koodali

Friday, August 31, 2012

మరి కొన్ని విషయాలు.


జన్మలు,  పునర్జన్మలు  ఉన్నాయని   దేశవిదేశాల్లో  జరిగిన   ఎన్నో    సంఘటనల  ద్వారా    తెలిసింది. జన్మలు,  పునర్జన్మల  గురించి  జ్యోతిష్యం  ఆధారంగా  తెలుసుకోవచ్చని   పూర్వీకులు    తెలియజేసారు.

 

జ్యోతిష్యం   వేద  పురుషునికి  కన్ను  వంటిదని  పండితులు  చెబుతున్నారు.  జ్యోతిషం  సహాయంతో   ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చట.  గ్రహాలు  నక్షత్రాల  స్థితిగతులను  బట్టి    వాతావరణాన్ని,  ప్రకృతివైపరీత్యాలను,   పంటలు  పండే  విధానాన్ని  ,  వంటి   ఎన్నో  విషయాలను   కూడా    చెబుతుంటారు.    జ్యోతిషశాస్త్రంలో  చెప్పిన  విధంగా  మంచి  ముహూర్తంలో  పనులు  ప్రారంభిచటం  వల్ల  శుభ  ఫలితాన్ని  పొందే  అవకాశం  ఉంది. 

 

అయితే,    ఈ  రోజుల్లో    పంచాంగాలలో    కొన్ని    తేడాలుంటున్నాయి.  ఉదాహరణకు..  ఒకే  ఊరికి  చెందిన  ఒక  పంచాంగంలో ,   ఫలానా  నక్షత్రం  మధ్యాహ్నం  12  గంటలవరకు  ఉంటుందంటే ,  ఇంకొక  పంచాంగంలో   వేరే   సమయం   వ్రాస్తారు.  ఇలా    తేడాలు    ఉండటం  వల్ల    ఎవరు  వ్రాసినది  సరైన  సమయమో  అర్ధం  కాదు. 


 

   నాకు  జ్యోతిషం  గురించి  కొద్దిగా  బేసిక్స్  మాత్రం  తెలుసు.  కొన్ని  సందర్భాలలో  మేము  ముహూర్తాల  కోసం  పండితులను  సంప్రదిస్తాము  కానీ ,  గౌరీ  పంచాంగం  కూడా  ఎంతో  గొప్పది.    మేము  చాలాసార్లు     గౌరీపంచాంగం    పాటిస్తాము.   
గౌరీపంచాంగం    గౌరీదేవిచే  తెలుపబడియుండుటచే  దీనికి  గౌరీ  పంచాంగమను  పేరు  కలిగినదని,     తిధి,  నక్షత్రము, యోగ కరణములు  హోరలు  యోగినీలు   లగ్నము యొక్క   శుభాశుభత్వములతో  పనిలేకుండా   ఆ దినము  గుణరహితమైనప్పటికీ    వ్యతీపాత  సంక్రాంతభద్రాది  అశుభ లక్షణములతో   కూడి యున్నప్పటికి   పరమేశ్వరుని  పూజించి  ఈ గౌరీ   పంచాంగకాలముల  ననుసరించు  వారికి  అన్ని  విషయములందు  విజయము  చేకూరగలదని  ప్రమాణము  కలదని ,ఇది    యెల్లరకు    ఉపయోగార్హమైన   సులభకాల   నిర్ణయ విధానమని    పండితులు  వ్రాసారు. 
 
 
    జ్యోతిషం,  జన్మలు,   పునర్జన్మలు   వంటి    అనేక  విషయాల  గురించి ,  2002 లో  ఆంధ్రభూమి  వీక్లీ లో    "సాత్విక్  "  అనే  రచయిత     " హిమయోగి,   అగ్నిసూర్య " అనే    నవలలలో  చక్కగా   వ్రాసారు.   మహాయోగి   " బాబాజీ "   వారి   గురించిన   వివరాలు   కూడా " హిమయోగి "  అనే  నవలలో    ఉన్నాయి. 


 

 ఈ  నవలలు  ఆంధ్రభూమిలో  వచ్చిన  సమయంలో  రచయిత  పాఠకుల  ప్రశ్నలకు  ఇచ్చిన  సమాధానాలు  కూడా  ఆసక్తిదాయకంగా  ఉన్నాయి.  ఒక  మహాభక్తుని  మరణానంతరం  వారి  చితిమంటలలో  అమ్మవారి  రూపం  కనిపించిన  చిత్రాన్ని  కూడా  అప్పట్లో  ప్రచురించారు. 


 ఇంకా, జన్మలు,   పునర్జన్మలు   గురించి  పరిశోధించిన     Ian Stevenson గురించి  కూడా   తెలియజేసారు.

   జన్మలు,   పునర్జన్మలు   గురించి   ఈ  లింకులో    కొన్ని  వివరములు  ఉన్నాయి. ....

Ian Stevenson - Wikipedia, the free encyclopedia

.....................................


వ్రాసిన    విషయాలలో   అచ్చు   తప్పుల  వంటి    ఏమైనా   పొరపాట్లు   ఉంటే   దయచేసి   క్షమించమని   దైవాన్ని   ప్రార్ధిస్తున్నాను.Wednesday, August 29, 2012

".Matter and energy cannot be created or destroyed "......జన్మపరంపర


తెలుగుభాషా  దినోత్సవం  మరియు  జాతీయ  క్రీడా  దినోత్సవం  సందర్భంగా  శుభాకాంక్షలండి.
.................................


ఆధునికవిజ్ఞానం...".Matter and energy cannot be created or destroyed "......అని  వివరించటం  జరిగింది.  ఈ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉండే  మాట  వాస్తవమే  అనిపిస్తుంది. 


ఉదాహరణకు...  ఎవరైనా  వ్యక్తి   యొక్క    జీవితం  ముగిసినప్పుడు ,   పంచభూతాలతో  తయారైన    శరీరం  పంచభూతాల్లో  కలిసిపోతుంది.  ......  మరి,  ఎన్నో  భావాలతో  కూడిన  మనస్సు  (  ఆత్మ )  ఏమవుతుంది  ?  జీవించి  ఉన్నప్పుడు   మనిషి  మనస్సుతో  ఎన్నో  ఆలోచనలు  ( పనులు ) చేస్తాడు.  అంటే,  మనస్సు  కూడా  శక్తే  కదా  !.... Matter and energy cannot be created or destroyed ...   అన్న  సూత్రం  ప్రకారం..... మరి  మరణించిన  వ్యక్తి  యొక్క  మనస్సు  ఏమవుతుంది  ? మనస్సు ( ఆత్మ ) మరో  శరీరాన్ని  ధరిస్తుంది.   మరో  జన్మనెత్తుతుంది.  పరమాత్మను   చేరేవరకూ  (మోక్షాన్ని  పొందేవరకూ) ఈ   జన్మపరంపర  కొనసాగుతుంది.   ఇదంతా  చూస్తే ,  ప్రాచీనులు  చెప్పినట్లు  జన్మలు,  పునర్జన్మలు   ఉన్నమాట  నిజమే  అనిపిస్తుంది.


