koodali

Wednesday, June 29, 2011

.....ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.

సంతోషకరమైన విషయం.......... అమరనాధ్ యాత్ర ప్రారంభమయిందట. ఈ యాత్ర చాలా గొప్ప యాత్ర .
.........................................


పూర్వం, ఇంట్లో పనులు చేయటానికి ఇన్ని యంత్రాలు లేవు కదా ! పప్పు రుబ్బటం, పిండి కొట్టటం ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళే చేసుకొనేవారు.


ఈ పనులన్నీ చేయటం వల్ల , ఇంకా పురుగు మందులు లేని పుష్టికరమైన ఆహారం తీసుకోవటం వంటి కారణాల వల్ల ఆరోగ్యంగా ఉండేవారు.


ఇప్పటిలా మధ్య వయసుకే నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, లాంటివి ఉండేవి కాదు. నాకు ఒక సందేహం వస్తూంటుంది.

ఇప్పుడు ఇన్ని యంత్రాలు ఉన్నా ఇంట్లో పనులు తొందరగా చేయలేకపోతున్నాము. అప్పటి వాళ్ళు అంతంత పనులు స్వయంగా చేసుకున్నా కూడా , వాళ్ళకి ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకోవటానికి బోలెడు సమయం ఎలా ఉండేదా ? అని.


ఇంకా వాళ్ళు నోములు, వ్రతాలు కూడా ఎక్కువగా చేసేవారట. అంత సమయం ఎలా ఉండేదో ?

మన ప్రాచీనులు ఆడవాళ్ళకు నోములు, వ్రతములు చెప్పటంలో ఆధ్యాత్మికతతో పాటూ ఎన్నో సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయనిపిస్తుంది.


పూజలు మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ ఇలా ముత్తయిదువులకు పసుపు కుంకుమ పంచిపెట్టమని చెప్పటం వంటి వాటి ద్వారా సమాజంలో అందరి శ్రేయస్సు కోరటం అలవాటవుతుంది.


ఇంకా, ,అందరి మధ్య మంచి స్నేహ సంబంధాలు పెరగటం వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి అనిపిస్తుంది.....

ఎక్కువగా నోములలో ఊరిలో కొందరు ముత్తయిదువులకు పసుపు,కుంకుమలు,తాంబూలం పంచి పెట్టమని చెబుతారు. ఇలాంటి నియమాల వల్ల ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహం ఏర్పడే అవకాశం ఉంది.


ఇలా ఆడవాళ్ళు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళినప్పుడు వారి ఇల్లు అలంకరణ, పెరటి తోట ఇలాంటివి చూసి తాము కూడా ఎన్నో విషయాలు నేర్చుకొంటారు.


సామాన్యంగా ఒక కోడలు " నేను ప్రక్కింటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకువస్తానండి " అని ఇంట్లో వారిని అనుమతి అడిగిందనుకోండి.

వారు పంపుతారో లేదో ! తెలియదు.


అలా కాకుండా పూజలు, పేరంటాలు వంటి సందర్భాలలో అయితే పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టరు గదా !


ఇంకా తీర్ధయాత్రలు, తిరునాళ్ళు విషయంలో కూడా ఆధ్యాత్మికతతో పాటూ ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్నాయనిపిస్తుంది.


ఇలా వెళ్ళి రావటం వల్ల కుటుంబసభ్యులు అందరికీ రోజువారి జీవితం నుంచి కొంచెం మార్పు ఉంటుంది.


ఎక్కువగా దేవాలయాలు కొండలమీద, నదుల ఒడ్డున ఉంటాయి. అలాంటి రమణీయ ప్రదేశాలకు నాలుగు రోజులు వెళ్ళి రావటం వల్ల ఇంట్లో అందరికీ ఉత్సాహంగా ఉంటుంది.


పుణ్యం, పురుషార్ధం అన్నీ దక్కుతాయి.

ఇలా మన పెద్దలు ఎన్నో విధాలుగా ఆలోచించి ఇవన్నీ ఏర్పాటుచేశారు. నిజంగా మన పెద్దలు ఎంత తెలివిగలవాళ్ళో గదా ! అనిపిస్తుంది.....


ఇంకా , స్త్రీలు ఆభరణాలు వేసుకోమని చెప్పటం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని ధరించటం వల్ల అందం, అలంకారం అని అందరికీ తెలుసు.


బంగారు ఆభరణాలు ధరించటం ,మట్టిగాజులు ధరించటం వల్ల ఆరోగ్యం కలుగుతుందట. స్త్రీలకు వివాహ సమయంలో పుట్టింటివారు, అత్తింటివారు ఆభరణాలు చేయిస్తారు.


ఈ ఆభరణాలు స్త్రీల దగ్గరే ఉంటాయి. అవి స్త్రీలకు ఆస్తిలాగా ఆపద సమయంలో ఆదుకుంటాయి.


ఉదా........ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

భర్తకు ఎప్పుడయినా అవసరమయితే భార్య తన ఆభరణాలు ఇవ్వటం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చు.


ఆ ఆభరణాలను తన పిల్లలకో , మనుమలకు, మనుమరాళ్ళకు ఇచ్చుకోవచ్చు.


ఇంకా, ,పూర్వం మహారాణులు వంటి వారు కష్టాలలో ఉన్నప్పుడు ( ఉదా...శత్రువులు ముట్టడించినప్పుడు ) వారి ఆభరణాలు వారికి ఉపయోగపడేవట.


సీతమ్మ వారి జాడ కనుగొనే సందర్భంలో ఆమె జారవిడిచిన ఆభరణాల పాత్ర అందరికి తెలిసిందే.


స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.


ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళ ఆభరణాలను అంత త్వరగా తీసుకోరు కదా !.మరీ కష్టాల్లో ఉంటే తప్ప.

అయినా, ఆ నగలు మళ్ళీ వారి పిల్లలకే చెందుతాయి కదా !


అయితే మితిమీరిన భోగాల వెనుక రోగాలు ఉన్నట్లు, మితిమీరి పసిడిని ప్రోగుచేస్తే దాని వెనుక దొంగల భయం వంటి ప్రమాదాలు ఉంటాయి.


ఇవన్నీ చూస్తే పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాల వెనుక... ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.. ..
..

Monday, June 27, 2011

లేకపోతే కుటుంబం అంటూ లేని ఆటవిక కాలం నాటి వ్యవస్థ మళ్ళీ వచ్చినట్లే..

ఈ రోజుల్లో చాలా కాపురాలు విడాకులకు దారితీయటం ఎక్కువగా జరుగుతోంది. ఇలా జరగటానికి రకరకాల కారణాలున్నాయి.( దయచేసి పూర్తిగా చదవండి. )

అందులో కొన్ని 1. అందరికి పనివత్తిడి విపరీతంగా పెరగటం, 2. భార్యాభర్తల మధ్యన మూడోవ్యక్తి ..... లాంటివి.


ఇలాంటి నెగిటివ్ విషయాల గురించి చర్చించకూడదు అంటారు కొందరు.

* నాకు ఏమనిపిస్తుందంటే, వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయటం కన్నా ......... కూలిపోబోతున్న కాపురాలలో ఏ ఒక్క కాపురాన్ని కాపాడినా ఎక్కువ పుణ్యం వస్తుంది అని.


* 1.పనివత్తిడి..... పెద్దవాళ్ళు .పనులు చేయవద్దని, పిల్లలు చదువుకోవద్దని ఎవరూ అనరు. అయితే శరీరం తట్టుకోలేనంతగా వత్తిడి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.


ఈ రోజుల్లో అందరూ నెలకు 50 వేలు అంతకన్నా ఎక్కువ జీతం రావాలని కోరుకుంటున్నారు. అయితే యాజమాన్యం అంతపెద్ద మొత్తం జీతాలు ఇస్తున్నప్పుడు జీతానికి తగ్గ పని చేయించుకుంటారు కదా !


ఉద్యోగస్తుల సంఖ్య తగ్గించి ఉన్న వాళ్ళతోనే మొత్తం పని చేయిస్తారు. అంటే ఒకే వ్యక్తి ఇద్దరి పని చేయవలసి వస్తుంది.


అందువల్ల విపరీతంగా అలసిపోయి జబ్బులు కొని తెచ్చుకొంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే, యాజమాన్యాలు ఒకే వ్యక్తికి 50 వేలు జీతం ఇవ్వటం కన్నా ....... 60 వేలు చొప్పున, ఒక్కొక్కరికి 30 వేలు జీతం ఇచ్చేటట్లు , ఇద్దరు ఉద్యోగస్తులను నియమించితే బాగుంటుంది.


అప్పుడు నిరుద్యోగుల సంఖ్యా తగ్గుతుంది. ఉద్యోగస్తులు అనారోగ్యాలు, సెలవులు లేకుండా ఉత్సాహంగా చేసే పని వల్ల , పనిలో నాణ్యత బాగుంటుంది.


ఎంత పెద్ద అధికారం లో ఉన్న వ్యక్తి అయినా మరింత మంది ఉద్యోగులను నియమించి అందరూ సమర్ధవంతంగా పని చేసేలా ప్రోత్సహించటం ద్వారా ........ పని వత్తిడి తగ్గించుకోవచ్చు.అలా నిరుద్యోగం కూడా తగ్గించవచ్చు.* ఎవరికయినా పని వత్తిడి వల్ల ఆరోగ్యం పాడయితే ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. సంపాదన ముఖ్యమే కానీ, అందుకు మనుషుల ఆరోగ్యం కూడా ముఖ్యమే. కదా !.


అదీకాక 24 గంటలు ఆఫీసుల్లోనే పని చేస్తే ఇక కుటుంబం బాగోగులు ఎవరు చూస్తారు ?


కుటుంబం అన్నాక భార్యకు , భర్తకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వారు తల్లిదండ్రులుగా పిల్లలకూ ఎంతో సమయం కేటాయించవలసి వస్తుంది. లేకపోతే ఆ పిల్లలు చెడిపోతారు.


ఇంకా, విపరీతమైన పనివత్తిడి వల్ల కోపం, అసహనం, చిరాకులు, జబ్బులు తప్పవు. ఇక కుటుంబంలో కలతలు మొదలవుతాయి.* ఉదా......ఒక కుటుంబం గురించి చెబుతానండి. భార్యా,భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. భార్య ఒకదగ్గర, భర్త వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారు.


