koodali

Friday, June 24, 2011

గృహిణిగా ఉండటం ఎంతో గొప్ప విషయం. .

 

మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఇద్దరూ సమానమే. అలాగే భార్యాభర్తలలో ఇద్దరూ సమానమే.


పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి కుటుంబవ్యవస్థకు విధివిధానాలను రూపొందించారు. ఎవరినీ తక్కువ చేయటం వారి ఉద్దేశం కాదు.


మగవాళ్ళకు, ఆడవాళ్ళకు శారీరికంగా, మానసికంగా ఎన్నో తేడాలుంటాయి. దానికి తగ్గట్టుగానే వారికి బాధ్యతలను ఇవ్వటం జరిగింది.


మగవాళ్ళకు కుటుంబ పోషణ, పాలన, రక్షణ వగైరా బాధ్యతలను అప్పగించారు.

ఆడవారు కొంచెం బిడియంగా, సున్నితంగా ఉంటారు, ఇంకా వారికి గర్భధారణ వంటివి ఉన్నాయి కాబట్టి , ఆడవారికి ఇంటిపట్టునే ఉండే ఇంటిని చక్కదిద్దుకోవటం, పిల్లల ఆలనాపాలనా వంటి బాధ్యతలను అప్పగించారు.

ఇంకా, ఆడవారు బైటకు వెళ్తే వచ్చే , రక్షణ వంటి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోని పెద్దలు ఇలా ఏర్పాటు చేశారు .


ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు మేము వంటింటి కుందేళ్ళుగానే పడి ఉండాలా ? అంటుంటే ..... వాళ్ళెందుకు అలా ఆలోచిస్తున్నారో అర్ధం కావట్లేదు.

బయటికి వెళ్ళి పనిచేస్తేనే గొప్ప... ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుకోవటం గొప్ప కాదు అ
ని... భావించటం తప్పు.

మన కుటుంబసభ్యులకు, పిల్లలకు , మన ఆరోగ్యం కోసం మనం వంట చేయటం చిన్నతనంగా భావించటం దురదృష్టం... అలా అనుకుంటే మరి మనకు భోజనం ఎవరు తయారు చేస్తారు ?


మీడియాలో చూపిస్తుంటారు, యాంకర్ . . " మీరు ఏం చేస్తుంటారు " ? అని గృహిణులను అడిగితే ....

కొందరు.." నేను హౌస్ వైఫ్ నేనండి".. అంటుంటారు.( తలదించుకుని ) .. ఉద్యోగం చెయ్యకుండా గృహిణిగా ఉండటమే తప్పు అన్నట్లు.

ఇలాంటి వారు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఎవరిల్లు వారు చక్కదిద్దుకుంటే దేశమే బాగుపడుతుంది కదా !

పూర్వం మగవాళ్ళు సంపాదన కోసం బైటకెళ్ళి కష్టపడి ,
.......ఏ మధ్యాహ్నమో భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ... లేక ... ఏ సాయంకాలానికో ఇంటికి వచ్చినపుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

(అప్పుడు మగవాళ్ళని ఇంటి పనులు చెయ్యమని ఎవరూ అడిగేవారు కాదు. అలాగే ఆడవాళ్ళని సంపాదించుకు రమ్మని అడిగే వారు కాదు. .)

ఆడవాళ్ళు అయితే , మగవాళ్ళు బయటకు వెళ్ళాక నిదానంగా ఇంటి పనులు చక్కబెట్టుకొని పగలు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

కానీ ఈ రోజుల్లో భార్యాభర్తా ఇద్దరూ సంపాదన కోసం బైటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తారు.

ఇక అప్పుడు అలసిపోయి ఇంట్లో పనులు చెయ్యాలంటే ఇద్దరికీ విసుగే. అప్పుడు నీరసంగా ఏదో ఇంత వండుకొని తింటారు.

ఈ విధానంలో ఎవరికీ విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ( రాత్రికి నిద్రలో విశ్రాంతి తప్ప. )

నేనూ మీలాగే బైట సంపాదిస్తున్నాను కాబట్టి, భర్త కూడా ఇంటి పని చెయ్యాలంటుంది భార్య.

ఇక ఇంటి పనులు తప్పించుకోవటానికి భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మొదలవుతుంది. ఇక గొడవలు మొదలు.

ఆ కోపమంతా .. అప్పటికే అలసిపోయి బడి నుంచీ వచ్చిన పిల్లల మీద చూపిస్తారు.

భార్యను భర్త తిడితే .. పురుషాహంకారం నశించాలి .. అని నినాదాలు చేస్తారు .

మరి పిల్లలను తల్లిదండ్రులు తిడితే ? తల్లిదండ్రుల అహంకారం నశించాలి ... అని పిల్లలు కూడా నినాదాలు చెయ్యాలేమో ఇక !

కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుంది.

కుటుంబం అన్నాక ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా .,ఆనందంగా ఉండాలంటే భార్యాభర్తలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.

ఇల్లాలు చక్కగా ఆహారాన్ని వండి పెట్టాలి. పాత్రలు, దుస్తులు ,ఇల్లు ఎప్పటికప్పుడు అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.


చిన్నపిల్లలను పెంచటానికి ఎంతో ఓపిక కావాలి.ఇంకా,..... ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని దగ్గరుండి చూసుకోవాలి కదా !

ఇలా ఆడవాళ్ళకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.

పూర్వం ఆడవాళ్ళు , పొరుగువారితో కబుర్లు చెప్పుకొనేటప్పుడు కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పప్పులు, ఉప్పులు శుభ్రం చేసుకోవటం , కుట్లు, అల్లికలు వంటివి చేస్తూ ఉండేవారు.

పెరట్లో కూరగాయలు , పండ్ల చెట్లు పెంచేవారు. కొందరు ఆవులు, గేదెలు పాలు పితకటం ఇలా ఎన్నో చూసుకొనేవారు.

పురుడు పోయటానికి అనుభవం గల ఆడవాళ్ళు ఉండేవారు.

ఈ రోజుల్లో కూడా వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వగైరా కొన్ని రంగాల్లో ఆడవాళ్ళు పనిచేయవలసిన అవసరం ఉంది.

అలాగని ఉద్యోగం చేయకపోతే చిన్నతనంగా మహిళలు భావించకూడదు.

ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ కూడా ఇతరులకు ఎంతో సహాయం చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

మొత్తానికి భార్యభర్త నేనుగొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ బిజీ అయి పోయి చంటిపిల్లలను కూడా కేర్ సెంటర్లలో వేస్తారు. తరువాత హాస్టళ్ళలో వేస్తారు.

ఇక ఆ పిల్లలు పెద్దయ్యాక ఈ ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తారు.

అధర్మ సంపాదనతో పొందిన ఆహారం, నిలువ ఉంచిన ఆహారం ( ఉదా.. జంక్ ఫుడ్, ఆరు నెలల క్రితం వండి అమ్మే కర్రీలు వంటివి ... ), ఇలాంటి ఆహారాన్ని తామస ఆహారం అంటారట.

ఇలాంటి ఆహారం స్వీకరించటం వల్ల తామసగుణాలు వృద్ధి చెందుతాయట.

అందుకేనేమో ! ఈ రోజుల్లో తామస గుణాలైన కోపం, అసహనం విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

 

No comments:

Post a Comment