koodali

Tuesday, September 29, 2015

సతీసహగమనం..పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు..  కానీ,  .ఇలాంటివి   సమాజంలో  వ్యాపించటానికి  కారణం  ప్రజలే.....


ఒకరిని  చూసి  ఒకరు  అనుకరించే  ప్రజల  ప్రవృత్తే.పూర్వం  రాజుల  కాలంలో  శత్రురాజుల   దండయాత్రల  వల్ల,     రాజు,  రాజ్యం  శత్రురాజుల  అధీనంలోకి    వెళ్ళినప్పుడు   రాణి  మొదలైన  స్త్రీలు  ,     శత్రు  రాజుల  చేతికి  చిక్కకుండా   తామే  ఆత్మార్పణం  చేసుకునేవారు.  భర్త  చనిపోతే   తట్టుకోలేని   కొందరు  స్త్రీలు తమకు  తామే  సహగమనం   చేసేవారు.


 భర్త  పోయిన  స్త్రీల  జీవితం  కష్టంగా  ఉంటుందని  భావించిన  కొందరు  స్త్రీలు  కూడా  తమకు  తామే  సహగమనం   చేసేవారు.ఇలా  కొందరు  తమ  ఇష్టపూర్వకంగా  సహగమనం  చేయటం  వల్ల,  ఇక  కాలక్రమేణా  అది  ఒక  ఆచారంగా  మొదలయి  ఉంటుంది.  అంతేకానీ  భర్త    పోయిన  స్త్రీలందరూ  సహగమనం  చేయాలని  పెద్దలు   చెప్పరు  కదా  !పెద్దలు  ఇలాంటి  సతీసహగమనం  వంటి  ఆచారాలను  ప్రోత్సహించలేదు  .


* ఉదా   ......రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !* భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చెయ్యలేదు.


* తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం చెయ్యలేదు కదా!* అంటే ,  ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.* పాండురాజు  చనిపోవటానికి  తానూ  కారణమని  భావించిన  మాద్రి    తన  ఇష్టంతోనే  సహగమనం   చేసింది.  ...(..తన  సంతానమైన  నకుల,  సహదేవుల  సంరక్షణను    కుంతీదేవికి  అప్పగించి ..... )


ఇలా ....మరి  కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ,.............ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.


 .........................................


ఇతరులను   గుడ్డిగా  అనుకరించటం  గురించి  పెద్దలు  ఒక  కధ  చెబుతారు..


ఒక  సాధువు  నదిలో  స్నానం  చేయటానికి  వచ్చి  , నది  ఒడ్డున  ఒక  చిన్న  గొయ్యి  తవ్వి  తన  కమండలాన్ని  అందులో  దాచి  పెడతాడు. ( భద్రత   కోసం.  ) దాచిపెట్టిన  ప్రదేశానికి    గుర్తుగా  దాని  పైన  ఇసుకను  గోపురం  ఆకారంలో  కుప్పగా  పోసి  స్నానానికి  నదిలోకి  వెళ్తాడు.  ఇదంతా  దూరం  నుంచి  చూసిన  భక్తులు  కొందరు ,  సాధువు  చేసినట్లు  ఇసుకను  గోపురం  ఆకారంలో  తయారుచేస్తే  పుణ్యం  వస్తుందని  భావించి,   తామూ  అలా  చేయటం  మొదలుపెడతారు, 


 (  సాధువు   అలా  ఎందుకు  చేసారో  అసలు  విషయం   వాళ్ళకు  తెలియదు.  ) ఇలా  ఒకరిని  చూసి  ఒకరు     చేయటం  వల్ల  , నది  ఒడ్డున   చాలా  ఇసుక  గోపురాలు  తయారవుతాయి.  సాధువు  స్నానం  చేసి  ఒడ్డుకు  తిరిగి  వచ్చి  తన  కమండలం  కోసం  చూసేసరికి , ఇంకేముంది.... ఎన్నో  గోపురాలు  కనిపిస్తాయి.   ఆలోచించగా..... ఆయనకు  విషయం  అర్ధమయి ,  ఇక   చేసేదేమీ  లేక  కమండలం లేకుండానే   ఉత్తచేతులతో  తిరిగి  వెళతారు. 