భర్తకు వంట చేయటం వచ్చు. కానీ ఆఫీసులో పని పూర్తయి ఎప్పుడో రాత్రికి ఇంటికి వస్తారు.

ఇక అప్పుడు వంట చేసే ఓపిక లేక హోటల్లో భోజనం చేసేసి ఇంటికి వచ్చేవారు. హోటల్ మూసేస్తే ఇక ఇంట్లో ఏమైనా ఉంటే తినటం , లేకపోతే ఇక పస్తే.


అలా చాన్నాళ్ళు గడిచాక ఆరోగ్యం పాడయ్యి ఒకరోజు హఠాత్తుగా ఆయన మరణించారు. ఇందులో ఎవరిది తప్పో ?

* 2. భార్యాభర్తల మధ్యన .........ఉదా....... ఒక కుటుంబం గురించి....... .....ఒక ఇంట్లో అద్దెకు చేరిన కొత్తలో మా పొరుగున ఒక కుటుంబం ఉన్నారు.


ఆ ఇంటి ఆమె నాకు ఎప్పుడూ కనబడలేదు. ఆమె గురించి మా ఎదురింటి ఆమెను అడిగాను .


ఆమె ఏమి చెప్పారంటే........ఆ ఇంట్లోని భార్యాభర్తా పిల్లలు బాగానే ఉండేవారట.


అయితే, భర్తకు వేరే ఆమెతో పరిచయమయిందట. ఆ విషయం భార్యకు తెలిసి గొడవలు జరిగాయట.


ఇక భార్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట.

వారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తమకు చేతనయినంతలో వంట చేసుకొనేవారు. ఇరుగుపొరుగు ఎంతో కాలం ఇవ్వరు కదా !


కొంతకాలానికి వారు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

నాకు అనిపించింది ఆ భార్యకు భర్త వల్ల తట్టుకోలేనంత బాధ కలిగింది. ( అలాంటి పరిస్థితి తట్టుకోవటం కష్టమే . )


కానీ , పిల్లల కోసమైనా ఆమె జీవించి ఉంటే, కనీసం పిల్లలయినా సంతోషంగా ఉండేవారు కదా ! అనిపించింది.


* ఇళ్ళలో తల్లిదండ్రుల మధ్యన విడాకులు,ఇంకా ఇలాంటి గొడవలు చూసిన పిల్లల మనస్తత్వంలో ఒక తేడా వస్తుంది.


ఇంకా , చిన్నతనం నుంచీ హాస్టళ్ళలో పెరిగిన పిల్లలకు కూడా కుటుంబ వ్యవస్థ గురించి సరైన అవగాహన ఉండటం లేదు.


* అందుకేనేమో , ఈ మధ్య కాలంలో " సహజీవనం " అనే కొత్త తరం తయారవుతోంది. ఇలా జరగటానికి ఆ పిల్లలను తప్పుపట్టలేము.


కుటుంబవ్యవస్థ ఇలా బీటలు వారటానికి ఎందరో బాధ్యులు.


కుటుంబం గురించి మాట్లాడితే సంకుచిత తత్వం అంటారు కొందరు.

* కానీ ఇప్పటికి అయినా పెద్దవాళ్ళు మేలుకొని , మన పెద్దలు ఎంతో ఆలోచించి , ఏర్పరిచి , మనకు అందించిన , ప్రపంచంలోనే గొప్పదైన భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి.

లేకపోతే కుటుంబం అంటూ లేని ఆటవిక కాలం నాటి వ్యవస్థ మళ్ళీ వచ్చినట్లే.
.

Friday, June 24, 2011

గృహిణిగా ఉండటం ఎంతో గొప్ప విషయం. .

మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఇద్దరూ సమానమే. అలాగే భార్యాభర్తలలో ఇద్దరూ సమానమే.


పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి కుటుంబవ్యవస్థకు విధివిధానాలను రూపొందించారు. ఎవరినీ తక్కువ చేయటం వారి ఉద్దేశం కాదు.మగవాళ్ళకు, ఆడవాళ్ళకు శారీరికంగా, మానసికంగా ఎన్నో తేడాలుంటాయి. దానికి తగ్గట్టుగానే వారికి బాధ్యతలను ఇవ్వటం జరిగింది.మగవాళ్ళకు కుటుంబ పోషణ, పాలన, రక్షణ వగైరా బాధ్యతలను అప్పగించారు.


ఆడవారు కొంచెం బిడియంగా, సున్నితంగా ఉంటారు, ఇంకా వారికి గర్భధారణ వంటివి ఉన్నాయి కాబట్టి , ఆడవారికి ఇంటిపట్టునే ఉండే ఇంటిని చక్కదిద్దుకోవటం, పిల్లల ఆలనాపాలనా వంటి బాధ్యతలను అప్పగించారు.


ఇంకా, ఆడవారు బైటకు వెళ్తే వచ్చే , రక్షణ వంటి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోని పెద్దలు ఇలా ఏర్పాటు చేశారు .ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు మేము వంటింటి కుందేళ్ళుగానే పడి ఉండాలా ? అంటుంటే ..... వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారో అర్ధం కావట్లేదు.


బయటికి వెళ్ళి పనిచేస్తేనే గొప్ప......... ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుకోవటం గొప్ప కాదు అని ..... భావించటం తప్పు.మన కుటుంబసభ్యులకు, పిల్లలకు , మన ఆరోగ్యం కోసం మనం వంట చేయటం చిన్నతనంగా భావించటం దురదృష్టం............ అలా అనుకుంటే మరి మనకు భోజనం ఎవరు తయారు చేస్తారు ?


మీడియాలో చూపిస్తుంటారు, యాంకర్ ....... . . " మీరు ఏం చేస్తుంటారు " ? అని గృహిణులను అడిగితే ....


కొందరు ,....." నేను హౌస్ వైఫ్ నేనండి ".. అంటుంటారు .( తలదించుకుని ) ....... ఉద్యోగం చెయ్యకుండా గృహిణిగా ఉండటమే తప్పు అన్నట్లు.ఇలాంటి వారు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఎవరిల్లు వారు చక్కదిద్దుకుంటే దేశమే బాగుపడుతుంది కదా !పూర్వం మగవాళ్ళు సంపాదన కోసం బైటకెళ్ళి కష్టపడి ,
.......ఏ మధ్యాహ్నమో భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ... లేక ... ఏ సాయంకాలానికో ఇంటికి వచ్చినపుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.


(అప్పుడు మగవాళ్ళని ఇంటి పనులు చెయ్యమని ఎవరూ అడిగేవారు కాదు. అలాగే ఆడవాళ్ళని సంపాదించుకు రమ్మని అడిగే వారు కాదు. .)ఆడవాళ్ళు అయితే , మగవాళ్ళు బయటకు వెళ్ళాక నిదానంగా ఇంటి పనులు చక్కబెట్టుకొని పగలు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.కానీ ఈ రోజుల్లో భార్యాభర్తా ఇద్దరూ సంపాదన కోసం బైటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తారు.


ఇక అప్పుడు అలసిపోయి ఇంట్లో పనులు చెయ్యాలంటే ఇద్దరికీ విసుగే. అప్పుడు నీరసంగా ఏదో ఇంత వండుకొని తింటారు.


ఈ విధానంలో ఎవరికీ విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ( రాత్రికి నిద్రలో విశ్రాంతి తప్ప. )


నేనూ మీలాగే బైట సంపాదిస్తున్నాను కాబట్టి, భర్త కూడా ఇంటి పని చెయ్యాలంటుంది భార్య.


ఇక ఇంటి పనులు తప్పించుకోవటానికి భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మొదలవుతుంది. ఇక గొడవలు మొదలు.


ఆ కోపమంతా ....... అప్పటికే అలసిపోయి బడి నుంచీ వచ్చిన పిల్లల మీద చూపిస్తారు.


భార్యను భర్త తిడితే ........... పురుషాహంకారం నశించాలి ........ అని నినాదాలు చేస్తారు .


మరి పిల్లలను తల్లిదండ్రులు తిడితే ......? తల్లిదండ్రుల అహంకారం నశించాలి ..... అని పిల్లలు కూడా నినాదాలు చెయ్యాలేమో ఇక !


కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుంది.


కుటుంబం అన్నాక ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా .,ఆనందంగా ఉండాలంటే భార్యాభర్తలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.


ఇల్లాలు చక్కగా ఆహారాన్ని వండి పెట్టాలి. పాత్రలు, దుస్తులు ,ఇల్లు ఎప్పటికప్పుడు అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.


చిన్నపిల్లలను పెంచటానికి ఎంతో ఓపిక కావాలి.ఇంకా,..... ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని దగ్గరుండి చూసుకోవాలి కదా !

ఇలా ఆడవాళ్ళకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.


పూర్వం ఆడవాళ్ళు , పొరుగువారితో కబుర్లు చెప్పుకొనేటప్పుడు కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పప్పులు, ఉప్పులు శుభ్రం చేసుకోవటం , కుట్లు, అల్లికలు వంటివి చేస్తూ ఉండేవారు.పెరట్లో కూరగాయలు , పండ్ల చెట్లు పెంచేవారు. కొందరు ఆవులు, గేదెలు పాలు పితకటం ఇలా ఎన్నో చూసుకొనేవారు.


పురుడు పోయటానికి అనుభవం గల ఆడవాళ్ళు ఉండేవారు.


ఈ రోజుల్లో కూడా వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వగైరా కొన్ని రంగాల్లో ఆడవాళ్ళు పనిచేయవలసిన అవసరం ఉంది.


అలాగని ఉద్యోగం చేయకపోతే చిన్నతనంగా మహిళలు భావించకూడదు.


ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ కూడా ఇతరులకు ఎంతో సహాయం చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.మొత్తానికి భార్యభర్త నేనుగొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ బిజీ అయి పోయి చంటిపిల్లలను కూడా కేర్ సెంటర్లలో వేస్తారు. తరువాత హాస్టళ్ళలో వేస్తారు.


