koodali

Monday, September 12, 2016

స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్..


దయచేసి పూర్తిగా  చదవమని కోరుకుంటున్నాను ..  
..................................
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు వదిలిన త్యాగధనులకు వందనములు.

.......................
  ఎన్నికల  సమయంలో నాయకులు  ఓట్ల  కోసం అనేక  హామీలు  ఇస్తూ తరువాత మాట తప్పుతున్నారు.

 ఇప్పటివరకు  నాయకులు ఇచ్చిన  హామీలు నెరవేర్చి ఉంటే భారతదేశం ఎప్పుడో  అభివృద్ధి చెంది ఉండేది.

 ఎన్నికల సమయంలో  పార్టీలు  మాట ఇవ్వటం..తరువాత  మాట తప్పటం  తరచూ  జరుగుతోంది.
………………………….

  విభజన  తరువాత  కేంద్రం..ఆంధ్రప్రదేస్కు నిధులు ఆలస్యంగా ఇవ్వటం జరిగింది.

 ఇలాంటి అనుభవాల  వల్ల ప్రజలలో  ప్యాకేజీ అంటే నిధులు సరిగ్గా  అందుతాయో? లేవో ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే ఆంధ్రప్రభుత్వం..  కేంద్రం ఇచ్చిన నిధులను వేరే విధంగా ఖర్చు చేస్తోంది కాబట్టి మేము త్వరగా నిధులు ఇవ్వటం లేదనటం సరైనది కాదు.

ఉదా.. తెలుగుదేశం, బీజేపీ కలసి ఎన్నికల సమయంలో ఇచ్చిన   రైతు రుణమాఫీ వంటి వాగ్ధానాల గురించి ఆశలు పెట్టుకుని ప్రజలు ఓట్లు వేశారు.

ఎన్నికలలో  గెలిచిన  తరువాత రుణమాఫీ గురించి ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి రుణమాఫీకొరకు ప్రభుత్వం ప్రయత్నించింది. 

అయితే ప్రభుత్వం వద్ద నిధులు చాలినంత లేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధులను కొంతవరకూ రైతు రుణమాఫీ కొరకు వాడటంలో తప్పులేదు..
............

ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక ప్యాకేజ్  ఇచ్చినా ప్రత్యేక  హోదా ఇచ్చినా కేంద్రానికి ఖర్చు అవుతుంది.

 ప్యాకేజ్  ఇస్తే సూటిగా డబ్బు ఇవ్వాలి. ప్రత్యేక హోదా అయితే రాష్ట్రాల నుంచి వచ్చే కొన్ని పన్నులు కేంద్రానికి తగ్గుతాయి.

ఇవన్నీ గమనించి కాబోలు ఇక మీదట ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోవటం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు  ఎక్కువగా అభివృద్ధి చెందలేదని అంటున్నారు.

 కొన్ని పరిశ్రమల వాళ్ళు  రాయితీల కోసం ప్రత్యేకహోదా  ఉన్న రాష్ట్రాలలో  చిన్న పరిశ్రమ పెట్టినా అక్కడ  పరిశ్రమను నడిపించకుండా  రాయితీలు మాత్రం తీసుకుంటున్నారట. 

స్థానికులకు ఎటువంటి ఉద్యోగాలను ఇవ్వటం లేదంటున్నారు.
.....................   

పరిశ్రమలు వచ్చినంత మాత్రాన  బోలెడు ఉద్యోగాలు వచ్చేస్తాయనుకోవటానికి  లేదు. 

 విదేశాలలో  కూడా నిరుద్యోగ సమస్య ఉంది.

యంత్ర వినియోగం పెరగటం, స్త్రీలు , పురుషులు  కూడా ఉద్యోగాల  కోసం పోటీ పడటం..వంటి  అనేక  కారణాల  వల్ల ప్రపంచవ్యాప్తంగా  నిరుద్యోగ సమస్య  పెరిగింది.
..........................

పారిశ్రామిక రాయితీల  వల్ల స్వదేశీ, విదేశీ పారిశ్రామికసంస్థలు  రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తామని వచ్చారనుకోండి. వాళ్ళు వందలు, వేల ఎకరాల భూమి అడుగుతారు.

 ప్రభుత్వం వద్ద  భూమి లేదు. అటవీభూమి ఇవ్వటానికి వీల్లేదు. ఇక మిగిలింది రైతులభూమే.

రైతులు  తమ భూమిని పరిశ్రమలకు  ఇవ్వవలసి  ఉంటుంది.

పారిశ్రామిక  రాయితీల  వల్ల పరిశ్రమల  అధిపతులకు  లాభం..

పన్నుల  ఆదాయం  తగ్గటం  వల్ల  ప్రభుత్వాలకు  నష్టం..

ఇక, భూమిని  ఇచ్చే రైతులకు లాభమా ? నష్టమా  ?  అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. 
...................

పరిశ్రమలకు  రాయితీలు ఇవ్వటం, భూములు ఇవ్వటం వల్ల పరిశ్రమల అధిపతుల  సంపద బాగా పెరుగుతుంది. 

 పెద్ద పరిశ్రమలు కాకుండా చిన్న, మధ్యస్థాయి  పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలి. తక్కువ భూమితో పరిశ్రమ పెట్టేవారిని ఎంకరేజ్  చేయాలి.

 అంకుర పరిశ్రమలు పెట్టే యువతకు, వ్యాపారాలు చేయటానికి ఆసక్తి  ఉన్న యువతకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే....సంపద కొంతమంది బడా పరిశ్రమల వాళ్ళ వద్ద  మాత్రమే కాకుండా దిగువ, మధ్య స్థాయి ప్రజలు కూడా  స్వతంత్రంగా పైకి ఎదగటానికి అవకాశముంటుంది.

....................
 పరిశ్రమల విషయంలో ఎన్నో విషయాలను ఆలోచించాలి..

 ఉదాహరణకు ..  ఒక పారిశ్రామికవేత్త  తాను   పరిశ్రమ పెట్టాలంటే 500 ఎకరాలు ప్రభుత్వం  ఇస్తే 500 మందికి ఉద్యోగం కలిపిస్తామని ప్రకటించారు.

 అంటే  500 ఎకరాలు ఇస్తే 500 మందికి మాత్రమే ఉద్యోగాలు  ఇవ్వటం అంటే ఏమంత గొప్ప విషయం. 

 ఈ రోజుల్లో కొందరు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారంటే .. ఉద్యోగస్తులను సాధ్యమైనంతగా  తగ్గించి యంత్రాలతో పని జరపటం చేస్తున్నారు.


పారిశ్రామికవేత్తలు  కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలరు.

 ఒకసారి ఉద్యోగంలో  చేరిన వ్యక్తి  సుమారు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూనే  ఉంటారు.

 ఈ లెఖ్ఖన  ప్రతి సంవత్సరమూ  ఇంజనీరింగ్ కాలేజీల నుంచి  లక్షల  మంది ఉత్తీర్ణులయి వస్తున్న అందరికీ  ఉద్యోగాలు  ఎలా ఇవ్వాలి... 

......................
దేశంలో పేదరికం, నిరుద్యోగం..వంటి సమస్యలు తగ్గాలంటే  సంపద  కొందరి వద్దే ఉండటం కాకుండా అందరి మధ్యా  పెరగటం అనేది ముఖ్యం.

 నల్లడబ్బును నియంత్రంచితే  దేశంలో ఎన్నో  సమస్యలు తగ్గుతాయి.

 సంపద ఉంటే సహజవనరులు  త్వరగా  తరిగిపోకుండా, పర్యావరణం  పాడవకుండా  అనేక ఉద్యోగాలను  సృష్టించవచ్చు.
.......................

వందల కోట్ల ఆస్తులున్న పారిశ్రామికవేత్తలు ఎందరో ఆంధ్రకు చెందిన వారు ఉన్నారు.

 ఇలాంటివారు  రాయితీలతో సంబంధం లేకుండా  ఆంధ్రలో పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుంది కదా!

  చెన్నై..వైజాగ్ కారిడర్  వల్ల పరిశ్రమలు వస్తాయంటున్నారు మరి.. 

……..
ఇక స్పెషల్  స్టేటస్  విషయానికి  వస్తే  కేంద్రం స్టేటస్ ఇవ్వనంటోంది. 

ఇప్పుడు  రాష్ట్రానికి  నిధుల అవసరం  ఎంతైనా  ఉంది..అందువల్ల  కేంద్రం ఇస్తామంటున్న  నిధులను  తీసుకుంటే బాగుంటుంది ఏమో..

 ఇప్పటికే  ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో  సమైక్య రాష్ట్రంలో చాలా నష్టపోయాము.

  పొరుగు రాష్ట్రాలు  అభివృద్ధిలో  ముందుకు వెళ్తుంటే ..

. మనకు ఇస్తామంటున్న  నిధులను  వద్దని తిరస్కరించి...   ఇవ్వమంటున్న స్పెషల్ స్టేటస్  కోసం  చాలాకాలం పోరాడే ఓపిక ప్రజలకు ఉందా  ? 

ప్యాకేజీని వదులుకుని హోదా కోసం ఎదురుచూస్తే ఎంతకాలం వేచి ఉండాలో ?

...............
  పార్లమెంట్లో ప్రధానమంత్రి అంతటి  వ్యక్తి ఇచ్చిన ప్రకటనకే  విలువ ఇవ్వని  ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేట్లు  లేదు.

 అందువల్ల   ఈ ప్యాకేజ్ కు  చట్టబద్ధత  కల్పించాలి. 
..........................

విభజన సమయంలోనూ ఉమ్మడి  ఆస్తుల పంపకంలో  ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది.

 స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి  ఇప్పుడు ఇవ్వనంటున్నారు.

స్పెషల్ స్టేటస్  ఇవ్వకుంటే   ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ తో  పాటు   వైజాగ్ రైల్వే  జోన్, కడపలో  స్టీల్ ఫేక్టరీ ..వంటివి ఇస్తే  బాగుంటుంది.
......................

 ముఖ్యమైన  విషయం  ఏమిటంటే.. ఇప్పటికే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం త్వరితగతిన న్యాయం చేయాలి. 

ప్రకటించిన ప్యాకేజ్  త్వరితగతిన  ఇవ్వాలి.

............
ప్యాకేజ్ వద్దంటూ  స్పెషల్ స్టేటసే  కావాలి అంటూ ఇప్పుడే ఉద్యమాలు చేస్తే ........ .

.  స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్ ..  రెండూ అందక రెంటికి చెడ్ద రేవడి అవుతుందేమో  రాష్ట్రం పరిస్థితి.

 ప్రస్తుతానికి ప్యాకేజ్ ఒప్పుకుని తరువాత స్పెషల్ స్టేటస్ అడిగితే బాగుంటుందేమో..

ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజ్  కేంద్రం నుండి సరైన సమయానికి సక్రమంగా  రాష్ట్రానికి చేరటం జరగాలి.

అందిన ప్యాకేజ్ సమయానికి సక్రమంగా వినియోగం జరగాలి.అప్పుడే ఉపయోగం ఉంటుంది.

ప్రస్తుతానికి  నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను. ఈ విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి.
 ..................

అందరికీ  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.


2 comments:

  1. Be it special status or special package, it is only beneficial for politicians, not for the common man.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.

    మనం మరీ నిరాశ చెందనవసరం లేదు.
    సామాన్య ప్రజలకు మంచి జరుగుతుంది లెండి.
    ...........

    రాజకీయులలోను మంచి, చెడు ఉంటారు. సామాన్య ప్రజలలోనూ మంచి, చెడు ఉంటారు.


    ఈ రోజుల్లో చాలామందిలో విలాసవంతమైన జీవితం అంటే మోజు పెరిగింది. అందుకు అవసరమైన డబ్బు సంపాదన కోసం ఎన్నో అవినీతి పనులు చేస్తున్నారు.

    ఎవరి స్థాయిలో వాళ్ళు చెడు పనులు చేయటానికి వెనుకాడటం లేదు.

    పెద్దవాళ్ళు కోట్లు స్థాయిలో డబ్బు వెనుకేస్తుంటే చిన్నవాళ్ళు వందలు,వేలు,లక్షలు స్థాయిలో అవినీతి చేస్తున్నారు.

    డబ్బు కోసం .. ఆహార పదార్ధాలను కల్తీ చేసే వాళ్ళు కొందరు, ప్రాణాన్ని కాపాడే మందులను కల్తీ చేసే వాళ్ళు కొందరు, అధిక వడ్దీలతో జనాన్ని ఏడిపించేవాళ్ళు కొందరు, వందల కోట్ల సొమ్మును బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు, అసభ్యకర చిత్రాల ప్రదర్శనలతో సమాజాన్ని కలుషితం చేసి డబ్బు సంపాదించాలని చూసేవాళ్ళు కొందరు, ఇతరులను దౌర్జన్యం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు కొందరు, ప్రజల ఆరోగ్యాన్ని హరించే విధంగా మద్యాన్ని అమ్మి డబ్బు సంపాదించేవాళ్ళు కొందరు....ఇలా ఎన్నో రకాల అవినీతి పనులతో ..ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువయ్యారు.

    వీటన్నింటికీ కారణం నైతికవిలువలంటే భయం లేకపోవటం.ఈ పరిస్థితి మారాలని ఆశిద్దామండి.


    ReplyDelete