 జన్మలు,  పునర్జన్మలు    ఉన్నప్పుడు ,  జీవికి  తాను  చేసిన  పూర్వకర్మల   ఆధారంగా    భవిష్యజన్మ    ఉంటుంది.    జీవి  పుట్టినప్పుడు  ఆ  జీవి  యొక్క  భవిష్యత్తు  ఎలా  ఉండబోతోందో   తెలుసుకుని ,   తగిన  జాగ్రత్తలు  తీసుకోవటానికి ( వీలయినంతలో   భవిష్యత్తును  సరిదిద్దుకోవటానికి  )  జ్యోతిషం   ఉపయోగపడుతుంది.  అందుకే  దయామయులైన  దైవం,  పెద్దలు  జ్యోతిషశాస్త్రాన్ని  లోకానికి   అందించారు.


   జ్యోతిషం  నిజమా  ?  కాదా  ?  అని  ప్రపంచంలో   చర్చలు  జరుగుతుంటాయి.   దైవాన్ని  ,  వేదాలను  నమ్మని  నాస్తికులు  జ్యోతిషాన్ని  నమ్మకపోవటంలో   ఆశ్చర్యం  లేదు.  కానీ,  దైవాన్ని  నమ్ముతాము .  అని  చెప్పేవాళ్ళలో   కూడా  కొందరు ,   జ్యోతిషం  అనేది  అబద్ధం  అనటం  బాధాకరం.


*జ్యోతిషం  వేదాంగాలలో  ఒకటి  అని    మహర్షులే   తెలియజేసారు.


జ్యోతిషం   శాస్త్రమే.   ఉదా..... ఏవిధమైన  ఆధునిక  టెక్నాలజీ  సాయం  లేకుండానే,   పంచాంగం  ద్వారా  లెక్కలువేసి  ,  ఎప్పుడో   రాబోయే  సూర్య,చంద్ర  గ్రహణాలను   సంవత్సరానికి  ముందే   చెప్పగలుగుతున్నారు  కదా  !  పంచాంగ  కర్తలు. సూర్యచంద్రుల    వంటి  గ్రహాలు,  నక్షత్రాల    ప్రభావం  మనుష్యుల  మీద  ఎలా  ఉండగలదు ? అని  కొందరు  సందేహిస్తారు. సూర్యుడు  కూడా  ఒక  విధమైన  నక్షత్రమేనట.  సూర్యచంద్రుల  ప్రభావం  ప్రపంచం  మీద  ఎంతో  ఉంది.      సూర్యుని   నుంచి  వచ్చే  సూర్యరశ్మి   వల్ల    పంటలు  పండుతున్నాయి  .సూర్యరశ్మి,  చంద్రుని  వెన్నెల  వల్ల  మొక్కలు,  వృక్షాలు    శక్తిని  పొందుతాయి.  ఇంకా,    సూర్యుని  వేడి తగిలితే  శరీరం    చురుక్కుమనటం,  చంద్రుని  చల్లదనం   తగిలితే  మనసుకు    హాయిగా  ఉండటాన్ని  మనం  ఫీలవుతున్నాము  కదా  !  ఇవన్నీ    గమనిస్తే   ,   సూర్యచంద్రుల  యొక్క  ప్రభావం  మన    మీద  ఉంటుందని  తెలుస్తోంది    కదా  !  


 చంద్రుని  వృద్ధిక్షయాలను  బట్టి  సముద్రపు  ఆటుపోట్లలో  హెచ్చుతగ్గులు  ఉండటం  అనేది  మనకు  తెలిసిన  విషయమే. 


  ఈ  రోజుల్లో  కొందరు   జ్యోతిష్కులకు    జ్యోతిషం  గురించి   సరైన    ప్రావీణ్యత లేకపోవటం,  సరైన  ఉపాసనా  బలం  లేకపోయినా  జ్యోతిషం  చెప్పటం  వంటి.....కొన్ని  కారణాల  వల్ల  ..జ్యోతిషం   చెప్పటంలో  తప్పులు  వస్తుండవచ్చు. అందుకు    జ్యోతిషాన్ని  తప్పు  పట్టడం ,   జ్యోతిషమే  తప్పు  అనటం  సరైన  పద్ధతి  కాదు.  
 గ్రహాలు,  నక్షత్రాలు   మానవులపై  ఎలా  ప్రభావాన్ని  చూపించగలవు  ? అని    కొందరు  ఆశ్చర్యపోతారు.  ఇలాంటి    ఆశ్చర్యకరమైన  విషయాలు  ప్రపంచంలో  ఎన్నో  ఉన్నాయి.   ఉదా...మొక్కలు,  ఖనిజాల  నుంచి  తీసిన  రసాయన  ఔషధాలను  వాడిన  రోగుల  జబ్బులు  తగ్గటం  కూడా  ఆశ్చర్యకరమైన  విషయమే.  మొక్కలేమిటి  ?  అవి  తింటే  మన  రోగాలు  తగ్గటమేమిటి ?  వాటికి   మనకు  ఏమిటి  సంబంధం....
  కొన్ని  రకాల  మూలికలను  కలిపి   ఔషధంగా   తీసుకుంటే   జబ్బులు  తగ్గుతాయి.  ఇదంతా  వైద్యశాస్త్రం . అని  మనకు  తెలుసు.  అయితే,  సృష్టిలో   ఇలాంటి  ఏర్పాటు  ఎవరు  చేసారు ? .....అని  ఆలోచిస్తే .....
*  దైవం  జీవులకు  అవసరమైన  వాతావరణం,  ఆహారం,  మొక్కలు,  పశుపక్ష్యాదులు,,.....ఇలా  ఎన్నింటినో   ఏర్పాటుచేసారు.  అలాగే  జీవులకు  వచ్చే   శారీరిక,  మానసిక    అనారోగ్యాలకు  మందుగా  మూలికలను  కూడా  ఏర్పాటు చేసారు. 
 ఆ  మూలికలను  ఒక  క్రమపధ్ధతిలో  కలిపితే  మందుగా  తయారయ్యే  విధానాన్ని  ఏర్పాటుచేసారు.   ఉదా...వామును  ఉప్పును  కలిపి  తీసుకుంటే  అజీర్ణం  తగ్గుతుంది.  ఉసిరికాయ  మరికొన్ని  వనమూలికలతో  కలిపి  తయారుచేసిన   చ్యవనప్రాశ  తయారుచేసి  తింటే  జలుబు  వంటివి  తగ్గుతాయి. 
 ఈ  మందులకు  రోగాలను  తగ్గించే  శక్తి  లేకపోతే  సృష్టిలోని   జీవులు  నశించిపోయేవి.  జీవులు  నశించకుండా  దైవం..... ఔషధాలను  ప్రకృతిలో  ఏర్పరిచారు .  
మనిషి  శరీరంతో  ఏ  మాత్రం  సంబంధం  లేని  రకరకాల  మొక్కల,  ఖనిజాల ,పదార్ధాలతో  తయారైన     రసాయనాలను   ఒక  క్రమ  పద్దతిలో  కలిపితే ,   ఆ  విధానం  వల్ల     ఔషధం    తయారయి ,  ఆ  ఔషధం  మనిషి  శరీరంపై ,  మనస్సుపై    ప్రభావాన్ని  చూపిస్తోంది  కదా  !


*  అలాగే   కొన్ని  గ్రహాలు,  నక్షత్రాలు  ఒక  పద్ధతిలో  ఉంటే     ఆ     విధానం వల్ల   ఏర్పడే   శక్తి    మనిషిపై     ప్రభావాన్ని  చూపిస్తుంది. 
 మొక్కల  నుంచి  తీసిన  రసాయన  ఔషధాలు   మానవులపై  ప్రభావాన్ని  చూపించగలిగినప్పుడు  ,  గ్రహాలు,  నక్షత్రాల  నుంచి  వచ్చే  శక్తి    మానవులపై   ప్రభావాన్ని  చూపించగలగటంలో  ఆశ్చర్యం ఏమీ   లేదు.


 గ్రహాలు,  నక్షత్రాలు    ఉండే    విధానం     యొక్క    ప్రభావం  ,   ఆ  సమయంలో     జన్మించిన  వ్యక్తుల   జీవితంపై  ఉండటంలో  ఆశ్చర్యం  ఏముంది.  


మనిషి    పూర్వజన్మలలో  చేసిన  కర్మలను  బట్టి  ,  అతని  జన్మసమయం  ఉంటుందని  పెద్దలు  చెబుతారు. జాతకం  అనేది   ఆ  వ్యక్తి  యొక్క  భవిష్యత్తు  ఎలా  ఉంటుందో  సూచన  చేస్తుంది.  
 జాతకం  లోని  సూచనలను  బట్టి   ఒకవేళ   భవిష్యత్తులో    కష్టాలు  ఉండే  సూచనలు  కనిపిస్తే ,  వర్తమానంలో  సత్ప్రవర్తనతో  జీవించటం,   ఎక్కువగా  పూజలను,     పుణ్యకర్మలను  ఆచరించటం,    ఇతరులకు   సహాయం  చేయటం ,  వంటి  పద్ధతులను  ఆచరించటం   ద్వారా ..... భవిష్యత్తులో  వచ్చే    కష్టాలను  అధిగమించే  అవకాశాలను  కూడా  పెద్దలు  తెలియజేసారు.


  సతీసావిత్రి,  మార్కండేయుడు  వంటి  వారు  పట్టుదలగా   ప్రయత్నించి  తమ   జీవితాలను    మార్చుకోగలిగారు.


  ఈ  విషయంలో  నా  అభిప్రాయాలను    ఇతరులకు  సరిగ్గా  అర్ధమయ్యేటట్లు    వ్రాయటం  కష్టంగానే  ఉంది.  కానీ,  అర్ధమయ్యేటట్లు  వ్రాయటానికి    వీలయినంత  ప్రయత్నించానండి..


వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Monday, August 27, 2012

ప్రపంచమంతా మాయ అని ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా...


* ఉదాహరణకు   రంగుల  విషయం   తీసుకుంటే....

* మానవులకు  సృష్టిలోని  వస్తువులు  కొన్ని   రంగులలో  కనిపిస్తాయి  కదా  !  కానీ  కొన్ని  పశుపక్ష్యాదులకు  మనలాగా   అన్ని   రంగులు  కనిపించవని  శాస్త్రవేత్తలు   అంటున్నారు.

 

* ఉదా...కొన్ని   
పశుపక్ష్యాదులకు  ,  ప్రపంచం  రంగుల్లో  కాకుండా  తెలుపు  నలుపు  రంగుల్లో  మాత్రమే  కనిపిస్తుందట.
 

*  కొన్ని  జీవులకేమో ,   గ్రే,  పసుపు,  ఆకుపచ్చ ,  నీలం    వంటి  కొన్ని  రంగులు మాత్రమే   కనిపిస్తాయట. 

 

* కొన్ని  రకాల   సీతాకోకచిలుకలకు ,       పుష్పాల  యొక్క  అల్ట్రావయొలెట్   వంటి  రంగులు   కూడా    కనిపిస్తాయట.   ఈ  శక్తి 
వాటికి   ఆహారసంపాదనకు  ఉపయోగపడుతుందట.  
 

  ( ఈ  అల్ట్రావైలెట్  రంగులను  మానవుల  కళ్ళు  గుర్తించలేవట. అందుకే   మనకు  ఆ  రంగులు  కనిపించవట.  )


 

* ఇవన్నీ  చూస్తుంటే,    ఇతర లోకాలకు  (గ్రహాలకు)   చెందిన    వారికి  మరెన్నో  క్రొత్త  రంగులు  కనిపించే  అవకాశం కూడా  ఉందని  మనం  భావించవచ్చు.
 

* ఇలా  ప్రపంచం  ఒక్కొక్క  జీవికి  ఒక్కొక్క  విధంగా  కనిపిస్తుంది.

 

*  మరి  ప్రపంచంలో  అసలు  ఎన్ని  రంగులు  ఉన్నాయి  ? అసలు    ఏ  వస్తువు  ఏ  రంగులో  ఉంటుంది  ?  అని  ప్రశ్నించుకుంటే   దానికి  సరైన  సమాధానం  సృష్టికర్తయైన  దైవానికి  మాత్రమే  తెలుస్తుంది.

 

*   కంటికి  కనిపించేదానిలో  ఏది  నిజమో  ? ఏది  భ్రాంతో  ?  ఎవరికీ  తెలుసు?
మన  కళ్ళకు  కనిపించేదంతా   మాయలా  అనిపిస్తుంది.
 

* కొందరు  ఏమంటారంటే,  తాము  కళ్ళతో  చూస్తేనే  ఏదైనా  నిజమని   నమ్ముతాము.  లేకపోతే  నమ్మము  అంటారు. 
 

* ఒక్కో  వస్తువు రంగు   .....ఒక్కో  జీవికి .... ఒక్కో  విధంగా  కనిపిస్తున్నప్పుడు   ఏది  నిజమని ,  ఎవరిది   నిజమని   నమ్మాలి  ? ఇలాంటప్పుడు   హేతువాదం  అంటే    అర్ధం  ఏమిటి  ? *   ఏ  జీవికి   ఏ   రంగులు  కనిపిస్తాయి  ? అన్నది  ఇక్కడ   ముఖ్యం  కాదు.  వస్తువుకు  ఏ   రంగు   ఉన్నట్లు ? ఏ   రంగు లేనట్లు ?  అసలు  రంగులు  ఉన్నట్లా  ?  లేక  లేనట్లా ? అంతా  మాయ..అని.
 
................................................
 

* ఒక  సమావేశంలో  మానవులు,  పశుపక్ష్యాదులు,  ఇతరగ్రహ  జీవులు  సమావేశమయ్యారట.  వారి  ఎదురుగా  కొన్ని  పుష్పాలున్నాయి.    ఏ  పుష్పం  ఏ  రంగుదో  చెప్పాలని  ఆ  సమావేశం  యొక్క  ఉద్దేశ్యం.
 

*  కొన్ని 
జీవులేమో ....... అన్ని   పుష్పాలు  తెలుపు,  నలుపు  రంగువే . అన్నాయి.
 
 (  ఆ  జంతువులు    తెలుపు,  నలుపు  తప్ప  వేరే  రంగులను  గుర్తించలేవు  మరి.  )
 

* కొన్ని  జీవులేమో ,..... ఆ   పుష్పాలు   గ్రే ,  పసుపు,  ఆకుపచ్చ,  నీలం  ....  రంగుల్లో  మాత్రమే  ఉన్నాయి.  అన్నాయి.

