koodali

Thursday, September 15, 2016

ఉన్న భూమి జాగ్రత్తగా వాడుకోవాలి....

 
ఈ  రోజుల్లో  పరిశ్రమలకు భూమి ఇవ్వటం కోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారు.

ఈ రోజుల్లో పరిశ్రమలు అవసరమే  కానీ, ఆహారం  కొరకు వ్యవసాయం  కూడా అవసరమే కదా!

................
ఈ  మధ్య కూరగాయల ధరలు  బాగా పెరిగాయి. ఇదేమిటి ? సడన్ గా ఇంతగా ధరలు పెంచేశారని అడిగితే కూరగాయలు అమ్మేవాళ్ళు  ఏమన్నారంటే..


 ముందుముందు ఇంకా  ధరలు పెరుగుతాయండి, పంటభూములు ఎక్కువ లేవు కదా.. పంటలు వేయటం తగ్గిపోయింది..అని జవాబిచ్చారు.

 వాళ్ళు నిజమే చెప్పి ఉండవచ్చు లేక రేట్లు పెంచటానికి అలా చెప్పి ఉండవచ్చు. 


అయితే వాళ్ళు అన్న దాంట్లో చాలా నిజం ఉంది. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతూ  పోయే కొలది ఆహార కొరత ఏర్పడుతుంది. 

ఇప్పటికే  దేశంలో పండే పంట సరిపోనందువల్ల..? విదేశాలనుంచి  ఆహారధాన్యాలను  దిగుమతి చేసుకుంటున్నారు.

పండుతున్న పంటలో కొంత భాగం సరిగ్గా నిలువ చేయకపోవటం వల్ల  గోడౌన్లలో పాడవుతోందనీ వార్తలు వచ్చాయి.


అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో  పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. 


అటు రైతుకూ గిట్టుబాటు  ధర  రావటం లేదు..ఇటు వినియోగదారులకూ  ధర అందుబాటులో  లేదు. మధ్య దళారులు బాగుపడుతున్నట్లు ఉంది. 



ఇలాంటి పరిస్థితిలో .. ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూములను పారిశ్రామిక  అవసరాలకు  కేటాయించేస్తే ....ఆహారకొరత మరింత తీవ్రమై, పప్పు దినుసుల కొరకు మరింతగా విదేశాలపై  ఆధారపడే పరిస్థితి రావచ్చు.


 తద్వారా ఆహారదినుసుల  ధరలు  మరింత పెరిగే అవకాశం ఉంది.


పరిశ్రమలు ఉన్నంత  మాత్రాన కడుపు నిండదు కదా!

..........................

  మనకు వ్యవసాయం బాగుంటే విదేశాల  నుండి ఆహారదినుసులను  దిగుమతి చేసుకునే ఖర్చు ఉండదు. 

వ్యవసాయం బాగుంటే దేశంలో అందరి కడుపు నిండుతుంది. ఆకలి చావులు ఉండవు.

అందరికీ పుష్టికరమైన ఆహారం లభించినప్పుడు అనారోగ్యాలూ తగ్గుతాయి. తద్వారా వైద్యానికి  పెట్టే   ఖర్చు తగ్గుతుంది. 

వ్యవసాయాధారిత  పరిశ్రమలను నెలకొల్పితే ఉద్యోగాలూ  వస్తాయి. రసాయన పరిశ్రమల  పొల్యూషన్  కూడా  తగ్గుతుంది.

................
భూమి చాలా విలువైనది. భూమి విస్తీర్ణం పెరగదు కదా... ఉన్న భూమినే జాగ్రత్తగా  వాడుకోవాలి.

 పరిశ్రమలకు  భూములను అధికంగా ఇచ్చేస్తే  వ్యవసాయానికి  ఇబ్బందితో పాటూ , భవిష్యత్తులో  కొత్త పరిశ్రమలు ఏర్పాటు  చేయాలంటే  భూమి  లభించని పరిస్థితి కూడా వస్తుంది.


అందువల్ల, సాధ్యమైనంత తక్కువ భూమిలో  పరిశ్రమలు ఏర్పాటుచేసేవారికి  ప్రాముఖ్యత  ఇవ్వాలి. 


పరిశ్రమల ఏర్పాటు  విషయంలో అన్నీ  పెద్దపెద్ద  పరిశ్రమల  వారికే అవకాశాలు  ఇవ్వటం  కాకుండా ..చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వారికి కూడా అవకాశం  ఇవ్వాలి.
 







No comments:

Post a Comment