  సాధువు   తన  కమండలం   యొక్క   భద్రత   కొరకు   గోపురం  చేస్తే  , ఆ  విషయం   తెలియని  మిగతావారు    అనుసరించినట్లుగా......  కొన్ని  విపరీత  ఆచారాలు  కూడా   పెద్దలు  ఏర్పరిచినవి  కాదు.  వాటికవే  సమాజంలో  మొదలయ్యి  మూఢాచారాలుగా  పాతుకుపోయి  ఉండవచ్చు..   


దురాచారాలు  పెరగటానికి      కారణం  ప్రజలయితే,  ఇలాంటి   దురాచారాలను   పెట్టారని    ప్రాచీనులను  ఆడిపోసుకుంటారు.

Wednesday, September 23, 2015

మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి .....మూడవ భాగం..

కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 
......................

వాళ్ళ అభిప్రాయం..

ప్రాచీనులు కొందరు స్త్రీలను గురించి పరుషంగా వ్యాఖ్యానించారని అంటున్నారు.


 సమాజంలో అందరు స్త్రీలూ చెడ్దవాళ్ళని ప్రాచీనుల అభిప్రాయం కాదు.


అయితే , సమాజంలో చెడ్డగా ప్రవర్తించే స్త్రీలు కూడా  ఉన్నారు. ఈ రోజుల్లో  గమనించితే,  కొందరు స్త్రీల ప్రవర్తన  జుగుప్సాకరంగా ఉంటోంది. 


వివాహేతర సంబంధాలు ఉంటే తప్పేమిటని  ప్రశ్నిస్తున్న స్త్రీలు ఎందరో ఇప్పటి సమాజంలో ఉన్నారు. పరపురుషుని కోసం కన్నబిడ్దలనే కష్టాలు పెడుతున్న తల్లుల గురించి కూడా  వింటున్నాము.


 సమాజంలో ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నప్పుడు ...స్త్రీల గురించి ఏదో అనేసారని గోలపెట్టటం ఎందుకు. 


...................


వాళ్ళ అభిప్రాయాలు..చెడ్డగా ప్రవర్తించటంలో దుర్యోధనుడి  తప్పేముంది ? అని అంటున్నారు.


 నా అభిప్రాయాలు...దుర్యోధనుడు రాజ్యం మొత్తం తనకే కావాలనే అత్యాశతో పాండవులను ఎన్నో విధాలుగా కష్టపెట్టాడు. ఆఖరికి తనే నాశనం అయిపోయాడు. దుర్యోధనుడి పాత్ర నుంచి మనం  ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అత్యాశ, స్వార్ధం ఉండకూడదని నేర్చుకోవచ్చు.నేర్చుకునే విషయాలను గురించి వదిలేసి,  అలా  దురుసుగా  ప్రవర్తించటంలో  దుర్యోధనుడి తప్పేముంది ? అని వాదించటాన్ని వితండవాదం అంటారు.వాళ్ళ వాదన ప్రకారం చూసినా దుర్యోధనుడి పాత్ర  చెడ్డ పాత్రే. 


ఉదా.. సినిమాలో విలన్ పాత్ర  చేసిన చెడ్డపనులను చూసిన ప్రేక్షకులు  ఆ విలన్ ను తిట్టిపోయటం సహజమే కదా ! ఆ విధంగా చూసినా  దుర్యోధనుడిపాత్రను తిట్టడంలో తప్పేమీ లేదు.

.................

వాళ్ళ అభిప్రాయం..  మాయాజూదం ఆడి పాండవులను అడవులపాలు చేశారని  కౌరవుల మీద చాలామందికి వ్యతిరేకత ఉంటుంది.  ‘‘(జూదంలో) ధర్మరాజే  గెలిస్తే , అప్పుడు కౌరవుల రాజ్యం ధర్మరాజుకి రావలసిందే కదా? అప్పుడు కౌరవులైనా అడవికి పోవలసిందే కదా?’’నా అభిప్రాయం..కౌరవులు ఆడింది మాయాజూదం. శకుని ఇష్టప్రకారం పడే పాచికలతో ఆడిన ఆట అది.


 ఇలాంటి మోసపూరితమైన జూదంలో కౌరవులు ఓడిపోవటం, అడవులకు వెళ్ళటం జరిగేపనికాదు.

.............
  
 వాళ్ళ అభిప్రాయాలు.. ధర్మరాజు మహాప్రస్థానంలో ఇంద్రుడు ఎదురొచ్చాడు. ముందు నిలిచాడు.. ధర్మరాజు ఆగిపోయి ఇంద్రుడికి నమస్కరించాడు. .. భార్యనీ, నలుగురు తమ్ముల్నీ ( నేలమీద పడిపోయినా వెనుదిరిగి) చూడకుండా నడిచిపోయినవాడు ఇంద్రుణ్ణి చూడకుండా వెళ్ళిపోతూవుండాలి. కానీ ఆగిపోయాడు!’’ 


నా అభిప్రాయం...ధర్మరాజు... భార్య, నలుగురు తమ్ముళ్ళు పడిపోయి మరణించిన తరువాత వాళ్ళను వదిలివెళ్ళాడు.


 దేవతల రాజైన ఇంద్రుడు ఎదురుపడితే ఆగటంలో తప్పేముంది ? 


ఇంద్రునితో స్వర్గానికి వెళ్ళిన తరువాత తన తమ్ముళ్ళు, భార్య కొరకు  ధర్మరాజు పడిన తాపత్రయం  గురించి కూడా  తెలుసుకుంటే  ధర్మరాజు వాళ్ళ గురించి ఎంత ఆలోచించాడో తెలుస్తుంది. 


తన వాళ్ళకు లభించని స్వర్గం తనకూ వద్దన్నన్నాడు  ధర్మరాజు. అలా తరువాత చాలా విషయాలు జరిగాయి.


 అదంతా వదిలేసి ధర్మరాజు తమ్ముళ్ళను, భార్యను వదిలి వెళ్ళిపోయాడని అభాండాలు వేయటం అన్యాయం.


................


 వాళ్ళ అభిప్రాయాలు.. కృష్ణుడు, ఏ కర్మ చేసినా ‘ఫలితాల మీద దృష్టి పెట్టవద్దు’ అన్నాడు కదా? అలాంటప్పుడు ఈ ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  ఎందుకు? ఈ కవి కృష్ణుడి బోధన పట్టించుకోలేదు. కృష్ణుణ్ణి సృష్టించి ఆ పాత్రతో అలా చెప్పించింది కవే.  ఆ కవే ఫల శ్రుతి చెప్పాడంటే... తను రాసినదాన్ని తనే పట్టించుకోలేదని అర్థం.నా అభిప్రాయం..అందరూ  వెంటనే  స్థితప్రజ్ఞులు కాలేరు. అలాంటివారికి  ఈ విధమైన  ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  తెలియజేస్తే ఆ ఆశతో అయినా మహాభారతం  గురించి చదవటం లేదా వినటం చేస్తారు. తద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని క్రమంగా స్థితప్రజ్ఞులయ్యే అవకాశముంది..


( స్థితప్రజ్ఞులవటానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. )
మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి ....రెండవ భాగం..కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 

..............

వాళ్ళ అభిప్రాయం..కురుక్షేత్ర యుద్ధం తర్వాత :  ధర్మరాజు , మొత్తం కౌరవ-పాండవ రాజ్యాలకు మహారాజు అయ్యాడు. వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?


నా అభిప్రాయం..ధృతరాష్ట్రుడు నేత్రహీనుడు కావటం వల్ల , పాండురాజు రాజ్యం బాగోగులు చూసుకుని రాజ్యాన్ని అభివృద్ధి చేసాడు. ( నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు... అని ధృతరాష్ట్రుడే చెప్పటం జరిగింది.)తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం  చేసాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు....ఆ విధంగా పాండవులు  రాజ్యాన్ని విస్తరించారు. పాండవుల శ్రమతో కూడా  పెరిగిన రాజ్యం మొత్తం తనకే కావాలని దుర్యోధనుడు  కోరుకోవటం అత్యాశే కదా !


.............................

ధృతరాష్ట్రుడు  కౌరవులకు తండ్రి. భారతయుద్ధంలో కౌరవులు ఓడిపోయిన తరువాత  కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా ఓడిపోయినట్లే కదా ! అతి మంచితనానికి పోయి పాండవులు రాజ్యం మొత్తాన్నీ ధృతరాష్ట్రునికి ఇవ్వాలనటం ఏం న్యాయం ?అయినా, వృద్ధుడైన ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఎలా పాలించగలడు ? అతిమంచితనంతో రాజ్యాన్ని ధృతరాష్ట్రునికి ఇచ్చి మళ్ళీ కొత్త సమస్యలు  తెచ్చుకోవటం కన్నా, సమర్ధులైన పాండవులు రాజ్యాన్ని  చేపట్టటం  ప్రజలకు కూడా  శ్రేయస్కరం కదా !  ప్రజలకు స్థిరమయిన పాలనను ఇవ్వటం కూడా అవసరమే. స్థిరమయిన పాలన అందివ్వటం కోసం పాండవులు మొత్తం రాజ్యాన్ని పాలించటమే సరైనది. 


