koodali

Monday, October 31, 2011

ఇక నేను నీతులు చెప్పటానికి కుదరదేమో ? అని తెగ కంగారుపడ్డాను.

దీపావళికి ముందు రోజున నేను బయటకు వెళ్ళినప్పుడు, రోడ్డుపైన చాలామంది ఒకరితోఒకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు,.


వారి మధ్యన ఒక బిచ్చమెత్తుకునే వ్యక్తి తిరుగుతూ , అందరినీ భిక్షం అడుగుతున్నాడు.


మాకు తెలిసినవారు కూడా నాకు శుభాకాంక్షలు చెబుతుంటే , ఆ వ్యక్తి నా వద్దకు వచ్చి , ఆకలిగా ఉంది ఏమైనా డబ్బు ఇవ్వమని అడగటం జరిగింది.


నాకు తోచింది కొద్దిగా ఇచ్చాను కానీ, .....మనసంతా బాధగా, చిరాగ్గా అయిపోయింది.


ఒకోసారి మనం బయటకు వెళ్ళినప్పుడు కొందరు చిన్నపిల్లలు మన వెనకాలే పడి డబ్బులు అడుగుతుంటారు.


పెద్దవాళ్ళు వెనకాల ఉండి ఈ పిల్లలను పంపిస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు పిల్లలమీద జాలి , పెద్దవాళ్ళమీద కోపం వస్తాయి.


వాళ్ళకు డబ్బు ఇచ్చి ప్రోత్సహించకూడదు అనిపిస్తుంది.


కానీ, ఈ రోజుల్లో బ్రతకటానికి వాళ్ళకి వేరే దారి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ? అనిపిస్తుంది.


కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇంకాఇంకా సంపాదన కోసం ప్రజలను తినేస్తుంటే ఇలాంటి పేదవాళ్ళను ఏం అనగలం ?


వాళ్లకు బ్రతకటానికి మంచి ఉపాధి చూపాలి. అప్పుడు వాళ్ళు మాత్రం అలా భిక్షమెత్తి ఎందుకు బ్రతుకుతారు. ?


ఒక వైపు శుభాకాంక్షలు......మరొక వైపు ఆకలికేకలు ఏమిటో ఇదంతా ? అనిపించింది .


కొందరికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు ఉంటాయి. కొందరికి కూటికి కూడా కరువే.


ఇలా సంపద కొందరి దగ్గర అతి ఎక్కువగా ,కొందరి దగ్గర అతి తక్కువగా ఉండటం అన్యాయం కదా !


భూమి మీద అభివృద్ధి
జరిగి(పోయింది ) .ఇక అంగారకుడి పైకి వెళ్ళిపోతున్నాము అంటున్నారు కానీ, అంగట్లో సరుకుల రేట్లే అందరానంతగా పెరిగిపోతున్నాయి.


ఎంతోమంది మేధావులు ఉన్నారు.


అయినా దేశంలో ఆకలికేకలు, విపరీతమైన మురికి, చెత్తకుప్పలు , గబ్బుకొట్టే గవర్నమెంట్ ఆస్పత్రులు, తుపుక్కున ఊసే వీధులు ....... సిగ్గుగా అనిపిస్తున్నది కదూ !టివి సీరియల్స్‌లో చూపించే ఇళ్ళను చూస్తే , ఇండియా ఇంత గొప్పగా ఉంటుంది కాబోలు అని భ్రమపడి విదేశీయులు ఎవరైనా ఇక్కడికి వస్తే .....అంతే సంగతులు.


దేశాన్ని కొద్దిగానైనా బాగుచేసుకోలేనంత చేతకానివాళ్ళంగా మనం ఎందుకు తయారయ్యామో ?


ఆ మధ్యన హజారే సాబ్ అవినీతి గురించి దీక్ష చేసినప్పుడు జనంలో కొద్దిగా కదలిక వచ్చింది.


క్రికెట్ ఆటలు, చీర్ లీడర్ల చిందులు, అర్ధనగ్నసినిమాల నుంచి కొద్దిగాపక్కకు వచ్చి హజారే సాబ్‌కు మద్దతు ఇచ్చినప్పుడు,


దేశానికి మంచి రోజులు వచ్చేస్తున్నాయేమో ? ఇక నేను నీతులు చెప్పటానికి కుదరదేమో ? అని తెగ కంగారుపడ్డాను.


ఇప్పుడు పాపం పెద్దాయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు.


ఆయన ( హజారే ) ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ దీక్ష చేసేవరకూ జనం ఇలా రెస్ట్
తీసుకుంటూ కాలక్షేపం చేస్తారు కాబోలు.

అయినా, ఎవరికీ వారు నిజాయితీగా,
సక్రమంగా జీవిస్తే అవినీతి...వంటివి ఎందుకు ఉంటాయి ?.ఈ మధ్యన ఒక వార్త చూశాను. అవినీతి సొమ్ము విదేశాల నుంచి తెచ్చేసి జనాలపేరిట ఉచితంగా వేస్తున్నారని ప్రచారం జరిగిందట,


ఇక చూడండి. జనం వేలం వెర్రిగా పోస్ట్ ఆఫీసులముందు క్యూలు కట్టి మరీ నించున్నారట,( ఇది మన రాష్ట్రంలోనే జరిగింది. )

ఇది చూశాక నాకు అనిపించింది.


ఈ ప్రజలను ఎవరు మాత్రం బాగుచెయ్యగలరు ? వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలెయ్యటం తప్ప ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? అని.


హజారేగారి దీక్షకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది.


ఇంతమంది అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు .


మరి లంచాలు ఇస్తున్నదెవరు ? పుచ్చుకుంటున్నదెవరు ? అని అయోమయంగా అనిపించింది.దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వేలాదిమంది జనాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ,

ఈ భక్తులు అందరూ నిజజీవితంలో సత్ప్రవర్తనతో ఉంటే లోకంలో ఇన్ని అన్యాయాలు జరగవు కదా ! అని.నైతికవిలువలు పాటించకుండా చేసే పూజలు ఎటువంటివంటే , పూర్వం రాక్షసులు చేసిన తపస్సులు, పూజల వంటివి.


అటువంటి పూజలను దైవం మెచ్చుకోవటం జరగదు..మళ్ళీ , ఇలా కూడా అనిపిస్తుంది ...,...ఇలా దైవభక్తి, పాపపుణ్యాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇంకా ఉండటం వల్లే లోకంలో ధర్మం ఇంకా ఉంది అని .


Friday, October 28, 2011

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని ..........సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు అనంతంగా ఉన్నాయి.


రమణ మహర్షుల వారు " నేను " అంటే ఏమిటి అని విచారణ చెయ్యమని చెప్పారట.

మనం మనకే అర్ధం కాము.

మన మనస్సు, మన శరీరం ఇవన్నీ కలిపి నేను అని భావిస్తూ
ఈ " నేను " కోసం , ఎంతో తాపత్రయపడిపోతాము.


చిత్రమేమిటంటే మన మనస్సు గురించి కానీ, మన శరీరంగురించి కానీ మనకు ఏమీ తెలియదు.,

తెలుసుకోవాలన్నా మనకి ఏమీ అర్ధం కాదు.

మన మనస్సు మనదే అనుకుంటాము కానీ ,

మరి మన మనస్సు మనం చెప్పినట్లు ఎందుకు వినదన్నది ఎంత ఆలోచించినా అర్ధం కాదు.


మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని వాళ్ళను నిందించటం అనవసరం.


నా మనస్సు, నా మనస్సు అని నేను తాపత్రయపడటమే కానీ, దానికి అలాంటి మొహమాటమేమీ ఉన్నట్లు కనిపించదు.


మనం ఏపనైతే చెయ్యకూడదు అనుకుంటామో మన మనస్సు ఆ పనే చెయ్యాలని
ఒకోసారి మొండికేస్తుంది.


దీనిని అదుపులో పెట్టటం చాలా కష్టం.


చాలాసార్లు ఈ మనస్సును అదుపులో పెట్టలేక నేను ఎంత నరకాన్ని అనుభవించానంటే ,


నాకు అనిపిస్తుంది, చెరకు గడలు యంత్రంలో నలిగేటప్పుడు అనుభవించే బాధ ఇలాగే ఉంటుందేమో ! అని.


అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే, భగవంతుని శరణు వేడాలి అని పెద్దలు చెబుతారు.అయితే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు.


మట్టి కూజా కాలితేనే కదా గట్టి కూజా తయారయ్యేది.

గొంగళిపురుగు దశ తరువాతే అందమైన సీతాకోక చిలుక దశ వస్తుంది.


అలాగని నేనేదో సీతాకోకచిలుక దశకు వచ్చేశానని కాదు.కష్టాలు వచ్చినప్పుడు
ఎవరూ కూడా గాభరాపడకుండా ఉండాలి అని చెబుతున్నాను అంతే . .


కష్టాలు సుఖాల కొరకే.కష్టాల వల్ల పూర్వపాపం ఖర్చయిపోతుంది. సుఖాలవల్ల పూర్వపుణ్యం ఖర్చయిపోతుందని పెద్దలు చెప్పారు కదా !అయితే నా మనస్సు అంటే నాకు ఇష్టమే. దైవప్రార్ధన చేయాలంటే దాని సహాయం కూడా అవసరమే కదా !అంతా దైవం దయ.

ఇక శరీరం .......దానిగురించి మాత్రం మనకేం తెలుసు.?

ఇలా ఆలోచించగా
.... ఏం తెలుస్తుందంటే మన మనస్సు, శరీరం వేటిపైనా మనకు అంతగా అడ్డూ, అదుపు, అధికారం లేవని అర్ధమవుతుంది.


మన శరీరంలో మనం శ్వాస తీసుకునే ప్రక్రియ కూడా మన ప్రమేయం లేకుండానే జరిగేటట్లు ముందే ఏర్పాటు చేయబడి ఉంది.


అందుకే కదా మనం నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.


ఎంత అద్భుతమైన దైవసృష్టో కదా ! అనిపిస్తుంది.


మన శరీరం అనబడేది ఆక్సిజన్, కార్బన్, వంటి కొన్ని ఎలిమెంట్స్ తో తయారుచేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా !


అంటే శరీరమంటే గాలి, నీరు ఇలాంటివేనన్నమాట.


మరి అందులో చైతన్యం ఎలా వస్తుందో ? జీవులు ఇన్ని పనులు ఎలా చేస్తున్నారో ?


అంతా అత్యంత ఆశ్చర్యం, అద్భుతం.
ఆధునిక శాస్త్రవేత్తలు శరీరంగురించి ఇలా చెబుతున్నారు.

Question: What Are the Elements in the Human Body?


Answer: Most of the human body is made up of water, H2O, with cells consisting of 65-90% water by weight. Therefore, it isn't surprising that most of a human body's mass is oxygen. Carbon, the basic unit for organic molecules, comes in second. 99% of the mass of the human body is made up of just six elements: oxygen, carbon, hydrogen, nitrogen, calcium, and phosphorus.

1. Oxygen (65%)
2. Carbon (18%)
3. Hydrogen (10%)
4. Nitrogen (3%)
5. Calcium (1.5%)
6. Phosphorus (1.0%)
7. Potassium (0.35%)
8. Sulfur (0.25%)
9. Sodium (0.15%)
10. Magnesium (0.05%)
11. Copper, Zinc, Selenium, Molybdenum, Fluorine, Chlorine, Iodine, Manganese, Cobalt, Iron (0.70%)
12. Lithium, Strontium, Aluminum, Silicon, Lead, Vanadium, Arsenic, Bromine (trace amounts)

Reference: H. A. Harper, V. W. Rodwell, P. A. Mayes, Review of Physiological Chemistry, 16th ed., Lange Medical Publications, Los Altos, California 1977.


శాస్త్రవేత్తలు చెప్పినట్లు శరీరం అంటే గాలి, నీరు అయితే మన పెద్దలు చెప్పినది కూడా అదే కదా ! అంతా మట్టి, గాలి, నీరు, అంతా మాయ.


ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది కదా !

అంతా దైవం దయ....

(నేను వ్రాసినవి చదివి నాకు ఏవో సినిమా కష్టాలవంటి కష్టాలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి. దైవం నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు.

అయితే,
ఈ రోజుల్లో చాలామంది జీవితంలో 90 శాతం మంచి ఉన్నా కూడా, మిగిలిన 10 శాతం లోటును గురించే ఆలోచిస్తూ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు కదా ! . నేనూ అలాగే.. ) ..


Wednesday, October 26, 2011

నరకాసురులు బయట మాత్రమే ఉండరు. మనలోనూ ఉంటారు.

దీపావళి పండుగ వస్తే టపాసులు కాల్చుకోవచ్చని పిల్లలు బాగా సరదాపడతారు.( చాలామంది పెద్దవాళ్ళు కూడా సరదా పడతారు. )

అయితే టపాసుల ధరలు కూడా అన్ని వస్తువుల ధరలలాగే రోజురోజుకీ మరింత పైకి వెళ్ళిపోతున్నాయి.


అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొద్దోగొప్పో డబ్బు ఉన్నవాళ్ళే ఈ ధరలు చూసి లబోదిబోమంటున్నారు. ఇక తక్కువ ఆదాయం గలవారు ఏం తింటారో ? ఎలా బ్రతుకుతారో ?


ఇంకో విషయం ఏమిటంటే , నరకాసురుల వంటి రాక్షసులు బయటే ఉంటారు అనుకుంటాము.


ఇలాంటి నరకాసురులు బయట మాత్రమే ఉండరు. మనలోనూ ఉంటారు.


మనలోని అత్యాశ, అహంకారం, అసూయ, వంటి దుర్గుణాలే మనలోని నరకాసురులు.

మనలోని నరకాసురులను వధించటం కూడా అత్యంత కష్టమయిన పనే.


మన మనస్సే కదా మన మాట వింటుందని అనుకోవటానికి లేదు. ఒకోసారి దానిష్టప్రకారం అది నడుస్తుంది.

మన మనస్సు మన మాట వినకపోవటమేమిటో అంతా వింతగా అనిపిస్తుంది కదా !.


మనలోని దుర్గుణాలే మనకూ, సమాజానికీ కూడా కష్టాలను తెచ్చిపెడతాయి.


అందుకని మనలోని దుర్గుణాలను పారద్రోలటానికి బాగా ప్రయత్నించాలి.


ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే భగవంతుని శరణు వేడాలి....


Monday, October 24, 2011

ప్రజాసమస్యల పరిష్కారానికి గట్టిగా ప్రయత్నించాలి.... కానీ....ఇప్పుడు సమాజంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. పేదరికం, అవినీతి, ఆర్ధిక అసమానతలు, ఇంకా ఎన్నో సమస్యలున్నాయి.

చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సమస్యలను పరిష్కరించటం పెద్ద కష్టమేమీ కాదు.


నాయకులు., అధికారులు సమస్యలు ఇలా ఉండిపోవటానికి రకరకాల కారణాలు చెబుతారు.


కానీ, కొందరు వ్యక్తులు తమకు విధమైన అధికారం , గొప్ప ఆర్ధికవనరులు లేకపోయినా , తమకు తోచినంతలో ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

అలాంటి విశిష్టవ్యక్తుల గురించి. వార్తాపత్రికల్లో చదువుతుంటాము.


బాబా ఆమ్టే .కుటుంబం .... ప్రజలకు చేస్తున్న సేవ గురించి చాలా మందికి తెలుసు.

ఇంకొక ఊరిలో భార్యాభర్తలైన ఇద్దరు వ్యక్తులు అడవిలోని గిరిజనుల కష్టాలకు చలించి నగరంలోని జీవనాన్ని వదిలి , గిరిజనుల ఊరిలోనే వైద్యశాల కట్టించి వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.


ఇంకొక మధ్య తరగతి వ్యక్తి వేసవికాలంలో కొందరు పేదవారికి ఉచితంగా రాగిజావ అందిస్తారని చదివాను.


ఒక వ్యక్తి విదేశాల్లో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చి ఊరినే ఒక ఆదర్శ గ్రామంగా మార్చివేశారట.


ఇలా ఎందరో మహోన్నత వ్యక్తుల గురించి వార్తాపత్రికల్లో చదువుతుంటాము.


వీరందరూ గొప్పవ్యక్తులు. వీరికి అధికారం, ఎక్కువగా ఆర్ధికవనరులు లేకపోయినా కూడా వీరు విజయాలను సాధిస్తున్నారు.


మరి అధికారం ఉన్నప్పుడు ఎంత ప్రజాసేవ చెయ్యవచ్చో కదా!


కాని స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు గడిచినా దేశంలో సమస్యలు చాలా అలాగే ఉన్నాయి. కారణాలు అందరికీ తెలిసినవే.


రాజకీయనాయకులు, అధికారులు, ప్రజలు కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తే సమస్యలను పరిష్కరిచుకోవటం పెద్ద పనేమీ కాదు.


రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఫ్లోరిన్ నీటి వాడకం వల్ల అవయవాలు వంకర్లు పోయిన వారు ఉన్నారు. వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది.


ఇలాంటివి తక్షణం పరిష్కరించవలసిన సమస్యలు.


ప్రతి కుటుంబానికి తాగటానికి, వంట చేసుకోవటానికి రోజుకు
రెండు బిందెలు శుద్ధి చేసిన నీటిని అందిస్తే చాలు , చాలావరకు ఈ సమస్య ను పరిష్కరించవచ్చు.


అందరికి ఆహారాన్ని అందించే రైతులు , చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు తగ్గ గిట్టుబాటు ధర లభించక , అప్పుల బారిన పడి వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


విలాసవంతమైన వస్తువులు తయారుచేసే పరిశ్రమలవారికి ఎంతో ఉదారంగా రాయితీలను అందించి ఆదుకున్నట్లే , ఈ బడుగు వర్గాల వారికీ తగినంత గిట్టుబాటు ధర ఇస్తే వారూ జీవిస్తారు కదా !


ఇక ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇప్పటికిప్పుడు వాడకం ఆపటం కుదరనప్పుడు ,

ప్రతి వీధిలోనూ కేవలం ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవెయ్యటానికి ప్రత్యేకమైన చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తే ,

అవి గాలికి విచ్చలవిడిగా ఎగిరి కాలువలకు అడ్డంపడటం ,

వర్షాకాలంలో కాలువలు పూడిపోయి ఊళ్ళు
వరదల్లో తేలటం వంటి సమస్యలు ఉండవు కదా !


ఇవన్నీ చేయటానికి డబ్బు ఖర్చు కన్నా , కావలసింది చిత్తశుద్ధి మాత్రమే.


ప్రజలు , నాయకులు తమ సొంత స్వార్ధాన్ని తగ్గించుకుని సమాజానికి మేలు చేస్తే (సమాజమంటే ప్రజలే కాబట్టి ) అందరూ సుఖంగా ఉంటారు.రాజకీయనాయకులు, అధికారులు, ప్రజలు ఉమ్మడిగా కృషి చేస్తే ఈ సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు.


చాలా మంది నాయకులూ , అధికారులు మొదట్లో చిత్తశుద్ధితోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలనే అనుకుంటారు. కానీ క్రమంగా రకరకాల కారణాల వల్ల....ఉదా.. ఉద్యోగంలో చేరిన కొత్తలో నీతిగా ఉండే ఉద్యోగులు కొందరు కాలక్రమేణా రకరకాల కారణాల వల్ల వత్తిడికి లోనై వాళ్ళూ బాధ్యతలను మర్చిపోతారు.


స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి అందరూ కలిసి చిత్తశుద్ధితో ప్రజాసమస్యలను పరిష్కరిస్తే ఈ నాడు దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉండేవికాదు కదా!

Friday, October 14, 2011

దయచేసి ఈ విడియో పూర్తయే వరకూ చూడండి.

దయచేసి విడియో పూర్తయే వరకూ చూడండి.

When Lions, Buffaloes and Crocodiles Attack—At the Same Time


భగవంతుని దయ ఉంటే ఇలాంటి చిత్రాలు జరుగుతాయి. అపాయాలు వచ్చినప్పుడు దైవం దయ ఉండాలి మనం కూడాఅపాయాన్ని తప్పించుకోవటానికి శాయశక్తులా కృషి చేయాలి. ఫలితాన్ని మాత్రం దైవానికే వదిలేయాలి.. వీడియోతీసినవారికి కృతజ్ఞతలు. .. .

Wednesday, October 12, 2011

అలాంటి చెట్ల నుంచీ వచ్చే పండ్లు ఆహారంగా తీసుకుంటే మానవులకు కూడా బాగా బలం వస్తుందట.

కొందరు శాకాహారం కన్నా మాంసాహారమే బలం అనుకుంటారు.

సింహం బలమైనదే అయినా , ఏనుగు , అడవి దున్న వంటివి కూడా బలమైనవే కదా !


అడవిదున్న ( బైసన్ ) తన నుదుటితో లారీ అంత బలమైన వాహనాన్ని కూడా నెట్టివేయగలదని అంటారు.
ఇలా భగవంతుని సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.


ఇంకా, సింహం కన్నా ఏనుగే ఎక్కువకాలం జీవిస్తుందట. (ఇతరత్రా ఆపదలు లేకపోతే ) .


ఏనుగు... , కొబ్బరి, వెలగ పండ్లు వంటి బలమైన ఆహారం తీసుకుంటుంది.


కొబ్బరి,
తాటి, వెలగ .మామిడి, పనస వంటి వృక్షములు ఎక్కువకాలం జీవిస్తాయి.


అలాంటి చెట్ల నుంచీ వచ్చే పండ్లు ఆహారంగా తీసుకుంటే మానవులకు కూడా బాగా బలం వస్తుందట.


అందుకేనేమో పూర్వులు దైవ ప్రసాదంగా కొబ్బరిని ఎక్కువగా ఉపయోగించటం మనకు నేర్పించారు అనిపిస్తుంది.


ఈ రోజుల్లో కొబ్బరి తక్కువగా వాడుతున్నారు.


పెద్దవారికేమో డయాబెటిస్ ఉండటం, పిల్లలకేమో లావు అవుతారని భయం ఇలా ఎన్నో కారణాలు....


కొంతకాలం క్రిందట పిల్లలు పచ్చి కొబ్బరి ముక్కలు ఇష్టంగా తినేవారు.


ఇప్పటి పిల్లలకు పిజ్జాలు, బర్గర్లు, వెనిగర్, అజనిమోటో , సాస్, శాకరిన్ వంటి పదార్ధాలు వేసి చేసే ఆహారం అంటేనే ఇష్టం.


ఇవన్నీ, ఇంకా నిలవ ఉన్న పదార్ధాలు, తామసాహారం కోవలోకే వస్తాయి.కొబ్బరి పచ్చిగా తినటం ఇష్టం లేకపోతే కొబ్బరిఉండలు చేయవచ్చు, ఇంకా పచ్చడి, కూరల్లోనూ వాడవచ్చు.


ఇంకా చిలగడదుంపలు, టమేటోలు, దోసకాయలు, వంటివి పచ్చిగానే తినేవారు.


ఇప్పుడు కూడా తింటున్నారు కానీ ఇదంతా మందులు కలిసిన సారంలేని ఆహారం.


దోసకాయ బాగా పండిన తరువాత అందులో పంచదార కలిపి తింటే మలబద్ధకం ఉండదని పెద్దవాళ్ళు చెబుతారు. వేసవిలో ఇలా ఎక్కువగా తినేవారు.


పండిన జామపండ్లు, అరటిపండ్లు కూడా మలబద్ధకం సమస్యకు ఉపయోగపడతాయి. .


కూరగాయలు తొక్క తీయకుండా వండితేనే బలం అంటారు కదా ! మేము కొన్నింటికి తొక్క తీసేసి వండుతున్నాము.


ఎందుకంటే, ఈ రోజుల్లో విచ్చలవిడిగా రసాయనిక మందులు చల్లుతున్నారు కదా ! అవి కూరగాయల తొక్కలపైన నిలవుంటాయన్న భయంతో.


అందుకే తొక్క తీసేస్తున్నాము.

బలం వచ్చే సంగతి అటుంచి , ఆ మందుల ఎఫెక్ట్ వల్ల జబ్బులు రాకుండా ఉంటే అంతే చాలు.


తొక్కపైనుంచి లోపలికి కూడా మందులు వెళ్తాయని నాకు అనుమానమే కానీ, ఏం చేయగలం ? ( నాకు అనుమానాలు బాగా ఎక్కువ మరి . )


ఏంటో కలికాలపు వింతలు..పూర్వపువారు చకచకా 10 కిలోమీటర్ల దూరం అలా నడుస్తూ వెళ్ళిపోయేవారు.


అందరూ బాగా శారీరక శ్రమ చేసేవారు. అందుకే ఎలాంటి ఆహారమైనా శుభ్రంగా అరిగిపోయేది.


ఇప్పటి పిల్లలు పట్టుమని పది గజాలు నడవమంటేనే పడిపోతున్నారు నీరసంతో.


పూర్వం 100 ఏళ్ళ పైనే జీవించేవారని గ్రంధాలలో చెప్పబడింది.


ఇప్పుడు పిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం, కళ్ళజోడు ,కట్టుడుపళ్ళవంటి పెద్దవయసు లక్షణాలు వస్తున్నాయి..

ఇదే కాబోలు అభివృద్ధి అంటే..


ఇది అలా ఉంచితే,


( గజేంద్ర మోక్షం కధలో ......... నీటిలోని ఒక మొసలి గజేంద్రుని పట్టుకుంటుంది. అప్పుడు గజేంద్రుని మొర విని శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షిస్తారు. ఇది గుర్తు వచ్చి ఏనుగు కన్నా మొసలికే బలం ఎక్కువ అనుకోరాదు. మొసలిది స్థాన బలం. అంటే నీళ్ళలో ఉన్నంతవరకూ మొసలికి బలం. అదే నేల పైన ఇలాంటి సంఘటన జరిగితే మొసలి కన్నా ఏనుగుకే బలం... . ).


దయచేసి విడియో పూర్తయే వరకూ చూడండి.

When Lions, Buffaloes and Crocodiles Attack—At the Same Time


భగవంతుని దయ ఉంటే ఇలాంటి చిత్రాలు జరుగుతాయి. అపాయాలు వచ్చినప్పుడు దైవం దయ ఉండాలి . మనం కూడాఅపాయాన్ని తప్పించుకోవటానికి శాయశక్తులా కృషి చేయాలి. ఫలితాన్ని ఫలితం మాత్రం దైవానికే వదిలేయాలి.. వీడియో తీసినవారికి కృతజ్ఞతలు. ...

Monday, October 10, 2011

మాంసము.......మానవాహారము కాదు.

ఈ క్రింది విషయాలు ఒక ప్రముఖ వైద్యులు వ్రాసిన పుస్తకంలోనివండి.


భగవంతుడు ఆయా జీవరాశుల నివాసములు, పరిసరములు, వాతావరణము, అంగసౌష్ఠవములను బట్టి విభిన్న ఆహారములను నియమించటం జరిగింది.భగవంతుని సృష్టి ఎంతో అద్భుతమైనది .జీవరాశులలో శాకాహారులు, తృణాహారులు, ఫలాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు ఇలా వివిధశాఖలుగా ఏర్పడి ఉన్నాయి,..మాంసాహారులైన జంతువులకు అందుకు తగినట్లుగా వాడికోరలు అవి ఉంటాయి.ఉదా... సింహము, పులి, నక్క, వగైరాలు.


భగవంతుడు వాటికి మాంసాహారానికి అనువైన అంతరావయములను, జీర్ణాదిరసములను అమర్చారు.


మాంసము త్వరగా కుళ్ళిపోతుంది.అది ప్రేగులలో నిలువయుండుట వల్ల అనేక రోగక్రిములు ప్రవేశించే అవకాశమున్నది.


కనుక త్వరగా జీర్ణమై మలము వెలువరించబడుటకు గానూ ,కుఱుచైన జీర్ణకోశము, మలకోశముల ఏర్పాటు జరిగింది.


