koodali

Monday, November 15, 2010

భగవంతుని విషయములో మనము చేసేది తప్పా...... 2

 

భగవంతుని ఫోటోస్ ను ఎక్కడపడితే అక్కడ అన్నిటిపైనా ముద్రించటం గురించి ఇంతకు ముందు బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో వ్రాశానండి. మళ్ళీ దానికి కొన్ని విషయాలను జోడించి ఆ పోస్ట్ ను ప్రచురిస్తున్నాను.

నా బ్లాగ్ పేరు ఆనందం.నావంటి సామాన్యులు కూడా మా అభిప్రాయములు తెలిపేవిధముగా ఇటువంటి టెక్నాలజీ కనిపెట్టిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.

భగవంతుని ఫొటోస్ గురించి నా అభిప్రాయములు చెప్పాలని ఉంది. దయచేసి మీరూ ఆలొచించండి.

మనము దేవుని ఫొటోస్ కూడా దేవునితో సమానముగా గౌరవిస్తాము. మరి ఎక్కువగా ప్రింట్ చేసి వాడిన తరువాత చెత్త లో వెయ్యటము వల్ల పుణ్యం రాకపోగా పాపము వస్తుందని నా అభిప్రాయము.


మనము గుడికి వెళ్ళేటప్పుడు దారిలో చించి పడవేసిన హారతి మఱియు అగరుబత్తి కవర్లు వాటిపైన దేవుని బొమ్మలు మీరు చూసే ఉంటారు. అవి తొక్కుతూనే మనము గుడిలోకి వెళ్తాము .మరి ఇది ఎంత ఘోరం.

ఈరోజుల్లో గుడి లో ఇచ్చే ప్లాస్టిక్ ప్రసాదం కవర్స్ పైన కూడా దేవుని బొమ్మలు ఉంటున్నాయి.

మరి ప్రసాదం తిన్నాక ఆ కవర్లు నీటిలో వేస్తే పొల్యుషన్. మరి అయిపోయిన ప్రసాదం కవర్లు ఎక్కడ వెయ్యాలి అన్నది సమస్య. వాటిని చెత్తకుప్పలలోనే వెయ్యటం ఎంతో పాపం .


అందుకే భగవంతుని బొమ్మలు తక్కువగా ప్రింట్ వేసి భగవంతుని ఎక్కువగా మనసులో నిలుపుకుందాము. ఆదేవుని దయకు పాత్రులమవుదాము.

మన పాత కాలములో ఇన్ని విగ్రహములు లేకపోయినా వారు మనకన్నా తక్కువ స్థాయి భక్తులు కాదని మనకు తెలిసినదే.

మనము అందరము ఈ విషయం దయచేసి ఆలోచించాలి.

ఈ రోజుల్లో మన కష్టాలకు ఇలా భగవంతుని అవమానించటము కూడా ఒక కారణమని నా అభిప్రాయము.

ఆ మద్య కొందరు మన దేవుని బొమ్మలు చెప్పులమీద ప్రింట్ వేసినందుకు ఛాలా బాధ పడ్డాము. మరి మనము చేసే పనులు కూడా అటువంటివే కదా... దయచేసి ఆలోచించండి...


భక్తి ఉంటే మనము ఇతరులను పీడించకుండా ..... అలా ధర్మబద్ధముగా జీవితాన్ని గడపటం మరియు బలమైన భక్తిభావం ద్వారా భగవంతుని సంతోషపరిచి ,........ తద్వారా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు..

అంతేకానీ... భగవంతుని చిత్రములు ప్రతీదాని పైనా ముద్రించి ఆనక వాటిని చెత్తకుప్పలో వెయ్యటం ద్వారా భగవంతుని కృప పొందగలమని అనుకోవటం వెర్రితనం.


కొంతమంది దేవాలయాల్లో ప్రతిబింబాలు కనిపించే అద్దం లాంటి నున్నని గ్రానైట్ రాయిని వేయిస్తున్నారు. అవి గుడిగోడల పైన అందంగానే ఉంటాయి. శుభ్రపరచటానికి సులువుగానే ఉంటుంది.

కానీ, గుడిలో నేలపైన ఇలాంటి అద్దం లాంటి రాళ్ళు పరచటం వల్ల దైవ విగ్రహం ప్రతిబింబం నేలపైన ప్రతిబింబించి... మనము నడిచేటప్పుడు తొక్కవలసి రావటం నేను గమనించానండి.

