koodali

Monday, November 29, 2010

మేము అమర్‌నాధ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు బాగా సహాయము చేశారు.

ఈ పోస్ట్ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలో వ్రాశానండి. మళ్ళీ ఇప్పుడు తిరిగి పోస్ట్ చేస్తున్నాను.

మా కుటుంబం క్రితం సంవత్సరము............ బాబా అమర్‌నాధ్ , మాతా వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళాము.అక్కడ చెప్పలేనంత బాగుంది.ఆ భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.


అక్కడ ముస్లిం సోదరుల సహాయము మేము మరిచిపోలేము. వారు మమ్ము చాలా బాగా చూశారు.మాకు చాలా ఆశ్చర్యము వేసింది. ఇంకామా యాత్రకు సహాయము అందించిన ప్రతి ఒక్కరికి మా క్రుతజ్ఞతలు.అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు. అక్కడ గుడి దగ్గర షాప్స్ లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.మాకు ఇదంతా చాలా ఆనందముగా, అనిపించింది.మతసామరస్యము ఆశ్చర్యము ,ఆనందముగా అనిపించింది.

నాఉద్దేశ్యములో అమర్నాధ్ గుహ ను ఒక ముస్లిము సోదరుడు కనిపెట్టడము చూస్తే భగవంతుడు అన్ని మతములవారు మంచిగా కలసి ఉండాలని సందేశము ఇచ్చాడేమో అనిపిస్తుంది.


ఇంకా సాయిబాబా కూడాఇదే చేప్పారు. అయ్యప్పస్వామికి వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి శబరిమలలో ఉందంటారు. ఏసుప్రభువుకు, హిమాలయములలోని మహావతార్ బాబాజీకు స్నేహంఉందని ఈ మధ్య కొన్నిపుస్తకములలో వ్రాసారండి. .


పెద్దవాళ్ళు ఇలాచెప్తుంటే మనము ఎందుకు కొట్టుకోవాలి.మతమేదయినా భగవంతుడనే ఆ మహాపవర్ ను అందరు ఆరాధించొచ్చు.


అక్కడ ఒక ఆర్మీ అతను మా తెలుగు మాటలువిని,మీరు తెలుగు వాళ్ళా అని ఆప్యాయముగా అడిగాడు. ఏ రాష్ట్రము వాళ్ళయినా వాళ్ళు కుటుంబానికి దూరముగా సరిగ్గా తిండి,నిద్ర లేకుండా త్యాగము చేస్తున్నందువల్లే మనలాంటివాళ్ళము ఇలా ఉన్నాము.


పొలీసులది కూడా ఇలాంటి త్యాగమయిన ఉద్యోగమే. వీళ్ళందరూ ఎక్కువమంది మద్యతరగతి కుటుంబాలనుండే వస్తారు. నాకు అనిపిస్తుంది,కొంతమంది దేశాన్ని దోచుకొనే వాళ్ళు హాయిగా విలాసాలులో బ్రతుకుతున్నారు. ఇదంతా చాలాభాధగా ఉంటుంది. పేదరికం మన ప్రపంచము నుండి ఎప్పుడు పోతుందో..
మేము హిందూ దేవుళ్ళతోపాటు అప్పుడప్పుడు అల్లాకు, ఏసు ప్రభువుకు కూడా దండము పెట్టుకుంటాము. స్రుష్టిలో రకరకాల మనుష్యులు ఉన్నట్లే ఎన్నిమతములు ఉన్నా అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.

ఆర్మీ వాళ్ళను చూసినప్పుడు వీళ్ళింతకష్టపడుతుంటే మనము ఇంట్లో టివి చూస్తూ ,బయట ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాము కదా మనము అని సిగ్గనిపించింది. ఇక మతము విషయానికి వస్తే ఒకే మతములో వాళ్ళు కూడా గొడవలు పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది  ప్రస్తుతానికి  జరగని  పని.
 మతము  అనేది    అసలు   లేకుండా పోవటము   అనేది  ఎప్పటికీ  జరగనిపని.


అందుకని అందరము ఆనందముగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటము ఒకటే మార్గము.మన యువత ప్రపంచాన్ని మంచిగామార్చాలి.ఆ భగవంతుడు అందరికి మంచి బుద్దిని కలిగించాలి. ... ........

Friday, November 26, 2010

మనం భగవంతుడిని విసిగిస్తున్నామా ?


అవునండి , ఒకోసారి నాకు ఇలాగే అనిపిస్తుంటుంది. మనము మన మనసును అదుపులో పెట్టుకోలేక అంతులేని కోరికలతో భగవంతుని ఇబ్బంది పెడుతున్నామేమో అని.


మనుష్యులకు కష్టాలు వారు పూర్వం చేసిన తప్పులవల్లనే వస్తాయి. మనం తప్పులు చేసి తీరా కష్టాలు వచ్చాక రక్షించమని భగవంతుని విసిగిస్తాము.


ఎట్లాగంటే ...........పిల్లలు గనక తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక తప్పులు చేసి తీరా ఇబ్బందుల్లో ఇరుక్కున్న తరువాత తల్లిదండ్రులను సహాయం అడుగుతారు. అప్పుడు వాళ్ళు నానా కష్టాలు పడి వారిని రక్షిస్తారు.


ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు.......... మనకు చాలాసార్లు డబ్బులు లేని పేదవారు ఎదురుపడి ఏదైనా దానం చెయ్యమని అడుగుతుంటారు. నాకు జాలి అనిపించి కొన్నిసార్లు దానం చేస్తూంటాను.


కానీ, ఒకసారి ఇలా అడిగినప్పుడు, నాకు చాలా చిరాకు అనిపించింది. అసలు వీళ్ళందరూ పనిచేయకుండా ఇలా విసిగిస్తుంటారు ఏమిటో అనిపించింది. ......... ( పని చేతనయిన వాళ్ళకి కూడా చేయటానికి ఈ రోజుల్లో పని దొరకటం లేదు లెండి. నాకు వేరే కారణాలవల్ల మనసు బాగోలేదండి అప్పుడు. మనసు చిరాగ్గా ఉన్నప్పుడు ప్రతిదీ విసుగ్గానే ఉంటుంది. తరువాత అలా చిరాకు పడినందుకు బాధపడ్డాను. )సరే,........అలా అనిపించిన కాసేపటికి మళ్ళీ ఇలా అనిపించిందండి......... సహాయం చెయ్యమని అన్నందుకు వాళ్ళ గురించి మనసులో చిరాకు పడ్డావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి ? చిన్న సమస్య రాగానే సహాయం కోసం దైవాన్ని అర్ధించటం లేదా ? అని నా మనసు నన్ను ప్రశ్నించినట్లు అనిపించిందండి.


ఇంకా,............. సహాయం చెయ్యమని అడిగిన వాళ్ళను చూసి నాకు చిరాకు అనిపించింది కదా...........మరి మనం భగవంతుడిని ఇలా ఎన్నోసార్లు సహాయం అడుగుతూ విసిగిస్తున్నాము కదా.............. అది ఏం న్యాయం ? పాపం.. అనిపించిందండి.అందుకే మన కష్టాలు పోవటానికి భగవంతుని వేడుకునే ముందు ఒక యోగ్యతను సంపాదించుకోవాలి.


అంటే ధ్యానం, తపస్సు, ఉపవాసం ద్వారా కొంచెం కష్టపడటం, లేక మన సంపదలో కొంత ఇతరులకు దానం చేయటం, విద్యాదానం, అన్నదానము, భక్తితో పూజలు, వ్రతములను చేయటం, దుష్ప్రవర్తన లేకుండట ............ ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇతరులకు సహాయపడటం చేసినప్పుడు .......... మనం పూర్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు భగవంతుని వేడుకోవటానికి మనకు ఒక యోగ్యత వస్తుందని నాకు అనిపించిందండి.
మనం మన పాటికి సోమరితనంతో ఉంటూ భగవంతుడే అన్నీ సమకూర్చాలి అనుకోవటం ఏం న్యాయం ?


ఉదా........మన పిల్లలు వీడియో గేంస్ ఆడుకుంటూ మనల్ని హోంవర్క్ చెయ్యమన్నారనుకోండి, వాళ్ళ హోంవర్క్ మనం చేస్తూపోతే ............ తీరా పరీక్షలో వారేమి రాయగలరు ? అందుకని కష్టపడి చదవటం వాళ్ళకి తప్పనిసరి.


అయితే వాళ్ళకు హోంవర్క్ చెయ్యటములో మనం సహాయంచెయ్యవచ్చు. అలాగే మన పని మనం సరిగ్గా చేస్తూ, మనకు చేతకాని సమయంలో , లేదా పెద్ద కష్టం వచ్చినప్పుడు ..................... దైవాన్ని సహాయం చెయ్యమని అడగటంలో తప్పులేదు. అంతేగానీ ప్రతిచిన్న సమస్యకు దైవాన్ని విసిగించటం బాగుండదు.మన తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని ఏదైనా పనిలో కష్టపడుతుంటే ఎంతో బాధపడతాము. అయ్యో వారు ఇంత పనిచేస్తున్నారే అని . వారి పనిని తగ్గించి వారిని సంతోషముగా ఉంచటానికి ప్రయత్నిస్తాము.


మరి భగవంతుడు మాత్రం మన బంధువు కాదా ? చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. మనం భగవంతుని గురించి కూడా ఆలోచించవద్దా ?


అందుకని మనం మన తల్లిదండ్రులను, పిల్లలను వాళ్ళకు ఇష్టమయిన పనులు చేసి సంతోషపెట్టడానికి ఎలా ప్రయత్నిస్తామో , అలాగే, ............ మనము మన అతి కోరికలను అదుపులో పెట్టుకుని , సత్ప్రవర్తనతో జీవించి మన జన్మజన్మల ఆత్మబంధువు అయిన ఆ దైవానికి కూడా ఆనందాన్ని కలిగించాలి....

Wednesday, November 24, 2010

అమ్మవారు కనురెప్పలను అలా అన్నట్లుగా.....................

ఇది కొన్ని సంవత్సరముల క్రితం జరిగిన సంగతి అండి. సంవత్సరం ఎప్పుడన్నది సరిగ్గా గుర్తు లేదండి.


ఒక రోజు సాయంత్రం సుమారు 5 గంటలు ఆ సమయము అప్పుడు నేను అమ్మవారి గుడికి వెళ్ళటం జరిగిందండండి.


నేను మామూలుగా అమ్మవారి ముందు నిలబడి చూస్తున్నప్పుడు, ఉన్నట్లుండి ఆమె కనురెప్పలను ఒక్కసారి అలా అన్నట్లు అనిపించిందండి. అంటే కనురెప్పల కదలిక అనిపించిందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.


ఇది చూడటానికి చాలా సహజంగా ........... నిజంగా ఒక మనిషి రెప్పలు ఆడిస్తే ఎలా ఉంటుందో, అంత సహజంగా అనిపించిందండి. అప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగిందండి. ( ఆ దృశ్యము అనుభూతి చెందటమే గాని వర్ణించటానికి నాకు కుదరటం లేదండి. )


అయితే నేను ............. అది నా భ్రమ అనుకుని కొంచెంసేపు అక్కడ ఉండి ఇంటికి వచ్చేశానండి.అయితే మరుసటి రోజు పేపరులో వార్త ఏమిటంటేనండి, ముందటి రోజున సాయంత్రం ఫలానా 5 గంటల సమయములో దేవాలయమునకు వెళ్ళినవాళ్ళు కొంతమంది అమ్మవారి కనురెప్పల కదలికను ................. దర్శించిన అనుభూతి పొందినట్లుగా వార్తా సారాంశం.


నేను అది చదివి ఎంతో ఆశ్చర్య పడ్డాను. నేను మాత్రమే కాకుండా , మరికొంతమంది కూడా ఇలా భావించటం కాకతాళీయం ఎలా అవుతుంది ?


ఇలాంటి విషయాన్ని ఇంకెవరయినా చెబితే నేను కూడా ఒక పట్టాన నమ్మనేమో.......... కానీ, నాకే జరిగింది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి.


ఒకోసారి ఇలా జరుగుతూంటాయి.....

Monday, November 22, 2010

ప్లేగు జ్వరము నయమగుట.

ఈ విషయం శిరిడి శ్రీ సాయిబాబా జీవితచరిత్రము లో చెప్పబడినదండి.

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను.

తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను.


అప్పుడతడు భార్యతో కూడ 'కల్యాణ్' పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డు పైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానాసాహెబు తన భార్య నుదిటిపై రాసెను.


ఆ భక్తుడిదంతయు జూ చెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడురోజులనుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను..
..

Friday, November 19, 2010

ఎవరింటికయినా వ్రతము చూడటానికి వెళ్ళినప్పుడు మధ్యలో వేరే పని వస్తే ఎలా...................... ..

ఒకోసారి మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఉదా..........మనకు తెలిసినవారు మనల్ని వారు చేయబోయే పూజలకు, వ్రతములకు పిలుస్తుంటారు కదా !

ఉదా....సత్యన్నారాయణ స్వామి వారి వ్రతమునకు పిలిచారనుకోండి ! పూజకు వెళ్ళినా ఒక్కోసారి పూజ పూర్తి అయ్యేవరకూ ఉండటానికి మనకు కుదరకపోవచ్చు. మనకు పూజ మధ్యలో నుండి తప్పనిసరిగా వెళ్ళవలసిన పనులు ఉండవచ్చు.

అలాంటప్పుడు ఇలా ధర్మ సందేహాలు వస్తూంటాయి. ....ప్రసాదం తీసుకోకుండా మధ్యలో వెళ్తే ఏమవుతుందో అని. అలా అని వెళ్ళకపోతే మరి మన పనులు ఎలా ? అని..................


పూజను స్వయముగా చేస్తున్న వాళ్ళు ఎలాగూ వీలయినంత నియమముగానే చేయటానికి ప్రయత్నిస్తారు. నియమముగా చేస్తే వాళ్ళకే ఎంతో మంచిది.


కానీ పూజను చూడటానికి వెళ్ళేవాళ్ళకు పూజ పూర్తి అయ్యే వరకూ ఉండాలంటే ఒకోసారి కుదరదు కదండి.

కుదిరితే , పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , తీర్ధ,ప్రసాదములు తీసుకుని రాగలిగితే ఎంతో అదృష్టము. కానీ కుదరనప్పుడు ఏమి చెయ్యాలి అన్నదే ఇక్కడ చెప్పుకుంటున్న సమస్య.


ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలియక నేను రకరకములుగా అలోచిస్తూంటాను. ఈ విధముగా............


1. ప్రసాదం తీసుకోకుండా పూజ మధ్యలో వచ్చేయటం వల్ల ఏదైనా దోషం వస్తుందేమో ? అందుకే అసలు పూజకే వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది ? ............అని.... ( పూజకు పిలిస్తే వెళ్ళకపోతే ఎలా ............ ? అని ) మళ్ళీ......2. దేవుని పూజకు పూర్తిగా వెళ్ళకుండా మానటం కంటే ................ మనకు వీలుకుదిరినంతవరకూ చూసి ఆ తరువాత భగవంతుని పైన భారం వేసి మన పనికి మనం వెళ్ళటం. ( దేవుని పూజ చూసే భాగ్యం కొద్దిసేపు దొరికినా అదృష్టమే కదా ! )

( దోషం గురించి అలోచించి దైవానికి దూరమవటం వివేకము అనిపించుకోదు. అలా చేసే కన్నా, దైవాన్నే నమ్ముకుని మనకు వీలయినంత వరకు పూజలో పాల్గొంటే, తరువాత అంతా దైవమే చూసుకోవటం జరుగుతుంది కదా ! )

ఇలా........ రకరకాల ఆలోచనలతో ఏమి చెయ్యాలో అర్ధం కాదండి.


ఇలాంటప్పుడు పైన రెండు ఆలోచనలలో, నాకు రెండవదే మంచిదని అనిపించిందండి.

అయితే ఇలాంటప్పుడు ప్రసాదం తీసుకోకుండా వచ్చేశామే ............ అని మనసు పీకుతుంది.

ఒకోసారి ఒక్కోసారి మనము అప్పుడే వేరే ఊరు వెళ్ళవలసి వస్తుందనుకోండి. మళ్ళీ వచ్చి అదే రోజు ప్రసాదం తీసుకోవటం కుదరదు,.


దీనికి నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపించిందండి.


అక్కడ పూజ పూర్తి అయ్యే సమయాన్ని సుమారుగా లెక్కవేసుకుని మనము ఎక్కడ ఉన్నా, ఒకవేళ ప్రయాణములో ఉన్నా, అక్కడ దొరికే మామూలు నీటిని, ఆహారపదార్ధాన్ని తీర్ధము, ప్రసాదముగా భావించి దైవాన్ని స్మరించి , వాటిని ప్రసాదముగా తీసుకోవచ్చు.


ఆఖరికి ఏదీ దొరకకపోతే ఒక ఆకునైనా ప్రసాదముగా భావించి తీసుకోవచ్చు. దేనికైనా భావన ముఖ్యమని పెద్దలు చెబుతున్నారు కదండి. ( అలా అని పేరు తెలియని ఆకులు తినకూడదు లెండి. )


అలా పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి , ప్రసాదము తీసుకుని వచ్చే సమయము లేనప్పుడు ఇలా చేయవచ్చని నాకు అనిపించిందండి.

ఇలాంటి సందర్భములలో ఏమి చెయ్యాలని శాస్త్రములో చెప్పారో నాకు తెలియదండి. నాకు పెద్ద పాండిత్యం లేదు. ఏదో నాకు తోచినంతవరకు ఆలోచనలు మీకు చెప్పుకోవటానికి ఇలా వ్రాస్తున్నానండి...


అయితే ఎవరయినా పూజలను చూడటానికి వెళ్ళినప్పుడు సాధ్యమయినంతవరకూ ఆ పూజ పూర్తి అయ్యేవరకూ ఉండి ప్రసాదం స్వీకరించటం వల్ల వారికి మంచి జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. .........................

Wednesday, November 17, 2010

ఆడపిల్లలే పుట్టారని బాధపడవద్దు.

మనలో చాలా మంది మగపిల్లలు పుడితే చాలా సంతోషిస్తారు. అదే ఆడ పిల్లలు పుడితే చాలా బాధపడతారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలలో సమస్యలు వస్తున్నాయి.

నాకు ఏమని అనిపిస్తుందంటేనండి , నాకు తెలిసినంతలో సీతాదేవికి తండ్రి అయిన జనకమహారాజు వారి సంతానం ఆడపిల్లలే కదా ! ( నేను చదివినంతలో వారికి పుత్రసంతానం ఉన్నట్లు ఎక్కడా చదవలేదండి మరి. )

జనకమహారాజు ఎంతో గొప్పవారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే వారికి కుమార్తెగా అవతరించటం జరిగింది. జనకులవారు భగవంతుని కృపను ఎంతగా పొందారో ఈ విషయాన్ని గమనిస్తే తెలుస్తోంది.


వ్యాసమహర్షి అంతటి వారే తన పుత్రుడైన శుకుడంతటి వారిని జనకులవారి వద్దకు పంపటం జరిగింది. జనకులవారు నిష్కామ కర్మ యోగిగా జీవించిన మహాత్ములని , అలా వారు భగవంతుని కృపకు ఎంతగానో పాత్రులయ్యారని, పెద్దలు చెబుతారు.

అందుకని పుత్రులు లేనివారు బాధపడవలసిన పనిలేదు.


అసలు ఎవరైనా, సంతానము లేనివారుకూడా భగవంతుని పుత్రునిగా, పుత్రికగా కూడా భావించవచ్చు. భావనలోనే ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు..

