koodali

Wednesday, July 6, 2011

పాపం .... పెద్దవాళ్ళు.


ఈ రోజుల్లో పెద్దవాళ్ళు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎందుకంటే, ఒక వేళ అనారోగ్యం వచ్చిందనుకోండి వారిని చూసేవాళ్ళు ఎవరు ? ఇంట్లో అందరూ బిజీ కదా !.

మా బంధువుల్లో ఒక బామ్మగారు ఉండేవారు. ఆమెకు 6 గురు సంతానం ఉన్నారు.

ఈమె భర్త మరణానంతరం 85 ఏళ్ళ వయసులో పల్లెటూరులో ఒక్కరే ఉండేవారు. అక్కడ అందరూ తెలిసిన వారు కాబట్టి ఇరుగుపొరుగు కొంచెం సహాయంగా ఉండేవారు.

ఒకరోజు ఆమె బాత్రూంలో కాలుజారి పడటం వల్ల ఇక మంచానికే పరిమితం అయ్యారు. ఆమెకు సేవ చెయ్యటానికి పనివాళ్ళు దొరకలేదు.


అలా మంచం మీద ఉన్నవారికి స్నానం చేయించటం, ,శుభ్రం చెయ్యటానికి ఎక్కువ డబ్బు ఇచ్చినా ..వాళ్ళు రెండు రోజులు పనికి వచ్చేవారు. తరువాత పని మానేసేవారు.

ఇక ఆమె పిల్లలు ఆమెను ఒక పేరున్న వృద్దాశ్రమంలో వేయాలని అనుకున్నారు. నెలకు 5 వేలు ఇంకా, కొన్ని వేలు డిపాజిట్ వేసి చేర్పించాలనుకున్నారు.

కానీ ఆ ఆశ్రమం వారు ఏమన్నారంటే , కొద్దిగా అయినా లేచి తమ పనులుతాము చేసుకునే వృద్దులనే వారు చేర్చుకుంటారట. ఇలా మంచంపై ఉండేవారిని వారు చేర్చుకోరట.

ఎందుకంటే అలాంటి వారిని చూసుకోవటానికి వారికి మనుష్యులు దొరకరని చెప్పి ఈమెను జాయిన్ చేసుకోవటానికి నిరాకరించారు.

ఆమెకు ఒక 6 రోజులు కొద్దిగా సేవ చేయటానికి మాత్రమే నాకు వీలు కుదిరింది.
అలాంటి వారికి చెయ్యటం కష్టమే.

ఆమె పరిస్థితి చూసి నాకు జీవితమంటే ఇంతేనా అని అనిపించింది.

పెద్ద వయసు వచ్చాక ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ? అని భయం కూడా కలిగింది.


యవ్వనంలో ఆరోగ్యంతో ఉండగా మనకు ఏదో సాధించెయ్యాలని తపన తప్పితే ఇలాంటి కష్టాలు తెలియవు.

వృద్దాప్యం అంటే రెండో బాల్యం అంటారు.

ఆ వయసు వచ్చి అనారోగ్యం ఉండేవాళ్ళకు అందరూ తమ దగ్గర కూర్చుని కొద్దిసేపయినా ఆప్యాయంగా మాట్లాడాలని ఉంటుంది.
కానీ..

 మనకేమో వీర బిజీ కదా ! మనకు భోజనం చెయ్యటానికే సమయముండదు.

వారికి ఏమీ తోచదు. కానీ ప్రతి చిన్న విషయం వారు పట్టించుకుంటారు. అన్నీ వివరాలు అడుగుతుంటారు.
కానీ ,మనకేమో అంత ఓపిక ఉండదు.

ఆ వయసులో వారితో మాట్లాడాలంటే ఇంట్లో వారికి విసుగ్గా అనిపిస్తుంది
కానీ ..

మనం చిన్నతనంలో ఎంత విసిగించినా ఓపికగా సమాధానాలు చెప్పి మనలను పెంచిన తల్లిదండ్రులే అయినా మనకు వారితో మాట్లాడటానికి విసుగొస్తుంది.

పెద్దవయసు వాళ్ళకు ఏమీ తోచక ఇరుగుపొరుగుతో మాట్లాడాలని ఉంటుంది .కానీ ,శరీరం సహకరించదు.

ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడాలని ఉంటుంది. కానీ, అందరూ ఎవరి బిజీలో వారు ఉంటారు.

అప్పటివరకూ జీవితంలో బిజీగా ఉండి ఒక్కసారే ఖాళీగా ఉండాలంటే తట్టుకోవటం వాళ్లకు కష్టంగా ఉంటుంది.

ఇక వాళ్ళు తమ జీవితంలో జరిగిపోయిన ముచ్చట్లు తలచుకుంటూ గడపటం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

ఇలా మంచానికే పరిమితమయిన వారి పరిస్థితి ఎంతో బాధాకరం. నాకు ఏమనిపించిందంటే ... నరకం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది.

ఇంకా, బామ్మగారు నాతో ఏమన్నదంటే , నేను ఇంకా ఎందుకు బ్రతకాలి ? అని ఏడ్చింది .కానీ దానికి ఏమని సమాధానం చెబుతాము. తరువాత కొన్ని నెలలు మాత్రమే జీవించింది ఆమె.

ఇవన్నీ చూశాక నాకు ఏమిటో ! మనిషి జీవితం అనిపించింది.

నడివయసు వాళ్ళకయినా చిన్న జబ్బు చేసి మంచం మీద ఉంటే ఈ రోజుల్లో వాళ్ళను చూసుకోవటానికే ఎవరికీ తీరికలేని పరిస్థితి ఉంది.

* మొత్తానికి అటు చిన్నపిల్లలుగాఉన్నప్పుడు కేర్ సెంటర్ల సం రక్షణలో , ఇటు వృద్ధాప్యం వస్తే వృద్ధాశ్రమం వాళ్ళ సం రక్షణలో ఉండవలసిన వింత పరిస్థితి వచ్చేసింది.

యవ్వనంలో మాత్రమే అదీ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనల్ని అందరూ గౌరవిస్తారు.

ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఎవరి గొప్పతనమయినా అనిపించింది.

యవ్వనంలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు గదా ! అది గుర్తుంచుకుంటే పెద్దవాళ్ళను చూడటానికి విసుగు తగ్గి కొంచెం ఓపిక వస్తుంది..


1 comment: