koodali

Friday, November 26, 2010

మనం భగవంతుడిని విసిగిస్తున్నామా ?


అవునండి , ఒకోసారి నాకు ఇలాగే అనిపిస్తుంటుంది. మనము మన మనసును అదుపులో పెట్టుకోలేక అంతులేని కోరికలతో భగవంతుని ఇబ్బంది పెడుతున్నామేమో అని.

మనుష్యులకు కష్టాలు వారు పూర్వం చేసిన తప్పులవల్లనే వస్తాయి. మనం తప్పులు చేసి తీరా కష్టాలు వచ్చాక రక్షించమని భగవంతుని విసిగిస్తాము.


ఎట్లాగంటే ...పిల్లలు గనక తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక తప్పులు చేసి తీరా ఇబ్బందుల్లో ఇరుక్కున్న తరువాత తల్లిదండ్రులను సహాయం అడుగుతారు. అప్పుడు వాళ్ళు నానా కష్టాలు పడి వారిని రక్షిస్తారు.


ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు...... మనకు చాలాసార్లు డబ్బులు లేని పేదవారు ఎదురుపడి ఏదైనా దానం చెయ్యమని అడుగుతుంటారు. నాకు జాలి అనిపించి కొన్నిసార్లు దానం చేస్తూంటాను.


కానీ, ఒకసారి ఇలా అడిగినప్పుడు, నాకు చాలా చిరాకు అనిపించింది. అసలు వీళ్ళందరూ పనిచేయకుండా ఇలా విసిగిస్తుంటారు ఏమిటో అనిపించింది. 

( పని చేతనయిన వాళ్ళకి కూడా చేయటానికి ఈ రోజుల్లో పని దొరకటం లేదు లెండి. నాకు వేరే కారణాలవల్ల మనసు బాగోలేదండి అప్పుడు. మనసు చిరాగ్గా ఉన్నప్పుడు ప్రతిదీ విసుగ్గానే ఉంటుంది. తరువాత అలా చిరాకు పడినందుకు బాధపడ్డాను. )


సరే,........అలా అనిపించిన కాసేపటికి మళ్ళీ ఇలా అనిపించిందండి......... సహాయం చెయ్యమని అన్నందుకు వాళ్ళ గురించి మనసులో చిరాకు పడ్డావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి ? చిన్న సమస్య రాగానే సహాయం కోసం దైవాన్ని అర్ధించటం లేదా ? అని నా మనసు నన్ను ప్రశ్నించినట్లు అనిపించిందండి.


ఇంకా, సహాయం చెయ్యమని అడిగిన వాళ్ళను చూసి నాకు చిరాకు అనిపించింది కదా....
రి మనం భగవంతుడిని ఇలా ఎన్నోసార్లు సహాయం అడుగుతూ విసిగిస్తున్నాము కదా....ది ఏం న్యాయం ? పాపం.. అనిపించిందండి.

అందుకే మన కష్టాలు పోవటానికి భగవంతుని వేడుకునే ముందు ఒక యోగ్యతను సంపాదించుకోవాలి.


అంటే ధ్యానం, తపస్సు, ఉపవాసం ద్వారా కొంచెం కష్టపడటం, లేక మన సంపదలో కొంత ఇతరులకు దానం చేయటం, విద్యాదానం, అన్నదానము, భక్తితో పూజలు, వ్రతములను చేయటం, దుష్ప్రవర్తన లేకుండట ............ ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇతరులకు సహాయపడటం చేసినప్పుడు .......... మనం పూర్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు భగవంతుని వేడుకోవటానికి మనకు ఒక యోగ్యత వస్తుందని నాకు అనిపించిందండి.

మనం మన పాటికి సోమరితనంతో ఉంటూ భగవంతుడే అన్నీ సమకూర్చాలి అనుకోవటం ఏం న్యాయం ?


ఉదా...మన పిల్లలు వీడియో గేంస్ ఆడుకుంటూ మనల్ని హోంవర్క్ చెయ్యమన్నారనుకోండి, వాళ్ళ హోంవర్క్ మనం చేస్తూపోతే ..... తీరా పరీక్షలో వారేమి రాయగలరు ? అందుకని కష్టపడి చదవటం వాళ్ళకి తప్పనిసరి.


అయితే వాళ్ళకు హోంవర్క్ చెయ్యటములో మనం సహాయంచెయ్యవచ్చు. అలాగే మన పని మనం సరిగ్గా చేస్తూ, మనకు చేతకాని సమయంలో , లేదా పెద్ద కష్టం వచ్చినప్పుడు ..... దైవాన్ని సహాయం చెయ్యమని అడగటంలో తప్పులేదు. అంతేగానీ ప్రతిచిన్న సమస్యకు దైవాన్ని విసిగించటం బాగుండదు.


మన తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని ఏదైనా పనిలో కష్టపడుతుంటే ఎంతో బాధపడతాము. అయ్యో వారు ఇంత పనిచేస్తున్నారే అని . వారి పనిని తగ్గించి వారిని సంతోషముగా ఉంచటానికి ప్రయత్నిస్తాము.


మరి భగవంతుడు మాత్రం మన బంధువు కాదా ? చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. మనం భగవంతుని గురించి కూడా ఆలోచించవద్దా ?


అందుకని మనం మన తల్లిదండ్రులను, పిల్లలను వాళ్ళకు ఇష్టమయిన పనులు చేసి సంతోషపెట్టడానికి ఎలా ప్రయత్నిస్తామో , అలాగే, ......
నము మన అతి కోరికలను అదుపులో పెట్టుకుని , సత్ప్రవర్తనతో జీవించి మన జన్మజన్మల ఆత్మబంధువు అయిన ఆ దైవానికి కూడా ఆనందాన్ని కలిగించాలి.

 

No comments:

Post a Comment