............................


అధికారాన్ని చేపట్టేవిషయంలో ఎన్నో రకాలు ఉన్నాయి.


 జ్యేష్ఠునికి పట్టాభిషేకం చేసి తమ్ముళ్ళు సహకారాన్ని అందించటం, ఉన్న రాజ్యాన్ని అన్నదమ్ములు భాగాలు చేసుకుని ఎవరి రాజ్యాన్ని వారు పాలించుకోవటం,  ప్రజల ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోవటం, యుద్ధంలో ఎవరు గెలిస్తే వారే పాలకులవటం..ఇలా ఎన్నో విధానాలున్నాయి.పైన చెప్పిన విధానాల ప్రకారం చూస్తే.. ధర్మరాజే ముందు జన్మించాడు.  ధర్మరాజే  దుర్యోధనునికన్నా జ్యేష్టుడు. 


రాజ్యాన్ని పంచి ఎవరి భాగాన్ని వారు పాలించుకోవటానికి పాండవులు సిద్ధమయ్యారు కానీ,  దుర్యోధనుడు దానికీ ఒప్పుకోలేదు. 


 ధర్మరాజే రాజు అవటం  ప్రజలకు ఇష్టమని దుర్యోధనుని మాటలలోనే తెలుస్తోంది. 


యుద్ధంలో కూడా పాండవులే గెలిచారు. 


ఏ విధంగా చూసినా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టటం న్యాయమే.

Monday, September 21, 2015

మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి ....

కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 
...............

వాళ్ళ అభిప్రాయం ... 


 ‘భూదేవికేం క్షమ ఉంది? జన నాశనం చేసి, బరువు తగ్గించమని కోరింది కదా? అదేనా భూదేవి క్షమ?’

***********

నా  అభిప్రాయం.. 


భూదేవికి ఉన్న క్షమ చాలా గొప్పది. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది .


 తల్లికి తన పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. పిల్లల తప్పులను తల్లి  ఎంతో ఓపికగా క్షమిస్తుంది. 


అయితే పిల్లలు  పాపాలు చేస్తూ ఉంటే పిల్లలను సరైన దారిలోకి తేవటానికి తల్లి దండించటం కూడా జరుగుతుంది కదా!భూమిపై పాపాత్ములు పెరగటం వల్ల ఆ భారాన్ని తాను మోయలేకపోతున్నానని చెప్పి జననాశనం చేయమని భూదేవి  కోరటం జరిగిందంటారు.జరిగిన యుద్ధంలో  పాపాలు  చేసిన వాళ్ళు , వాళ్లకు సహకరించిన వారు  ఎందరో శిక్షను అనుభవించారు. ఆ విధంగా ఎంతో  భూభారం తగ్గింది. ..................

వాళ్ళ అభిప్రాయం ... 

 అమృతం, అశుచిత్వం:  ఆదిపర్వంలో ఉదంకుడు  పేడ తింటాడు.  అది పేడ కాదనీ, అమృతమనీ తర్వాత  గురువు చెప్తాడు. 

ఈ సందర్భంలో ఆ  రచయిత్రి విశ్లేషణ- 

 ‘‘మాయలతో మంత్రాలతో తయారుచేసే కట్టు కథలు కూడా అందులో పెట్టుకునే హద్దులకే లోబడివుండాలి. అమృతాన్ని పవిత్రమైనదని ఒక పక్క చెపుతూ, అది తినడం వల్ల అశుచి అయినట్టు ఇంకో పక్క చెపితే , ఆ అతకనితనం కట్టుకథకి కూడా పనికి రాదు.’’

***********

నా  అభిప్రాయం.. 

ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి . 

నలదమయంతి కధలో నలుడు లఘుశంకకు వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకపోవటం వల్ల  అశుచిత్వం కలిగి, కలికి  తన ప్రభావం చూపించటానికి  అవకాశం లభించిందని అంటారు.


ఉదంకుని అశుచి  విషయంలో ఎలా అర్ధం చేసుకోవచ్చంటే,


  ఉదంకుడు గోమయం తిన్న తరువాత రాజు వద్దకు వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. దారిలో ఉదంకుడు కాలకృత్యాలు  తీర్చుకుని ఉండవచ్చు.


 ప్రయాణ బడలిక వల్లో లేక  మరేవైనా కారణాల వల్లనో కాలకృత్యాల తరువాత  ఉదంకుడు కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకుండా ఉండవచ్చు. ఆ విధంగా ఉదంకుడు  అశుచి అయి ఉండవచ్చు. 


జరిగిన విషయం గుర్తు లేకపోవటం వల్ల , పేడ తినటం వల్లనే  తనకు అశుచి వచ్చిందని ఉదంకుడు భావించి ఉండవచ్చు.
Saturday, September 19, 2015

వర్షాల కోసం పూజలు..


ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా ఉండవని వాతావరణవిభాగం వాళ్ళు తెలియజేసారు. 

అలాగే కొన్నిరోజుల క్రితం వరకూ వానలు  సరిగ్గా పడలేదు. ఇక ఈ సంవత్సరానికి సరిగ్గా వానలు  పడవనే అనుకున్నారు.


 అయితే ,  వానలు  కురవాలని పూజలు   చేసారు.  దైవం  దయ వల్ల  చక్కగా  వర్షాలు పడ్డాయి.


 వర్షాలు కురిపించినందుకు దైవానికి కృతజ్ఞతలు.

............................


సకాలంలో  వానలు  పడని  పరిస్థితికి  మనుషుల  స్వయంకృతాపరాధాలే  కారణం.  


అభివృద్ధి  పేరుతో మనుషులు  సాగిస్తున్న  విచ్చలవిడి  పర్యావరణ కాలుష్యం  వల్ల  ఉష్ణోగ్రతలు  క్రమంగా  పెరుగుతున్నాయి. 


ఒక దగ్గర  వరదలు, ఒక దగ్గర విపరీతమైన ఎండలు ఉంటూ  వాతావరణం  అస్తవ్యస్థంగా  మారుతోంది. 
...........................


వానలు  కురవకపోతే  పూజలు  చేయటం  మంచిదే  కానీ , వాతావరణ విధ్వంసాన్ని  మానుకోవాలి. 


 దైవం  దయామయులు  కనుక ..   మనుషులు  ఎన్ని  తప్పులు  చేస్తూన్నా  ఇంకా   వానలు  కురిపిస్తూనే ఉన్నారు. 
................................


మనుషులు  చేస్తున్న  విధ్వంసం  వల్ల  పర్యావరణం  పాడయ్యి  ఎన్నో  జీవజాతులు  కూడా  ఇబ్బందులు  పడుతున్నాయి. 


 మనుషులు తాము  పర్యావరణానికి   కలగజేస్తున్న  విధ్వంసాన్ని  గ్రహించాలి. లేకపోతే  ముందుముందు  ఏం  జరుగుతుందో  ఊహించటం  కష్టమే.

...........................

ఈ బ్లాగ్ ను ఆదరిస్తున్న అందరికి   కృతజ్ఞతలండి .  

Thursday, September 17, 2015

వినాయక చవితి శుభాకాంక్షలు.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి. Saturday, September 12, 2015

అంతరార్ధాలను గ్రహించాలి.


ప్రాచీన గ్రంధాల ద్వారా పెద్దలు ఎన్నో విషయాలను అందించారు.  


పురాణేతిహాసాలను  అపార్ధం చేసుకోకుండా సరిగ్గా అర్ధం చేసుకోవాలి.


మహాభారతం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.


పెద్దలు కొబ్బరి తింటే మంచిది అని తెలియజేసారనుకోండి.

 కొబ్బరి బొండాన్ని చూసి.. దీన్ని ఎలా  తింటారు ? ఈ పెద్దలు ఇలాగే చెబుతారు. అని ఎగతాళిచేయకూడదు.


 కొబ్బరి బొండాం పీచు వలిచితే లోపల ఉన్న తీయటి కొబ్బరి కనిపిస్తుంది. 

అలాగే పురాణేతిహాసాలను పైపైన చూసి అపార్ధం చేసుకోకుండా అంతరార్ధాలను గ్రహిస్తే చక్కటి విషయాలు అవగతమవుతాయి.

అంతా దైవం దయ.

Wednesday, September 9, 2015

కొన్ని విషయాలు...

పాండవులకు  రాజ్యం అంతా తమకే కావాలనే   అధికారదాహం  ఉంది. అందువల్లే యుద్ధం జరిగింది. అంటారు కొందరు.

 పాండవులకు అధికారదాహమే ఉంటే గంధర్వుల  నుంచి దుర్యోధనాధులను రక్షించకుండా ఉపేక్షించి రాజ్యాన్ని ఏలుకునేవారు. కానీ పాండవులు  అలా చేయలేదు. 

గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నప్పుడు పాండవులే దుర్యోధనాదులను  రక్షించారు.
 ....................

మహాభారతంలో.. గీతోపదేశం అద్భుతమైనది. గీత ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు
............
 గీత అహింసను , వైరాగ్యాన్నీ  ఉపదేశిస్తుంది . మరి ,  యుద్ధంలో   హింస జరిగింది కదా ! అంటారు కొందరు.

  గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందన్నది నిజమే. 

 అయితే,  అధర్మాన్ని ఆచరించేవారిని,  వారిని అనుసరించేవారిని శిక్షించటం కూడా అహింస క్రిందకే  వస్తుంది. 

కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలంటే .. వైరాగ్యమూ అవసరమే. 
....................

 ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు అని తెలియజేసిన కృష్ణుడు ...

అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెండు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే!   అని ఎందుకన్నారని అంటారు.


క్షత్రియుని స్వధర్మంలో యుద్ధం చేయటమూ ఒక భాగమే. రాజ్యాన్ని పాలించటమూ, కోల్పోయిన  రాజ్యం కోసం యుద్ధం చేయటమూ క్షత్రియులకు ధర్మమే. 

 యుద్ధం చేయటం అర్జునుని కర్తవ్యం. రాజ్యాన్ని స్వార్ధపరుల చేతుల్లో నుంచి రక్షించే బాధ్యత అతనిపై ఉంది.


బంధుప్రీతి వల్ల అర్జునుడు యుద్ధాన్ని చేయకపోతే, దుర్యోధనుని వంటి స్వార్ధపరుల వల్ల రాజ్యంలోని ప్రజలూ కష్టాలను అనుభవిస్తారు. 


ఇలాంటప్పుడు,  అర్జునునికి స్వర్గాశ లేక రాజ్యభోగముల పట్ల ఆశలు  చూపించి అయినా ధర్మయుద్ధం చేయించాలని  కృష్ణుడు అలా అని ఉండవచ్చు. 
...............................

స్వార్ధము, కోరిక, సంతోషము, భయము, ఆశ, బంధుప్రీతి ..లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవారు స్థితప్రజ్ఞులు . 

ఉదా.. ఒక న్యాయమూర్తి తీర్పును ఇచ్చేటప్పుడు బంధువులు, మిత్రులు,శత్రువులు.. అనే తేడా ఉండకూడదు కదా!
.......................

అయితే  ఎంత గొప్పవాళ్ళకయినా  కొన్నిసార్లు  ధర్మాధర్మసందేహాలతో  సంకటపరిస్థితి ఏర్పడి  ధైర్యం  సడలిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
................

యుద్ధరంగంలో అంత గీత ఉపదేశించటం ఎలా కుదురుతుంది ? అని ప్రశ్నిస్తారు కొందరు. 

 యుద్ధం  పూర్తిగా  మొదలవటానికి  ముందే  సేనలను  పరిశీలించటానికి అర్జునుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఉండవచ్చు..


యుద్ధరంగంలో అందరూ అర్జునుడిని, కృష్ణుడినీ మాత్రమే చూస్తూ  కూర్చోరు  కదా !   ఎవరి హడావుడిలో వాళ్ళుంటారు.


 అయినా, గీత ఉపదేశించటానికి , వినడానికి  ఎక్కువ  సమయం  అవసరం లేదు. అంతా తృటిలో జరిగిపోతుంది  (దైవం తలచుకుంటే ).


Wednesday, September 2, 2015

ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది..............


మానవులకు అనేక కోణాలనుంచి ఆలోచించే శక్తి ఉండటం ఒక రకంగా వరం.........ఒక రకంగా శాపం కూడా.... 


అంటే మన ఆలోచనల ద్వారా మనము జీవితాన్ని బాగూ చేసుకోవచ్చు....అలాగే పాడూ చేసుకోవచ్చు.


