koodali

Friday, April 29, 2011

.ఉన్నాడు ఆ పై వాడు............ఉంటాడు మనకు సైదోడు..................

ఒక గురువు గారు అబూబకర్ అనే తన శిస్యునితో కలసి ఒక అడవిమార్గంలో ప్రయాణిస్తున్నారట.

శిస్యుడు కొంచెం భయపడి గురువుగారితో .........మనం ఇద్దరమే వెళ్తున్నాము . దారిలో దొంగలు దోచుకొంటే ఎలాగండి ? భయంగా ఉంది అన్నాడట.


అప్పుడు గురువుగారు .........లేదు , మనం ముగ్గురము ఉన్నాము. అన్నారట.


శిష్యుడు ఆశ్చర్యపడి ముగ్గురమా ! ఎవరండి ఆ మూడో వ్యక్తి ? అని అడగగా ..........


మనము ఇద్దరము, మరియు పరమేశ్వరుడు. అని గురువుగారు సమాధానమిచ్చారట.


( నిజంగా ఇంతగా భగవంతుని యందు నమ్మకముంచితే ఇక లోటేముంటుంది...........ఈ నమ్మకం ఏర్పడటమే మోక్షానికి మార్గము..........(నిష్కామ కర్మ యోగం )......... ఈ నమ్మకాన్ని పొందటమే అత్యంత కష్టసాధ్యం కూడా....... )


ఈ మధ్య టి.వి లో పెద్దలు ఈ కధ చెప్పారు. ఇలాంటి కధనే నేను శ్రీ రామకృష్ణ పరమహంస వారి కధలలో కూడా చదివానండి.

అందరి బోధనలు దగ్గరదగ్గర ఒకలానే ఉంటాయి.

ఎందుకంటే........... మతాలు ఎన్నయినా దైవం ఒక్కరే కాబట్టి. సూర్యుని ఎన్ని భాషలలో ఎన్ని పేర్లతో పిలిచినా ........ సూర్యుడు ఒక్కరే కదా ! అలాగన్నమాట.


అయితే, భక్తులే వాదులాడుకుంటూ ఉంటారు. హిందువులలో కూడా కొందరు శైవులు...వైష్ణవులు మా దేవుడే గొప్ప ...........అంటే.........మా దేవుడే గొప్ప. అని వాదించుకుంటారు.


ప్రాచీన గ్రంధాలలో........... శివునికి విష్ణువుకు భేదం చూపించిన వారు .... నరకానికి పోతారని వారే చెప్పినట్లుగా ఉంది. అయినా భక్తులు............... వారు పూజించే దేవుళ్ళ మాటలు ప్రక్కన పెట్టి వాదులాడుకుంటూ ఉంటారు.


భగవంతుడు చెప్పిన ధర్మమార్గాన్ని పాటించకుండా ............... ఆ భగవంతునికి విపరీతంగా పూజలు చేయటం ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్న వింత.


ఏ మతం వారైనా భక్తులు ........ఈ విశ్వం అంతా తాము నమ్మే దైవమే సృష్టించారని నమ్ముతారు. మరి అలాంటప్పుడు ......... ఇతర మతస్తులు కూడా ఈ విశ్వంలో భాగమే కదా !


అలా చూస్తే........ తాము నమ్మే దైవమే అందరినీ సృష్టించినట్లు కదా !


లేదు ......... ఇతర మతస్థులను మా దైవం సృష్టించలేదూ అంటారా ! .............వారు నమ్మే దైవం యొక్క విశ్వవ్యాపకత్వాన్ని వారే .......... తక్కువ చేసినట్లు అవుతుంది.వారు నమ్మే దైవం యొక్క శక్తి పరిమితమని వారే ఒప్పుకున్నట్లు ...............


నేను పుట్టుకతో హిందువును కాబట్టి నా ధర్మం ప్రకారం నేను హిందూ ఆచారాలను పాటిస్తాను.

( అయితే ,........ కొన్నిసార్లు నాకు ఏసుప్రభువు..అల్లాహ్ కు సంబంధించిన దైవానుభూతులు కూడా కలిగాయి. నేను కొన్నిసార్లు......... దైవాన్ని వీరి వలె కూడా ప్రార్ధిస్తాను. )


ఎవరైనా తెలిసీతెలియక ఇతరుల దైవాన్ని నిందిస్తే ............ ఆ నిందించిన వ్యక్తి నిందను మనం తప్పు పట్టాలి గానీ ......... ఆ వ్యక్తి ఆరాధించే దైవాన్ని మనము తప్పుపట్టకూడదు. ఎందుకంటే .............. దైవం అందరికీ ఒకరే కాబట్టి.


ఎవరి ఆచారాలను వారు పాటిస్తూ........ఇతరులను గౌరవిస్తూ జీవిస్తే పెద్దగా గొడవలు రావు .

శ్రీ రాములవారు తన భక్తుడయిన రామదాసును చెరసాల నుంచి విడిపించిన కధ మనకు తెలుసు.


మరి, రామలక్ష్మణులంతటివారు ........ మేము తానీషా వద్దకు ఎందుకు వెళ్ళాలి ? అనుకోలేదు.


తలచుకొంటే వారు చిటికెలో రామదాసును విడిపించగలిగేవారే...... కానీ వారు అలా చెయ్యలేదు.


రామదాసు కట్టవలసిన కప్పం సొమ్ముని కట్టి మాత్రమే రామదాసును విడిపించారు.

ఇలాంటి వాటి ద్వారా మనము ఎన్నో నేర్చుకోవచ్చు............రామలక్ష్మణులు స్వయంగా మారు వేషాలలో తానీషా దగ్గరకు వెళ్ళకుండా ................ ఇతరుల ద్వారా డబ్బును పంపించి కూడా భక్త రామదాసును విడిపించవచ్చు...........

రామలక్ష్మణులు దేవుళ్ళయి కూడా ఇంత కష్టపడటమెందుకు ? అని మనకు అనిపిస్తుంది. ................. ప్రతిపనికి ఒక పధ్ధతి ఉంటుంది కదా !. ఆ పధ్ధతి వెనుక .............. ఎన్నెన్నో కారణాలు, అర్ధాలు ఉంటాయి... .అవి అంతగా మనకు తెలియవు.రామదాసును బంధించిన తానీషా వద్దకు రామలక్ష్మణులు స్వయంగా వెళ్ళటం వల్ల............ తానీషాకు, లోకానికి రామదాసు యొక్క భక్తి గట్టిగా నిరూపించబడింది.. .......... తనను నమ్మిన గొప్ప భక్తుల యెడల దైవం ఇంతగా దయను చూపిస్తారు...రామలక్ష్మణులు తానీషాకు దర్శనమివ్వటానికి ............ పూర్వజన్మలో తానీషా ఎంత పుణ్యం చేసుకున్నారో కదా !
రామదాసును కాపాడటంలో అంతగా ఆశ్చర్యం లేదు.......... ఆయన గొప్ప భక్తుడు కాబట్టి.


దేవుళ్ళు అయినా రామలక్ష్మణులు .............. కప్పం కట్టి మాత్రమే భక్త రామదాసును విడిపించటం వంటి పధ్ధతులను పాటించారు......... అలా ఆచరించి చూపించారు............
.......


నిజాయితీ గల ఒక దేశాధినేత గానీ .........లేక......... ఒక అత్యున్నత న్యాయమూర్తి గానీ తమకు ఎంత అధికారం ఉన్నా......... ధర్మబధ్ధమైన పధ్ధతిలో మాత్రమే జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. ( అది కష్టమయినా సరే. )

అంతేగానీ తమ అధికారాన్ని ప్రతీపనికి ఉపయోగించరు.............


అలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటం ద్వారా ........ వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. .............

Wednesday, April 27, 2011

నక్షత్ర ఆవర్తన పధ్ధతి ప్రకారం చూస్తే సత్య సాయి 96 సంవత్సరాలు జీవించారట................

