koodali

Saturday, November 15, 2014

ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...?..

 
 ఈ  రోజుల్లో  చాలామంది  తమకు   జీతాలు  బాగా  పెంచాలని కోరుతున్నారు.  చిత్రం  ఏమిటంటే  నెలకు  50వేలు  పైన  వచ్చేవాళ్ళు  కూడా  జీతాలు  పెంచాలని  అడుగుతున్నారు. 

ఎక్కువ  జీతం  కావాలని  కోరుకునే  వాళ్ళు  ఒక  విషయాన్ని గుర్తించాలి.  ఎక్కువ  జీతం  ఇచ్చే  యజమానులు  ఎక్కువ  పని  చెప్పకుండా  ఊరుకుంటారా ? 

ఇస్తున్న  జీతానికి  తగ్గట్లు  ఒళ్లు  హూనమయ్యేటట్లు  పని చేయించుకుంటారు. అతిగా  పనిచేయటం  వల్ల  కొన్నాళ్ళకు  ఆరోగ్యమూ  పాడవుతుంది. 


కుటుంబ  సభ్యులతో  తగినంత  సమయం  గడిపే  అవకాశాలు  లేకపోవటం  వల్ల   కుటుంబ  సంబంధాలూ  దెబ్బతింటాయి.


ఎక్కువ  జీతాలు  ఎందుకు  ? అంటే  అన్ని  రేట్లు  పెరిగిపోయాయి  అంటుంటారు.  

జీతాలు  తక్కువ  ఉన్న  పాత కాలంలో  వస్తువుల  రేట్లూ  తక్కువే  ఉండేవి.  జీతాలు  పెరిగిన  ఈ  రోజుల్లో  వస్తువుల  రేట్లూ  పెరిగాయి. తేడా  ఏమీ  లేదు  కదా !


ఉద్యోగస్తుల  జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులూ ధరలు పెంచేస్తారు. ఇక జీతాలు పెరిగి లాభమేమిటి? 


అసలు నా అభిప్రాయమేమిటంటే,  ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలి .


జీతాలు పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా ..అని నా అభిప్రాయం.

 ఎక్కువ  ధరకు  కొనేవాళ్ళు  లేకపోతే ..చేసేదేమీ  లేక   వాళ్ళే  ధరలను  తగ్గిస్తారు.

 ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు, స్థలాలు కొనేవాళ్ళు లేక ధరలు తగ్గాయి కదా..

...............................
ఈ మధ్య  బ్యాంక్  వాళ్ళు  జీతాలు  పెంచమని  సమ్మె  చేసారు  కదా  !  నా  భర్త  కూడా  బ్యాంక్లో పని చేస్తున్నారు.  
దేశంలో  తిండికి  గతిలేని  వారు  ఎందరో  ఉండగా  ఇంకా  జీతాలు  పెంచమని  అడగటం  ఏం  న్యాయం.
................................

ఈ  రోజుల్లో   నెలకు   లక్ష  దాటి  ఆదాయం  లభించే  కుటుంబాలు  ఎన్నో  ఉన్నాయి.  వీళ్ళల్లో  చాలామంది బోలెడు  ఖర్చు  పెట్టి  కొత్త  వస్తువులు,  దుస్తులు,  కార్లు  వంటివి   కొని  పడేస్తుంటారు.  50  వేల  పైన  విలువ  చేసే  సెల్ఫోన్లు  అవలీలగా  కొనేస్తున్నారు. కొన్ని  రోజులు  పోయాక  ఆ  ఫోన్  అవతల  పడేసి  మరో  కొత్త  ఫోన్  కొంటుంటారు.

  జీతాలు  బాగా  పెరగటం  వల్ల   అన్నింటినీ  కొనేయటం ... లేకపోతే  ఆస్తులను  కూడబెట్టడం  జరుగుతోంది.. ఈ  గోలలో  పేదవాళ్ళు  బతికేదెలా ?


  రోడ్డు  పక్కన  చెప్పులు  కుట్టుకునే వారికి  చాలా  తక్కువ  ఆదాయం  వస్తుంది. చెప్పులు  కుట్టేవాళ్ళు, రోజు  కూలీలు  వంటి  వారు  తమ  ఆదాయం  పెరగాలని  సమ్మెచేసి  ఎవరిని  డిమాండ్  చేయగలరు  ?


 ఏ వృత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయాలలో  పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు.

.....................

ప్రభుత్వ   ఉద్యోగస్తులకు  బోలెడు  జీతాలు  ఉన్నాయి....ఇంకా   రిటైరయిన  తరువాత   బోలెడు పెన్షనూ  లభిస్తుంది. అవన్నీ  ప్రజలు  కట్టిన  పన్నుల  నుంచి  వచ్చేవే.

  మాకు  తెలిసిన  ఒకామె  లెక్చరర్గా  పనిచేసి  వాలంటరి  రిటైర్మెంట్  తీసుకుంది.  ఆమెకు  నెలకు సుమారు 40  వేల  పెన్షన్  వస్తోంది. ఇలాంటి  వాళ్ళలో  కొందరు  ఖరీదైన  వస్తువులు  కొనుక్కుంటూ  జీవిస్తుంటారు. 


 రోజువారి కూలిపనివారు,  రైతులు, చిన్నతోపుడుబండ్లపై  సరుకులు  అమ్ముకునే  వారు   కూడా  ఎండలో  ఎంతో  కష్టపడుతుంటారు.  అయినా  వారి  జీవితాలకు  నిత్యావసరాలకు  కూడా  చాలినంత  డబ్బు  ఉండదు. 


వారికి  పనిచేసేటప్పుడు  ఏసీ  గదులూ  ఉండవు.  అలసిపోయి  పని మానేస్తే  పెన్షన్లూ  ఉండవు.

..........................

  అత్యంత  ధనికులైన  వారు  కొందరు  విదేశాలకు  తరలించిన  డబ్బు  గురించి  దేశంలో చర్చ  జరుగుతోంది. ఆ డబ్బు  ఉంటే  దేశం  ఎంత  అభివృద్ధి  చెందేదో  అంటున్నారు.

అత్యంత  ధనికుల  సంఖ్య  వందలలో  ఉంటే, ఉన్నత..మధ్య  తరగతి  వారి  సంఖ్య  వేలల్లో  ఉంటుంది. వీరి వద్ద  ఉన్న సంపద  కూడా  చాలా  ఉంటుంది.


 దేశంలో, 
ఉన్నత-మధ్య  తరగతి అంటూ  ఒక  వర్గం  ఉంది .  బాగా  ఎక్కువ  జీతాలు   లభించే  ఉద్యోగులు,  బాగా  రేట్లను  పెంచి  అమ్ముతూ  లాభాలను  పొందే  వ్యాపారులు  ఉన్నత-మధ్య  తరగతి  కోవలోకి  వస్తారు.


దేశంలోని  అత్యంత  ధనికులు  మరియు  ఉన్నత-మధ్య  తరగతి  వద్దకు  చేరుతున్న  ఆదాయం  కలిపితే  లక్షల కోట్లలో  ఉంటుంది. 


దేశంలోని  పేద,  మధ్య  తరగతి  వారికి  మాత్రం  తినటానికి  సరైన  తిండి  కానీ,  రోగం  వస్తే  చికిత్స  చేయించుకోవటానికి  చాలినంత  డబ్బు  కానీ  ఉండవు. 


ఉన్నత  వర్గాల  వద్ద  బోలెడు  డబ్బు  ఉండగా  పేద,  మధ్య  తరగతి  వారికి  నిత్యావసరాలు  తీరటం  కూడా  కష్టమే.


 సమాజంలో ఉన్న  ఆర్ధిక  అసమానతలు  తగ్గినప్పుడే  సమసమాజం  ఏర్పడుతుంది.  సమాజంలో  సంఘర్షణలు  తగ్గుతాయి. ఆర్ధిక  అసమానతలు  తగ్గకుండా  సమస్యలు  ఎలా  తగ్గుతాయి  ?

...............

 దేశంలో  ఏ  అభివృద్ధి  కార్యక్రమం  చేయాలన్నా  ప్రభుత్వం  తన  వద్ద  ఎక్కువ  డబ్బు  లేదంటుంది.

 ప్రజలందరి  సొత్తు  అయిన  సహజవనరులను  ప్రైవేటీకరణ  పేరుతో   కొద్దిమందికి  అప్పగిస్తే   ప్రజా  సంక్షేమ  కార్యక్రమాలు  చేయటానికి  ప్రభుత్వం  వద్ద  డబ్బు  ఎక్కడినుంచి  వస్తుంది?


ఆదాయం కోసం  ప్రజల మీద  మీద  అధిక  పన్నులు  వేయటం,  మద్యం  మీద  వచ్చే  ఆదాయంపై  ఆధారపడటం   చేస్తున్నారు. ఇలా  చేయటం  సరైనది  కాదు.


ప్రైవేటీకరణ  తగుమాత్రం  మాత్రమే  ఉండాలి.ఎక్కువ సహజవనరులు  ప్రభుత్వం  యొక్క  ఆధీనంలోనే  ఉండాలి. 

............

ఆర్ధిక  అసమానతల వల్ల  సమాజంలో  అనేక  కష్టాలు  వస్తాయి .

వస్తువుల  ధరలు  పెరిగాయని  ఉద్యోగస్తుల  జీతాలు  పెంచుతారు.   మరి  పెరిగిన  వస్తువుల  రేట్లతో  రోజువారీ  కూలీలు  వంటి వారు ఎలా బ్రతకాలి...?  ఆ స్థాయిలో వారి  కూలీరేట్లు  పెరగవు  కదా ! 


ఈ  రోజుల్లో  ఏ  వస్తువు  చూసినా  బోలెడు  రేటు  ఉంటోంది. సామాన్యులు  కొనేటట్లు  ఉండటం  లేదు.


వ్యాపారస్తులు  ఇష్టం  వచ్చినట్లు  వస్తువుల  ధరలను  పెంచకుండా  ప్రభుత్వం  గట్టి  చర్యలను  తీసుకోవాలి.  అప్పుడే  ధరలు  పెరగకుండా  ఉంటాయి.

..............

దేశం  నుంచి  విదేశాలకు  పంపించిన  నల్లడబ్బును  తిరిగి తీసుకురావాలి.  ఇక  ముందు  దేశ  సంపద  బయటకు  తరలిపోకుండా గట్టి చర్యలు  తీసుకోవాలి.

ఉద్యోగస్తులు జీతాలు  పెంచమని  చీటికీమాటికీ  అడగకూడదు...వ్యాపారస్తులు  వస్తువులను  అధిక  ధరలకు  విక్రయించకూడదు.


  ప్రజలు   కొవ్వొత్తులు  పట్టుకుని  రోడ్లపై  పరిగెట్టడం  వల్ల   దేశం  లోని  సమస్యలు  తీరవు.  సొంతలాభము  కొంత  మానుకుని  పొరుగువాడికి  తోడుపడవోయ్..అన్నారు  ఒక  కవి.


అత్యంత సంపన్న వర్గాలు ,  వ్యాపారస్తులు,  ఉద్యోగులు   తమ  స్వలాభాన్ని  కొంతమేరకు  తగ్గించుకుంటే...దేశంలో  ఉన్న  సంపద  పేద,  మధ్య  తరగతి  వారికి  కూడా  చేరుతుంది.

........
  నేను  ఇలా  రాసినందుకు  చాలామందికి  కోపం  వస్తుందని  నాకు  తెలుసు.  అయితే  కొంచెం  ఆలోచించండి,  మనదేశం  లో  పేదరికం  తగ్గాలంటే  సొంతలాభం  కొంత  తగ్గించుకుని  తలోచేయి  వేయాలి.  మన  దేశంలో ప్రజలు  పేదగా ,  మురికిగా  లేకుండా  సిరిసంపదలతో  ఉండటం  మనకే  గర్వకారణం  కదా !


2 comments:

  1. we cannot expect an Utopian society

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నూటికి నూరుపాళ్ళు ఆదర్శవంతమైన సమాజాన్ని
    (an Utopian society ) సాధించలేకపోవచ్చు.

    అయితే, అందరూ చిత్తశుద్ధితో తలుచుకుంటే సమాజంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం సాధ్యమే.

    ReplyDelete