కొంతమంది పుత్రులవల్లనే పున్నామ నరకం తప్పుతుందని అనుకుంటూ, కుటుంబములలో కలతలు సృష్టించుకుంటున్నారు.


ఎవరికైనా వారి ప్రవర్తన ఆధారంగానే భగవంతుని దయ ఉంటుంది కానీ, వారికి సంతానమున్నదా ? ఉంటే ఆడపిల్లలా ? మగపిల్లలా ? ఇలాంటి వాటి పైన ఆధారపడి మాత్రమే భగవంతుని దయ, స్వర్గం, నరకం ఇత్యాదులు ఉండవు.....

ధర్మమును, భక్తిని కలిగినంతలోనే భగవంతుడు ఎందరినో అనుగ్రహించిన కధలు ఎన్నో మనకు తెలుసు. పుత్రులు లేనివారిని, అసలు సంతానమే లేనివారిని కూడా ఆ భగవంతుడు తప్పక అనుగ్రహిస్తారు.. ......

Monday, November 15, 2010

భగవంతుని విషయములో మనము చేసేది తప్పా...... 2

భగవంతుని ఫోటోస్ ను ఎక్కడపడితే అక్కడ అన్నిటిపైనా ముద్రించటం గురించి ఇంతకు ముందు బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో వ్రాశానండి. మళ్ళీ దానికి కొన్ని విషయాలను జోడించి ఆ పోస్ట్ ను ప్రచురిస్తున్నాను.

నా బ్లాగ్ పేరు ఆనందం.నావంటి సామాన్యులు కూడా మా అభిప్రాయములు తెలిపేవిధముగా ఇటువంటి టెక్నాలజీ కనిపెట్టిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.


భగవంతుని ఫొటోస్ గురించి నా అభిప్రాయములు చెప్పాలని ఉంది. దయచేసి మీరూ ఆలొచించండి.

మనము దేవుని ఫొటోస్ కూడా దేవునితో సమానముగా గౌరవిస్తాము. మరి ఎక్కువగా ప్రింట్ చేసి వాడిన తరువాత చెత్త లో వెయ్యటము వల్ల పుణ్యం రాకపోగా పాపము వస్తుందని నా అభిప్రాయము.


మనము గుడికి వెళ్ళేటప్పుడు దారిలో చించి పడవేసిన హారతి మఱియు అగరుబత్తి కవర్లు వాటిపైన దేవుని బొమ్మలు మీరు చూసే ఉంటారు. అవి తొక్కుతూనే మనము గుడిలోకి వెళ్తాము .మరి ఇది ఎంత ఘోరం.

ఈరోజుల్లో గుడి లో ఇచ్చే ప్లాస్టిక్ ప్రసాదం కవర్స్ పైన కూడా దేవుని బొమ్మలు ఉంటున్నాయి.

మరి ప్రసాదం తిన్నాక ఆ కవర్లు నీటిలో వేస్తే పొల్యుషన్. మరి అయిపోయిన ప్రసాదం కవర్లు ఎక్కడ వెయ్యాలి అన్నది సమస్య. వాటిని చెత్తకుప్పలలోనే వెయ్యటం ఎంతో పాపం .


అందుకే భగవంతుని బొమ్మలు తక్కువగా ప్రింట్ వేసి భగవంతుని ఎక్కువగా మనసులో నిలుపుకుందాము. ఆదేవుని దయకు పాత్రులమవుదాము.

మన పాత కాలములో ఇన్ని విగ్రహములు లేకపోయినా వారు మనకన్నా తక్కువ స్థాయి భక్తులు కాదని మనకు తెలిసినదే.

మనము అందరము ఈ విషయం దయచేసి ఆలోచించాలి.

ఈ రోజుల్లో మన కష్టాలకు ఇలా భగవంతుని అవమానించటము కూడా ఒక కారణమని నా అభిప్రాయము.

ఆ మద్య కొందరు మన దేవుని బొమ్మలు చెప్పులమీద ప్రింట్ వేసినందుకు ఛాలా బాధ పడ్డాము. మరి మనము చేసే పనులు కూడా అటువంటివే కదా............. దయచేసి ఆలోచించండి...


భక్తి ఉంటే మనము ఇతరులను పీడించకుండా ............. అలా ధర్మబద్ధముగా జీవితాన్ని గడపటం మరియు బలమైన భక్తిభావం ద్వారా భగవంతుని సంతోషపరిచి ,........ తద్వారా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు..

అంతేకానీ........ భగవంతుని చిత్రములు ప్రతీదాని పైనా ముద్రించి ఆనక వాటిని చెత్తకుప్పలో వెయ్యటం ద్వారా భగవంతుని కృప పొందగలమని అనుకోవటం వెర్రితనం.


కొంతమంది దేవాలయాల్లో ప్రతిబింబాలు కనిపించే అద్దం లాంటి నున్నని గ్రానైట్ రాయిని వేయిస్తున్నారు. అవి గుడిగోడల పైన అందంగానే ఉంటాయి. శుభ్రపరచటానికి సులువుగానే ఉంటుంది.

కానీ, గుడిలో నేలపైన ఇలాంటి అద్దం లాంటి రాళ్ళు పరచటం వల్ల దైవ విగ్రహం ప్రతిబింబం నేలపైన ప్రతిబింబించి.................. మనము నడిచేటప్పుడు తొక్కవలసి రావటం నేను గమనించానండి.

ఇంకా నేల ఇలా నున్నగా ఉండటం వల్ల తడిగా ఉన్నప్పుడు కాలు జారి పడే అవకాశం కూడా ఉంది.


నేలపైన (ఫ్లోరింగ్ ) మాత్రం నున్నటి అద్దంలాంటి బండలు బదులు ఇతరరకములు వేయటం మేలని నా అబిప్రాయమండి. ఇప్పటికే ఇలా వేసిన చోట నేల పైన మూల విగ్రహం ప్రతిబింబము పడేచోట, ....................... ప్రతిబింబం పడి ఎవరూ తొక్కకుండా ఉండటానికి నేలపైన కాలిపట్టా వెయ్యవచ్చు.


అయితే ఇవన్నీ మరీ చాదస్తం అనుకుంటే నేనేమి చెయ్యలేను కానీ అండి. నాకు తోచింది చెప్పాను అంతే.

మనము పూజలు చేసేటప్పుడు ఏదయినా పొరపాటు జరిగితేనే మహాపరాధం అని అనుకునేవాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. మరి ఇలా భగవంతుని బొమ్మలు ప్రతీదానిపైనా చిత్రించి ............... వాడకం తర్వాత చెత్తకుప్పలో వెయ్యటం .............. ఇవన్నీ మహాపరాధములు కావా ?


