koodali

Friday, November 28, 2014

భగవద్గీత గురించి కొన్ని విమర్శలు..నా అభిప్రాయాలు.

వాళ్ళ అభిప్రాయాలు....  గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందని కదా అంటారు?

anrd.. గీత అహింస,వైరాగ్యాలు ఉపదేశిస్తుందన్నది నిజమే. సమాజానికి చెడు చేసేవాళ్ళను శిక్షించటం కూడా అహింస క్రిందకే  వస్తుంది.
కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలంటే .. వైరాగ్యమూ అవసరమే. 

వాళ్ళ అభిప్రాయాలు.. (గీత 2/23) (ఆత్మను అస్త్ర - శస్త్రాలు ఏమీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు) అని ఆలోచించి, ఎవరినైనా గండ్రగొడ్డలితో ఒక మాంచి దెబ్బ వేస్తే ఏం?’ తర్వాత వాళ్ళ బంధువులు  ఏడ్వడం మొదలు పెడితే .. 


ఏడుస్తున్నారెందుకు?’ (గీత 2/22) (మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్నివదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.) - అని అంటే!


anrd..మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్ని వదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.. ఇలాంటి వాక్యాలు..జీవితంలో ధర్మయుద్ధం చేయటానికి భయపడినప్పుడు , ఆప్తులు మరణించినప్పుడు.. ధైర్యాన్నికలగజేస్తాయి.


 ధర్మయుద్ధం చేయటానికి వెనుకంజవేస్తున్న అర్జునునికి ధైర్యం చెప్పటానికి కృష్ణుడు ఇవన్నీ చెప్పారు. అంతేకానీ, ఎవరినిపడితే వారిని చంపి పైవాక్యాలు అనాలన్నది కృష్ణుని ఉద్దేశం కాదు. 


వాళ్ళ అభిప్రాయాలు.. గీత పదును కూడా ఎక్కిందంటే ప్రతి ఊరూ కురుక్షేత్రం అయిపోతుంది. అందుకే నేను చేతులు జోడించి ఉడుకు రక్తంలో గీత చదవ వద్దు బాబూ, అంటాను.


anrd.. గీతోపదేశం విన్నతర్వాత ప్రతి ఊరూ కురుక్షేత్రం ఎందుకు అవుతుంది ? కృష్ణుడు చెప్పింది  ధర్మయుద్ధం చేయమని మాత్రమే. ఊరకనే ప్రజలు ఈటెలు, బల్లేలు బయటికి తీయమని  కాదు.


వాళ్ళ  అభిప్రాయాలు.. ‘అర్జునా!..ఇంత జ్ఞానం నేను ఇచ్చిన తర్వాత శరీరం నశ్వరమని, ప్రపంచం క్షణభంగురమని ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవి. రాజ్యకాంక్ష వదిలేసేయి.... ఈ మాటలేవీ ఆయన అనలేదు.


anrd..అసూయాపరుడైన దుర్యోధనుడు మాయాపాచికల  సాయంతో  పాండవులను ఓడించి  అడవులకు  పంపించాడు. అలాంటి దుర్యోధనుడుకి రాజ్యాన్ని వదిలి పాండవులు యుద్ధం చేయకుండా ఒక మూల కూర్చోవాలనటం  ఏం న్యాయం? ఇది న్యాయం కాదు కాబట్టే దుష్టుడైన  దుర్యోధనుని శిక్షించటానికి  యుద్ధం చేయాలని కృష్ణుడు అర్జునుని అనేక విధాలుగా ప్రోత్సహించాడు. 


 వాళ్ళ అభిప్రాయాలు.. జీవుడు నశించనప్పుడు హత్య చేసిన వాడికి ఉరిశిక్ష ఎందుకివ్వాలి?


anrd..  జీవునికి మరలమరల జన్మలను ధరించే అవకాశం ఉంది కాబట్టి, జీవుడు ఎప్పుడూ నశించడనేది వాస్తవమే. అలాగని జీవించి ఉన్నవారిని హత్యచేసే వాళ్ళను శిక్షించకుండా ఊరుకోవాలా?    


వాళ్ళ అభిప్రాయాలు.. కృష్ణుడు ఒకచోటనేమో ఇలా ఉపదేశిస్తున్నాడు --(గీత. 14/24) (సుఖదుఃఖాలను సమానంగా భావించి, ఆత్మస్థుడై ఉంటూ మట్టి గడ్డను, రాతిని, బంగారాన్ని, ఒకటిగానే ఎంచుతూ, ఇష్టానిష్టాలను, నిందాస్తుతులను సమభావంతో ఎవడు స్వీకరిస్తాడో వాడే ధీరుడు).ఒకసారి అనాసక్త కర్మను ఉపదేశిస్తాడు - (గీత 2/38) (సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను, సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడవు కా. దీనివల్ల నీకు పాపమంటదు)తర్వాత గెలుపు ఆశ కూడా చూపుతాడు -(గీత 11/33) (కాబట్టి అర్జునా, లే, యశస్సు పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు) ఇక నీవే చెప్పు, సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్నీ సమానమైనప్పుడు భగవానుడు జయము, కీర్తి, వీటి ఆశ ఎందుకు చూపుతున్నాడు?


 భగవానుడంటాడు -  (గీత 18/61) (ఈశ్వరుడే సర్వప్రాణుల హృదయాల్లో నెలకొని తన మాయ ప్రభావంతో వానిని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు.) ఈ మాటే నిజమైతే ఇంత అయోమయం సృష్టించవలసిన పనే ముంది? నేరుగా తన యంత్రమే తిప్పేస్తే సరిపోయేదికదా! .. తర్వాత మళ్ళీ ‘యథేచ్చసి తథా కురు’ (గీత 18/63) (నీ కోరిక ఎలా ఉంటే అలా చెయ్యి) అనే మాట ఎందుకంటాడు?


 కృష్ణుడు ఇలా ఎందుకన్నాడు -(అన్ని ధర్మాలు (కర్తవ్య కర్మలు) వదలి పెట్టి నా ఒక్కని శరణు పొందు. నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను).ఈ మాటే చెప్పదలచుకొని ఉంటే, ఏడు వందల శ్లోకాల అవసరం ఏముంది? 


anrd..చదవటానికి ఇష్టపడని పిల్లవానికి తల్లి ఎన్నో విధాలుగా నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది. చదువు  ప్రాదాన్యత గురించి కాసేపు బుజ్జగించి చెబుతుంది. చదువుకుంటే జీవితంలో ఎన్నో సుఖాలు లభిస్తాయని ఆశ పెడుతుంది. చదువుకోకుంటే కష్టాలు వస్తాయని భయపెడుతుంది. చదువుకోవటం  విద్యార్ధి ధర్మం కాబట్టి తప్పక చదవాలని బోధిస్తుంది. చదువులో అర్ధం కాని ప్రశ్నలు ఉంటే తనను సాయం అడిగితే (శరణు కోరటం) అర్ధం అయ్యేటట్లు చెప్పి పరీక్షలో పాసయ్యేటట్లు  చేస్తానని  అభయమిస్తుంది. చదువుతావో..చదవవో ఇక నీ ఇష్టం అనీ అంటుంది. 


జగన్నాటకం అనే ఆట లేకపోతే సృష్టి జడంగా ఉంటుంది కాబట్టి , తన మాయాప్రభావంతో జీవులను సృష్టించి జగన్నాటకాన్ని ఆడిస్తారు దైవం. 


జీవికి ఒక జన్మను ఇచ్చి భూమికి పంపుతారు.పుట్టినతరువాత చాలామంది అంతులేని కోరికలతో ఎన్నో కర్మలు చేస్తారు...చేసిన పాపపుణ్య కర్మల ఫలితంగా కష్టసుఖాలను అనుభవిస్తూ, తిరిగితిరిగి జన్మలను పొందుతూ  ఉంటారు.మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాల ప్రకారం జన్మలను ఇస్తూ..దైవం తన మాయ ప్రభావంతో జీవులను కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నారు.


 నిష్కామకర్మను ఆచరిస్తూ జీవించేవారికి పాపపుణ్యాల కర్మబంధం నుండి విముక్తి కలిగి, జన్మపరంపరనుండి విడుదల లభించి పరమపదాన్ని పొంది హాయిగా ఉంటారు.


వాళ్ళ అభిప్రాయాలు..  కృష్ణుడు మనసుకు ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాడు -- క్షత్రియుడివి. కనుక యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకపోతే నిందల పాలవుతారు. కాబట్టి యుద్ధం చెయ్యి.’


 anrd..క్షత్రియుని స్వధర్మంలో యుద్ధం చేయటమూ ఒక భాగమే. రాజ్యాన్ని పాలించటమూ, కోల్పోయిన  రాజ్యం కోసం యుద్ధం చేయటమూ క్షత్రియులకు ధర్మమే.


 పాండవులకు అధికారదాహం  ఏమీ లేదు. పాండవులకు అధికారదాహమే ఉంటే గంధర్వుల  నుంచి దుర్యోధనాధులను రక్షించకుండా ఉపేక్షించి మొత్తం రాజ్యాన్ని ఏలుకునేవారు. కానీ పాండవులు  అలా చేయలేదు. గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నప్పుడు పాండవులే దుర్యోధనాదులను  రక్షించారు.


దుర్యోధనుడు అసూయతో  చిన్నతనం నుండి పాండవులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. లక్క ఇంటిలో  చంపటానికీ ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల పాండు రాజే రాజ్యాన్ని సంరక్షించేవాడు. అయినా పాండవులు, మొత్తంరాజ్యాన్ని ఆశించలేదు. 


 అయిదు  ఊళ్ళు ఇస్తే చాలన్నా ఒప్పుకోకుండా, దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.  దుర్యోధనుని అధికారదాహం, అసూయ వల్ల భారతయుద్ధంలో ఎందరో సైనికులు  మరణించారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.


వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు అర్జునికేమో ఇలా ఉపదేశిస్తాడు -(గీత 2/11) (జ్ఞానులయిన వారు మరణించిన వారిని గురించిగానీ, జీవించి ఉన్న వారిని గురించిగానీ శోకించరు). కానీ, అభిమన్యుని చంపినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ మాయమై పోయింది? -- 


anrd.. నిజమే, అభిమన్యుని చంపినప్పుడు  అర్జునుడు  శోకించాడు.ఎంత జ్ఞానం తెలుసుకున్నా మనిషిగా జన్మను ఎత్తిన తరువాత ఎంతటివాళ్ళైనా కూడా మానవుల వలెనే భావాలను ప్రకటించటం కనిపిస్తుంది.


వాళ్ళ అభిప్రాయాలు..  జయద్రథునితో పగ సాధించడానికి అంత మాయోపాయం ఎందుకు చేయవలసి వచ్చింది?


 anrd.. జీవితంలో స్వధర్మాన్ని ఆచరించే సమయంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు వేయవలసిన పరిస్థితులూ ఎదురయ్యే అవకాశం ఉంది.అలాంటప్పుడు  ఉపాయంగా ధర్మరక్షణ చేయవలసి  ఉంటుంది.


వాళ్ళ  అభిప్రాయాలు..  కృష్ణుడంటాడు - (గీత. 2/55) (ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు) అలాంటప్పుడు రాజ్యం, స్వర్గం, వీటి ఆశ చూపుతూ ఇలా ఎందుకన్నాడు?-(అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెంటికి అతని పాడు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే! )

anrd..  యుద్ధం చేయటం అర్జునుని కర్తవ్యం. రాజ్యాన్ని స్వార్ధపరుల చేతుల్లో నుంచి రక్షించే బాధ్యత అతనిపై ఉంది.స్వార్ధము, కోరిక, సంతోషము, భయము, ఆశ, బంధుప్రీతి ..లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవారు స్థితప్రజ్ఞులు... ఒక న్యాయమూర్తి తీర్పును ఇచ్చేటప్పుడు మిత్రులు,శత్రువులు.. అనే తేడా ఉండకూడదు.


బంధుప్రీతి వల్ల అర్జునుడు యుద్ధాన్ని చేయకపోతే, దుర్యోధనుని వంటి స్వార్ధపరుల వల్ల రాజ్యంలోని ప్రజలూ కష్టాలను అనుభవిస్తారు. ఇలాంటప్పుడు అర్జునునికి స్వర్గాశ చూపించి అయినా ధర్మయుద్ధం చేయించాలని  కృష్ణుడు అలా అని ఉండవచ్చు.


వాళ్ళ అభిప్రాయాలు..కృష్ణుడు తాను మాత్రం జరాసంధునితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు!


anrd..  ప్రతి వారిని శిక్షించటానికి ఒక సమయం  ఉంటుంది. తప్పుచేసిన వారిని వెంటనే శిక్షించరు. వాళ్ళు మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు. అప్పటికీ మారకపోతే ఇక తప్పక శిక్షిస్తారు. జరాసంధుని కొంతకాలం వదలటానికి కారణం అప్పటికి  అతని పాపం పండలేదు.  


వాళ్ళ అభిప్రాయాలు.. అర్జునుడు తర్కం శాస్త్రం చదవలేదు. అందుకే రెండు విధాలా ఉచ్చులో చిక్కుకున్నాడు. నేనుండి ఉంటే అడిగేవాణ్ణి. ‘హే కృపాసింధు, ఈ రెండూ కాక మరో పరిణామం కూడా జరగవచ్చు కదా! అర్జునుణ్ణి పట్టి బంధిస్తే అప్పుడు మరి ఎలా? స్వర్గమూ ఉండదు, రాజ్యమూ ఉండదు కదా! రెంటికీ చెడ్డ రేవడై పోయినట్లే కదా!’


anrd..అర్జునుడు రెంటికీ చెడ్డ రేవడి ఎందుకవుతాడు? బంధితులు ఎవరైనా సరే, కలకాలం అలా బంధితులుగానే జీవిస్తూ ఉండిపోరు కదా! యుద్ధం చేస్తూ పట్టుబడి బంధితుడుగా మరణించితే  స్వర్గం  లభిస్తుంది. బంధనాలనుంచి తప్పించుకుని మరల యుద్ధం చేస్తే రాజ్యం లభించే అవకాశమూ  ఉంది..

వాళ్ళ అభిప్రాయాలు..అంత భయంకరమైన యుద్ధం జరగబోయేముందు పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి తీరిక ఎవరికి వుంది? అంతవరకు పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం త్రాటక ముద్రలో కుంభక ప్రాణాయామం చేస్తూ వుందా? సంజయుని కళ్లల్లో టెలివిజన్ ఫిట్ అయి ఉందా? 

anrd.. పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి  ఎక్కువ  సమయం  అవసరం లేదు. అంతా తృటిలో జరిగిపోతుంది దైవం తలచుకుంటే.


సంజయునికి దైవం ప్రసాదించిన దూరదృష్టికి నేటికాలంలో టీవీల ద్వారా చూస్తున్న దూరదృష్టికి  పొంతన లేనేలేదు. భౌతికశక్తి ద్వారా  పొందేదానికీ..ఆధ్యాత్మికశక్తి ద్వారా పొందే దానికి ఎంతో తేడా ఉంది.


 కృష్డుడు అర్జునునకు గీతను బోధించటం ఎలా జరిగింది? సంజయుడి దూరదృష్టి ఎలాంటిది ? అనే  విషయాలను కొద్దిగానైనా తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా తెలుసుకోవలసిందే.కేవల  భౌతికవాదులకు అవి ఎప్పటికీ అంతుబట్టని విషయాలే.   

 ...........

 వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 
...............

anrd..  ఎంతో తెలివిగలవాళ్ళమనుకునే వాళ్ళు కూడా, తమ చేతిలో ఏమీ లేదనీ, దైవమే అత్యంత శక్తివంతుడని ఎప్పటికో ఒకప్పటికి తెలుసుకుంటారు. ఇలా తెలుసుకోవటానికి కొందరికి కొన్నిజన్మలు  కూడా పట్టవచ్చు. ఎవరికైనా చివరికి తెలిసిదేమిటంటే, భగవంతుని శరణువేడటం తప్ప  వేరే మార్గం లేదని.


Wednesday, November 26, 2014

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు..

 వాళ్ళ అభిప్రాయాలు.. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? 

anrd.. ధర్మరాజు తనకు తానై వెళ్ళలేదు. దుర్యోధనుడు కోరగా, ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు పెడతాడు పాచికలాటకు రమ్మని. పెద్దలమాట తిరస్కరించటం ఇష్టంలేని  ధర్మరాజు పాచికలాట ఆడటానికి వచ్చి ఆ ఆటలో మునిగిపోయి కుటుంబ సభ్యులను, రాజ్యాన్ని కూడా ఓడిపోయి, వనవాసం  చేస్తూ కష్టపడవలసి వచ్చింది. 


 నీతి..ఇలాంటి విషయాలలో పెద్దవాళ్ళు ఆహ్వానించినా సరే వెళ్ళకుండా ఉండటమే మంచిది.


 వాళ్ళ అభిప్రాయాలు..వారి తల్లి కుంతి ఆజ్ఞ కదా,‘ఐదుగురూ సమానంగా పంచుకొండి’అని. మర్యాదస్తుల పద్ధతి ఇదేనా? అందుకే గదా, ఒకసారి కర్ణుడు నిండు సభలో.. (కురునందనా! స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు నిర్దేశించారు. కాని, ఈమె అనేకుల వశవర్తిని. కాబట్టి ఖచ్చితంగా ఉంపుడు కత్తే!)..అని అన్నాడు


anrd..ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండటం వెనుక అనేక కారణాలున్నాయి, వాటికి అనేక  అంతరార్ధాలూ ఉన్నాయి. ఆ కారణాలను, అంతరార్ధాలనూ అలా ఉంచి, పైకి  తెలుస్తున్న  విషయాలను బట్టి గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.


