koodali

Monday, December 26, 2016

మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉంటుందా ?

ఈ  రోజుల్లో  చాలామంది   జనం   ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించటమే  జీవిత ధ్యేయంగా  బ్రతుకుతున్నారు.


డబ్బున్నవాళ్ళు  తమ గొప్పలను    అతిగా  ప్రదర్శించటం  వల్ల  సమాజానికి  హాని  జరుగుతోంది.


  కొందరు  జరుపుకునే  అట్టహాసమైన  ఫన్క్షన్స్  చూసి   చాలా  మంది  తామూ  అలా  ఆడంబరంగా  జీవించాలని   ప్రయత్నిస్తున్నారు.  ఎలాగైనా  డబ్బు  సంపాదించాలనే  తాపత్రయంలో  కొందరు  అడ్డదారులలో  డబ్బును  సంపాదించటానికి  ప్రయత్నిస్తున్నారు. ఇంతా  చేసి  డబ్బున్నవారు  అందరూ  నిజంగా  సుఖంగా  ఉన్నారంటారా  ?
 


 డబ్బున్నవారిలో  చాలామందికి  మనశ్శాంతి  లేకపోయినా ..... తమకు  ఉన్న  సొమ్మును  ఇతరులకు  ప్రదర్శిస్తూ  తృప్తి  పడటానికి  ప్రయత్నిస్తుంటారు.
.............................

డబ్బున్నవారు కూడా  కొన్ని  విషయాలను  గ్రహించాలి.  సమాజంలో  పేదవారు  లేనప్పుడు  డబ్బున్నవారు  తమ  గొప్పలను  ప్రదర్శించుకోవచ్చు.  అంతేకానీ,  సమాజంలో  మన  ప్రక్కనే  ఎందరో  పేదవారు   అష్టకష్టాలు  పడుతుంటే  మనం  మాత్రం  మన  గొప్పలను  అదేపనిగా  ప్రదర్శించుకోవటం  మానవత్వం  అనిపించుకోదు.  ప్రపంచంలోని  సంపద  అందరిదీ..  అయితే  కొందరు  తమ  తెలివి,  బలం,  అధికారంతో    అతిగా  డబ్బును  పోగేసి  విలాసవంతంగా  జీవిస్తున్నారు. ఒక  స్థాయికి  మించి  డబ్బును   కూడబెట్టుకోవటం  అంటే  ఇతరుల  సొమ్మును  దొంగిలించినట్లే.  సమాజంలోని  ఆర్ధిక  అసమానతల  వల్లే  సమాజంలో  ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరుగుతున్నాయి. 


 తెలివి,  బలం,  అధికారం  ఉన్నవాళ్ళు  తమ  తెలివిని,  బలాన్ని,  అధికారాన్ని  కేవలం  తమవరకు  డబ్బు  సంపాదించటానికి  మాత్రమే  కాకుండా ,   సమాజంలోని  తోటి  నిస్సహాయుల  కోసం  కూడా  ఉపయోగించాలని  దైవం  ఆశిస్తారు.  ప్రక్కవాళ్ళు  ఆకలితో  అల్లాడుతుంటే  విచ్చలవిడిగా  విందు  భోజనాలు  చేయటం,  తోటివాళ్ళు  కొంపాగోడులేక  అల్లాడుతుంటే  కోట్లాది  డబ్బుతో  విలాసవంతమైన  బంగళాలను  నిర్మించుకోవటం....ఇవన్నీ  ఏం  బాగుంటాయి.  సమాజంలోని  ఎందరో  బడుగుజీవులు  అనారోగ్యంతో  అల్లాడుతున్నారు.  మనం  కోటి  రూపాయల  కారులో  తిరిగితే   పొందే  ఆనందం  కన్నా  10  లక్షల  రూపాయల  కారు  కొనుక్కుని  మిగిలిన  90  లక్షలను  అనారోగ్యంతో  అల్లాడుతున్న  పేదవారికి  సహాయం  చేస్తే   వచ్చే  ఆనందం  ఎన్నో  రెట్లు  ఎక్కువ.    


తెలివి  ఉన్నా  చదువుకోవటానికి  డబ్బు  లేక  బాధపడుతున్న  పేద  విద్యార్ధులు  ఎందరో  ఉన్నారు.  అలాంటి  పేద  విద్యార్ధులకు  సాయం  చేస్తే  పొందే  ఆనందం  ఎంతో  తృప్తిని  ఇస్తుంది.


  డబ్బున్న  వారు  కొందరు  కలిసి  పేదరికాన్ని  పోగొట్టే  కార్యక్రమాలకు  సహాయం  చేయవచ్చు.  మనవల్ల  ఏ  ఒక్కరి  జీవితం  బాగుపడినా  ఆ  ఆనందం  వర్ణనాతీతం. అయితే,  మనం  ఎంత  మంచి  చేసినా  కొన్నిసార్లు  ఇతరులు  మెచ్చుకోరు.  అయినా    ఫరవాలేదు.  మనలను  మెచ్చుకోవలసింది  దైవం. 

.................................. 

 ఈ  రోజుల్లో  టీవీలు  వంటి  ప్రసారమాధ్యమాల్లో  వచ్చే  సీరియల్స్  ,  సినిమాలలో  కనిపించే  ఇళ్ళలోని  వస్తు  సామాగ్రిని   చూసి  తామూ  అలా  విలాసవంతమైన  వస్తువులను  కొనుక్కోవాలని  చాలామంది    తాపత్రయపడుతున్నారు.


ఇలాంటి  విలాసవంతమైన  ఇళ్ళలో  జీవించేవారందరూ   నిజంగా  ఆనందంగా  జీవిస్తున్నారా  ?  అని  ప్రశ్నించుకుంటే   లేదనే  చెప్పుకోవచ్చు.  ఎంత  డబ్బున్నా,  ఎన్ని  విలువైన  వస్తువులు  చుట్టూ  ఉన్నా  మనస్సులో  సంతోషం  లేనప్పుడు   సుఖమెలా  ఉంటుంది  ?


  డబ్బు  వల్ల  కొన్ని  సౌకర్యాలు  ఉండే  మాట  నిజమే.  అయితే  మనశ్శాంతి  అనేది  మాత్రం   డబ్బుతో  మాత్రమే  లభించేది   కాదు.

 ఉదా...కుటుంబసభ్యుల  వల్ల  మనశ్శాంతి  కరువైతే  బోలెడు   డబ్బున్నా  సంతోషం   ఉంటుందా  ?


ఎంత  డబ్బున్నా    మనశ్శాంతి  లేక  అల్లాడే  వారు  ఎందరో  ఉన్నారు.  ఉన్న  దానితోనే   తృప్తి  పడి  సంతోషంగా  జీవిస్తున్నవారు  కూడా  ఎందరో  ఉన్నారు.
........................... 


చెడ్డవాళ్ళు  సుఖపడటం,  మంచివారు   కష్టాలు  పడటం   కూడా  ప్రపంచంలో  అప్పుడప్పుడు  కనిపిస్తుంది.  ఇది  చూసి  కొందరు  ఏమంటారంటే,  ఇతరులకు  సాయం  చేసేవాళ్ళకు  కూడా  కష్టాలు  వస్తున్నాయి  కదా  !  అంటారు.  ఇలా  ఆలోచించటం  సరైనది  కాదు.  మనం  క్రితం  జన్మలలో  చేసిన  పాపపుణ్యాల  ఫలాలను   ఇప్పుడు  అనుభవిస్తున్నాము.  ఇప్పుడు  చేసిన  పుణ్యఫలాలు  ఎక్కడికీ  పోవు.
 Saturday, December 24, 2016

కొన్ని సవరణలు ..


గత పోస్ట్ లో నేను ..వైకుంఠ ఏకాదశి ఈ డిసెంబర్ లో అన్నట్లు వ్రాసాను. 

అయితే వైకుంఠ ఏకాదశి 2017 జనవరి లో  వచ్చిందంటున్నారు.

 పొరపాటుకు దయచేసి క్షమించండి.


**************
ఇంకొక విషయం ఏమిటంటే, శని దేవుని జయంతి గురించి నాకు సరిగ్గా తెలియదు.
శనిదేవుని జయంతి గురించి గత పోస్టులో ....గ్రహశ్రేష్టులు శ్రీ శనేశ్వర దేవత వికారి నామ సంవత్సరము మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమున జన్మించినట్లు శాస్త్రగ్రంధాలు పేర్కొన్నాయి. కాశ్యపగోత్రోద్భవుడు అయిన 'శనిదేవుని జయంతి' శింగణాపూర్ లో ప్రతిసంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అతి వైభవముగా జరుపబడుతుంది... విషయాలను నేను ఒక దగ్గర చదివాను.
(
నెల 22 అంటే రేపు మార్గశిర బహుళ నవమి .)..అని వ్రాయటం జరిగింది.

ఈ  విషయాలను  మా దగ్గర ఉన్న ఒక పుస్తకంలో చదివాను. 
*************
అయితే కొన్ని ప్రాంతాల వారు,  శనిదేవుని జయంతి ....వైశాఖ అమావాస్య నాడు చేస్తారట.....  మరికొందరు జ్యేష్ఠమాస అమావాస్య నాడు కూడా  చేస్తారన్నట్లు అంతర్జాలంలో చదివాను.బహుశా సౌరమాన పద్ధతి మరియు చాంద్రమాన పద్ధతుల వల్ల ఈ విధంగా జరుగుతున్నదేమో ?

(నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు.)
*************
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Wednesday, December 21, 2016

ఓం..
మార్గశిర బహుళ అష్టమి రోజున కూడా అనఘాష్టమీ వ్రతం చేస్టారు.(అంటే ఈ రోజు వచ్చింది.)


 గ్రహశ్రేష్టులు శ్రీ శనేశ్వర దేవత వికారి నామ సంవత్సరము మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమున జన్మించినట్లు శాస్త్రగ్రంధాలు పేర్కొన్నాయి. కాశ్యపగోత్రోద్భవుడు అయిన 'శనిదేవుని జయంతీ శింగణాపూర్ లో ప్రతిసంవత్సరము  వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అతి వైభవముగా జరుపబడుతుంది...ఈ విషయాలను నేను ఒక దగ్గర చదివాను.
( ఈ నెల 22 న అంటే రేపు మార్గశిర బహుళ నవమి .)

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి.ఈ విశేషముల సందర్భంగా శుభాకాంక్షలు.Friday, December 16, 2016

ఓం...

ధనుర్మాసం ఆరంభమయింది...


చాలాచోట్ల తిరుప్పావై పారాయణ చేస్తారు . ప్రవచనాలు కూడా జరుగుతాయి. 


ఈ విశేషముల సందర్భంగా శుభాకాంక్షలు.

Wednesday, December 14, 2016

డిజిటల్ ఎకానమి..?..2..


అయినా, అన్ని విషయాలలోనూ విదేశాల్లో జరిగినట్లే ఇక్కడా జరగాలనుకోవటం సరైనదికాదు.

టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశాలలో అంతా హాప్పీగా ఉందనుకోవటం పొరపాటు. అక్కడా ఎన్నో సమస్యలు ఉన్నాయి..

 కాబట్టే క్రమంగా అక్కడి   ప్రజలు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు.

ఇవన్నీ గమనించకుండా ..మన నేతలు విదేశాల పద్ధతులే గొప్పవి అనుకుంటూ  వెళితే ..ఇక్కడి ప్రజలు కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా  వెళ్ళే అవకాశముంది.  
నూరుశాతం క్యాష్ లెస్ అని కాకుండా.. పెద్ద లావాదేవీలు బ్యాంకుల ద్వారా చిన్న లావాదేవీలు నగదు ద్వారా జరిపే వెసులుబాటు ఉంటే బాగుంటుంది.

ఈ రోజుల్లో ఎవరినీ నమ్మే పరిస్థితి కనిపించటం లేదు. బ్యాంకులలోను, పోస్టాఫీసులలోనూ కూడా కొందరు అక్రమాలకు పాల్పడుతున్న వార్తలు వస్తున్నాయి.

ఇలాంటప్పుడు డిజిటల్ లావాదేవీల గురించి తెలియని ప్రజలు ఎవర్ని నమ్మాలి ?

సి.సి కెమెరా ఉన్నచోట పిన్ నంబర్ రహస్యంగా వాడాలి.

 ఎక్కడపడితే అక్కడ స్వైప్ చేయొద్దు..చేస్తే మీ అకౌంట్లో డబ్బు పోయే అవకాశముందని ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నారు.


 ఇవన్నీ చూస్తుంటే నగదురహిత లావాదేవీలంటే ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడేటట్లు ఉంది.
అందువల్ల నూరుశాతం నగదురహిత వ్యవస్థ మంచిది కాదు.


ఏ దేశ ప్రజలకయినా ముందు నిత్యావసరాలు తీరాలి.

