koodali

Wednesday, September 1, 2010

ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...

 

సాయి బాబా వారు శ్రధ్ధ, సబూరి అనునవి అందరికి ఎంతో అవసరం అని చెప్పేవారు.

ఈ సంఘటన శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము లోనిది. ఒకనాడు సాయిబాబా భక్తుడగు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెదననుకొనెను. స్నేహితులాతని విఠోబా గుడికి తీసికొనిపోవనిశ్చయించిరి. . పాముకాట్లు అచ్చట బాగగుచుండెను .


కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దీపితుడయి బాబా యిట్లనియె, ఓరి పిరికి పురోహితుడా ! యెక్కవద్దు, నీవెక్కినచో నేమగునో చూడుమని బెదిరించి తరువాత యిట్లు గర్జించెను. పో , వెడలిపొమ్ము. దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మశీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు ?అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను.


కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామా దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను.


వెంటనే బాబా తాత్యాపటేలును, కాకాసాహెబు దీక్షితును, అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ( పో , వెడలిపొమ్ము , క్రిందకు దిగు )శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి యెక్కరాదనియు , అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి.


మంత్రములలో నారితేరిన తక్కినవారివలె , వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్ర బియ్యము గాని, తీర్ధము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి.


మనము కూడా కష్టములు వచ్చినప్పుడు నిరాశ పడకుండా గురువు,మరియు భగవంతుని యందు ధృడమైన నమ్మకము, ఓపిక కలిగిఉండవలెను .

భక్త రామదాసు అంతటి రామభక్తుడే ఒకానొక పూర్వకర్మానుసారము చెరసాలలో కొంతకాలము శిక్ష అనుభవించిన తరువాత భగవంతుడు వారిని కాపాడారు.

అందుకే అందరికి దైవం యందు ధృడమైన నమ్మకము , ఓపిక ఎంతో అవసరము. ...
.

 మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.


 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

2 comments:

  1. ఈ పట్టున జ్ఞప్తి యందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము ( పో , వెడలిపొమ్ము , క్రిందకు దిగు )శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి యెక్కరాదనియు , అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి.
    -------
    మంత్రాలకి చింతకాయలు రాలు తాయా అని అంటారు కానీ మంత్రాలు అన్నీ మనస్సుని ఆజ్ఞాపించేవి అయి ఉండవచ్చు. కాకపోతే వాటి మీద నమ్మకము సరి అయిన ఉచ్చారణ చాలా ముఖ్యము. మంచి సంగీతము మన మనస్సును స్వాధీనము చేసుకుని మనకు ఆనందము కలుగ చేయుట లేదా!
    థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. కామెంట్స్ కొద్దిసేపటి క్రితం మాత్రమే చూసినందువల్ల జవాబివ్వటం ఆలస్యమయినందుకు నిజంగా చాలా బాధగా ఉందండి. దయచేసి క్షమించండి. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete