koodali

Wednesday, September 9, 2015

కొన్ని విషయాలు...

 
పాండవులకు  రాజ్యం అంతా తమకే కావాలనే   అధికారదాహం  ఉంది. అందువల్లే యుద్ధం జరిగింది. అంటారు కొందరు.

 పాండవులకు అధికారదాహమే ఉంటే గంధర్వుల  నుంచి దుర్యోధనాధులను రక్షించకుండా ఉపేక్షించి రాజ్యాన్ని ఏలుకునేవారు. కానీ పాండవులు  అలా చేయలేదు. 

గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నప్పుడు పాండవులే దుర్యోధనాదులను  రక్షించారు.
 ....................

మహాభారతంలో.. గీతోపదేశం అద్భుతమైనది. గీత ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు
............
 గీత అహింసను , వైరాగ్యాన్నీ  ఉపదేశిస్తుంది . మరి ,  యుద్ధంలో   హింస జరిగింది కదా ! అంటారు కొందరు.

  గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందన్నది నిజమే. 

 అయితే,  అధర్మాన్ని ఆచరించేవారిని,  వారిని అనుసరించేవారిని శిక్షించటం కూడా అహింస క్రిందకే  వస్తుంది. 

కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలంటే .. వైరాగ్యమూ అవసరమే. 
....................

 ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు అని తెలియజేసిన కృష్ణుడు ...

అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెండు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే!   అని ఎందుకన్నారని అంటారు.

క్షత్రియుని స్వధర్మంలో యుద్ధం చేయటమూ ఒక భాగమే. రాజ్యాన్ని పాలించటమూ, కోల్పోయిన  రాజ్యం కోసం యుద్ధం చేయటమూ క్షత్రియులకు ధర్మమే. 

 యుద్ధం చేయటం అర్జునుని కర్తవ్యం. రాజ్యాన్ని స్వార్ధపరుల చేతుల్లో నుంచి రక్షించే బాధ్యత అతనిపై ఉంది.

బంధుప్రీతి వల్ల అర్జునుడు యుద్ధాన్ని చేయకపోతే, దుర్యోధనుని వంటి స్వార్ధపరుల వల్ల రాజ్యంలోని ప్రజలూ కష్టాలను అనుభవిస్తారు. 

ఇలాంటప్పుడు,  అర్జునునికి స్వర్గాశ లేక రాజ్యభోగముల పట్ల ఆశలు  చూపించి అయినా ధర్మయుద్ధం చేయించాలని  కృష్ణుడు అలా అని ఉండవచ్చు. 
...............................

స్వార్ధము, కోరిక, సంతోషము, భయము, ఆశ, బంధుప్రీతి ..లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవారు స్థితప్రజ్ఞులు . 

ఉదా.. ఒక న్యాయమూర్తి తీర్పును ఇచ్చేటప్పుడు బంధువులు, మిత్రులు,శత్రువులు.. అనే తేడా ఉండకూడదు కదా!
.......................

అయితే  ఎంత గొప్పవాళ్ళకయినా  కొన్నిసార్లు  ధర్మాధర్మసందేహాలతో  సంకటపరిస్థితి ఏర్పడి  ధైర్యం  సడలిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
................

యుద్ధరంగంలో అంత గీత ఉపదేశించటం ఎలా కుదురుతుంది ? అని ప్రశ్నిస్తారు కొందరు. 

యుద్ధరంగంలో అందరూ అర్జునుడిని, కృష్ణుడినీ మాత్రమే చూస్తూ  కూర్చోరు  కదా !   ఎవరి హడావుడిలో వాళ్ళుంటారు.

 అయినా, గీత ఉపదేశించటానికి , వినడానికి  ఎక్కువ  సమయం  అవసరం లేదు. అంతా తృటిలో జరిగిపోతుంది  (దైవం తలచుకుంటే ).


1 comment:

  1. వెనకటికి ఒక మహర్షి ఒక మహారాజుకు త్రుటిలో జ్ఞానాన్ని ఉపదేశించారని అంటారు.

    ReplyDelete