koodali

Wednesday, September 29, 2010

మరి కొన్ని సంగతులు...........

ఒకప్పుడు నేను ఎవరిదగ్గరయినా ఉపదేశము తీసుకుందామని ప్రయత్నించానండి కుదరలేదు. ఒకసారి మేము చెన్నైలో ఉన్నప్పుడు ధ్యానమును నేర్చుకుందామని ఒక ఫ్రెండ్ , నేను ధ్యాన కేంద్రమునకు వెళ్ళామండి.
సరే వారినుంచి వివరములను తెలుసుకున్న తరువాత వారు రమ్మన్నరోజున వెళ్ళాము. వెళ్ళే ముందు గుడికి వెళ్లి దైవ ప్రార్ధన చేసి తరువాత అక్కడకు వెళ్లాను. వారు క్రొత్తగా జేరిన మా అందరికి ఎవరికి ఏ దేవుడు ఇష్టమని అడిగారండి.ఆ తరువాత కొన్ని విషయములను ఉపదేశించి ఆ తరువాత ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. అలా ఉపదేశించిన విషయములను గురించి అందరికి చెప్పకూడదట.


అప్పటినుంచి ధ్యానమయితే అంతగా చేయటము లేదు కానీ, నాకు కుదిరినప్పుడు , శుచిగా ఉన్నప్పుడు వారు ఉపదేశించిన విషయమును చేస్తున్నాను. ఇక ఇతర సమయములలో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయి నామమును అనుకుంటున్నాను.


ఇక్కడ ఇంకో సంగతి నేను శ్రీ దేవీ భాగవతములో ఒక కధ చదివానండి.


ఒక ముని కుమారుడు కొన్ని కారణముల వల్ల అడవులకు వెళ్ళి ఒంటరిగా ఉంటూ ఉంటాడు,. తనకు తెలియకుండానే కొన్ని నియమములను పాటిస్తూ జీవిస్తుంటారు.


అలా కాలం గడుస్తూ ఉండగా జరిగిన ఒక సంఘటన లో ఆయన ఐ, అను ఒక శబ్దమును విని దానినే మననము చేస్తూ ఉండటం జరుగుతుంది. ఆ శబ్దము వాగ్బీజమునకు సంబంధించిన శబ్దము.


ఐం అనేది వాగ్బీజము. ఆ వాగ్బీజమును సంపూర్ణముగా కాకుండా ఐ,ఐ అని అనుకున్నంత మాత్రమునే అమ్మవారు ప్రసన్నమై ఆయనకు అనేక వరములను అనుగ్రహిస్తారు.


ఇక్కడ నేను గ్రహించిన విషయము ఏమంటే ఆ జపసమయములో ఆయన తనకు తెలియకుండానే మంచి నియమబధ్ధమైన జీవితమును గడుపుతున్నారు.


ఇంకా నాకు ఏమని అనిపించిందంటే నండీ ........ కొన్ని మంత్రములను అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ , మరియు ఇలా బీజాక్షరములకు సంబంధించిన మంత్రములను గురూపదేశం ద్వారా పొంది కొన్ని నియములను పాటిస్తూ జపించటము వలన పొరపాట్లు జరగకుండా ఉత్తమ ఫలితములను పొందవచ్చని అనిపించిందండి.
ఏమీ తెలియని వారికి భగవంతుడే గురువు అని కూడా అనుకోవచ్చేమో .ఇలాంటి మంత్రజపమునకు వీలైనంతవరకు విధివిధానములు పాటిస్తే అనుకున్నదానికన్నా మంచిఫలితములు వస్తాయేమోనని కూడా నాకు అనిపిస్తోంది అండి. .ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమును నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశించారట.

ఇంకా శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఇలా చెప్పారండి.

కృతయుగములో శమదమములు {అనగా నిశ్చల మనస్సు, శరీరము } త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలి యుగములో భగవన్మహిమలను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. అని ఉందండి...అందుకే కలి యుగములో అందరికి సులభమైన ఉపాయము దైవ నామమేనని పెద్దలు చెప్పి ఉంటారు. ...

ఇందులో తప్పులున్నచో ఆ దైవం దయచేసి క్షమించవలెను...........

Monday, September 27, 2010

కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు...

నామస్మరణం గురించి ఇంకొంచెం వ్రాయాలనిపించిందండి. మన పెద్దలు కలియుగమునకు దైవనామస్మరణం తరుణోపాయమని చెప్పారు. కాబట్టి ఏ నామమైనా స్మరించుకోవచ్చు అని నాకు అనిపిస్తోందండి.


కాని నాకు అసలు ఈ నామస్మరణము ........... . మరియు ........... మంత్ర జపము ఈ రెండిటికి గల తేడా ఏమిటి ? రెండూ ఒకటేనా లేక వేరువేరునా ? అనే శాస్త్ర విషయములు తెలియవండి.


రామ, హరి. శివ ఇలా అయితే నామమును స్మరించటము, లేక ఈ నామములకు ఓంకారమును జోడించి ఉపదేశమును పొందితే మంత్ర జపం చేయటం అవుతుందా ? ఇలాంటి విషయములు నాకు తెలియవండి.ఒక పుస్తకములో నేను ఇలా చదివానండి. ఒక పెద్దాయన తన అనుభవమును ఇలా వ్రాసారండి. వారు ఒక ఉపన్యాసములో " ఓం నమో భగవతే వాసుదేవాయ " అను మంత్రమును విని కొన్నాళ్ళు జపించారట. అప్పుడు వారికి కొన్ని కష్టములు వచ్చాయట.


ఇలా ఎందుకు జరిగిందని ,కారణము ఏమిటని వారు ఒక యోగిని అడిగితే .......ఏముందీ నీవు భక్తి, జ్ఞాన, వైరాగ్య, తపస్సులను అడిగావు. వాసుదేవుడు ఇచ్చారు. అందుకే ఈ కష్టాలు. అని ఈ మంత్రము ముక్తి మంత్రమని, చాలా శక్తివంతమైనదని తెలియజేసారట.


ఇలాంటివి చదివినప్పుడు చాలా సందేహములు వస్తాయి. నామస్మరణం యొక్క విధివిధానములు నాకు తెలియవు కాబట్టి, తెలుసుకున్నా ............ వాటిని పాటించే అంత శక్తి నాకు ఉంటుందోలేదో అన్న అనుమానంతో ............ నేను విధివిధానములు, పట్టింపులు అవసరం లేని సాయి,సాయి అన్న నామస్మరణం చేస్తున్నానండి.మా దగ్గర ఉన్న శిరిడి సాయి బాబా జీవితచరిత్రము పుస్తకములో ఒక దగ్గర సాయి స్వయముగా ఎన్నో విషయములను తెలియజేసిన సందర్భములో ఇలా కూడా అన్నారు.......... సాయిసాయి ............ యను నామమును జ్ఞప్తి యందుంచుకున్న మాత్రమునే మంచి జరుగుతుందని తెలియజేసారు.


వారు ఓంకారమును గాని శ్రీ కారమును గాని జోడించమని చెప్పలేదు. నేనయితే సాయిసాయి అనే అనుకుంటున్నాను.


మొదట్లో ఎన్నో దేవుని నామములు ప్రయత్నించానండి. ఆఖరికి ఏ పేరు కాకుండా అమ్మా అమ్మా ......... అని కూడా అమ్మవారిని స్మరించుకోవచ్చు కదా అని అలా కూడా చేసాను. కానీ అలా అనుకోవటం కొంచెము కష్టముగా అనిపించిందండి.తరువాత సాయిసాయి అన్న నామము సౌకర్యముగా, సులువుగా అనిపించిందండి. యోగాసనములు సరిగ్గా వెయ్యకపోతే ఒళ్ళు నెప్పులు వస్తాయి. అలాగే మనకు సులువు అలవాటు అవటానికి కొంచెం సమయము పడుతుంది.ఇంకో విషయము కూడా వ్రాయాలనిపిస్తోదండి. సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట. భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.


శిరిడీలో పాదుకలను స్థాపించే విషయములో శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారట. బాబా ఆ పాదుకలను తాకి అవి భగవంతుని పాదుకలని చెప్పి, చెట్టుక్రింద ప్రతిష్టించమని చెప్పారట.


బాబా శిరిడీలో శ్రీరామ నవమి నాడు పగలు హిందువులచే శ్రీరామనవమి ఉత్సవము, మరియు జెండా యుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము జరిపించేవారట.


సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు.

ఇంకా భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.... ..

Friday, September 24, 2010

కొంతమంది టెన్షన్ గా ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టుకోమని అంటుంటారు. నాకయితే దానికిబదులు దైవనామ స్మరణ మంచిదనిపిస్తుంది.

.............. ఆ తరువాత నుండి నాకు వీలు కుదిరినప్పుడల్లా దైవనామ స్మరణ చేస్తున్నానండి. అయితే ప్రారంభములో యధాప్రకారం కొన్ని సందేహములు వచ్చాయండి.


అసలు ఏ దేవుని నామము అన్న దగ్గరనుంచి .....నెమ్మదిగా అనుకోవాలా ? లేక త్వరత్వరగానా అన్న వరకూ .........అయితే కష్టం లేకుండా సుఖంగా ఎలా స్మరించుకోవాలి ? ఇలాంటి విషయములన్నీ ఎవరి వీలునుబట్టి కాలక్రమేణా వారికే తెలుస్తుందండి.భోజనం చేసేటప్పుడు, టి.వి. చూసేటప్పుడు , ప్రయాణములు చేసేటప్పుడు కూడా నామస్మరణకు మంచి అవకాశం కుదురుతుంది.


కొంతమంది టెన్షన్ గా ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టుకోమని అంటుంటారు. నాకయితే దానికిబదులు దైవనామ స్మరణ మంచిదనిపిస్తుంది.


ఒక్కొక్క నామము ఒక్కొక్క మందు బిళ్ళలాగ పనిచేస్తూ ఎప్పటికయినా మన పురాతన పాపకర్మలన్నీ నశిస్తాయి మరియు క్రొత్తగా మనము పాపకర్మలు చేయకుండా ఆ నామములు అడ్డుకుంటాయి.


నా కయితే నామస్మరణ శ్రధ్ధగా చేసినప్పుడు నా తెలివితేటలకు మించిన ఆలోచనలు రావటాన్ని గమనించాను. బ్లాగ్ లో దైవానికి సంబంధించిన విషయములు వ్రాసినప్పుడు ఆ ఆలోచనలు ఇలా వచ్చినవే.మొదట్లో రకరకముల నామములు మార్చానండి. అయితే శ్రీ మాత్రే నమః, ఓం నమఃశివాయః, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాటి నామములు చెయ్యాలంటే కొన్ని నియమములు పాటించాలేమోనని నాకు అనిపించిందండి. { నియమములు పాటించాలో అవసరం లేదో నాకు తెలియదండి }


అలా పాటించటం నావల్ల అవుతుందో లేదో ........... ఎందుకులే అనుకుని ప్రస్తుతం ఓంకారం లేకుండా సాయిసాయి అనుకుంటున్నాను.


పూజలో శుచిగా ఉన్నప్పుడు మాత్రము ఏ దేవునివైనా నామములు అనుకోవచ్చు. ...................... శుచి మరియు అశుచి ......... ఇలా అన్ని సమయములలోను సాయినామమునకు ఎటువంటి పట్టింపులు లేవు కదా ...........అని ఇలా చేస్తున్నాను.
అన్ని వేళలా శుచిగా ఉండటం ఎలా కుదురుతుంది ?

ఏ దేవుని పేరు అయినా అంతా పరమాత్మయే కదండి.................
నాకు అయితే ఏమని అనిపిస్తుందంటేనండి ,........ కలియుగమున దైవనామస్మరణం అవసరమని పెద్దలే తెలిపారు కాబట్టి, ....... ఎవరైనా ఎటువంటి సమయములోనైనా ,ఏ దేవుని నామమునైనా నిరభ్యంతరముగా స్మరించుకోవచ్చు అని...............సమస్యలు వచ్చినప్పుడు దైవ నామస్మరణ వల్లా ఎంతో ధైర్యముగా అండగా అనిపిస్తోంది. కలియుగమున దైవనామస్మరణ తరుణోపాయమని పెద్దలు కూడా తెలిపారు కదండీ...


నాకు దైవ నామస్మరణం పధ్ధతిప్రకారం ఎలా చెయ్యాలో తెలియదండి. నేను చేస్తున్న పధ్ధతి నాకు ఇప్పటికి బాగానే ఉంది.


వ్రాసినదానిలో తప్పులుంటే దయచేసి క్షమించండి.
.......

Wednesday, September 22, 2010

అసలు ఏమిచెయ్యాలో ? ఏమి చెయ్యకూడదో అర్ధం కాక అంతా అయోమయంగా ఉంది.

దైవాన్ని ఆరాధించటములో ఎవరి పధ్ధతులు వాళ్ళవి . మా అమ్మ,నాన్నగార్లు భక్తులే గానీ అండి, మరీ ఎక్కువగా తీర్ధయాత్రలకు వెళ్ళరు. మన ఇంట్లో కూడా దైవాన్ని ప్రశాంతముగా పూజించుకోవచ్చు అంటారు. అప్పుడప్పుడువెళ్తుంటారు .అదే మా మామగారు,అత్తగారు వాళ్ళకి మొదటినుంచి తీర్ధయాత్రలు చేయటం అలవాటు. వారు ఉత్తరదేశయాత్రలు కొన్నిటికి వెళ్ళారు. వాళ్ళు రోజుల్లో ఒక కారు మాట్లాడుకుని తోడుకోసం ఇద్దరు,ముగ్గురు బంధువులనుతీసుకుని వెళ్ళేవారట.


ఒక పొయ్యి కూడా వెంట తీసుకువెళ్ళి వంట చేసుకునేవారట. { ఆరోగ్యం పాడవకుండా ఇలా చెయ్యటం } మధ్య ఓపిక లేక వెళ్ళటం లేదు. అయితే మధ్యనే కాశీ, అలహాబాద్ వెళ్ళివచ్చారు.నాకు కూడా కాశీ వెళ్ళిరావాలని ఉంది. దైవం దయ ఎప్పుడో ? ఇక మేము వీలు కుదిరితే తీర్ధయాత్రలకు వెళ్తామండి. లేకపోతే ఇంట్లోనే పూజించుకుంటామండి.సరే, నేను కొంతకాలం క్రితంకొన్ని సందేహములు వచ్చి మా తల్లిదండ్రులను ఇలా అడిగానండి.


ఒకోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా, పూజలో కొన్నిలోటుపాట్లు జరుగుతున్నాయి. కొందరేమో భగవంతుడు ఏమీ అనడు అంటున్నారు. మరి కొందరేమో ఇలా చేస్తే చాలాకష్టములు వస్తాయి అంటున్నారు. పూజలో కొన్ని లోటుపాట్లు జరిగినా క్రొత్త కష్టములు వస్తే ఎలా ? అసలు ఏమిచెయ్యాలో ? ఏమి చెయ్యకూడదో అర్ధం కాక అంతా అయోమయంగా ఉంది. కానీ భగవంతుని అండ తప్పక కావాలి. అని వారితో నా సందేహములు చెప్పుకున్నప్పుడు .............


వాళ్ళు ఇలాఅన్నారండి. చిన్నప్పుడు దేవుడే లేడని అనే నువ్వు భక్తిగా మారటమే ఆశ్చర్యం అని ,

దేవుడు మనం చెడ్డ పనులు చేస్తేకోపగించుకుంటాడు కానీ, పూజలో తెలిసీ తెలియక మనం చేసే లోటుపాట్లకు కోపగించుకోడు. చెడ్డ పనులు చేసిన వాళ్ళుకూడా పశ్చాత్తాపపడి మారితే ఆ దైవం క్షమిస్తారు. అయినా నువ్వు చాలాసేపు అలా దేవుని మందిరంముందు కూర్చుంటే కుటుంబం ఎలా ? నువ్వు నీకు వీలు కుదిరినంత సేపు ప్రశాంతముగా పూజ చేసుకున్నా చాలు. ఇంకా ......... నీ రోజువారీ పనులు చేసుకుంటూనే ............. కుదిరినంతవరకూ లోపల భగవన్నామాన్ని అనుకుంటూ ఉండు. భగవన్నామ స్మరణం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతున్నారు. దైవం దయ వలన......... నామమే నిన్ను సరి అయినదారిలో నడిపిస్తుంది. .......ఇలా అన్నారండి. .,..


{ నిజం చెప్పాలంటే నాకు కూడా ఎక్కువసేపు అలా కూర్చున్నప్పుడు ధ్యాస నిలిచిపోయిన పనులమీద ఇంకా ఎక్కడో ఉంటుంది. }

మరి కొన్ని వివరములు ఇంకొకసారి అండి...............................

Monday, September 20, 2010

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.

నేను ఇంతకుముందు ఒకోసారి చాలా చాదస్తముగా ప్రవర్తించటం జరిగేదండి.


ఉదా.......ఒకోసారి మా ఇంట్లోని వాళ్ళని ప్రొద్దున్నే గుడికి వెళ్తే మంచిదని చెప్పి  తీసుకువెళ్ళటం జరిగేది. నా అభిప్రాయమేమిటంటేనండీ గుడికి సాయంత్రం వెళ్తే అప్పటికి ఏదోఒకటి తినటం జరుగుతుంది కదా అని ................


.ఇక్కడ ఏమి జరిగేది అంటేనండి ఉదయం ,పిల్లల స్కూల్ కు సమయము మించిపోతుండేది. గుడిలో ఒకోసారి అభిషేకం తరువాత అలంకరణ చేసే సమయములలో దేవుని ముందు తెర వేసి ఉంటుంది. ఒకోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు దర్శనం ఆలస్యమవుతుంది.ఇలాంటప్పుడు పిల్లలు స్కూల్ టైం అయిపోతోందని కంగారు పడతారు. వాళ్ళ అభిప్రాయం సరి అయినదే. గుడికి వెళ్ళటం వల్ల ఆలస్యమయిందని చెబితే టీచర్ ఊరుకోరుగదా !


ఏదిఏమైనా నేను వాళ్ళను వదలక ఇంకొంచెము సేపట్లో దర్శనం అయిపోతుందిలే అని సర్దిచెబుతాను. నాకు మనస్సులో అయ్యో స్కూల్ సమయం మించిపోతోదని కంగారుగానే ఉంటుంది.కానీ దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏమిజరుగుతుందో అని శంక. ఇలా నేను ఇంట్లో వాళ్ళను చాలా సతాయించాను పాపం.


ఇప్పుడు కొద్దికొద్దిగా అలాచేయటం మానివేసి నాకు ఎంత వీలయితే అంతే చేస్తున్నాను. వాళ్ళకి ఇప్పటికి దేవుడంటే భక్తి ఎక్కువే ఉంది. నేను గనక ఇలా చాదస్తముగా కంటిన్యూ చేస్తే వాళ్ళు నాస్తికులవుతారేమోనని ఒక భయం వచ్చింది.


ఇంకా నాకు ఏమని అనిపించిందంటేనండీ ,నాలో కోపము, చిరాకు, నెగెటివ్ ఆలోచనలు ఇలా ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. ముందు ఇలాంటివి భగవంతునికి అస్సలు నచ్చవు. ఇలాంటివాటి విషయములో నా మనస్సును అదుపులో ఉంచుకోవటం నాకు చేతకాక పూజవిధివిధానాల పేరిట ఇంట్లో వాళ్ళని సతాయించటం ఏమి న్యాయం అని అనిపించింది.


ఇలా విధివిధానాల వెంపర్లాటలో పడి భగవంతుని యందు ధ్యాస, ప్రేమ, భక్తి కి దూరమవుతున్నానేమో అని కూడా సందేహమొచ్చిందండి.
అందుకే పూజలో లోటుపాట్లకు దైవాన్ని క్షమించమని కోరుకుంటూ ...భగవంతుని యందు ప్రేమ భక్తికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిదని అనిపిస్తోదండి.


ఇప్పుడు స్కూల్ కు వెళ్ళే తొందరలో గుడికి వెళ్ళటం లేదు. వెళ్ళినా ఒకవేళ దర్శనం కాకపోతే అసంతౄప్తి చెందక బయటనుంచి నమస్కరించి వచ్చేయటం మంచిపద్దతి అని అనిపిస్తోంది.

భోజనం చేసినా గుడికి ప్రశాంతముగా సాయంకాలం వెళ్ళటం మంచిదని అనిపిస్తోదండి..

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.Saturday, September 18, 2010

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..

ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది.


అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు.


ఇంకో సంఘటన. ........మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ కు వెళ్ళాలని మా పిల్లల కోరిక. నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.


నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.


కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో అందరూ సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.


వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..


ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని.


విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం కాదు. . ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ....

Wednesday, September 15, 2010

ఇది ఒక వింత పరీక్ష..............

సాయి.

ఇప్పుడు చెప్పబోయే విషయం కొద్దిగా వేరేగా ఉంటుందండి. ఒక 10 సంవత్సరములు అయ్యుంటుంది ఇది జరిగి.


మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ లో ఒక పెద్దాయన వాళ్ళ కుటుంబం ఉండేవారు.


ఒకరోజున మా ఇంటికి వచ్చి తాను ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నానని, మమ్మల్ని కూడా అందులో భాగస్వాములుగా చేరమని అడగటానికి వచ్చారు. ఆ వ్యాపారంలో లక్షలు, కోట్లు వచ్చేస్తాయని ఎంతో చెప్పారు.


అంతా తానే చూసుకుంటానని, మేము మా వాటా డబ్బులు ఇస్తే చాలని అన్నారు. ఆయన చెప్పినది మాకు నచ్చలేదు. కానీ ఆయన రోజూ ఇంటికి రావటం, నచ్చచెప్పటానికి ప్రయత్నించటం ఇలా చేసేవారు.


ఇంతకీ అసలు విషయం చెప్పనేలేదు కదండి. దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు. అది మద్యమునకు సంబంధించిన వ్యాపారం లెండి. మేము ఎంతో చెప్పాము. మా పెద్దలు ఇవన్నీ వింటే కోప్పడతారు. అలాంటి వ్యాపారములు చేయటము పాపము , మాకు ఇష్టం లేదు అని.


ఒక పదిరోజులు రోజూ రావటం మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చచెప్పటానికి ప్రయత్నించటం.

ఇక నాకు వళ్ళు మండి లక్షలు, కోట్లు వచ్చినా సరే, ఇతరుల కుటుంబాలు పాడుచేసే వ్యాపారములు మేము చేయం.

ఇక ముందు ఈ ప్రసక్తి తెస్తే బాగుండదు. విషయం మీ వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పేసరికి అప్పటితో మరి రాలేదు. అనారోగ్య కారణాల వల్ల ఒక సంవత్సరం తరువాత ఆయన కాలం చేసారు.


ఇలా ఒకోసారి మొహమాటాలు ప్రక్కనపెట్టి గట్టిగా ఉండి తీరాలి. లేకపోతే మన కొంప మునుగుతుంది. ఆయన అసలు మా ఇంటికి ఎందుకు వచ్చి అడిగారో నాకు ఇప్పటికి అర్ధంకాదు.


అప్పుడు మా దగ్గర మా ఊరులో అమ్ముకున్న ఆస్థి తాలూకు సొమ్ము కొంచెం ఉంది. ఇంకా నాకు ఏమని అనిపిస్తుందంటేనండి ,....... మేము డబ్బుకొరకు ఆశ పడతామా లేదా అని.........
మాకు దైవం పెట్టిన పరీక్ష ఏమో ఇది అని....... ఏమైనా ఆ దైవం దయవల్ల కాపాడబడ్డాము.


మేము నిజంగా ఆ వ్యాపారం చేసినా మాకు నష్టమే. లేక ఆయన మా డబ్బు తీసుకుని మమ్మల్ని మోసం చేసినా మాకు సొమ్ము నష్టమే.

మొత్తానికి భగవంతుని దయవల్ల .............ఆ సమయములో మంచి ఆలోచనను, గట్టిగా నిలబడే శక్తిని ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు.


దైవానికి వ్యతిరేకమయిన అధర్మపు పనులు చేసి, ఆ తరువాత శాపాల పాలై కష్టాలు పడే దురవస్థ మాకు తప్పింది. ఒకోసారి ఇలాంటి వింత పరీక్షలు ఎదురవుతుంటాయి.


ఇప్పుడు మాకు కోట్లాది రూపాయలు లేకపోయినా బాధలేదు. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు కదా............. .....

Monday, September 13, 2010

మాకు ఎదురైన ఒక విపత్కర పరిస్థితి........

నేను పుట్టిన సంవత్సరం 1966. అండి. మా అమ్మగారు, నాన్నగారు, మామగారు, అత్తగారు దేవుని దయవల్ల క్షేమంగా ఉన్నారు. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి నాకు ఎన్నో సందేహాలు వస్తూఉంటాయి. రోజువారీ జీవితంలో ఒకోసారి మనకు ఎలా ప్రవర్తించాలో తెలియని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలా నాకు ఎదురైన కొన్ని సంఘటనలగురించి వ్రాస్తానండి.


భగవంతుని దయవలన మాకు అనారోగ్యం కొంచెము తక్కువగానే వస్తుంటుంది. ఉదా....మేము చెన్నైలో ఆరు సంవత్సరములు ఉంటే షుమారు పదహారు సార్లు వెళ్ళామేమో డాక్టర్ దగ్గరికి .......మేము ఎక్కువగా ఆయుర్వేదం, హోమియో వాడుతాము. ఒకోసారి అల్లోపతి వాడుతాము. { ఇక్కడ నేను ఏ వైద్యాన్ని తక్కువ చేయటం లేదు. దేని గొప్ప దానిదే. }

...అలాంటిది ఒకసారి మా అమ్మాయి చిన్నతనములో అంటే ఒకటవ తరగతి చదివేటప్పుడు అనుకుంటాను తనకి తలలో చిన్న కురుపు వచ్చింది. అది కొంతకాలానికి పెద్ద పుండు అయ్యింది.మేము హోమియో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఆయన చాలా బాగా మందులు ఇచ్చేవారు. అయితే అమ్మాయి తోటి పిల్లలతో ఆడుకునే సమయంలో ఆ తలకు దెబ్బ తగలటం , పుండు మళ్ళీ పెద్దదవటం ఇలా రెండు, మూడు సార్లు జరిగింది.


ఇక్కడ అసలు విషయమేమిటంటేనండి, మేము తనకి తలనీలాలు గుడిలో ఇస్తామని అనుకున్నాము. అల్లోపతి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్తే తప్పకుండా వాళ్ళు ఆ పుండు ఉన్న ప్రదేశాన్ని కత్తిరించి శుభ్రం చేసి కుట్లు వేసి మందులు వేస్తారు. మళ్ళీ హెయిర్ సరిగ్గా వస్తుందో రాదో కూడా తెలియదు.ఒక ప్రక్క చూస్తే ఆ కురుపు తగ్గటంలేదు. ఒక ప్రక్క దేవుని సెంటిమెంట్. ఏమి చెయ్యాలి ?


సీతాఫలం ఆకు రుబ్బి పుండు పైన ఉంచితే బాగా ఫలితముంటుందని రోజూ ఆ మందు కూడా వాడాము. కురుపు పైన పెచ్చులా గట్టిపడినా చీము వస్తూండేది. ఇలా రెండునెలలు గడిచాయి.


మాకు తెలిసిన వాళ్ళు ఇదంతా చూసి మమ్మల్ని కోప్పడ్డారు. మీ చాదస్తం మండిపోను. ఇది ఇలా వదిలేయటం చాలా డేంజర్. ఇన్ ఫెక్షన్ అయితే పిల్ల తలకే ప్రమాదం ఇలా భయపెట్టేసరికి మాకు ధైర్యం జారిపోయింది.
మరుసటి రోజు అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్దాము అని ............... తలస్నానం చేయిస్తూ ఆ కురుపును శుభ్రం చెయ్యటం కోసం నెమ్మదిగా రుద్ది చూసేసరికి పెచ్చు కొద్దిగా ప్రక్కకు వచ్చింది.................... అప్పుడు నిజంగా మేము ఎంతో ఆశ్చర్య పోయాము. అక్కడ కొద్దిగా పచ్చిగా ఉండటం తప్ప పుండు అంతా మానిపోయింది.దాంతో ఇక బాగా శుభ్రం చేసి , హోమియో మందు కొన్నాళ్ళు వాడేసరికి పూర్తిగా మానిపోయింది. దేవునికి తలనీలాలు కూడా సమర్పించాము. అంతా ఆ భగవంతుని దయ.ఇదంతా జరిగిన కాలంలో అందరు దేవుళ్ళను ప్రార్ధించటము, చేసేవాళ్ళం. మా అమ్మాయి కూడా నమస్కారం చేసేది. తను చిన్నప్పటినుంచి సాయి బాబా కు నమస్కరిస్తుంటుంది. మేము కూడా సాయిని ఎంతో ప్రార్ధించాము. అంతా దైవందయ. ఆ సాయి దయ.కాని ఇప్పుడు అదంతా తలచుకుంటే కొంచెం భయంగా నే ఉంటుంది. చిన్న పిల్ల అంత బాధ భరించింది కదా ........ అని తలచుకుంటే బాధగా కూడా ఉంటుంది. మేము కూడా హోమియో మందులు వాడుతూనే ఉన్నాము కదా అనే ధైర్యంతోనే అలా అంతకాలం ఆగాము.
ఇప్పుడు చాలా చిన్న చుక్క అంత మచ్చ ఉంటుంది తలలో అంతే. .


ఒకరకంగా మాకు మంచే జరిగింది. ఇంగ్లీష్ వైద్యుల దగ్గరకు వెళ్తే వైద్యంలో భాగంగా హెయిర్ కొంచెం కత్తిరించవలసివస్తుంది, అప్పుడు గుడిలో తలనీలాలు ఇచ్చే సెంటిమెంట్ కు దెబ్బ తగుల్తుంది. ఇలా అనుకుని మేము హోమియో, ఆయుర్వేదం వాడాము.

