koodali

Wednesday, May 30, 2012

జంట అంటే అర్ధం ఇద్దరు అని....


జంట అంటే  అర్ధం  ఇద్దరు  అనేకానీ   బోలెడుమంది  అని  కాదు. ఒక  భార్యను  ఒక  భర్తను    ఒక జంట   అని  పెద్దలు అంటారు.


  వారు     చక్కటి  జంటగా    జీవితాంతమూ  తోడునీడగా  ఉన్నప్పుడు  ఆ  కుటుంబమూ  ఆ  సమాజమూ  చక్కగా  ఉంటాయి. 


 అందుకే  జీవితాంతం    కష్టసుఖాలలో  ఒకరికొకరు  తోడునీడగా  ఉండాలని  వివాహసమయంలో  వధూవరులతో  పెద్దలు   ఎన్నో  ప్రతిజ్ఞలు  చేయిస్తారు...... అలా  చక్కగా  ఉండే  జంట   అదృష్టవంతులే. 


 అయితే  అందరి  జీవితాలూ  ఒకలా  ఉండవు  కదా  !   ఎన్నో  కారణాల  వల్ల   కాపురాల్లో   మార్పులు  చేర్పులు  వస్తుంటాయి. ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  వల్ల  వచ్చే    కొన్ని  కష్టాలను  పురాణేతిహాసాల  ద్వారా  తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు .....  ఏవైనా    కారణాల  వల్ల   భర్త  వేరే  వివాహం  చేసుకున్నప్పుడు   ఆ   సవతి  తల్లి  వల్ల  మొదటి  భార్య  సంతానానికి  కష్టాలు  వచ్చే  అవకాశం  ఉంది. ఉదాహరణకు.....   రామాయణంలో  కైకేయి  వల్ల  రాముని  పట్టాభిషేకం  ఆగిపోవటం,  తరువాతి  సంఘటనలు     అందరికీ  తెలిసిన  కధే.  
ఇక     శంతనుని  విషయంలో  కొంచెం  వేరే  కధ. ....... మొదటి  భార్య  గంగాదేవి  భీష్ముని  పుట్టుక  తరువాత  శంతనుని  వదిలి  వెళ్ళిపోయింది.  (వివాహానికి  ముందు  జరిగిన  ఒప్పందానికి  వ్యతిరేకంగా  శంతనుడు   గంగాదేవిని  ప్రశ్నించేసరికి. )  
  చాలాకాలం  తరువాత   శంతనుడు    మళ్ళీ   వివాహం  చేసుకోవాలని  అనుకున్నారు. తనకు   భార్య  లేదు  కాబట్టి,  మళ్ళీ  వివాహం  చేసుకోవాలని  అనుకున్నప్పుడు , వివాహానికి     ఆంక్షలు  విధించిన      సత్యవతీదేవి  యొక్క  సంబంధాన్ని  కాకుండా,    శంతనుడు  ఇంకొక  స్త్రీని  వివాహం  చేసుకుంటే  బాగుండేది.


శంతనుడు  సత్యవతీదేవిని  వివాహం  చేసుకోవాలనుకున్నప్పుడు   సత్యవతీదేవి  తండ్రి  కోరిన  కోరికల  వల్ల  భీష్ముడు  వివాహాన్ని,  రాజ్యార్హతను  వదిలేయవలసి  వచ్చింది  కదా  !    భీష్ముడు  వివాహాన్ని  చేసుకుని,  రాజ్యాన్ని  పాలిస్తే   మహాభారత  కధ  ఇంకోలా  ఉండేదేమో!   ఇక  స్త్రీలు  ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  ...... ఉదాహరణకు ....  ఊహించని   విధంగా      ద్రౌపదికి   పంచపాండవులతో   వివాహం    జరిగింది  కదా  !  ద్రౌపది  పంచ  పాండవుల  వద్ద   ఒక్కొక్కరి  వద్ద  ఒక్కొక్క  సంవత్సరం  ఉండేటట్లు  ఏర్పాటు  జరిగింది  . 


 ధర్మరాజు  వద్ద  ద్రౌపది  ఉన్న    సంవత్సరంలో  మిగతా  నలుగురు    వారింటికి   రాకూడదన్న  మాట.    ఒకసారి  ఒక  తప్పనిసరి   పనివల్ల  అర్జునుడు  ద్రౌపది  ఉన్న  ధర్మరాజు   ఇంటికి  రావటం   వల్ల  ,     అర్జునుడు  తీర్ధయాత్రలు  చేయవలసి  వచ్చింది.  అప్పుడే   అర్జునుడు   సుభద్ర  మొదలగు  వారిని  వివాహం  చేసుకున్నాడు. ఎక్కువ  వివాహాలు  చేసుకోవటం  వల్ల  ఇలాంటి  సున్నితమైన  ఇబ్బందులు  ఎన్నో   ఉంటాయని   ద్రౌపది  కధ  ద్వారా  మనం  తెలుసుకోవచ్చు.


ఈ  రోజుల్లో  కొందరు   ఆడవారు    వేరే  వివాహాలు  చేసుకుంటున్నారు.  ఇలాంటి    సందర్భాలలో ఎక్కువగా    ఇబ్బందులు  పడేది    వారి  సంతానామే.   స్త్రీలు  రెండవ  వివాహం  చేసుకుంటే  ఆ  స్త్రీకి     మొదటి  భర్త  వల్ల   కలిగిన  సంతానానికి , మారుటి  తండ్రి  వల్ల  కష్టాలు  వచ్చే  అవకాశం      ఉంది.  ఆమెకు  ఆడపిల్లలు  ఉంటే    ఆ  పిల్లలకు   కొత్తరకం  కష్టాలు    వచ్చే   అవకాశాలు  కూడా    ఉండొచ్చు.ఈ  రోజుల్లో  తల్లిదండ్రులు    తమ  పిల్లల  ఇష్టాఇష్టాలను  పట్టించుకోకుండా   తమ  సంతోషమే  ముఖ్యంగా  భావిస్తూ  వేరే  వేరే   వివాహాలు  చేసుకుంటున్నారు. తమ  పిల్లల  మనసులు  ఎంత  గాయపడతాయో   వాళ్ళకు  తెలిసినా  తాము  చేసిన  పనిని   సమర్ధించుకుంటున్నారు.      సొంతతల్లి  బదులు  కొత్త  తల్లి,  సొంత  తండ్రి  బదులు  కొత్త  తండ్రి   ఇంట్లో   ఉంటే        ఆ  పిల్లల  మానసిక  పరిస్థితి  ఎలా  ఉంటుందో  ఊహించుకుంటేనే  బాధగా  ఉంటుంది.


 ఇలాంటి    ఎందరో    జీవితాలలోని     సంఘటనల  సమాహారమే  పురాణేతిహాసాలు.  వాటిని  చదివి ,  జాగ్రత్తపడి    రాబోయే  తరాల  వాళ్ళు   తమ    జీవితాలను  చక్కగా  తీర్చిదిద్దుకోవాలని  ఆశించి ,  దైవం  , పెద్దలు  ఒక  ప్రణాళిక  ప్రకారం   పురాణేతిహాసాలను  మనకు  అందించారు . అని  నాకు అనిపిస్తుంది. 


 పురాణేతిహాసాలలో  ఇంకా  ఎన్నో  అంతరార్ధాలు  కూడా   ఉన్నా,  ఒక  సామాజిక  కోణం  ద్వారా  చూస్తే  నాకు  ఇలా  అనిపించింది...

...................................


Monday, May 28, 2012

మరి కొన్ని విషయములు....

* ఓం. శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రణామములు.

*బ్రహ్మ దేవుడు , నారదునితో పరమాత్మను గురించి చెప్పిన సందర్భంలో...........


*సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే 

 ఆదిశక్తి-ఆదిపురుషుల తత్వం.అది తేజస్సు....
ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు.సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రాభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ.పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. అంటూ ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.
....................................

  *  ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి నారాయణుడు నారదునితో చెప్పిన విషయాలు............


స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు.దక్షిణా దేవి యజ్ఞపత్ని
.


స్వధాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి.స్వస్తి దేవి వాయుపత్ని. ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది.


పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు.తుష్టిదేవి అనంత పత్ని. సకలదెవతలూ సకల లోకాలూ సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే.


సంపత్తిదేవి ఈనాశ పత్ని.
ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. (( ఇలాగే ఉందండి . .) మరి ఈశాన పత్ని . సరైనదో . లేక ఈనాశ పత్ని. సరైనదో నాకు తెలియదండి. )
 

ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో వొణికిపోవాల్సివస్తుంది.


సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమై పోతుంది.దయాదేవి మోహ పత్ని.ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది.కీర్తిదేవి సుకర్మ పత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది.క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి.
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.


శాంతదేవి లజ్జాదేవులిద్దరూ సుశీల పత్నులు. వారు లేకపోతే జగత్తు ఉన్మత్తమై పోతుంది.

బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది.మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప. మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ
కూడా నిరాధారుడై పోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీ రూప. మూర్తి రూప.మాన్య. ధన్య.


ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.


కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు.


క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది.


.తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు.కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది.నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు.శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.* ఇలా పెద్దలు చెప్పటం జరిగింది.
.....................
* నాకు అర్ధం అయినంతలో .........

౧. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు. .......

అంటే ,
పుష్టిదేవితో కూడిన గణపతి దేవుని అనుగ్రహం వల్ల స్త్రీపురుషులు క్షీణించకుండా ఉంటారు....

( పుష్టిగా ఉంటేనే క్షీణించకుండా బలంగా ఉంటారు కదా !. )


౨. ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో
వొణికిపోవాల్సివస్తుంది.......

అంటే , (..ధృతి అంటే ధైర్యం .ధైర్యం లేకపోతే అధైర్యమే కదా !. )


౩ . ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది. ........

అంటే ,( ..పుణ్యాలు చేస్తే ప్రతిష్ఠ పెరుగుతుంది. పుణ్యాలు చేసేవారు లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది కదా ! )


౪.కీర్తిదేవి సుకర్మ పత్ని.
ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది......

అంటే , (.మంచి కర్మలు చేసే వారు లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది కదా ! )


౫ . క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి. .............

అంటే ,. (. పద్ధతిగా పనులు చేసేవారులేకపోతే లోకాలన్నీ సోమరులతో నిండి విధిహీనాలైపోతాయి కదా ! )


౬ .
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది .......

అంటే ,. ( మిధ్యావాదులైన అధర్మపరులయిన ప్రజల వల్ల సృష్టి
విచ్ఛిన్నమవుతుంది కదా !. )


౭ . శాంతాదేవి లజ్జాదేవులు సుశీల పత్నులు.........వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. .........

అంటే , ( శాంతం, లజ్జ ( సిగ్గు ) లేని ........ సుశీలత లేని వ్యక్తుల వల్ల జగత్తు ఉన్మత్తమైపోతుంది కదా !. )


బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. ......

అంటే ,....( బుద్ధి మేధా ధృతి కలిగిన జ్ఞానులు లేని లోకం మూఢులతో నిండిపోతుంది కదా !.)


౯ .. మూర్తిదేవి ధర్మపత్ని........

అంటే ,...( ధర్మం , ధర్మమూర్తులు లోకంలో పెరిగినప్పుడు లోకంలో ధర్మానికి బలం పెరిగి , అధర్మానికి బలం తగ్గిపోతుంది . అప్పుడు
పరమాత్మ కృపకు పాత్రులమవుతాము కదా ! )


౧౦ . క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది......

అంటే , (.క్షుత్పిపాసలతో కూడిన లోభబుద్ధి కలవారి వల్లే లోకం చింతాతురమవుతోంది కదా ! )౧౧. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. ..........

అంటే ,...( జరా ( ముసలితనం ), మృత్యువు వల్లనే జీవులు మరణిస్తారు. అలా జగత్తు క్షీణిస్తోంది కదా !. )


౧౨. నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు..........

అంటే ,....(. నిద్రా ......... సుఖం వల్ల అలసటనుంచి తేరుకుంటారు కదా ! )


౧౩. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.................

అంటే ,. ( శ్రద్ధా భక్తులు ఉన్నవారికి వైరాగ్యం కుదురుకుంటుంది. వారికి మోక్షం లభించే అవకాశం ఉంది కదా !.)
ఇలా నాకు అర్ధమయింది వ్రాసానండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి....(
ఈ  విషయములను   ఇంతకుముందు    ఒక  టపాలో    వేసాను.. )

...................................Friday, May 25, 2012

కొన్ని విషయాలు....


 మేము  చెన్నై  వెళ్ళి  నిన్న  ఉదయమే  తిరిగి  వచ్చామండి. ఇప్పుడు   ఎండలు  బాగా  మండిపోతున్నాయి.  నాకు  ఏమనిపించిందంటే,  ఈ  వేడిని   విద్యుత్ గా    మార్చి  నిల్వ  చేసుకుంటే  వచ్చే  వేసవి  వరకూ  విద్యుత్  కొరత  ఉండదు  కదా  !   అని . . ఎండలు  అంత  తీవ్రంగా  ఉన్నాయి    మరి.  ఈ  విషయం  అలా  ఉంచితే.....

............

ఆదిపరాశక్తి అయిన పరమాత్మ విశ్వాన్ని సృష్టించారు.

విశ్వంలో ఎన్నో లోకాలున్నట్లు పెద్దలు తెలియజేసారు.


 "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో పెద్దలు ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.


శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు .......తాము పరమపదించిన కొన్ని రోజుల తరువాత పునరుత్ధానం చెంది....... ఆయా లోకాల గురించి తమ శిష్యునికి చెప్పటం జరిగింది.


అందులో కొన్ని విషయములు........


"సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మ గ్రహాలు చాలా ఉన్నాయి."


అక్కడి వాళ్ళెవరూ స్త్రీ గర్భాన జన్మించిన వారు కారు: సూక్ష్మలోకవాసులు తమ విశ్వ సంకల్ప శక్తి సహాయంతో ప్రత్యేక ( అవయవ ) నిర్మాణమూ ,సూక్ష్మ శరీరమూ గల సంతానాన్ని సృష్టించుకుంటారు.సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా , మానసికప్రసార ( టెలిపతీ ) సూక్ష్మదూరదర్శనాల ( ఆస్ట్రల్ టెలివిజన్ ) ద్వారా జరుగుతుంది.మానవుడు ప్రధానంగా ఘన,ద్రవ,వాయు పదార్ధాల మీదా గాలిలో ఉన్న ప్రాణ శక్తి మీదా ఆధారపడి ఉన్నవాడు : కానీ సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయటం , అదృశ్యం చేయటం చేస్తూంటారు.సూక్ష్మ ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైనదీ పరిశుభ్రమైనదీ పరిశుద్ధమైనదీ సువ్యవస్థితమైనదీ.ఇలా ఎన్నో విషయాలు శ్రీ యోగానంద గారి గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యునికి చెప్పటం జరిగింది.
................................

పై  విషయాలను  గమనిస్తే    నాకు ఇలా అనిపించింది.......సృష్టిలో , దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు , దానవులు, ఉన్నారు.


దేవతలు, మానవులు, దానవులు,.............వీరందరి ధర్మాలు, గుణాలలో భేదం ఉంటుంది.


ఇతరలోకాల వారికి , మానవులకు   ఎన్నో  భేదాలున్నాయి.


ఇతరలోకాల వారికి , మానవులకు ఇన్ని తేడాలు ఉన్నప్పుడు , మరి మానవులకు దేవతలకు ఎన్నో తేడాలుంటాయి  కదా  !

  మనం దేవతల చర్యలను మన ఆలోచనా కోణం నుండి మాత్రమే చూస్తాము.....కానీ, దేవతలకు మానవులకు ఉన్న రీతిలో రాగద్వేషములు ఉండవు.దేవతల చర్యలు , మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. ........దేవతల చర్యలను మానవ ధర్మాలు,  గుణముల కోణం నుండి చూడకూడదు..........ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో   అంతరార్ధాలు  ఉంటాయి.దేవతలు ,  మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము ,....... వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు ....పురాణేతిహాసాలలోని   విషయాలలో మనకు తెలియని    ఎన్నో అర్ధాలు    దాగుంటాయి.


త్రిమూర్తుల  గురించి,   త్రిశక్తులైన  లక్ష్మీదేవి,   సరస్వతీదేవి,  పార్వతీదేవి  గురించి  " శ్రీపాద  శ్రీ  వల్లభ  సంపూర్ణ  చరితామృతము " గ్రంధములో  ఎన్నో  విషయములు    ఉన్నాయి.        ఇంకా    అనేక  ఆసక్తికరమైన   విషయములు  కూడా ఈ   గ్రంధంలో  ఉన్నాయి. 

  
Friday, May 18, 2012

అష్టలక్ష్ములు...మా  ఇంట్లో  ,   ఒక   పుస్తకంలో  ఉన్న  అష్టలక్ష్మీ  స్తోత్రంలో   ఆదిలక్ష్మీ ,    ధాన్యలక్ష్మి,     ధైర్యలక్ష్మి,   గజలక్ష్మి,  సంతానలక్ష్మి,    విజయలక్ష్మి,   విద్యాలక్ష్మి,     ధనలక్ష్మి....అని  నామములు  ఉన్నాయి. 


 ఆ  అష్టలక్ష్మీ  స్తోత్రంలో   విద్యాలక్ష్మి  యొక్క  స్తోత్రం  కూడా  ఉంది.


 మా  ఇంట్లో    అష్టలక్ష్మీదేవిల   చిత్రాలు    ఉన్న  ఒక  క్యాలెండర్  ఉంది.  ఆ    పటానికి   నేను  అప్పుడప్పుడు  నమస్కరించుకుంటూ  ఉంటాను.  అయితే  ఆ  క్యాలెండర్లో  ఉన్న  అమ్మవారి   చిత్రాల  క్రింద  రాసి  ఉన్న  నామముల  గురించి  నేను  అంతగా    పట్టించుకోలేదు.   అష్టలక్ష్మీదేవి      అని  నమస్కరించుకోవటం  జరిగేది.


అయితే,  నిన్న  నాకు  ఒక  ఆలోచన  వచ్చింది  అష్టలక్ష్ములలో  ఒకరైన   విద్యాలక్ష్మి  యొక్క  ఆకారవిశేషాలు  ఎలా  ఉంటాయో  తెలుసుకోవాలన్న  ఆలోచన  వచ్చి,     క్యాలెండర్ లో  చిత్రాల   క్రింద  ఉన్న  పేర్లు  చదివితే  అందులో  విద్యాలక్ష్మి  పేరు  లేదు.. ఇందులో    విద్యాలక్ష్మి  పేరు   లేదేంటి  చెప్మా  !  అని   తిరిగి  చదివితే,      గజలక్ష్మి,     ఆదిలక్ష్మి,   విజయలక్ష్మి,     వీరలక్ష్మి,    ధనలక్ష్మి,    సంతానలక్ష్మి,   ధాన్యలక్ష్మి,   ఐశ్వర్యలక్ష్మి,...... అని   నామములు  ఉన్నాయి.


అప్పుడు  నాకు  అనిపించింది ......   అష్టలక్ష్ములు  అంటే  ఒకే  రకమైన  పేర్లు    కాకుండా ,     .ఇలా  వివిధ రకములైన  నామములు  కూడా   ఉంటాయి  కాబోలు   అనిపించింది. ,  కొందరు  ఇలా     కొన్నిరకాల   మార్పులు,  చేర్పులతో  కూడా    పూజిస్తారు  కాబోలు  అనిపించింది.   చాలాకాలం  నుండి  మా  ఇంట్లో  ఆ  క్యాలెండర్  ఉన్నా  ,అప్పుడప్పుడూ    నమస్కరించటమే  కానీ,  ఎప్పుడూ  ఆ  నామముల  గురించి  పరిశీలించలేదు  . మన  కళ్ళెదుటే  ఉన్నా    చాలా  విషయాలను   మనం  సరిగ్గా  పరిశీలించము.   అందుకే  నాకు  ఏమనిపిస్తుందంటే,  నాకు  ఏమైనా  తెలివితేటలు  గాని  లేక  మంచి  ఆలోచన  గానీ  వచ్చిందంటే ,  అది  నా  సొంత  ప్రతిభగా  నేను  భావించను.  నాకు  కలిగిన  ఆ    చక్కటి  ఆలోచనలు   దైవం  యొక్క  దయవల్ల  కలిగినవి    మాత్రమే  అని  నేను  అనుకుంటాను.


  బ్లాగులో   నేను   వ్రాసే  విషయాల్లో  కూడా  చక్కటి  ఆలోచనలను  భగవంతుని  దయగాను,  పొరపాట్లు  రాస్తే  ఆ  పొరపాట్లను    నేను  చేసిన  తప్పులుగానూ  నేను  భావిస్తాను........Wednesday, May 16, 2012

సూర్య ప్రభ, చంద్ర శోభ ....సూర్యప్రభ, చంద్ర ప్రభ.


దేవతల గురించి పెద్దలు చెప్పిన విషయాల్లో అర్ధాలు నిగూఢంగా ఉంటాయట. మనం వాటి    పైపై విషయాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చెయ్యకూడదు.


గోలోకానికి అధిపతులు .... శ్రీకృష్ణుడు రాధాదేవి. .  శ్రీకృష్ణుడురాధాదేవి  దంపతులు.

ఒక సందర్భంలో శ్రీకృష్ణుని   రాసలీలల గురించి ,   రాధాదేవి శ్రీ కృష్ణుని  అడిగిన  సందర్భంలోని  కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. .......


శోభ అనే గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి వెళ్ళిపోగా ...... శ్రీకృష్ణుడు ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, బంగారానికి, స్త్రీల ముఖాలకీ,చిగురాకులకీ  , పువ్వులకీ, పక్వ ఫలాలకీ, పంటలకీ, రాజదేవమందిరాలకీ, శిశువులకీ, క్షీరానికీ, పంచిపెట్టారట.


 
ప్రభ అనే గోపిక సూర్యమండలానికి వెళ్ళిపోయింది...... ఆ ప్రభను కృష్ణుడు కొంత తన కన్నులలో దాచుకున్నారట. కొంత అగ్నికీ., యక్షులకీ, పురుష సింహాలకీ, దేవతలకీ, విష్ణుజనులకూ, నాగజాతికీ, బ్రాహ్మణులకూ, మునులకీ, తపస్వులకూ, సౌభాగ్యవతులకూ, యశస్వంతులకూ విభజించి ఇచ్చారట.
శాంతి అనే గోపిక శరీరాన్ని విడిచి కృష్ణునిలో లీనమయ్యిందట. .......... శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత రాధాదేవికీ, లక్ష్మీదేవికీ, కృష్ణుని మంత్రోపాసకులకూ, శాక్తేయులకూ, తపస్వులకూ, ధర్ముడికీ పంచిపెట్టారట.


క్షమ అనే గోపిక ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయిందట. ............... అప్పుడు కొంత భాగాన్ని విష్ణువుకీ, వైష్ణవులకీ, ధార్మికులకీ, ధర్ముడికీ, దుర్బలులకీ, తపస్వులకూ, వేదపండితులకూ, పంచి ఇచ్చినట్లు చెప్పబడింది.

.............................................

ఇవన్నీ చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.


ఈ విషయములలోని అంతరార్ధములు నాకు అంతగా తెలియవు కానీ ,


శాంతి అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ,క్షమ అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది,   ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.


 ఇంకా, ,

 శోభ కూ ప్రభకూ ఉండే తేడా  గురించి ,  ....ఏవి ఎక్కడ ఉంటాయి ,...ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.


ఉదా... చంద్రునికి ఉండే తత్వాన్ని  శోభ అంటారనీ, సూర్యునికి ఉండే 
తత్వాన్ని  ప్రభ అంటారని తెలుస్తోంది.  
 

అప్పుడు  సూర్య ప్రభ,  చంద్ర శోభ  అని  అనాలి.  కాని  పూర్వీకులైన  పెద్దలు   సూర్య ప్రభ,  చంద్ర ప్రభ అని  కూడా  అన్నారు.   సూర్య ప్రభ  వాహనం,  చంద్ర  ప్రభ  వాహనం  అని  అంటారు  కదా  !


 

అయితే,   సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి , భూమికి చేరుతుంది ....అలా   సూర్యుని  కాంతి  (  ప్రభ )   చంద్రునిపై  పడటం  కూడా    వెన్నెల వెలుగుకు  ఒక  కారణం  అని  ఆధునికులు  కూడా    అంటున్నారు  కదా  !
 అలా  చూస్తే  సూర్యప్రభ, చంద్ర  ప్రభ  అని    కూడా  అనవచ్చు.  సూర్యప్రభ  వాహనం,  చంద్రప్రభ  వాహనం అని  పెద్దలు   అన్నది    సరైనదే. ( పెద్దలకు   కూడా  ఈ  విషయాలన్నీ  తెలుసు  అనిపిస్తుంది.) ద్వాదశార్యాసూర్యస్తుతిః లో.. 9 వ శ్లోకం ద్వారా.. సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి రాత్రి వేళ వెన్నెలకాంతి వెలువడటం అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. 

..................
 ఇలా  ...   శ్రీ  కృష్ణుని  రాసలీలలు   ద్వారా    ఎన్నో  విషయాలు  కూడా   తెలుసుకోవచ్చు.
.................

వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

అంతా  దైవం  దయ..శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి  నమస్కారములు.....

Monday, May 14, 2012

గ్రంధాలలో ఉన్న విషయపరిజ్ఞానం అనంతం....విజయవాడ  వెళ్ళామండి. ఇంద్రకీలాద్రిపై  కొలువున్న   అమ్మవారిఅయ్యవారి ( దుర్గాదేవి దుర్గామల్లేశ్వరస్వామివారి ) దర్శనం   చేసుకుని  ఈ  రోజు  ఉదయమే  తిరిగి    వచ్చాము. .  ఈ  రెండురోజులు  బ్లాగ్  చూడటం  కుదరలేదు. 
....................

గ్రంధాలలో  ఉన్న  విషయపరిజ్ఞానం   అనంతం  అనిపిస్తుంది. 

గ్రంధాలలో  ఉన్నకొన్ని  విషయాలు....అక్కడక్కడా...
.........................................


సృష్టికి  ఆదిలో  త్రిమూర్తులు  ఆదిపరాశక్తిని  దర్శించి  స్తుతించారు.  అప్పుడు  జగదీశ్వరి  వారికి  ఎన్నో  విషయాలను  తెలియజేయటం  జరిగింది.  ఇంకా  ఆ  ముగ్గురికీ    మూడు  శక్తులను    (  బ్రహ్మ  విష్ణు   మహేశ్వరులకు......   సరస్వతీ  లక్ష్మీ  గౌరీ  ( మహాకాళీ  ) శక్తులను )బహుకరించి.........ఎన్నో  విషయాలను  వివరించి,  .....

.............విషమ  పరిస్థితి ఏదైనా  ఎదురైనప్పుడు  నన్ను  స్మరించండి.  స్మరణ  మాత్రం  చేతనే  నేను  మీకు  దర్శనం  అనుగ్రహిస్తాను.    అలాగే  సనాతనుడైన   పరమాత్మను  కూడా  తలుచుకోండి.  మా  ఇద్దరినీ  తలుచుకుంటే  మీకు  కార్యసిద్ధి నిస్సంశయంగా   కలుగుతుంది........... అని  కూడా  చెప్పటం  జరిగింది. 
....................................

శ్రీరాముడు  నారదుల వారిని  దేవీప్రభావాన్ని  తెలియజేయమని  అడిగినప్పుడు  నారదుడు  దేవి  గురించి  ఎన్నో  విషయాలను  రామునితో  చెప్పటం  జరిగింది.  

కొన్ని  విషయాలు....విష్ణుమూర్తిలో  పాలన శక్తి  ఆమె. బ్రహ్మలో     సృజనశక్తి  ఆమె. రుద్రుడిలో  సంహారకశక్తి  ఆమె.  ఈ  సృష్టిలో  ఏ  చిన్న  వస్తువైనా  సరే  అది  ఆవిడ  శక్తియే.  ఆవిడ  ఉత్పత్తియే.   ఈ  త్రిమూర్తులూ ఈ  సూర్యచంద్రులూ   ఈ  భూగోళం  ఏవీ  లేనప్పుడు  కూడా  ఈ  మహాదేవి  పూర్ణప్రకృతిగా  పరాత్పరుడితో  కలిసి  విహరిస్తూ ఉంటుంది.  నిర్గుణస్వరూప  తాను  సగుణస్వరూపగా  మారి  ముల్లోకాలనూ  సృష్టిస్తోంది.....బ్రహ్మాదులను  సృష్టించి  వారికి  తన  శక్తులను   ప్రసాదించి  లోక  సృష్టిని  నిర్వహింపజేస్తోంది....అని  నారదులవారు    ఎన్నో  విషయాలను  తెలియజేసారు. 

 తరువాత  శ్రీరాముడు  దేవీ  నవరాత్ర  వ్రతం   చేసి     దేవిని  పూజించి   .....తరువాత   రావణుని  సంహరించి  ,    రాజ్యపాలనను    స్వీకరించి  ప్రజలకు  చక్కటి  పాలనను  అందించారు.
.......................................

నారాయణమహర్షి  నారదమహర్షితో  చెప్పిన  విషయాలలోని  కొన్ని  విషయాలు. 

 నారదా  !  ఆత్మ  నిత్యం.  ఆకాశం  నిత్యం.  కాలం  నిత్యం.  దిక్కులు  నిత్యం.  అలాగే  ఈ  విశ్వంలో  గోలోకం  నిత్యం. అందులో  ఒక  ప్రదేశమే   వైకుంఠం. అలాగే  ప్రకృతి  - నిత్యం.  అది  బ్రహ్మలీల.  సనాతనం.  అగ్నికి  వేడిమి  ,  చంద్రుడికి  వెన్నెల  ,  పద్మానికి  శోభ,  సూర్యుడికి  ప్రకాశం       ఎలా  అవిభాజ్యాలూ  అవిభక్తాలూ  అభిన్నాలో   అలాగే  (  పరమ  )  ఆత్మ  -  ప్రకృతి  రెండూ  అభిన్నాలు....ఇలా  ఎన్నో  విషయాలను  చెప్పటం  జరిగింది.
..........................................


సృష్టికి  మొదట  ప్రకృతితో    కలిసి   పరమాత్మ   ద్వివిధ రూపం   ధరించాడు. (  అర్ధనారీశ్వరుడు.  )  ఈ  రూపంలో  దక్షిణ  భాగం  పురుషుడు.  వామభాగం  ప్రకృతి.  ఇదే  పరబ్రహ్మ  స్వరూపం.  ఇదే  నిత్యం.  ఇదే  సనాతనం.  అగ్నికి  దాహకశక్తి  ఎలా  భిన్నం  కాదో   అలాగే  ఆత్మకు   శక్తి (  ప్రకృతి  )  భిన్నం  కాదు.  అందుకే  యోగులకు  స్త్రీపురుష  భేదభావన  వుండదు.  వారికి  అంతా  బ్రహ్మమయంగానే  కనిపిస్తుంది. 