ఇలా అంటే కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఎక్కడ లేడు అంటారు.................... దేవుడు ఎక్కడైనా ఉన్నాడన్న పరిణతి నిజముగా వచ్చిన వ్యక్తి తన అంతరంగములోనే దైవాన్నీ దర్శిస్తారు.


మనకు వస్తువులపైన చిత్రించుకోవటానికి పువ్వులు, ఇంకా ఎన్నో అందమయిన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. వాటిని ఎన్నయినా మనకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడయినా ముద్రించుకోవచ్చు.

వీలయినంతవరకూ దేవుని రూపాన్ని ప్రతిదానిపైనా ముద్రించి ఆనక అపవిత్ర ప్రదేశములలో పడవేసి అగౌరవించకూడదని నా విన్నపమండి. .


ఇప్పుడు కొంతమంది చీరల పైనా ఇలా దేవుని బొమ్మలు ముద్రించుకుంటున్నారు. అదీ నడుము పై భాగములో అయితే ఫరవాలేదు................................నడుముకు క్రింద భాగములో ముద్రించుకుంటే ............. కూర్చున్నప్పుడు బొమ్మపైన కూర్చోవలసి వస్తుంది. ఇది అపచారం కదా...


ఇవన్నీ ఇలా ఎందుకు రాస్తున్నానంటేనండి ........... రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు అడుగు వేస్తే మురికి మధ్య దేవుని బొమ్మలతో కూడిన కాగితాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి......... ఏమీ చెయ్యలేని నిస్సహాయత ..........................

Friday, November 12, 2010

త్యాగం వాటిది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


ఈ సృష్టిలో మానవులమైన మనము మాత్రమే గొప్పవాళ్ళము అనుకుంటుంటాము. కానీ అల్పజీవులు అనబడే మొక్కలు, ఫలవృక్షములు, జంతుజాలము , ఇతరజీవులు మానవ మనుగడకోసం ఎన్నో త్యాగములు చేస్తున్నాయి.


మనము కోరికలతో ఎన్నో పూజలు చేసి వాటి ఫలితములను మాత్రము మనకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆలోచిస్తే పూజలో మనము వాడే ఎన్నో పదార్దములు ఇతర జీవుల నుంచి మనము పొందేవే.


ఉదా............పుష్పములు మొక్కల నుంచి పొందుతాము. మొక్కలు పెరిగేటప్పుడు వాటి కొమ్మలను తుంపటం, కత్తిరించటం ఇలా ఎన్నో బాధలకు గురవుతాయి.


మరి ప్రసాదముగా .......... పాయసం, ఇతరపిండివంటలు తయారుచెయ్యటానికి వాడే పాలు ........ ఆవుల ద్వారా వస్తాయి కదా.............. ఈ రోజుల్లో ఆ పాలను వాటి దూడలను కూడా సరిగ్గా త్రాగనివ్వకుండా పిండేస్తున్నారు .


పండ్లు, బియ్యపుపిండి, గోధుమలు, బెల్లము , ఇవన్నీ మొక్కలు, చెట్లనుంచి మనము పొందేవే. ఇలా దేవునికి ప్రసాదముగా మనము సమర్పించే పదార్దములు ఇతరజీవుల నుంచి మనము పొందుతూ పూజా ఫలము మాత్రము ......... మనకు మాత్రమే దక్కాలని కోరుకోవటం ఏమి న్యాయం ? మనము మనదిగా భగవంతునికి ఏమి ఇస్తున్నాము ?


మనము కూడా సత్ప్రవర్తనతో జీవితాన్ని గడిపిభగవంతునిఆనందపరచవచ్చుఇంకా ప్రేమతోకూడిన భక్తిని వారికిసమర్పించవచ్చు.


మనము స్వచ్చమైన భక్తిని కూడా భగవంతుని యెడల ప్రదర్శించలేకపోతున్నాము. త్యాగం ఇతర జీవులది. ఫలితం మాత్రం మనకు మాత్రమేనా......ఇదెక్కడి అన్యాయం ?


అందుకే పెద్దలు పూజాఫలమును పరమాత్మకే సమర్పించమని చెబుతుంటారు.


ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు ఏది ఎలా చెయ్యాలో ! ఎవరికి ఏది , ఎంత ఇవ్వాలో !


ఈ విశ్వ మనుగడకు ఇతర జీవులు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. మరి జీవులలో ఉత్తములు అనబడే మనం భగవంతునికి ప్రేమ భక్తితో పూజ కూడా చెయ్యలేకపోతున్నాము.

ఇంకా, మనం బ్రతకటం అంతా....... మన గొప్పే, మన తెలివివల్లనే అని విర్రవీగుతుంటాము.


ఆలోచిస్తే ప్రాణవాయువు అందకపోతే........... గట్టిగా కొంతసేపు కూడా ఉండలేని అల్పజీవులమైన మనం పుట్టినప్పటినుంచి మనకు ప్రాణవాయువును, నీటిని ,ఆహారాన్ని ఇంకా అనేకమైన వాటిని ఏర్పరిచిన పరమాత్మ పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి.


అలా లేకపోగా ......... మన బ్రతుకుకు తోడ్పడుతున్న ఇతరజీవులను మన భౌతికమైన సుఖములకోసం నిర్దాక్షిణ్యముగా వాడుకుంటూ, మానవులు ఎంతో గొప్పవాళ్ళు ........ ఇతరజీవులు అల్పమైనవి అంటుంటారు.


ఇంకా, ఎన్నో అవసరముల కోసం ఇతర జీవుల దయపై ఆధారపడి బ్రతుకుతూన్న మనం , భౌతిక సుఖములకు అతిగా అలవాటుపడి ...................... కన్నూమిన్నూగానక ఇతర జీవులను సర్వనాశనం చేస్తున్నాము.

అవి అల్పజీవులు కాదు. మనిషే........... అల్పబుద్దిగలవానిగా తయారవటం నేటి దౌర్భాగ్యం. . 
......


Wednesday, November 10, 2010

నాకు పూర్తిగా తెలియని విషయాలు .....................

ఇది ఆ మధ్యన నేను ఒక పుస్తకములో చదివిన సంగతి అండి. ......

అదేమిటంటేనండి, ఆ పుస్తకములో ఏమని ఉందంటే .................. ఒక ఆయన ఒక స్వామివారి భాగవత ఉపన్యాసమునకు వెళ్ళారట.

అప్పుడు ఆ ఉపన్యాసములో నారదుడు- ప్రహ్లాదుడికి "ఓం నమో భగవతే వాసుదేవాయ "అనే మంత్రాన్ని ఉపదేశించే విషయాన్ని చెబుతున్నారట. దీనిని విన్న ఆయనకు ఆ ఉపన్యాసం చాలా ఆనందాన్ని ఇచ్చిందట.