గట్టి ఆధ్యాత్మిక సాధన, మంచి ప్రవర్తన వల్ల దైవానికి దగ్గరవటంతో పాటు క్రమంగా............. కొన్ని శక్తులు కూడా వాటంతట అవే వస్తాయని పెద్దలు చెబుతారు. అయితే ................. ఆ శక్తుల దగ్గరే ఆగిపోకుండా ముందుకు వెళితే దైవాన్ని పొందటం జరుగుతుందట.ఇలాంటి యోగులు కష్టపడి తపశ్శక్తి ద్వారా సాధించిన శక్తులను పొదుపుగా వాడుకుంటారట. వాటిని ఎక్కువగా లోక కల్యాణానికే వినియోగించటం కనిపిస్తుంది.


దేవతలు కూడా శక్తిని పొందటం కొరకు తపస్సులు చేస్తారు. దేవతలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇంద్రుడు త్రిమూర్తులను సహాయం కోరటం జరిగింది.


త్రిమూర్తులు కొన్నిసార్లు రాక్షసులను ఎదిరించలేనప్పుడు ఆదిపరాశక్తిని ప్రార్ధించగా ఆ శక్తి వారిని ఆదుకొని రాక్షసులను సంహరించటం జరిగింది.


పరమాత్మ , ( మణిద్వీపంలో ఉండే శ్రీ మన్మహాదేవీ మహాదేవులు )( వీరిద్దరూ ఒకటే.. ఆమే ఆయన ఆయనే ఆమె . )ఈ పరమాత్మ మాత్రం సర్వ శక్తిమంతులు . వారి శక్తి అపరిమితం. వారు ఏదైనా చేయగలరు. రెప్పపాటులో బ్రహ్మాండాలను సృష్టించనూగలరు ............ లయించనూగలరట.


( నేను ఎప్పుడైనా మనసుకు కష్టంగా అనిపించినప్పుడు పరమాత్మ పాదాలపైగానీ, ఒడిపైగానీ తల ఆనించి సేద తీరుతున్నట్లు భావించుకుంటాను. వారు అందరికీ అత్యంత ఆప్తులు కదా ! )లోకంలో కొందరు దేవుడు లేడు అంటారు. ఎవరు అవునన్నా.....కాదన్నా దైవం ఉండటం నిజం.


దైవ సంబంధమైన అనుభవాలు ఎందరికో కలుగుతున్నాయి. ఇవి భ్రమలు ఎంతమాత్రం కాదు . అవి పొందినవారికే తెలుస్తాయి.


దైవం లేరని అనేవారిని చూసి జాలి పడాలి అంతే. దైవాన్ని నమ్మాలంటే దానికి ఒక టైం రావాలి. అప్పుడు వారికే అనుభవాలు కలుగుతాయి.


అదలా ఉంచితే కొందరు గొప్పపేరు తెచ్చుకున్నవారిని గురించి కొందరు రకరకాలుగా మాట్లాడుతుంటారు.


సీతారాములనే విమర్శిస్తున్నప్పుడు ఇక ఎవరిని మాత్రం విమర్శించకుండా వదులుతారు.


చూస్తే.......... ........ వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు అడవిలో వెళ్ళే బాటసారులను చంపి వారి దగ్గరున్న సొమ్ము దోచుకోవటం జరిగేదట. తరువాత నారదుల వారి ద్వారా రామ నామమును పొంది మహర్షిగా మారటం జరిగింది.తెలిసో తెలియకో జీవితంలో ఇలా పొరపాట్లు చేసి తరువాత సరిదిద్దుకొని గొప్పవారిగా మారిన వారు ప్రాచీన కధలలో కూడా కొందరు కనిపిస్తారు. వారిని మనం ఆరాధిస్తాము కూడా !


శ్రీ మంజునాధ సినిమాలో ఒక నాస్తికుడు మహా భక్తునిగా మారటం చూపించారు.


ఈ పాత్రల ద్వారా ఏం తెలుస్తుందంటే ......... పొరపాట్లు చేసినవారు తప్పు సరిదిద్దుకుంటే గొప్పవారిగా మారవచ్చని ఈ పాత్రలను సృష్టించటం ద్వారా పెద్దలు తెలియచేశారని అనిపిస్తుంది.


అందుకే మనం ప్రతి ఒక్కరినీ తప్పుపట్టకూడదు.

ఈ రోజుల్లో మోసాలు చేసేవారు ఎక్కువయ్యారు. నిజమే !.............. అందువల్ల ఎవరు మంచివాళ్ళో ..ఎవరు కాదో తెలియక ఒకోసారి మంచివాళ్ళను కూడా గుర్తించలేక ........... అంతా అయోమయంగా ఉంటోంది. ఇలాంటప్పుడు దేవుడే దిక్కు.


ఇవన్నీ అలా ఉంచితే సత్యసాయి గురించి మాకు జరిగిన ఒక సంఘటన చెబుతాను.


మేము ఉన్న దగ్గర చుట్టుప్రక్కల కొందరు సాయి భక్తులు ఉండేవారు. వారు మాతో మీరు పుట్టపర్తి వస్తే సాయిని దగ్గరగా చూపిస్తాము అనేవారు.


మేము షిరిడీ సాయిని నమ్మేవారము. సత్యసాయి గురించి మాకు పెద్దగా తెలియదు.


మేము పుట్టపర్తి వెళ్ళలేకపోయాము. నాకు ఒకటిరెండుసార్లు సత్యసాయి కలలోకి రావటం కూడా జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది.

అప్పుడు అనిపించింది............... షిరిడీ సాయిని చూడలేదు.......పుట్టపర్తి సాయిని అయినా ఒక్కసారి చూడాలనిపించింది. ఎవరిలో ఏ మహత్తు ఉందో ఎవరికి తెలుసు. .............. అయ్యో ! ఒక్కసారన్నా చూడలేకపోయామే ! అని బాధ పడే పరిస్థితి రాకూడదు అనిపించింది.


తరువాత మేము చెన్నైకి మారినప్పుడు,............... లోకకల్యాణార్ధం జరిగిన ఒక యాగం సందర్భంగా సాయి చెన్నై రావటం జరిగింది.


మా ఇంట్లోవాళ్ళం యాగం చివరి రోజు తీరుబాటుగా .............. యాగం జరిగే దగ్గరకు వెళ్ళేసరికి యాగం పూర్తయ్యి సాయి అప్పుడే వెళ్ళిపోయారని తెలిసింది. ఎంతో నిరాశ కలిగింది.కొందరు సాయి మళ్ళీ కొంతసేపటిలో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొందరేమో వస్తారో......రారో చెప్పలేము వారిష్టం అన్నారు.


అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆశ నిరాశల మధ్య చాలా సేపు ఎదురు చూసి ..... ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేంతలో సాయి వస్తున్నారని వినిపించింది.


వారు వచ్చారు. కొంచెం దూరంగా చూడగలిగాము. వారి ఉపన్యాసం విన్నాము. మొత్తానికి ఒక్కసారన్నా చూడాలన్న నా కోరిక అలా తీరింది.


గొప్పవాళ్ళు చెప్పేమాటలు ఒకోసారి నర్మగర్భంగా ఉంటాయి. మనకు ఒక పట్టాన అర్ధం కావు.


షిర్డి సాయి తన నిర్యాణానికి కొద్ది రోజులముందు కొందరితో ఏం చెప్పారంటే.......... తాత్యా కోతే పాటీలు అనే తన ప్రియ భక్తుడు త్వరలో చనిపోతాడని చెప్పటం జరిగింది.


ఇది విన్నవారు భయపడ్డారు. అలాగే కొద్ది రోజులకు తాత్యాకు జబ్బు చేస్తుంది............ సాయిబాబా కూడా జబ్బు పడతారు..............


తాత్యా గురించి విషయం తెలిసిన వారు సాయిబాబా చెప్పిన మాట తప్పక జరుగుతుందని నమ్మి........... తాత్యాకు ఏం ప్రమాదం జరుగుతుందో అని భయపడతారు.


అయితే తాత్యా కోలుకుంటాడు............ బాబా మరణించటం జరుగుతుంది. తాత్యాను రక్షించి సాయి మరణించారని అందరూ అనుకోవటం జరుగుతుంది.


అలా పెద్దలు చెప్పే కొన్ని విషయాల వెనుక భావం మనకు అర్ధం కాదు.....కొన్ని విషయాలను వారు అలా నర్మగర్భంగా చెబుతారు.సత్యసాయి 96 సంవత్సరాలు వచ్చేవరకూ జీవించారని పండితులు చెబుతున్నారు.


ఎలాగంటే...........నక్షత్ర ఆవర్తన పధ్ధతిలో సంవత్సరానికి 324 రోజులట .......... 30,834 రోజులు జీవించిన సత్యసాయి నక్షత్ర ఆవర్తన పధ్ధతి ప్రకారం లెక్క వేస్తే .............. వారు చెప్పినట్లే 96 వ సంవత్సరం వచ్చినతరువాతే పరమపదించారట.


సత్యసాయి కొంతకాలం ముందునుంచీ ఆహారం తీసుకోవటం మానేసారని వార్తలు వస్తున్నాయి. దానిని బట్టి చూస్తే........ వారికి తన గురించి ముందే తెలుసని అనుకోవచ్చేమో !


సాయి యొక్క సర్వమత సమానత్వ భావన చాలా గొప్పది. అలాగే వారి సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుందాము.


ఈ పోస్ట్ కొంచెం హడావుడిగా రాయటం జరిగింది. తప్పులుంటే దయచేసి భగవంతుడు క్షమించాలని కోరుకుంటూ........
.

Monday, April 25, 2011

ప్రజల సొమ్ము దోచేవారికి............ప్రజలకు సేవ చేసినవారికి ఎంతో తేడా.......................

ప్రజలకు సహాయం చేసిన వారిని ఆ ప్రజలు ఎంతగా ఆరాధిస్తారో చూస్తూనే ఉన్నాము.

సత్యసాయి తమ జీవితంలో చూపించిన మహిమలను ఎందరో భక్తులు వివరిస్తున్నారు.

ఇంకా,... సత్యసాయిబాబా గారు ప్రపంచములోని ఎన్నో దేశాలలో సహాయకార్యక్రమాలు నిర్వహించారని తెలుస్తోంది .

ఒక కుటుంబంలోని కొద్ది మంది వ్యక్తులను సరిగ్గా నడిపించాలంటేనే చాలా కష్టం. ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం .అలాంటిది........... పెద్దమొత్తంలో .వచ్చిన విరాళాలను అన్ని దేశాలలో సేవా కార్యక్రమాలు నడిపిస్తూ ............ ఆ విధంగా సద్వినియోగం చేయటం సామాన్యమైన విషయం కాదు. .............. ఎంతో గొప్ప విషయం.


మరి ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా డబ్బు అవసరం కదా ! . ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలంటే ............... వారి దగ్గరున్న సొమ్మును దానికి సంబంధించిన వారు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఎందుకంటే, సేవా కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే ఉచితంగా విద్య, వైద్యం పొందుతున్న వారు బాధలు పడవలసి వస్తుంది .


రామకృష్ణపరమహంస, వివేకానంద లాంటివారు ఎందరో....... ప్రజలకు ఎంతో సహాయం చేశారు. మదర్ థెరెస్సా కూడా ప్రజలకు ఎంతో సహాయం చేశారు.


ఇంకా మహాత్మాగాంధీ, సుభాశ్ చంద్రబోస్, భగత్ సింగ్ ,
బాబా ఆమ్టే ............. ఇలాంటివారు కూడా ఎందరో ఉన్నారు. ఇంకా కొంతమంది............ తమ శక్తికొలది చిన్న పరిధిలో సేవ చేస్తున్నవారూ ఉన్నారు. వీరందరూ భగవంతుని దయకు పాత్రులు.


కానీ ...........

కొందరు అవినీతిపరులు ప్రజల సొమ్మును దోచి పది తరాలకు సరిపడా తమ సొంతానికి దాచుకుంటారు. వారికీ........వీరికీ ఎంత తేడా ?


అలా ప్రజలకు అన్యాయం చేసిన వారికి ఏం మిగులుతుంది ? శాశ్వత అపకీర్తి , ప్రజలు పెట్టే శాపాలూ తప్ప...


ఇలాంటి అవినీతిపరులను వారి స్వంత పిల్లలే అష్టకష్టాలు పెడతారు. ఇంకా ,........... తాము చేసిన పాపాలకు ఫలితంగా వారికి ........... చచ్చినతరువాత కూడా నరకం, నీచమైన పునర్జన్మ తప్పకపోవచ్చు.


దీనికన్నా ..కుటుంబానికి కొంతవరకు ( అవసరమైనంత, తగినంత , తాను ఎంతవరకు సంపాదిస్తే ధర్మమో అంతవరకు ) సంపాదించి తృప్తిపడి ఇక ...... చక్కగా ప్రజలకు మంచి చేస్తే ఎంతో పేరు, మానసిక తృప్తి లభిస్తాయి కదా !


ప్రపంచాన్ని పీడించి తమ సుఖం తాము చూసుకొనే వారు ప్రజల అభిమానానికి, భగవంతుని దయకు ............. దూరమయ్యే దురదృష్ట జీవులు. ఇటువంటి వారు కూడా మంచిమార్గం లోకి వచ్చి భగవంతుని కృపకు పాత్రులు అవాలని కోరుకుందాము...


ఏంటో ! అవినీతిపరులు మంచిగా మారాలంటే దేవుడే దిక్కు.

Friday, April 22, 2011

కోమాలోకి వెళ్ళినవారిని కొన్ని సంవత్సరాల వరకు జీవింపజేసే ..............

ఈ రోజు గుడ్ ఫ్రైడే .

పీ ఎస్ ఎల్ వీ విజయవంతమయినందుకు కారణమైన అందరికి శుభాకాంక్షలు .దీని ద్వారా ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు గదా !

ఇవాళ ధరిత్రీ దినోత్సవమట. మంచిది.


ఆధునిక సైన్స్ వల్ల లాభాలూ ఉన్నాయి. నష్టాలూ ఉన్నాయి.


వైద్యంలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేయటం లాభాలలో ఒకటి. ఇంకా, ఈ వెంటిలేటర్ చికిత్స సహాయంతో ఎంతకాలం ప్రాణాలు నిలుపుకోవచ్చో ............... ఆ వివరాలు నాకు అంతగా తెలియదు.


కోమాలోకి వెళ్ళినవారిని కొన్ని సంవత్సరాల వరకు జీవింపజేసే చికిత్సలు కూడా ఉన్నాయట. ( 10 సంవత్సరాలు కూడా జీవించి ఉంటారట కొందరు ).


అలాగే ఎవరికయినా సెలైన్ అందించి ప్రాణాన్ని కాపాడటం కూడా లాభాలలో ఒకటి.


వీటిని కనిపెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పాలి మనము. ఎందరివో ప్రాణాలు ఇలాంటి చికిత్సల వల్ల కాపాడబడ్డాయి.ఇక ఇవాళ ఎర్త్ డే అంటున్నారు గదా !

మనిషి అత్యాస వల్ల ధరిత్రి ఎంతగా నష్ట పోతున్నది అందరికీ తెలుసు.

ఉదా.......... మనిషి తన అవసరాలకు అత్యంత ప్రమాదకరమైన అణుశక్తిని వాడుకుంటున్నాడు. వీటినుంచి విడుదలయ్యే వ్యర్ధాలను ఏమి చెయ్యాలో........... ఇంతవరకు సరైన సమాధానం లేదు.


ఇక ఈ మధ్య జరిగిన జపాన్ ప్రమాదంలో అణు రియాక్టర్లనుంచీ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు జనం తరలిపోయారు.

మనుషులు కాబట్టి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు.


సరే ........మరి కోట్లాది ఇతరజీవులు, చెట్లు ...............వీటి గురించి ఎవరు ఆలోచించారు ?


అవి ఎక్కడికని వెళ్ళిపోగలవు ? మనుషుల స్వార్ధానికి అవి బలి అవ్వాల్సిందేనా ?


ఎంతసేపూ మనకు వైద్యం అవసరం............. విద్యుత్ అవసరం....... ఈ గోలే గానీ ఈ ధరిత్రి లోని ఇతర జీవులు మన ప్రయోగాల వల్ల ......... ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాయో , ఎంత బాధ పడుతున్నాయో మనకి పట్టదా ?


వాటికి మనలానే బాధలు ఉంటాయి. , వాటికీ వైద్యం, అవసరమే గదా ! ( విద్యుత్ అక్కరలేదు లెండి . మనం అలవాటు చేస్తే తప్ప........ )

ఈ ప్రపంచం మీద మనకు మాత్రమే హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాము.

మనిషికి వైద్యము, విద్యుత్తు వీటి కన్నా ముందు ............. ధరిత్రి భద్రంగా ఉంటేనే మనకు భద్రత ఉంటుందని మనమందరము గుర్తుంచుకోవాలి మరి. . ......Wednesday, April 20, 2011

దైవ భక్తులు ఇతరవిషయాల గురించి మాట్లాడకూడదా ?

పోస్ట్ తిరిగి ప్రచురిస్తున్నానండి.


ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారంటే.....

ఎవరైనా దైవభక్తులు , స్వాములు దేశంలో జరుగుతున్న.........అవినీతి, అన్యాయాలను గురించి మాట్లాడితే ....... వాళ్ళు, భక్తిగురించి తప్ప ఇతరవిషయాలు మాట్లాడటమే తప్పు ........... అన్నట్లు మాట్లాడుతున్నారు.


వారూ ఈ దేశ పౌరులే కదా ! అలాంటప్పుడు వారికీ మాట్లాడే హక్కు ఉంటుంది.


ఈ రోజుల్లో మతం పేరుతో ప్రజలను మోసం చేసే మోసగాళ్ళు ఉన్నమాట నిజమేకానీ .......... అందరూ అలా చెడ్డగా ఉండరు కదా..........


పూర్వం రాజులకు గురువులు ఉండేవారు ........ రాజ్యపాలనలో సలహాలను ఇవ్వటానికి. ఉదా... దేవతలకు ఏదైనా సమస్య వస్తే దేవేంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని సలహా అడగటం మనం గ్రంధాలలో చదువుకున్నాము.


దశరధులవారికి వశిష్టులవారు గురువుగా ఎన్నో సలహాలను ఇస్తుండేవారు.

ఇలా వారు రాజ్యరక్షణ విషయంలో, ప్రజల బాగోగుల విషయంలో రాజులకు సలహాలను ఇస్తుండేవారు. రాజులు అవి పాటించేవారు.


రాజులు కూడా తమకు అన్ని విషయములు తెలిసినా గురువులను గౌరవించేవారు. గురువులు కూడ వారికి తమ సహకారాన్ని అందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకునేవారు...


ఈ మధ్య కాలంలో చూస్తే........


విజయనగరసామ్రాజ్య స్థాపనలో శ్రీ విద్యారణ్య స్వాముల వారి పాత్ర ఎంత ముఖ్యమయినదో మనకు తెలిసినదే.


శ్రీ సమర్ధ రామదాసులవారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువుగా ఎన్నో సలహాలను ఇచ్చి ముందుకు నడిపించారు.ఇంతేకాదు,...............


మన పూర్వ ఋషులు, ఉపనిషత్ ద్రష్టలు దైవభక్తి వల్లనే ఎన్నో వైజ్ఞానిక విషయాలను కనుగొని ప్రపంచానికి అందించారు.


గణితశాస్త్రం, ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, అర్ధశాస్త్రం, జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలను ప్రపంచానికి అందించారు.

అప్పుడు అంత గొప్ప ఆధ్యాత్మికవాదులు ఉండేవారు.


ఈ రోజుల్లో కూడా దైవభక్తులైన శాస్త్రవేత్తలు ,
మరియు ఇతరులు ఎందరో ఉన్నారు.


ఇంకా,ప్రపంచంలోని సర్వమతప్రజలకోసం తాపత్రయపడే మహానుభావులు ఎందరో ఉన్నారు........," ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో మహా గురువులు ప్రపంచంలోని సర్వమతములకు చెందిన ప్రజల బాగోగులకోసం తాపత్రయపడటం స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా
,..........


శ్రీ రామకృష్ణులవారు.......వివేకానందులవారి గురించీ మనకు తెలుసు. శ్రీ రామకృష్ణమఠం వారు పేదవారికి ఎంతో సహాయం చేస్తున్నారు.

శ్రీ రామకృష్ణమఠం లో అన్ని మతముల
వారికి ప్రవేశం ఉంది.


ఎందుకంటే.......... పేర్లు, వేషభాషలు ఎన్ని రకాలుగా ఉన్నా ........... దైవం ఒక్కరే. ప్రపంచ మానవులందరూ వారి సంతానమే.


దైవభక్తులైన వారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అసలు ప్రతి మనిషికి దైవ భక్తి ఉండటం అవసరం.

అంతేగానీ దైవభక్తులైన వారిని .......... మీకు ఇతరవిషయాలు గురించి ఎందుకు ? అనటం తగనిపని...............
6 comments:

durgeswara said...

idi himdu dharmam ku sambamdhimchina guruvula patla maatrame lemdi. migataa mataalavaaru edi cheppinaa vimtaaru .

Rao S Lakkaraju said...

నా ఉద్దేశం లో ఓట్లు వేసే వాళ్ళందరికీ వాటి గురించి మాట్లాడే హక్కు వుండాలి.Religious or otherwise.

anrd said...

ధన్యవాదములండి.

anrd said...

ధన్యవాదములండి.

Lakshmi P. said...

ధన్యవాదములండి.

anrd said...

కృతజ్ఞతలండి.

Monday, April 18, 2011

అమర్నాధ్ యాత్రలో .................

ఓం.
శ్రీ సువర్చలా దేవీ సమేత
శ్రీ ఆంజనేయ స్వామికి ప్రణామములు.

మేము కొంతకాలం క్రిందట అమరనాధ్........వైష్ణవీ దేవి యాత్రలకు వెళ్ళాము కదండి.

అమరనాధ్ గుహ చేరేసరికి సాయంత్రం 6 అయినట్లు గుర్తు. తరువాత దైవ దర్శనం అయ్యేసరికి సాయంత్రం 7 గంటలు అలా అయినట్లు గుర్తు.


అదంతా ఒక అధ్బుత ప్రపంచం .......

ఇక రాత్రి ఏడు గంటలు దాటితే కొండ దిగటం కష్టమని ఆ రాత్రికి బస చేయటానికి ................ ఒక టెంట్ అద్దెకు మాట్లాడుకుని అక్కడే ఉన్నాము.


( కొంచెం ముందే దర్శనం అయ్యినవాళ్ళు తిరిగి వెళ్ళే దారిలో పంచతరణి, శేష్ నాగ్ దగ్గరకూడా బస చెయటానికి సౌకర్యాలు ఉన్నాయి. ).


సరే, మేము దర్శనం పూర్తయి తిరిగి వస్తుంటే ఒక దగ్గర గుంపు కనిపించింది.


ఏమిటా అని చూస్తే ఒక పెద్దామె తప్పిపోయారు. ఆమె తెలుగు వారు. ఆమెది కరీం నగర్ అట.ఆమె తాను తప్పిపోయిన సంగతి తెలుగులో చెబుతున్నారు, చుట్టూ ఉన్నవారు కొందరు తాము ఆమెకు సహాయం చేస్తామని చెబుతున్నారు.


మేము కూడా వెళ్ళి ఆమెను వివరాలు అడిగాము. ఆఖరికి ఆమెను మాతో పాటు మా టెంట్ కు తీసుకు వెళ్దామని అనుకున్నాము.

