koodali

Friday, December 2, 2016

ఏదో చేయాలనుకుంటే..ఏదో అవుతున్నట్లుంది..సామాన్య మధ్య తరగతి వారికి అనేక హద్దులు ఏర్పరుస్తూ, సంపద లెక్కలు చూపమనటం బాగానే ఉంది.. నియమాలు ఎవరికైనా ఉండవలసిందే..

అయితే సమాజంలో వందలు, వేలకోట్ల సంపద ఉన్న వారెందరో ఉన్నారు.

కొందరికి ఇంత వరకే సంపద ఉండాలని హద్దులు పెడుతున్నప్పుడు ..కొందరి వద్ద వందలు, వేలకోట్ల సంపద ఉండకూడదు కదా!

నోట్లు, బంగారం సంగతి  అలా ఉంచితే భూమి సంగతి ?  పారిశ్రామిక వేత్తలకు, అనేక సంస్థలకు ప్రభుత్వాలే వందల ఎకరాలను ఇస్తున్నాయి.

భూమి లేని ప్రజలెందరో ఉండగా కొన్ని దేశవిదేశీ  సంస్థలకు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వానికి భూమి కావాలంటే మళ్ళీ సామాన్యప్రజల వద్ద సేకరిస్తారు కాబోలు.

ఇక, బ్యాంకుల నుండి లక్షల కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించని ధనవంతులను ఏం చేస్తున్నారు?


ఇక, వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను లేకపోవటం అనే కారణంవల్ల చాలామంది ధనవంతులు ..భూమి కొని  పన్ను కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


  సామాన్య, మధ్యతరగతి రైతులకు పన్ను వేయకుండా పెద్దమొత్తంలో వ్యవసాయభూములు ఉన్న వారిపై పన్ను వేస్తే  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది.

ప్రజలందరికి సంబంధించిన ఖనిజాలు ...మొదలైన సహజసంపదలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. ఆ సంస్థలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నారు.


 టాక్స్ చెల్లించినా కూడా వారివద్ద వందలు, వేల కోట్ల ఉంటున్నప్పుడు.. ప్రజలకు చెందవలసిన సొమ్ము కొందరు ప్రైవేటు వ్యక్తులు పొందటం అన్యాయం కాదా?

నష్టాలు వస్తున్నాయని చెప్పి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం కాకుండా ..ప్రభుత్వరంగ సంస్థలను   ప్రభుత్వాలే సమర్ధవంతంగా నిర్వహించితే  చాలా ఆదాయం వస్తుంది.


 ప్రజలసొమ్ముతో నేతలు ఎన్నో సౌకర్యాలు ఏర్పర్చుకుంటున్నారు. దేశంలో జరిగే పెద్ద, చిన్నా ఫంక్షన్లకు నేతలు, అధికార్లు  విమానాలలో, కార్లలో వచ్చిపోవటానికి ఎంతో ప్రజల సొమ్ము ఖర్చవుతుంది. ఇక పార్టీల ఎన్నికల ఖర్చు సంగతి సరేసరి. 


 దేశంలో   సొమ్ము ప్రజలందరికీ న్యాయంగా అందాలి. ప్రభుత్వాలు ప్రజలను లెక్కలు అడుగుతున్నట్లు..ప్రభుత్వాలు కూడా ప్రజలకు లెక్కలు చెప్పవలసి ఉంటుంది.


 స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉందో? ప్రభుత్వాలు ఎందుకు సమర్ధవంతంగా పనిచేయలేదో ? వంటి ప్రశ్నలు ప్రజలు కూడా వేస్తారు.


 అయితే చాలామంది ప్రజలలో కూడా అవినీతి బాగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఎవరూ ఎవరినీ .. ఇదేమిటని...అడిగే  పరిస్థితి ఎక్కువగా  లేదు.


సమాజంలో ఉన్న  ఆర్ధిక అసమానతలు పోవాలంటే కొందరి వద్ద ఎక్కువ సంపద ..కొందరి వద్ద తక్కువ సంపద ఉండకూడదు.కనీసం విపరీతమైన  అసమానతలు ఉండకూడదు.

నల్లడబ్బు ఉన్న బడావ్యక్తులను పట్టుకోకుండా సామాన్య, మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని  ఎక్కువమంది ప్రజలు వ్యక్తపరచటాన్ని ప్రభుత్వం గమనించాలి.


1 comment:

 1. ఇక బంగారం విషయానికి వస్తే, బంగారాన్ని బిస్కట్ల రూపంలో పెద్ద ఎత్తున దాచినవారికి ఆంక్షలు విధించటం సరైనదే.

  స్త్రీల విషయంలో ఆర్ధికంగా అవసరపడుతుందని ఆభరణాల రూపంలో బంగారాన్ని పెద్దలు ఏర్పాటుచేసారు.

  విపరీతంగా ఉండటం సరైనది కాదుకానీ వివాహిత స్త్రీ వద్ద 1000 గ్రాముల వరకూ ఉంటే బాగుంటుందని కొందరు స్త్రీలు కోరుకుంటున్నారు.

  అనేకకారణాల వల్ల ప్రభుత్వాలు బంగారంపై ఎక్కువ ఆంక్షలు పెట్టాలని అనుకుంటున్నాయి కాబోలు.

  అయితే, ఇంతకుముందు అనేకదేశాలు ఆర్ధిక మాంద్యంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా.. భారతదేశానికి అంత ఇబ్బంది కలగలేదంటే ఈ దేశంలో ఉన్న బంగారం కూడా కారణం.

  భారతదేశాన్ని బంగారం ఎన్నోసార్లు ఆదుకుంది.

  స్పెక్యులేషన్ తో కూడిన షేర్ మార్కెట్ మీద మోజుతో బంగారాన్ని చిన్నచూపు చూడటం తగదు.

  ReplyDelete