ఆయన అప్పటినుంచి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టారట.

అయితే ఆ తరువాత కష్టాలు రావటం , ఈ కష్టాలకు కారణం, ఈ మంత్రమేనని భావించి వారు ఆ స్మరణను ఆపివేయటం జరిగిందట. కష్టాలు నెమ్మదిగా తొలగిపోయాయట.

ఆయన ఆ మంత్రాన్ని జపించటంవలన కష్టాలు రావటానికి కారణం ఏమిటని ఒక యోగిని అడిగినప్పుడు, " ఏముందీ నీవు భక్తి- జ్ఞాన - వైరాగ్య - తపస్సులను అడిగావు. వాసుదేవుడు ఇచ్చారు. అందుకే ఈ కష్టాలు. ఈ మంత్రం ముక్తి మంత్రమని, చాల శక్తివంతమైనదని వారు తెలిపారట.


ఇవన్నీ చదివాక నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అంటే తెలియని వాళ్ళు అన్నీ మంత్రములు జపించకూడదు కాబోలు అని.

ఇంకా , ఈ మధ్యన టి.విలో పెద్దలు ఏమి చెప్పారంటేనండీ , భక్తులకు మొదలు కష్టములు వచ్చినా ఆ తరువాత సుఖములు వస్తాయట.

ఇంకా నాకు ఎన్నెన్నో ఆలోచనలు కలిగాయి. అవి ఏమంటే, మనము మంత్రజపం చేసినప్పుడే అనుకోకుండా కష్టములు రావటం వల్ల మనము ఆ కష్టములు జపంవల్ల అని పొరబడే అవకాశం కూడా ఉంది. అనీ,...........


కొన్ని మంత్రములను గురువు దగ్గర నుంచి ఉపదేశమును పొంది మాత్రమే జపించాలేమో ? అనీ ఇలా....

పైన యోగి చెప్పిన దానిప్రకారం అంటే, "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రము ముక్తి మంత్రము అని చెప్పినదానిప్రకారం చూస్తే ............. ఈ మంత్రం పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళకు బాగా అవసరం. ఉదా... ........ పెద్దలు నాలుగు ఆశ్రమధర్మములను గురించి చెప్పారు కదండి.


అలా నాలుగు ఆశ్రమధర్మములను నిర్వర్తించి క్రమముగా మోక్షమునకు అర్హతను సంపాదించుకోవచ్చని పెద్దలే తెలపటం జరిగింది. (ఈ రోజుల్లో వానప్రస్థాశ్రమం అంటే వనములకు వెళ్ళటం అందరికీ అయ్యే పని కాదు కదా ! కాబట్టి, ఉన్నచోటే మనస్సును అలా నిష్కామముగా ఉంచుకోవచ్చట. )


కానీ కొంతమందికి ( పెద్దవయస్సు గల వాళ్ళు ) వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళకు మనస్సులో ఇహలోక సుఖముల పట్ల కొద్దిగా అయినా అనురక్తి తగ్గటం జరగక బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి మహా మంత్రములు ఎంతో సహాయపడతాయి అని నాకు అనిపించిందండి.


అలాగే నారదుల వారు ప్రహ్లాదునికి ఈ మంత్రమును ఉపదేశించారన్న విషయాన్ని చూస్తే, మరి ప్రహ్లాదులవారు వివాహం చేసుకోవటం, పుత్ర, పౌత్రులను పొందటం జరిగింది కదా ! అలా చూస్తే ఈ మంత్రం ఇహలోక,పరలోక శుభములను రెండింటినీ ఇచ్చే మంత్రమని తెలుసుకోవచ్చు..


ఏమిటో నాకు పెద్ద పాండిత్యం లేకపోయినా ( పెద్ద
పాండిత్యం కాదు , నాకు సంస్కృతం అస్సలు రాదండి. ) ఇందులో తప్పులున్నయెడల నా అజ్ఞానాన్ని మన్నించవలెనని భగవంతుని మరియు పెద్దలను ప్రార్ధిస్తున్నాను....... .. ...

Saturday, November 6, 2010

అనగనగా ఒక కధ.....

ఇప్పుడు వ్రాయబోయే కధ నేను చాలా కాలం క్రిందట చదివినదండి. సంభాషణలు ఉన్నవున్నట్లు గుర్తులేవు గానీ, కధ సారాంశం చాలా వరకు గుర్తుందండి.

నారదుల వారు ఎప్పుడూ నారాయణ నామ స్మరణ చేస్తూంటారు గదా !

ఒకప్పుడు నారదుల వారి మనస్సులో తాను చాలా గొప్ప భక్తుడిని అనే భావం ప్రవేశించిందట.


అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇంకొక గొప్ప భక్తుని గురించి చెప్పదలిచారట. అప్పుడు నారదులవారు ఆ భక్తుడెవరో తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతను ప్రదర్శించారట.

అప్పుడు , శ్రీ మహావిష్ణువు ఒక సామాన్య రైతును చూపించారట. ఆ రైతు తన స్వధర్మమును చక్కగా ఆచరిస్తూ సామాన్యముగా జీవిస్తున్నాడు.

నారదునిలా చాలాసార్లు దైవనామాన్ని స్మరించటం లేదు. అతనెలా గొప్ప భక్తుడు అవుతాడని నారదునికి సందేహం కలిగింది.

అప్పుడు విష్ణుమూర్తి నారదునికి ఒక పోటీ పెట్టటం జరిగింది. అదేమిటంటే అంచుల నిండుగా ద్రవపదార్దమున్న ఒక పాత్రను తలపైన పెట్టుకుని ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా ప్రదక్షిణలు చేయాలి.

ఈ విధముగా నారదుడు పాత్రను తలపైన పెట్టుకుని ప్రదక్షిణలు ప్రారంభించారట. చాలా సమయం గడిచింది.

అప్పుడు విష్ణుమూర్తి నారదునితో, ఇప్పటికి ఎన్నిసార్లు నారాయణ నామస్మరణం జరిగిందని అడిగారట.

అప్పుడు నారదుడు ఆ పాత్రలోని పదార్ధం ఎక్కడ క్రింద చిందుతుందో అన్న ఆలోచనలో ఉన్న తాను నామస్మరణం అంతగా చేయలేదని చెప్పటం జరుగుతుంది.అప్పుడు విష్ణుమూర్తి ఆ రైతు సంసారనిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉండి ఎక్కువగా నామస్మరణం చెయ్యలేకపోయినా కొద్దిసార్లు మాత్రమే చేస్తున్నా అతని ధర్మబధ్ధజీవనం, బలమైన భక్తిభావం ఇలాంటి కారణములవల్ల అతనూ గొప్ప భక్తుడే అని చెప్పటం జరిగిందట.