ఉదా.........మహాభారతంలో................. ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు. వారు పాచికలాటలో రాజ్యాన్ని పోగొట్టుకోవటం .. మనకు తెలిసిన విషయాలే కదా !


ఆ సంఘటన ద్వారా ఎంత గొప్పవారైనా సరే.......... చిన్న పొరపాటు చేసినా కష్టాలను అనుభవించే అవకాశం ఉంది .... కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది.దీని ద్వారా ఒక వ్యక్తి ఎలా ఆలోచించవచ్చంటే.......


ధర్మరాజంతటి వారే ఒక చిన్న సంఘటన వల్ల అన్ని కష్టాలు అనుభవించినప్పుడు , మనం జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని .ఆలోచిస్తారు . ( ఇలా ఆలోచించి ఆ కధవల్ల జీవితాన్ని సరి దిద్దుకుంటారు కొందరు. )


మరి కొందరేమో.... ధర్మరాజంతటి వారే జూదం ఆడటం జరిగింది కాబట్టి సామాన్యవ్యక్తిని నేను ఆడితే తప్పేమీ లేదు అని ఆలోచిస్తారు. .............  (ఇలా ఆలోచించి తన  వ్యసనాన్ని   సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తారు.  ఇలా ఆలోచిస్తూ తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు.)ఇలా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లో ప్రతిఒక్కరూ ........ అవకాశవాదంతో 
 ధర్మాన్ని  తమకు అనుకూలంగా మార్చి చెప్పుకుంటే ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు ?


ఆలోచన అన్ని వైపులా పదునున్న కత్తిలాంటిది. అది వాడుకునేవాళ్ళను బట్టి ఉంటుంది.కత్తితో కూరగాయలూ తరుగుకోవచ్చు........ఇతరుల తలకాయలూ నరకవచ్చు.


అందుకని నాకు ఏమనిపిస్తుందంటే, ఎవరి కర్మ ప్రకారం వారి ఆలోచనలు ఉంటాయి.


బాగుపడేరాత ఉన్నవాళ్ళను ఎవరూ చెడగొట్టలేరు. చెడిపోయేవారిని ఎవరూ బాగుచేయలేరు.

ఒకోసారి కొన్ని సంకటపరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. భగవంతుని మేధాశక్తి అపరిమితం ......... మన ఊహకు కూడా అందదు. మానవుల మేధాశక్తి పరిమితం.అందుకే సంకటపరిస్థితి వచ్చినప్పుడు మనకు చేతనయినంతలో ప్రయత్నించి ఇక మనలను సరి అయిన దారిలో నడిపించమని ఆ దైవాన్ని కోరటమే మనం చేయగలిగింది.

.....................................


ధృతరాష్ట్రునికి    పాచికలాటకు  పాండవులను  పిలవటం  అంతగా  ఇష్టం  లేకపోయినా,  పుత్రప్రేమను  అణచుకోలేక  ఒప్పుకున్నాడు. అందుకు  తగ్గ  మూల్యాన్ని  చెల్లించారు.

ధర్మరాజుకు  పాచికలాట  ఆడటం  ఇష్టం  లేదు. అయితే,  పెదతండ్రి  అయిన  ధృతరాష్ట్రుని  ఆహ్వానం  మేరకు  ,  ఆయన  ఆహ్వానాన్ని  తిరస్కరించకూడదని వచ్చి,  పాచికలాట  ఆడటం  జరిగింది.

 ఈ  విషయాలు  ఈ  లింక్  ద్వారా  చదువవచ్చు..... మహా భారతము

(తెలుగు )Mahabharata - Wikipedia, the free encyclopedia

 


పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కటి దిశానిర్దేశం.....శకుంతల,కుంతీదేవి, ధర్మరాజు ..


పురాణేతిహాసాలలోని  పాత్రలను  కొందరు  అపార్ధం  చేసుకుంటారు.  అంత  గొప్ప  వాళ్ళు  కూడా   కొన్ని పొరపాట్లు   చేసారు  కదా !  అంటారు.  నిజమే  ,  గొప్పవారు  అయినా  కొన్నిసార్లు  పొరపాట్లు  చేసే  అవకాశం  ఉంది.

ఇతరులు  చేసిన  గొప్పపనులను  మనం  ఆదర్శంగా  తీసుకోవాలి.  ఇతరులు  చేసిన  పొరపాట్ల  నుంచి  మనం   పాఠాన్ని  నేర్చుకోవాలి.


