koodali

Monday, December 26, 2016

మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉంటుందా ?

ఈ  రోజుల్లో  చాలామంది   జనం   ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించటమే  జీవిత ధ్యేయంగా  బ్రతుకుతున్నారు.


డబ్బున్నవాళ్ళు  తమ గొప్పలను    అతిగా  ప్రదర్శించటం  వల్ల  సమాజానికి  హాని  జరుగుతోంది.


  కొందరు  జరుపుకునే  అట్టహాసమైన  ఫన్క్షన్స్  చూసి   చాలా  మంది  తామూ  అలా  ఆడంబరంగా  జీవించాలని   ప్రయత్నిస్తున్నారు.  ఎలాగైనా  డబ్బు  సంపాదించాలనే  తాపత్రయంలో  కొందరు  అడ్డదారులలో  డబ్బును  సంపాదించటానికి  ప్రయత్నిస్తున్నారు. 

ఇంతా  చేసి  డబ్బున్నవారు  అందరూ  నిజంగా  సుఖంగా  ఉన్నారంటారా  ?
 

 డబ్బున్నవారిలో  చాలామందికి  మనశ్శాంతి  లేకపోయినా ..... తమకు  ఉన్న  సొమ్మును  ఇతరులకు  ప్రదర్శిస్తూ  తృప్తి  పడటానికి  ప్రయత్నిస్తుంటారు.
.............................

డబ్బున్నవారు కూడా  కొన్ని  విషయాలను  గ్రహించాలి.  సమాజంలో  పేదవారు  లేనప్పుడు  డబ్బున్నవారు  తమ  గొప్పలను  ప్రదర్శించుకోవచ్చు.  


అంతేకానీ,  సమాజంలో  మన  ప్రక్కనే  ఎందరో  పేదవారు   అష్టకష్టాలు  పడుతుంటే  మనం  మాత్రం  మన  గొప్పలను  అదేపనిగా  ప్రదర్శించుకోవటం  మానవత్వం  అనిపించుకోదు. 


 ప్రపంచంలోని  సంపద  అందరిదీ..  అయితే  కొందరు  తమ  తెలివి,  బలం,  అధికారంతో    అతిగా  డబ్బును  పోగేసి  విలాసవంతంగా  జీవిస్తున్నారు.


 ఒక  స్థాయికి  మించి  డబ్బును   కూడబెట్టుకోవటం  అంటే  ఇతరుల  సొమ్మును  దొంగిలించినట్లే. 

 సమాజంలోని  ఆర్ధిక  అసమానతల  వల్లే  సమాజంలో  ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరుగుతున్నాయి. 

 తెలివి,  బలం,  అధికారం  ఉన్నవాళ్ళు  తమ  తెలివిని,  బలాన్ని,  అధికారాన్ని  కేవలం  తమవరకు  డబ్బు  సంపాదించటానికి  మాత్రమే  కాకుండా ,   సమాజంలోని  తోటి  నిస్సహాయుల  కోసం  కూడా  ఉపయోగించాలని  దైవం  ఆశిస్తారు.


 ప్రక్కవాళ్ళు  ఆకలితో  అల్లాడుతుంటే  విచ్చలవిడిగా  విందు  భోజనాలు  చేయటం,  తోటివాళ్ళు  కొంపాగోడులేక  అల్లాడుతుంటే  కోట్లాది  డబ్బుతో  విలాసవంతమైన  బంగళాలను  నిర్మించుకోవటం....ఇవన్నీ  ఏం  బాగుంటాయి. 


 సమాజంలోని  ఎందరో  బడుగుజీవులు  అనారోగ్యంతో  అల్లాడుతున్నారు.


 మనం  కోటి  రూపాయల  కారులో  తిరిగితే   పొందే  ఆనందం  కన్నా  10  లక్షల  రూపాయల  కారు  కొనుక్కుని  మిగిలిన  90  లక్షలను  అనారోగ్యంతో  అల్లాడుతున్న  పేదవారికి  సహాయం  చేస్తే   వచ్చే  ఆనందం  ఎన్నో  రెట్లు  ఎక్కువ.    