.డిజిటల్ లావాదేవీల వల్ల నల్లధనం పోతుంది అంటున్నారు..అందిన మటుకు దోచుకోవాలనే మనుషుల మనస్తత్వాలు మారనంతవరకు నల్లడబ్బుకు ఎన్నో మార్గాలుంటాయి.

అయినా డిజిటల్ ఎకానమీ ఉన్న దేశాల్లో నల్లడబ్బు సమస్య లేదంటారా?

కొందరిదగ్గర బాగా ఎక్కువ సంపద ..కొందరి దగ్గర తక్కువ సంపద వంటి విపరీతమైన ఆర్ధిక అసమానతలు ఉన్నంతవరకు పేదరికం సమస్యలూ ఉంటూనే ఉంటాయి.
దేశంలో పేదరికం పోవాలంటే నల్లడబ్బు..తెల్లడబ్బు అని కాదు.. సమాజంలో విపరీతమైన ఆర్ధిక అసమానతలు ఉండకూడదు.

డిజిటల్ ఎకానమి..?
విదేశాలతో పోల్చి , ఇక్కడ కూడా ఇప్పటికిప్పుడు  నగదురహితం అవ్వాలనటం సరైనదికాదు. 

  పోస్టాఫీస్ కెళ్తే , మెషీన్లు పనిచేయటం లేదు ..ఎప్పటికి బాగవుతుందో చెప్పలేం..అనే పరిస్థితి విదేశాలలో ఉండకపోవచ్చు.

అయినా, అంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్న విదేశాలలో కూడా సైబర్ నేరాలు..వంటివి జరుగుతున్నాయంటున్నారు.

విదేశాల్లో కూడా నూరుశాతం నగదురహిత లావాదేవీలు లేవంటున్నారు.

అలాంటప్పుడు, అభివృద్ధి ..అంతగాలేని భారతదేశంలో నగదురహిత లావాదేవీలు చేయాలనటం భావ్యంకాదు.

ఎంతో కొంత తెలిసినవాళ్ళు నగదురహిత లావాదేవీలు అలవాటు చేస్కుంటున్నారు కానీ ... చదువుకున్నా టెక్నాలజీ గురించి అంతగా తెలియనివాళ్ళు ఎందరొ ఉన్నారు.

ఇంకా, అడవులలో గిరిజనులు, ఎందరో నిరక్షరాస్యులు, స్లంస్లో నివసించే ప్రజలు ..ఇలా ఎందరో ప్రజలు టెక్నాలజీ గురించి తెలియని వారు కోట్ల  సంఖ్యలో ఉన్నారు.

ఇప్పటివరకూ వీళ్ళందరూ తమకు ఉన్నంతలో నగదు వాడుకుంటూ బ్రతుకుతున్నారు.

ఇప్పటికిప్పుడు అందరూ నగదురహిత వ్యవస్థకు మారాలంటే ఇతరులపై ఆధారపడాలి.తద్వారా మోసపోయే అవకాశమూ ఉంది.

స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళయినా దేశాన్ని అభివృద్ధి చేయకుండా ..

ఇప్పుడు ఉన్నఫలాన అందరూ నగదురహిత లావాదేవీలు చేయాలంటూ ఫోర్స్  చేయటం సరైనది కాదు.

ఇదెలా ఉందంటే ..

పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా, చిన్న తరగతి పిల్లలను పట్టుకుని ఉన్నఫళాన మీరందరూ పీజీ పరీక్షలు రాయాలని అంటే ఎంత అయోమయంగా ఉంటుందో అలా ఉంది పరిస్థితి.

ఇదంతా చూస్తుంటే, అంతగా చదువుకోని వాళ్ళు, టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు దేశంలో సరిగ్గా బ్రతికే అవకాశం లేదన్నట్లుంది.

చదువురానివాళ్ళు కూడా సెల్ఫోన్లు వాడుతున్నారు కదా! అంటున్నారు కొందరు.
మామూలుగా మాట్లాడుకోవటానికి సెల్ వాడటం తేలికే కాబట్టి చాలామంది సెల్ వాడుతున్నారు.

అంతకుమించి సెల్ వాడకం గురించి తెలియనివాళ్ళెందరో ఉన్నారు.

నగదురహిత లావాదేవీలలో మోసపోకుండా ఉండాలంటే తరచూ పిన్ నంబర్ మార్చటం..వంటివి చేయాలంటున్నారు.

టెక్నాలజీ తెలిసినవారికి ఇవన్నీ తేలికగానే అనిపించవచ్చు. తెలియనివారికి పిన్ మార్చటం, యాప్ డౌన్లోడ్ చేయటం వంటివి కష్టంగానే ఉంటాయి.

టెక్నాలజీ గురించి తెలియని ప్రజలు కోట్లలో ఉన్న మన దేశంలో ఇప్పటికిప్పుడు అందరూ నగదురహిత లావాదేవీలే చేయాలనటం సరైనదికాదు అనిపిస్తుంది.


Monday, December 12, 2016

ఓం .


ఈ రోజు తిరువణ్ణామలై దీపోత్సవం....
హనుమద్వ్రతం.... 
మిలాదున్నబి....
రేపు .. దత్త జయంతి .. పూర్ణిమ....

ఈ విశేషాల  సందర్భంగా శుభాకాంక్షలు.


Friday, December 9, 2016

ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత ..


ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత .. 
 
శ్లో|| యత్ర యేగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
 
తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ||


పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

Wednesday, December 7, 2016

కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే..


ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. ఇలాంటప్పుడు అందరికీ  ఉపాధి  అనేది చాలా సమయం పడుతుంది. 

  పరిశ్రమలు పెట్టండి..అంటూ అందరినీ బ్రతిమాలుకోవాలి..వారికి భూములు లభించాలి..పరిశ్రమలు నెలకొల్పాలి..ఇదంతా సమయం పడుతుంది. 

ఇంతా చేస్తే ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయో చెప్పలేం.ఉద్యోగం వచ్చినా ఎంతకాలం ఉద్యోగం ఉంటుందో అసలే చెప్పలేం.

 ప్రతిసంవత్సరం దేశంలోని కాలేజీల నుండి కేవలం ఇంజనీరింగ్ చదివిన వారే లక్షలమంది వస్తున్నారు. 

మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు లభించాలంటే అబ్బో చాలా పెద్దపని.

ఇలాంటప్పుడు కనీసం అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా చేస్తే బాగుంటుంది.

 దేశంలో ఎక్కువ  శాతం  ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చౌక ధరకు ఆహారాన్ని అందివ్వటం, తక్కువ ధరకు సరుకులను అందించటం, తక్కువ ధరకు వైద్యాన్ని అందించటం వంటివి చేస్తే  ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.  


వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని నెలకొల్పితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.

సేవా రంగం ద్వారా కూడా  అవకాశాలు పెంచుకోవచ్చు..

ఉపాధి కోసం  పెద్ద ఎత్తున వస్తు తయారీరంగంపై మాత్రమే ఆధారపడితే సహజవనరులు వేగంగా తరిగిపోతాయి. 

ఉపాధి కోసం .. ఉన్న వనరులన్నీ మనమే ఖాళీ చేస్తే రాబోయే తరాలకు మిగిలేదేమిటి ?

*********************

 Monday, September 8, 2014
అమ్మ, అన్న క్యాంటీన్లు..

ఈ క్యాంటీన్ల  గురించి  వినే  ఉంటారు.  తమిళనాడులో  అమలవుతున్న  అమ్మ  క్యాంటీన్లలో  అతితక్కువ  ధరకే  భోజనాన్ని  అందిస్తున్నారట. 

ఇంకా  నిత్యావసర  వస్తువులనూ  అందిస్తున్నారట. మిగతా  విషయాలు  ఎలా  ఉన్నా  ఇది  మంచి  పద్ధతే  అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  కూడా  అన్న  క్యాంటీన్లను  ప్రారంభించాలనుకోవటం  ఎంతో మంచి  విషయం.

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే. అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  

వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.
...................
ఇక్కడ  ఒక విషయాన్ని  చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.    ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 


  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది. 

 పీనాసితనాన్ని,అత్యాశను   తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.


Monday, December 5, 2016

ఓం ..


శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..


హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసమేత  మమదేహి కరావలంబం..


దేవాదిదేవనుత దేవగణాధినాధ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాధ మమదేహి కరావలంబం..


దేవాదిదేవ రధమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..


శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం
సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..


సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


ఇంకొక విషయం ఏమిటంటే కంప్యూటర్లో వ్రాసేటప్పుడు కొన్ని తప్పులు వస్తున్నాయి.
 న కారము " న్ " అని వ్రాసే దగ్గర సకారం" స్" అని వసోంది.
 ఉదా.. రోగహారిన్ అని వ్రాసిన దగ్గర ఈ విషయాన్ని గమనించవచ్చు.


