోచదు. కానీ ప్రతి చిన్న విషయం వారు పట్టించుకుంటారు. అన్నీ వివరాలు అడుగుతుంటారు.
కానీ ...........

మనకేమో అంత ఓపిక ఉండదు.ఆ వయసులో వారితో మాట్లాడాలంటే ఇంట్లో వారికి విసుగ్గా అనిపిస్తుంది
కానీ ............

మనం చిన్నతనంలో ఎంత విసిగించినా ఓపికగా సమాధానాలు చెప్పి మనలను పెంచిన తల్లిదండ్రులే అయినా మనకు వారితో మాట్లాడటానికి విసుగొస్తుంది.

పెద్దవయసు వాళ్ళకు ఏమీ తోచక ఇరుగుపొరుగుతో మాట్లాడాలని ఉంటుంది .......కానీ ,.శరీరం సహకరించదు.


ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడాలని ఉంటుంది........ కానీ అందరూ ఎవరి బిజీలో వారు ఉంటారు.అప్పటివరకూ జీవితంలో బిజీగా ఉండి ఒక్కసారే ఖాళీగా ఉండాలంటే తట్టుకోవటం వాళ్లకు కష్టంగా ఉంటుంది.ఇక వాళ్ళు తమ జీవితంలో జరిగిపోయిన ముచ్చట్లు తలచుకుంటూ గడపటం తప్ప ఏం చేయలేని పరిస్థితి.


ఇలా మంచానికే పరిమితమయిన వారి పరిస్థితి ఎంతో బాధాకరం. నాకు ఏమనిపించిందంటే ....... నరకం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది.
ఇంకా, బామ్మగారు నాతో ఏమన్నదంటే , నేను ఇంకా ఎందుకు బ్రతకాలి ? అని ఏడ్చింది ......కానీ దానికి ఏమని సమాధానం చెబుతాము. తరువాత కొన్ని నెలలు మాత్రమే జీవించింది ఆమె.


ఇవన్నీ చూశాక నాకు ఏమిటో ! మనిషి జీవితం అనిపించింది.నడివయసు వాళ్ళకయినా చిన్న జబ్బు చేసి మంచం మీద ఉంటే ఈ రోజుల్లో వాళ్ళను చూసుకోవటానికే ఎవరికీ తీరికలేని పరిస్థితి ఉంది.


* మొత్తానికి అటు చిన్నపిల్లలుగాఉన్నప్పుడు కేర్ సెంటర్ల సం రక్షణలో , ఇటు వృద్ధాప్యం వస్తే వృద్ధాశ్రమం వాళ్ళ సం రక్షణలో ఉండవలసిన వింత పరిస్థితి వచ్చేసింది.


యవ్వనంలో మాత్రమే అదీ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనల్ని అందరూ గౌరవిస్తారు.

ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఎవరి గొప్పతనమయినా అనిపించింది.


యవ్వనంలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు గదా ! అది గుర్తుంచుకుంటే పెద్దవాళ్ళను చూడటానికి విసుగు తగ్గి కొంచెం ఓపిక వస్తుంది..


Monday, July 4, 2011

పాపం పసివాళ్ళు....

ఒకప్పుడు నాకు ఉద్యోగం చెయ్యాలని ఇంకా సమాజాన్ని ఉద్దరించాలనీ అలా ఏవేవో కోరికలుండేవి.


* ముందు నన్ను నేను ఉద్దరించుకుంటే అదే గొప్ప అని ఇంకా, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించటం కూడా సమాజ ఉద్దరణలో భాగమే అని, నాకు ఆలస్యంగా తెలిసింది.( మా టీచర్ ఒకామె ( నాస్తికవాది ) మాకు దేవుడు లేడు అంటూ చెప్తుండేవారు. అవన్నీ నమ్మి నేను దైవ ప్రసాదాన్ని నిరాకరించటం లాంటి తప్పులు కూడా చేశాను.
కానీ, భగవంతుడు దయామయుడు కాబట్టి నన్ను క్షమించారు. )


కొన్ని సంవత్సరాల క్రితం........ఒక రోజు మా అబ్బాయి చిన్నప్పుడు ( నెలల వయసు ఉన్నప్పుడు ) హఠాత్తుగా విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు.ఎంత ఊరుకోబెట్టినా ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. కడుపు నొప్పి అనుకుని మందు కూడా వేశాను.. బొమ్మలు ఇచ్చినా, బయట తిప్పినా, ఏడుపు ఆపలేదు.
నాకు చాలా భయం వేసింది.......... ఏం జరిగిందో తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని భయం, అయ్యో పిల్లాడు ఇంత బాధ పడుతున్నాడే అన్న బాధ ..


నేను ఎంత ప్రయత్నించినా బాబు ఏడుపు ఆపలేదు.


*ఆ గందరగోళంలో వత్తిడితో కూడిన విసుగుతో నేను బాబును ఒక చిన్న దెబ్బ కూడా వేసినట్లు గుర్తు. అయినా ఏడుపు ఆపలేదు.