ఒక సంసారం ఉంటేనే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎక్కువ సంసారాలు ఉంటే మరిన్ని ఎక్కువ  బాధ్యతలను నెత్తిన వేసుకోవలసి వస్తుంది.ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త వద్ద ఉండేలా  ఏర్పాటు జరిగింది.ఒక భర్త వద్ద ఉన్నప్పుడు మిగతా భర్తల సేవ కుదరదు కదా!ఇలాంటప్పుడు ఎన్నో  చిత్రమైన సమస్యలు ఎదురవుతాయి.ఇలాంటి సందర్భంలోనే అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం, సుభద్రతో వివాహం జరగటం జరిగాయి.    


నీతి: ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఎక్కువ  బాధ్యతలు, ఎక్కువ కష్టాలు వస్తాయి. అందుకే స్త్రీలైనా, పురుషులైనా ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు.


వాళ్ళ అభిప్రాయాలు..ఇటు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతూంటే అటు పాండవులు సభలో కిమ్మనకుండా కూర్చున్నారు!వాళ్ళలో పౌరుషమంటూ లేకపోయింది! 


anrd..ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఫలితంగా దుర్యోధనుడు అతని సోదరులు నాశనమై  పోయారు. ఈ సంఘటన ద్వారా ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలుసుకోవచ్చు.

పాచికలాటలో ఓడిపోయారు కాబట్టి పాండవులు మౌనంగా ఉండిపోయారు. ద్రౌపదిని పణంగా పెట్టడం తప్పే...పాండవులు కూడా జీవితంలో ఏమాత్రం సుఖపడ్డారు ?

వాళ్ళ  అభిప్రాయాలు.. పాండవుల తండ్రి పాండురాజు .. సంతానోత్పత్తి చేయడంలో అసమర్థుడు. అందువల్ల ఐదుగురు దేవతల ఆవాహన చేసి పాండవులు జన్మించేట్లు చేయడం జరిగింది. అరే, దీనికంటే పాండురాజు నిస్సంతుగా మరణించినా బాగుండేది. ఎవరికి వందమంది అన్న కుమారులున్నారో, అతడికి వంశం ఇంకా వృద్ధిచేసుకోవాలని అంత ఆరాటం ఎందుకుండాలి? అది కూడా ఇతరుల భరోసాతో! 


anrd.. వారసులు కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. పాండురాజు ఆలోచన వల్ల కుంతికి,మాద్రికి  సంతానం కలిగారు..ఈ రోజుల్లో కూడా సంతానం లేని దంపతులు కొందరు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ మరియు స్పెర్మ్ బ్యాంక్ సాయంతో సంతానాన్ని  పొందుతున్నారు కదా! పాండుపుత్రుల  విషయంలో దేవతలే సంతానాన్ని ప్రసాదించారు. ఎన్నో మహిమలు కలిగిన దేవతల ద్వారా సంతానాన్ని పొందటమంటే అది మానవుల విషయంలో వలె ఉండదని మనం గ్రహించాలి.

  
వాళ్ళ అభిప్రాయాలు.. పాండురాజు కూడా ఒకవేళ భీష్ముని లాగా సంతృప్తిపడి ఉంటే, సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుని పుత్రులు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవారు.  

anrd..దుర్యోధనుడు కూడా మొత్తం రాజ్యం తనకే కావాలని అత్యాశకు పోకుండా పాండవులకు  అర్ధరాజ్యం ఇచ్చినా కూడా సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు కదా ! ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల రాజ్యాన్ని పాలించలేడు కాబట్టి, పాండురాజే రాజ్యం యొక్క  బాగోగులు చూస్తూ ఎంతో అభివృద్ధి  చేసాడు. అందుకోసం అయినా పాండవులకు  రాజ్యంలో వాటా ఇవ్వాలి. 


వాళ్ళ  అభిప్రాయాలు.. జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు ఊరక పక్కన కూర్చోవలసింది. అప్పుడు కూడా సింహాసనం కావాలనుకోవడం, ఇదెక్కడి న్యాయం ..


anrd..పందెంలో అనుకున్నట్లు  అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన  తరువాతే  పాండవులు తమ రాజ్యాన్ని అడిగారు. ఇందులో  అన్యాయం  ఏముంది ?


 వాళ్ళ  అభిప్రాయాలు..కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు.. వీరందరి వధ ధర్మవిరుద్ధంగానే జరిగింది.


anrd..కర్ణుడు,జయద్రథుడు..అధర్మప్రవర్తనలో దుర్యోధనునికి సహకరించారు. ద్రోణుడు, భీష్ముడు వంటి  వీరుల వల్ల దుర్యోధనుని బలం పెరుగుతుంది.దుర్యోధనుని వంటి అసూయాపరుడు, అత్యాశ గలవాళ్ళ  బలం  పెరగటం  సమాజానికి  మంచిది కాదు. దుష్టుని  బలం పెరగటానికి కారణమవటం వల్ల భీష్ముని, ద్రోణుని సంహరించవలసి వచ్చింది. 


నీతి:చెడ్దవాళ్ళ ప్రక్కన ఉంటే , మంచి  వారికీ  కష్టాలు తప్పవని  పెద్దలు తెలియజేసారు . 


వాళ్ళ  అభిప్రాయాలు.. దుశ్శాసనుడు ఒకే ఒక చీరను అపహరిస్తే దానిపైన మహాభారత యుద్ధం చెలరేగింది. శ్రీకృష్ణుడు అంత వస్త్రాపహరణ చేస్తే అది విశుద్ధ భాగవతమై కూర్చుంది. 


anrd.. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను దాచింది చిన్నతనంలో. ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణకు, కృష్ణుడు గోపికల వస్త్రాలను చెట్టు మీద పెట్టడానికి చాలా తేడా ఉంది.


వాళ్ళ  అభిప్రాయాలు.. కృష్ణుని భార్యలను కూడా చివర్లో దొంగలు.. కొల్లగొట్టి తీసుకుపోయారు. (దేవీ భాగవతం . 2/7) (కృష్ణావతారానంతరం అర్జునుడు కృష్ణుని భార్యలను ద్వారక నుండి హస్తినాపురం తీసుకుపోతున్న సమయంలో దారిలో దొంగలు.. వారి ధనాన్నే కాక, కృష్ణుని భార్యలను కూడా అపహరించి తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ సంరక్షకుడు అర్జునుడు అసహాయుడై చూస్తూ ఉండిపోయాడు!)


anrd..కృష్ణావతారానంతరం కృష్ణుని అష్టభార్యలు కూడా అవతారాన్ని చాలించారని  అంటారు. ఈ అష్టభార్యలు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల అవతారాలు కావచ్చని నా అభిప్రాయం.


ఇక,దొంగలు అపహరించి తీసుకుపోయినట్లుగా చెప్పబడినవారు కృష్ణుని 16 వేలమంది భార్యలు. వీరి  గురించి అనేక కధనాలు,అంతరార్ధాలు ఉన్నాయి.ఒక కధనం ప్రకారం ఈ 16వేల మంది భార్యలు దేవలోకంలోని అప్సరసలు.ఒకప్పుడు నరనారాయణులు  తపస్సు  చేసుకుంటుండగా ఈ అప్సరసలు వారి వద్దకు వెళ్ళారు. 


ఏదైనా వరం కోరుకోమని నారాయణుడు  అనగా,తమను భార్యలుగా స్వీకరించమని నారాయణుడిని వరమడిగారు. ఆ జన్మలో కాకుండా  శ్రీకృష్ణావతారంలో వారి కోరిక తీరగలదని నారాయణుడు తెలియజేసాడు.అలా అనుకోకుండా  వారిని భార్యలుగా స్వీకరించవలసి వచ్చింది నారాయణుడికి(శ్రీకృష్ణుడికి.) 


వరం కోరుకొమ్మని అప్సరసలతో అని కష్టాలలో ఇరుక్కున్నాను ..అలా  అనకుండా మౌనంగా ఉంటే బాగుండేదని నారాయణుడు అనుకుంటారు. తపస్సు చేసుకుంటున్న వ్యక్తిని కోరరాని వరాలను కోరి ఇబ్బందిపెట్టటం సరైనది కాదు కదా !


వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అన్నదమ్ములకు, దగ్గరి బంధువులకు మధ్య విరోధం పుట్టించి, ఒకరినొకరు చంపుకొనేట్లు చేసి భూభారం తగ్గించాడని పురాణం చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణం. కాని, ..  ఆయన యదువంశం కూడా అదే విధంగా నశించిపోయింది. 


anrd..భూభారాన్ని తగ్గించటం కోసం ఒక ప్రణాళికప్రకారం శ్రీకృష్ణ జననం  జరిగింది.  ఆదిపరాశక్తిఅయినపరమాత్మ ఈ ప్రణాళికను రచించారు. శ్రీకృష్ణునికి ధర్మాన్ని నిలబెట్టటం ముఖ్యం. ఆ విషయంలో తన,పర భేధాలను లెక్క  జేయరు.యదువంశం కూడా చాలావరకూ క్షీణించినా కృష్ణుడు పట్టించుకోలేదు.

యాదవులు  సురాపానమత్తులో మహర్షిని అవమానించి శాపానికి గురయ్యారు. 

నీతి: తప్పుచేస్తే ఎంతటివారైనా సరే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని మనం  తెలుసుకోవచ్చు.


వాళ్ళ  అభిప్రాయాలు.. (ఓ సుందరీ! ఉద్దాలకుని పుత్రుడు శ్వతకేతు ద్వారా ఇది ధర్మసమ్మతంగా చెప్పబడింది...) ఆ రోజుల్లో నియోగం ఆచారంగా ఉండేది.


anrd..పరస్త్రీని తల్లిగా భావించాలని పెద్దలు తెలియజేసిన సంస్కృతిలో..

   పుత్రప్రాప్తి కోసం పర స్త్రీ పురుషుడు సంగమించడం శాస్త్రసమ్మతం కాదు.

తెలిసికానీ, తెలియకకానీ..కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తులు సనాతనధర్మాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా సమాజంలో కొన్ని చెడ్డ ఆచారాలను ప్రవేశపెట్టారు.( అయితే,ఆ ఆచారాలను  తరువాతి తరం వాళ్ళు తొలగించారు.) 


సనాతనధర్మాన్ని  సరిగ్గా అర్ధం చేసుకోని వ్యక్తులలో గొప్పవాళ్ళు కూడా ఉండవచ్చు. గొప్పవాళ్ళైనంత మాత్రాన వాళ్ళు చేసిన అధర్మపు పనులు ధర్మబద్ధమైపోవని పర్యవసానాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.


వాళ్ళ  అభిప్రాయాలు..(అహల్య, ద్రౌపదీ తార, కుంతి, మండోదరి ఈ పంచకన్యలను నిత్యం స్మరించినవారి పాపాలన్నీ నశించిపోతాయి.) - ..  పంచ కన్యలని ఎందుకంటున్నావు? వీళ్ళను ప్రాతఃస్మరణీయులని ఎందుకు చెప్తున్నావు? 


anrd...ఈ సంఘటనల  వెనుక అనేక  కారణాలున్నాయి, వాటికి అనేక అంతరార్ధాలూ  ఉన్నాయి. ఆ కాలంలో పతివ్రతలను కన్య అనే సంభోదనతో గౌరవించే వారని నా అభిప్రాయం.

( ఈ సంఘటనలగురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవవచ్చు.ఈ గ్రంధానికి కాపీరైట్స్ ఉన్నాయి.) 

ఇందులో అహల్య తప్పేమీ లేదు.అహల్య భర్త అయిన గౌతముని వేషం ధరించి వచ్చాడు ఇంద్రుడు.తరువాత ఏం జరిగిందో చాలామందికి తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలంటే.. శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవగలరు .


కుంతిని సంతానం పొందమని కోరినది ఆమె భర్త అయిన పాండురాజే.(ఈ రోజుల్లో  కూడా సంతానం లేని కొందరు దంపతులు టెస్ట్ట్యూబ్ మరియు స్పెర్మ్ బ్యాంక్   సాయంతో  సంతానాన్ని పొందుతున్నారు కదా! )..ద్రౌపది అయిదుగురిని వివాహం చేసుకోవటానికి వెనుక అనేక కారణాలున్నాయి. కుంతీదేవి ఆజ్ఞ కూడా ఒక కారణం.   


వాళ్ళ  అభిప్రాయాలు.. శకుంతల, దమయంతి సంగతి ...


anrd..శకుంతల, దమయంతి కధల నుంచి ఎన్నో విషయాలను  తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళకు  తెలియకుండా గాంధర్వ వివాహం లాంటివి  చేసుకుంటే ఆనక ఆ పురుషుడు మోసం చేస్తే  ఎలాంటి  పరిస్థితి వచ్చే అవకాశముందో శకుంతల కధ ద్వారా టీనేజీ అమ్మాయిలు తెలుసుకోవచ్చు.


వ్యసనాలు కలిగిన భర్త ఉంటే ఏర్పడే సంక్లిష్ట పరిస్థితిలో కూడా సమస్యను ఎదుర్కోవటాన్ని  దమయంతి కధ ద్వారా తెలుసుకోవచ్చు.


 శకుంతల, కుంతి యొక్క కధల  ద్వారా టీనేజ్  పిల్లలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలి.  వివాహానికి  ముందే  సంతానాన్ని పొందితే  ఎన్నికష్టాలు వస్తాయో వీరి  కధల  ద్వారా  పెద్దలు తెలియజేసారు. ఇలాంటి జాగ్రత్తలను పిల్లలకు చెప్పాలంటే తల్లితండ్రులకు మొహమాటం అడ్డువస్తుంది. పురాణేతిహాసాల ద్వారా  మానవబలాలనూ, బలహీనతలను  మరియు లోకంలోని రకరకాల సంఘటనలను తెలుసుకుని జాగ్రత్తపడవచ్చు. 


వాళ్ళ  అభిప్రాయాలు..శర్మిష్ఠ, దేవయాని పరాచికాలాడడంలో ఆధునిక యుగాన్ని కూడా హీనపరిచి వెళ్ళారు. 

anrd..దేవయాని, శర్మిష్ఠ పట్టుదలలకు  పోకుండా ఉంటే బాగుండేది. పెద్దవాళ్ళ  పంతాలు, పట్టుదలల ప్రభావం వారి సంతానంపై కూడా పడింది.


వాళ్ళ  అభిప్రాయాలు.. వ్యాసుని వల్ల పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించారు. నియోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకుందట. కాబట్టి ఆమెకు జన్మాంధుడైన పుత్రుడు కలిగాడు.


anrd..వ్యాసుని ద్వారా అంబికా,అంబాలికలకు  జన్మించిన సంతానాన్ని గమనిస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. సంతానాన్ని పొందే విషయంలో జీవులు చేసిన పాపపుణ్యాల ప్రాధాన్యత ఉంటుంది. దానితో పాటూ స్త్రీ పురుషుల మనో భావాలకు గల ప్రాధాన్యతను కూడా గమనించవచ్చు. 


ఇలాంటి విషయాలను మనకు తెలియజేయటానికి వ్యాసునిద్వారా  ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన  సంఘటనను ప్రాచీనులు మనకు తెలియజేసారేమో.

ఇష్టంలేక కళ్ళు మూసుకున్న అంబికకు  గ్రుడ్డివాడైన  ధృతరాష్ట్రుడు  జన్మించాడు. భయంతో పాలిపోయిన అంబాలికకు పాండురాజు జన్మించాడు.  వ్యతిరేకత లేక  ఉన్న దాసివల్ల మంచివాడైన విదురుడు జన్మించాడు. అంబిక,అంబాలికలకు సంతానం  కలిగించే  విషయంలో వ్యాసునికి కూడా వ్యతిరేకత ఉండి ఉంటుంది . ఆధునికవిజ్ఞానం కూడా  స్త్రీపురుషుల మానసికభావాల యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. 


గర్భాన్నిధరించాలనుకునే స్త్రీ మరియు గర్భవతి అయిన స్త్రీ మంచి ఆలోచనలను చేయటం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల చక్కటి పిల్లలు పుడతారంటారు.చెడ్డ విషయాలను వినకూడదని,భయపడకూడదనీ అంటారు. (అందువల్లనే కాబోలు, మొదటిసారి గర్భవతి అయిన స్త్రీని  అత్తింటివారి సాధింపులకు  దూరంగా కొంతకాలం  పుట్టింటికి పంపే పద్ధతి కూడా ఉంది కదా !) 


ఇంకొకవిషయమేమిటంటే, వ్యాసుడు స్త్రీసంయోగం లేకుండానే సంతానాన్ని  పొందగలిగిన  మహిమగలవాడు .

 ఉదా..వ్యాసపుత్రుడైన శుకుడు అయోనిజుడిగా జన్మించాడు..( స్త్రీపురుష  సంబంధం లేకుండానే సంతానాన్ని పొందవచ్చని ఆధునిక పరిశోధనల ద్వారా కూడా తెలుస్తోంది.)


 వాళ్ళ  అభిప్రాయాలు..అంత పెద్ద జ్ఞాని అయి కూడా వ్యాసుడు వ్యభిచారకర్మకు ఎందుకు సిద్ధపడ్డాడు? వ్యభిచార పర్యవసానం మంచిగా ఉండదు. వ్యాసునికి కూడా తర్వాత పశ్చాత్తాపం కలిగింది - (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)


anrd... (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)..అని వ్యాసుల వారే అనుకున్నారు కదా! ఇంకా ఇందులో మనం తప్పుపట్టవలసింది ఏముంది?


తల్లిసత్యవతి ఆజ్ఞ కాదనలేక తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు..అంబిక, అంబాలికలకు  సంతానాన్ని ప్రసాదించారు. పర్యవసానాన్ని గమనించితే.. వ్యాసుని వల్ల జన్మించిన ధృతరాష్ట్రుని వారసులైన దుర్యోధనాదులు భారతయుద్ధంలో  మరణించారు. 


నీతి: పెద్దవాళ్ళు ఆదేశించారు కదా అని అధర్మకర్మలను ఆచరించితే, పర్యవసానం సరిగ్గా  ఉండదని తెలుసుకోవచ్చు.అధర్మకర్మలను పెద్దవాళ్ళే ఆచరించమని ఆదేశించినా ఆచరించకూడదు.

............. 
anrd.. మహాభారతంలో లేనిది ప్రపంచంలోనే లేదు. పురాణేతిహాసాల ద్వారా ఎంతో  విజ్ఞానాన్ని ప్రాచీనులు మనకు  అందించారు. దేవతలు కూడా పాత్రధారులై నడిపించిన  జీవిత కధల  ద్వారా(పురాణేతిహాసాల ద్వారా) మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
 ఆసక్తి  ఉన్నవారు.. అయోజనిత్వం గురించి వివరాలున్న ఈ క్రింది  లింకును కూడా  చూడగలరు . 

Monday, November 24, 2014

రామాయణం గురించి కొందరి విమర్శలు, నా అభిప్రాయాలు..

 వాళ్ళ  అభిప్రాయాలు..అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? ఏ ఆడదాని ముక్కైనా కోసేసుకో. ఏ ఆడదాని పైనైనా బాణం వేయి. ఒక రకంగా చూస్తే స్త్రీని ఏడ్పించడంతోనే రాముని వీరత్వం మొదలయింది. దానితోనే ముగిసింది కూడా.

anrd..స్త్రీ  అయినంత మాత్రాన  ఎంత తప్పు చేసినా  శిక్షించకుండా  వదిలేయాలా?  తాటకి వంటి రాక్షసిని  వధించటంలో ఎటువంటి తప్పూ  లేదు. శూర్పణఖ  రామలక్ష్మణులను  మోహించి  వెంటపడింది.  సీతాదేవిని  మ్రింగివేయబోయింది.  అలాంటి  శూర్పణఖ  ముక్కుచెవులు  కోయటంలో తప్పేమీ  లేదు. తప్పుచేసినవాళ్ళు  స్త్రీలైనా  పురుషులైనా  శిక్షార్హులే.

.....................

వాళ్ళ  అభిప్రాయాలు..ప్రజలు ఏక కంఠంతో సీతను రాజ్యం నుండి బహిష్కరించమని అన్నారే అనుకో, అప్పుడు రాముని కర్తవ్యమేమిటి? మహారాణి నిర్దోషి అనీ, అగ్ని పరీక్షలో ఉత్తీర్ణురాలయిందనీ, ఆయనకు తెలిసినప్పుడు ప్రపంచం ఏమంటే ఏం? తన న్యాయం పైన గట్టిగా నిలబడి ఉండాలి కదా?


anrd.. సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే , వారిపై  నింద  వేయటం జరిగింది.


 సీత  యొక్క  పాతివ్రత్యం  గురించి  రామునికి  తెలుసు. అయితే, లోకులు  నోటికి  ఏది వస్తే  అది  అంటారు.  లోకుల బుద్ధి  తెలిసే  రాముడు  సీతకు  అగ్నిపరీక్ష  చేయించి  అయోధ్యకు  తీసుకువచ్చాడు. అయినా  తప్పుపట్టారు. ఎన్నోవిధాలుగా  ఆలోచించి   సీతను  అడవులకు  పంపించవలసివచ్చింది. 


 సీతమ్మను అడవులకు పంపించటం విషయంలో  గమనించవలసినది ఏమంటే , ఆ పామరుడు అలా అన్న తరువాత  రాములవారు భార్యను అడవులకు పంపించారు. 


( ఒక వ్యక్తి  యొక్క  భార్య  పరపురుషుని  ఇంటి  వద్ద  కొన్నాళ్ళు  ఉండివచ్చింది. అప్పుడు  ఆ వ్యక్తి  తన  భార్యను  నమ్మలేక  తాను  భార్యను  ఏలుకోలేను  అన్నాడు. అప్పుడు రాముని  ప్రసక్తి తీసుకువచ్చాడు .)ఇంకొక విషయాన్ని గమనించితే, సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకురమ్మని అప్పటి ప్రజలు రాముని ప్రాధేయపడినట్లు అనిపించటం లేదు..

ఈ విషయాన్ని గమనించితే, అప్పటి ప్రజలలో చాలామందికి రాముడు సీతాదేవిని ఏలుకోవటం నచ్చలేదేమో ? అనే సందేహం వస్తోంది.

 సీతాదేవిని అడవులకు పంపారని శ్రీ రాముని తప్పుపడుతున్నారు కొందరు.

 సీతాదేవిని ఏలుకున్నందుకు కూడా శ్రీ రాముని తప్పుపట్టారు  కొందరు. 

కొందరు లోకులు తమకు ఏది తోస్తే అది అంటారు.

ఎన్నో కారణాలు, ఎందరో చర్యల వల్ల సీతారాములు కష్టాలను అనుభవించారు.

సీతారాములు అవతారమూర్తులు.  

సీతారాములు  అయోధ్యకు తిరిగి వచ్చి  అన్యోన్యంగా ఉండటం అనేది సీతారాముల విషయంలో సరైనది. 

అయితే, మనుషుల విషయంలో అందరూ గొప్పవారు ఉండరు కదా!

 రకరకాల మనస్తత్వాలు గల స్త్రీలు, పురుషులు ఉంటారు. అనేక రకాల పరిస్థితులు ఉంటాయి. 

అలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని...

 భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాలను, సంతోషాలను త్యాగం చేసి ఉండవచ్చు.

 సీతాదేవి  అంటే  మహాపతివ్రత.  లక్ష్మీదేవి అంశావతారం.  అందరు  ఆడవాళ్ళూ  సీత వంటి గొప్పవారు కాదుకదా ! 


ఈ రోజుల్లో  కొందరు  ఆడవాళ్ళు  ఏమంటున్నారంటే, మగవాళ్ళు  పరస్త్రీలతో  తిరిగితే  తప్పులేనప్పుడు, తాము  పరపురుషులతో  తిరిగితే  తప్పేమిటని  ప్రశ్నిస్తున్నారు.


 పురుషులు  పరస్త్రీలతో  తిరగటమే  తప్పు అనుకుంటుంటే, ఆ విషయాన్ని  ప్రశ్నించటం  వదిలి.. తామూ  తిరుగుతామని  కొందరు  స్త్రీలు  అనటం న్యాయం  కాదుకదా ! 


 ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నప్పుడు, ధర్మసంకటం ఏర్పడినప్పుడు  ఎలాంటి నిర్ణయం  తీసుకోవాలి  అనే  విషయంలో  ఎన్నో  ఆలోచించవలసి  ఉంటుంది . 

 ఇవన్నీ  కూడా ఆలోచించి  పెద్దలు  త్యాగాలు  చేసి ఉండవచ్చు. 


 సీతారాములకు  ఒకరంటే  ఒకరికి  అపారమైన  ప్రేమ. సీతను  అడవికి  పంపించిన  తరువాత   రాముడు మళ్లీ  వివాహం  చేసుకోకుండా, రాజ్యాన్ని  పాలిస్తున్నా కూడా రాజభోగాలను, పట్టుపానుపులను వదిలి  దర్భలపై  శయనిస్తూ  ఒక రుషిలా  జీవించాడు. 


 అశ్వమేధయాగ సమయంలో భార్య స్థానంలో సీతాదేవి స్వర్ణప్రతిమను ఉంచి సీతాదేవే తన భార్య అని లోకానికి తెలియజేశాడు రాముడు.


ఒకవేళ  సీతాదేవి  తిరిగి  అయోధ్యకు వెళితే  మళ్ళీ  ఎవరైనా  వ్యక్తులు తమ  ఇష్టం  వచ్చినట్లు  వ్యాఖ్యానించరని  గ్యారంటీ  లేదు  కదా! అప్పుడు  సమస్య  మళ్ళీ  మొదలవుతుంది. ఇవన్నీ  ఆలోచించి సీతాదేవి  లవకుశులను రామునికి  అప్పగించి  తాను  భూప్రవేశం  చేసి ఉంటుంది.


సీతాదేవి  భూప్రవేశం  ఎంతో  బాధాకరమైన  విషయం. తన  భార్యను  తాను ఏలుకోలేని  పరిస్థితి  రామునిది  తన  ఇంటికి  తాను  వెళ్ళలేని  పరిస్థితి  సీతది. 


సీతాదేవి భూప్రవేశం  చేయకుండా వాల్మీకిమహర్షి  ఆశ్రమంలో  ఉన్నా  బాగుండేది.  లేకపోతే   ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్తే  బాగుండేది. స్త్రీ  కష్టాలలో  చిక్కుకుంటే  భర్తే  ఆదుకోవాలి.  లేకుంటే  ఆమె  తల్లిదండ్రులు గానీ  సోదరులు గానీ ఆదుకోవాలి. ఆమె పిల్లలు  పెద్దవాళ్ళయితే  వారు  చూసుకోవాలి.

 రాముడు  రాజు కాబట్టి  ఎన్నో విషయాల గురించి ఆలోచించి  సీతను అడవులకు  పంపించాడు.  రాముడు  ఒక  సాధారణ  మానవుడు  అయి ఉన్నట్లయితే , లోకం  ఏమన్నాకూడా   సీతను  తప్పక ఏలుకునేవాడని  నా అభిప్రాయం.


( రాముడు  సీతను  ఏమైనా  కోరిక  కోరుకోమని  అడిగితే, వనాలలో  ఉన్న  మున్యాశ్రమాలను  చూడాలని  ఉందనే  కోరికను  కోరిందట  సీతాదేవి. సీతను  అడవుల్లో  వదలలేదు.  వాల్మీకి  మహర్షి  వంటి  ఉత్తములైన  వారి  ఆశ్రమం  సమీపంలో  విడిచివచ్చారు. ఎంతైనా ఇలా జరగటం  అత్యంత  బాధాకరమే. ఇవన్నీ ఇలా జరగటానికి అనేక కారణాలున్నాయి .ఈ కధల  ద్వారా పెద్దలు రాబోయే తరాలకు  ఎన్నో విషయాలను నేర్పించారు .)       

.............

వాళ్ళ  అభిప్రాయాలు.. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే అనుమానం ఉంటే మళ్ళీ భరతుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి భార్యతో సహా అడవి మార్గం పట్టవలసింది! రామరాజు తన పతిధర్మం కోసం అయోధ్య సింహాసనాన్ని వదులుకోలేకపోయాడు. 


anrd..రాముడు  పతిధర్మం  కోసం  సింహాసనాన్ని  వదుకోలేకపోయాడని  అభాండాలు వేయటం  సరైనది  కాదు..భరతుడు రాజ్యాన్ని  ఏలటానికి ఇష్టపడలేదు.  సీతారాములు  ఎందరికో  స్పూర్తిని  కలిగించారు. ఇలాంటి  వారినుంచి  స్పూర్తిని  పొంది,  తరతరాల  నుండి  ఎందరో  వ్యక్తులు తమ  వ్యక్తిగత ఆశలను  కొంతైనా త్యాగం  చేసి  సమాజంలో  అధర్మం పెరగకుండా కృషి చేస్తున్నారు.  


 ఈ నాటికీ  ఎందరో  సైనికులు  దేశరక్షణ కోసం  తమ కుటుంబాలకు  దూరంగా  మంచు  కొండలలో  విధులను  నిర్వహిస్తున్నారు.  సైనికులు విధులకు  వెళ్ళినప్పుడు  వారి భార్యలు  భర్తలకు  దూరంగా  పిల్లాపాపలతో  జనారణ్యంలో ఒంటరిగా  జీవిస్తున్నారు. 


అధికారం కోసం కొన్నిదేశాల స్వార్ధపరులైన  పాలకులు  సాగించే  యుద్ధాలలో ఎందరో  సైనికులు  ప్రాణాలను  పోగొట్టుకుంటున్నారు. సైనికులు  తమ  కుటుంబాలకు  దూరంగా  ఉంటూ  దేశసరిహద్దులను  కాపలా  కాయకపోతే  దేశంలోని  ప్రజలు  సుఖంగా  కుటుంబాలతో  కలిసి  ఉండగలరా ? 

 పూర్వం రాజులు రాణులు  కూడా, ధర్మాన్ని  రక్షించటం  కోసం మరియు  తమ  రాజ్యప్రజలక్షేమంకోసం ..తమ సొంత క్షేమాన్ని, తమ సుఖసంతోషాలనూ కూడా అంతగా  లెక్కచేసేవారు కాదు. సీతారాములు  అలాంటి  త్యాగమూర్తులు.  

............
వాళ్ళ  అభిప్రాయాలు.. రాముడు ఎక్కువ కాలం...  నిషాదుడు, కేవటుడు, భిల్లిని, గద్ద, ఎలుగుబంటి, కోతి - వీరి మధ్యనే గదా ఉన్నాడు! మూర్ఖపు దాసి మాటలకు తండ్రి కొడుకుకు వనవాసం ఇచ్చాడు. ఈయన మతిలేని చాకలివాని మాటలకు భార్యకు వనవాసం ఇచ్చాడు. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం. ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు! (రాముని గూఢచారి). 

anrd.. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం.అనీ అంటారు. శూద్రుడైన  శంభూకుడిని చంపేసాడు.అనీ  అంటారు. రాముడు, శూద్రురాలైన  శబరిని  ఎంతో ఆదరించాడు . లోకానికి  చేటు తెచ్చే  కోరికలతో  తపస్సు  చేస్తుండటం వల్లనే  శంభూకుడిని  వధించాడు.

.............
వాళ్ళ  అభిప్రాయాలు..  వాలిని ఆ విధంగా చెట్టు చాటున దాక్కొని ఎందుకు చంపాడు? ఎదురెదురుగా యుద్ధంచేసి చంపవలసింది? 

anrd..వాలి  తనకు  ఎదురుగా  నిలబడి  యుద్ధంచేసే  వారి  శక్తి క్షీణించాలనే  ప్రత్యేకమైన వరాన్ని  పొందినవాడు. ఇలాంటి ప్రత్యేకమైన వరాల  సహాయంతో ఇతరులను  బాధపెట్టే  వారి విషయంలో  ధర్మసూక్ష్మాలూ  ప్రత్యేకంగానే  ఉంటాయిమరి. ఇలాంటి  సందర్భాలలో   చెట్టుచాటునుండి  సంహరించటంలో  అధర్మమేమీ  లేదు.

..........
వాళ్ళ  అభిప్రాయాలు.. “ఏ పాపానికైతే (సోదరుడు సుగ్రీవుని భార్య తారను కైవసం చేసుకున్నందుకు” వ్యాధుని లాగా వాలిని చంపాడో అదే పాపం తర్వాత వాలి భార్యను తనదానిగా చేసుకుని సుగ్రీవుడు చేశాడు. ఆ దుశ్చేష్టే (రావణ వధానంతరం మండోదరిని కైవసం చేసుకొని ) విభీషణుడు కూడా చేశాడు.

anrd..  మానవులకు, వానరములకు, రాక్షసులకు  ధర్మాలలో  వ్యత్యాసం  ఉండొచ్చదన్నది ఇక్కడ మనం గమనించవలసిన  విషయం. 


వాలి యొక్క భార్య  అయిన తార  సుగ్రీవుని  వివాహం  చేసుకోవటాన్ని  గమనిస్తే అనేక  విషయాలను  గమనించవచ్చు. సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు.

 సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం.


ఇంకో  విషయమేమిటంటే, వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే..అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

(ఈ  విషయాలు  అంతర్జాలంలో  చదివి  వ్రాసినవి.)

 రావణాసురుడు, మండోదరి ..రాక్షసజాతికి రాజు, రాణి.

రావణుడు ఎన్నో  అధర్మాలు  చేశాడు. దేవతలను  పీడించేవాడు.వేదవతిని అపహరించటానికి  ప్రయత్నించి  ఆమె మృతికి  కారణమయ్యాడు.  వాలిని, రావణుణ్ణి సంహరించటమే  సరైనది.
..............
వాళ్ళ  అభిప్రాయాలు.. లంకకు తీసుకెళ్ళి కూడా రావణుడు సీతను అవమానించలేదు. రాణివాసంలోకి తీసుకెళ్ళలేదు. అశోకవాటికలో ఉంచాడు. అందరూ రాక్షసుడనవచ్చు. కానీ, అంత సభ్యతతో కూడిన ప్రవర్తన మనుషుల్లో అరుదుగానే కనిపిస్తుంది.

anrd..ఇష్టంలేని  స్త్రీని  బలవంతం  చేస్తే  రావణుని  తల  బ్రద్దలవుతుందని  రావణునికి  ఒక  శాపం  ఉంది....అందుకే  రావణుడు  తనను  వివాహం  చేసుకోమని   సీతాదేవిని ప్రాధేయపడటం,  బెదిరించటం  వరకే  చేసేవాడు.అంతేకానీ రావణుడికి సభ్యతతో కూడిన ప్రవర్తన  ఉండటం  వల్ల కాదు.

............................... 

వాళ్ళ  అభిప్రాయాలు.. ఇద్దరు పట్టమహిషులుండగా ముసలితనంలో మూడో పెళ్ళి చేసుకోవాలనే సరదా దశరథునికి ఎందుకు పుట్టింది?


anrd..పురాణేతిహాసాల  ద్వారా  ఇంకో విషయం  కూడా  తెలుసుకోవచ్చు.   కైకేయి   కోరిన  వరాల  వల్ల  రాముడు  అరణ్యాలకు  వెళ్ళవలసి  వచ్చింది. ఎక్కువ  వివాహాల  వల్ల ఎక్కువ  కష్టాలు  వచ్చే  అవకాశముందని  తెలుసుకోవచ్చు.

 ....................  

వాళ్ళ  అభిప్రాయాలు.. అయోధ్య నుండి  సైన్యం సన్నద్ధం చేసుకొని భరతుడు  వెళ్ళి ఉంటే రామునికి కోతుల సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చేది?


anrd.. భరతుడు  సైన్యంతో  రాకుండా  వానరుల  సహకారంతో  రావణ వధ  జరగటం ద్వారా ఎన్నో గొప్ప సందేశాలను తెలుసుకోవచ్చు. 


 క్రూరులు, బలవంతులూ  అయిన  రాక్షసులు  సౌమ్యులైన  వానరుల చేతిలో పరాజయాన్ని  పొందిన  కధ  ఇది. ధర్మాన్ని  ఆచరించేవారికి  మానసికధైర్యాన్ని  అందించే  కధ  ఇది. రామతత్వం  రావణతత్వంపై  విజయాన్ని సాధించిన కధ ఇది. లోకంలో అంతిమ  విజయం  ధర్మానిదే అని  చాటిచెప్పిన  కధ ఇది.

.................
వాళ్ళ  అభిప్రాయాలు.. హనుమంతుడు  మొదటి యజమాని సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి రాముని సేవకు అంకితమైపోయాడు.

anrd..హనుమంతుడు  రామలక్ష్మణుల  సహాయంతో  తన  రాజు  అయిన  సుగ్రీవుని కాపాడాడు.ఆ విధంగా సుగ్రీవుని  పట్ల  తన స్వామిభక్తిని  నిరూపించుకున్నాడు. సీతాదేవిని వెదకటానికి సాయం చేస్తానని  సుగ్రీవుడు  ఇచ్చిన మాటలో భాగంగా కూడా హనుమంతుడు  సీతాదేవిని వెదకటంలో సాయం చేసారు.   

 ..........................
 వాళ్ళ  అభిప్రాయాలు.. విభీషణుడు ఎలాంటి ఆదర్శం ? ‘ఇంటి గూఢచారి లంకను ధ్వంసం చేస్తాడు’ అనే సామెతకు కారకుడయ్యాడు. 

anrd..రావణుడు ఎన్నో  అధర్మాలు  చేశాడు.  ఇలాంటివాని మరణానికి  సహాయం  చేయటంలో  ఎలాంటి తప్పూ  లేదు. అధర్మవర్తనులను శిక్షించటంలో బంధు ప్రీతి ఉండరాదు అంటారు  కదా ! 

..................... 
( పురాణేతిహాసాల  ద్వారా , పెద్దలు రాబోయే  తరాలకు  ఎన్నో  విషయాలను నేర్పించారు .) 
.........  
ఆసక్తి  ఉన్నవారు  క్రింది  లింకు కూడా చూడగలరు .   Tuesday, November 18, 2014

ఓం.. శీతాద్రి శిఖరాన....


శ్రీ లలితా  పూజా విధానము  పుస్తకము  నుండి ... 

సంకలనము
డాక్టర్  జి.ఎల్.ఎన్.శాస్త్రి. 

శీతాద్రి  శిఖరాన

శీతాద్రి  శిఖరాన  పగడాలు  తాపించు
మాతల్లి  లత్తుకకు  నీరాజనం-
నిండైన  నీరాజనం -  భక్తి  మెండైన  నీరాజనం.

యోగీంద్ర  హృదయాల మ్రోగేటి  మాతల్లి
బాగైన  అందెలకు  నీరాజనం
బంగారు  నీరాజనం - భక్తి  పొంగారు  నీరాజనం.

నెలతాల్పుడెందాన వలపు  వీణలు  మీటు
మాతల్లి  గాజులకు  నీరాజనం
రాగాల  నీరాజనం - భక్తి  తాళాల  నీరాజనం


మనుజాళి హృదయాల తిమిరాలు  కరగించు
మాతల్లి నవ్వులకు  నీరాజనం
ముత్యాల నీరాజనం -  భక్తి  నృత్యాల  నీరాజనం.

చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి  అలరారు
మాతల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం - భక్తి  జతనాల  నీరాజనం.

పసిబిడ్డలనుచేసి  ప్రజనెల్ల  పాలించు
మాతల్లి చూపులకు  నీరాజనం
అనురాగ నీరాజనం - భక్తి  కనరాగ  నీరాజనం.

దహరాన కనిపించు  ఇనబింబమనిపించు
మాతల్లి  కుంకుమకు  నీరాజనం
కెంపైన  నీరాజనం - భక్తి  పెంపైన  నీరాజనం.

తేటిపిల్లలవోలె గాలి  కల్లలలాడు
మాతల్లి కురులకు  నీరాజనం
నీలాల నీరాజనం - భక్తి  భావాల  నీరాజనం.

జగదేక మోహినీ  సర్వేశదేహినీ
మాతల్లి  రూపులకు  నీరాజనం
నిలువెత్తు  నీరాజనం - భక్తి  విలువెత్తు  నీరాజనం.

Saturday, November 15, 2014

ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...?..

 ఈ  రోజుల్లో  చాలామంది  తమకు   జీతాలు  బాగా  పెంచాలని కోరుతున్నారు.  చిత్రం  ఏమిటంటే  నెలకు  50వేలు  పైన  వచ్చేవాళ్ళు  కూడా  జీతాలు  పెంచాలని  అడుగుతున్నారు. 

ఎక్కువ  జీతం  కావాలని  కోరుకునే  వాళ్ళు  ఒక  విషయాన్ని గుర్తించాలి.  ఎక్కువ  జీతం  ఇచ్చే  యజమానులు  ఎక్కువ  పని  చెప్పకుండా  ఊరుకుంటారా ? 

ఇస్తున్న  జీతానికి  తగ్గట్లు  ఒళ్లు  హూనమయ్యేటట్లు  పని చేయించుకుంటారు. అతిగా  పనిచేయటం  వల్ల  కొన్నాళ్ళకు  ఆరోగ్యమూ  పాడవుతుంది. 


కుటుంబ  సభ్యులతో  తగినంత  సమయం  గడిపే  అవకాశాలు  లేకపోవటం  వల్ల   కుటుంబ  సంబంధాలూ  దెబ్బతింటాయి.


ఎక్కువ  జీతాలు  ఎందుకు  ? అంటే  అన్ని  రేట్లు  పెరిగిపోయాయి  అంటుంటారు.  


జీతాలు  తక్కువ  ఉన్న  పాత కాలంలో  వస్తువుల  రేట్లూ  తక్కువే  ఉండేవి.  జీతాలు  పెరిగిన  ఈ  రోజుల్లో  వస్తువుల  రేట్లూ  పెరిగాయి. తేడా  ఏమీ  లేదు  కదా !


ఉద్యోగస్తుల  జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులూ ధరలు పెంచేస్తారు. ఇక జీతాలు పెరిగి లాభమేమిటి? 


అసలు నా అభిప్రాయమేమిటంటే,  ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలి .


జీతాలు పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా ..అని నా అభిప్రాయం.

 ఎక్కువ  ధరకు  కొనేవాళ్ళు  లేకపోతే ..చేసేదేమీ  లేక   వాళ్ళే  ధరలను  తగ్గిస్తారు.

 ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు లేక ధరలు తగ్గాయి కదా..

...............................
ఈ మధ్య  బ్యాంక్  వాళ్ళు  జీతాలు  పెంచమని  సమ్మె  చేసారు  కదా  !  నా  భర్త  కూడా  బ్యాంక్లో పని చేస్తున్నారు.  
దేశంలో  తిండికి  గతిలేని  వారు  ఎందరో  ఉండగా  ఇంకా  జీతాలు  పెంచమని  అడగటం  ఏం  న్యాయం.
................................
ఈ  రోజుల్లో   నెలకు   లక్ష  దాటి  ఆదాయం  లభించే  కుటుంబాలు  ఎన్నో  ఉన్నాయి.  వీళ్ళల్లో  చాలామంది బోలెడు  ఖర్చు  పెట్టి  కొత్త  వస్తువులు,  దుస్తులు,  కార్లు  వంటివి   కొని  పడేస్తుంటారు.  50  వేల  పైన  విలువ  చేసే  సెల్ఫోన్లు  అవలీలగా  కొనేస్తున్నారు. కొన్ని  రోజులు  పోయాక  ఆ  ఫోన్  అవతల  పడేసి  మరో  కొత్త  ఫోన్  కొంటుంటారు.

  జీతాలు  బాగా  పెరగటం  వల్ల   అన్నింటినీ  కొనేయటం ... లేకపోతే  ఆస్తులను  కూడబెట్టడం  జరుగుతోంది..... ఈ  గోలలో  పేదవాళ్ళు  బతికేదెలా ?


  రోడ్డు  పక్కన  చెప్పులు  కుట్టుకునే వారికి  చాలా  తక్కువ  ఆదాయం  వస్తుంది. చెప్పులు  కుట్టేవాళ్ళు, రోజు  కూలీలు  వంటి  వారు  తమ  ఆదాయం  పెరగాలని  సమ్మెచేసి  ఎవరిని  డిమాండ్  చేయగలరు  ?


 ఏ వృత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయాలలో  పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు.

.....................
ప్రభుత్వ   ఉద్యోగస్తులకు  బోలెడు  జీతాలు  ఉన్నాయి....ఇంకా   రిటైరయిన  తరువాత   బోలెడు పెన్షనూ  లభిస్తుంది. అవన్నీ  ప్రజలు  కట్టిన  పన్నుల  నుంచి  వచ్చేవే.

  మాకు  తెలిసిన  ఒకామె  లెక్చరర్గా  పనిచేసి  వాలంటరి  రిటైర్మెంట్  తీసుకుంది.  ఆమెకు  నెలకు సుమారు 40  వేల  పెన్షన్  వస్తోంది. ఇలాంటి  వాళ్ళలో  కొందరు  ఖరీదైన  వస్తువులు  కొనుక్కుంటూ  జీవిస్తుంటారు. 


 రోజువారి కూలిపనివారు,  రైతులు, చిన్నతోపుడుబండ్లపై  సరుకులు  అమ్ముకునే  వారు   కూడా  ఎండలో  ఎంతో  కష్టపడుతుంటారు.  అయినా  వారి  జీవితాలకు  నిత్యావసరాలకు  కూడా  చాలినంత  డబ్బు  ఉండదు. 


వారికి  పనిచేసేటప్పుడు  ఏసీ  గదులూ  ఉండవు.  అలసిపోయి  పని మానేస్తే  పెన్షన్లూ  ఉండవు.

..........................
  అత్యంత  ధనికులైన  వారు  కొందరు  విదేశాలకు  తరలించిన  డబ్బు  గురించి  దేశంలో చర్చ  జరుగుతోంది. ఆ డబ్బు  ఉంటే  దేశం  ఎంత  అభివృద్ధి  చెందేదో  అంటున్నారు.

అత్యంత  ధనికుల  సంఖ్య  వందలలో  ఉంటే, ఉన్నత..మధ్య  తరగతి  వారి  సంఖ్య  వేలల్లో  ఉంటుంది. వీరి వద్ద  ఉన్న సంపద  కూడా  చాలా  ఉంటుంది.


 దేశంలో, 
ఉన్నత-మధ్య  తరగతి అంటూ  ఒక  వర్గం  ఉంది .  బాగా  ఎక్కువ  జీతాలు   లభించే  ఉద్యోగులు,  బాగా  రేట్లను  పెంచి  అమ్ముతూ  లాభాలను  పొందే  వ్యాపారులు  ఉన్నత-మధ్య  తరగతి  కోవలోకి  వస్తారు.


దేశంలోని  అత్యంత  ధనికులు  మరియు  ఉన్నత-మధ్య  తరగతి  వద్దకు  చేరుతున్న  ఆదాయం  కలిపితే  లక్షల కోట్లలో  ఉంటుంది. 


దేశంలోని  పేద,  మధ్య  తరగతి  వారికి  మాత్రం  తినటానికి  సరైన  తిండి  కానీ,  రోగం  వస్తే  చికిత్స  చేయించుకోవటానికి  చాలినంత  డబ్బు  కానీ  ఉండవు. 


ఉన్నత  వర్గాల  వద్ద  బోలెడు  డబ్బు  ఉండగా  పేద,  మధ్య  తరగతి  వారికి  నిత్యావసరాలు  తీరటం  కూడా  కష్టమే.


 సమాజంలో ఉన్న  ఆర్ధిక  అసమానతలు  తగ్గినప్పుడే  సమసమాజం  ఏర్పడుతుంది.  సమాజంలో  సంఘర్షణలు  తగ్గుతాయి. ఆర్ధిక  అసమానతలు  తగ్గకుండా  సమస్యలు  ఎలా  తగ్గుతాయి  ?

...............
 దేశంలో  ఏ  అభివృద్ధి  కార్యక్రమం  చేయాలన్నా  ప్రభుత్వం  తన  వద్ద  ఎక్కువ  డబ్బు  లేదంటుంది.

 ప్రజలందరి  సొత్తు  అయిన  సహజవనరులను  ప్రైవేటీకరణ  పేరుతో   కొద్దిమందికి  అప్పగిస్తే   ప్రజా  సంక్షేమ  కార్యక్రమాలు  చేయటానికి  ప్రభుత్వం  వద్ద  డబ్బు  ఎక్కడినుంచి  వస్తుంది?


ఆదాయం కోసం  ప్రజల మీద  మీద  అధిక  పన్నులు  వేయటం,  మద్యం  మీద  వచ్చే  ఆదాయంపై  ఆధారపడటం   చేస్తున్నారు. ఇలా  చేయటం  సరైనది  కాదు.


ప్రైవేటీకరణ  తగుమాత్రం  మాత్రమే  ఉండాలి.ఎక్కువ సహజవనరులు  ప్రభుత్వం  యొక్క  ఆధీనంలోనే  ఉండాలి. 

............
ఆర్ధిక  అసమానతల వల్ల  సమాజంలో  అనేక  కష్టాలు  వస్తాయి .

వస్తువుల  ధరలు  పెరిగాయని  ఉద్యోగస్తుల  జీతాలు  పెంచుతారు.   మరి  పెరిగిన  వస్తువుల  రేట్లతో  రోజువారీ  కూలీలు  వంటి వారు ఎలా బ్రతకాలి...?  ఆ స్థాయిలో వారి  కూలీరేట్లు  పెరగవు  కదా ! 


ఈ  రోజుల్లో  ఏ  వస్తువు  చూసినా  బోలెడు  రేటు  ఉంటోంది. సామాన్యులు  కొనేటట్లు  ఉండటం  లేదు.


వ్యాపారస్తులు  ఇష్టం  వచ్చినట్లు  వస్తువుల  ధరలను  పెంచకుండా  ప్రభుత్వం  గట్టి  చర్యలను  తీసుకోవాలి.  అప్పుడే  ధరలు  పెరగకుండా  ఉంటాయి.

..............
దేశం  నుంచి  విదేశాలకు  పంపించిన  నల్లడబ్బును  తిరిగి తీసుకురావాలి.  ఇక  ముందు  దేశ  సంపద  బయటకు  తరలిపోకుండా గట్టి చర్యలు  తీసుకోవాలి.

ఉద్యోగస్తులు జీతాలు  పెంచమని  చీటికీమాటికీ  అడగకూడదు...వ్యాపారస్తులు  వస్తువులను  అధిక  ధరలకు  విక్రయించకూడదు.


  ప్రజలు   కొవ్వొత్తులు  పట్టుకుని  రోడ్లపై  పరిగెట్టడం  వల్ల   దేశం  లోని  సమస్యలు  తీరవు. సొంతలాభము  కొంత  మానుకుని  పొరుగువాడికి  తోడుపడవోయ్..అన్నారు  ఒక  కవి.


అత్యంత సంపన్న వర్గాలు ,  వ్యాపారస్తులు,  ఉద్యోగులు   తమ  స్వలాభాన్ని  కొంతమేరకు  తగ్గించుకుంటే...దేశంలో  ఉన్న  సంపద  పేద,  మధ్య  తరగతి  వారికి  కూడా  చేరుతుంది.

........
నేను  ఇలా  రాసినందుకు  చాలామందికి  కోపం  వస్తుందని  నాకు  తెలుసు.  అయితే  కొంచెం  ఆలోచించండి,  మనదేశం  లో  పేదరికం  తగ్గాలంటే  సొంతలాభం  కొంత  తగ్గించుకుని  తలోచేయి  వేయాలి.  మన  దేశంలో ప్రజలు  పేదగా ,  మురికిగా  లేకుండా  సిరిసంపదలతో  ఉండటం  మనకే  గర్వకారణం  కదా !