koodali

Wednesday, July 13, 2011

ఎన్నో కుటుంబాల , వ్యక్తుల సమాహారమే కదా సమాజం అంటే ....... .. . ........ ...



మన సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి.

ఇప్పుడు అన్ని వృత్తులలోనూ పని వత్తిడి బాగా పెరిగిపోయింది.

వైద్యులను ప్రాణదాతలుగా దేవునితో సమానంగా గౌరవిస్తాము.

వైద్యుల వలెనే విమానం నడిపే పైలట్లు , బస్సు రైళ్ళ డ్రైవర్లు , పడవ నడిపేవారు
కూడా గొప్పవారే.

* సమాజంలో ధర్మబద్ధంగా చేసే ఏ వృత్తి అయినా గొప్పదే.

పనిలో వత్తిడి వల్ల వైద్యులు ఏదైనా పొరపాటు చేస్తే రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది.( వైద్యులు కూడా రోగుల నుంచి రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి .)

వాహనాలు నడిపే డ్రైవర్లు ఏదైనా పొరపాటు చేస్తే అందులో ప్రయాణించే ప్రయాణీకులతో పాటూ వాహనాన్ని నడిపేవారి ప్రాణాలకు కూడా ప్రమాదమే.

ఒక బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగా గుండెనొప్పి వచ్చిందట. అలాగే బస్సును రోడ్ ప్రక్క ఆపిన తరువాత ఆయన ప్రాణం విడిచారట. ప్రాణం మీదకు వచ్చిన సమయంలో కూడా ప్రయాణీకుల క్షేమం గురించి ఆలోచించిన ఆ డ్రైవర్ గురించి ఈ మధ్య వార్తాపత్రికలో వేశారండి.


ఇంకా గనులు, పెద్దపెద్ద యంత్రాల వద్ద పనిచేసేవారు అజాగ్రత్తగా ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం.

రక్షణ రంగంలో పనిచేసేవారి జీవితాలు .. సైనికులు, పోలీసులు, అటవీ సంరక్షణ అధికారులు, ఇలా రక్షణకు సంబంధించిన ఏ రంగమైనా , వారి జీవితాలు ప్రమాదభరితమైనవే.

ఇళ్ళ వద్ద వాచ్ మాన్ లుగా పనిచేసే వారివి కూడా ప్రమాదభరితమైన జీవితాలే.

ఇక బక్క రైతులు .. వీరి గురించి చెప్పటానికేముంది. అందరికీ పంచభక్ష్యపరమాణ్ణాలు అందించి అప్పుల వల్ల తాము పస్తులుండే జీవులు. వారు పండించిన పంటలు ఎంత రేటుకు అమ్ముకోవాలో నిర్ణయించుకునే హక్కు వారికి లేదు కదా మరి.

ఇక ఎన్నో రంగాల్లో కార్మికులు, రోజంతా ఎండలో ,వానలో ఎంత రెక్కలుముక్కలు చేసుకుని పనిచేసినా వారికి దక్కేది కొద్ది సంపాదనే.

ఇలా చెప్పినట్లు రకరకాల వృత్తులవారు సమాజంలో ఉన్నారు.

అర్చకత్వం వృత్తి అనటం సబబు కాదు. పండితులు, అర్చకులు ... వీరు , ,ప్రాచీన విజ్ఞానాన్ని తరతరాల నుంచీ ఎంతో బాధ్యతగా కాపాడి , ఈ నాటి వారికి అందించారు. ప్రాచీన సంస్కృతి, ఇంకా, దేవాలయాల ఆలన, పాలన , రక్షణ కోసం వీరు ఎన్నో త్యాగాలు చేశారు. 


* అందరిదీ ఒకటే కష్టం. కానీ మనం కొన్ని వృత్తుల వారినే బాగా గౌరవిస్తాము. కొందరిని తక్కువ గౌరవిస్తాము .

ఈ తేడా ఎందుకో నాకు అర్ధం కాదు.

అది అలా ఉంచితే పని వత్తిడి తగ్గాలంటే, హాస్పిటల్స్ లో ఎక్కువమంది వైద్యులను నియమించుకోవాలి.

విమానాల్లో అయితే ఒకరి కంటే ఎక్కువ పైలట్లు ఉంటారు.

బస్సులలో కూడా రాత్రి సమయాల్లో దూరప్రయాణం వెళ్ళేటప్పుడు ఇద్దరు డ్రైవర్లను నియమిస్తారు.

కానీ కొన్ని రూట్లలో ఒక డ్రైవరే 10 గంటలు కన్నా ఎక్కువ సమయం బస్సును నడపటం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదం.

నేను కొన్నిసార్లు బస్సు దిగివెళ్ళేముందు డ్రైవర్ కు కృతజ్ఞతలు చెప్పాను ,( వైద్యుల లానే వీరు కూడా ప్రాణదాతలే కదా మరి.)


అయితే
, కొన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాక ఇక చెప్పటం మానేశాను. ఓవర్ యాక్షన్ లాగ ఉంటుందేమో, ఎందుకొచ్చిన గోల అనిపించింది.

ఇప్పుడు అన్ని వృత్తులలోనూ పని వత్తిడి బాగా పెరిగిపోయింది.

కానీ, తల్లిదండ్రులు తమ కుటుంబావసరాలకు తగినంత సమయం కేటాయించటం కూడా ముఖ్యమే.

*
కానీ, కొన్ని వృత్తుల వారికి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించటం కుదరదు.

ఉదా.. సైనికులకు కుటుంబంతో ఎప్పుడూ ఉండటం కుదరదు కదా !

ఇలాంటి వారి కుటుంబసభ్యులది కూడా త్యాగమయమయిన జీవితమే అనిపిస్తుంది.

* ఇంటి యజమాని ఉద్యోగ నిర్వహణలో సమాజానికి చేసే సేవ వల్ల ..... వారి కుటుంబానికి ఎంతో పుణ్యం వస్తుంది అన్నది నిజమే అయినా ........

* సమాజానికి సేవ చేయటానికైనా చక్కటి ఆరోగ్యం ఉండాలి కదా !

అందుకే వీలయినంతవరకూ పని వత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.

* ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం ద్వారా పనిని ఎక్కువమంది పంచుకుంటే కొంతయినా పని వత్తిడి తగ్గుతుంది.

నిరుద్యోగమూ తగ్గుతుంది.
ఇంకా కుటుంబ అవసరాలను చూసుకోవటానికి వీలు కుదురుతుంది.

* తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ,పర్యవేక్షణ లోపించిన పిల్లలు సంఘ విద్రోహులుగా మారే అవకాశముందని మానసికశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో కుటుంబాల , వ్యక్తుల సమాహారమే కదా సమాజం అంటే .

 

No comments:

Post a Comment