koodali

Friday, September 30, 2016

అమెరికాలో..శ్రీ యంత్రం...

కొన్ని సంవత్సరాల క్రిందట అమెరికాలోని Oregon అనే ప్రాంతంలో శ్రీ యంత్రం( శ్రీ చక్రం) యొక్క ఆకారం పెద్ద సైజులో కనిపించిందట.


ఈ విషయం గురించి పూర్తి వివరాలు నాకు సరిగ్గా తెలియవు.


ఆసక్తి ఉన్నవారు యు ట్యూబ్  లో చూడవచ్చు. 


Oregon Sri Yantra YouTube...


****************


 చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. 

పక్కలో బల్లెం..పరిస్థితి చక్కబడాలని ..
పదేపదే కవ్విస్తుంటే చేయగలిగింది ఏముంది.

తప్పని పరిస్థితిలో చర్య తీసుకున్నారు.
 
దేశరక్షణ కొరకు ధైర్యంగా పోరాడి విజయాన్ని సాధించిన అందరికీ కృతజ్ఞతలు. 


పరిస్థితి చక్కబడాలని దైవాన్ని కోరుకుందాము. 


Wednesday, September 28, 2016

స్థానికుల ఉపాధి ...

పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చాలామంది అంటుంటారు.

అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు..ఇక్కడి రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే  రాష్ట్రప్రజలకు  ఉపాధి లభిస్తుంది.

అంతేకానీ ఉద్యోగాలలో ఇతరులను తీసుకుంటే అప్పుడు పరిశ్రమలు వచ్చినా స్థానికులకు కలిగే లాభం ఏమీ ఉండదు.
...............
 
 భూములేమో రాష్ట్ర ప్రజల వద్ద నుండి  తీసుకోవటం..పరిశ్రమల ద్వారా వచ్చే లాభాలేమో పరిశ్రమల అధిపతులకు..ఉద్యోగాలేమో ఇతర రాష్ట్రాల వాళ్లకు అనే పరిస్థితి ఉండకూడదు.


 ఎక్కడెక్కడెక్కడివాళ్ళో వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ చక్కగా ఉపాధి పొందుతుంటే.. స్థానికులు వలస వెళ్లే పరిస్థితి ఉంటే... అలాంటి అభివృద్ధి ఎవరికోసం ?
.....................

ఎక్కడైనా కొంచెం అభివృద్ధి కనిపిస్తే చాలు .. ఇక ఎక్కడెక్కడి వాళ్లో వచ్ఛేస్తారు. 

   ఇలాంటప్పుడు స్థానికులకు ఉపాధి విషయంలో  పోటీ ఏర్పడి సమస్యలు వస్తాయి.

ఇవన్నీ చదివి, నాకు విశాలహృదయం లేదు..స్వార్ధం ఎక్కువ అనుకుంటే నేనేమీ చేయలేను.
 దేశంలో అందరూ ఒకే జాతిగా కలిసికట్టుగా జీవించాలి అనుకోవటం బాగుంటుంది.
 అయితే అలాంటి సమైక్యత  ఉండి, మన నీళ్లు, మన ఉద్యోగాలు..అనుకుంటూ  కలిసికట్టుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు ... మా నీళ్ళు, మా ఉద్యోగాలు అనే మాట వినిపించదు.


అయితే .. అనేక కారణాల వల్ల, మా నీళ్లు, మా ఉద్యోగాలు అనే ధోరణి  ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితిలో ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వారికి కూడా మా నీళ్ళు, మా ఉద్యోగాలు .. అనే అభిప్రాయం కలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

..............

ఇప్పుడు అమెరికా వంటి దేశాల వాళ్ళు కూడా ఇతరదేశాలనుండి తమ దేశానికి వచ్చే వాళ్ల వల్ల ... తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని భావించే పరిస్థితి ఉంది.
........................

 ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను.

 ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇతర రాష్ట్రం నుండి మరింత మంది ఇక్కడ రావాలి.. అంటూ ఇతర  రాష్ట్రం వాళ్ళు తమ వాళ్ళను ఆహ్వానిస్తున్న వార్త చదివాను.

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే బోలెడుమంది ఉపాధి లేక బాధపడుతున్నారు.

 ఇక ఎక్కడెక్కడి నుండో వస్తే స్థానికుల ఉపాధి సంగతేమిటి ?


 ఇలాంటప్పుడు ..  మాకు విశ్వనగరాలు అక్కరలేదు... బాబోయ్! మమ్మల్నిలా బ్రతకవ్వండి చాలు.. అనాలనిపిస్తుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇతరరాష్ట్రాలకు, ఇతరదేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడివాళ్ళు కూడా మనవాళ్లను తిట్టుకుంటూ ఉంటారు.
.................

వలసలు వెళ్లటం కొంతవరకూ ఎక్కడైనా జరిగేదే..

అయితే , వలసలు ఒక స్థాయిని మించితే మాత్రం స్థానికులకు, వలసదారులకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.


ఇలాంటి పరిస్థితిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ...ఎవరి దేశాన్ని వాళ్లు అభివృద్ధి చేసుకుని సొంత ప్రాంతంలో ఉపాధి పొందటం మంచిది.
.................

అయితే, ప్రపంచమంతటా ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు , తత్వవేత్తలు.... వంటివారు ప్రపంచానికి అంతా చెందినవారు.


 ఇలాంటివారికి ప్రాంతీయత ఉండదు.ప్రపంచమంతా వారిదే. వారు అందరివారు.

 ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే.. సైనికులలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉంటారు. వారికి ప్రాంతీయభేదాలు ఉండవు. కలసికట్టుగా దేశ రక్షణకు కృషి చేస్తుంటారు.


 సైనికులను  చూసి దేశప్రజలు ఎంతో నేర్చుకోవాలి.

Monday, September 26, 2016

రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...


సునామీలు, తుఫాన్లు గురించి ముందుగానే సమాచారం తెలిసే విధంగా రాకెట్ ప్రయోగం విజయవంతగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు అభినందనలు.
..........

రాబోయే కాలంలో రొబోట్ల సంఖ్య పెరగటం.. తద్వారా మనుషులకు ఉద్యోగావకాశాలు తగ్గటం జరుగుతుందంటున్నారు.

 అయితే రోబోట్లను కొన్ని పనులకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఉదా..భూకంపాలు వచ్చినప్పుడు శిధిలాలలో ఉండిపోయిన వారి ఆచూకీ తెలుసుకోవటం కోసం రోబోట్లను ఉపయోగించవచ్చు అంటున్నారు..

చెత్త తరలించే కార్యక్రమాలలో మనుషుల బదులు రోబోట్లను వాడుకోవచ్చు.

 బోరుబావులలో పడిపోయిన వారిని వెలికితీయటంలో రోబోట్లను వాడవచ్చు. 

 మనుషులకు కష్టమైన పనులకు రోబోట్లను వాడేలా ఉపయోగించితే బాగుంటుంది.
***************
 మనుషులు చేసే ఉద్యోగాల స్థానంలో మనుషులను తీసేసి రోబోట్లను పెడితే నిరుద్యోగ సమస్య ఎదురవుతుందనేది నిజమే..

అయితే, ప్రభుత్వం  వద్ద డబ్బు బాగా ఉండి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఉద్యోగాల కల్పన కష్టమేమీ కాదు.

 జీతాలు ఇవ్వటానికి డబ్బు ఉండాలే కానీ ఉద్యోగాలకు ఏం కొదవ .. . ఎన్ని చిత్రవిచిత్రమైన ఉద్యోగాలైనా సృష్టించవచ్చు..

ఉదా..రోడ్డు  ప్రక్కన చెట్లు నాటి వాటి రక్షణకు ఒక్కో రోడ్డుకు ఒక్కో ఉద్యోగిని నియమించవచ్చు.

 మరీ డబ్బు ఎక్కువ ఉంటే ఒక్కో చెట్టు సంరక్షణకు ఒక్కో ఉద్యోగిని నియమించవచ్చు.
................

ఈ రోజుల్లో  చాలా ఆఫీసులలో ఇద్దరు చేసే పనిని ఒక్కరే చేస్తున్నారు. 

 ఇంతకుముందు అన్ని బస్సులలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉండేవారు.
ఇప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు ఎక్కువ లేక కొన్ని బస్సులలో కండక్టర్ను తీసివేసారు. డ్రైవరే టికెట్ ఇస్తున్నారు.

సమాజంలో పేదరికం, నిరుద్యోగం పోవాలంటే సంపద కొందరి వద్దే కాకుండా .. అందరి వద్ద ఉండాలి.

 పేదరికం, నిరుద్యోగం తగ్గాలంటే ప్రభుత్వాలు నల్లడబ్బును, అవినీతిని సమర్ధవంతంగా అరికట్టటానికి కఠినచర్యలు తీసుకోవాలి.
పెరుగుతున్న ధరలను తగ్గించాలి.

 ప్రజలు కూడా అత్యాశ తగ్గించుకోవాలి. అప్పుడు అందరి వద్దా సంపద  ఉంటుంది.

 భారతీయుల వద్ద ఉన్న వేలు లేక లక్షల కోట్ల సంపద బయటకు వస్తే .. పేదరికం తగ్గి నిరుద్యోగ సమస్యా తగ్గుతుంది.

అందువల్ల  నల్లడబ్బును, అవినీతిని నిర్మూలించటం ఎంతో ముఖ్యం. 

సమాజంలో నైతికవిలువలు పెంపొందటం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం.


Friday, September 23, 2016

అందరికీ మంచి బుద్ది......


ఈ మధ్య జరిగిన సంఘటనలో కొందరు సైనికులు మరణించటం అత్యంత బాధాకరం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి వందనములు.


ఈ సంఘటనల వల్ల భారతదేశంలోని ప్రజలు కొందరు పొరుగుదేశంతో యుద్ధం చేయాలంటున్నారు.

యుద్ధం వస్తే ముందు కష్టపడేది సైనికులే. 

ఇంతకుముందు జరిగిన యుద్ధాలలో భారతదేశం గెలిచినా కూడా.. ఎందరో సైనికులను కోల్పోవటం జరిగింది.

అత్యంత ప్రమాదకరమైన ఆధునిక మారణాయుధాలు ఉన్న ఈ రోజులలో యుద్ధం వస్తే ఇరుదేశాలూ తీవ్రంగా  నష్టపోయే అవకాశం ఉంది.

పోనీ,  యుద్ధం వల్ల సమస్య పరిష్కారమై పోతుందని చెప్పలేం.అందువల్ల యుద్ధం అనేది ఇప్పుడు సరైనది కాదు.

ఇంతకుముందు కూడా భారతదేశం తనకుతానుగా పొరుగుదేశంపై ముందుగా యుద్ధం ప్రకటించలేదు.

 ఇక పొరుగుదేశమే యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు ఎటూ యుద్ధం తప్పదు.

కొంతకాలం క్రిందట మేము అమరనాధ్, వైష్ణవీదేవి..యాత్ర కొరకు జమ్మూ..కశ్మీర్ వెళ్లి వచ్చాము.అద్భుతమైన ప్రదేశమది.


అక్కడి  సైనికులు మరియు ప్రజలు మాకు ఎంతో సహాయసహకారాలు అందించారు.

 స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.
....................


ఆ మధ్య కశ్మీర్లో వచ్చిన వరదలు వచ్చిన సమయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న సహాయచర్యల వల్ల అక్కడి వారు బీజేపీకి కూడా ఓట్లు వేసారు..   అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

తద్వారా అక్కడ  సంకీర్ణప్రభుత్వం ఏర్పడింది.
 ఆ తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం గట్టి కృషి చేస్తే ప్రజల ఆదరణ పొంది  బాగుండేది.

ఇంకో విషయం ఏమిటంటే, కొన్ని సమస్యలకు పరిష్కారం అంత సులువుగా ఉండదు.


కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం జరగటం అనేది అంత సులభం కాదు.

నష్టతీవ్రత వీలయినంత తక్కువగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతానికి చేయగలం.

 కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలి.  

ఈ మధ్య ప్రధానమంత్రి గారు బలూచిస్థాన్ గురించి ప్రస్తావించటం.. తద్వారా అక్కడి వాళ్ళ సమస్యను ప్రపంచదేశాల దృష్టికి తేవటమనేది చక్కటి ఆలోచనే.

  అయితే,  బలూచిస్తాన్ పోరాటనాయకులకు  భారతదేశంలో స్థానం కల్పించటం అనే ఆలోచన, అలా ప్రకటించటం . . అనేవి మాత్రం అంత సరైనది కాదనిపిస్తుంది . 

ఈ చర్య వల్ల పొరుగుదేశం రెచ్చిపోవటం జరిగితే భారత్ కు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. 

 ప్రపంచదేశాలకు పాక్ దుశ్చర్యలను తెలియజేస్తూ ..  భారత్ కు మద్దతు కూడగట్టడం, పాక్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేయటం మంచిదే.

అయితే కొన్నిదేశాలు తమ అవసరాల దృష్ట్యా ఎప్పుడు ఎటు ప్లేట్ ఫిరాయిస్తాయో తెలియదు కాబట్టి భారత్ జాగ్రత్తగా ఉండాలి. 
..............

  స్వార్ధపరులు, నిస్వార్ధపరులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.

ఎవరు ఎటు పోయినా సరే..మా అవసరాలే మాకు ముఖ్యం..  అంటూ స్వార్ధంగా ప్రవర్తిస్తూన్న వారు దేశంలో ఎందరో ఉన్నారు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలే నీటివిషయంలో సర్దుబాట్లు చేసుకోవటంలో పట్టువిడుపు లేకుండా ప్రవర్తిస్తూ గొడవలు పడటం జరిగింది.

*********

 ఇలా గొడవలు పడకుండా  ఇరుదేశాలు అభివృద్ధిపై దృష్టిపెడితే ఎంతో బాగుంటుంది.

ఇరుదేశాల ప్రజలూ సుఖంగా ఉంటారు.

భజరంగి భాయ్ జాన్  సినిమా చాలా బాగుంది.
 
అందరికీ మంచి బుద్ది ఉండాలని  దైవాన్ని కోరుకుందాము.


Wednesday, September 21, 2016

అడవిలో....

కొంతకాలం క్రిందట మేము నల్లమల అడవులలో ఉన్న..ఒక శివాలయ దర్శనానికి వెళ్ళి రావటం జరిగింది. (గుండ్ల బ్రహ్మేశ్వరం  )..

ఈ దేవాలయ దర్శనానికి సామాన్య భక్తులను మహాశివరాత్రి సందర్భంలో అంటే సంవత్సరంలో రెండు, మూడురోజులు మాత్రమే అనుమతిస్తారట.ప్రయాణం అడవుల గుండా జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చారు..
మేము ఉదయం బయలుదేరి సాయంత్రానికి తిరిగి గిద్దలూరు చేరుకున్నాము. దైవదర్శనం బాగా జరిగింది.

జీపులో వెళ్ళటానికి సుమారు నాలుగు గంటలు, తిరిగి రావటానికి సుమారు నాలుగు గంటలు సమయం పట్టింది.

అంత అడవిలో కూడా వారు సరుకులు తెచ్చి  వంట చేసి దేవాలయం వద్ద  అన్నదానం జరపటం ఎంతో గొప్ప విషయం.
...........
ప్రయాణంలో అడవిలో జంతువులు కూడా కనిపించే అవకాశం ఉంది. మాకు జింకలు కనిపించాయి.


 మేము వెళ్ళినప్పుడు.. అక్కడి అటవీ సిబ్బంది దారిలో కనిపించి ..ఇంతకుముందు కొందరు చిరుతపులిని చూడటం జరిగిందని చెప్పి , జాగ్రత్త.. అని చెప్పారు.

