koodali

Friday, July 8, 2011

శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి సంపద.


* శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద గురించి గురించి వింటున్నాము కదా !

* ఆ సంపద గురించి ఇంతకాలంగా బయటి ప్రపంచానికి తెలియకుండా రక్షించిన వారిని ఎంతో అభినందించాలి.

నాకు ఏమనిపించిందంటే ఇదంతా బయటకు రాకుండా అలాగే ఉంటే బాగుండేదేమో అని. ఎందుకంటే ఈ సంపదను ఎలా కాపాడుతారు ?

దేశంలో అందినది అందినట్లు దోచేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సంపదను సం రక్షించటం ఎలా ?


కొంతలో కొంత నయం .. ఇంకా తెరవని ఒక గదినీ ప్రస్తుతానికి తెరవకూడదని భావించటం మంచి పని.

ఆ గదిని తెరిస్తే ప్రమాదం అని పెద్దలు చెబుతున్నప్పుడు , వారి ప్రకారం చెయ్యటమే మంచిది.

* ఇప్పటికే బయటకు తీసిన సంపదను ......... ఆ దేవాలయ ప్రాంగణంలోనే గట్టి భవనం నిర్మించి ఈ సొమ్మును అందులో ఉంచి గట్టి భద్రత ఏర్పాటు చేసి సం రక్షించాలి.


ఇక నుంచీ ఆ దేవాలయం వద్ద పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు ఎలాగూ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఈ సంపదను మరల ఆ స్వామి వారి చెంతనే భద్రపరిస్తే బాగుంటుంది....

దేవునిపై భారం వేసి , మానవ ప్రయత్నం చెయ్యాలి గదా !

ఇలాంటి అపురూప ప్రాచీన సంపదను భావి తరాలకు గొప్పగా చూపించటానికైనా వాటిని జాగ్రత్తగా అట్టిపెట్టాలి.

ఇలాంటి అపురూపమైన వస్తువులను సంపాదించటం ఇప్పటి వారికి ఎంతో కష్టమయిన పని.

పెద్దలు ఇచ్చిన సంపదను మొత్తంగా ఖాళీ చేయకుండా ముందు తరాలవారికి అందించవలసిన బాధ్యత అందరిదీ.

ఒకాయన ఏమన్నారంటే, వారి ఊరిలో ఉన్న దేవాలయంలో కూడా నిధులుండే అవకాశం ఉందని చెబుతూ, ప్రజలు తట్టుకోలేని కష్టాలలో ఉన్నప్పుడు , ఆ నిధిలో కొంత భాగాన్ని వినియోగించుకోవచ్చని పెద్దలు చెప్పారంటూ అలా చెప్పటం జరిగింది.

నాకు ఏమనిపిస్తుందంటే , ఒకోసారి తీవ్రమయిన కరువు, కాటకాలు వచ్చినప్పుడు కొంత సొమ్మును వాడుకోవచ్చు అని పెద్దల అభిప్రాయమయి ఉంటుంది.

కానీ మనకు దేవుని దయవల్ల అలాంటి పరిస్థితి లేదు.

మనకు చిత్తశుద్ధి లేకపోవటం వల్ల మాత్రమే మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది .

సోమాలియా వంటి దేశాల వారితో పోలిస్తే మనం ఎంతో అదృష్టవంతులం...

అయితే ఇప్పుడు కూడా బంగారునాణేల వంటివాటిలో కొంత భాగాన్ని సంక్షేమానికి ఉపయోగించవచ్చేమో !

* కానీ విగ్రహాలు, వజ్రాలు, ఆభరణాలు వంటి అపురూపమైన వాటిని అలా భద్రపరిస్తేనే బాగుంటుంది .

కొంత మంది ఉత్సాహం పట్టలేక ఇంకా ఫలానాఫలానా దేవాలయాల దగ్గర బోలెడు సంపద ఉంటుంది అంటూ ప్రకటిస్తున్నారు.

ఇదంతా అమాయకత్వం అనుకోవాలో ఏంటో అర్ధం కావటం లేదు.