మొత్తానికి దైవం దయ వలన ఆఖరికి మంచే జరిగింది. అమ్మాయి తలలో పెద్దమచ్చ పడలేదు.సీతాఫలం ఆకు కూడా ఇలాంటివాటికి బాగా పనిచేస్తుందని తెలిసింది. అయితే ఈ ఆకులు విషపూరితమయినవి కావటం వల్ల ఏమాత్రం కళ్ళకు తగలకుండా , పిల్లలు ఆ చేతులు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలకు వాడకపోవటమే మంచిది. అప్పడు మాకు ఆ ఆకులు విషపూరితమయినవని తెలియదు.
ఏమైనా భగవంతుని దయవల్లా రక్షించబడ్డాము కానీ ......... నేను ఏమనుకుంటానంటే దేవుడా ! ఇలాంటి పరిస్థితులలో మా బుద్ధిని సరిఅయిన మార్గములో నడిపించు అని....Friday, September 10, 2010

ఇప్పటికిప్పుడు మోక్షం వస్తుందంటే ఎవరు ఎలా................. .

మనకు చాలా భక్తి ఉందనుకుంటుంటాము. పరీక్షా సమయాలలో ఆ భక్తి యొక్క బండారం బయటపడుతుంది. ఉదా....మోక్షాన్ని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మోక్షం వస్తుందంటే ఎంతమంది సిధ్ధంగా ఉంటారు ? ఖచ్చితంగా కొందరు జారిపోతారు. ఇది ఒక విచిత్రమైన ఆలోచనే.
కానీ ఇక్కడ నేను చదివిన ఒక కధ చెప్పాలి...............

అనగనగా ఒక ఊరిలో ఒక గుడి ఉండేది. ఆ గుడికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అందరూ కొంచెం సేపు పురాణకాలక్షేపం చేసి ,ఆ తరువాత దేవుని ప్రార్ధించేవారట. భగవాన్ ! మాకు మోక్షమును ప్రసాదించు. మాకు నీవు తప్ప మరేమీ అక్కరలేదు .ఇలా.........[ అప్పటి మన శక్తి మేరకు మాత్రమే భగవంతుని ప్రార్ధించటం మంచిదేమో అనిపిస్తుంది }
ఇదంతా చూసి ఒకరోజు ........... ఒక కొంటెకుర్రాడు దేవుని విగ్రహం వెనుక దాక్కుని భక్తులతో ఈ విధంగా పలికాడట......దేవునిలా.......భక్తులారా !మీ భక్తికి మెచ్చితిని. మీకందరికీ ఉత్తమలోకములను ప్రసాదించవలెనని నా కోరిక. ఉన్నవారు ఉన్నట్లుగా నాతో స్వర్గానికి రండి . అని.......
వెంటనే అక్కడి భక్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ,ఇదేమిటి ,భగవంతుడు అసలు ఇంత త్వరగా అనుగ్రహించటం , అయినా ఇప్పటికిప్పుడు అంటే ఎలా.?.......... మనకు చేయవలసిన పనులు బోలెడు మిగిలే ఉన్నాయి కదా...........కుటుంబం ఏమయిపోవాలి ? ఇలా అనుకుంటూ నెమ్మదిగా అంతా జారుకున్నారట. అక్కడే ఉంటే ఎక్కడ దేవుడు తీసుకుపోతాడోనని................ఇక్కడ నేను ఆ భక్తులను తప్పుపట్టడం లేదు. ఒకవేళ నేనే గనక అక్కడ ఉండిఉంటే ,....... .................., నేనుకూడా అలాగే వెళ్ళిపోవటం జరిగేదేమో. నాకు దేవుడంటే ఎంతో, ఎంతో ఇష్టం. అయినాకూడా................నా భక్తి కూడా అంత పరిపక్వత కాలేదు మరి. ఇలా చెప్పటానికి నేను ఎంతో సిగ్గు పడుతున్నాను.
నాకు కూడా ఇహలోక భాందవ్యాలు , వానియందు వ్యామోహం ఇంకా పోలేదు. అయినా అందరూ ఇలా ఉండరు లెండి. చరిత్రలో భగవంతుని కొరకు సర్వస్వం అర్పించిన భక్తశిఖామణులు మహానుభావులు ఎందరో ఉన్నారు.ఆఖరికి జంతువులు కూడా భగవంతుని కొరకు తమ ప్రాణాలను కూడా అర్పించాయి. ఉదా.....,శ్రీకాళహస్తికి సంబంధించిన కధ మనకు తెలిసిందే.


అందుకని ఎవ్వరం మనమేదో గొప్ప భక్తులం అనుకోరాదేమో.

అసలు నూతిలో కప్ప అదే గొప్ప ప్రపంచం...........అందులోనే గొప్ప సుఖం ఉందని భ్రమించినట్లు. ........... ఈ లోకంలోని వ్యామోహంలో పడిపోయిన మనకు మోక్షానందం గురించి తెలియదు.
నిష్కామముతో మన స్వధర్మాన్ని ఆచరిస్తే , వారిని జీవన్ముక్తులు అంటారని పెద్దలు తెలియజేసారు. ఉదా......... శుకయోగి, జనకమహారాజు ఇలాంటివారు.......... ....................
స్థితప్రజ్ఞులు మంచిజరిగినా ,చెడు జరిగినా అంతా భగవంతుని దయగా భావించి స్థితప్రజ్ఞతతో ప్రశాంతముగా ఉంటారు. ఆ దైవానికన్నా మన మంచిచెడ్డలు ఎవరికి తెలుస్తాయి అని వారు భావిస్తారు. ఇలాంటివారు ఎప్పుడో, ఎక్కడో నూటికో, కోటికో అరుదుగా ఉంటారు.మనము ఏవిధముగా జీవిస్తే ఆ భగవంతుని ప్రేమకు పాత్రులమవుతామో ,ఆ విధముగా ప్రవర్తించే బుధ్ధిని, శక్తిని ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్ధించాలి. .............

Wednesday, September 8, 2010

ఆఖరి జన్మ దగ్గరపడుతున్న కొద్దీ.................

ఒకోసారి సత్ప్రవర్తనతో జీవిస్తూన్న మంచివారికి కూడా రాకూడని పెద్ద కష్టాలు రావటం మనం చూస్తున్నాము.