ఇక ఆ పిల్లలు పెద్దయ్యాక ఈ ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తారు.


అధర్మ సంపాదనతో పొందిన ఆహారం, నిలువ ఉంచిన ఆహారం ( ఉదా.. జంక్ ఫుడ్, ఆరు నెలల క్రితం వండి అమ్మే కర్రీలు వంటివి ... ), ఇలాంటి ఆహారాన్ని తామస ఆహారం అంటారట.


ఇలాంటి ఆహారం స్వీకరించటం వల్ల తామసగుణాలు వృద్ధి చెందుతాయట.

అందుకేనేమో ! ఈ రోజుల్లో తామస గుణాలైన కోపం, అసహనం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ..

Wednesday, June 22, 2011

అన్నయ్య గారూ, ఆక్కయ్య అని పిలుచుకొనే ఆ నాటి పిలుపులు ఏమైపోయాయో ?

బంధువులు కాకుండా పరిచయస్తులు.. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకరినొకరు అన్నయ్య గారూ, ఆక్కయ్య అని పిలుచుకొనే
ఆ నాటి పిలుపులు ఏమైపోయాయో ?


మా చిన్నతనంలో జీవితం ఇంత హర్రీబర్రీగా ఉండేది కాదు.


కాసేపు నింపాదిగా కూర్చుంటే కొంపలు మునిగిపోతాయేమో అన్నట్లు కంగాళీగా ఉండేది కాదు. కొంచెం ప్రశాంతంగానే ఉండేది ప్రపంచం.


మధ్యాహ్నమో, సాయంత్రమో చుట్టుప్రక్కల ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం లాంటి దృశ్యాలు కనిపించేవి.


పిల్లలకు సాయంత్రం పూట ఆడుకోవటానికి కూడా సమయముండేది.

( అప్పట్లో ఇప్పటిలా బండెడు హోంవర్క్ ఉండేది కాదు. )


మా ఎదురింట్లో ఒక పిన్నిగారు ఉండేవారు. వారి పిల్లలు నాకు ఫ్రెండ్స్.


ఆ పిన్నిగారు మా ఇంటికి వస్తూ మా అమ్మగారిని
" అమ్మాయ్ ! ఏం చేస్తున్నావు" అంటూ వస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది.ఆ పిన్నిగారు, ప్రక్కింటి వదినగారు, మా అమ్మగారు కబుర్లు చెప్పుకుంటుంటే
నేను మా అమ్మ పర్మిషన్ తీసుకొని పిన్నిగారి ఇంటికి వెళ్ళటం జరిగేది.,

ఇక చుట్టుపక్కల పిల్లలం ఎన్నో కధలు చెప్పుకొనేవాళ్ళం.


రాజు......భేతాళ కధలు ,చందమామ లోని కధలు ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్ళం.
ఆ కధలు సీరియల్స్ లా కూడా కొనసాగేవి.ఎందుకంటే కధ పూర్తి అవకముందే పెద్దవాళ్ళు ఇంటికి పిలిచేశారనుకోనండి.
కధ ఆగిపోయి తరువాయి భాగం తరువాత కొనసాగేది అన్నమాట.


మగవాళ్ళు వచ్చే సమయమయ్యేసరికి ఆడవాళ్ళు కబుర్లు ముగించి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేవారు.


ఆ రోజుల్లో ఆఫీసుల్లో కూడా ఇప్పటిలా గొడ్డుచాకిరీ ఉండేది కాదు.

చాలా మంది మగవాళ్ళు వీలయినంత త్వరగానే ఇళ్ళకు వచ్చేసే వారు.


వ్యవసాయం, వ్యాపారం చేసేవారికి, ఇంకా కుటుంబ వారసత్వంగా వచ్చిన వృత్తులు చేసేవారికి కూడా
ఇప్పటి అంత టెన్షన్ గా పని వత్తిడి ఉండేది కాదు.కొందరు ఇంట్లో పిల్లలతో హోంవర్క్ చేయించే తండ్రులు కూడా ఉండేవారు అంటే....... ఇప్పటి వాళ్ళు ఆశ్చర్యపోతారు.


మగవాళ్ళకు కూడా కుటుంబంతో గడపటానికి, ఇంకా , స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పుకోవటానికి తగిన సమయం ఉండేది.


ఇలా కబుర్లు చెప్పుకోవటం వల్ల పని దండగ,పోచుకోలు కబుర్లు అని ఈ మధ్య అంటున్నారు గానీ,

కబుర్ల వల్ల చాలా లాభాలున్నాయట.


మనకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవటం, ఇంకా, మానసికవత్తిడి తగ్గటం ఇలా ఎన్నో లాభాలున్నాయట.


( అలా అని మన ఇంట్లో విషయాలన్నీ పక్కింటివారికి అన్నీ చెప్పెయ్యకూడదు. ఎంతవరకూ చెప్పొచ్చో అంతవరకే చెప్పినప్పుడే లాభాలు.

పరిధి దాటి చెప్పేస్తే జరగబోయే పరిణామాలకు ఏం చేయాలో తెలియక మనం దిక్కులు చూడవలసిందే .)


ఇక,....................


ఈ రోజుల్లో అయితే పిల్లలకు సూర్యోదయం నుంచీ మళ్ళీ సూర్యోదయం వరకూ చదువేచదువు.(

మధ్యలో కొంచెం సేపయినా నిద్ర పోకపోతే బాగుండదు కాబట్టి
పడుకోవటానికి పర్మిషన్ దొరుకుతుంది అంతే.


నిద్రలో కూడా మెదడుకు చదువు చెప్పే సాధనాలు ముందుముందు కనుక్కుంటారేమో చెప్పలేము.


ఇక తండ్రులు, కెరీర్ టార్గెట్టుల మాయాజాలంలో ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తారు.చాలా మంది తల్లులు కూడా ఉద్యోగాల వల్ల రాత్రి 7 లేక 8 గంటలకు ఇంటికి వస్తారు.


పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఇంట్లో ఎవరూ ఉండరు కాబట్టి ,
వాళ్ళను కరాటే, కధాకళి వగైరా క్లాసుల్లో వేస్తారు .

( అవి నేర్చుకోవటం వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా, నేర్చుకోవటానికి ఓపిక ఉన్నా లేకపోయినా ).అందరూ ఇంటికి వచ్చి ఇంత వండుకుని తిని ,దానికీ ఓపిక లేకపోతే కర్రీ పాయింట్ల నుంచీ

తెచ్చుకుని భోజనాలు కానిచ్చి పడుకుంటారు.


కొన్ని ఇండ్లలో తండ్రిని వారం రోజుల పాటు చూడని పిల్లలు కూడా ఉన్నారట.


అంటే రాత్రి తండ్రి ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్ర పోతారు. ప్రొద్దున పిల్లలు లేచేసరికి తండ్రి పనిలోకి వెళ్ళిపోతారు.


ఇక ఈ రోజుల్లో భార్యా భర్తా మాట్లాడుకోవాలన్నా అన్నీ అడ్డంకులే.

ఉదా... భార్య " ఏమండి."......... అనగానే "ఏమిటోయ్ "! అని భర్త అనగానే .......


ట్రింగ్!ట్రింగ్ ! అని సెల్ ఫోన్ మోగుతుంది. ఇంకా సంభాషణ కట్.


ఒక అరగంట అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉండే భర్తను చూసీచూసీ భార్య తాను భర్తతో ఏం

చెప్పాలనుకుందో మర్చిపోతుంది.


అరగంట ఫోన్ సంభాషణ అనంతరం భర్త కాసేపు అయోమయంగా తాను ఆఫీసులో ఉన్నానో లేక ఇంట్లో ఉన్నానో అర్ధం కాక , గుర్తు తెచ్చుకుని స్పృహ లోకి వచ్చి ,

ఎదురుగా నీరసం మొహం వేసుకొని చూస్తున్న భార్యను చూసి ........


"ఆ ! ఏంటోయ్ ! ఇందాక ఏదో చెబుతున్నావు. విషయమేంటి " ? అని అడుగుతారు.

" మరీ ! మరీ ! విషయమేమిటంటే ............ అని గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే .......


మళ్ళీ ట్రింగ్ !ట్రింగ్! ........


ఒక గంట ఫోన్ తరువాత తెప్పరిల్లి చూసిన భర్త గారికి భార్య నిద్రపోతూ కనిపిస్తుంది.


తెల్లవారితే ఆఫీసులో చేయవలసిన పనుల గురించి , ఫోన్ లో సూచనలు ఇచ్చిన పై అధికారి మాటలు చెవుల్లో గింగిర్లు తిరుగుతుండగా ,


రేపు అడుగుదాములే ఏం చెప్పాలనుకుందో ! అని ఆయనా పడుకుంటారు.


ఆ రేపు ఎప్పటికి వస్తుందో ? ఆ భార్య ఏం చెప్పాలనుకుందో ? ఏమిటో ?* ఈ రోజుల్లో పెరిగిన రవాణా, ఫోన్ ఇత్యాది సౌకర్యాల వల్ల
ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిందని దేశాల మధ్య దూరం తగ్గిపోయిందని చెబుతున్నారు.

నిజమే,

కానీ, ఒక దగ్గర ఉండే మనుషుల మనసుల్లో మాత్రం దూరం పెరిగిపోయిందని చెప్పక తప్పదు.
* పూర్వం బ్రతకటం కోసం పని చేసి సంపాదించేవారు. ఇప్పుడు పనిచేయటం కోసమే బ్రతుకుతున్నాము అనిపిస్తోంది.......

Monday, June 20, 2011

భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించటం ............

*ఒక సవరణ .......... భక్తుల కోరిక మేరకు అమరనాధ్ యాత్రకు మొదటివిడత కొంతమందిని పంపటం జరిగిందని న్యూస్ లో చూసి , అమరనాధ్ యాత్ర మొదలయిందని ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి.

మళ్ళీ ఈ రోజు వార్తాపత్రికలో చదివాను ............. అమరనాధ్ యాత్ర ఇంకా మొదలవలేదని. జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించమని కోరుతున్నానండి..

................................................................

భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించటం ............ తద్వారా కూలిపోతున్న కాపురాల గురించి ఈ మధ్యన తరచుగా వింటున్నాము.


ఈ రోజుల్లో మారిన సమాజపు పోకడ వల్ల వ్యవస్థలోను , వ్యక్తులలోను ఎన్నో మార్పులు వచ్చాయి.

వ్యక్తుల మధ్య పరిచయాలకు ఎంతో అవకాశం ఏర్పడింది.


కొందరి విషయంలో ఆ పరిచయాలు పెడత్రోవ పడుతున్నాయి.

అంతే, అప్పటివరకు ఉన్నదాంట్లోనే సరిపెట్టుకుని ఒద్దికగా గడిపిన భార్యాభర్త వారి పిల్లలతో కూడిన కుటుంబం అనే ఆ బంధం విచ్చిన్నమయిపోతుంది.


పోయిన వారు పోగా మిగిలిన వారు ఒంటరి పక్షుల్లా మిగిలిపోతారు నిస్సహాయంగా.

అలా ఒంటరిగా మిగిలిపోయిన భార్య గానీ భర్త గానీ వారి పరిస్థితి అయోమయమే ........ వారి పిల్లల పరిస్థితి అంతకన్నా అయోమయం.


అప్పుడు ఆ ఇంట్లో పిల్లల మానసిక పరిస్థితి ఎలాఉంటుంది ? ఉత్తమ పౌరులుగా తయారవవలసిన ఆ పిల్లల మనస్తత్వంలో ఒక తేడా తప్పకుండా ఉంటుంది.


అయినా ఇలా ఇతరుల కుటుంబములో చిచ్చుపెట్టడం న్యాయమా ?

మన దగ్గర కొన్ని ఉండకపోవచ్చు . అవి ఇతరుల దగ్గర ఉండవచ్చు. అంతమాత్రాన అవి మన సొంతమవాలని కోరుకోవటం ఏం న్యాయం ?


ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ మన సొంతమవుతాయా ? చెప్పండి.


మనకు నచ్చాయని ప్రక్కింటి వారి కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో మచ్చిక చేసి మన ఇంటికి తెచ్చేసుకుని మన సొంతం చేసుకుంటానంటే ఎవరూరుకుంటారు ?


మన పెరట్లోని మామిడి పండ్లకు ఆశపడి ఎవరో తెంపుకు వెళ్ళిపోతే .............. వారిని ఏమంటారో అందరికీ తెలుసు.


అంతెందుకు, ఆకలితో ఉన్న ఒక పేదవ్యక్తి చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలికి తాళలేక ఏ స్వీటు షాపు నుంచో ఒక స్వీటు ముక్క తీసుకున్నాడనుకోండి. ఎవరూ జాలి చూపరు. పైగా అలా చేయటం తప్పు అనే .అంటారు.


మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా అని ............. ఎదుటివారి డబ్బు కావాలని ఆశ పడి ప్రయత్నిస్తే ఏమవుతుంది ? వారిని ఏమంటారు ?


మరి ఇతరుల వస్తువుల కొరకు ఆశపడితేనే తప్పుగా భావిస్తున్నారే........... అలాంటిది, వ్యక్తుల విషయంలో ఇంకా ఎన్నో రూల్స్ ఉండాలి కదా !


ఉదా...... ఒక జంట వివాహ సమయంలో
ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని.... అలాంటి భార్యాభర్తల కాపురాన్ని కల్లోలపరచటం ఏం న్యాయం ?వీలయితే భార్యాభర్తల మధ్య గొడవలుంటే వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలి గానీ ......... వాటిని ఆసరాగా తీసుకుని వారి కాపురాన్ని కూల్చటానికి ప్రయత్నించటం ఈ మూడో వ్యక్తులకు తగదు.* ఇతరుల వస్తువులు లాక్కునేవారికి శిక్షలున్నాయి. కానీ ఇతరుల కాపురాన్ని.......?


ప్రపంచంలో మనకు నచ్చినవన్నీ అధర్మంగా అయినే సరే పొందాలనుకోవటం అన్యాయం,.*
ఒక జంట వివాహ సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు. కష్టసుఖాల్లో తోడుగా కడదాకా కలిసి ఉంటామని ........ భార్యాభర్తలు కూడా బయటి ఆకర్షణల విషయంలో తప్పుటడుగులు వేయకూడదు మరి.

Sunday, June 19, 2011

జగత్తుకే తండ్రి అయిన పరమాత్మకు కృతజ్ఞతలు.జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమిస్తాము. అలాగే, జగత్తు అంతటికీ తల్లిదండ్రులు అయిన జగన్మాతాపితరులను ( పరమాత్మను ) ప్రేమించాలి.


ఆ పరమాత్మ మనకోసం ఎన్నో ఇచ్చారు.

ప్రాణవాయువును అందించారు. దాహం తీరటం కోసం నీటిని , ఆకలి తీరటం కోసం ఆహారాన్ని సృష్టించి ఇచ్చారు.


వెచ్చటి సూర్యరశ్మిని, వెండి వెన్నెలను, వైద్యం కోసం ఎన్నో ఔషధాలను సృష్టించి ఇచ్చారు.


మహోన్నతమైన మంచు పర్వతాలను, మహా సముద్రాలనూ సృష్టించారు.


రసభరిత ఫలాలను , పరిమళ భరిత పుష్పాలను, పిల్ల తెమ్మెరలను, పైరగాలిని, పసిడిపంటలను,...........ఇలా ఎన్నింటినో ఇస్తూనే ఉన్నారు.


ఇంకా, మానవులు అహంకరించి దారి తప్పకుండా , ఒకింత భయ భక్తులతో ఉండటం కోసం అంతులేని అగాధాలను, అగ్నిపర్వతాలవంటి వాటిని కూడా సృష్టించారు.తప్పులు చేస్తున్న మానవులను హెచ్చరించటానికి భగవంతుడు సునామీలను, సుడిగాలులనూ ( కూడా సృష్టించటం జరుగుతుంది.


అయినా తప్పులను సరిదిద్దుకొనకపోతే ఎవరి కర్మకు వారే బాధ్యులుకదా !( కొంతకాలం క్రితం తండ్రి అంటే గౌరవంతో పాటూ ఒకింత భయం కూడా పిల్లలకు ఉండేది.

మళ్ళీ మనుమల విషయం వచ్చేసరికి మాత్రం తాతగారి వద్ద చనువు , . తండ్రి అంటే భయం ఉండేది. అలా పిల్లలు భయభక్తులతో ఉండేవారు. )మనకు ఎంతో తెలుసు అనుకుంటున్నాము కానీ, ఇంకా మనకు తెలియని అంతులేని అనంత విజ్ఞానం ఆకాశమంతా నిండి ఉంది.మనకు ఎన్నో ఇచ్చిన భగవంతునికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం ?


పువ్వులను సమర్పించాలంటే మొక్కలను అనుజ్ఞ అడగాలి.


పండ్లను సమర్పించాలంటే చెట్లను అడగాలి.


పాలు సమర్పించాలంటే ఆవులను అడగాలి.


పిండివంటలను సమర్పించాలంటే అందులోకి కావలసిన బియ్యం, పప్పులు, బెల్లం ,నూనె......... వగైరాలు మొక్కల నుంచే వస్తాయి కదా !


నగలు, వజ్రవైఢూర్యాలు సమర్పించాలంటే అంత స్థోమత అందరికి ఉండదు కదా !


అయినా , బంగారు,వజ్రాల గనులను కూడా దైవమే సృష్టించారు కదా !మనతో సహా ఈ విశ్వంలో అన్నీ భగవంతుని సృష్టే కదా !మరి,మనకు ఎన్నో ఇచ్చిన భగవంతునికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం ?పసిపిల్లలు కొద్దిగా ఆహారపదార్ధాన్ని అయినా , తన చిట్టిచిట్టి చేతులతో అమ్మానాన్నా నోటికి అందిస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో .భగవంతుడు కూడా అంతే.


భక్తులు ఆప్యాయంగా సమర్పించిన చిన్న దానితో వారు ఎంతో ఆనందపడతారు.


పెద్దలు ఏం చెబుతారంటే ..........భగవంతుని ప్రేమించాలి. ,ఇంకా , మనము ధర్మబద్ధంగా జీవించటం ద్వారా దైవాన్ని
సంతోషపెట్టవచ్చు.అని. .


" మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లే " అంటారు పెద్దలు.


ఆ మనసును అదుపులో పెట్టుకోలేక మనం ఎన్నో తప్పులు చేస్తూ తద్వారా ఎన్నో బాధలు అనుభవిస్తున్నాము.


భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చినా తృప్తి లేక, ఇంకా ఏదో కావాలని ఆకాశాన్ని తాకే అత్యాశతో తడబడుతూ తప్పుటడుగులు వేస్తున్నాము.
ఆ అడుగులు ఎక్కడికి తీసుకువెళతాయో ?


పిల్లలు తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు కదా !


అలాగే పెడత్రోవన వెళ్తున్న మానవులను మంచి దారిలోకి తేవటానికి దైవం ఎన్నో ముందస్తు హెచ్చరికలు చేస్తారట.


అయినా వినకపోతే భగవంతుడు కూడా తన పద్దతిలో తాను సృష్టిని రక్షించుకొంటారు.తమ పిల్లలు ధర్మబద్దంగా జీవించి , తమకు మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అప్పుడే వారు సంతోషపడతారు.


అలాగే భక్తులు కూడా ధర్మబద్ధంగా జీవించి భగవంతుని సంతోషపెట్టాలి.


అంతేకానీ, భక్తులట ! .............. చూడండి !, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారో ? ........ అని ,. నాస్తికులు నవ్వేటట్లు, వెక్కిరించేటట్లు భక్తులు అనిపించుకొనేవారు ప్రవర్తించకూడదు కదా !


భగవంతుని భక్తులంటే ఇంత గొప్పగా ఉండాలి ............ అని అందరూ మెచ్చుకునేటట్లు భక్తుల ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా భగవంతుని సంతోషపెట్టవచ్చు...


ఆ విధంగా జీవితము గడపటానికి కనీసము ప్రయత్నం చేద్దాము..


మనం జీవించటానికి మొక్కలు, జంతువుల వంటి ఎన్నో ప్రాణుల సహాయం అవసరం కదా ! .

అందుకే మనతో పాటు లోకమంతా సుఖంగా ఉండాలని అందరూ దైవాన్ని కోరుకోవాలని పెద్దలు చెబుతుంటారు.Friday, June 17, 2011

అవీ............ఇవీ కొన్ని విషయాలు.

ఈ సంవత్సరపు అద్భుతమైన అమరనాధ్ యాత్ర ప్రారంభమయింది...............................................................................

స్వామి నిగమానంద గారు గంగానది కాలుష్యాన్ని తగ్గించాలన్న విషయం గురించి దీక్ష చేస్తూ అమరులయ్యారు.......... సాటి మనుషులు వారి త్యాగాన్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ దైవం దగ్గర ఇలాంటి త్యాగమూర్తులకు చక్కటి స్థానం ఉంటుంది. .......................................................................


చర్యకు ప్రతి చర్య ఉన్నట్లే ఎవరైనా పాపాలు చేస్తే కష్టాలు .............. పుణ్యాలు చేస్తే సుఖాలు అనుభవిస్తారని పెద్దలు చెబుతారు.


తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కదా ! అలాగే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఈతరుల పట్ల చెడ్డగా ప్రవర్తిస్తే వారు బాధలు పడతారు. దానికి ప్రతిచర్యగా మనకు కష్టాలు వస్తాయి.


నేను ప్రాణిక్ హీలింగ్ కొంతకాలం నేర్చుకున్నానండి. అప్పుడు వారు ఏం చెప్పారంటే............. మనం ఎవరికయినా చెడు చేస్తే అది గోడకు కొట్టిన బంతిలాగ తిరిగి మనకే తగులుతుందట.


అలాగే మనము ఎవరికయినా మంచి చేస్తే గోడకు కొట్టిన బంతిలాగ తిరిగి మనకు మంచి జరుగుతుందట.

అందుకే మనం సంతోషంగా ఉండాలంటే మనం ఇతరులను కష్ట పెట్టకూడదు అన్నమాట.ఈ రోజుల్లో చాలామంది ఒక చేత్తో పూజలు ఒక చేత్తో పాపాలు చేస్తున్నారు,. మళ్ళీ అలా పాపాలు చెయ్యటం వల్ల కష్టాలు వచ్చాయనుకోండి. ఎన్ని పూజలు చేసినా దేవుడు కష్టాల నుంచి తప్పించటం లేదు . అంటూ తిరిగి దేవున్నే నిష్టూరంగా మాట్లాడుతారు.మనం పాపాలు చేసి ,.కష్టాలు వస్తే ........... దేవుణ్ణి అనటం తప్పు కదా !

పాపాలు చేసినా శిక్షలు ఉండకూడదు అనుకుంటారు కొందరు. అలా ఎలా కుదురుతుంది ?


ఉదాహరణకు ఒక వ్యక్తి నేరం చేశాడనుకుందాము. తీర్పు చెప్పే జడ్జి అతని తాతగారే అయినా సరే,అతనికి శిక్ష వేయకుండా తప్పదు కదా !


ఒక విద్యార్ధి పరీక్షల్లో కాపీలు చేస్తున్నాడనుకుందాము. ఆ కాలేజీ ప్రిన్సిపల్ అతని తండ్రి గారే అయినా సరే, ఆ విద్యార్ధిని డిబార్ చెయ్యవలసిందే కదా !


కన్నబిడ్డలే అయినా సరే , తప్పులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలను దండిస్తారు కదా !అలాగే వ్యక్తులు పాపాలు చేసినప్పుడు భగవంతుడు వారిని శిక్షించవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ( భగవంతుడు ఎంత దయామయుడయినా కూడా ).భగవంతుడు ఇలా ఎందుకు శిక్షించటం జరుగుతుందంటే వారు మరింతగా పాపాలు చెయ్యకుండా ఉండటానికి, ఇంకా వారిని చూసి ఇతరులు బుద్దిగా నడుచుకుంటారని.ఇంకా, మనుషులు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారంటే....ఎన్ని తప్పులు చేసినా తనకు మాత్రం శిక్ష పడకూడదని.........ఇతరులు తప్పు చేస్తే మాత్రం వారికి తప్పకుండా శిక్ష పడాలనీ అనుకుంటారు......తనకొక నీతి ఎదుటివారికి ఒక నీతి అన్నమాట.
ఉదా..........ఒక వ్యక్తి కొన్ని నేరాలు చేశాడనుకుందాము. మనం ఏమని అంటామంటే ,.,........ అటువంటి క్రూరులను కఠినంగా శిక్షించాలి అనే కదా అంటాము. పాపం ! ఏదో తెలిసో తెలియకో పేదరికం వల్ల గానీ, కొందరి చెప్పుడు మాటలు విని గానీ అలా తప్పులు చేశాడులే ! చిన్న శిక్ష విధిస్తే చాలులే పాపం ! అని ఏ మాత్రం జాలిని చూపించము కదా !ఇంకా ఏమంటామంటే ,.......... అతనికి శిక్ష తగ్గిస్తే అందరికీ భయం పోతుంది. అని కూడా సమర్ధించుకుంటాము. అది కూడా నిజమే !తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు లేకపోతే ప్రజలకు భయమన్నది లేక తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే భగవంతుడు పాపాత్ములను శిక్షించటం జరుగుతుంది.అయితే మన విషయానికి వచ్చేసరికి మాత్రం ఏదో ! తెలిసీతెలియక తప్పులు చేసేశాం .......... ఈసారికి క్షమించేయి దేవుడా ! అని బ్రతిమలాడుకుంటాము.


ఎదుటివారికయితే శిక్షలు పడాలనుకుంటాము. మనకు మాత్రము ఎటువంటి శిక్షలు పడకూడదు అనుకుంటాము. మానవ నైజం ఎక్కువగా ఇలాగే ఉంటుంది.అందుకే ఈ శిక్షలు, కష్టాలు ఉండకూడదు అనుకుంటే మాత్రం పాపాలు చేయటం పూర్తిగా ఆపి .......... సత్కర్మలు చేస్తూ ,పెద్దలు చెప్పిన విధంగా ధర్మబద్దంగా జీవించాలి..కొందరు నైతికవిలువలను పెద్దగా పాటించకపోయినా, భక్తి అంతగా లేకున్నా, నలుగురిలో ఆడంబరంగా కనిపించటానికి పూజలు చేస్తుంటారు.


అయితే అలా పూజలు చేయగాచేయగా, క్రమేణా వారి ప్రవర్తన మంచిగా మారుతుంది. ( కొందరి విషయంలో అలా మారటానికి వారికి ఇంకో జన్మ ఎత్తే సమయం కూడా పట్టవచ్చు . ఇదంతా వారివారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. )

మంచిపనులు ఇష్టపడి చేసినా, కష్టపడి చేసినా ఎప్పటికయినా మంచి ఫలితాన్నే ఇస్తాయి కదా !

Monday, June 13, 2011

ఆ కానుకలు ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.

పూర్వం ఆడవాళ్ళు ఇప్పటిలా ఉద్యోగాలు చేసి సంపాదించటం తక్కువగా ఉండేది.


భర్త ఎంత ధనికుడయినా ఆడవారికి తమకంటూ సొంతానికి కొంత ధనం ఉంటే వాళ్ళకు స్వతంత్రంగా ఉంటుంది.


ఒక ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే .......... పండుగలకు కొత్త బట్టలు, ఆడుకొనే బొమ్మలు, తినే వస్తువులు ఇవన్నీ .......... తల్లిదండ్రులు పిల్లలు అందరికి ఇస్తుంటారు.


అలాగే తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు వారి వివాహం సందర్భంగా ........... ముచ్చటపడి ఆ పిల్లలకు కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపేవారు.


డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా , తక్కువగా ఉన్నవాళ్ళు తమకున్నంతలో కానుకలు ఇచ్చుకొనేవారు.


ఆ కానుకలు ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.అలా ఆడవాళ్ళు ............. పుట్టింటినుంచి తెచ్చుకున్న ధనాన్ని భర్త మొదలైన వారు కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.


స్రీ ధనంగా భావించి దానిని ఆమెకే ఉంచేసేవారు. ఆ కానుకలు ఆమె తమ పిల్లలకు ఇచ్చుకోవటం జరిగేది.


అలా ముచ్చటగా మొదలైన వ్యవహారం ............. ఇప్పుడు వికృతరూపం దాల్చి ఆ కానుకల కోసం ఎంతకైనా తెగించేస్థాయికి పరిస్థితులు వచ్చాయి.


తప్పు ఎక్కడ వచ్చింది అంటే మనుషుల మనస్తత్వాలు మారటం వల్ల వచ్చింది.


డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోవటం,తేరగా ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశ పడటం, డబ్బు కోసం హుందాతనం లేకుండా లేకిగా ప్రవర్తించటం, మానవసంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోవటం వల్ల........... ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి.


వియ్యానికయినా, కయ్యానికయినా సమాన స్థాయి ఉండాలంటారు.ఇప్పుడు అందరికీ కోరికలు పెరిగిపోయి కొందరు ఆడపిల్లలు అమెరికా పెళ్ళికొడుకులే కావాలి అంటే.......... కొందరు మగపిల్లలు ఐశ్వర్యా రాయ్ లాంటి అమ్మాయి మాత్రమే కావాలి ......... ఇలా పెరిగిపోతున్న కోరికలు.


ఇక తల తాకట్టు పెట్టి అయినా పెళ్ళి చేస్తారు పెద్దవాళ్ళు.


చాలామంది మగవారినే ఆడిపోసుకుంటారు గానీ ........... ఈ డబ్బు గొడవల్లో భర్త ఒక్కడే కాదు. చాలా సార్లు అత్తా, ఆడపడుచుల ప్రమేయం కూడా ఉంటుంది. ....