ఆమెను ఇంటికి ఎలా పంపాలో ఆమెను అడిగి ఆలోచిద్దామని ఆమెను తీసుకుని మా బసకు వస్తున్నాము.


అప్పటికే మాకు చాలా నీరసంగా ఉంది. ఏమైనా తిందామని దారిలో ఒక భండారా వద్దకు వెళ్ళాము.

అదృష్టవశాత్తు మేము వెళ్ళిన భండారాలోనే ఈమెతోపాటు వచ్చిన వాళ్ళు కూర్చుని ఉన్నారు.


వాళ్ళూ ఈమె ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్నారట. వాళ్ళు ఈమెను చూసేటప్పటికి సంతోషంగా ఎదురొచ్చారు.

మొత్తానికి అలా ఆమె తనవాళ్ళను కలుసుకున్నారు.

( ఈ భండారాల్లో యాత్రికులకు ఉచితంగా ఫలహారాలు ఏర్పాటు చేస్తారు. మనకు తోచిన డబ్బు ఇవ్వవచ్చు. )

అదలా ఉంచితే ఈ మామ్మగారు తప్పిపోయినప్పుడు ఆమెను వివరాలు అడుగుతున్నవారిని చూస్తే ఎంతో ముచ్చట వేసింది.


అందులో రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ళు, ఎన్నో భాషల వాళ్ళు ఉన్నారు.

అక్కడి ముస్లింస్ తాము వెళ్ళి మైకులో ఈమె పేరు వివరాలు అనౌన్స్ చేయిస్తామని చెప్పారు.

ఒక హిందీ అతను ఈమెను ఆమె ఊరిలో దింపి వస్తాను అన్నాడు. ఇంకా సైనికులు కూడా యాత్రీకులకు సహాయాన్ని అందిస్తున్నారు.

ఇదంతా చూశాక ఇలా మనుషులందరూ చక్కగా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా ! అనిపించింది.


ఈ అమరనాధ్ గుహకు చాలామంది నడిచి వెళ్తున్నారండి. కానీ మేము నడవలేకపోయాము. గుర్రాలు మాట్లాడుకున్నాము.


కానీ ఆ గుర్రాలు పాపం మమ్మల్ని మోస్తూ అలా నడవటం ................ వాటిని అంత కష్టపెట్టి మేము దైవదర్శనానికి వెళ్ళిరావటం .......... ఇదంతా నాకు నచ్చలేదండి. ఏం చేస్తాం. అదంతా అలా జరిగింది.


కొందరు కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో నడుస్తున్నారు. వాళ్ళను చూస్తే ఆశ్చర్యమనిపించింది. వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదో కదా అనిపించింది.


ఇక అమర్ నాధ్ గుహ అంటే ............ అదేమీ గుహలా ఇరుకుగా చీకటిగా ఉండదు. వెడల్పుగా రెండంతుస్తుల మేడ అంత ఎత్తుగా ఉంటుంది.


సొరంగంలోనుంచి లోపలికి వెళ్ళనవసరం లేదండి.. బయటే ఉంటుంది.

ఈ పరిసరాలన్నీ ఒక అధ్బుత దృశకావ్యం అని చెప్పుకోవచ్చు.

అయితే అక్కడ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లు కవర్లు , ఇంకా ఇలాంటివన్నీ పడవేస్తున్నారు. .

మరి తరువాత వాటిని ఏరివేస్తారేమో తెలియదు. అలా ఏరటం కష్టమయిన పని.

మొత్తానికి ఆ హిమాలయాలు ఎంతో ఎంతో బాగున్నాయి. ...................... దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి..
.

Friday, April 15, 2011

ఏ కష్టం వెనుక ఏ సుఖముందో ......ఏ శాపం వెనుక ఏ వరముందో .............. ఎవరికి తెలుసు ?


అనగనగా ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకు ఇష్టుడైన మంత్రిగారు ఒకరు ఉండేవారు.

ఆ మంత్రి గారికి ప్రతీదానికీ అంతా మనమంచికే అనటం........ అలవాటు.

రాజుగారికి వేట అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడయినా వేటకు వెళితే రాజుగారు మంత్రిగారిని కూడా తప్పనిసరిగా తీసుకు వెళ్ళేవారు.


అలా కాలం గడుస్తుండగా ఒకసారి ప్రమాదవశాత్తు రాజుగారి చేతివేలు తెగిపోయింది. వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తున్నారు.

ఈ సమయంలో మన మంత్రిగారు రాజుగారికి ధైర్యం చెప్పటం కోసం ..................... అంతా మన మంచికే జరిగింది, బాధపడకండి అనేశారు.

ఇంకేముంది రాజుగారికి ఒళ్ళు మండి వెంటనే మంత్రి గారిని కారాగారంలో పడవేయమని ఆజ్ఞాపించారు. అలాగే అమలుపరచారు భటులు.


కొంతకాలం గడిచి రాజుగారికి నయమయ్యాక వేటకు వెళ్ళాలని ఆయనకు బుధ్ధి పుట్టింది. కొంతమంది భటులను తీసుకుని వేటకు వెళ్ళారు.


ఈ సారి మంత్రిగారు రాలేదు. ( కారాగారంలో ఉన్నారు కదా ! )

రాజు గారి వేట అలా సాగుతుండగా ఇంతలో హటాత్తుగా కొందరు ఆటవికులు వారిని చుట్టుముట్టడం,................. ఆ పోరులో భటులు పారిపోవటం జరిగింది.


రాజుగారిని బందీగా తీసుకువెళ్ళారు ఆటవికులు. రాజుగారిని మరుసటి రోజు తమ కులదేవతకు బలి ఇవ్వాలని నిర్ణయిస్తారు.


జరుగుతున్న పరిణామాలకు రాజుగారు ఎంతో బాధపడతారు.


తెల్లవారాక రాజుగారిని బలికి సిధ్ధం చేయటానికి ఆటవికులు వస్తారు. అలా సిధ్ధం చేస్తూ ఉండగా వారు రాజుగారికి ఒక చేతి వేలు లేకపోవటాన్ని గమనిస్తారు.


ఇక వాళ్ళు రాజుగారిని బలి ఇవ్వటాన్ని ఆపేస్తారు.

కారణమేమిటంటే వారి ఆచారం ప్రకారం అవయవాల లోపం ఉన్నవారిని బలి ఇవ్వకూడదు.


అది వినగానే రాజుగారు పట్టరాని ఆనందముతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.


వెంటనే ఆయనకు అంతా మన మంచికే అనే మంత్రిగారి మాటలు గుర్తు వస్తాయి.

నిజమే కదా ! ఆ రోజు తన వేలుకు అలా ప్రమాదం జరగకపోతే ఈ ఆటవికులు తనను బలి ఇచ్చేవారు కదా ! అనుకుంటారు.


తరువాత తన రాజ్యానికి వెళ్ళిన వెంటనే మంత్రిని కారాగారం నుంచి విడిపించి ........... ఇలా అడుగుతాడు. ............

" సరే నాకు మంచే జరిగింది. మరి మీరు అనవసరంగా ఇన్నాళ్ళు కారాగారంలో ఉన్నారు కదా ! అందులో మంచి ఏమిటి ? " అని .

అప్పుడు ..........మంత్రి ఇలా చెబుతాడు.

" మహారాజా ! నన్ను మీరు కారాగారంలో ఉంచకపోతే నేను కూడా మీతో వేటకు వచ్చేవాడిని........... మీకు వేలు లేనందువల్ల విడిచిపెట్టిన ఆటవికులు ..............నన్ను బలి ఇచ్చేవారేమో !............ దేవుని దయవల్ల వేటకు వెళ్ళకపోవటం వల్ల నేను రక్షించబడ్డాను.......... అంతా మన మంచికే " అంటాడు మంత్రిగారు.


రాజు మంత్రికి ఎన్నో బహుమతులను ఇచ్చి సత్కరిస్తాడు. ఇదండీ కధ.


కధలో ఇలా చెప్పారు గదా అని .................. మన కళ్ళముందు ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అంతా మన మంచికే అని నిర్లిప్తంగా కూర్చోమని ఈ కధ ఉద్దేశం కాదండి.*సమస్య వచ్చినప్పుడు మన శాయశక్తులా చెయ్యగలిగినంతా చేసి............. ఇక దైవం పైన భారం వేసి ఏది ఎలా జరిగినా ........... అంతా మన మంచికే అని నిబ్బరంగా ఉండగలగాలి. అప్పుడు ........... మనశ్శాంతి....


*ఎంతో కష్టాన్ని కలిగించి శాపాలుగా అనిపించే కొన్ని సంఘటనలే.............ముందు జీవితంలో వరాలుగా మారే సందర్భాలు చాలా మందికి జీవితంలో జరుగుతూనే ఉంటాయి.


*ఏ కష్టం వెనుక ఏ సుఖముందో ......ఏ శాపం వెనుక ఏ వరముందో .............. ఎవరికి తెలుసు ?


*అందుకే కష్టాలను చూసి అతిగా భయపడకండి. ,................ దైవం పైన భారం వేసి నిజాయితీగా ముందుకు నడవండి. .... ఇలా చేసినప్పుడు , కాలక్రమేణా............ శాపాలు కూడా వరాలుగా మారుతాయని పెద్దలు చెబుతున్నారు.


Wednesday, April 13, 2011

సీతారాములు ... ఆదర్శదంపతులు. ...............

నేను గృహిణినండి. సరే, అది అలా ఉంచుదామండి.

కొందరు రామాయణం గురించి రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు.

రాములవారు అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజ్యాన్ని చూసుకోవటానికి దశరధులవారు ఉన్నారు కదా ! .........

సీతారామలక్ష్మణులు తాము రాజభోగాలు వదిలి అరణ్యాలలో కష్టాలు పడుతున్నా.............. అక్కడి ప్రజలను, మునులను పీడిస్తున్న రాక్షసులను సంహరించి ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించారు.


రావణాసురుడు ఇతర రాజులతో యుధ్ధాలు చేసి వారిని పీడించి దోచి తెచ్చిన సంపదతో తన లంకరాజ్యాన్ని అభివృధ్ధి చేసుకునేవాడు.

రావణాసురుని చంపటం ద్వారా అందరికీ అతడి పీడను వదిలించారు శ్రీ రాముల వారు.


ఇంకా రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అసలు సీతారాములు పడ్డ కష్టాలు ఎన్నెన్నో.......


.తెల్లవారితే పట్టాభిషేకం అనుకుంటే............దాని బదులు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయవలసి రావటం...........


అరణ్యవాసం ముగింపుకు వచ్చిందిలే అనుకుంటే ............అంతలోనే సీతాపహరణం జరగటం...........


సరే ,రావణవధ జరిగింది ,. సీతారాములు రాజ్యానికి తిరిగి వచ్చి......... ఇక అంతా సవ్యంగా ఉందిలే అనుకునేంతలో......కొందరు ప్రజల మాటలవల్ల సీతాదేవిని అరణ్యాలకు పంపవలసి రావటం...........


కొంతకాలానికి సీతాదేవిని, లవకుశులను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చూసిన తరువాత........ పిల్లలను చూసిన ఆనందములో రాములవారు ఉండగానే ...........సీతాదేవి భూమాతను ఆశ్రయించటం...........


ఇలా ఎన్నో ఆటు.........పోట్లు, ఆశ.......నిరాశలతో కూడిన జీవితం. నేటి సామాన్యులు సీతారాములు పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని తమ కష్టాలను ధైర్యంగా ఎదిరించటం నేర్చుకోవాలి.సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు. ............


ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.సీతమ్మవారిని అడవులకు పంపిన తరువాత రాములవారు ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా...............తాను రాజభోగాలకు దూరంగా సామాన్యంగా జీవించారు . ( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ .! .)............... ( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా అతి సామాన్యమైన తల్పంపైన శయనించటం లాంటివి.)ఇక సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది............


అగ్నిపరీక్షలో నెగ్గిన తరువాత సీతాదేవిని ఇంటికి తెచ్చుకున్నా కూడా ........ కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు. అందువల్ల సీతాదేవిని రాములవారు అడవికి పంపించటం జరిగింది.


ఇప్పుడు లవకుశులతో పాటు సీతాదేవి కూడా రాజ్యానికి తిరిగివస్తే,.............ఒకవేళ , మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే ..........అప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,............. ఆ ఇబ్బంది ఎదురుకాకుండా సీతమ్మవారు అలా త్యాగం చేసి ఉంటారు.


తన ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి.............. సీతమ్మది తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది.............. ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )


సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో రాములవారు అంతకన్నా త్యాగమూర్తి. ఇద్దరూ ఆదర్శ దంపతులు.


* కొంతకాలం ముందు రామాయణం గురించి వ్రాసిన టపా కూడా క్రింద జత పరుస్తున్నానండి...
..


పురాణములలో ఉన్నది అధర్మం కాదు......అంతటా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి ఆరవ భాగం...........
ఓం, శ్రీ మహా విష్ణువుకు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి బ్రహ్మ దేవునికి సకల దేవతలకు నమస్కారములు.


ఇప్పుడు సీతారాముల కధలోని విషయములు కొన్ని చెప్పుకుందామండి. రామాయణం లోని పాత్రలు, వారి అవతార విశేషాలు, వారి పూర్వ కర్మ విశేషములు, శాపములు ఇవన్నీ చాలా పెద్ద కధ . ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని పెద్దలు చెబుతున్నారు కదండి. అదంతా పెద్ద కధ.
ఇక్కడ మనం సీతమ్మ వారి అగ్ని పరీక్ష, రాములువారు ఆమెను అడవులకు పంపించటం ఇదంతా అధర్మం అని కొంతమంది అంటుంటారు కదా ఆ విషయం గురించి నాకు తెలిసిన అభిప్రాయములు చెప్పుకుంటానండి ..ఇంతకుముందు హరిశ్చంద్రుల వారి కధలో చెప్పుకున్నట్లు వారు తమ ప్రజలకు ధర్మం యొక్క విలువను తెలుపుటకు తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు , శ్రీ మహావిష్ణువు లోకపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి.... లోకంలోని ప్రజలను అధర్మం నుండి రక్షించుటకు ఎన్నో అవతారములు ధరించి ,ఎన్నో కష్టములు సహించి లోకములను రక్షించారు. అందుకోసం మత్స్యావతారం, కూర్మావతారం వంటి అవతారములను కూడా ధరించారు. శ్రీ రామావతారములో శ్రీ లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవితో కలసి ఎన్నో కష్టములను అనుభవించి లోకులని రాక్షసులు బారి నుండి కాపాడారు. సీతారాములు ఆదర్శ దంపతులు.
రాములువారు ఏమి తప్పు చేశారు? తన భార్య కష్టముల పాలైనప్పుడు ఆమెకోసం ఎంతో ఆరాటపడి, రక్షించుకున్న మంచి భర్త. ఆ సందర్భములో ఎంతోమంది రాక్షసులను కూడా సం హరించారు.. రాములవారికి తాను విష్ణుమూర్తి అవతారమని తెలుసు. సీతమ్మ వారి జాడ తెలియని సందర్భములో ఆమె కోసం ఎంతో విలపించారు. దేవతలకు కూడా సుఖః, దుఃఖములు ఉంటాయి కదా!