నాకేమనిపిస్తుందంటేనండి ......... వారి ఇప్పటి సత్ప్రవర్తన కన్నా వారు పూర్వ జన్మలలో చేసిన పాపకర్మ ఎక్కువగా ఉండటం ఒక కారణం కావచ్చు..ఇంకా ఏమనిపిస్తుందంటేనండీ ఈ అభిప్రాయం సరైనదో కాదో తెలియదుగానీ ... ఆఖరి జన్మకు దగ్గరయ్యే కొద్దీ పరీక్షలు, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటాయేమోనని.


ఉదా......కొండమీదున్న దైవాన్ని దర్శించటానికి నడిచివెళ్ళేటప్పుడు ముందు ఓపికగా ఉన్నా ఆఖరికి వచ్చేసరికి కళ్ళుతిరిగి పడే పరిస్థితి కూడా వస్తుంది. గుడిని చేరుకున్నాక ఆ కష్టాన్ని మరచిపోతాము.
అలానే ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే ఆఖరు సంవత్సరం వచ్చేసరికి ఓపిక నశిస్తుంది. పరీక్షలు ఎంతో కష్టంగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చెయ్యవలసి వస్తుంది. పరీక్ష పాసయ్యాక అన్నీ కష్టాలు గట్టెక్కుతాయి.మరి అత్యుత్తమయిన మోక్షమును సాధించాలంటే ఎన్నో పరీక్షలను తట్టుకోవాలి.

ఈ బాధలన్నీ ఎవరు పడతారు ..........మాకు మోక్షం వద్దు. ఈ లోకంలోనే ఉంటాము అనటానికి వీల్లేదు మరి. ప్రతి జీవి మోక్షమును పొంది బాధలు లేని పరమానందమును పొందాలని భగవంతుని అభిప్రాయము.


ఆ మోక్షము ఎంతో గొప్పది కాబట్టే ఆ దైవం అలా అందరూ మోక్షమును సాధించాలని ఆశిస్తారు. మనకు ఆ మోక్షానందం తెలియదు.ఉదా.... మామిడిపండు తిన్నవారికి మాత్రమే ఆ రుచి తెలుస్తుంది. తిననివారికి దాని గురించి ఎంత వర్ణించినా ఆ రుచి తెలియదు కదా !


కొందరికి ఎక్కువజన్మలు, కొందరికి తక్కువ జన్మలు అంతేగాని, మోక్షాన్ని పొందటం అందరికి తప్పనిసరి లక్ష్యం. మనం అంతా పరమాత్మకు సంబంధించిన వాళ్ళమే మనం తిరిగి మన నిజనివాసానికి వెళ్ళటానికి అభ్యంతరం దేనికి ?మనకు దైవలీలలు అర్ధం కావు. ఎందరి జబ్బులనో తగ్గించి ప్రాణదానం చేసినవారు సాయి , పాముకాటు నుండి , నోటివాక్కుతో శ్యామా ప్రాణాన్ని కాపాడినవారు సాయి, మరి సాయినే దైవంగా నమ్మిన కాకాదీక్షిత్ కూతురు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి శిరిడీలో అకస్మాత్తుగా చనిపోయింది మరి. { ఈ సంగతి పెద్దలు వ్రాసిన ఒక పుస్తకములో చదివాను }ఇంకా సాయినే నమ్ముకున్న మహల్సాపతి, కనీసం కుటుంబావసరాల కొరకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కొందరు సంపన్న భక్తులు మహల్సాపతికి పెద్దమొత్తములో డబ్బు ఇవ్వబోతే సాయి వద్దని వారించారు.భక్తుల గతకర్మను పూర్తి చేసి మోక్షమును ప్రసాదించాలని సాయి అభిప్రాయం కావచ్చు ఏమో అని నాకు అనిపించింది.

మనకు మన ఈ ఒక్క జన్మ మాత్రమే తెలుసు. యోగులకు మనయొక్క ఎన్నో గత జన్మ కర్మలు తెలుసు కాబట్టి , మనకు భవిష్యత్తులో ఏది మంచిదో దానిని బట్టి మన కోరికలను తీరుస్తారు.


ఇంకొక విషయం అండి జీవులు మరణానంతరం మోక్షమునకు ముందు పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి గతజన్మలలోని బంధువులు { అప్పటికి పునర్జన్మను పొందని బంధువులు } కనిపిస్తారట. వింటుంటేనే వెరైటీగా ఉంది కదండి.
మంచివాళ్ళు ఇహలోక మోహంలో పడుతున్నారని అనిపించినప్పుడు ............ దైవం వారికి కష్టాలను కల్పించి మోక్షమార్గంలోకి తీసుకువస్తారు ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు. ......................
...

Monday, September 6, 2010

కష్టకాలములో అండగా......

శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఈ విధముగా చెప్పబడినది.


సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవానియందు నమ్మకముంచినట్లు, సం సారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను........ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల మాయాశక్తి బారి నుండి తప్పించుకొందురు.................


పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఒకప్పుడు అతడనేక కష్టములు పాలయ్యెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు.


ఒకప్పుడు అతని స్థితి చాల హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయనిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండుమాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను.కొన్ని అడుగుల దూరమున ఒక హోటలుండెను. దాని యజమాని సగుణమేరునాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను పిలచి అక్కల్ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా ? అని అడుగుచూ పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కధ వచ్చెను. ...........


అక్కల్ కోట్ కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను.


బాధను సహించలేక నిరాశచెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. ...........గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తి , బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు ? గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము .


సమయోచితమయిన ఈ కధను చదివి , అంబాడేకర్ చాలా ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో అతను చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును , దయాళుత్వమును చూచి అంబాడేకర్ కు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృడమయ్యెను.అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృధ్ధి పొందెను.


జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడపెను..ఈ కధలను చాలా మంది చదివే ఉంటారు. కాని మర్చిపోతూంటాము. కష్ట సమయములలో ఇలాంటి భక్తి కధలను గుర్తు తెచ్చుకొంటే ధైర్యముగా ఉంటుంది. . .
..