ఈ కధను నాకు గుర్తున్నంతవరకు వ్రాయటం జరిగిందండి.

నాకు ఈ కధ ఏ పుస్తకములో చెప్పబడిందో తెలియదండి.

ఇందులో తప్పులు ఉన్నయెడల దయచేసి క్షమించవలెనని భగవంతుని ప్రార్దిస్తున్నాను.....
...

Friday, November 5, 2010

కొన్ని వ్రణములు మందులతో తగ్గుతాయి. కొన్ని తీవ్రమయిన వ్రణములు శస్త్రచికిత్స ద్వారా కోసిపారేస్తే గానీ

ఇంతకు ముందు పోస్ట్ వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి.

ఏమంటే, పాపములు చేసే వాళ్ళు దైవపూజకు అర్హులు కారు అనుకుంటే ఈ కలికాలములో పాపములు చెయ్యనివాళ్ళు ఎంతమంది ఉంటారు ?

అదీకాక వారిని దైవకార్యక్రమముల వంటి మంచి కార్యక్రమములకు దూరం చేస్తే వారు మంచికి మరింతగా దూరమయ్యే అవకాశం ఉంది.

సత్సంగం వల్ల చెడ్డ ఆలోచనలు దూరమయి చెడ్డవాళ్ళు మంచిగా మారే అవకాశం ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు కదండి. అందుకే మంచివాళ్ళయినా, చెడ్డవాళ్ళయినా దైవపూజకు అర్హులే.


అయితే, కొన్ని ప్రాచీన గ్రంధములలో ఏమని ఉంటుందంటే ................ అందులోని విషయములను భక్తిలేని వారికి చెప్పవద్దని హెచ్చరిస్తారు పెద్దలు.

ఎందుకంటే, కొందరు దురాశాపరులు ప్రాచీనవిజ్ఞానాన్ని, గొప్పమంత్రములను దుర్వినియోగపరచటం వల్ల లోకమునకు హాని కలుగుతుందని పెద్దల అభిప్రాయం కావచ్చు.

ఇలాగే కొంతమంది తీవ్రస్థాయి చెడ్డ మనస్తత్వం గలవాళ్ళు ( పురాణములలో చెప్పబడ్డ రాక్షసులు ) తపస్సులు అవిచేసి, మరింత బలం సంపాదించి లోకములను అల్లకల్లోలం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆఖరికి వారు దైవం చేతిలో సంహరించబడటం అందరికీ తెలిసిన విషయమే.

ఈ రాక్షసులు తీవ్రమయిన తపస్సు చేసినప్పుడు ఆ తపశ్శక్తి వల్ల పుట్టిన వేడికి లోకాలు తల్లడిల్లగా, దేవతలు లోకములను రక్షించుట కొరకు రాక్షసులకు వరప్రదానం చేసినట్లు మనం చదువుకున్నాము.


ఇవన్నీ ఆలోచిస్తే ఇలా అనిపిస్తోందండి. ఈ విశ్వాన్నే సృష్టించిన పరమాత్మకు ........... రాక్షసులకు వరములను ఇవ్వకుండానే , ఆ రాక్షసుల తపశ్శక్తి వల్ల పుట్టిన వేడినుంచి లోకములను కాపాడటం పెద్ద పనేమీ కాదు.


అయితే, పరమాత్మ దయామయుడు. మంచివారు, చెడ్డవాళ్ళు అందరూ వారి బిడ్డలే .

అందుకే రాక్షసులయినా వారు కష్టపడి తపస్సు చేయటం వల్ల దైవం వారికి వరములను ప్రసాదించి, ఆ రాక్షసులు కూడా మంచిగా మారటానికి ఒక అవకాశమును కల్పించిందని మనం భావించవచ్చు.


కానీ వరములను పొందిన తరువాత వారు మంచిగా మారకుండా లోకులను పీడిస్తూ ఉండటం వల్ల దైవం వారిని సంహరించవలసి వస్తోంది.


ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ రాక్షసులు ఒక ప్రక్క దైవంవల్లనే వరములను పొందుతూ , ఆ వరముల సాయంతోనే లోకులను పీడించటానికి, దైవాన్ని ఎదిరించుటకు ప్రయత్నిస్తారు.

కానీ సదా లోకక్షేమం కోరే దైవం చూస్తూ ఊరుకోవటం జరగదు కదా !

అసలు ఈ రాక్షసులకు తపస్సు చేసేటప్పుడు త్వరగా వరములను ప్రసాదించటం ఒకరకముగా మంచిదే. లేకపోతే వారు అలాగే తపస్సు చేస్తూ మరింత శక్తిని పొందే అవకాశం ఉంది.


వారిని సంహరించటం వారికి కూడా మంచి చేయటమేనని పెద్దలు చెబుతున్నారు. ఎలాగంటే ఆ రాక్షసులు మరిన్ని చెడ్డపనులు చేసి మరిన్ని పాపములు మూటకట్టుకోకుండా అన్నమాట.


......ఇవన్నీ ఎలాగంటేనండీ, ........... ఉదా......... శరీరంపై వచ్చిన వ్రణములు కొన్ని మందులతో తగ్గుతాయి. కొన్ని తీవ్రమయిన వ్రణములు శస్త్రచికిత్స ద్వారా కోసిపారేస్తే గానీ పోవు.


అలాగే కొద్ది స్థాయి చెడ్డవాళ్ళు దైవపూజల వల్ల మంచిగా మారే అవకాశం ఉంది. తీవ్రస్థాయి చెడ్డతనం కలిగిన వాళ్ళు మారరు .................. వారికి వెయ్యవలసిన శిక్షను వారికి దైవం వేసేవరకూ....... అని తెలుస్తోంది.


ఇలా ప్రతి విషయానికి మనకు తెలియని ఇంకా ఎన్నో కోణములు ఉంటాయని అనిపిస్తోందండి.................
....

Wednesday, November 3, 2010

తనవరకూ వస్తే గానీ తత్వం తెలియదు అని పెద్దలు అన్నట్లు.................

ఇంతకుముందు పోస్ట్ లో ......... కొంతకాలం క్రితం మాకు కొన్ని సమస్యలు వచ్చాయని వ్రాయటం జరిగింది కదండి.


ఆ సమస్యలు రాకముందు నా ఆలోచనా విధానం ఎలా ఉండేదంటేనండి, ఎవరైనా నన్ను దేవుడిని ఏమి కోరుకున్నావు ? అని అడిగారనుకోండి ....... నేను ఏదో గొప్ప వేదాంతిలా ................ ఇలా చెప్పటం జరిగేదండి.........మనము కోరుకునేదేమిటి, భగవంతునికి తెలియదా ఏమిటి, మనకి ఏమి కావాలో........ అని........