 (  ఈ  జీవులు   గ్రే,  పసుపు,  ఆకుపచ్చ,  నీలం  ....  తప్ప  వేరే  రంగులను  గుర్తించలేవు  .  )
 

* మానవులేమో  ........పుష్పాలు  ఏడురంగుల్లో  ఉన్నాయి  అన్నారు.
 
(  మానవులకు  ఏడు  రంగులకు  సంబంధించిన  రంగులు  కనిపిస్తాయి . 
)
 

* కొన్ని  సీతాకోకచిలుకలు  ....... అల్ట్రావయొలెట్  రంగు కలిగిన  పుష్పాలు  కూడా  ఉన్నాయి . అన్నాయి.
 
 (  ఈ  సీతాకోకచిలుకలకు  మానవులకు  కూడా  కనపడని  అల్ట్రావయొలెట్  రంగు  కనిపిస్తుంది  మరి.  )
 

*  ఇతర  గ్రహాల  జీవులేమో ...... అనేక    కొత్త  రకం  రంగుల్లో  పువ్వులు  ఉన్నాయి . అన్నారు.
 
 (   ఇతర  గ్రహ  జీవులకు  మనకు  కనిపించని  క్రొత్త  రంగులెన్నో  కనిపించే  అవకాశం  ఉండొచ్చు.  )
 

* అందరి  మధ్య  వాదం  పెరిగింది.  నేను  చెప్పిందే  కరెక్ట్  అంటే  నేను  చెప్పిందే  కరెక్ట్  అని ...... అన్ని  జీవులు  ఘర్షణ  పడటం  మొదలెట్టారు.

 

*  ఎందుకంటే  వారి    దృష్టికి  కనపడేదే  వారు  చెప్పగలుగుతున్నారు.
 

* ఈ  ఒక్క  విషయంలోనే  కాదు . సృష్టికి    సంబంధించిన   అన్ని    రహస్యాల    గురించి ,   సృష్టికర్త  అయిన  దైవానికి   మాత్రమే  సరిగ్గా   తెలుస్తుంది.  మనకు  తెలిసింది  చాలా  తక్కువ.
 

*  అందుకే    పూర్వపు  మహర్షులు  తపస్సు,  ధ్యానం  ద్వారా  దైవాన్ని  మెప్పించి ,  భౌతికదృష్టికి  అందని    విషయాలను  కూడా  తెలుసుకుని ,  లోకహితం  కోసం     ప్రపంచానికి  అందించటం  జరిగింది.. 

 

* హేతువాదానికి,  భౌతికవాదానికి  అందని  విషయాలెన్నో    ఆధ్యాత్మికత  ద్వారా   తెలుసుకోవచ్చని  పెద్దలు  తెలియజేసారు.
Friday, August 24, 2012

మరి కొన్ని ముఖ్యమైన విషయాలు ......


* కురువపురం  శ్రీ పాదశ్రీవల్లభస్వామి  వారి  దేవస్థానం  నది  మధ్యలో  ఉన్నది.


*  ఆ  మధ్య     భారీ వరదలు  వచ్చినప్పుడు  కురువపురం  గ్రామములోకి ,    ఇంకా  ,  శ్రీవల్లభపురంలోని  శివాలయం  వద్దకు     వరదనీరు  వచ్చిందట.  కానీ,  నది  మధ్యలోని  శ్రీ పాదశ్రీవల్లభస్వామి  వారి   దేవస్థానానికి   మాత్రం   ఇబ్బంది  అవలేదట.


 *  శ్రీ పాదశ్రీవల్లభస్వామి వారి    దేవస్థానానికి   జూరాల  ప్రాజెక్ట్    10  కిలోమీటర్లు    దూరం  మాత్రమే  ఉండటం  వల్ల ,  భవిష్యత్తులో  ఏం  జరుగుతుందో !  అని     కొందరు  భక్తులు   తమ  అభిప్రాయాలను     వ్యక్తపరుస్తున్నారు.  * ఒక  బ్లాగులో  కురువపురం  గురించి   ఇలా  వ్రాసారు....


 (  Latest information: The Government of Andhra Pradesh intends to construct “JOORALA RIVER PROJECT†which is about only a distance of 10 kms from Kuravapur. The people who are staying in the sorrounding areas narrate their woes and fear that the Kurvapur Kshetra will be submerged in water due to this callous project. So it is the time for every one of us to pray Lord dattatreya not to give any trouble on the powerful Kurvapur due to this proposed project.I'm sure Lord Dattatreya would save the Kshetra and ultimately He decides what has to happen.Please visit this sacred place before it submerges in the waters. )  .........
..........................

 *   దైవం  ఏం  చేస్తారో  !

* ప్రసిద్ధమైన  శ్రీ లలితాసంగమేశ్వర క్షేత్రం   శ్రీశైలం    ప్రాజెక్ట్  కట్టినప్పుడు  ఆ  నీటిలో  మునిగిపోయింది.  వేసవిలో   నీరు  తగ్గినప్పుడు  ఆ  గుడి  కనిపిస్తుంది.  అప్పుడు  భక్తులు  ఆ  దేవాలయాన్ని  దర్శించుకుంటారు.  ఆ  దేవాలయంలోని  కొన్ని భాగాలను  తీసుకువచ్చి  వేరొకచోట  భద్రపరిచారు.   చారిత్రిక  ప్రాధాన్యమున్న  నాగార్జున  కొండ కూడా  నాగార్జునసాగర్  నీటిలో మునిగిపోయిందట. * ఇప్పటికే  కట్టిన  ఆనకట్టల  ఎత్తు  భవిష్యత్తులో  పెంచకుండా  ఉంటే  బాగుండు.


*  ఆశ్చర్యమేమిటంటే,  ఇలా  ఎన్నో  విలువైన   ప్రదేశాలను   నీటిలో  ముంచివేస్తూ,  వేలాది, లక్షలాది  కోట్లు  ఖర్చు  చేసి    మనం    భారీ  ప్రాజెక్టులను   కట్టుకుంటున్నా  కూడా ,  రాష్ట్రంలోని  అనేక  ప్రాంతాల్లో  నీటి  ఎద్దడి,  ఆహారకొరత,  రైతుల  బాధలు  ఇప్పటికీ   కొనసాగుతూనే  ఉన్నాయి.


 * మన  రాష్ట్రంలో    ఎన్నో   ఆనకట్టలున్నాయి.  అయినా  
  రాయలసీమ,   కోస్తా,  ఉత్తరాంధ్రా , తెలంగాణా ,   లోని    ఎన్నో    ప్రాంతాలు  ఇప్పటికీ   నీటి  కరువుతో  అల్లాడుతున్నాయి. 
* ఆశ్చర్యమేమిటంటే,  భారీ  నాగార్జున సాగర్  ప్రాజెక్ట్  చుట్టుప్రక్కల  .... నల్గొండ,   ఖమ్మం,  కృష్ణా ,   గుంటూరు,  ప్రకాశం  ....    జిల్లాలలో  కూడా  ఇప్పటికీ   అనేక    ప్రాంతాలు    చాలినంత  నీరు   లేక    సతమతమవుతున్నాయి.


*నల్గొండ  మరియు  ఎన్నో  జిల్లాలలోని    ఫ్లోరైడ్  నీటి సమస్య    గురించి  అందరికి  తెలిసిన  విషయమే.

 
* ఆనకట్టలు  అవసరమే  కానీ,   భారీ  ఖర్చు  చేసి   భారీ  ఆనకట్టలు  కట్టడం  కన్నా ,  చిన్నతరహా  ఆనకట్టలు  ,  మరియు   చెక్  డ్యాంస్,   వర్షపునీటిని  నిలువ  చేసే  గుంతలు  ఏర్పాటు  చేసుకోవటం,  ఎప్పటికప్పుడు  చెరువులు,  కాలువల్లో  పూడిక  తీసుకోవటం  వంటి  జాగ్రత్తల  వల్ల  తక్కువ  ఖర్చుతో    నీటిని    భద్రపర్చుకోవచ్చు.


* అతి పెద్ద  ఆనకట్టల  వల్ల  కొన్ని  ప్రయోజనాలతో  పాటు  అనేక  సమస్యలు  కూడా  ఉంటాయంటున్నారు.*  నదీతీరంలోని  సారవంతమైన వ్యవసాయ భూములు  మరియు    ఎన్నో  వందల  గ్రామాలు  , డ్యాం    క్రింద   నీటమునిగిపోవటం, ఎంతో  విలువైన  చారిత్రక  సంస్కృతి    కనుమరుగైపోవటం,  ఎందరో  ప్రజలు  నిర్వాసితులవటం ,  అడవులు ,  ఇంకా  అందులో  ఉండే  పశుపక్ష్యాదులు  . ...జీవావరణ వ్యవస్థ     అస్తవ్యస్తం  కావటం  జరుగుతోంది.


* పెద్దమొత్తంలో  నీటిని  కృత్రిమంగా  నిలువ  చేసే  డ్యాముల  వల్ల  భూకంపాలు  వచ్చే  అవకాశాలు  బాగా  పెరుగుతాయని  అంటున్నారు.  ఆ  చుట్టుప్రక్కల  ప్రాంతాలు  క్రమంగా  భూకంపజోన్  క్రిందకు  వచ్చేస్తాయట. * భారీ  డ్యాంస్  కట్టి  బోలెడు  భూమిని  ముంపుకు  గురి  చేస్తే  భూమి  ఎక్కడ  లభిస్తుంది  ? నీరు  కావాలంటే,  వాడిన  నీరు  తిరిగి  శుద్ధి  చేసి   పరిశ్రమలకు , పొలాలకు  సరఫరా  చేయవచ్చు.  కానీ  భూమి  కావాలంటే  దొరకటం  కష్టం  కదా  !  జపాన్  లో  భూమి  సరిపోక   అక్కడి  వాళ్ళు  ఎన్నో  ఇబ్బందులు  పడుతున్నారట.  మనమేమో  ఉన్న  భూమిని   పోగొట్టుకుంటున్నాము..  భూమి,  నీరు  రెండూ  ముఖ్యమైనవే,  రెండింటినీ  జాగ్రత్తగా   చూసుకోవాలి.

*  భద్రత  అనేది  మరో   పెద్ద  సమస్య.  మేము  కొంతకాలం  క్రిందట  ఒక    డ్యాం   ప్రాంతానికి    వెళ్ళాము.    అక్కడ  చాలామంది   పోలీసులు  ఉండి , సందర్శకులు   ఎవరినీ   లోపలికి  వెళ్ళనివ్వటంలేదు.  ఎందుకంటే,  ఆ  ప్రాంతానికి  బెదిరింపు  హెచ్చరికలు    వచ్చాయట.


*  భద్రత  రీత్యా  చూసినా  ....విద్యుత్  ఉత్పత్తికి  .... జలవిద్యుత్   ఉత్పత్తి  కేంద్రాలను ,  అణువిద్యుత్ కేంద్రాలను  ఏర్పాటు  చేయటం  కన్నా,   సౌరవిద్యుతుత్పత్తి  కేంద్రాలను    ఏర్పాటు  చేసుకోవటం    మంచిది.


* పెద్ద  ఆఫీసులు,  అపార్ట్మెంట్స్,  హాస్పిటల్స్,   పరిశ్రమలు  ...ఇలా  ఎవరికి  వారు  సోలార్  ప్యానల్స్  ఏర్పాటు  చేసుకోవచ్చు.  జర్మనీ  వంటి  దేశాల్లో  ఇళ్ళకు  కూడా  సోలార్  విద్యుత్  ను  ఉపయోగిస్తున్నారట.  దీనివల్ల  విద్యుత్  కష్టాలు  చాలా  వరకూ  తగ్గుతాయి.


* సౌరవిద్యుత్  గురించి  అంతగా  తెలియని  రోజుల్లో ,  పంటలకు  నీరు  మరియు     జలవిద్యుత్  వంటి  అవసరాలకు    భారీ  డ్యాంస్  కట్టారు.    ఇప్పుడు  సౌరవిద్యుత్  యొక్క  ఉపయోగాలు  తెలిసాయి  కాబట్టి  ,  జలవిద్యుత్  ను  నెమ్మదిగా  తగ్గించి  పూర్తిగా  సౌరవిద్యుత్ ను  అభివృద్ధి  చేసుకోవటం  ఎంతో  మంచిది.


*  పూర్వం  ప్రతి  గ్రామానికి  చెరువు  ఉండేది.  వేసవి  వస్తే  గ్రామస్తులు   చెరువులో   పూడిక  తీసి   వర్షాకాలానికి  సిద్ధం  చేసుకునేవారు.  అప్పుడు  చెరువులో  నీరు  సమృద్ధిగా  ఉండేది.  ఇప్పుడు  పూడికలు   తీయని  చెరువులు ,   ప్లాస్టిక్  గుట్టలు  అడ్డంబడి  పూడుకుపోయే   కాలువలు  వల్ల ..... వరదలు  ఊళ్ళను  ముంచెత్తుతున్నాయి.


*  వర్షపు  నీరు  సముద్రంలోకి   వెళ్ళటం,  మళ్ళీ  ఆ  నీరు  ఆవిరై  వానలా  పడటం  ...ఈ  చక్రం  సరిగ్గా  ఉంటేనే  సకాలంలో  వర్షాలు  పడటం  జరుగుతుంది.  మనుషులు  తమ    మితిమీరిన  కోరికలతో   ఈ  వ్యవస్థను  అస్థవ్యస్థం  చేయటానికి  ప్రయత్నిస్తున్నారు. 


* సముద్రంలోకి  బొట్టు  నీరు  కూడా  పోగూడదంటూ     అతిగా  ఆనకట్టలు   కట్టేస్తూ,  తాము  వాడిన  మురికి  నీటిని,  పారిశ్రామిక  వ్యర్ధాలను      మాత్రం   ధారాళంగా  నదుల్లోకీ,  సముద్రాల్లోకి  వదిలేస్తున్నారు.


*  పూర్వం  త్రాగటానికి,  ఇతర  అవసరాలకు  నీటిని  ఉపయోగించేవారు.  ఇప్పుడు  త్రాగటానికన్నా  పారిశ్రామిక  అవసరాలకు  ఎక్కువ  నీటిని  వినియోగిస్తున్నారు.  ఇలా  మన  అవసరాలను  పెంచుకుంటూ  పోతే  ఎక్కడెక్కడి  వనరులూ  చాలవు.  మానవులు  కోరికలను  తగ్గించుకుంటేనే  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.* పూర్వీకులు  కూడా డ్యాంస్    కట్టారు. అయితే,  పూర్వీకులు  తక్కువ   ఆనకట్టలు      కట్టి  చెరువులను  ,  కాలువలను   చక్కగా    అభివృద్ధి  చేసుకున్నారు.  ఇప్పటి  వాళ్ళు  ఎక్కువ  ఆనకట్టలు    కట్టి  చెరువులను,  కాలువలను  పూడిక  తీయకుండా  వదిలేయటం,  నిర్లక్ష్యం  చేయటం  జరుగుతోంది.


 * భారీ  డ్యాంస్  కట్టడం  అంత  మంచిది   కాదని   ప్రపంచవ్యాప్తంగా    ఇప్పుడు   ఎందరో  అభిప్రాయపడుతున్నారు.    మేధాపాట్కర్  వంటి  వారు  కూడా  ఇలాగే  అంటున్నారు  . 

Wednesday, August 22, 2012

కురువపురం గురించి మరి కొన్ని వివరములు. .ఓం.

శ్రీ అనఘాదేవీ సమేత శ్రీ  దత్తాత్రేయుల  వారికి  అనేక  నమస్కారములు.


   శ్రీపాదశ్రీవల్లభస్వామి వారు   పిఠాపురంలో  జన్మించారు.  పిఠాపురంలో  వారి  దేవస్థానం  ఉంది.  కురువపురం , శ్రీపాదశ్రీవల్లభ స్వామి  వారు  తపస్సు  చేసిన  ప్రాంతం .


 కురువపురం  వెళ్ళటానికి  కుదరని  వారు .... పిఠాపురం  వెళ్ళి కూడా  దైవ  దర్శనం  చేసుకోవచ్చును.


  కురువపురం (  కురుంగడ్డ  )  కృష్ణా  నది  మధ్యలో  ఒక  ద్వీపంలో   ఉంది.  ఇక్కడ   శ్రీపాదశ్రీవల్లభస్వామి వారి  దేవస్థానం,  వారు  తపస్సు  చేసిన..  వటవృక్షం  .....మొదలైన    దర్శనీయ  స్థలాలున్నాయి.


 ఈ  ద్వీపంలో ,    దేవస్థానానికి   దూరంగా    చాలా  ఇళ్ళు  ఉన్నాయట. 


  దేవస్థానం  ఉన్న  ప్రదేశంలో  మాత్రం   ఎక్కువ  ఇళ్ళు  ఉండవు.  వెళ్ళిన  భక్తులకు  మోడర్న్  సదుపాయాలు లేని   కొన్ని  గదులు  మాత్రం  అందుబాటులో   ఉన్నాయి.


 వెళ్ళే  ముందు  పూజారి  గారికి  ఫోనులో   సమాచారాన్ని   తెలియజేస్తే  గదులు  ఖాళీగా   ఉంటే  ఇస్తారు.


నదికి  ఇవతలి  ఒడ్డున   పంచదేవ్  పహాడ్  అనే  ఊరు  వద్ద  , ( శ్రీ  క్షేత్ర  శ్రీ వల్లభాపురము లో  )  నది  ఒడ్డున    శివాలయం  ఉంది.


 శివాలయం  బయటే  నది   వద్ద  అనేక  తెప్పలు  ఉంటాయి.  వాటిలో  వెళ్ళి   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దర్శనం  చేసుకు  రావచ్చు.


   ఈ  శివాలయం  వారి  వద్ద  భక్తులు  బస  చేయటానికి  గదులు   లభిస్తాయి. సొంతవాహనం  మీద  వెళ్ళినవారు    శివాలయం   వద్ద  వాహనం  నిలుపుకుని  నది  దాటి  వెళ్ళి  దైవదర్శనం  చేసుకురావచ్చు. లేక  రాత్రికి   శివాలయం  వద్ద  గదిలో  విశ్రాంతి  తీసుకుని  ఉదయాన్నే  నది  దాటి  వెళ్ళి  దర్శనం  చేసుకురావచ్చు.శివాలయంలోని  ఆవరణలో   కాలభైరవ  ఆలయం  కూడా  ఉంది.


  శివాలయంలో  స్వామి  వారు  కూర్చున్న  ఆసనాన్ని  దర్శించుకోవచ్చు.   (వారు  కూర్చున్న రాయిని (ఆసనం)  సింహాసనం   క్రింది  బాగాన    తాపడం  చేసారు. ....)


 శివాలయ  ఆవరణంలోని  ఒక  దేవాలయంలో,  ఒక  రాయిలో  త్రిశూలం  ఆకారం   కనిపిస్తుంది.  ఔదుంబర  వృక్షం  ఉన్న  ఈ  దేవాలయం  చుట్టూ    "  దిగంబరా  !  దిగంబరా  !!  శ్రీ  పాద  వల్లభ  దిగంబరా  !!!  " అనుకుంటూ  27  ప్రదక్షిణలు  చేస్తే  కోరికలు  తీరతాయని  అక్కడి  వాళ్ళు  చెప్పారు.  


 నాకు   అర్ధమయినంతలో  విషయాలను  వ్రాసానండి.  వ్రాసిన  దానిలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.  
 .......................................


 ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికీ  అనేక  కృతజ్ఞతలండి.
................................................

1............Shripad Shri Vallabha. 


2...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

 

3..Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha).............

 


మా కురువపుర యాత్ర ౨౦౦౮ - YouTube

 

ఈ  వీడియోలో  ఉన్నవారు  బ్లాగుల్లో....  తాడేపల్లి  గారేనా  ? కాదా  ?  అనే వివరములు   నాకు  తెలియదండి.

  ...........................

*  Kuravpur - Sreepada Sreevallabha Maha Samasthan  

 దేవ స్థానం  గురించి  ఎన్నో  వివరములు  ఈ  లింకులో  ఉన్నాయండి.

 ....................

జగద్గురు  శ్రీశ్రీశ్రీ  దత్తాత్రేయ స్వామి  మహా సంస్థాన  పీఠం.
శ్రీ క్షేత్ర  శ్రీ వల్లభాపురము
పంచ దేవ పహాడ్ ( పోస్ట్ )....509208.
మఖ్తల్  (  మండలం ) మహబూబ్  నగర్  జిల్లా..


ఇక్కడ   నది  దాటి  కొద్ది  దూరం  వెళ్తే   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దేవాలయాన్ని  చేరుకోవచ్చు.

 

 
Monday, August 20, 2012

కురువపురం....ఎంతో గొప్పక్షేత్రం.

ఓం.

 ఆదివారం  మరియు  రంజాన్  పండుగ  శుభసందర్భంగా  సోమవారం  కార్యాలయాలకు  సెలవు  ప్రకటించారు  కదా  ! 
 
మేము  శ్రీపాద  శ్రీవల్లభస్వామి  వారి  దేవస్థానం ..... కురువపురం  వెళ్ళి  వచ్చామండి.  అంతా  దైవం  దయ.  చాలా  అద్భుతంగా  ఉంది.కొంత దూరము  కృష్ణా  నదిలో  తెప్పలో  వెళ్ళాము. కొద్దిగా  భయంగా  అనిపించింది  గానీ,  దైవం  దయవల్ల  క్షేమంగా  చేరాము. 