 నారాయణ  ముని  ఈ  విషయాలన్నింటినీ  నారదుడికి  చెప్పి ,  ఆయన  కోరిక  మీద  దేవిని  ఎలా  ఆరాధించాలో   వివరించినట్లు  వ్యాసుడు  జనమేజయునికి  తెలియజేశాడు. 
..............................

శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధంలో  మణిద్వీపం  గురించి  చక్కగా  వర్ణించారు.
................................
 గ్రంధాలలో  ఉన్న  విషయపరిజ్ఞానం   అనంతం  అనిపిస్తుంది. 

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాటుగా  వ్రాస్తే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను..


......................

Friday, May 11, 2012

మన శక్తి మేరకు విషయాలను తెలుసుకుని, .....


జగన్మాతాపితరులు    ఒక   చక్కటి   ప్రణాళిక  ప్రకారం  ఈ  సృష్టిని    నడిపిస్తుంటారు.


 దేవతలు  ఒకరికొకరు  శాపాలు  ఇచ్చుకోవటం  వల్ల    లోకానికి  మాత్రం   మేలే  జరిగింది   అనిపిస్తుంది.  .  ఉదా...ఒకానొక  శాపం  వల్ల  గంగాదేవి  భూమిపై  అవతరించటం  వల్ల  (  గంగా  జలం  లభించి  )  లోకానికి  మేలే  జరిగింది  కదా  !


  విష్ణుమూర్తిని  భృగు మహర్షి  శపించటం ...  ..రామాయణ  ,  భారత  గాధలు  జరగటం ...ఇలా  పురాణేతిహాసాల  ద్వారా  ప్రజలకు  ఎన్నో  విషయాలు  తెలుసుకునే  అవకాశం  కలిగింది.


  పురాణేతిహాసాల  ద్వారా  రాబోయే  తరాలకు  దిశానిర్దేశం  చేశారు  పెద్దలు  అనిపిస్తుంది. 


  మనకు  ఎన్నో  విషయాలు  సరిగ్గా  తెలియవు.  ఉదాహరణకు  .... మన  మనస్సు  నిర్మాణం  గురించి  మనకే   సరిగ్గా  తెలియదు. 


 ప్రపంచంలో  ఎన్నో  వింతలు,  విశేషాలు,   రహస్యాలు  ఉన్నాయి.  వాటి  గురించీ  సరిగ్గా  తెలియదు. ఈ  లోకంలో  ఇప్పుడు  జరుగుతున్న  విషయాల  గురించే  మనకు  సరిగ్గా  తెలియనప్పుడు,     దైవరహస్యాల  గురించి,  పురాణేతిహాసాలలోని  అర్ధాలు, అంతరార్ధాల  గురించి  పూర్తిగా  తెలుసుకోవటం  ఎంతో  కష్టం  కదా  !


 మన  శక్తి  మేరకు ,  విషయాలను  తెలుసుకుని,   ధర్మాన్ని   ఆచరిస్తూ  ,  మనల్ని  సరైన  మార్గంలో  నడిపించమని  దైవాన్ని  ప్రార్ధించటం  ఉత్తమోత్తమం..

***************

    రాధాకృష్ణులు   గోలోకాధిపతులు.  రాధా  దేవి  శ్రీకృష్ణుని  అర్ధాంగి.    గోలోకం  గురించి  గ్రంధాలలో  ఎంతో  గొప్పగా  వర్ణించారు.  గోలోకంలో    వైకుంఠం  ఒక  భాగమట.


   గోలోక  శ్రీకృష్ణుని  అర్ధాంగి  రాధాదేవి  (  రాధిక  )  ,   వైకుంఠంలోని   చతుర్భుజ  నారాయణుని  అర్ధాంగి  లక్ష్మీదేవి. 


 గోలోకం  గురించి , గోలోక  శ్రీకృష్ణుడు   మరియు  రాధాదేవి  గురించి  శ్రీదేవీ  భాగవతము  గ్రంధంలో  ఎన్నో  వివరములున్నాయి..

********* 
శ్రీదేవీ  భాగవతము ,  శ్రీ పాద  శ్రీ  వల్లభ  సంపూర్ణ  చరితామృతము ,  ఒక  యోగి ఆత్మ  కధ ..... గ్రంధములలో   ఇంకా  ఎన్నో  ఆసక్తికరమైన  విషయాలున్నాయి. 


 మన  శక్తి  మేరకు     విషయాలను  తెలుసుకుని,   ధర్మాన్ని   ఆచరిస్తూ  ,  మనల్ని  సరైన  మార్గంలో  నడిపించమని  దైవాన్ని  ప్రార్ధించటం  ఉత్తమోత్తమం....

Wednesday, May 9, 2012

అంశావతారాలు విషయంలో....


పురాణములు వాటిలోని కధలను మనము చిన్నతనములో చదివినప్పుడు ఒక అర్ధం లో గోచరించవచ్చు. అదే మనకు వయస్సు పెరిగి బుధ్ధి పరిపక్వత చెందేకొద్దీ సత్యం కొంచెం కొంచెముగా అర్ధమవుతూ ఉంటుంది. అందుకని త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదు. అందుకే తరాలు మారినా అందులోని అర్ధములు అనంతములు. పురాణములలో చాలా లోతైన గొప్ప విషయాలుంటాయి. అవి పండితులకు మాత్రమే అర్ధమవుతాయి. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు, నాకు అవి అర్ధం కావు కాబట్టి. నాకు తెలిసిన సామాన్య విషయాలే రాయటం బాగుంటుంది లెండి .


ఇప్పుడు ....... బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తారు కదా. సృష్టి రచనకు విజ్ఞానం అవసరం. అందుకే వారికి భార్యగా చదువుల తల్లి సరస్వతీ దేవి ఉండటం ,......మరి మహా విష్ణువు పాలన చేస్తారు. అందుకే వారికి సంపదలనిచ్చే తల్లి మహాలక్ష్మీ దేవి భార్యగా ఉండటం., ...... అలాగే పరమశివుడు సం హారాన్ని చేస్తారు గదా... అందుకే వారికి శక్తి స్వరూపిణి తల్లి పార్వతీ దేవి భార్యగా ఉండటం ......... ఇవన్నీ ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో గదా.
...........


 
ఇంకా త్రిమూర్తులు వారివారి పదవీబాద్యతల ప్రకారం వారి వస్త్రధారణ ఉన్నట్లు కూడా నాకనిపించింది.

సృష్టిని చేసే బ్రహ్మ ఈ నాటి శాస్త్రవేత్తల వలె గడ్డం కలిగిఉండటం ...


మహావిష్ణువు స్థితి కి సూచనగా ఆభరణములు ధరించుట ఇలా అలంకారప్రియులు.పరమశివుడు లయకారత్వానికి చిహ్నమైన భస్మమును ధరించుట, ఇంకా అభిషేకప్రియులు. ఇలా మనపెద్దలు ఎంత బాగా చెప్పారు...

 
********
పైన  వ్రాసిన  విషయాలు  పాత  టపాలలోనివండి.   బ్రహ్మదేవునికి  గడ్డం  ఉండదని  కొందరు  పండితులు  చెబుతున్నారు.
************************

ఈ  రోజు  పోస్ట్.


ఓం.
మూలదైవం ...... తానే  త్రిమూర్తులుగానూ  త్రిశక్తులైన  లక్ష్మీ  సరస్వతీ  పార్వతీలు గానూ  రూపాలను  ధరించి ,  అన్నీ  తామై    సృష్టిని  నడిపించటం  జరుగుతుంది.   మూలదైవానికి   సగుణగానూ  నిర్గుణగానూ,   సాకారంగానూ  నిరాకారంగానూ ..... అప్పటి  పరిస్థితిని  బట్టి  ఎలా  కావాలంటే  అలా    తనను  తాను  మార్చుకోగల  శక్తి  ఉంటుంది. 