.అంతా దైవం దయ....మాకు పులి కనిపించలేదు.
 దట్టమైన అడవిలో అక్కడక్కడ కొందరు అటవీ సిబ్బంది కాపలాకాస్తున్నారు. 


 కొందరి వద్ద ఆధునిక ఆయుధాలు ఉండి ఉండవచ్చు. 

అయితే కొందరు సిబ్బంది విల్లంబుల  సహాయంతో కాపలా కాయటం కూడా జరుగుతోంది.  

 ఒక దగ్గర ఒక్క అతనే నిలుచుని కాపలా కాస్తున్నాడు.

అతనివద్ద  రక్షణ కొరకు ఒక చెట్టుకొమ్మ వంటిది   మాత్రమే ఉన్నదని చూసినట్లు నాకు గుర్తుంది.


 నాకు ఏమనిపించిందంటే , పులి  వస్తే అతను ఒక్కడే  ఎలా ఎదుర్కోగలడు ? ఏం ఉద్యోగాలో ? ..అనిపించింది.

 అటవీ సిబ్బంది అందరికీ ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలు ఇస్తే బాగుంటుంది.

మార్గమధ్యంలో ఒక దగ్గర అటవీ గెస్ట్ హౌస్ కూడా ఉంది.

రాత్రి సమయంలో గెస్ట్ హౌస్ చుట్టుప్రక్కల క్రూరజంతువులు తిరిగే సందర్భాలు కూడా ఉంటాయని అక్కడి సిబ్బంది చెప్పారు.

 వాళ్ళు డ్యూటీ పైన అక్కడికి వెళ్తే కొన్ని రోజులకు సరిపడా ఆహారదినుసులను తీసుకువెళ్ళవలసి ఉంటుందట. అక్కడే వాళ్ళు వంట చేసుకుంటారట.

 ఆ అడవుల్లో రాకపోకలకు సన్నని దారి ఉంది.

 అడవుల్లో స్మగ్లర్లు వంటి వారి బెడద కూడా ఉంటోంది.

మొత్తానికి అడవులు, అటవీ సిబ్బంది రక్షణ గురించి కొరకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడితే బాగుంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే ... కొన్నిసార్లు తిరుమల కొండల వద్ద అడవిలో నిప్పు వ్యాపించినప్పుడు సిబ్బంది చెట్ల కొమ్మలతో అగ్నిప్రమాదాన్ని  నివారించటానికి ప్రయత్నించటాన్ని టీవీలో చూసాము.

ప్రమాద నివారణ కొరకు  మరింత మెరుగైన పరికరాలను సిబ్బందికి సమకూర్చాలి.

Monday, September 19, 2016

దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు..మరియు...కొన్ని విషయాలు..దేశరక్షణ విధులను నిర్వహిస్తూ కొందరు సైనికులు మరణించటం, కొందరు గాయాలపాలవటం ఎంతో బాధాకరమైన విషయాలు. ఇవన్నీ ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది.


దేశరక్షణ కొరకు ప్రాణాలు సమర్పించిన సైనికులకు వందనములు. .............

ఇంకో విషయం ఏమిటంటే ,ఆంధ్రప్రదేశ్లో కృష్ణా..గోదావరి బేసిన్లో చమురు లభిస్తుందని తెలిసిన తరువాత నుండి అక్కడ చమురు..సహజవాయువు వెలికితీత కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరగటం, కొందరు మరణించటం కూడా జరిగింది. 

ఇప్పడు కూడా అప్పుడప్పుడు గ్యాస్ వెలికిరావటం ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకటం జరుగుతోంది. 
 ఈ వార్తలు గమనిస్తే.. బాబోయ్!ఇక మీదట ఏ ప్రదేశంలోనూ ఖనిజాలు, గ్యాస్..వంటి నిక్షేపాలు  లభించవద్దు.అని కోరుకోవాలనిపిస్తోంది.

సూర్యరశ్మి అపారంగా లభించే మన దేశంలో సోలార్ విద్యుత్ మరింతగా పెంచుకోవాలి ..

సోలార్ విద్యుతో నడిచే వాహనాలను చవకగా తయారుచేసేలా ప్రయోగాలు జరిగేలా ప్రభుత్వాలు   ప్రోత్సహిస్తే బాగుంటుంది. 

  భూగర్భ వనరులను అదేపనిగా వెలికితీయటం వలన సముద్ర నీరు పైకి చొచ్చుకు వచ్చి మంచినీరు ఉప్పునీరుగా మారటం  వంటి  దుష్ఫలితాలు వస్తాయంటున్నారు.

 ఇప్పటికే కోస్తాలో అనేక చోట్ల మంచినీరు లభించే ప్రదేశంలో  ఉప్పునీరు ఆక్రమించటం జరుగుతోంది.

ఇలాంటి త్రవ్వకాల వల్ల పరిస
ర ప్రాంతాలలో  కాలుష్యం కూడా బాగా ఉంటుంది.

పచ్చటి కోనసీమ లో ఎప్పుడు ఏం  జరుగుతుందోనని ? ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే ఖర్మ ఏమిటి ?

ఈ పరిస్థితి మారేలా అందరూ చర్యలు తీసుకోవాలి.

Friday, September 16, 2016

ఆంధ్రప్రదేశ్ ...... కొన్ని విషయాలు..

 ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గమనించదగ్గ కొన్ని విషయాలున్నాయి.

రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, 


రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

...............  


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా,  ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.


అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.


నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు. 


  రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.

.....................

రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు. 


 తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.


  రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.


రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.


రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

అమరావతి చుట్టుప్రక్కల  కూడా  కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.

....................

 రాష్ట్రానికి  పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.


అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.


 పారిశ్రామికవేత్తలు  భూమి తక్కువధరలో కావాలంటారు.


 కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.


భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు. 


అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ  మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.


అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.


అయితే పరిశ్రమల వల్ల  కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.


.....................


 రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............

 నా అభిప్రాయాలను వ్రాసాను. ఇక ఎవరి అభిప్రాయాలు వారివి. 
Thursday, September 15, 2016

ఉన్న భూమి జాగ్రత్తగా వాడుకోవాలి....

ఈ  రోజుల్లో  పరిశ్రమలకు భూమి ఇవ్వటం కోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారు.

ఈ రోజుల్లో పరిశ్రమలు అవసరమే  కానీ, ఆహారం  కొరకు వ్యవసాయం  కూడా అవసరమే కదా!

................

ఈ  మధ్య కూరగాయల ధరలు  బాగా పెరిగాయి. ఇదేమిటి ? సడన్ గా ఇంతగా ధరలు పెంచేశారని అడిగితే కూరగాయలు అమ్మేవాళ్ళు  ఏమన్నారంటే..


 ముందుముందు ఇంకా  ధరలు పెరుగుతాయండి, పంటభూములు ఎక్కువ లేవు కదా.. పంటలు వేయటం తగ్గిపోయింది..అని జవాబిచ్చారు.

 వాళ్ళు నిజమే చెప్పి ఉండవచ్చు లేక రేట్లు పెంచటానికి అలా చెప్పి ఉండవచ్చు. 


అయితే వాళ్ళు అన్న దాంట్లో చాలా నిజం ఉంది. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతూ  పోయే కొలది ఆహార కొరత ఏర్పడుతుంది. 

ఇప్పటికే  దేశంలో పండే పంట సరిపోనందువల్ల..? విదేశాలనుంచి  ఆహారధాన్యాలను  దిగుమతి చేసుకుంటున్నారు.

పండుతున్న పంటలో కొంత భాగం సరిగ్గా నిలువ చేయకపోవటం వల్ల  గోడౌన్లలో పాడవుతోందనీ వార్తలు వచ్చాయి.


అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో  పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. 


అటు రైతుకూ గిట్టుబాటు  ధర  రావటం లేదు..ఇటు వినియోగదారులకూ  ధర అందుబాటులో  లేదు. మధ్య దళారులు బాగుపడుతున్నట్లు ఉంది. ఇలాంటి పరిస్థితిలో .. ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూములను పారిశ్రామిక  అవసరాలకు  కేటాయించేస్తే ....ఆహారకొరత మరింత తీవ్రమై, పప్పు దినుసుల కొరకు మరింతగా విదేశాలపై  ఆధారపడే పరిస్థితి రావచ్చు.


 తద్వారా ఆహారదినుసుల  ధరలు  మరింత పెరిగే అవకాశం ఉంది.


పరిశ్రమలు ఉన్నంత  మాత్రాన కడుపు నిండదు కదా!

..........................

  మనకు వ్యవసాయం బాగుంటే విదేశాల  నుండి ఆహారదినుసులను  దిగుమతి చేసుకునే ఖర్చు ఉండదు. 

వ్యవసాయం బాగుంటే దేశంలో అందరి కడుపు నిండుతుంది. ఆకలి చావులు ఉండవు.

అందరికీ పుష్టికరమైన ఆహారం లభించినప్పుడు అనారోగ్యాలూ తగ్గుతాయి. తద్వారా వైద్యానికి  పెట్టే   ఖర్చు తగ్గుతుంది. 

వ్యవసాయాధారిత  పరిశ్రమలను నెలకొల్పితే ఉద్యోగాలూ  వస్తాయి. రసాయన పరిశ్రమల  పొల్యూషన్  కూడా  తగ్గుతుంది.

................

భూమి చాలా విలువైనది. భూమి విస్తీర్ణం పెరగదు కదా... ఉన్న భూమినే జాగ్రత్తగా  వాడుకోవాలి.

 పరిశ్రమలకు  భూములను అధికంగా ఇచ్చేస్తే  వ్యవసాయానికి  ఇబ్బందితో పాటూ , భవిష్యత్తులో  కొత్త పరిశ్రమలు ఏర్పాటు  చేయాలంటే  భూమి  లభించని పరిస్థితి కూడా వస్తుంది.


అందువల్ల, సాధ్యమైనంత తక్కువ భూమిలో  పరిశ్రమలు ఏర్పాటుచేసేవారికి  ప్రాముఖ్యత  ఇవ్వాలి. పరిశ్రమల ఏర్పాటు  విషయంలో అన్నీ  పెద్దపెద్ద  పరిశ్రమల  వారికే అవకాశాలు  ఇవ్వటం  కాకుండా ..చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వారికి కూడా అవకాశం  ఇవ్వాలి. 
Monday, September 12, 2016

స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్..


దయచేసి పూర్తిగా  చదవమని కోరుకుంటున్నాను ..  

