koodali

Wednesday, June 29, 2011

.ఆచారాల వెనుక...ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.....



సంతోషకరమైన విషయం..అమరనాధ్ యాత్ర ప్రారంభమయిందట. ఈ యాత్ర చాలా గొప్ప యాత్ర.
.........................................

పూర్వం, ఇంట్లో పనులు చేయటానికి ఇన్ని యంత్రాలు లేవు కదా ! పప్పు రుబ్బటం, పిండి కొట్టటం ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళే చేసుకొనేవారు.

ఈ పనులన్నీ చేయటం వల్ల , ఇంకా పురుగు మందులు లేని పుష్టికరమైన ఆహారం తీసుకోవటం వంటి కారణాల వల్ల ఆరోగ్యంగా ఉండేవారు.


ఇప్పటిలా మధ్య వయసుకే నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, లాంటివి ఉండేవి కాదు. నాకు ఒక సందేహం వస్తూంటుంది.

ఇప్పుడు ఇన్ని యంత్రాలు ఉన్నా ఇంట్లో పనులు తొందరగా చేయలేకపోతున్నాము. అప్పటి వాళ్ళు అంతంత పనులు స్వయంగా చేసుకున్నా కూడా , వాళ్ళకి ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకోవటానికి బోలెడు సమయం ఎలా ఉండేదా ? అని.


ఇంకా వాళ్ళు నోములు, వ్రతాలు కూడా ఎక్కువగా చేసేవారట. అంత సమయం ఎలా ఉండేదో ?

మన ప్రాచీనులు ఆడవాళ్ళకు నోములు, వ్రతములు చెప్పటంలో ఆధ్యాత్మికతతో పాటూ ఎన్నో సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయనిపిస్తుంది.


పూజలు మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ ఇలా ముత్తయిదువులకు పసుపు కుంకుమ పంచిపెట్టమని చెప్పటం వంటి వాటి ద్వారా సమాజంలో అందరి శ్రేయస్సు కోరటం అలవాటవుతుంది.

ఇంకా, అందరి మధ్య మంచి స్నేహ సంబంధాలు పెరగటం వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి అనిపిస్తుంది.....

ఎక్కువగా నోములలో ఊరిలో కొందరు ముత్తయిదువులకు పసుపు,కుంకుమలు,తాంబూలం పంచి పెట్టమని చెబుతారు. ఇలాంటి నియమాల వల్ల ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహం ఏర్పడే అవకాశం ఉంది.


ఇలా ఆడవాళ్ళు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళినప్పుడు వారి ఇల్లు అలంకరణ, పెరటి తోట ఇలాంటివి చూసి తాము కూడా ఎన్నో విషయాలు నేర్చుకొంటారు.

సామాన్యంగా ఒక కోడలు " నేను ప్రక్కింటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకువస్తానండి " అని ఇంట్లో వారిని అనుమతి అడిగిందనుకోండి.

వారు పంపుతారో లేదో ! తెలియదు.

అలా కాకుండా పూజలు, పేరంటాలు వంటి సందర్భాలలో అయితే పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టరు గదా !

ఇంకా తీర్ధయాత్రలు, తిరునాళ్ళు విషయంలో కూడా ఆధ్యాత్మికతతో పాటూ ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్నాయనిపిస్తుంది.

ఇలా వెళ్ళి రావటం వల్ల కుటుంబసభ్యులు అందరికీ రోజువారి జీవితం నుంచి కొంచెం మార్పు ఉంటుంది.

ఎక్కువగా దేవాలయాలు కొండలమీద, నదుల ఒడ్డున ఉంటాయి. అలాంటి రమణీయ ప్రదేశాలకు నాలుగు రోజులు వెళ్ళి రావటం వల్ల ఇంట్లో అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. పుణ్యం, పురుషార్ధం అన్నీ దక్కుతాయి.

ఇలా మన పెద్దలు ఎన్నో విధాలుగా ఆలోచించి ఇవన్నీ ఏర్పాటుచేశారు. నిజంగా మన పెద్దలు ఎంత తెలివిగలవాళ్ళో గదా ! అనిపిస్తుంది.....


ఇంకా , స్త్రీలు ఆభరణాలు వేసుకోమని చెప్పటం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని ధరించటం వల్ల అందం, అలంకారం అని అందరికీ తెలుసు.

బంగారు ఆభరణాలు ధరించటం ,మట్టిగాజులు ధరించటం వల్ల ఆరోగ్యం కలుగుతుందట. స్త్రీలకు వివాహ సమయంలో పుట్టింటివారు, అత్తింటివారు ఆభరణాలు చేయిస్తారు.

ఈ ఆభరణాలు స్త్రీల దగ్గరే ఉంటాయి. అవి స్త్రీలకు ఆస్తిలాగా ఆపద సమయంలో ఆదుకుంటాయి.

ఉదా..ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

భర్తకు ఎప్పుడయినా అవసరమయితే భార్య తన ఆభరణాలు ఇవ్వటం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చు.

ఆ ఆభరణాలను తన పిల్లలకో, మనుమలకు, మనుమరాళ్ళకు ఇచ్చుకోవచ్చు.

ఇంకా, పూర్వం మహారాణులు వంటి వారు కష్టాలలో ఉన్నప్పుడు ( ఉదా...శత్రువులు ముట్టడించినప్పుడు ) వారి ఆభరణాలు వారికి ఉపయోగపడేవట.

సీతమ్మ వారి జాడ కనుగొనే సందర్భంలో ఆమె జారవిడిచిన ఆభరణాల పాత్ర అందరికి తెలిసిందే.

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ... స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళ ఆభరణాలను అంత త్వరగా తీసుకోరు కదా! మరీ కష్టాల్లో ఉంటే తప్ప.

అయినా, ఆ నగలు మళ్ళీ వారి పిల్లలకే చెందుతాయి కదా !

అయితే మితిమీరిన భోగాల వెనుక రోగాలు ఉన్నట్లు, మితిమీరి పసిడిని ప్రోగుచేస్తే దాని వెనుక దొంగల భయం వంటి ప్రమాదాలు ఉంటాయి.

ఇవన్నీ చూస్తే పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాల వెనుక... ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.


5 comments:

  1. ముత్తయిదువులకు పసుపు,కుంకుమలు,తాంబూలం పంచి పెట్టమని చెబుతారు. ఇలాంటి నియమాల వల్ల ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహం ఏర్పడే అవకాశం ఉంది.
    ----------
    పూర్వకాలం నుండీ మన సమాజం ఎప్పుడూ స్త్రీల బాగోగులు పట్టించుకొంటూనే ఉండేది. కాకపోతే ఆ పద్ధతులు ప్రస్తుతం ఎవరికీ నచ్చవు. ఈ కాలంలో ఆ పద్ధతులకి రేప్లసుమేంట్ ఇంకా రాలేదు. బాగా వ్రాసారు.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు. ఇలాంటి ఆలోచనాస్ఫోరక టపాలు మఱికొన్ని చేయగలరు.

    ReplyDelete
  3. మీరు కొన్ని రోజులు ఊరు వెళ్ళి వస్తానని అనటం గురించి మీ బ్లాగ్ లో చదివానండి. ఊరు వెళ్ళివచ్చినందుకు సంతోషం అండి. మేడం గారిని అడిగినట్లు చెప్పండి. ఈ టపా నచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.

    మీరన్నట్లు మన సమాజం ఎప్పుడూ స్త్రీల బాగోగుల గురించి పట్టించుకొంటూనే ఉంది. పాతకాలం పద్దతులు ప్రస్తుతం చాలామందికి నచ్చని మాట కూడా నిజమేనండి.....

    ReplyDelete
  4. ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలండి.
    ఏదో నాకు తెలిసినంతలో వ్రాస్తున్నాను. .అంతా దైవం దయేనండి.

    ReplyDelete
  5. అమెరికాలో పుట్టిన అబ్బాయి ఇండియాలో శాస్త్రోక్తంగా పెళ్లి చెయ్యమని అడిగితే ఎగిరి గంతేసి పెళ్లి చేసి తిరిగి అమెరికా వచ్చాము మీలాంటి వాళ్ళ మంచిమాటలు వినటానికి. గుర్తు పెట్టుకున్నందుకు థాంక్స్ట.

    ReplyDelete