మనం  పురాణేతిహాసాలను  చదివి  ఎన్నో  అపోహలకు  లోనవుతాము. కాని   అలా అపోహ  పడటం   తప్పు.  


 దేవతామూర్తులు  అవసరాన్ని  బట్టి   ,  లోకోపకారం  కోసం  తమ  అంశలతో   ఎన్నో  అవతారాలను  ధరిస్తారు.


 సరస్వతిదేవి    బ్రహ్మలోకంలో  ఉంటుందని  మనకు  తెలుసు.  విష్ణులోకంలో  కూడా  సరస్వతీదేవి   యొక్క  అంశ  ఉంటుందని  పెద్దలు  చెబుతారు.   విష్ణు  లోకంలో  సరస్వతీదేవి అంశ    అంటే  ......?
ఈ   విషయం  అలా  ఉంచితే....


లక్ష్మీదేవి  యొక్క  అష్టలక్ష్మీ  స్వరూపాల్లో   విద్యాలక్ష్మి  కూడా  ఒకరని    అంటారు.   


ఇంకా,   గంగాదేవి     ఇంద్రలోకంలో  మందాకినిగా,  పాతాళంలో  భోగవతిగా,   భూలోకంలో  అలకనందగా   ( భాగీరధి  ) పిలవబడుతూ ,   ఇంకా ....ఎన్నో  లోకాల్లో  కూడా    ప్రవహిస్తుందట. 


  గంగాదేవి   అంటే    జలం .  లోకాలకు  ఎంతో  అవసరమైనది  జలం.   సృష్టి    పాలనకు  జలం  ఎంతో  అవసరం. 


 ఆ  విధంగా    వైకుంఠంలో  పాలనా  బాధ్యతలు  స్వీకరించిన  విష్ణుమూర్తికి  సహాయంగా లక్ష్మీ ,    సరస్వతి,  గంగ,  ఉంటారంటే ..... లోకపాలనకు    లక్ష్మీ(సంపద)   సరస్వతి, (  విజ్ఞానం  ) గంగ  (  జలం )  ,  ఎంతో  అవసరమే  కదా  !

 (  గంగమ్మను  జ్ఞానానికి  సంకేతంగా  కూడా  చెబుతారు.)


ఇంకా,  గంగాదేవి   సృష్టి  పాలనకే  కాకుండా  ,   సృష్టి   సంహారం  విషయంలో  కూడా  పాల్గొనే  అవకాశం  ఉంది.  మానవులకు   నీరు  దాహాన్ని  తీర్చి   ప్రాణాలనూ     నిలుపుతుంది  ....  ప్రచండ  వేగంతో  ఊళ్ళమీద  పడితే  అదే  జలం  ప్రాణాలనూ    తీసి  సంహరిస్తుంది.  అలా   సంహరించకుండా  గంగమ్మ  యొక్క  ప్రచండతను  శివుడు  తన  జటాజూటంలో  నిలిపి  తగ్గించారు. .   అవసరమైతే   ఆ  జలమే    వరదల  రూపంలో   సంహారాన్నీ  చేస్తుంది.  జలం   ప్రాణులకు  సంక్షేమాన్నీ    కలిగించగలదు.     సంహారాన్నీ    కలిగించగలదు..


 అలా  గంగాదేవి   
వైకుంఠంలోనూ   ఉండవచ్చు.     కైలాసంలోనూ  ఉండవచ్చు  అని  నాకు  అనిపించింది.


రాక్షసులు  వరాలు  కోరినప్పుడు  ఇచ్చి,  ఆ  వరభంగం  కాకుండానే  ఎంతో  చాకచక్యంగా  ఆ  రాక్షసులను  సంహరించిన  దైవానికి   ధర్మవిరుద్ధం  కాకుండా  అవతారాలను  ధరించటం  కూడా  తప్పక   తెలుస్తుంది.


   కలియుగంలో  కొంతకాలం   గడిచిన    తరువాత ,  భూలోకంలోని    గంగానది  అదృశ్యమవుతుందట.  ఇప్పుడు  గంగానదిని    పొల్యూట్  చేస్తున్న  తీరు  చూస్తుంటే   గ్రంధాలలో  చెప్పినది  నిజమేనని  స్పష్టంగా  తెలుస్తోంది. 

ఆ  విషయం అలా   ఉంచితే,...

దేవతామూర్తులు      అంశావతారాలు , కళాంశ  రూపాల   విషయంలో,    పరిస్థితిని  బట్టి  మార్పులుచేర్పులు  జరుగుతుంటాయి  అనిపిస్తుంది.  


గంగాదేవి  కైలాసంలో  పార్వతీదేవి  అంశతోనూ,  వైకుంఠంలో  లక్ష్మీదేవి  అంశతోనూ ఉంటుందని  నాకు  అనిపించింది.


   గంగాదేవికి  గల   నామములలో  గిరిజాయై  అన్న  నామము    కూడా  ఉంది.   పార్వతీదేవికి  కూడా  గిరిజాయై  అనే  నామము  ఉంది.

ఇంకా , గంగాదేవిని  లక్ష్మీ  స్వరూపిణి  అని  కూడా   గ్రంధాలలో  చెప్పారు.  


 వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి   క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. ఈ  టాపిక్  కొంచెం  క్లిష్టమయినదే.  బ్లాగులో  వ్రాయనా  వద్దా  అని  ఎంతో  ఆలోచించి  వ్రాయటం  జరిగిందండి.
Monday, May 7, 2012

నాకు అర్ధమయినది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే..పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి. 

లోకంలో  మానవులకు  అవసరమైన  ఎన్నో    విషయాలు  వాటిలో  ఉన్నాయి.  విజ్ఞానశాస్త్రం,  మనో  విజ్ఞాన శాస్త్రం,  సామాజిక  శాస్త్రం ......   ఇంకా   ఎన్నో    విషయాలను  పెద్దలు  మనకు  పురాణేతిహాసాల  ద్వారా  అందించారు.


 పురాణేతిహాసాలలో   పైకి  కనిపించే  అర్ధం  మాత్రమే  కాకుండా ,    అంతరార్ధాలు  కూడా  అనేకం  ఉంటాయట.  పురాణాన్ని   చదువుతున్న    కొద్దీ     కొత్త  అర్ధాలు స్ఫురిస్తూనే  ఉంటాయట. 


 నాకు  ఉన్న  పాండిత్యం  చాలాచాలా  తక్కువ.     పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకుని  కొందరు   హేళన  చేస్తుంటే   బాధగా   అనిపించి  నాకు  తెలిసినంతలో   చెప్పాలని  ఇలా  వ్రాస్తున్నాను. 


   పురాణేతిహాసాలలోని   కధలను పోలిన కధలు    ఈ  రోజుల్లో  కూడా   జరగటం   చూస్తున్నాము.  ఏ  యుగంలోనైనా  అధర్మం  పెరిపోయినప్పుడు  దైవం    అవతరించి   ధర్మసంరక్షణ   చేయటం  జరుగుతుంది.   


  మాఇంట్లో " శ్రీ  దేవీ  భాగవతము",...." శ్రీ  పాద  శ్రీవల్లభ సంపూర్ణ  చరితామృతము",...." ఒక  యోగి  ఆత్మ కధ"  వంటి  గ్రంధాలున్నాయి.  అయితే  ,  ఈ  గ్రంధాలలో  నాకు అర్ధమయినది  సముద్రంలో  నీటిబొట్టంత  మాత్రమే. 


 మనకు    అర్ధమయిన  అన్ని  విషయాలను    ఇతరులకు     అర్ధమయ్యే  విధంగా   చెప్పాలన్నా  కూడా  కష్టమే.   ఎందుకంటే,   మనం  సరిగ్గా  మన    అభిప్రాయాన్ని     చెప్పలేకపోతే  ఇతరులు  అపార్ధం  చేసుకునే   ప్రమాదం  కూడా  ఉంది. 