..................................
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు వదిలిన త్యాగధనులకు వందనములు.

.......................

  ఎన్నికల  సమయంలో నాయకులు  ఓట్ల  కోసం అనేక  హామీలు  ఇస్తూ తరువాత మాట తప్పుతున్నారు.

 ఇప్పటివరకు  నాయకులు ఇచ్చిన  హామీలు నెరవేర్చి ఉంటే భారతదేశం ఎప్పుడో  అభివృద్ధి చెంది ఉండేది.

 ఎన్నికల సమయంలో  పార్టీలు  మాట ఇవ్వటం..తరువాత  మాట తప్పటం  తరచూ  జరుగుతోంది.
………………………….

  విభజన  తరువాత  కేంద్రం..ఆంధ్రప్రదేస్కు నిధులు ఆలస్యంగా ఇవ్వటం జరిగింది.

 ఇలాంటి అనుభవాల  వల్ల ప్రజలలో  ప్యాకేజీ అంటే నిధులు సరిగ్గా  అందుతాయో? లేవో ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే ఆంధ్రప్రభుత్వం..  కేంద్రం ఇచ్చిన నిధులను వేరే విధంగా ఖర్చు చేస్తోంది కాబట్టి మేము త్వరగా నిధులు ఇవ్వటం లేదనటం సరైనది కాదు.

ఉదా.. తెలుగుదేశం, బీజేపీ కలసి ఎన్నికల సమయంలో ఇచ్చిన   రైతు రుణమాఫీ వంటి వాగ్ధానాల గురించి ఆశలు పెట్టుకుని ప్రజలు ఓట్లు వేశారు.

ఎన్నికలలో  గెలిచిన  తరువాత రుణమాఫీ గురించి ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి రుణమాఫీకొరకు ప్రభుత్వం ప్రయత్నించింది. 

అయితే ప్రభుత్వం వద్ద నిధులు చాలినంత లేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధులను కొంతవరకూ రైతు రుణమాఫీ కొరకు వాడటంలో తప్పులేదు..
............

ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక ప్యాకేజ్  ఇచ్చినా ప్రత్యేక  హోదా ఇచ్చినా కేంద్రానికి ఖర్చు అవుతుంది.

 ప్యాకేజ్  ఇస్తే సూటిగా డబ్బు ఇవ్వాలి. ప్రత్యేక హోదా అయితే రాష్ట్రాల నుంచి వచ్చే కొన్ని పన్నులు కేంద్రానికి తగ్గుతాయి.

ఇవన్నీ గమనించి కాబోలు ఇక మీదట ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోవటం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.


ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు  ఎక్కువగా అభివృద్ధి చెందలేదని అంటున్నారు.

 కొన్ని పరిశ్రమల వాళ్ళు  రాయితీల కోసం ప్రత్యేకహోదా  ఉన్న రాష్ట్రాలలో  చిన్న పరిశ్రమ పెట్టినా అక్కడ  పరిశ్రమను నడిపించకుండా  రాయితీలు మాత్రం తీసుకుంటున్నారట. 

స్థానికులకు ఎటువంటి ఉద్యోగాలను ఇవ్వటం లేదంటున్నారు.
.....................   

పరిశ్రమలు వచ్చినంత మాత్రాన  బోలెడు ఉద్యోగాలు వచ్చేస్తాయనుకోవటానికి  లేదు. 

 విదేశాలలో  కూడా నిరుద్యోగ సమస్య ఉంది.

యంత్ర వినియోగం పెరగటం, స్త్రీలు , పురుషులు  కూడా ఉద్యోగాల  కోసం పోటీ పడటం..వంటి  అనేక  కారణాల  వల్ల ప్రపంచవ్యాప్తంగా  నిరుద్యోగ సమస్య  పెరిగింది.

..........................

పారిశ్రామిక రాయితీల  వల్ల స్వదేశీ, విదేశీ పారిశ్రామికసంస్థలు  రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తామని వచ్చారనుకోండి. వాళ్ళు వందలు, వేల ఎకరాల భూమి అడుగుతారు.


 ప్రభుత్వం వద్ద  భూమి లేదు. అటవీభూమి ఇవ్వటానికి వీల్లేదు. ఇక మిగిలింది రైతులభూమే.

రైతులు  తమ భూమిని పరిశ్రమలకు  ఇవ్వవలసి  ఉంటుంది.

పారిశ్రామిక  రాయితీల  వల్ల పరిశ్రమల  అధిపతులకు  లాభం..

పన్నుల  ఆదాయం  తగ్గటం  వల్ల  ప్రభుత్వాలకు  నష్టం..

ఇక, భూమిని  ఇచ్చే రైతులకు లాభమా ? నష్టమా  ?  అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. 

...................

పరిశ్రమలకు  రాయితీలు ఇవ్వటం, భూములు ఇవ్వటం వల్ల పరిశ్రమల అధిపతుల  సంపద బాగా పెరుగుతుంది. 


 పెద్ద పరిశ్రమలు కాకుండా చిన్న, మధ్యస్థాయి  పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలి. తక్కువ భూమితో పరిశ్రమ పెట్టేవారిని ఎంకరేజ్  చేయాలి.