ఒక భర్త తన భార్యను కొడుతున్నప్పుడు తోటి ఆడవాళ్ళుగా అత్తగారు , ఆడపడుచులు, అలా చేయటం తప్పు అని చెపితే ............... భార్యను కొట్టే భర్త ప్రవర్తన మారే అవకాశం ఎంతయినా ఉంది.అలా చేయకపోగా కొందరు అత్తగార్లు, ఆడపడుచులు విషయాన్ని మరింత పెద్దది చేస్తారు.కుటుంబాల్లో గొడవలు జరగటానికి సమస్య డబ్బు మాత్రమే కాదు.


కొందరి విషయాల్లో డబ్బు వల్ల గొడవలు వస్తున్నాయి .


మరి కొందరు కోట్ల రూపాయల కట్నం తీసుకెళ్ళినా కూడా .......... వారి కుటుంబాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి,.మొత్తం మీద ఇలా కుటుంబాల్లో గొడవలు పెరిగిపోవటానికి ........... మనుషుల మధ్య ఆప్యాయతలు , నమ్మకాలు తగ్గిపోవటం, ఇగో సమస్యలు పెరిగిపోవటం ............ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.


అయితే, భార్యాభర్తలు, అత్తకోడలు,ఆడపడుచులు వీరి మధ్య ఆప్యాయతలు, మంచి అవగాహన ఉన్నప్పుడు డబ్బు పెద్ద సమస్య కాబోదు........


ఆడపిల్లలకు వివాహ సమయంలో వారి తల్లిదండ్రులు కానుకలు ఇవ్వటానికి నేను వ్యతిరేకం కాదు.

అయితే కానుకలను అత్తింటివారు పీడించి తీసుకోవటానికి నేను పూర్తిగా వ్యతిరేకం.

కానుకలను అత్తింటి వారు తీసుకోకుండా అమ్మాయికే అట్టిపెట్టడం పద్దతిగా ఉంటుంది.

Friday, June 10, 2011

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది,

మానవ శరీరంలో ఆక్సిజన్ (65%), కార్బన్ (18% ), హైడ్రోజన్ (10% )నైట్రోజన్ ( 3% ) కాల్షియం ( 1.5 % ),ఫాస్ఫరస్ ( 1.0% ) ,పొటాషియం, సోడియం............ఇలా ఇంకా కొన్ని ఉంటాయట. వీటన్నిటితో శరీరం తయారవుతుందట.


విశ్వం అంతా కూడా ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. . ఇది అంతా బౌతికశాస్త్రం............ అంతే కానీ, దైవం అనిఎవరూ లేరు అంటారు కొందరు భౌతికవాదులు.


శరీరం ఆక్సిజన్, హైడ్రోజన్ వీటితో తయారయ్యే మాట నిజమే అయినా......... ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది, ఎన్నో భావాలను కలిగి ఉంటుంది.


అలాగే విశ్వం ఆవిర్భావానికి మూలకారణమైన మూలశక్తి ( ఆదిశక్తి ) మనిషి కన్నా............... ఎంతోఊహాతీతమైన శక్తి గల పరమశక్తి అని ఆస్తికులు నమ్ముతారు. శక్తినే వారు దైవంగా భావిస్తారు.


* కొన్ని ఎలిమెంట్స్ తో తయారయిన మానవులే ఎంతో ఆలోచనా శక్తిని కలిగి ఉన్నప్పుడు ,....................... అనంత ,విశ్వాన్ని , అందులోని అన్ని తత్వాలను తనలో కలిగి ఉన్న ఆదిపరమశక్తికి అనంతమైన ఆలోచనా శక్తి ఉంటుంది.అందువల్లే సృష్టి అంతా ఒక పద్దతి ప్రకారం తయారు కాబడింది.
సృష్టిలో చూడండి ........... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే ....... ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.

ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం ..............ఇవన్నీ ఎంతో పద్దతిగా ఏర్పడి ఉన్నాయి .


పెద్దచేపకు ఆహారంగా చిన్నచేపలు, వాటికి ఆహారంగా, చిన్న ప్రాణులు, వాటికి ఆహారంగా ఆల్గే వంటివిఇలా............ ఒక పద్దతి ప్రకారం అద్భుతంగా సృష్టి రచన సాగిపోవటం చూస్తూనే ఉన్నాము.


కొందరు దేవుడు ఉంటే చూపించండి అంటారు. గాలిని మనం చూడగలమా ? కేవలం ఫీలవుతాము అంతే.శాస్త్రవేత్తలు
విటమిన్స్ గురించి చెబుతారు. అవి ఉన్నాయన్నదీ నిజమే........... a,b,c,D .విటమిన్స్... ..వీటిని చూడాలంటే కుదురుతుందా ?ఒక వ్యక్తి ఉన్నాడు . అతనికి ఎందుకో మామిడిపండు అంటే ఇష్టం లేక పుట్టినతరువాత ఎప్పుడూతినలేదు. దాని రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదు.

వ్యక్తి మామిడిపండును తింటున్న తన స్నేహితునితో ఇలా అంటున్నాడు.


"మామిడిపండు రుచి ఎలా ఉంటుంది " ?

" తియ్యగా ఉంటుంది. "

"తియ్యగా అంటే పంచదార లాంటి తీపి రుచా ? లేక పనస పండు లాంటి తీపి రుచా " ?


" రెండూ కాదు. పంచదార తీపి రుచి వేరు, పనసపండు తీపి రుచి వేరు, మామిడి పండు తీపి రుచివేరు. "

"అంటే ఎలాంటి తీపి " ?


"ఎలాంటి తీపి అంటే . అలా చెప్పటానికి కుదరదు. నువ్వు కూడా మామిడి పండు తింటేనే రుచి నీకుసరిగ్గా తెలుస్తుంది."


అలాగే దైవాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు ................ వాళ్ళు కూడా మార్గంలోపద్దతిగా ప్రయత్నిస్తే కానీ దైవాన్ని తెలుసుకోవటం కుదరదు.శరీరం రకరకాల ఎలిమెంట్స్ తో తయారయింది నిజమే కానీ,............ అందులో ప్రాణం, చైతన్యం, బుద్ధి , మనసుఇవన్నీ ఎలా ప్రవేశించాయో మనకు తెలియదు.


ప్రాణం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో ? ఎలా నిష్క్రమిస్తుందో ? .................


కొన్ని విషయాలు తెలుసుకోవాలంటేబాహ్యేంద్రియాల శక్తి సరిపోదని అంతఃకరణ ద్వారా మాత్రమేతెలుసుకోగలమని పెద్దలు చెబుతున్నారు .


ప్రాచీనులు కొందరు, తపస్సు వంటి వాటి ద్వారా జీవుల పుట్టుకకుముందు., మరణానికి తరువాత జరిగేఎన్నో విశేషాల గురించి ,
ఇతరలోకాల గురించి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలియజేసారు............ వాటి గురించి తెలుసుకునేంతస్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.


పూర్వం కొందరు తల్లులు పిండాలను కుండలలో ఉంచి పెంచారు అని ప్రాచీన గ్రంధాలలో చదివివెక్కిరించిన వారే ............. .నేడు టెస్ట్ ట్యూబుల లో పిండాలను పెంచడాన్ని చూస్తున్నారు.


పూర్వం అభిమన్యుడు, ప్రహ్లాదుడు వంటి వారు తల్లుల గర్భంలో ఉన్నప్పుడే ఎన్నోవిషయాలునేర్చుకున్నారని చదివి వెక్కిరించిన వారే ....................... నేడు విదేశాల్లో కడుపుతోఉన్న తల్లులు కొందరు పుట్టబోయే పిల్లల కొరకు క్లాస్ లకు వెళ్ళి పాఠాలు వినటాన్ని చూస్తున్నారు.


అందుకని నా అభిప్రాయం ఏమిటంటేనండి, మనకు తెలియని విషయాలన్నీ అభూత కల్పనలుఅనటంసబబు కాదు.


భూమిపై మనకన్నా ముందు మనకన్నా ఎంతో గొప్ప నాగరికత కలిగి ,ఎంతో గొప్పవిజ్ఞానవంతులైనమానవులు నడయాడారేమో ?ఎవరికి తెలుసు ?


కొన్ని కారణాల వల్ల నాగరికత అంతర్ధానమైఉండవచ్చు గదా !


విశ్వం పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో గత 200 సంవత్సరాల్లో పుట్టిన మానవులే గొప్పవాళ్ళు . ఆధునిక విజ్ఞానమే గొప్పది అనుకోవటం తప్పు

...................................................................
.
టపా రాసాక నాకు ఒక ఆలోచన వచ్చిందండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు....... అసలు నేను అంటేఏమిటి ? అని. ఆక్సిజన్ వీటితో కూడిన శరీరమా ? లేక మనసా ? లేక ? నేను అంటే అసలు ఏమిటి ? ఏమో.........

అంతా దైవం దయ ....

.

Wednesday, June 8, 2011

సినిమాలు తియ్యటం చాలా కష్టమే.

సినిమాలు, సీరియల్స్ ఇలాంటి వాటి ప్రభావం సమాజం పై ఎంతో ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు తో సహా ఒప్పుకుంటున్నారు.


పూర్వం సినిమాల్లో అశ్లీలత తక్కువగా ఉండేది. కుటుంబసమేతంగా చూడగలిగేటట్లు ఉండేవి.


ఈ మధ్యన వచ్చిన వాటిల్లో కూడా అసభ్యత లేకుండా సరదాగా సాగే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఉదా. పెళ్ళిపుస్తకం, ఏప్రిల్ 1 విడుదల, మిస్సమ్మ ( నీలకంఠ గారిది. , ) లీడర్ ( ఇది సరదా సినిమా కాదు లెండి. )............ వీటికన్నా కూడా నాకు నచ్చిన సినిమాలు ఇంకా ఉన్నాయి. కొన్ని సినిమాల పేర్లు మాత్రమే రాసాను.ఇక డ్యూయెట్లు పేరిట హీరో,హీరోయిన్స్ చెట్లమ్మట పుట్లమ్మట గెంతటం అన్నది నిజజీవితంలో అరుదుగా కనిపిస్తుంది.

సరే ఏదో కాసేపు సరదాకి చూద్దాములే అనుకుంటే ఇప్పుడు అవి అసభ్య నృత్యాల స్థాయికి దిగజారిపోయాయి.

పూర్వం భార్యాభర్తల సరదాలు పిల్లల కంటబడకుండా గుట్టుగా ఉండేవి.


ఇప్పుడు టి.విల పుణ్యమాని చిన్నపిల్లలు ఈ డ్యూయెట్ల పేరుతో వస్తున్న, ........... వాళ్ళ వయసుకు చూడకూడని ఇలాంటి దృశ్యాలనే బాహాటంగా చూస్తున్నారు...... ఇలాంటి దృశ్యాల ప్రభావం పెరిగే పిల్లలపై చాలా ఉంటుందన్నది అందరికి తెలిసిందే.


.గన్స్.......... మొదలైన వాటితో ఆడే వీడియో గేంస్ వల్ల పిల్లలలో సున్నితత్వం తగ్గి క్రూరత్వం పెరుగుతుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

సినిమాలు తియ్యటం చాలా కష్టమే.

మనం తెరమీద కొద్దిసేపు చూసే దృశ్యం తీయటానికి బయట ఎంతో సమయం పడుతుంది. షూటింగ్ మధ్యలో అందరికీ టిఫిన్స్, భోజనాలు ఇలా అన్నీ అమర్చటం అబ్బో, ఆ అట్టహాసం......... అవన్నీ ఎంతో ఖర్చుతో కూడిన విషయాలు.

అంత కష్ట పడి కొందరు సినిమాలు తీస్తే ఆ సినిమాలను కొందరు చాటుగా చూసేస్తే (
పైరసీ ద్వారా ) చెప్పలేనంత బాధగా ఉంటుంది. అలా చూడటం ధర్మం కూడా కాదు.


ఈ మధ్య కొన్ని సినిమాల్లో అసభ్యత ఎక్కువగా చూపిస్తున్నారు. దానికి వారేమంటారంటే., సినిమా ఆడాలంటే యువతను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి,.............పాతకాలంలోలాగ నిండా బట్టలు వేస్తే యువత సినిమా చూడరు అంటున్నారు.......... యువత అందరూ ఇలా ఆలోచిస్తారని నేను అనుకోను............ఈ యువతలో మీ పిల్లలూ, మీ బంధువుల పిల్లలూ కూడా ఉంటారు మరి.


ఈ మధ్య కొన్ని సినిమాల్లో హీరోను నీతి నియమాలు లేకుండా , జులాయిగా తిరిగే వెధవ గానూ , హీరోయిన్ను అర్ధనగ్నంగా తిరిగేదానిగానూ చూపించేస్తున్నారు.......... ఆ సినిమాలు పదేపదే వెర్రిగా చూసే యువత అందులో హీరో, హీరోయిన్స్ లాగే తయారవుతారు.


అలా తయారయిన వాళ్ళు సినిమాను దొరల్లాగ ఎందుకు చూస్తారు ? దొంగల్లాగే చూస్తారు. అయ్యో ! సినిమాను నిర్మాత ఎంత కష్టపడి తీశారో అనే సున్నితత్వం వాళ్ళకి ఎలా ఉంటుంది ?


ఇప్పుడు ఎవరెంత లబలబలాడినా ఇలాంటి ప్రేక్షకులని మార్చటం కష్టమే. సమాజాన్ని చెడ్డగా మార్చటానికి ఎక్కువ సమయం పట్టదు............ కానీ .............. దారి తప్పిన సమాజాన్ని మంచిగా మార్చటానికి చాలా సమయం పడుతుంది.


టి.వి చానల్స్ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చూపిస్తారు . కానీ అర్ధరాత్రి అయితే అసభ్య దృశ్యాలతో కూడిన పాటలు , ప్రసారం చేస్తారు.

ఇలాంటి వాటి వల్ల చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి.


పిల్లలు కొందరు అర్ధరాత్రి దాటేవరకూ చదువుకుంటారు. చదువుకుంటూ మధ్యలో కాసేపు రిలాక్సేషన్ కోసం టి.వి పెట్టారంటే ఇక అప్పటివరకూ చదివిందంతా అంతే సంగతులు.

ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల 30 ఏళ్ళ వరకు వివాహం కానివారూ, వివాహం అయినా ఉద్యోగం వల్ల వేరువేరు ఊళ్ళలో ఉంటున్న భార్యాభర్తలూ, , ఎక్కువగా కనిపిస్తున్నారు. ............. ఇక విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో చెప్పక్కర్క్లేదు.


ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాము, కొందరు పసిపిల్లలు ,అమాయకులైన ఆడపిల్లలు ........... బంధువులు, పరిచయస్తులైన వారి వల్ల కూడా అత్యాచారాలకు గురయ్యే సంఘటనలు జరుగుతున్నాయని .ఈ మధ్య వేద పాఠశాలలో జరిగిన సంఘటనలు ( బయట హాస్టల్స్ లో కూడా
కొన్ని చోట్ల ఇలా జరిగి వెలుగులోకి రాకుండా ఉండే అవకాశం ఉంది. ) ఇవన్నీ సమాజంలో పతనమవుతున్న నైతికవిలువలకు సంకేతాలు.


చిన్నపిల్లలు, మూలనున్న ముసలమ్మలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారంటే .........ఏం చెప్పాలి ?*పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా ( సెల్ ఫోన్స్ వగైరా..... ) అసభ్యకరమైన ఉద్రేకపూరితమైన ప్రసారాలు అందుబాటులోకి రావటం కూడా నైతికవిలువల పతనానికి ఒక కారణం......... . వీటి ప్రభావం సమాజం పైన ఎంతో ఉంటుంది.


* మీడియా ప్రభావం సమాజంపైన ఎంతో ఉందన్నది
అందరికి తెలిసిందే. ............. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వీళ్ళందరూ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఉత్తమ స్థానంలో ఉన్నారు.


మీలో ఎందరో ఉన్నత ఆదర్శాలు కలవారున్నారు. సమాజాన్ని మంచి దారిలో పెట్టాలనే తపన కల ఉత్తములున్నారు. దయచేసి మీరందరూ దారి తప్పుతున్న సమాజాన్ని మంచిదారిలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకోండి.


*ఒకప్పుడు ధర్మాన్ని నిలబెట్టటానికి రాజ్యాన్ని తృణప్రాయంగా భావించిన సత్య హరిశ్చంద్రుడు , శ్రీరామచంద్రుడు, వంటి మహనీయుల గురించి విన్నాము.


ఈ మధ్యకాలంలో కూడా దేశ స్వాతంత్ర్యం కోసం ఆస్తులను పోగొట్టుకుని జైళ్ళ పాలయిన వారి గురించి విన్నాము.

ఇప్పుడు డబ్బు కోసం సమాజం తప్పుదారి పట్టినా ఫరవాలేదు, దేశసంస్కృతి ఏమైపోయినా ఫరవాలేదు అని భావించే వారి గురించి వింటున్నాము.


అసభ్యంగా చిత్రాలు తీసి యువతను ఆకర్షించి ఆ యువత దారి తప్పితే వారిని కన్న తల్లిదండ్రుల శాపాలు వీరికి తగిలే అవకాశం కూడా ఉంది.


* అధర్మంగా డబ్బు సంపాదించేవారు ఎవరైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఆ పాపపు సొమ్ము వల్ల వారు ఎప్పటికయినా ( వచ్చే జన్మలో అయినా సరే ) అష్టకష్టాలు అనుభవించవలసి వస్తుందన్నది పెద్దల మాట............... ధర్మబద్దంగా సంపాదించినది కొద్ది సొమ్ము అయినా దైవకృపకు దగ్గర చేస్తుంది.అన్నది కూడా
పెద్దల మాట..


*
పెద్దవాళ్ళు తమ పిల్లలకు ఏం చెప్పాలంటే ............... 'సినిమాలు, సీరియల్స్ వేరు...........జీవితం వేరు " అని పిల్లలకు వివరించి అవగాహన కలిగించాలి.


అందులో చూపించే చెడును ఆదర్శంగా తీసుకోకుండా వదిలెయ్యాలని పిల్లలకు అవగాహన కలిగించాలి. అలా పిల్లలకు మంచి చెడు చెప్పి , ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధర్మంగా జీవించగలిగేలా వారిని పెంచాలి. పెద్దవాళ్ళు తాము కూడా మంచి నడవడికను కలిగి ఉండాలి.....Monday, June 6, 2011

అందరూ విపరీతంగా ధర్మపన్నాలు చెబుతున్నారు. ( నాతో సహా )

మేము ఊరు వెళ్ళి ఈ రేజే వచ్చామండి. అందుకే బ్లాగ్ చదవటానికి కుదరలేదండి. ఏదో నాకు తెలిసినంతలో రాస్తుంటాను.

ఎన్నో విషయాలు తెలిసిన వారు ఇక్కడ ఎందరో ఉన్నారు. వారికి తెలిసిన విషయపరిజ్ఞానంలో నాకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే ఎక్కడన్నా తప్పుగా వ్రాస్తే దయచేసి క్షమించండి.


ఈ బ్లాగ్ ను సపోర్ట్ చేస్తున్న అగ్రిగేటర్లు అందరికి నా కృతజ్ఞతలండి. ఇంకా ఇంతకుముందు నుంచి బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న వారికి మరియు ఇప్పుడు కొత్తగా చదువుతున్న వారికి అందరికీ నా కృతజ్ఞతలండి.. ................................................................


మనం బస్సులో గానీ, రైల్ లో గానీ ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఊర్లు చూస్తుంటాము గదండి ! కొన్ని ప్రదేశాలు కొంచెం బాగానే ఉంటాయి గానీ .......... చాలా ప్రదేశాలు చెప్పలేనంత మురికిగా ఉంటున్నాయి.

ఒక పక్క 22 వ శతాబ్దంలోకి దూసుకుపోతున్నాము అంటున్నారు............ ఒక ప్రక్క దూసుకుపొతున్నఅవినీతి తో పాటూ ,. ఆకలి కేకలూ వినిపిస్తున్నాయి.


దేశంలో విపరీతంగా పంటలు పండాయి ....... పండిన ధాన్యం నిలువ చేయటానికి సదుపాయాలే లేవు అంటున్నారు.

అంత పంట పండినా కూడా పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. ప్రజలకు ఆకలి తీరదు. ఏమిటో !


మనం రోడ్ మీద వెళ్తుంటే ఆకలిగా ఉంది. ధర్మం చెయ్యండి అనే వాళ్ళు అనేకమంది కనిపిస్తుంటారు.

ఒకరికి ఏదైనా ఇస్తే మరింత మంది చుట్టూ పోగవుతారు. ఇదంతా చాలా బాధగా ఉంటుంది.


మొన్న నేను ఊరెళ్ళినప్పుడు రోడ్డుపై నడిచి వెళ్తోంటే ఒక ముసలి ఆమె ..............ఆకలిగా ఉంది. ఏమైనా ధర్మం చెయ్యమన్నప్పుడు........ ఈ వ్యవస్థతో సహా అందర్నీ తిట్టుకుని నన్ను నేను కూడా బాగా తిట్టుకున్నా ....... ఇక చేసేదేమీ లేక.

( మనం ఒక సారి ఏమైనా ఇవ్వగలం........కానీ తరువాత వాళ్ళ పరిస్థితి ఏమిటి ? అనాధ పిల్లలు కూడా ఇలా కనిపిస్తుంటారు. ).


అసలు వ్యవస్థలోనే లోపముంది అనిపిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం అందరూ పని చేస్తే ఈ వ్యవస్థ మారటం పెద్ద కష్టమేమీ కాదు. ................. కానీ చాలా మంది తమ స్వార్ధం తప్ప ఏమీ పట్టించుకోవటం లేదు.


ఎక్కడ పడితే అక్కడ ఉమ్మిన కిళ్ళీలు, రోడ్ల ప్రక్కన కంపు, ఇదంతా చూస్తే ............ఒకప్పుడు శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే భారతీయులు ఇలా తయారయారేమిటి ? అన్న బాధ మనసును పిండేస్తుంది.


చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అని చదివించేవారు. కొంత కాలం క్రిందట పొలాల్లో గట్ల పైన కొబ్బరి, తాటి చెట్లు వేసేవారు.


ఇప్పుడు రోడ్ల పక్కన కూడా చెట్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.......... చెట్ళు ఎక్కువగా పెంచితే చల్లగా ఉంటుంది కదా ! ఏదో కారణంతో ఉన్న చెట్లనే కొట్టేస్తుంటారు. ఇలా అయితే ఎలా ?


*అసలు ఎవరి పని వారు సక్రమంగా చేస్తే దేశం ఎందుకు బాగుపడదు ?

ఒక ఉద్యోగి అవినీతి, లంచం లేకుండా తన పని తాను సక్రమంగా చేసినప్పుడు.......


ఒక ప్రజా ప్రతినిధి తనను ఎన్నుకున్న ప్రజల కష్టాలను తీర్చి ............ వారికి ప్రాధమిక అవసరాలకు లోటు లేని మంచి పాలనను అందించినప్పుడు........


ప్రజలందరూ ధర్మబద్దంగా మాత్రమే ......... జీవితాలను సాగించినప్పుడు ........


భక్తులు పూజ చేయటం మాత్రమే కాకుండా ......... దైవానికి ఇష్టమయిన విధంగా ధర్మబద్దంగా జీవించినప్పుడు........

శాస్త్రవేత్తలు ప్రపంచానికి పనికివచ్చే ప్రయోగాలను మాత్రమే చేసి వాటిని ప్రపంచానికి అందించి నప్పుడు .............

ఇలా అందరూ తమతమ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించినప్పుడు.......

ఇక కష్టాలెందుకుంటాయి ?


ఇప్పుడు సమస్య అదే ! ఎవరి ధర్మం వారు సరిగ్గా పాటించటం లేదు. .......... పాటించకపోగా అందరూ విపరీతంగా ధర్మపన్నాలు చెబుతున్నారు. ( నాతో సహా ) ఇదే కలికాలపు వింత..


*ఈ రోజుల్లో ........... ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు తమ ప్రభుత్వం పడిపోకుండా 5 ఏళ్ళు ఎలా నిలబెట్టాలి ? అన్న చింతతోనే కాలం గడిచిపోతుంది............. ఓడిపోయిన పార్టీలకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి ? అన్న చింతతోనే కాలం గడిచిపోతుంది.. ఇక.....ఏది దారి ................?*చిన్నతనం నుంచీ పిల్లలకు నైతికవిలువలతో కూడిన విద్యను అందించటం వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ..............

అయితే నైతికవిలువలు అంటే తమకు ఇష్టం వచ్చినట్లు అర్ధం చెప్పుకునే వాళ్ళూ ఎక్కువయిపోయారు .అదే విషాదం మరి..............

Wednesday, June 1, 2011

డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదలు ఉంటారు............ (రెండవ భాగం.).....

ఈ రోజుల్లో చాలా మంది తమకు డబ్బు సరి పోవటం లేదు అంటున్నారు.

పేదవాళ్ళు అలా అన్నారంటే అర్ధముంది. కొంచెం డబ్బు బాగా ఉన్నవాళ్ళు కూడా అలాగే అంటున్నారు.

ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే. ........... ప్రజలకు కోరికల చిట్టా పెరిగిపోవటం వల్ల వచ్చిన సమస్య ఇదంతా అనిపిస్తుంది.

పూర్వం వాళ్ళకు ఇన్ని కోరికలు, ఉండేవి కావు. పుష్టికరమైన ఆహారం తినేవారు. అవసరమైన కొద్దిపాటి సామానుతో పొదుపుగా జీవించేవారు.

దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలిగేది కాదు.................. ఎక్కడ చూసినా వాడిపారేసిన వస్తువులతో నిండిన చెత్త కుప్పలు ఉండేవి కాదు.

ఇప్పుడేమో కార్లు కావాలి..........ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉండాలి............లేటెస్ట్ నగా,నట్రా ఉండాలి. ........ విదేశీ యాత్రలు ,........ విమానం టిక్కెట్లు .......ఇలా....... ఇవన్నీ కనీస సౌకర్యాలు అన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.


పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు వేలు, లక్షల్లో ఉంటాయి. ...................... అలాంటి స్కూల్లో చదివితేనే పిల్లలు అభివృద్దిలోకి వస్తారని ఇప్పటి వాళ్ళ అభిప్రాయం.


అభివృద్ది అంటే లక్షల్లో సంవత్సరాదాయం వచ్చే ఉద్యోగాలు పొందటం........... నలుగురిలో సోషల్ స్టేటస్ వగైరా....................

( ఇదేనా అభివృద్ది అంటే ? ఇవి ఉంటే జీవితంలో ఆనందం తప్పనిసరిగా ఉంటుందా ?

ఇవన్నీ ఉన్న కుటుంబాల్లో కూడా ...................... ఎన్నో సమస్యలు ఉంటున్నాయిగా మరి............ ఆ సమస్యలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొందరు. )


పిల్లల అభివృద్ది కోసమంటూ తల్లి ఒక దగ్గరా...........తండ్రి ఒక దగ్గరా ఉండి ఉద్యోగాలు చేస్తారు .............. అలా సంపాదిస్తూ బోలెడు డొనేషన్స్ కట్టి పిల్లలను స్కూల్లో వేస్తారు పెద్దవాళ్ళు.

ఇహ పిల్లలు పొద్దున లేచి రాత్రి పడుకొనేవరకూ స్కూలూ , వరుస ట్యూషన్లూ ............ఇక వాళ్ళు పెద్దవారయి ఉద్యోగంలో చేరాక తమ చదువు కోసం కట్టిన డొనేషన్స్ కు తగ్గట్టు తిరిగి డబ్బు సంపాదించాలి కదా !

ఇంకా ........ తమకు పుట్టిన పిల్లల అభివృద్ది కోసం కూడా డబ్బు సంపాదించాలి కదా !

ఇక వీళ్ళు మళ్ళీ పొద్దస్తమానం కష్టపడటం మొదలు పెడతారు. ...............ఈ క్రమంలో ముసలితనం వచ్చేస్తుంది. ............... కాలం ఎవరి కోసం ఆగదు కదా ! ఇక వ్యాధులు మొదలవుతాయి..................... అప్పుడు అలసటతో వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితమంతా శూన్యంగా కనిపిస్తుంది.


మనిషికి డబ్బు అవసరమే. కానీ డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

ఒక స్థాయికి మించి డబ్బు సంపాదించటం వల్ల మన వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్లే ప్రమాదం రావచ్చు.

డబ్బు కోసం సొంతవాళ్ళే తమ వారికి హాని కలిగిస్తున్నారు.

అందుకని సంపాదన కోసం అతి వెంపర్లాట తగ్గించుకోవటం అందరికి శ్రేయస్కరం.

* ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు డబ్బు ఉన్నవాళ్ళకు కూడా కష్టాలూ ,నష్టాలూ, , రోగాలూ, రొష్టులూ ఉంటాయి.

డబ్బు ఎంత ఉన్నా కొందరి ఇళ్ళలో కుటుంబసభ్యులు ఆప్యాయతలు లేకుండా ఎవరికి వారు బ్రతుకుతుంటారు.

కొందరు పేదవారి ఇళ్ళలో డబ్బు అంతగా లేకపోయినా ................ కుటుంబ సభ్యులు ,బంధువులు ఆప్యాయంగా కలసిమెలిసి ఉంటారు. .......... ఈ మధ్యన వాళ్ళూ తిట్టుకోవటం మొదలుపెట్టారు లెండి.

* అందుకే సంతోషంగా ఉండాలంటే డబ్బు కన్నా .......... మనసు యొక్క తీరు ముఖ్యపాత్ర వహిస్తుంది.

అందుకని ధనవంతులు ప్రపంచంలో సంపదంతా పోగేయాలనే దురాశ వదిలిపెట్టినప్పుడే ......... వారికీ , చుట్టుప్రక్కలవారికీ సుఖం.

పేదవారు కూడా తాము డబ్బు లేని దురదృష్టవంతులం అని నిరాశపడకుండా కష్టపడితే............ జీవితంలో అభివృద్ది సాధిస్తారు.

అలాంటప్పుడే సమసమాజం ఏర్పడుతుంది..