అలాగని  మన  అభిప్రాయాలను  అసలే  చెప్పకపోతే  పురాణేతిహాసాలను    అపార్ధం  చేసుకోవటం ,  హేళన  చేయటం,   ఎక్కువైపోతుంది  కదా  !    కొన్ని    గ్రంధాలలోని   కొన్ని   విషయాలను  అలాగే    బహిరంగంగా    చెప్పకూడదనే  ఆంక్షలూ      ఉంటాయి.   ఆంక్షలు  లేకపోయినా  కూడా మనకు  అర్ధమైన   కొన్ని  విషయాలను  ఇతరులకు  చక్కగా  వివరించలేకపోవటం ... అనే  సమస్య  ఎదురవుతుంది. ,


 (     ఎవరికి  వారు  గ్రంధములను  స్వయంగా  చదివి    అర్ధం  చేసుకుంటేనే   కొన్ని  విషయాలు  బాగా  అర్ధమవుతాయి.  )


  ఇంకా,   ఇలా ...... బ్లాగుల్లో  బహిరంగంగా  వ్రాయలేని  విషయాలు  కొన్ని   ఉంటాయి,  ఇలా  ఎన్నో  కారణాల  వల్ల  నా  అభిప్రాయాలను  ఉన్నదున్నట్లుగా  వ్రాయలేకపోతున్నా  , అయితే,    ఈ  మాత్రం  వ్రాసే  అదృష్టాన్ని  ప్రసాదిస్తున్న  భగవంతునికి  కృతజ్ఞతలు  .అంతా  దైవం  దయ..
Sunday, May 6, 2012

పురాణేతిహాసములు ఎంతో గొప్పవి.

నేను  కొంత కాలం  క్రిందట   హరిశ్చంద్రుని  గురించి  వ్రాయటం  జరిగింది.  మరల    ఈ  రోజు ( కొన్ని  కారణాల  వల్ల ) ఈ     టపాలు  వెయ్యాలనిపించి  వేస్తున్నానండి.

july  12, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు అంతా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి నాలుగవ భాగం ........ ...
ఇవాళ ఇంకో విషయం చెప్పుకుందామండి.

ఓం నమః శివాయః దుర్గాదేవికి నమస్కారములు..

కొంతమంది ఇలా అంటుంటారు. ఒకాయన తన మాట కోసం ఆలిని అమ్మేసాడు, ఒకాయన ఆలిని అగ్ని పరీక్షకు గురిచేశాడు అని , ఒకాయన జూదం లో ఆలిని పణంగా పెట్టాడు అని.....దీని గురించి కొంచెం చెప్పుకుందామండి.


హరిశ్చంద్రుడు ఉన్నారు. ఒకానొక సందర్భములో ఆయన సత్యవాక్పరిపాలన కోసం విశ్వామిత్రులవారికి తన రాజ్యాన్నిఇచ్చివేయాల్సి వచ్చింది. దక్షిణ కోసం కొన్ని బారువుల బంగారాన్నీ ఇవ్వటం మిగిలింది. దానికోసం ఆయన తనభార్యను, కుమారుని అమ్మిన మాట వాస్తవమే.

ఇది కొంచెం విచారించదగ్గ విషయమే, కానీ అప్పటి ప్రత్యేకమయిన సందర్భములో ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అప్పటికి తమకు తోచిన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు... ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అన్ని కష్టాలను అనుభవించారు..అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. వివాహ సందర్భములో భార్యాభర్తలు తాము జీవితములో కష్టసుఖాలనుకలసి పంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు కదా.....ఉదాహరణకు సంపదలు బాగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అందరూసుఖభోగాలను అనుభవిస్తారుగదా! అలాగే ఆపదలలో వచ్చే కష్టాలను అందరూఎదుర్కోవాలి కదా.....
.అలాగే హరిశ్చంద్రుడు కష్టములో ఉన్నప్పుడు భార్యగా చంద్రమతీ దేవి హరిశ్చంద్రునితో తానే సలహా చెప్పటం జరిగింది ....తననిపరిచారికగా ఎవరికయినా ఇచ్చి వచ్చే సొమ్ముతో రుణం తీర్చమని... నిజంగా ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలు. తానుపుట్టింటికి పోయి భర్త యొక్క పరిస్థితి చక్కబడ్డాక రావచ్చులే అని ఆమె అనుకోలేదు .. . ఆ సందర్భములో వారు ఎంతోబాధపడ్డారు. అయినా కూడా ఆ దంపతులు ధర్మాన్ని వీడలేదు.
కాశీలోని ఒక పండితునికి బార్యాబిడ్డలను అమ్మిన సందర్భములో హరిశ్చంద్రుడు పడ్డ బాధ వర్ణనాతీతం తన వలనసుకుమారులయిన తన భార్యాబిడ్డలు ఇంత కష్ట పడుతున్నారుగదా అని ఎంతగానో విలపించారు. ఆ తరువాతఆయనేమీ వారిమానాన వారిని వదిలేసి తాను రాజభోగాలను అనుభవించలేదు. ఇచ్చిన మాటకోసం తానుకూడాచండాలుని రూపంలో ఉన్న యమధర్మరాజుకు కాటికాపరిగా అమ్ముడుపోయారు.. . ఆతరువాత కొంతకాలానికి వారికుమారుడు పాముకాటుతో చనిపోవటంతో అందరూ శ్మశానములో కలుసుకున్నప్పుడు విరక్తితో శరీర త్యాగం చేసుకోబోతుంటే వారి సత్యవాక్పరిపాలనకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమయ్యి వారి కుమారుని బ్రతికించి అందరినిఅనుగ్రహించారు.ఆ రోజుల్లో మరి సత్యం అంటే అంత గౌరవంతో పాటు మాట తప్పితే అందరికి కష్టాలు వస్తాయని కూడా ఆ నాటి వారుభావించేవారు. .. .... ఇంతటి సత్యవాక్పరిపాలన , త్యాగం ఈ రోజుల్లో మనవల్ల కానిపని .... కానీ ఇందులో ఏ కొద్దిగాపాటించినా చాలు లోకం ఎంతో బాగుపడుతుంది.ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలకే హత్యలు, ఆత్మహత్యలు ఆ తరువాత పిల్లలు అనాధలవటం ఇలాంటివితగ్గుతాయి. అనాధలు ఎక్కువ కావటానికి తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా ఒక కారణమని నా అభిప్రాయం....
.ఇందులో మనము అయ్యో హరిశ్చంద్రుడు భార్యను ఎంత ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా .... భార్యాభర్తలుసంపదలలోనే కాదు,....ఆపదలు వచ్చినప్పుడు కూడా అంతే ఐకమత్యముగా ఉండాలని.. పెద్దలు మనకు చెప్పారనిఅనుకోవచ్చు కదా...............


అయితే ఇది కలికాలం కాబట్టి అమ్ముడుపోవటం లాంటి సాహసాలు ఏమీ ఆడవాళ్ళు చెయ్యక్కర్లేదు కానీ భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు.........

*********************


పురాణములలో ఉన్నది అధర్మం కాదు ....అంతా ధర్మమే..... పురాణములు ఎంతో గొప్పవి .... ఐదవ భాగము.........
ఓం శ్రీ సాయి.