ఇంకా, నా మనసులో కూడా ....... చాలామంది జనం కోరికలకోసమే గుడికి వస్తారు కానీ భక్తితో కాదు, నేను అలా కాదు, నేను అంతలా కోరికలు కోరను ........ ఈ విధంగా ఆలోచిస్తూ నేను కొంచెం గొప్ప అన్న అహంకారం ( చాలా కొద్దిగా ) నాలో ఉండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుందండి.


పెద్ద గా సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరూ గొప్పవారే . సమస్యలు వచ్చినప్పుడే కదా ! ఎవరు ఏమిటో తెలిసేది.


తీరా సమస్య నాకే వచ్చేసరికి మాత్రం నేను ........... దేవునికి తెలియదా ఏమిటి....... నాకుఏమి కావాలో అని అనుకోలేకపోయాను . ఆ సమస్య నుంచి రక్షించమని భగవంతుని కోరుతూ గుడుల చుట్టూ తిరిగిన తర్వాత నాకు తత్వం తెలిసివచ్చింది.మనం ఇతరులను , వాళ్ళు కోరికలకోసం మాత్రమే గుడికి వెళ్తున్నారు .......... ఈ విధముగా అనుకుంటూ ఎవరి భక్తినీ తక్కువగా చూడకూడదని తెలిసివచ్చింది. .........


ఎవరి శక్తికొలదీ వారు భగవంతుని సేవిస్తారు. మనం ఎవరి భక్తినీ తక్కువగా భావించకూడదు. ఏమో ఇప్పుడు కోరికలతో దైవాన్ని ప్రార్దించేవారే కొంతకాలానికి అలా పూజిస్తూ క్రమముగా................... మహాభక్తులు, గొప్ప వేదాంతులు కావచ్చు కూడా..........కానీ కొంతమంది ఉంటారు, చాలా పాపాలూ చేసేసి తీరా కష్టాలు వచ్చేటప్పటికి పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా .......... దేవుడా రక్షించు అని భగవంతుని సతాయించేవాళ్ళని....... సమర్ధించటం న్యాయం కాదు కదా...........
ఇలాంటి వాళ్ళవల్లే ఆస్తికులకు చెడ్డపేరు వస్తోంది అని.........ఇంతకుముందు అనుకోటం జరిగేది.
ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి ........... అసలు చెడ్డపనులు చేసే వారికి భగవంతుని అవసరం మరింతగా ఉంది. పూజలు లాంటి మంచి కార్యక్రమములు చేస్తూ ఉంటే, అలా క్రమంగా వాళ్ళూ మంచిగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని.


ఇంకా ఇలా అనిపిస్తుందండి, పూజలు చేస్తూ కూడా ఇన్ని పాపాలు చేస్తున్నారంటే, అసలు పాప భయం, దైవభక్తి కొంచెం కూడా లేకపోతే వాళ్ళు మరెన్ని పాపాలు చేస్తారో గదా అనిపిస్తుంది..

అందుకే ఎవరు పూజలు చేసినా మనం సంతోషించాలి...........


ఇంకా, నేను ఇప్పుడు కూడా కోరికలకోసం మాత్రమే భగవంతుని పూజించకూడదు ఇలాంటి మాటలు చెప్పినా, ఇంతకుముందు అన్నదానికి, ఇప్పుడు అన్నదానికి భావములో తేడా ఉన్నదిలెండి...........
......

Monday, November 1, 2010

సమస్యల నుంచి కూడా లాభాలు...............

మేము ఆ మధ్యన అమర్ నాధ్ ,వైష్ణవీ దేవి యాత్రలు చేసి వచ్చామని ఇంతకుముందు చెప్పాను కదండి. ఆ యాత్రలను మేము కేవలం భక్తి వల్ల మాత్రమే చేయలేదు.


ఆ మధ్య మాకు కొన్ని సమస్యలు వచ్చాయి లెండి. ఆ సమస్యలను తట్టుకోలేక........... ఆ దైవం ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారని , అలా యాత్ర చేయటం జరిగింది.


తెలిసిన వాళ్ళు ఆ యాత్రలు ప్రమాదకరమని భయపెట్టారు. ఆ సమయంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలను భరించటం కన్నా ఆ యాత్రలు చేయటం మాకు కష్టమనిపించలేదు.


మేము ఈ యాత్ర విషయం చెప్పినప్పుడు మా పెద్దవాళ్ళు మొదట్లో భయపడ్డారు....... ( వెళ్ళవద్దని చెప్పినా మేము వినముకదా..... ) మాకూ భయం ఉన్నా, ఈ రోజుల్లో ప్రమాదం ఎక్కడ లేదు........ అని సర్దిచెప్పుకుని భయంవేసినప్పుడు దైవాన్ని తలచుకొని ధైర్యాన్ని తెచ్చుకోవటం జరిగింది.


మొత్తానికి ఆ భగవంతుని దయవల్ల క్షేమంగా యాత్ర చేసి తిరిగి వచ్చాము. మా పెద్దవాళ్ళు ఆ విషయం గురించి ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఆ యాత్రలు చెయ్యటం గొప్పగా భావిస్తున్నారు.


అవన్నీ తలచుకొంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి, అలా సమస్యలు రావటం వల్లనే గదా ................... అంత గొప్పయాత్రలు చేయటం జరిగిందని, ............. అది మా అదృష్టమని ఇప్పుడు అనిపిస్తోంది.


ఎందుకంటే నేను ఈ జన్మలో ఎప్పుడూ ఆ యాత్రలు చేస్తానని కనీసం ఊహించలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే. అంతా భగవంతుని దయ.


ఈ సంఘటనల అనంతరం నేను జీవితాన్ని సరికొత్త కోణం నుంచి చూడటం నేర్చుకుంటున్నాను.

ఆ సమయంలో నాకు కష్టంగా అనిపించినా, కొన్ని నియమాలను పాటించి దైవపూజ చెయ్యటం వల్ల ఇప్పుడు రోజువారీ పనులలో ఒక క్రమశిక్షణ పాటించటాన్ని నేర్చుకుంటున్నాను. (ఇంతకూ ముందు
క్రమశిక్షణ లేదని కాదు .... మరికొంచెము పాటించటాన్ని నేర్చుకుంటున్నాను )


ఇంకా, నాలో ఎంతో మార్పు వచ్చింది.

ఈ విధంగా కష్టముల వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

ఈ మధ్యన టి.వి లో పెద్దలు చెప్పినట్లు ఎప్పుడైనా కష్టములు వచ్చాయని భయపడకూడదు. భగవంతుని నమ్మి ధర్మకార్యములు చేస్తూ ఉంటే పరిష్కారమార్గం తప్పక లభిస్తుంది.........