Friday, September 3, 2010

ఒక పంఖాను { ఫాన్ } ఒక వాహనచోదకుడిని { డ్రైవర్ } నమ్మినదానికన్నా ఎక్కువగా మనము .......

ఎప్పటినుండో ఇలా వ్రాయాలనుకుంటున్నానండి. మనము స్వధర్మమును నిష్కామముగా ఆచరిస్తూ , ఫలితమును భగవంతునికి అర్పించాలని పెద్దలు తెలియజేశారు. ఒక జనక మహారాజు , ఒక శుక యోగి లాంటి గొప్పవాళ్ళు చరిత్రలో కనిపిస్తారు. మనకు అంత లేకపోయినా ....... అందులో ఆవగింజంత అమలుపరచినా మన బ్రతుకులు బాగుపడతాయి కదా...
భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఆయన తలచుకుంటే కానిదేముంటుంది. ఇక్కడ ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అన్ని విషయాలు తెలిసికూడా మనమెందుకు ........ దైవం పైన భారం వేసి , ప్రశాంతంగా బ్రతకలేక , ప్రతిదానికి ఆందోళన పడిపోతాము అని ?ఉదా......ఒక పంఖా ను { ఫాన్ } చూడండి. అది బాగా వేగంగా తిరుగుతున్నప్పుడు పడిపోతుందేమో అనిపిస్తుంది. అవి బోల్టులు ఊడి పంఖాలు క్రింద పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినా మనకు ఫాన్ అవసరం కాబట్టి భయం ఉన్నా చేసేదేమీ లేక హాయిగా నిద్రపోతాము. { పంఖా అని వ్రాయాలా లేక ఏమి అని వ్రాయాలో నాకు సరిగ్గా తెలియదండి. }ఇలాగే ఇంకో ఉదా..ఎప్పుడైనా రాత్రిపూట రహదారిపై కారులోగాని, బస్సులో గానీ ప్రయాణించేటప్పుడు ,చూడండి. ఆ వాహన చోదకుడు {డ్రైవర్ } ఒక లిప్త పాటు కళ్ళు మూసుకుంటే చాలు , ప్రమాదం జరగటానికి. ఇలా చాలాసార్లు ప్రమాదం తృటిలో తప్పటం మనకందరికి అనుభవమే అయ్యుంటుంది. భయంగా ఉన్నా, కొంచెంసేపు మెలకువగా ఉండి ఇక చేసేదేమీ లేక , అలసటతో నిద్రపోతాము కదా.ఇలాంటప్పుడు పెద్దలు చెప్పింది గుర్తుకొస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం , రెప్పపాటు జీవితమ్ ....... అని అయితే ఇక్కడ వాహన చోదకుడు కన్ను తెరిస్తే వాహనంలో అందరికి జననం, వారు కన్ను మూస్తే అందరికీ మరణం అయ్యే అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి. {ఇక్కడ కన్ను అన్నది కరెక్టా, లేక రెప్ప అన్నది సరైనదో గుర్తు రావటం లేదండి. }

సరే ఈ విధంగా ఒక ఫాన్ ను, ఒక డ్రైవర్ ను నమ్మి నిద్రపోయినప్పుడు, సర్వశక్తిమంతుడైన ఆ దైవాన్ని నమ్మి మనం ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఎందుకు ఉండకూడదు ? అలా గనక మనము ఉండగలిగితే జీవితములో ఎంతో ప్రశాంతత ఉంటుంది.మన శక్తికొలది ధర్మమును పాటిస్తూ, ఫలితాన్ని ఆ దైవానికి వదిలిపెట్టి, మనం ఆందోళన లేకుండా ఉండగలిగితే ఎంతో ఉత్తమం. ఒకోసారి మనం ఏమీ చేయలేని విధముగా పరిస్థితులు చుట్టుముడతాయి. కనీసం ఇలాంటప్పుడైనా గాభరాపడి గుండెనెప్పి తెచ్చుకోకుండా నిబ్బరంగా ఉండటానికి పైవిధంగా ప్రయత్నించాలి.అయితే మనకు తెలుసు. ఇదంతా చెప్పినంత తేలిక ఎంతమాత్రం కాదు అని. ఇలాంటి మానసిక ధృఢత్వం రావాలన్నా భగవంతుని కృప తప్పక ఉండాలి అని.


ఆ దైవాన్ని ప్రార్ధించగా, ప్రార్ధించగా ఎప్పటికైనా ఆ స్థితి వస్తే ఎంతో అదృష్టవంతులం. . ....

Wednesday, September 1, 2010

ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...

సాయి బాబా వారు శ్రధ్ధ, సబూరి అనునవి అందరికి ఎంతో అవసరం అని చెప్పేవారు.


ఈ సంఘటన శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము లోనిది. ఒకనాడు సాయిబాబా భక్తుడగు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెదననుకొనెను. స్నేహితులాతని విఠోబా గుడికి తీసికొనిపోవనిశ్చయించిరి. . పాముకాట్లు అచ్చట బాగగుచుండెను .


కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దీపితుడయి బాబా యిట్లనియె, ఓరి పిరికి పురోహితుడా ! యెక్కవద్దు, నీవెక్కినచో నేమగునో చూడుమని బెదిరించి తరువాత యిట్లు గర్జించెను. పో , వెడలిపొమ్ము. దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మశీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు ?అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను.
కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామా దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను.


వెంటనే బాబా తాత్యాపటేలును, కాకాసాహెబు దీక్షితును, అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ( పో , వెడలిపొమ్ము , క్రిందకు దిగు )శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి యెక్కరాదనియు , అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి.


మంత్రములలో నారితేరిన తక్కినవారివలె , వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్ర బియ్యము గాని, తీర్ధము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి.మనము కూడా కష్టములు వచ్చినప్పుడు నిరాశ పడకుండా గురువు,మరియు భగవంతుని యందు ధృడమైన నమ్మకము, ఓపిక కలిగిఉండవలెను .

భక్త రామదాసు అంతటి రామభక్తుడే ఒకానొక పూర్వకర్మానుసారము చెరసాలలో కొంతకాలము శిక్ష అనుభవించిన తరువాత భగవంతుడు వారిని కాపాడారు.

అందుకే అందరికి దైవం యందు ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...
.