తెలివి  ఉన్నా  చదువుకోవటానికి  డబ్బు  లేక  బాధపడుతున్న  పేద  విద్యార్ధులు  ఎందరో  ఉన్నారు.  అలాంటి  పేద  విద్యార్ధులకు  సాయం  చేస్తే  పొందే  ఆనందం  ఎంతో  తృప్తిని  ఇస్తుంది.


  డబ్బున్న  వారు  కొందరు  కలిసి  పేదరికాన్ని  పోగొట్టే  కార్యక్రమాలకు  సహాయం  చేయవచ్చు.  మనవల్ల  ఏ  ఒక్కరి  జీవితం  బాగుపడినా  ఆ  ఆనందం  వర్ణనాతీతం. 

అయితే,  మనం  ఎంత  మంచి  చేసినా  కొన్నిసార్లు  ఇతరులు  మెచ్చుకోరు.  అయినా    ఫరవాలేదు.  మనలను  మెచ్చుకోవలసింది  దైవం. 
.................................. 

 ఈ  రోజుల్లో  టీవీలు  వంటి  ప్రసారమాధ్యమాల్లో  వచ్చే  సీరియల్స్  ,  సినిమాలలో  కనిపించే  ఇళ్ళలోని  వస్తు  సామాగ్రిని   చూసి  తామూ  అలా  విలాసవంతమైన  వస్తువులను  కొనుక్కోవాలని  చాలామంది    తాపత్రయపడుతున్నారు.

ఇలాంటి  విలాసవంతమైన  ఇళ్ళలో  జీవించేవారందరూ   నిజంగా  ఆనందంగా  జీవిస్తున్నారా  ?  అని  ప్రశ్నించుకుంటే   లేదనే  చెప్పుకోవచ్చు.


 ఎంత  డబ్బున్నా,  ఎన్ని  విలువైన  వస్తువులు  చుట్టూ  ఉన్నా  మనస్సులో  సంతోషం  లేనప్పుడు   సుఖమెలా  ఉంటుంది  ?

  డబ్బు  వల్ల  కొన్ని  సౌకర్యాలు  ఉండే  మాట  నిజమే.  అయితే  మనశ్శాంతి  అనేది  మాత్రం   డబ్బుతో  మాత్రమే  లభించేది   కాదు.

 ఉదా...కుటుంబసభ్యుల  వల్ల  మనశ్శాంతి  కరువైతే  బోలెడు   డబ్బున్నా  సంతోషం   ఉంటుందా  ?

ఎంత  డబ్బున్నా    మనశ్శాంతి  లేక  అల్లాడే  వారు  ఎందరో  ఉన్నారు.  ఉన్న  దానితోనే   తృప్తి  పడి  సంతోషంగా  జీవిస్తున్నవారు  కూడా  ఎందరో  ఉన్నారు.
........................... 

చెడ్డవాళ్ళు  సుఖపడటం,  మంచివారు   కష్టాలు  పడటం   కూడా  ప్రపంచంలో  అప్పుడప్పుడు  కనిపిస్తుంది.  ఇది  చూసి  కొందరు  ఏమంటారంటే,  ఇతరులకు  సాయం  చేసేవాళ్ళకు  కూడా  కష్టాలు  వస్తున్నాయి  కదా  !  అంటారు.  ఇలా  ఆలోచించటం  సరైనది  కాదు. 

 మనం  క్రితం  జన్మలలో  చేసిన  పాపపుణ్యాల  ఫలాలను   ఇప్పుడు  అనుభవిస్తున్నాము.  ఇప్పుడు  చేసిన  పుణ్యఫలాలు  ఎక్కడికీ  పోవు.
 

**********************
మరికొన్ని విషయాలు ఏమిటంటే, 

ఎవరైనా.. ఒక రూపాయి పెట్టుబడికి పది రూపాయలు ఇస్తామని చెపితే నమ్మి, కొందరు ప్రజలు అత్యాశతో డబ్బు పెట్టుబడి పెడతారు.


  తరువాత మోసం జరిగితే, తాము నష్టపోయిన దానికి న్యాయం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారు.

మోసం చేయటం తప్పే.. అదే సమయంలో అత్యాశకు పోవటంలో ప్రజల తప్పు కూడా ఉంటుంది కదా!



No comments:

Post a Comment