ఇక సీతమ్మవారి అగ్ని పరీక్ష గురించి అంటే రాముల వారికి తమ అవతార రహస్యం గురించి తెలుసునట. సీతమ్మ మహాసాధ్వి అనీ తెలుసు. ఆమెకు ఏమీ కాదనీ తెలుసు. అందుకే అలా చేసిఉంటారు. లోకుల సంగతి ఆయనకు ముందే తెలుసు.ఈ కలికాలంలోనే దైవభక్తి కలవారు ఎంతో మంది , ధ్యానం, తపస్సు, యోగా చేసేవారు ఎన్నో మహత్తులు చూపిస్తున్నారు. ఒక యోగి ఆత్మకధలో ఎంతో మంది ఈ నాటి యోగుల గురించిన ఎన్నో మహత్యములను గురించి తెలుసుకున్నాము. మరి సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారమయిన సీతమ్మ వారికి అగ్నిపరీక్ష వల్ల ఏ ఆపదా రాదని రాముల వారికి తెలుసు.
శ్రీ షిరిడి సాయిబాబా వారి కధలో కూడా ఆయనకు ఖండ యోగం అనే మహాధ్భుత విద్య తెలుసునని చెప్పబడింది. అంటే ఖండయోగమనగా శరీరావయవములన్నియు విడదీసి తిరిగి కలుపుట. ఇలాంటి మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్, టి.వి ఇలాంటివి తెలియని మారుమూల తెగల ప్రజలకు వాటి గురించి చెబితే అస్సలు నమ్మరు. అలాగే ఇవి కూడా.మనకు తెలియక వాటి గురించి నమ్మలేకపోతున్నాము.

సరే అలా సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడండి.........వారిని ఒక పామరుడు తప్పుపట్టాడు. ఇది ఏమి న్యాయము? ఇలాంటి కొంతమంది గురించి ఆలోచించే రాముల వారు సీతమ్మవారి అగ్నిపరీక్షకు ఒప్పుకుని ఉంటారు.
.సీతమ్మవారు కూడా మరి తాను వనవాసం చెయ్యవలసిన అవసరం లేకపోయినా రాజభోగాలు అన్నీవదలి భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. కష్టాలు అనుభవించారు. ఆమె ఎంతో ఉత్తమ ఇల్లాలు.* ఇక సీతమ్మను అడవులకు పంపించటం. ......... ఇక్కడ గమనించవలసినది ఏమంటే ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు. అప్పటి పాలకులు చాలా సెన్సిటివ్ గా ఉండేవారు మరి.
*ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...
అసలు అప్పుడు కూడా రాములవారు ఆమె గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారంట. వాల్మీకి మహర్షి వద్ద ఆమె సురక్షితముగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశారట. అడవులకు పంపించటానికి ముందే వ్యాసులవారికి ఈ విషయం రాములు వారు తెలిపారట. అప్పట్లో ఒకరితో ఒకరు మనసు ద్వారా విషయములు తెలుసుకోవటం అనేవి ఉండేవంట. తపశ్శక్తి ద్వారా ఇది సాధ్యమట. ఇప్పుడు టెలిపతి అనే దానికి దగ్గరగా అర్ధం వస్తుందేమో. ...... సరే ముందే విషయం తెలియటం వల్ల వాల్మీకి మహర్షి వచ్చి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్ళారని పెద్దలు చెబుతున్నారు.

రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి. సీతారాములు ఆదర్శ దంపతులు. .
ఆ భగవంతుని దయ. .....

Monday, April 11, 2011

జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అసలు ఇదంతా ఎందుకో ?

మనకు ఒకోసారి ఏమనిపిస్తుందంటే , జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అసలు ఇదంతా ఎందుకో ? అని .

* అయితే ఇదంతా ఎందుకో భగవంతునికి మాత్రమే తెలుస్తుంది.

అయితే మనం ఇలా కూడా అనుకోవచ్చేమో !

ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాలా మంది పిల్లలున్నారట. వాళ్ళకు వేసవి సెలవులు వచ్చాయి.


పిల్లలూ అందరూ ఆట స్థలానికి వెళ్ళి ఆడుకోవాలనుకుని ఇంటి పెద్ద అయిన తాత గారు, బామ్మ గారిని పర్మిషన్ అడుగుతారు. వారు సరేనని పంపిస్తారు.


ఆటలంటే గెలుపుఓటములుంటాయి. ఓడిపోయిన వారికి బాధ,........గెలిచిన వారికి సంతోషం కలగటం సహజమే కదా !

ఇంకా , ఆటలలో అనుకోకుండా దెబ్బలు కూడా తగలవచ్చు.

ఆటలలోని ఈ కష్టసుఖాలన్నీ ముందే తెలిసినా పిల్లలు ఆటలు ఆడుకోవటానికే ఇష్టపడతారు.

కొందరు పిల్లలు కొంచెం సేపు ఆడుకుని విసుగొచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు.

సాయంత్రం అయ్యేసరికి పిల్లలను తీసుకుని వెళ్ళటానికి తాతగారు వస్తారు. పిల్లలను బుజ్జగించి ఇంటికి తీసుకువెళ్తారు.


ఇంటికి రానని మారాము చేసే పిల్లలను ఒక చిన్న దెబ్బ వేసయినా ఇంటికి తీసుకు వెళ్తారు.


* ఎందుకంటే ఎప్పటికీ ఆటస్థలంలోనే ఉండిపోవటం పధ్ధతి కాదు కదా ! ఇంటికి తిరిగి వెళ్ళటమే పధ్ధతి.


* అలాగే మనమందరము మన ఇల్లు అయిన ........ పరమాత్మ ( జగన్మాతా పితరుల ) ఇంటినుంచి ఈ లోకమనే ఆట స్థలానికి వచ్చాము.


ఇక్కడా గెలుపు..ఓటములు , కష్టసుఖాలూ ఉంటాయి.

ఈ జీవితమనే ఆటలో చెంప దెబ్బలూ పడవచ్చు. . పూలదండలూ
పడవచ్చు. .* అయితే ఎప్పటికయినా అందరమూ తిరిగి మన ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళమే. ( అదే మోక్షమేమో ! )


మనం దాని గురించి మరిచి పోతే భగవంతుడు గుర్తు చేస్తూ ఉంటారు.


ఎందుకంటే ఇల్లే అందరికీ భద్రమైన ప్రదేశం.

* ఏ చిన్న కష్టమూ సోకని పరమానంద స్థానం .............. మన పరమాత్మ ఇల్లు.


* ( క్రమముగా నాలుగు రకాలైన మోక్షాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. ).
...

.ఏదో తోచింది వ్రాశానండి. తప్పులున్నచో దైవం క్షమించాలని కోరుకుంటూ.........

Friday, April 8, 2011

కొంతమంది వృధ్ధులు కాదు ..... ఎప్పటికీ యువకులే.......( అన్నా హజారే లాంటివాళ్ళు )


మొత్తానికి అవినీతిని గురించి బాధపడుతూ నిట్టూర్చటంతో ఊరుకోకుండా అన్నాహజారే గారు .......... ప్రజలను నిర్లిప్తత నుంచి కదిలించారు.

దేశంలో పరిస్థితులు ఇలా తయారు కావటానికి ప్రజలు కూడా కొంతవరకూ కారణమే.

ఎన్నికలు వస్తే .......... నోట్ల కోసం ఎదురుచూసే పామర ప్రజలు కొందరు..........., ఫ్రీ........ఫ్రీ.....ఫ్రీ... అంటూ వినవచ్చే .గిఫ్టుల కొరకు ఆశపడి ఓట్లు వేసే ప్రజలు కొందరు.................
ఎన్నికల రోజు ఓటు వెయ్యటానికి బధ్ధకించి......... టి.వి చూస్తూ ........ దేశం పాడైపోతోందని కామెంట్స్ చేస్తూ గడిపేసే ప్రజలు కొందరు........... .

ఇలా ఉంటే........ దేశం ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది ?


ఎన్నికలలో నిలబడ్డవారు తాము గెలిస్తే ఏ అభివృధ్ధి పధకాలు ప్రవేశపెడతామో ప్రజలకు చెప్పుకోవాలి గానీ ............... ప్రజలకు ఫ్రీ గిఫ్టులు ఇస్తామనటం లంచము ఇవ్వటము లాంటిదే కాదా ?..