 ( మనం  అలాంటి   పొరపాట్లు  చేయకూడదనే   పాఠాన్ని   నేర్చుకోవాలి. )

..........................................

సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు.

ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.


ఇప్పుడు సమాజంలో చూడండి ........ ఎన్నో నేరాలు,  ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.మంచివారూ ఉన్నారు ........ చెడ్డవారూ ఉన్నారు.

 మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా , దైవం, పెద్దలు ... పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా.....ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , .......ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో .......మనకు   చక్కటి  దిశానిర్దేశం  చేశారు    అనిపిస్తుంది.అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.

...........................................

పురాణేతిహాసాలలోని    పాత్రల  నుంచి  మనం  ఎన్నెన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు.  


ఉదా...వివాహం  కాని  అమ్మాయిలు  ఉన్న  తల్లితండ్రులకు  కొంత  భయం  ఉంటుంది.  అమ్మాయికి  జాగ్రత్తలు  చెప్పాలంటే   ఎలా  చెప్పాలో  తెలియక  మొహమాటంగా  కొంత   ఇబ్బందిగా  ఉంటుంది.  అలాంటప్పుడు  శకుంతలదుష్యంతుల  కధను  అమ్మాయికి  తెలియజేస్తే , తల్లితండ్రులకు  తెలియకుండా  రహస్య  వివాహాలు  చేసుకుంటే  కలిగే  ఇబ్బందులు  వంటి  వాటిని  శకుంతల  పాత్ర  ద్వారా  తెలుసుకుని   అమ్మాయిలు  జాగ్రత్తగా  ఉండే  అవకాశం  ఉంది.


........................................


కుంతీదేవి  కధను  తెలుసుకోవటం  ద్వారా    పిల్లలు,  పెద్దలు  కూడా  ఎన్నో  విషయాలను   నేర్చుకోవచ్చు.  జీవితంలో  ఎన్ని  కష్టాలు  వచ్చినా  కుంతీదేవి  సహనంతో, దృఢత్వంతో  జీవించటం  జరిగింది.  కుంతీదేవి    వ్యక్తిత్వంలోని    సహనం,  దృఢత్వం  వంటి   ఎన్నో  గొప్ప  విషయాలను  మనము  నేర్చుకోవచ్చు. అయితే  తెలిసితెలియని  చిన్నతనంలో ,  మహర్షి  ప్రసాదించిన  వరాన్ని    పరీక్షించకోరిన సందర్భములో  సంభవించిన  కర్ణజననం ,  లోకోపవాదానికి  భయపడి  కర్ణుని  వదిలిపెట్టడం  వంటి  సంఘటనల  వల్ల  కుంతీదేవి  జీవితాంతం  వరకు  మానసిక  క్షోభను   అనుభవించింది.  కర్ణునికి  తాను  అన్యాయం  చేశానని  కుమిలిపోయింది.  కుంతీదేవి  జీవితంలోని  ఈ   సంఘటన  ద్వారా  వివాహానికి  పూర్వమే  బిడ్డలను  కంటే  ఎన్ని  కష్టాలు  ఉంటాయో  అమ్మాయిలకు   వివరంగా  తెలుస్తుంది.

 .....................................

 ధర్మరాజు  ఎంతో  గొప్పవ్యక్తి.   ధర్మాన్ని  చక్కగా   ఆచరించిన    వ్యక్తి.  వారు  పాటించిన  నైతిక  విలువలతో  కూడిన  గొప్ప  జీవితం  ద్వారా  మనం  ఎన్నో  మంచి  విషయాలను  నేర్చుకోవచ్చు. 


అయితే,  జీవితమంతా  ధర్మాన్ని  పాటిస్తూ   జీవించినా  కూడా  జూదం  వంటి  ఒక్క  చర్య   వల్ల  వారు   వనవాసం  వంటి  కష్టాలను  అనుభవించవలసి  వచ్చింది.


 ఈ విషయం  గురించి  మనం  ఏం  నేర్చుకోవాలంటే , ప్రతి  విషయంలోనూ  మనం  జాగ్రత్తగా  ఉన్నప్పుడే  జీవితంలో  కష్టాలు  రాకుండా  ఉంటాయి  అని  తెలుసుకోవాలి.


దయచేసి  ఈ  లింక్  కూడా  చదవగలరు. 


ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...