వాటి ప్రేగుల నిడివి జంతువులను బట్టి ఉంటాయి., ఉదా.... పెద్దపులి, సింహము వంటి వాటికి 10 అడుగుల పొడవు మాత్రము ఉంటాయి.


అందువల్ల ఈ మృగములు మాంసమును భుజించిన ఐదారుగంటలకే మలవిసర్జన చేస్తాయట.


అదే మానవుల జీర్ణమండలము, జీర్ణాదిరసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధముగా ఏర్పాటై ఉన్నాయి.


మానవ జీర్ణమండలము దాదాపు 30 అడుగుల పొడవుంటుందట.

అందువల్ల 24 గంటలకు గానీ మలవిసర్జన జరుగదు ,


మాంసము 24 గంటలు ప్రేవులలో ఉండటం వల్ల అది కుళ్ళిపోయి దుర్వాయువులు వస్తాయి.


ఆ గాస్ వల్ల గాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, నులిపురుగులు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

ఇంకా అనేక వ్యాధులు వచ్చే అవకాశముందటున్నారు. రక్తం పులిసి చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారవుతుందట.


అంతేకాక , రక్తం చిక్కబడిపోవటం . అందువల్ల కీళ్ళనొప్పులు, గుండెజబ్బులు, మూత్రపిండాలలో రాళ్ళు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


మాంసాహారము తమోగుణమును కలిగిస్తుంది.. అందువల్ల ఉద్రేకము, కోపము, అశాంతి వంటివి పెరుగుతాయి.


అందుకని శాకాహారమే మానవులకు మంచిదని చెప్పారు .


ఎక్కువగా పండ్లు ,పచ్చి కూరగాయలు వంటివి తినాలి..


మితిమీరి వండిన ఆహారపదార్ధాలు , ఎక్కువకాలం ఫ్రిజ్‌లలో నిలువ ఉన్నవీ వంటి
ఆహారపదార్ధాలు తినకూడదు.

యిలా ఎన్నో విలువైన విషయాలను చెప్పటం జరిగింది.

Friday, October 7, 2011

దైవమే అందరికీ అండ.

* మణిద్వీపవాసులైన ఆదిశక్తి అయిన పరమాత్మకు అనేక వందనములు.


* దైవాన్ని ఏ పేరుతో, ఏ రూపంతో ఆరాధించినా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.


లోకంలో గొప్పవారితో పరిచయం పెంచుకోవాలని ఎందరో ప్రయత్నిస్తుంటారు.


కొద్దిమంది ప్రముఖులు మనకు పరిచయమైనా కూడా, మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాము.


* అలాంటిది, అలాంటిది విశ్వానికంతటికీ అధిపతి అయిన దైవంతోనే మనము పరిచయాన్ని పెంచుకుంటే అది ఎంతో గొప్ప విషయం కదా ! అప్పుడు మనకే మంచి జరుగుతుంది.


దైవానికి మనం అందరూ పరిచయమే కదా !. మనమే లోకమాయలోపడి అప్పుడప్పుడూ భగవంతుని మరిచిపోతుంటాము.


అలా కాకుండా మన స్వధర్మాన్ని మనం నిర్వహిస్తూనే , సర్వత్రా దైవాన్ని తోడునీడగా భావించాలి.


* మనకు భగవంతుని అండ ఎంతో అవసరం. మనకు ఆసరాగా ఉండి మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి.కొందరు ఏమని అంటారంటే, విధిరాతను ఎవరూ తప్పించలేరు, మనం చేయగలిగింది ఏముంది ? అంటారు .* కానీ, సతీ సావిత్రి, మార్కండేయుల వంటి వారు దైవాన్ని మెప్పించి తమ జీవితాల్లోని ఆపదలను తొలగించుకున్నారు కదా !


యమధర్మరాజు రావద్దు అన్నా కూడా ఆయన వెంటపడి , యముని అనుగ్రహాన్ని పొంది సతీసావిత్రి తన పతి ప్రాణాలను దక్కించుకుంది.


జీవులకు పూర్వపాపకర్మల వల్ల ఇప్పుడు కష్టాలు వస్తాయి.


కానీ, ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించటం వల్ల ఆ పాపకర్మ యొక్క ఫలితాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.


* ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నా కూడా , సత్ప్రవర్తన కలిగిఉండి దైవాన్ని మెప్పించితే పాపకర్మఫలితాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అనీ పెద్దలు చెప్పటం జరిగింది.


కొందరు ఎన్నో మంచిపనులు చేస్తున్నా కూడా , వారి జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి.


అది వారు పూర్వం చేసిన పాపకర్మ ఫలితం వల్ల కావచ్చు. .