హరిశ్చంద్రుల వారి కధ నుండి నాకు తోచిన ఇంకొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ కాలం వాళ్ళు కొంతమంది అనుకుంటారు..... సత్యవాక్పరిపాలన ఇంత గట్టిగా పాటించాలా అని ....ఇప్పుడు ఆ కధలో ..... .... కాశీ పండితులవారు తన భార్య సుకుమారి కాబట్టి, పిల్లలతో... పని అంతా చేసుకోలేకపోతోంది అని చెప్పి హరిశ్చందులవారి భార్యను, కుమారుని పరిచారకులుగా కొనుక్కున్నారు గదా.....ఇలా భార్యను, కుమారుని అలా అమ్మటం చాలా దారుణమైన విషయమని హరిశ్చంద్రుల వారికీ తెలుసు. దానికి వారు ఎంతో బాధపడ్డారని కూడా మనం చెప్పుకున్నాం.అయితే రాజంతటి వారే మాట తప్పితే ఇక ప్రజలు సత్యం అన్నది పాటించరని ........ ఇక ప్రజలందరు రోజూ అబధ్ధాలే చెబుతూ ఒక అబధ్ధం కప్పిపుచ్చటానికి ఇంకో అబధ్ధం ....... ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఇక ధర్మం నిలబడదు. అంతా అధర్మం, అవినీతి మయం అయిపోతుంది. ఇన్ని ఆలోచించి ఆయన ప్రజలనందరిని పాపాత్ములను చేయకుండా ఉండటానికే తన కుటుంబం అష్టకష్టాలు పడినా భరించారు. అప్పటి పాలకులు ప్రజలను అలా చూసుకునేవారు.
ఇంకో విషయమండి. ప్రజలు చేసే పాపంలో పాలకులకు ఇంతని వాటా వస్తుందట. ఆ ప్రజలు చేసే పాపం పాలకులను పరలోకంలో కూడా పట్టి పీడిస్తుందట. . అందుకే అప్పటి మంచి పాలకులు ప్రజలు పాపపు పనులు చెయ్యకుండా పనికట్టుకుని చూసుకునేవారట. ఇది పెద్దలు చెప్పిన విషయం. ఇంకోటి అసలు హరిశ్చంద్రులవారు విశ్వామిత్రుల వారికి కావాలని రాజ్యాన్ని దానం చెయ్యలేదు.
ఒకప్పుడు హరిశ్చంద్రుల వారు ఆపదలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు మారు వేషములో ఆయనను రక్షించారు. ఆ సంతోషములో ఆయన ఏదైనా కోరుకో ఇస్తానని అంటే విశ్వామిత్రుల వారు ఇంత పెద్ద కోరిక కోరుకున్నారు. దానికి వేరే కారణాలున్నాయని మనకి తెలుసు కదా....అది ఇంకో కధ.
హరిశ్చంద్రుడు ఆ తపస్వి ఏదో సాధారణ దానం అడుగుతారని అనుకున్నారు గాని ఇదంతా ఊహించలేదు. ఒకోసారి అంతే. ఇలాగే జరుగుతుంది. అయితే విశ్వామిత్రుల వారి వల్ల హరిశ్చంద్రునికి మంచే జరిగింది. వారి పేరు ఈ నాటికి మనము చెప్పుకుంటున్నాము.
అందుకే అందరూ మంచిపనులు చేస్తూ దైవాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ మనము రక్షించబడతాము.. .........Friday, May 4, 2012

లోకహితం కోసం.......

ఓం..
శ్రీ  నృసింహ స్వామి  వారి   జయంతి   సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.

.......................................

 సత్య యుగం,   త్రేతా యుగం,  ద్వాపర యుగం,    గడిచి    కలి యుగం  వచ్చేటప్పటికి   క్రమేపీ     లోకంలో   పాపాత్ముల  సంఖ్య   విపరీతంగా   పెరిగిపోతుందట.  

రావణుడు  పరస్త్రీ  వ్యామోహం  , ఇంకా  ఇతర     దుర్గుణాల    వల్ల  తాను  పతనమవటమే  కాకుండా  తన  చుట్టూ  ఉన్నవారిని  కూడా   కష్టాలపాలు  చేసాడు.   ,

  దుర్యోధనుడు  అసూయ,  లోభం  ,  ఇంకా  ఇతర    దుర్గుణాల  వల్ల  తాను  పతనమవటమే  కాకుండా  తన  చుట్టూ  ఉన్నవారిని  కూడా   కష్టాలపాలు  చేసాడు. 

  త్రేతాయుగం,  ద్వాపరయుగాల్లో  రావణుడు,  దుర్యోధనుడు  వంటివారు  కొద్దిమందే  ఉంటే  ,   కలియుగం  వచ్చేటప్పటికి  ఇలాంటివారు  విపరీతంగా  పెరిగిపోతారట.

  అందుకే  ,   ప్రతి  ద్వాపరయుగంలోనూ   లోకహితం  కోసం  ,  వ్యాసమహర్షి   వేదాలను  విభజించి,  పురాణాలను  రచించి  ప్రజలకు    అందివ్వటం  జరుగుతుందట.

విష్ణుమూర్తి  వ్యాసునిగా  జన్మిస్తారట.

అంతర్జాలంలో  .....  ".వేదవ్యాసుడు "........ " పురాణములు "........ అన్న  లింకులో  చాలా  విషయములున్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక ,  వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు....ఇలా  ఎన్నో  విషయములు  ఉన్నాయండి.Wednesday, May 2, 2012

నాకు తెలిసినంతలో..........


  ఇక  యయాతి  దేవయానిల  సంతానమైన  యదు ,   తండ్రి  యొక్క    వృద్ధాప్యాన్ని     స్వీకరించటానికి  నిరాకరించటం  వల్ల     శాపానికి  గురౌతారు. 

 యయాతి  శర్మిష్టల   సంతానమైన  పురు  ,  తండ్రి  అయిన  యయాతికి    శాపవశాత్తు  సంక్రమించిన  వృద్ధాప్యాన్ని  కొంతకాలం  స్వీకరించి  తద్వారా    రాజ్యపాలనకు  అర్హతను  పొందారు.

  (  ఏమైనా,  పురు   ఇలా  వృద్ధాప్యాన్ని    స్వీకరించటమనేది  గొప్ప  విషయమే. )

 
నాకు  తెలిసినంతలో..........

పురు వంశంలో   క్రమంగా    ...... శంతనుడు.......  శంతనుని      కుమారుడైన  భీష్ముడు ,  తండ్రి  కొరకు   ప్రతిజ్ఞ    చేసి  రాజ్యపాలనకు  దూరమై   అవివాహితుడుగా  ఉండిపోవటం,  శంతనునికి  సత్యవతిదేవి  వల్ల  జన్మించిన    కుమారులిద్దరూ     వారసులు  లేకుండానే  మరణించటం,  తరువాత  వ్యాసుని  వల్ల  అంబిక   ,అంబాలికలు  సంతానాన్ని  పొందటం,     కౌరవులు , తరువాత    పాండవులు      జన్మించటం  ఇలా  .......కధ    జరిగింది.


యదు  వంశంలో    క్రమంగా......   ......    దేవకీదేవి  వసుదేవులకు  శ్రీకృష్ణుడు  జన్మించటం ,   అంతకుముందే  దేవకీ  గర్భం  నుంచి  సంకర్షించబడి  రోహిణీదేవి  గర్భాన       బలరాముడు  జన్మించటం ఇలా......  కధ    జరిగింది.


పాండవులను  శ్రీకృష్ణుడు  ఎన్నోసార్లు  ఆదుకున్నారు. ఆ  క్రమంలో    గాంధారి  వల్ల    శాపాన్ని కూడా   పొందారు.


ఇవన్నీ  గమనిస్తే  ఎన్నో  విషయాలు  మనకు  అర్ధమవుతాయి..ఎన్నో  మనస్తత్వాలు., ఎన్నో  విషయాలు,   ఎన్నో  చిత్రవిచిత్రమైన  మలుపులతో    భారతగాధ  అద్భుతంగా  సాగిపోయింది.   ఈ  గాధనుండి    ఎన్నెన్నో  విషయాలు    తెలుసుకోవచ్చు. ఇన్ని  గొప్ప  విషయాలను  అందించిన  పెద్దలకు  ధన్యవాదాలు..