koodali

Wednesday, November 10, 2010

నాకు పూర్తిగా తెలియని విషయాలు .....................

 

 

ఇది ఆ మధ్యన నేను ఒక పుస్తకములో చదివిన సంగతి అండి. ......

అదేమిటంటేనండి, ఆ పుస్తకములో ఏమని ఉందంటే .... ఒక ఆయన ఒక స్వామివారి భాగవత ఉపన్యాసమునకు వెళ్ళారట.

అప్పుడు ఆ ఉపన్యాసములో నారదుడు- ప్రహ్లాదుడికి "ఓం నమో భగవతే వాసుదేవాయ "అనే మంత్రాన్ని ఉపదేశించే విషయాన్ని చెబుతున్నారట. దీనిని విన్న ఆయనకు ఆ ఉపన్యాసం చాలా ఆనందాన్ని ఇచ్చిందట.

ఆయన అప్పటినుంచి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టారట.

అయితే ఆ తరువాత కష్టాలు రావటం , ఈ కష్టాలకు కారణం, ఈ మంత్రమేనని భావించి వారు ఆ స్మరణను ఆపివేయటం జరిగిందట. కష్టాలు నెమ్మదిగా తొలగిపోయాయట.

ఆయన ఆ మంత్రాన్ని జపించటంవలన కష్టాలు రావటానికి కారణం ఏమిటని ఒక యోగిని అడిగినప్పుడు, " ఏముందీ నీవు భక్తి- జ్ఞాన - వైరాగ్య - తపస్సులను అడిగావు. వాసుదేవుడు ఇచ్చారు. అందుకే ఈ కష్టాలు. ఈ మంత్రం ముక్తి మంత్రమని, చాల శక్తివంతమైనదని వారు తెలిపారట. 


ఇవన్నీ చదివాక నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అంటే తెలియని వాళ్ళు అన్నీ మంత్రములు జపించకూడదు కాబోలు అని.

ఇంకా , ఈ మధ్యన టి.విలో పెద్దలు ఏమి చెప్పారంటేనండీ , భక్తులకు మొదలు కష్టములు వచ్చినా ఆ తరువాత సుఖములు వస్తాయట.

ఇంకా నాకు ఎన్నెన్నో ఆలోచనలు కలిగాయి. అవి ఏమంటే, మనము మంత్రజపం చేసినప్పుడే అనుకోకుండా కష్టములు రావటం వల్ల మనము ఆ కష్టములు జపంవల్ల అని పొరబడే అవకాశం కూడా ఉంది. అనీ,...........


కొన్ని మంత్రములను గురువు దగ్గర నుంచి ఉపదేశమును పొంది మాత్రమే జపించాలేమో ? అనీ ఇలా....

పైన యోగి చెప్పిన దానిప్రకారం అంటే, "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రము ముక్తి మంత్రము అని చెప్పినదానిప్రకారం చూస్తే ............. ఈ మంత్రం పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళకు బాగా అవసరం. ఉదా.. పెద్దలు నాలుగు ఆశ్రమధర్మములను గురించి చెప్పారు కదండి.


అలా నాలుగు ఆశ్రమధర్మములను నిర్వర్తించి క్రమముగా మోక్షమునకు అర్హతను సంపాదించుకోవచ్చని పెద్దలే తెలపటం జరిగింది. (ఈ రోజుల్లో వానప్రస్థాశ్రమం అంటే వనములకు వెళ్ళటం అందరికీ అయ్యే పని కాదు కదా ! కాబట్టి, ఉన్నచోటే మనస్సును అలా నిష్కామముగా ఉంచుకోవచ్చట. )


కానీ కొంతమందికి ( పెద్దవయస్సు గల వాళ్ళు ) వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళకు మనస్సులో ఇహలోక సుఖముల పట్ల కొద్దిగా అయినా అనురక్తి తగ్గటం జరగక బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి మహా మంత్రములు ఎంతో సహాయపడతాయి అని నాకు అనిపించిందండి.


అలాగే నారదుల వారు ప్రహ్లాదునికి ఈ మంత్రమును ఉపదేశించారన్న విషయాన్ని చూస్తే, మరి ప్రహ్లాదులవారు వివాహం చేసుకోవటం, పుత్ర, పౌత్రులను పొందటం జరిగింది కదా ! అలా చూస్తే ఈ మంత్రం ఇహలోక,పరలోక శుభములను రెండింటినీ ఇచ్చే మంత్రమని తెలుసుకోవచ్చు..


ఏమిటో నాకు పెద్ద పాండిత్యం లేకపోయినా ( పెద్ద
పాండిత్యం కాదు , నాకు సంస్కృతం అస్సలు రాదండి. ) ఇందులో తప్పులున్నయెడల నా అజ్ఞానాన్ని మన్నించవలెనని భగవంతుని మరియు పెద్దలను ప్రార్ధిస్తున్నాను.

 

No comments:

Post a Comment