* అంటే , ఇప్పుడు వారు చేస్తున్న పుణ్య కర్మ కన్నా , పూర్వపు పాపకర్మ అంత ఎక్కువగా ఉందన్న మాట.

* ( ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అవి భగవంతునికే తెలుస్తాయి. )


ఇప్పుడు వారు చేస్తున్న పుణ్యకర్మ వృధా పోదు. ఎప్పటికయినా ఆ పుణ్యఫలం అనుభవంలోకొస్తుంది.


* భగవంతుని ఆరాధించాలంటే ధనం, విద్య ఉండితీరాన్న నియమమేమీలేదు. నిర్మలమైన ప్రేమ భక్తితో భగవంతుని ఆరాధించినా చాలు.


కొందరు ఆడంబరంగా పూజలు చేస్తారు. కొందరు భక్తి ఉన్నా కూడా అంత ఆడంబరంగా పూజలు చెయ్యకపోవచ్చు. ఏమైనా భక్తిని కలిగిఉండటం ముఖ్యం.


* నిర్మలమైన భక్తిని కలిగిన వారు ఎవరైనా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అలాంటి నిర్మలమైన భక్తిని ఇవ్వమని మనము భగవంతుని ప్రార్ధించాలి.


* నాకు విషయపరిజ్ఞానం అంతగాలేదండి. అయినా , బ్లాగులో ఈ మాత్రం విషయాలు వ్రాస్తున్నానంటే ,
* ఇది అంతా దైవం వేసిన భిక్షయే. అంతా దైవం దయయే..


నూతిలోని కప్ప అదే పెద్ద ప్రపంచమనీ, తనకు విశ్వం గురించి అంతా తెలుసనీ, అలా అనుకుంటుందట.


మానవులు కూడా తమకు తెలిసిన గోరంత విజ్ఞానం చూసి మిడిసిపడటం తగదు. మనకు తెలిసిన విజ్ఞానం అతి తక్కువ.

*
దైవమే అందరికీ అండ.

Wednesday, October 5, 2011

భక్తి యోగములో కొంత భాగము..............4

ఓం.

కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి గలవాడును , కార్యసమర్ధుడును , ( సమయస్ఫూర్తి గలవాడును ), తటస్థుడును , దిగులు ( దుఃఖము ) లేనివాడును , సమస్తకార్యములందును కర్తృత్వమును వదలినవాడును ,
( లేక సమస్త కామ్యకర్మలను , శాస్త్ర నిషిద్ధ కర్మలను త్యజించిన వాడును ) నాయందు భక్తి గలవాడును , ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.ఎవడు సంతోషింపడో , ద్వేషింపడో ,శోకమును బొందడో , ఎవడు శుభాశుభములను వదలినవాడో , అట్టి భక్తుడు నాకు ఇష్టుడు.శత్రువు నందును, మిత్రునియందును, మానావమానములందును , శీతోష్ణసుఖదుఃఖములందును సమముగ నుండువాడును , దేనియందును సంగము
( ఆసక్తి, మనస్సంబంధము ) లేనివాడును, నిందాస్తుతులందు సమముగ నుండువాడును, మౌనముతో నుండువాడును ( లేక మననశీలుడును ), దేనిచేతనైనను ( దొరికినదానితో ) తృప్తిని బొందువాడును, నిర్దిష్టమగు నివాసస్థానము లేనివాడును ( లేక గృహాదులందాసక్తి లేనివాడును ), నిశ్చయమగు బుద్ధి గలవాడును , భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు.
ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి
( నాయందాసక్తి గలవారై )ఈ అమృతరూపమగు
( మోక్షసాధనమైన ) ధర్మమును ( ఇప్పుడు ) చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.


గీతా మాహాత్మ్యములో కొంత భాగము. ............................


భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను.....

ఓ భగవానుడా ! పరమేశ్వరా ! ప్రభూ ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు ?


విష్ణువు చెప్పెను....

ఓ భూదేవీ ! ప్రారబ్ధ మనుభవించుచున్నను , ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడైయుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును..( వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..).

...........................

శ్రీకృష్ణ పరమాత్మకు అనేక వందనములు.

ఆదిశక్తి అయిన పరమాత్మకు అనేక వందనములు.

అందరికి దసరా పండుగ శుభాకాంక్షలండి.

....................................

ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఎన్నో ఆటంకాలు., ఇంకా ఎన్నో పరీక్షలు .

కానీ, దైవం దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

అలాగే, నిశ్చలమైన భక్తి ఉంటే దైవం దయ ఉన్నట్లే.

అందుకే, నిశ్చలమైనభక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Monday, October 3, 2011

భక్తి యోగములో కొంత భాగము......3.


ఓం.

ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించినవాడవై దీనిని గూడ నాచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మల యొక్క ఫలములను త్యజించివేయుము.వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.
సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.
ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు
.

( వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..).