అయితే అన్నా హజారే గారు ఈ వయస్సులో దీక్ష చేయటం బాధను కలిగిస్తున్నా .......... ప్రజలలో కొంచెము కదలిక వచ్చింది.


ఈ కదలిక తాత్కాలికం కాకుండా........ జన లోక్ పాల్ బిల్లు అమలు లోకి రావాలని........వచ్చిన తరువాత పకడ్బందీగా అమలు కావాలని .......... మనస్పూర్తిగా అందరమూ కోరుకుందాము.


అంతే కాదు ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే బిల్ కూడా రావాలి.

ఇంకా............ ప్రజలలో నైతిక విలువలు పెరగనప్పుడు చట్టాలు ఎన్ని ఉన్నా అంత ప్రయోజనం కనబడదు.


జనం సినిమాలకు, క్రికెట్ కు, సీరియల్స్ చూడటానికి , ఇలా ఇంకా కొన్ని విషయాలకు ఇవ్వవలసినదానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు............... అందువల్ల జనం దారి జనానిది............దేశాన్ని దోచుకునే వారి దారి........ వారిది అయిపోయింది.


ప్రజలు సమాజం గురించి కూడా కొంచెం సీరియస్ గా పట్టించుకుంటే పరిస్థితులు ఇంతవరకూ రావు.


మొత్తానికి........ ఏదో పెద్దాయన పాపం దీక్ష చేసుకుంటున్నాడు ............ మనమేమి చేయగలంలే అని జనం ఎప్పటిలా నిర్లిప్తంగా ఉండకుండా ............. ఇంతలా కదిలివచ్చినందుకు ప్రజలను నిజంగా అభినందించి తీరాలి. .

మీడియా వాళ్ళను కూడా అభినందించాలి.


అవినీతిపరులు లాంటి వాళ్ళు కూడా ఆలోచిచాల్సిన విషయమేమిటంటే ........... వారు ఇక్కడ న్యాయస్థానాలలో తప్పించుకున్నా.............దైవమనే న్యాయస్థానంలో ఎప్పటికీ తప్పించుకోలేరు.


కొంతకాలం క్రితం అవినీతి గురించి ఒక సినిమా వచ్చిందండి. ............. అందులో అవినీతి, లంచాలకు పాల్పడిన వారిని వారి పిల్లలే మంచిగా మార్చుతారు. ............ అలా నేటి యువతరం చైతన్యవంతులై సమసమాజాన్ని స్థాపించాలి..

ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి.....

Wednesday, April 6, 2011

మూడు చేపల కధ లా .............మనుషుల ఆలోచనా విధానాలు.


ఒక గ్రామంలో నీరు సమృధ్ధిగా ఉన్న ఒక చిన్న చెరువు ఉండేది. అందులో మూడు చేపలు కూడా నివసించేవి. అవి స్నేహంగా ఉండేవి.


ఇలా ఉండగా వేసవి కాలం సమీపించింది. ఎండలకు చెరువులో నీరు క్రమంగా తగ్గసాగింది.

ఒక రోజు కొందరు వ్యక్తులు వచ్చి, చెరువును పరిశీలించి .............. మరి కొన్ని రోజులు గడిస్తే నీరు మరింత తగ్గుతుందనీ...............అప్పుడు చేపలు పడితే బోలెడంత లాభం వస్తుందని చెప్పుకుని ............ మరికొన్ని రోజులు పోయాక వద్దామని అనుకుని వెళ్ళిపోతారు.


మాటలన్నీ మొదటి చేప విన్నది. దానికి పరిస్థితి అర్ధమయ్యింది.

అక్కడే ఉంటే ప్రమాదమని భావించి మిగతా రెండు చేపలను పిలిచి విషయం చెప్పింది.

చెరువుకు కొన్ని చిన్న కాలువలు ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తే ఇంకో పెద్ద చెరువుకు చేరుకోవచ్చు.


*అలా వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామని మొదటి చేప మిగతా రెండు చేపలకు చెబుతుంది.............. అయితే మిగతా రెండు చేపలు విషయాన్ని సీరియస్ గా తీసుకోవు.


*ఇదంతా విని రెండవ చేప........ ఏమంటుందంటే ....... పరిస్థితి అంతదాకా వస్తే అప్పుడు చూసుకుందాములే అని వెళ్ళిపోతుంది.

*మూడో చేప.......... జాలరి వాళ్ళు మళ్ళీ రారు. ఇదంతా అనవసర భయం......... అంతా చాదస్తం అని విసుక్కుని కులాసాగా తిరగటానికి వెళ్ళిపోతుంది.


*ఇక చేసేదేమీ లేక మొదటి చేప.......... కాలువల ద్వారా బయలుదేరి పెద్ద చెరువుకు వెళ్ళిపోతుంది.


ఎందుకంటే ఆలస్యం చేస్తే ఎండలు పెరిగి కాలువలు కూడా ఎండిపోతే పెద్ద చెరువుకి వెళ్ళటానికి దారి మూసుకుపోతుంది కాబట్టి.


కొన్ని రోజులు పోయాక జాలరి వాళ్ళు వచ్చి వలలు వేసి చేపలను పట్టుకుంటారు. రెండు చేపలు కూడా వలలో చిక్కుతాయి.

జాలరులు చేపలను వలలో నుంచి తీసి ఒడ్డున వేస్తుంటారు.

రెండో చేప........... అప్పటికఫ్పుడు ఆలోచించి చచ్చిన దానిలా కదలకుండా ఒడ్డున పడిఉంటుంది.

జాలరులు చేప చనిపోయిందని భావించి ........ ఇక ఎక్కడికి పోతుందిలే అనుకుని దానిని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు రెండో చేప నెమ్మదిగా నీటిలోకి జారిపోతుంది.


* చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా రెండవ చేప.......... అప్పటికి తప్పించుకుంటుంది.

అయితే ఇంకోసారి జాలర్లు వస్తే మాత్రం దాని పరిస్థితి చెప్పలేము. ఇప్పుడు అది ఏమనుకుంటుందంటే ..............మొదటి చేప చెప్పినట్లు విని తాను కూడా ముందే పెద్ద చెరువుకి వెళ్ళిపోతే ఎంతో బాగుండేది కదా ! అని బాధపడుతుంది.


ఇప్పుడు వెళ్ళటానికి దానికి దారి లేదు. ఎందుకంటే పెద్ద చెరువుకి వెళ్ళే కాలువల్లో నీళ్ళు ఎండిపోయాయి.


ఇక మూడో చేప వలలో పడ్డాక ఏమి చేయాలో తెలియక ప్రాణ భయంతో ఎగిరెగిరి పడుతుంటే జాలరులు కర్రతో ఒక దెబ్బ వేసి దానిని చంపేస్తారు.

*పాపం మూడో చేప ........... కధ అలా అర్ధంతరంగా ముగిసిపోయింది.


మనుషులలో కూడా ఇలా రకరకాల స్వభావాల వాళ్ళు ఉంటారు.

*ఒకోసారి ఒకే మనిషిలో............ మూడు చేపల స్వభావాలు కూడా ఉండొచ్చు.


అంటే ఒక విషయములో ఎంతో ముందు చూపుతో తెలివిగా ప్రవర్తించిన వ్యక్తే ......... ఇంకో విషయములో తెలివితక్కువగా ప్రవర్తించవచ్చు.


ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. అలా జరగటాన్ని తలరాతగా చెప్పుకోవచ్చేమో !


*అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ సరిగ్గా సాగాలని దైవాన్ని ప్రార్ధించాలి...( కధ గుర్తుంది గానీ చేపల పేర్లు అవి సరిగ్గా గుర్తు లేవండి. ఎప్పుడో చదివిన కధ..... .మొదటి చేప పేరు,.........దీర్ఘదర్శనుడు, రెండవ దాని పేరు.....ప్రాప్తకాలజ్ఞుడు ఇలా ఏవో పేర్లున్నాయండి..)..