ఇప్పుడు బయటకు తీసిన సంపదనే ఎలా జాగ్రత్త చేయాలో తెలియటం లేదు గదా ! మరి వాళ్ళు ఎందుకు అలా ప్రచారం చేసుకుంటున్నారో ?

ఇక దేవుడిపై భారం వెయ్యటం తప్ప...ఎవరూ ఏం చెయ్యలేరు.

ఇప్పుడు బయటపడిన సంపదను సంక్షేమ పధకాలకు వినియోగించాలి అని కొందరు అంటున్నారు. మంచిదే, కానీ ,

ఇప్పటికే ఎన్నో లక్షల కోట్లు . సంక్షేమ పధకాల పేరుతో ఖర్చు అయ్యాయి. ఆ సొమ్ము ఎక్కడికి పోయిందో తెలియదు.

పేదరికం మాత్రం ఎక్కడిది అక్కడే ఉంది. ఏం జరుగుతోందో అందరికీ తెలుసు.

ఎక్కడ సొమ్ము దొరికినా ఇక దాన్ని సంక్షేమ పధకాలకు వినియోగించాలి అని బయలుదేరుతారు.

మన బ్రతుకులకు ఎక్కడి సొమ్మూ చాలదు. అవినీతి రూపంలో పొయేది బయటకు పోతూ ఉంటే ఎంత డబ్బు అయినా చాలదు.

ఇప్పుడు అన్నాహజారే గారు, ఇంకా ఇలాంటివారు ఉద్యమాలు చేస్తున్నారు గదా ! వారికి ప్రజలు ఇంకా ఎంతో సపోర్ట్ చేయాలి.

అంతేగానీ అన్నా హజారేకు పట్టువిడుపూ ఉండాలి, వారు రూల్స్, రెగ్యులేషన్స్ ఇంకా ఫాలో అవ్వాలి..అని నిరుత్సాహంగా మాట్లాడితే ఎలా ?

రూల్స్, రెగ్యులేషన్స్ ప్రజల బాగు కోసం ఏర్పరిచారు.

పెద్దలు చెప్పినట్లు ... రూల్స్ ఉండేది ప్రజల కోసం..అంతేకాని ప్రజలు ఉండేది రూల్స్ కోసం కాదు.

* ఈ దేశం నుంచి విదేశాలకు తరలించబడిన సంపద 30 లక్షల కోట్లకన్నా పైనే ఉంటుందని చెబుతున్నారు.

అదంతా తిరిగి తెస్తే ప్రజల పేదరికం చాలా వరకూ తగ్గుతుంది కదా ! ఆ ప్రయత్నాలు చేస్తున్నవారిని నిరాశపరచకుండా ఉంటే అదే చాలు.

దొరికిన సొమ్మును దొరికినట్లు వాడేసుకుంటే ఆ సంపద అయిపోయిన తరువాత మళ్ళీ కధ మొదటికి వస్తుంది.

కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయంటారు.

అందుకని పేదరికం పోవాలంటే, ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం ముందు అవినీతిని గట్టిగా నిరోధించాలి.

ఇంకా, ప్రజలలో కూడా బాగా మార్పు రావాలి.

ఇకముందు ఇక్కడినుంచీ సొమ్ము విదేశాలకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా మనకు దేవుని దయ వల్ల బోలెడు సహజవనరులు ఉన్నాయి.

అంటే నదులు, సముద్రాలు, పచ్చటి పంటలు పండే భూములు ఇలా ఎన్నో ఉన్నాయి.

వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పేదరికం ఎందుకుంటుంది ?

మనకు చిత్తశుద్ది లేకపోవటం, సరైన ప్రణాళిక పాటించకపోవటం వల్లే పేదరికం పెరిగిపోతోంది.

ఉదా.. రైతులు పంటలు బాగా పండించారు. వాటిని దాచుకోవటానికి గోదాములు ఖాళీగా లేవు.

ఉన్న గోదాముల్లోని ఉత్పత్తులేమో పాడయిపోతున్నాయి. బయట చూస్తే ఆకలి కేకలు, పేదరికం, ఆహార కొరత.

పంటలు పండించిన రైతులకేమో గిట్టుబాటు ధర రాదు.. ప్రజలకేమో ఆహారం అందదు.