ఇంకా నేల ఇలా నున్నగా ఉండటం వల్ల తడిగా ఉన్నప్పుడు కాలు జారి పడే అవకాశం కూడా ఉంది.


నేలపైన (ఫ్లోరింగ్ ) మాత్రం నున్నటి అద్దంలాంటి బండలు బదులు ఇతరరకములు వేయటం మేలని నా అబిప్రాయమండి. ఇప్పటికే ఇలా వేసిన చోట నేల పైన మూల విగ్రహం ప్రతిబింబము పడేచోట, ... ప్రతిబింబం పడి ఎవరూ తొక్కకుండా ఉండటానికి నేలపైన కాలిపట్టా వెయ్యవచ్చు.


అయితే ఇవన్నీ మరీ చాదస్తం అనుకుంటే నేనేమి చెయ్యలేను కానీ అండి. నాకు తోచింది చెప్పాను అంతే.

మనము పూజలు చేసేటప్పుడు ఏదయినా పొరపాటు జరిగితేనే మహాపరాధం అని అనుకునేవాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. మరి ఇలా భగవంతుని బొమ్మలు ప్రతీదానిపైనా చిత్రించి .... వాడకం తర్వాత చెత్తకుప్పలో వెయ్యటం ..... ఇవన్నీ మహాపరాధములు కావా ?


ఇలా అంటే కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఎక్కడ లేడు అంటారు.... దేవుడు ఎక్కడైనా ఉన్నాడన్న పరిణతి నిజముగా వచ్చిన వ్యక్తి తన అంతరంగములోనే దైవాన్నీ దర్శిస్తారు.


మనకు వస్తువులపైన చిత్రించుకోవటానికి పువ్వులు, ఇంకా ఎన్నో అందమయిన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. వాటిని ఎన్నయినా మనకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడయినా ముద్రించుకోవచ్చు.

వీలయినంతవరకూ దేవుని రూపాన్ని ప్రతిదానిపైనా ముద్రించి ఆనక అపవిత్ర ప్రదేశములలో పడవేసి అగౌరవించకూడదని నా విన్నపమండి. .


ఇప్పుడు కొంతమంది చీరల పైనా ఇలా దేవుని బొమ్మలు ముద్రించుకుంటున్నారు. అదీ నడుము పై భాగములో అయితే ఫరవాలేదు......నడుముకు క్రింద భాగములో ముద్రించుకుంటే .కూర్చున్నప్పుడు బొమ్మపైన కూర్చోవలసి వస్తుంది. ఇది అపచారం కదా...


ఇవన్నీ ఇలా ఎందుకు రాస్తున్నానంటేనండి ..... రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు అడుగు వేస్తే మురికి మధ్య దేవుని బొమ్మలతో కూడిన కాగితాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి......... ఏమీ చెయ్యలేని నిస్సహాయత ..

 

8 comments:

  1. చాలా మంచి పోస్ట్ keep it up

    ReplyDelete
  2. ధన్యవాదాలు. ఎన్నో రోజులుగా నా ఆలోచనలను కెలుకుతున్న అంశాన్ని ప్రస్తావించారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి?

    ReplyDelete
  3. ఈ పోస్ట్ చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు థాంక్స్. మీ వంటి యువత ఇలా దేవుని విషయముల పట్ల ఆసక్తిని కలిగి ఉండటం నిజంగా అందరూ ఆనందించవలసిన విషయం...

    ReplyDelete
  4. ఈ పోస్ట్ చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు కృతజ్ఞతలండి. ఈ రోజుల్లో అచ్చుయంత్రములు వచ్చాక పేపర్స్, పుస్తకములలో దేవుని చిత్రములు వెయ్యటం ఎవరూ నివారించలేని స్థాయికి చేరుకుందండి. ఆఖరికి బీడీ కట్టలపైన, బూంది పొట్లాలపైనా దేవుని బొమ్మలే. అవన్నీ వాడేసిన తరువాత నీళ్ళలో వేస్తే చెరువులు పూడుకుపోయి ఎందుకూ పనికిరావు. అందువల్ల, ఎవరికి వారే ఇలా దేవుని అవమానించటం మానుకుని అవసరమైనంతవరకే దేవుని చిత్రములు ముద్రించుకోవాలి. మనము భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండటం, జీవితములో ధర్మముగా ప్రవర్తించటం ద్వారా ఆ దేవుని సంతోషపరిచి వారి కృపకు పాత్రులమవ్వచ్చు అని నా అభిప్రాయమండి.