ఇక భయం వేసి నా భర్తకు ఫోన్ చేసి హాస్పిటల్ కు తీసుకు వెళ్దాము....... అని చెబుదామనుకుంటుంటే , ఏడ్చిఏడ్చి అలసిపోయి పిల్లాడు నిద్రపోవటం జరిగింది.


* బాబును మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంటే చూశాను. తన చేతి వెనుక ఎర్రటి చీమ కుడుతోంది.


దానిని తీసిపారేశాను. కానీ , ఆ సంఘటన తరువాత నేను ఉద్యోగం చెయ్యలేదని బాధపడటం తగ్గిపోయింది.


ఇదంతా ఆలోచిస్తే నాకు ఎంతో బాధ కలిగింది.


తల్లినయిన నాకే విసుగు కలిగిందే ! అయ్యో ! తన బాధ ఇదీ అని చెప్పటానికి ఇంకా మాటలు కూడా రాని చంటిపిల్లలను పనివాళ్ళకు, లేక క్రచ్ లకు అప్పగించి వెళితే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని ?అంటే వాళ్ళు సరిగ్గా చూడరని కాదు. బాగా చూసె వాళ్ళు కూడా కొందరు ఉంటారు లెండి.


ఎంతైనా ఇంటి వాళ్ళంత ఆప్యాయంగా చూస్తారా ? ఏమో !
పూర్వం పేదస్త్రీలు పనులకు వెళ్ళేటప్పుడు తమ చంటి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్ళి చీరతో వీపుకు కట్టుకుని పనిచేసేవారట. లేకపోతే పొలం గట్టున చెట్టుకు చీరతో కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి కొంచెం పెద్దపిల్లలను కాపలాగ పెట్టి పనులు చేసుకొనేవారట.( అంటే ఇప్పుడు అందరూ అలా చేయమని కాదు. వాళ్ళు పిల్లలను అంత జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్పటానికి అలా చెప్పాను అంతే. ).. మేము ఒక దగ్గర ఉన్నప్పుడు........ మా పొరుగున ఇంట్లో ఒకరి అమ్మాయి బిడ్డ పుట్టాక రెండో నెలలోనే పాలుత్రాగే బిడ్డను తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళిపోయింది.
( కెరీర్ కోసమని .)( ఆమెకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం కూడా లేదు. ( అయినా సంపాదనకు అంతు ఎక్కడుంది ? )పెద్దవాళ్ళు పనిలో సాయం చేసే ఆమె సహాయంతో ఆ బిడ్డను చూసేవారు. పని ఆమె రానిరోజున వాళ్ళ పని ఇక అంతే.


పూర్వం తల్లిదండ్రులు చంటిపిల్లలను పెంచుతుంటే తాతా బామ్మలు, మనుమలు,మనుమరాండ్ర ముచ్చట్లతో కాలం గడిపేవారు.


కానీ, డాక్టర్ వంటి వృత్తులలో ఉన్న ఆడవాళ్ళ పిల్లలను పెంచటానికి మాత్రం వారి పెద్దవాళ్ళు తప్పక సహాయం చేయటం బాగుంటుంది.


.... అంటే , నాకు ఏమనిపిస్తుందంటే .......


వీలయినంతవరకు చంటి పిల్లలను పెంపకానికి బయటివాళ్ళ దగ్గర వదలటం కంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ( తాతగార్లు, అమ్మమ్మ,నాయనమ్మ....... ......) వదలడమే మంచిది అనిపిస్తుంది....


ఇప్పుడు నాకు ఇంటిని చూసుకోవటం, కొంచెం సేపు పూజ చేసుకోవటం, పత్రికలు, పుస్తకాలు చదవటం ఇలా సమయం సరిపోవటం లేదు.

అసలు పుస్తక పఠనం అలవాటు ఉన్నవారికి బోర్ కొడుతోంది అనే సమస్యే ఉండదు..

Friday, July 1, 2011

చెప్పుకున్న విధానాలు ఆచరించటం వల్ల.......

శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయంలో సంపద గురించి పదేపదే వార్తలలో చెప్పటం ఎందుకు ! .................అనిపిస్తుంది.నాకు..
............................................
సరే ,.ఇంతకు ముందు కొన్ని టపాలలో కుటుంబాలలో కలతలు రావటం గురించి చెప్పుకున్నాం కదండి.


ఒక 50 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు బయటకు వచ్చి సంపాదించటమనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు సమాజం చాలా మారిపోయింది. ఇంకో 50 ఏళ్ళు అయితే ఇంకెన్ని మార్పులు వస్తాయో !


ఈ రోజుల్లో పెద్దవయసు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కర్మకాలి వాళ్ళు బాత్రూం లో కాలుజారి పడో, లేక పక్షవాతం వచ్చో మంచానికి పరిమితం అయిపోయారనుకోండి. ఈ రోజుల్లో వాళ్ళను చూసే వారే తక్కువ.భార్యాభర్తలు ఇద్దరూ బిజీ కదా ! ఈ రోజుల్లో చంటి పిల్లలను చూసుకోవటానికి కూడా పెద్దవాళ్ళకు తీరిక లేక పిల్లలను క్రచ్ లలో వేస్తున్నారు.


