koodali

Friday, January 29, 2016

ఈ సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది...

ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటో ?

 స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే  పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

 ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.

 ఎందరో స్త్రీలు  అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే  వేదనకు గురవుతున్నారు. 

పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో  లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు. 

ఇంకా  ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే  బాగుంటుంది.

 

ఇంటిపట్టున ఉండే స్త్రీలను చిన్నచూపు చూడటం తగదు.

కొందరు ఏమంటారంటే.. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళు ఇరుగుపొరుగుతో తీరికగా పిచ్చాపాటి మాటలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు.... అంటూ  ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళ జీవితాలు వృధా అన్నట్లు మాట్లాడుతుంటారు. 

ఆడవాళ్ళు ఇంటిపట్టున ఉంటే ఎన్నో లాభాలున్నాయి. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళు తమ చంటిపిల్లలను  క్రెష్లో వేయకుండా  తామే చక్కగా చూసుకోవటానికి సమయం ఉంటుంది. పిల్లలను స్వయంగా పెంచుకున్నామనే తృప్తీ ఉంటుంది.


ఎదిగే వయసులో పిల్లలను దగ్గరుండి చూసుకోవటం ,   పిల్లలకు చక్కటి సమతులాహారాన్ని ఇవ్వటం  ఎంతో అవసరం. 


 చక్కటి పోషణలో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారు.   పిల్లలకు డబ్బుకన్నా ఆరోగ్యాన్ని అందించటం ఎంతో అవసరం. 


ఎదిగే వయసులో పిల్లలకు తల్లితండ్రుల ప్రేమానురాగాలు, పర్యవేక్షణ కూడా అవసరం. 


హాస్టల్స్లో పిల్లలు సరైన సమతులాహారాన్ని తీసుకుంటారా ? 


హాస్టల్స్లో ఎవరైనా వేధిస్తుంటే ఏం చేయలేక పిల్లలు తమలో తామే క్రుంగిపోతారు. వీలైనంతవరకూ పిల్లల్ని ఇంట్లో ఉంచి చదివించుకోవటమే మంచిది.


ఇంకో విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఉన్న కొద్ది ఉద్యోగాల కోసం స్త్రీలు, పురుషులు పోటీపడుతున్నారు కదా! ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళ స్థానంలో కొందరు మగవాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి.


ఇంటిపట్టున ఉండే స్త్రీలను చిన్నచూపు చూడటం తగదు.

.......................


ఆడ వాళ్ళు ఇంటి నుంచి బయటకు రావాలని రప్పించారు. బాగానే ఉంది. మరి  బయటకు వచ్చిన స్త్రీలు అందరూ  కష్టాలు లేకుండా హాయిగా ఉన్నారా ?

 బడికి వెళ్లే చిన్నపిల్ల వద్ద నుంచి ఆఫీసుకు వెళ్ళే పెద్ద ఆమె వరకూ  ఎప్పుడు ఏ మగవాళ్ళ  వేధింపులు  ఎదురవుతాయో తెలియక భయపడుతూనే ఉన్నారు.


వార్తాపత్రికలు చూస్తే .. ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఎన్నో దారుణమైన వార్తలను వింటున్నాము.  ఇక వార్తలలో  రాకుండా  ఉన్నవి ఎన్ని దారుణాలు ఉన్నాయో ?


 ఆడవాళ్ళు ఇళ్ళు వదిలి బయటకు రావాలి అంటున్నవారు ...బయటకు వచ్చిన ఆడవాళ్ళకు రక్షణ కల్పించగలరా ? 


రక్షణ కల్పించనప్పుడు... స్త్రీలు ఇంటి నుండి బయటకు రండి అని అనటం దేనికి ? 

...............

కొందరు  ఆడవాళ్ళకు ఉద్యోగం చేయటం ఇష్టం ఉండదు. అయితే, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా  ఉద్యోగం చేసే అమ్మాయిలనే వివాహం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందువల్ల  అమ్మాయిలు తప్పనిసరిగా  ఉద్యోగాలు చేయవలసి వస్తోంది.


పాతకాలంలో   స్త్రీలపై  ఆర్ధిక భారం  ఉండేది కాదు. ఈ రోజుల్లో ఇంటిపనితో పాటు కుటుంబ ఆర్ధిక భారాన్ని కూడా స్త్రీల నెత్తిన పడేసారు. 


ఇటు  పిల్లలను  సరిగ్గా చూసుకోలేక   బయట ఆఫీసులోనూ పనివత్తిడితో సతమతమవుతూ చాలామంది స్త్రీలకు అనారోగ్యాలు వస్తున్నాయి.

ఈ రోజుల్లో  స్త్రీల కష్టాలు మరింత పెరిగినట్లు ఉన్నాయి. పిల్లలకు కూడా కష్టాలు వచ్చి పడ్డాయి. 

 మారిన విధానంలో సమాజంలో  ఎన్నో కొత్త కష్టాలు పుట్టుకువచ్చాయి.

 స్త్రీలకు ఆర్ధికభద్రత కల్పించేవిధంగా చట్టాలు చేయాలని  స్త్రీలందరూ కలిసి ఐకమత్యంగా ఉద్యమాలు చేయాలిగానీ..ఆర్ధికభద్రత కోసం అంటూ స్త్రీలు ఇంటాబయటా కూడా కష్టపడటం తెలివితక్కువతనం కదూ!Monday, January 25, 2016

ఎందరో భాగస్వామ్యం ఉంది....

ఎన్నో రిపబ్లిక్ దినోత్సవాల తరువాత కూడా ఎన్నో సమస్యలు అలాగే ఉన్నాయి.

 ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేశం అభివృద్ధి చెందకపోవటానికి ప్రజలు, అధికారులు, పాలకులు ..ఎందరో భాగస్వామ్యం ఉంది.

...............

 స్వాతంత్రోద్యమం  కాలం నాటి ప్రజలు చాలామంది  తమ సంపదను కూడా దేశం కోసం అర్పించారు. జీవితంలో ఎంతో కాలం జైళ్ళలో గడిపారు. 

భగత్ సింగ్ వంటి కొందరు యువకులు దేశం కోసం జీవితాల్నే అర్పించారు.
..................

 అయితే ఈ రోజుల్లో...  దేశం ఎటుపోతే మనకేమిటి మనకు డబ్బు వస్తే చాలు..అనుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటివాళ్ళ వల్లే దేశం వెనుకబడి ఉంది.

ఇప్పటికీ వందలాదిమందికి ఒక్కటే పాయిఖానా ఉండే బస్తీలు ఎన్నో ఉన్నాయి.

 ఫ్లోరైడ్ నీటితో అవయవాలు కొంకరపోయిన ప్రజలు ఎందరో ఉన్నారు.

 పందులు తిరిగే రోడ్లు.. ఎలుకలు, కుక్కలు  సంచరించే  ఆస్పత్రులు..  బొద్దింకలు, నల్లులు పాకుతూ గబ్బుకొట్టే టాయ్లెట్లున్న రైళ్ళు ఉన్నాయి...

 ( ఈ సమస్యలను పరిష్కరించకుండా బుల్లెట్ రైళ్ళ కోసం డబ్బు ఖర్చు చేయటం ఎందుకు  ?) 


   లాభాల కోసం అదేపనిగా ధరలు పెంచే వ్యాపారులు , వినోదం పేరుతో అసభ్యకర విషయాలతో ప్రజలను పాడుచేస్తున్న వాళ్ళు,  దేశంలోని  సంపదను కొల్లగొడుతున్న వాళ్ళు , ప్రతిపనికి లంచాలు మింగే వాళ్ళు..ఇలా  ఎవరికి వీలైనంతలో వాళ్ళు డబ్బుకోసం  కక్కుర్తి పడిపోతూ  జీవిస్తుంటే దేశం ఇలా కాక ఇంకెలా ఉంటుంది. 


  
సొంత అభివృద్ధి తప్పు కాదు. అయితే మన సొంత అభివృద్ధి కోసం ఇతరుల పొట్ట కొట్టకూడదు. 

సమాజ సంపదలో మన వంతు వాటాను మాత్రమే మనం వాడుకోవాలి. అంతా నాకే అని వాడేసుకోకూడదు.

 ప్రపంచంలోని సంపద కొందరిది మాత్రమే కాదు. అందరికీ భాగం ఉంది.

 మన తెలివితేటలు, బలమూ ..మనతో పాటు, ఇతరుల అభివృద్ధికీ ఉపయోగపడాలి.
.................

మనలో మార్పు రావాలి. 

 మాది పేదదేశం అంటూ అందరినీ  అప్పులు అడుక్కునే పరిస్థితి మారాలి. 

ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 
Wednesday, January 20, 2016

సంపద కొందరి వద్దే ఉండటం అనేది ముఖ్యమైన సమస్య..


గత కొన్ని సంవత్సరాలుగా దేశం నుంచి ఎంతో డబ్బు విదేశాలకు తరలిపోయిందని అంటున్నారు.

తరలిపోయిన డబ్బును వెనక్కి రప్పించటం , ఇక ముందు సంపద తరలిపోకుండా తగు చర్యలను తీసుకోవటం ఎంతో అవసరం. 

ధనవంతులైన భారతీయుల వద్ద కొన్ని వేల కోట్ల సంపద ఉంది.

 సంపద కొందరి వద్దే ఉండటం అనేది ముఖ్యమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకుండా పేదరికం, నిరుద్యోగం పోగొట్టడం సాధ్యం కాదు.

 ప్రభుత్వం  వద్ద డబ్బు ఉంటే  ఎన్నో ఉద్యోగావకాశాలను మనమే సృష్టించుకోవచ్చు.

ఉద్యోగావకాశాల కోసం సహజవనరులను పెద్ద ఎత్తున తవ్వేసి నష్టపోనవసరం లేదు. మన పూర్వీకులు పెద్ద ఎత్తున సహజవనరులను వాడకుండానే చక్కగా జీవించారు.

ఆధునికకాలంలో చదవటం దగ్గర నుంచి.. ఉద్యోగం పొందటం.. పొందిన ఉద్యోగాన్ని నిలుపుకోవటం వరకూ అన్నీ సమస్యగానే మారిపోయాయి.

సంపద కొందరి వద్దే ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు పెట్టినా పెద్ద లాభం లేదు. పరిశ్రమల లాభాలు పరిశ్రమల అధిపతుల వద్దే ఉంటాయి.

 ఈ రోజుల్లో ధనవంతులు మరింత ధనవంతులు కావటం, పేదలు అలాగే ఉండటం జరుగుతోంది. 

ప్రజలు, పాలకులు నైతికవిలువలను మాటలలో కాకుండా చేతలలో చూపించాలి. 

కఠిన చట్టాలను చేసైనా సరే సంపద దేశం నుంచి తరలిపోకుండా , సంపద కొందరి వద్దే ప్రోగుపడకుండా  కఠినమైన చర్యలు తీసుకోవాలి.

పాలకులు, ప్రజలు, అధికారులు అందరూ ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో పనిచేస్తే భారతదేశంలో పేదరికం పోగొట్టుకోవటం పెద్దపనేమీ కాదు.

 అంతేకానీ , ఎవరి స్వార్ధాన్ని వారు చూసుకుంటూ దేశం అభివృద్ధి చెందాలంటే అయ్యే పని కాదు.
Wednesday, January 13, 2016

ఓం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.


Monday, January 11, 2016

సేంద్రియ పద్ధతి..ఎక్కువగా పాలిష్ చేసిన ఆహారదినుసులను వాడటం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవటం జరుగుతుందంటున్నారు.

ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. 


పాతకాలంలో దంపుడుబియ్యం  ఎక్కువగా వాడేవారు.దంపుడు బియ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఇప్పటివాళ్ళు దంపుడు బియ్యం  ఎక్కువగా వాడుతున్నారు. 


దంపుడు బియ్యంతో వండిన అన్నం తినలేని వారు దోసెలు , ఇడ్లీ వంటివి చేయటానికి  వాడుతున్నారు.   


పాతరోజుల్లో  సన్నబియ్యం ఎక్కువ ధర ఉండేవి,  దంపుడు బియ్యం,  రాగులు, జొన్నలు  తక్కువ ధరకే లభించేవి. 

ఈ రోజుల్లో దంపుడుబియ్యం, రాగులు, జొన్నలు వంటివి కూడా  ధరలు బాగా పెరిగాయి.

  పేదవారు కొనాలంటే  పప్పుదినుసుల  రేట్లు బాగా పెరిగాయి.

విదేశాల వాళ్లు రసాయన పురుగుమందుల వాడకాన్ని చాలావరకూ తగ్గించుకుంటున్నారు.

 భారతదేశంలో పండించిన పంటలలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో కొన్ని దేశాల వాళ్ళు భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని ఆహార ఉత్పత్తులను వెనక్కి తిప్పి పంపటం కూడా జరిగింది. 

రసాయన పురుగుమందులు హానికరం అని తెలిసినా కూడా మనదేశం వాళ్ళు  విచ్చలవిడిగా పురుగు మందులను వాడుతున్నారు. 

పండలను త్వరగా మగ్గించటానికి కూడా రసాయనాలను వాడుతున్నారు కొందరు.

పాతకాలంలో సేంద్రియపద్దతిలో పండించే పంటలే ఉండేవి. ఈ రోజులలో సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను చాలా ఖరీదుకు అమ్ముతున్నారు.

ఆరోగ్యం కావాలంటే సేంద్రియ పద్ధతిలో పంటలను పండించటాన్ని తిరిగి అలవాటుచేసుకోవాలి.


Wednesday, January 6, 2016

దేశం కోసం ..


దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన  సైనికులకు నివాళులు. ఇకమీదట ఇలాంటి విషాద సంఘటనలు జరగకూడదని,  ప్రపంచమంతటా శాంతిభద్రతలు పెరగాలని కోరుకుంటున్నాను.

Friday, January 1, 2016

అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.


అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.