 అంకుర పరిశ్రమలు పెట్టే యువతకు, వ్యాపారాలు చేయటానికి ఆసక్తి  ఉన్న యువతకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే....సంపద కొంతమంది బడా పరిశ్రమల వాళ్ళ వద్ద  మాత్రమే కాకుండా దిగువ, మధ్య స్థాయి ప్రజలు కూడా  స్వతంత్రంగా పైకి ఎదగటానికి అవకాశముంటుంది.

....................

 పరిశ్రమల విషయంలో ఎన్నో విషయాలను ఆలోచించాలి..

 ఉదాహరణకు ..  ఒక పారిశ్రామికవేత్త  తాను   పరిశ్రమ పెట్టాలంటే 500 ఎకరాలు ప్రభుత్వం  ఇస్తే 500 మందికి ఉద్యోగం కలిపిస్తామని ప్రకటించారు.

 అంటే  500 ఎకరాలు ఇస్తే 500 మందికి మాత్రమే ఉద్యోగాలు  ఇవ్వటం అంటే ఏమంత గొప్ప విషయం. 

 ఈ రోజుల్లో కొందరు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారంటే .. ఉద్యోగస్తులను సాధ్యమైనంతగా  తగ్గించి యంత్రాలతో పని జరపటం చేస్తున్నారు.


పారిశ్రామికవేత్తలు  కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలరు.


 ఒకసారి ఉద్యోగంలో  చేరిన వ్యక్తి  సుమారు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూనే  ఉంటారు.


 ఈ లెఖ్ఖన  ప్రతి సంవత్సరమూ  ఇంజనీరింగ్ కాలేజీల నుంచి  లక్షల  మంది ఉత్తీర్ణులయి వస్తున్న అందరికీ  ఉద్యోగాలు  ఎలా ఇవ్వాలి... 

......................

దేశంలో పేదరికం, నిరుద్యోగం..వంటి సమస్యలు తగ్గాలంటే  సంపద  కొందరి వద్దే ఉండటం కాకుండా అందరి మధ్యా  పెరగటం అనేది ముఖ్యం.

 నల్లడబ్బును నియంత్రంచితే  దేశంలో ఎన్నో  సమస్యలు తగ్గుతాయి.

 సంపద ఉంటే సహజవనరులు  త్వరగా  తరిగిపోకుండా, పర్యావరణం  పాడవకుండా  అనేక ఉద్యోగాలను  సృష్టించవచ్చు.

.......................

వందల కోట్ల ఆస్తులున్న పారిశ్రామికవేత్తలు ఎందరో ఆంధ్రకు చెందిన వారు ఉన్నారు.

 ఇలాంటివారు  రాయితీలతో సంబంధం లేకుండా  ఆంధ్రలో పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుంది కదా!

  చెన్నై..వైజాగ్ కారిడర్  వల్ల పరిశ్రమలు వస్తాయంటున్నారు మరి.. 

……..

ఇక స్పెషల్  స్టేటస్  విషయానికి  వస్తే  కేంద్రం స్టేటస్ ఇవ్వనంటోంది. 

ఇప్పుడు  రాష్ట్రానికి  నిధుల అవసరం  ఎంతైనా  ఉంది..అందువల్ల  కేంద్రం ఇస్తామంటున్న  నిధులను  తీసుకుంటే బాగుంటుంది ఏమో..

 ఇప్పటికే  ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో  సమైక్య రాష్ట్రంలో చాలా నష్టపోయాము.

  పొరుగు రాష్ట్రాలు  అభివృద్ధిలో  ముందుకు వెళ్తుంటే ..


. మనకు ఇస్తామంటున్న  నిధులను  వద్దని తిరస్కరించి...   ఇవ్వమంటున్న స్పెషల్ స్టేటస్  కోసం  చాలాకాలం పోరాడే ఓపిక ప్రజలకు ఉందా  ? 

ప్యాకేజీని వదులుకుని హోదా కోసం ఎదురుచూస్తే ఎంతకాలం వేచి ఉండాలో ?

...............

  పార్లమెంట్లో ప్రధానమంత్రి అంతటి  వ్యక్తి ఇచ్చిన ప్రకటనకే  విలువ ఇవ్వని  ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేట్లు  లేదు.

 అందువల్ల   ఈ ప్యాకేజ్ కు  చట్టబద్ధత  కల్పించాలి. 

..........................

విభజన సమయంలోనూ ఉమ్మడి  ఆస్తుల పంపకంలో  ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది.

 స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి  ఇప్పుడు ఇవ్వనంటున్నారు.

స్పెషల్ స్టేటస్  ఇవ్వకుంటే   ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ తో  పాటు   వైజాగ్ రైల్వే  జోన్, కడపలో  స్టీల్ ఫేక్టరీ ..వంటివి ఇస్తే  బాగుంటుంది.

......................

 ముఖ్యమైన  విషయం  ఏమిటంటే.. ఇప్పటికే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం త్వరితగతిన న్యాయం చేయాలి. 

ప్రకటించిన ప్యాకేజ్  త్వరితగతిన  ఇవ్వాలి.

............

ప్యాకేజ్ వద్దంటూ  స్పెషల్ స్టేటసే  కావాలి అంటూ ఇప్పుడే ఉద్యమాలు చేస్తే ........ .


.  స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్ ..  రెండూ అందక రెంటికి చెడ్ద రేవడి అవుతుందేమో  రాష్ట్రం పరిస్థితి. ప్రస్తుతానికి ప్యాకేజ్ ఒప్పుకుని తరువాత స్పెషల్ స్టేటస్ అడిగితే బాగుంటుందేమో..

ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజ్  కేంద్రం నుండి సరైన సమయానికి సక్రమంగా  రాష్ట్రానికి చేరటం జరగాలి.

అందిన ప్యాకేజ్ సమయానికి సక్రమంగా వినియోగం జరగాలి.అప్పుడే ఉపయోగం ఉంటుంది.

ప్రస్తుతానికి  నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను. ఈ విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి.
 ..................

అందరికీ  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.


Thursday, September 8, 2016

1.దృష్టిలోపం తగ్గటానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులు....2.కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి....

ఆసక్తి ఉన్నవారు లింక్స్ వద్ద చూడగలరు.

   Ayurveda For Improving Eyesight
ayurveda-foryou.com/treat/improve-eyesight.    Ayurvedic Remedy for Eye Sight Improvement | Ayurpedia

   ************************

   ఇంతకుముందు నాకు కళ్లజోడు లేదు. ఈ  మధ్యనే కళ్ళజోడు అవసరం పడింది. 

    బై  ఫోకల్  మరియు  ప్రొగ్రెస్సివ్ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి.

    బై ఫోకల్ నుండి కొన్ని లక్షణాలను ప్రొగ్రెస్సివ్ నుండి కొన్ని లక్షణాలను తీసుకుని కొత్తరకం కళ్ళజోడు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది.

   అంటే కళ్ళజోడును బై ఫోకల్ విధానంలోనే ఉంచి  మధ్యలో విభజన గీత ప్రదేశంలో మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందనిపించింది.

    అంటే కళ్ళజోడు అంతా ప్రొగ్రెస్సివ్ విధానం కాకుండా కళ్ళజోడు అంతా బై ఫోకల్ పద్ధతిలో తయారుచేసి ... విభజనగీత  వద్ద మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

    ప్రొగ్రెస్సివ్లో దృశ్యాన్ని చూడటానికి కళ్లు తమకు తామే సర్దుకోవలసి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త దృశ్యాన్ని చూసినప్పుడల్లా కళ్లు అలసిపోయే అవకాశం ఉందనిపించింది.

   అదే బై ఫోకల్ మధ్యలో కొద్ది భాగానికి మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే కళ్ళకు కలిగే శ్రమ గణనీయంగా  తగ్గుతుందనిపించింది.

   ఇలాంటి  విధానం సరైనదో కాదో నాకు తెలియదు.నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.
   ...................... 

   రీడింగ్ గ్లాసెస్ తో కొందరికి దూరపు దృశ్యాలు సరిగ్గా కనిపించవట.

   మొదట్లో  నాకు రీడింగ్ గ్లాసెస్  ఉండేవి. నా విషయంలో రీడింగ్ గ్లాసెస్తోనే దగ్గర దృశ్యాలు, దూరపు దృశ్యాలు కూడా చక్కగా కనిపించేవి.

   ( బహుశా అప్పుడు నాకు ఉన్న దూరదృష్టి, దగ్గరదృష్టి కూడా  1.5 రీడింగ్ గ్లాసెస్ కు సరిపోయి ఉంటుంది.)

   అయితే కళ్ళజోడు షాప్ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ తో దూరపు దృశ్యాలు చూడకూడని చెప్పటంతో డాక్టర్ వద్దకు వెళ్లి బై ఫోకల్ వేయించుకున్నాను.

    బైఫోకల్ నాకు అనీజీగా ఉండటంతో ప్రొగ్రెసివ్ మార్చాను ప్రొగ్రెసివ్ ఇంకా అనీజీగా ఉండేది. ఇలా కళ్లజోడ్లు మార్చటంతో కళ్లు అలసి దగ్గరదృష్టిలోపం మరికొంచెం పెరిగింది. కొద్దిగా మెడనొప్పులు కూడా వచ్చాయి.

   ............................


   ఇంకో విషయం ఏమిటంటే,  రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడకూడదని కొందరు అంటారు.


   ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ,  కొందరు  దూరపు వస్తువులను సరిగ్గా చూడలేని  వాళ్ళకు ఇచ్చే  కళ్ళజోడుకు విభజనగీత  ఉండదు. అద్దం అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. 

     వీళ్లు ఆ అద్దాలతోనే దూరపు వస్తువులనూ చూడగలరు..దగ్గర వస్తువులనూ చూడగలరు.

    ఈ విషయాన్ని గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...

   . కొందరు   ఒకే అద్దంతో దూరపు  మరియు దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు ( వాళ్ళు అలా చక్కగా చూడగలిగినప్పుడు)..

   . రీడింగ్ గ్లాస్ వాడేవాళ్ళు ...వాటితో దూరపు వస్తువులను  కూడా చూడటానికి కూడా ఉపయోగిస్తే తప్పేమిటి  ? అనే సందేహం అనిపిస్తుంది.

    దృస్టి లోపం ఎక్కువ పెరిగినప్పుడు  ఎలాగూ బైఫోకల్  గానీ ప్రొగ్రెస్సివ్ గానీ ఇస్తారు.

   నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.

    దైవం దయవల్ల నాకు ప్రస్తుతం దృష్టిలోపం ఎక్కువగా లేదు.

   అవసరమైనప్పుడు  రీడింగ్ గ్లాసెస్ వాడుతూ కళ్ళజోడు పవర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.