అది అలా ఉంచితే మీడియాలో వార్తలు చూస్తుంటే వివాహేతర సంబంధాలు, విడాకులు, వివాహవ్యవస్థ విచ్చిన్నమవటం , యువతరంలో సహజీవనం వంటివి పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల పట్ల , ఆఫీసుల్లో పనిచేసే మహిళల పట్ల కొందరు మగవారి వేధింపులు, వీటిగురించి వింటున్నాము.ఇవన్నీ వింటున్న భార్యలకేమో తమ భర్తల గురించిన బెంగ, భర్తలకేమో తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో తమ పిల్లల గురించిన బెంగ ఉంటుంది.ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరగటం , అవి విడాకులకు దారితీయటం వింటున్నాము.


నాకు ఏమనిపిస్తుందంటే, కొంతకాలం క్రిందట అమ్మాయిలకోసం విడిగా పాఠశాలలు, కళాశాలలు ఉండేవి. మళ్ళీ ఆ పద్దతి వస్తే ఈ బాధలు సగమయినా తగ్గే అవకాశముంది.


ఇంకా , చదువుకున్న ఆడవాళ్ళు కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ( ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. )


అందులో పేద, మధ్యతరగతి మహిళలను ఉద్యోగానికి తీసుకోవటం వల్ల వారికి సహాయం చేసినట్లు అవుతుంది.


పరిశ్రమలంటే కుటీరపరిశ్రమలు, జ్యూట్ సంచుల తయారీ, పచ్చళ్ళు, పిండివంటల తయారీ, ( డ్వాక్రా సంఘాలలా ), బట్టలపై అద్దకం, ఫాషన్ టెక్నాలజీ, ..........ఇంకా రైతుల వద్ద పంట కొని ఉదా...వడ్లు కొని బియ్యం అమ్మటం, కందులు కొని కంది పప్పు చేసి అమ్మటం, టమేటో కొని ఎండబెట్టి అమ్మటం( వరుగులు ) ఇలా ఎన్నో చేయవచ్చు.ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఉండే ఆడవాళ్ళు సాయంత్రం పూట చుట్టుపక్కల పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్పించవచ్చు.


ఆఫీసుల్లో ఆడవారికి నచ్చినట్లు టైమింగ్స్ ఉండవు కదా ! ఎప్పుడో ప్రొద్దున వెళ్ళి రాత్రికి రావలసి వస్తుంది.


అలా కాకుండా మహిళలే స్థాపించిన పరిశ్రమల్లో అయితే వారు తమకు తగ్గట్లు 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.


ఆ విధంగా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో చిన్న
క్రచ్ ఏర్పాటు చేసుకుంటే చంటి పిల్లల తల్లులు మధ్యలో ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు.


ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.ఈ రోజుల్లో వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వంటి కొన్ని రంగాలలో మహిళలు పనిచేయటం అవసరం.


ఈ రోజుల్లో మనుష్యుల్లో పడిపోతున్న నైతికవిలువల గురించి ఎన్నో సంఘటనలు వింటున్నా ................ సమాజం పూర్తిగా పాడయిపోయిందని అనుకోకూడదు.


సంప్రదాయాన్ని పాటిస్తూ, పద్దతిగా ఉండేవారు ఎందరో ఉన్నారు.


సినిమా రంగంలోనే చూడండి. భానుమతి గారు తన హుందా ప్రవర్తన వల్ల ఎంత గౌరవాన్ని పొందారో.

రాజకీయాల్లో ,ఇంకా ఇతర రంగాల్లో కూడా కూడా మంచి పద్దతిగల మహిళలు, పురుషులు ఎందరో ఉన్నారు.


కొన్ని సంవత్సరాల క్రిందట ఒక పత్రికలో చదివానండి. ఒక టీనేజీ అమ్మాయి ఒక పేరున్న సినిమా హీరో ఇంటికి వచ్చిందట.


తనకు ఆయన అంటే చాలా అభిమానమని ఆఖరికి వాళ్ళింట్లో పని చేసి అయినా బ్రతికేస్తానని ప్రాధేయపడిందట.


అప్పుడు వారు ఆ అమ్మాయిని మందలించి ఆ పిల్ల తన కూతురితో సమానమని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తిప్పి పంపించేశారట.


ఆ నటుని పేరు పత్రిక వారు రాయలేదు.

ఇలాంటి వారివల్లే నైతిక విలువలపై నమ్మకం ఇంకా మిగిలి ఉంది.


అయితే అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలో కూడా మంచితో పాటూ చెడు కూడా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కూడా ఉండాలి . ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాము కదా !


పైన చెప్పుకున్న విధానాలు ఆచరించటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించగలుగుతారు. మగవాళ్ళ వేధింపులకు భయపడే ఆడవాళ్ళకు రక్షణ లభిస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్ధాలు , తగ్గే అవకాశం ఉందని నాకు అనిపించిందండి.....