 కురువపురం  ఒక  ద్వీపమ్ . నది  మధ్యలో   ఉన్నది.  అయితే, వేసవిలో  నదిలో (నీరు లేనప్పుడు)  నడిచి వెళ్ళ వచ్చట .


ఈ  క్షేత్రం  ఎంతో  గొప్పక్షేత్రం.  జీవితంలో  ఒక్కసారైనా  దర్శించుకుంటే  మంచిదని  పెద్దలు  చెబుతున్నారు.


  అంతా  అద్భుతమైన  ప్రకృతి  సౌందర్యం,  పక్షుల  కిలకిలారావాలు,  పచ్చటి  పొలాలు  చాలా  బాగున్నాయి.


 దర్శనం  చేసుకుని   ఈ  రోజే    తిరిగి  వచ్చాము.

కురువపురం  దేవాలయం  ఎంతో  ప్రశాంతంగా  అద్భుతంగా  ఉంది.


 ఇంత  అద్భుతమైన  దర్శనాన్ని  అనుగ్రహించిన  శ్రీపాద  శ్రీ  వల్లభ  స్వామి  వారికి  అనేక  నమస్కారములు.   అంతా  దైవం  దయ.  


కురువపురం  గురించి ,   ఈ  లింక్  లో..... వివరములున్నాయి.  

1............Shripad Shri Vallabha. 

2...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

 

3..Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha).............

 

*  Kuravpur - Sreepada Sreevallabha Maha Samasthan  

 

 దేవ స్థానం  గురించి  ఎన్నో  వివరములు  ఈ  లింకులో  ఉన్నాయండి.

....................

జగద్గురు  శ్రీశ్రీశ్రీ  దత్తాత్రేయ స్వామి  మహా సంస్థాన  పీఠం.
శ్రీ క్షేత్ర  శ్రీ వల్లభాపురము
పంచ దేవ పహాడ్ ( పోస్ట్ )....509208.
మఖ్తల్  (  మండలం ) మహబూబ్  నగర్  జిల్లా..


ఇక్కడ   నది  దాటి  కొద్ది  దూరం  వెళ్తే   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దేవాలయాన్ని  చేరుకోవచ్చు.

 

 

Friday, August 17, 2012

లక్ష్మీకటాక్షం.....

ఓం.
శ్రీ లక్ష్మీదేవి    అనుగ్రహాన్ని   పొందటానికి   పెద్దలు    అనేక  ఉపాయాలను   తెలియజేయటం  జరిగింది.   భక్తితో   పూజలు  చేయటం,   సత్ప్రవర్తనను  కలిగి ఉండటం .....  సత్కార్యాలు  చేయటం....... ఇలా...  లక్ష్మీ  అనుగ్రహాన్ని  పొందవచ్చు. 


ఇంకా ,   గడపకు   పసుపు   రాయటం,     గుమ్మం   బయట  ఆవుపేడతో  కళ్ళాపి  జల్లి  చక్కటి  ముగ్గులు    వేయటం......... ఇలా  చేయటం  వల్ల    కూడా    లక్ష్మీ  అనుగ్రహం  కలుగుతుందని  పెద్దలు  చెప్పేవారు.  

 

 పసుపు  రాయటం,  ఆవుపేడతో  కళ్ళాపి  జల్లటం ,  ముగ్గు  వెయ్యటం   వల్ల  ఇంటి  చుట్టు  ప్రక్కల  చెడు  బాక్టీరియా  చనిపోతుంది.    పరిసరాలు  శుభ్రంగా  ఉంటాయి. 

 

  పసుపు,  ఆవు  పంచకం,  ఆవు పేడ,  మొదలైన  వాటికి  బాక్టీరియాను  చంపే  గుణం  ఉన్నదని  ఆధునికులు  కనుగొన్నారు.  

 

  ఇవన్నీ  గమనిస్తే ,   పూర్వీకులకు  ఎంతో  విజ్ఞానం  తెలుసని  మనకు   స్పష్టంగా  తెలుస్తుంది. 

 

   శుచీశుభ్రత  ఉన్న  దగ్గర    లక్ష్మీదేవి  ఉంటుందని,    అశుభ్రంగా  ఉంటే  లక్ష్మీదేవి  ఇష్టపడదనీ  పెద్దలు  చెప్పేవారు.  అందువల్ల  ,  భయభక్తులతో    పూర్వం   ప్రజలు  చక్కగా  శుచీశుభ్రతలను  పాటించేవారు. 

 

  ఇలా  శుచీశుభ్రతలను  పాటించటం  వల్ల   ఇంటిలో    అందరూ  ఆరోగ్యంగా  ఉంటారు .   అలా  అందరూ   శుభ్రతను  పాటిస్తే  సమాజంలోని  అందరూ  ఆరోగ్యంగా  ఉంటారు.  ఆరోగ్యమే  మహా  భాగ్యం  కదా  !

 
............................

ఇంకా, భార్యాభర్తలు  గొడవలు  పడే  ఇంట్లో  లక్ష్మీదేవి  ఉండదని  కూడా  పెద్దలు   తెలియజేయటం  జరిగింది. ఈ  విషయం  కూడా  నిజమే. 

 

 ఇంట్లో  పెద్దవాళ్ళు  గొడవలు   పడుతుంటే  ఇక  పిల్లల  పరిస్థితి , ఆ   ఇంటి  పరిస్థితి ,తద్వారా  సమాజం    ఏం  బాగుంటుంది  .

 

 అందరూ  లక్ష్మీదేవి  అనుగ్రహాన్ని    పొంది  ఆరోగ్యంగా,  ఆనందంగా,  సిరిసంపదలతో  జీవించాలని  పెద్దలు  ఎన్నో  చక్కటి  ఆచారాలను ,  అలవాట్లను   దైనందిక  జీవితంలో    ఏర్పరిచారు.

 
..................................................


 

డబ్బు  ఉన్న  వాళ్ళు  మాత్రమే  లక్ష్మీ  కటాక్షాన్ని  పొందినవారని,   ధనం  మాత్రమే  లక్ష్మీ  స్వరూపం  అనీ   అనుకుంటారు  కొందరు.   కానీ,     ధనం తో  పాటూ   లక్ష్మీదేవి   ఇంకా    అనేక    రూపాల్లో  ఉంటుంది....... స్వర్గలక్ష్మి,  రాజ్యలక్ష్మి  ,  మోక్షలక్ష్మి....ఇలా....
 

ఇంకా...  ..... అష్టలక్ష్ములుగా ........ ఆదిలక్ష్మి,  ధాన్యం,   ధైర్యం,  గజములు (  రధ  గజ  తురగ పదాది..)  సంతానం,   విజయం,   విద్యా,   ధనం, .......ఇవన్నీ  లక్ష్మీ  స్వరూపాలే.

 

ఒకరికి  ఇంటినిండా  ధాన్యపు  రాశులుంటాయి.   అయినా    అతనికి  సుగర్  ,  బిపి , అజీర్ణం.. వంటి  వ్యాధులు  ఉంటే,   కడుపు  నిండా  తినటానికి  కూడా  అతడికి  అవకాశం  ఉండదు.

 

  ఒక  పేద  వ్యక్తికి   ఇంటి  నిండా  ధాన్యపు  రాశులు  లేకపోయినా , సుగర్ .. వంటి  జబ్బులు  లేకుండా  ఉంటే , అతడు  తనకు  ఉన్నంతలో   ,   ఇష్టమైన  ఆహారాన్ని    తినగలడు. 