మన పద్దతులు ఇలా ఉంటే ఎన్ని లక్షల కోట్లు సంపద దొరికినా ఉపయోగమేమీ ఉండదు.

* అదలా ఉంచితే ఇప్పుడు బయటపడిన సంపద ద్వారా భగవంతుడు ఎన్ని కధలు నడిపిస్తారో ? ఎన్ని చిత్రవిచిత్రాలు జరిపిస్తారో !

 

2 comments:

  1. $anrd గారు

    ఈ విషయం మీద మీ అభిప్రాయం కోసం ఎదురూచూస్తూ ఉన్నా. చక్కగా రాసారు.

    ముఖ్యంగా మరీ ముఖ్యంగా నిక్కచ్చిగా చెప్పిన మీ ఈ మాట..ఆలోచి౦పచేసే మాట..

    మన బ్రతుకులకు ఎక్కడి సొమ్మూ చాలదు. అవినీతి రూపంలో పొయేది బయటకు పోతూ ఉంటే ఎంత డబ్బు అయినా చాలదు.

    మరోకోణంలో చూస్తే

    ముష్కరులు దండెత్తి దోచుకోకముందు, వలసపాలనలకు ముందు భారతదేశం రత్నగర్భ అన్నదాంట్లో అసత్యం లేదు.[నేడూ రత్నగర్భే..ఆయితే అది కొందరి సోత్తయి నల్లధనం కింద మూలుగుతుంది]

    అత్యాధునిక సాంకేతిక పద్దతులు ఉపయోగించినా నేలమాళిగ గదుల్ని తెరవలేక కష్టపడ్డ వైన౦ చూస్తే నిధిని దాచడానికి ఉపయోగించిన నాటి భారతీయ సాంకేతిక విజ్ఞాన నైపుణ్యం అపూర్వమని తెలుస్తుంది.

    ఈ కోణంలో మీరో టపా రాయగలరు.

    చివరిగా ఇప్పుడీ నిధి బయటపడ్డం ఎక్కడికి దారితీస్తుంది అన్నది మీరు చెప్పినట్లు ఆ భగవంతుండి కథలో తర్వాత ఏమిటో అని ఆసక్తిగా ఎదురుచూడటమే..!

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.
    నిజమే భారతదేశం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ రత్నగర్భయే.

    నిజమేనండి. " అత్యాధునిక సాంకేతిక పద్దతులు ఉపయోగించినా నేలమాళిగ గదుల్ని తెరవలేక కష్టపడ్డ వైన౦ చూస్తే నిధిని దాచడానికి ఉపయోగించిన నాటి భారతీయ సాంకేతిక విజ్ఞాన నైపుణ్యం అపూర్వమని తెలుస్తుంది "

    " iron pillar of Delhi "' ఈ స్థంభం నిర్మించి ఎన్నో సంవత్సరాలు గడిచినా రస్ట్ ఉండదట. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ ఈ రహస్యాన్ని పూర్తిగా కనుక్కోలేపోయారట.

    ఇంకా, తిరుచ్చిలో పిళ్ళయార్ దేవాలయపరిధిలోని శివాలయం ఆలయ పై కప్పుకు రకరకాల చిత్రాలు ఉన్నాయి . అక్కడ అమ్మవారి చిత్రం చాలా చిత్రంగా ఉంటుంది. మనం ఎటునుండి చూసినా మనవైపే చూస్తున్నట్లూ ఇంకా, . పాదముల విషయంలో ఒక ప్రత్యేకత ఉండేటట్లు ఇలా చాలా గొప్పగా చిత్రించారు. . అక్కడి పండితులు ఆ విశేషాలను తెలియచేశారు. ఇలా ఎన్నో విషయాలలో భారతీయుల నైపుణ్యం అపూర్వమని తెలుస్తుంది.

    ఇక నా విషయానికొస్తే ఏదో నాకు తెలిసినంతలో వ్రాస్తున్నానండి. అంతా దైవం దయ. మీ అందరికీ ఎంతో నాలెడ్జ్ ఉంది. అయినా నాకు తెలిసినంతలో నేను వ్రాస్తున్న విషయాలను కూడా మెచ్చుకోవటం మీ అందరి గొప్పదనం....

    ReplyDelete