Friday, December 2, 2016

ఏదో చేయాలనుకుంటే..ఏదో అవుతున్నట్లుంది..సామాన్య మధ్య తరగతి వారికి అనేక హద్దులు ఏర్పరుస్తూ, సంపద లెక్కలు చూపమనటం బాగానే ఉంది.. నియమాలు ఎవరికైనా ఉండవలసిందే..

అయితే సమాజంలో వందలు, వేలకోట్ల సంపద ఉన్న వారెందరో ఉన్నారు.

కొందరికి ఇంత వరకే సంపద ఉండాలని హద్దులు పెడుతున్నప్పుడు ..కొందరి వద్ద వందలు, వేలకోట్ల సంపద ఉండకూడదు కదా!

నోట్లు, బంగారం సంగతి  అలా ఉంచితే భూమి సంగతి ?  పారిశ్రామిక వేత్తలకు, అనేక సంస్థలకు ప్రభుత్వాలే వందల ఎకరాలను ఇస్తున్నాయి.

భూమి లేని ప్రజలెందరో ఉండగా కొన్ని దేశవిదేశీ  సంస్థలకు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వానికి భూమి కావాలంటే మళ్ళీ సామాన్యప్రజల వద్ద సేకరిస్తారు కాబోలు.

ఇక, బ్యాంకుల నుండి లక్షల కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించని ధనవంతులను ఏం చేస్తున్నారు?


ఇక, వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను లేకపోవటం అనే కారణంవల్ల చాలామంది ధనవంతులు ..భూమి కొని  పన్ను కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


  సామాన్య, మధ్యతరగతి రైతులకు పన్ను వేయకుండా పెద్దమొత్తంలో వ్యవసాయభూములు ఉన్న వారిపై పన్ను వేస్తే  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది.

ప్రజలందరికి సంబంధించిన ఖనిజాలు ...మొదలైన సహజసంపదలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. ఆ సంస్థలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నారు.


 టాక్స్ చెల్లించినా కూడా వారివద్ద వందలు, వేల కోట్ల ఉంటున్నప్పుడు.. ప్రజలకు చెందవలసిన సొమ్ము కొందరు ప్రైవేటు వ్యక్తులు పొందటం అన్యాయం కాదా?

నష్టాలు వస్తున్నాయని చెప్పి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం కాకుండా ..ప్రభుత్వరంగ సంస్థలను   ప్రభుత్వాలే సమర్ధవంతంగా నిర్వహించితే  చాలా ఆదాయం వస్తుంది.


 ప్రజలసొమ్ముతో నేతలు ఎన్నో సౌకర్యాలు ఏర్పర్చుకుంటున్నారు. దేశంలో జరిగే పెద్ద, చిన్నా ఫంక్షన్లకు నేతలు, అధికార్లు  విమానాలలో, కార్లలో వచ్చిపోవటానికి ఎంతో ప్రజల సొమ్ము ఖర్చవుతుంది. ఇక పార్టీల ఎన్నికల ఖర్చు సంగతి సరేసరి. 


 దేశంలో   సొమ్ము ప్రజలందరికీ న్యాయంగా అందాలి. ప్రభుత్వాలు ప్రజలను లెక్కలు అడుగుతున్నట్లు..ప్రభుత్వాలు కూడా ప్రజలకు లెక్కలు చెప్పవలసి ఉంటుంది.


 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉందో? ప్రభుత్వాలు ఎందుకు సమర్ధవంతంగా పనిచేయలేదో ? వంటి ప్రశ్నలు ప్రజలు కూడా వేస్తారు.


 అయితే చాలామంది ప్రజలలో కూడా అవినీతి బాగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఎవరూ ఎవరినీ .. ఇదేమిటని...అడిగే  పరిస్థితి ఎక్కువగా  లేదు.


సమాజంలో ఉన్న  ఆర్ధిక అసమానతలు పోవాలంటే కొందరి వద్ద ఎక్కువ సంపద ..కొందరి వద్ద తక్కువ సంపద ఉండకూడదు.కనీసం విపరీతమైన  అసమానతలు ఉండకూడదు.

నల్లడబ్బు ఉన్న బడావ్యక్తులను పట్టుకోకుండా సామాన్య, మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని  ఎక్కువమంది ప్రజలు వ్యక్తపరచటాన్ని ప్రభుత్వం గమనించాలి.