    ReplyDelete
  5. మంచి విషయం ప్రస్తావించారు. అగరబత్తులైన, హారతి ప్యాకెట్లైనా, మరేవైనా సరే దేవుని పేరు పెట్టుకోవడం వరకు ఫర్వాలేదు అంతేగాని వాటిమీద దేవతాచిత్రాలు అవసరం లేదు. అలాగే కొన్నిటి మీద మంత్రాలు కూడా వ్రాస్తున్నారు. అది అవసరం లేదు. వాటిని స్వయంగా మనమే బయటపడేయాల్సి రావటం ఇబ్బందికరం. మనం ఈ పని చేస్తూ ఇతరులను తిట్టుకోవడం అనవసరం. అందుకే అంగడి సరుకుల మీద దేవునిబొమ్మలు చిత్రించటం మానివేస్తే బాగుంటుంది. పుణ్యం చేసుకోలేకపోయినా ఫర్వాలేదు. కాని తెలిసి పాపం చేయడమెందుకు.

    శ్రీవాసుకి

    ReplyDelete
  6. ముందుగా బియ్యపు బస్త్తలపైన ఈ చిత్రాలను ముద్రించడం ఆపాలి.ఎందుకంటే వాటిని కాళ్ళు తుడుచుకునే పట్టాలుగా వాడుతున్నారు గనుక.

    ReplyDelete
  7. ఈ పోస్ట్ చదివి మీ అభిప్రాయములు తెలియచేసినందుకు కృతజ్ఞతలండి. మీరు అన్నట్లు పుణ్యం రాకపోయినా ఫరవాలేదు. పాపం రాకుంటే అంతేచాలు. ఇలా రాయవచ్చో లేదో తెలియదు కానీ అండి, కొంతమంది తెలిసినవాళ్ళు ఫంక్షన్స్ అప్పుడు మనకు గిఫ్‌ట్ గా దేవుని బొమ్మలు ఇస్తుంటారు. అవి కూడా ...... వద్దంటే ఏమి జరుగుతుందో అన్న భయంతో తీసుకుంటాము. ఇంట్లో పెట్టుకున్న తరువాత వాటిని సరిగ్గా శుభ్రపరచక దుమ్ముకొట్టుకుంటే మళ్ళీ అదొక దోషం....

    ReplyDelete
  8. ఈ పోస్ట్ చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు కృతజ్ఞతలండి. మీరు చెప్పినట్లు బస్తాల పైన దేవుని బొమ్మ ఉండటం వాళ్ళు దానిపైన కాళ్ళు తుడుచుకోవటం నేను కూడా చూశానండి మా బంధువుల దగ్గర.

    ఇలా రాస్తే మరీ చాదస్తం అనుకుంటారేమో కానీ అండి, ఈ రోజుల్లో చాలా పత్రికలు, వారపత్రికలలో దేవుని కధలు వ్రాసి, ప్రక్కన బొమ్మలు వేస్తున్నారు. మనము భక్తిగా అవి చదివి .................. వీలయితే నమస్కరించుకుని తరువాత ........... ఇక చేసేదేమీ లేక వాటిని పాత పేపర్ వాళ్ళకి అమ్మేస్తాము. వాళ్ళు అవి మిఠాయి షాప్ వాళ్ళకు అమ్ముతారు. మనము ఎప్పుడో బజ్జీలు అవి కొనుక్కున్నప్పుడు ........ ఇలా దేవుని బొమ్మలు ఉన్న కాగితములో కట్టి ఇస్తారు. అప్పుడు, అలా తినటానికి, తరువాత ఆ కాగితాన్ని చెత్తలో పారవెయ్యటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

    నా అభిప్రాయం ఏమిటంటేనండీ, పత్రికలలో దేవుని కధలు వ్రాయటం మంచిదే, ( ఎందుకంటే , ఇలాంటి పేపర్స్ పైన విషయాలు కూడా చదివే అలవాటుంది లెండి నాకు..) కానీ ప్రక్కన బొమ్మలు ముద్రించకుండా ఉంటే బాగుంటుంది కదా అని....

    ReplyDelete