 

  డబ్బున్నా  తినలేని  వ్యక్తి....... తక్కువ  డబ్బున్నా   చక్కగా  తినగలిగే  వ్యక్తి ...........  వీళ్ళిద్దరికి    కూడా   ఏదో  విధంగా   లక్ష్మీకటాక్షం  ఉందని  చెప్పుకోవచ్చు.

 

ఒక  వ్యక్తికి   ధనం    అంతగా  లేకున్నా ,   అతడికి  ధైర్యం  ఉంటే  , ఆ వ్యక్తికి   క్రమంగా  ధనలక్ష్మి  అనుగ్రహం    కూడా   లభించే  అవకాశం  ఉంది.

 

ధైర్యం  లేని  వ్యక్తి   తన  ధనాన్ని  కూడా  క్రమంగా  కోల్పోయే    అవకాశం   ఉంది.

 

ఇక  మోక్షలక్ష్మి   విషయంలో  పేదవారు,   డబ్బున్న వారు  అనే  తేడాలు  లేవు.  మోక్షలక్ష్మి  అనుగ్రహాన్ని  పొందిన  వారు  ఎంతో  అదృష్టవంతులు.

 

ఇవన్నీ  గమనిస్తే,  లక్ష్మీదేవి  అనుగ్రహం  అనేక  విధాలుగా    ఉంటుందని  మనం  తెలుసుకోవచ్చు.  అందుకే  ఎవరూ  నిరాశ చెందకూడదు. 


 లక్ష్మీకటాక్షం   అందరికీ  ఏదో  రూపంలో  ఉంటూనే  ఉంటుంది..

Wednesday, August 15, 2012

ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 నోట్లు.......


 దేశానికి  స్వాతంత్ర్యం  రావటానికి   ఎన్నో  త్యాగాలను  చేసిన     ఎందరో   త్యాగమూర్తులకు   అనేక  నమస్కారములు.

..................................


అసలు మన దేశము
లో   ఇంత దరిద్రము   ఎందుకు   ఉందంటే , ఒకరి దగ్గర 100కోట్లు ఉంటే ఒకరి దగ్గర ఓటు తప్ప నోట్లు,  కోట్లు ఉండవు కాబట్టి.  కొంత   మంది ప్రపంచములో సొమ్మంతా వారి తరతరాలకి దాచి అత్యాశకు పోతున్నారు.
 

అసలు మనకు కావాల్సిన దానికన్న ఒక లిమిట్ దాటి సంపాదించుకోవటము మహా పాపము. ధనవంతులు చాలా మందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది కాని , కడుపు నిండా ఇష్టమయినవి తినలేరు. 


 మనలో చాల మందికి ఏ షుగరు జబ్బో, బి.పి,జబ్బో ఉంటాయి. ఇంకా,  మనశ్శాంతి లేక ఎన్నో కష్టాలుంటాయి. అప్పుడు డబ్బు ఎక్కువ ఉండి కూడా ఏం  లాభం ?  అందరి సొమ్ము దోచుకునేవాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టే  అవకాశం   ఉంది.
 

 కుటుంబంలో  సమస్యలు,   ప్రమాదాలు  వంటి  సమస్యలు  ..... డబ్బు  ఉన్న  వాళ్ళకి,  డబ్బు  లేని  వాళ్ళకు  కూడా  ఉండే  అవకాశం  ఉంది.  అలాంటప్పుడు  డబ్బు  చాలా  ఉన్నా  ఏం  లాభం ...దయచేసి , ధనవంతులు మరీ ఎక్కువ  డబ్బు పోగు చేసుకోవటం మాని ,  పేద వాళ్ళు కూడా పైకి రావటానికి సహాయపడితే ఎంతో పుణ్యము చేసిన వాళ్ళవుతారు. ఆ పుణ్యము వల్ల ధనవంతులకు కూడా జీవితములో ఎంతో సంతోషముగా ఉంటుంది......అంతే గాని ,  పేదలను దోచుకుని భగవంతుని పూజ చెయ్యటము మహా పాపము.
 

ఈ ప్రపంచము మన ఒక్కరి కోసము కాదు. ఈ సంపద అందరితో కలసి మనము పంచుకోవాలి. అప్పుడు మాత్రమే పేదరికం ఉండదు.మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు ఉండే   తృప్తి   ఎన్ని లక్షలున్నా,  కోట్లున్నా  రాదు. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. దయ చేసి,   ధనవంతులూ కొంచెము ఆలోచించండి. ప్లీజ్...
 

మనము ఏదైనా కష్ట సమయములో రక్షించమని భగవంతుని అడిగితే , దానికి మన అర్హత, మనకు  ఎంత కోట్ల ఆస్తి ఉందని ఆయన ఆలోచించడు. మనము ఎంత మందికి సహాయము చేశామని మాత్రమే ఆయన చూస్తాడు.......
Monday, August 13, 2012

విపరీతంగా పెరిగిపోయిన ఆర్ధిక అసమానతలు.

 ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికీ  అనేక  కృతజ్ఞతలండి.
.................................


నీరు,  భూమి, సూర్యుడు,  గాలి,   వాతావరణం,    విత్తనాలు .......... ..ఇలా    మనిషి  జీవనానికి  కావలసిన  ఎన్నింటినో    దైవం  చక్కగా     సృష్టించి  ఇస్తే ,  వాటిని  సరిగ్గా  పంచుకుని  జీవించటం  కూడా    ప్రజలకు  చేతకావటం  లేదు.  ఇప్పటికీ    కొందరు  ప్రజలు   ఆహారం  కూడా  లభించక  మరణించటం  అనేది  ఎంతో  సిగ్గుపడవలసిన  విషయం.   చక్కటి  ప్రణాళిక,  చిత్తశుద్ధి  ఉంటే  సమాజంలో  ఇన్ని  అసమానతలు  ఉండవు   కదా! 

 

  కొందరు  పదితరాలకు  సరిపడా  సంపాదించి    దాచిపెడుతుంటారు.  తాము  మరణించిన  తరువాత  ఆ  సొమ్ము  ఏమవుతుందో  వీరికి  తెలియదు.  అయినా  అత్యాశతో  నానా  కష్టాలు  పడి  సంపాదిస్తారు.  అత్యాశ  వల్ల  ఇహలోకంలోనూ,  పరలోకం  లోనూ  కూడా  ఎన్నో  కష్టాలను  అనుభవించవలసి  వస్తుందని  ప్రాచీనులు  చెప్పటం  జరిగింది.  అన్నీ  తెలిసి  కూడా  ప్రజలు  స్వార్దాన్ని  తగ్గించుకోలేకపోవటం  చూస్తే   ఆశ్చర్యంగా  ఉంటుంది. 


 ఇప్పుడు  సమాజంలో  ప్రజల  మధ్య  ఆర్ధిక  అసమానతలు  విపరీతంగా   పెరిగి పోయాయి. వ్యాపారస్తులు,  ఉద్యోగస్తులు,  అన్నిరంగాల  ప్రజల  ఆదాయాల్లో  విపరీతమైన  తేడాలు  ఉంటున్నాయి. 

 

    నేను  రాసిన  రెండు  పాత  టపాలలోని   కొన్ని  విషయాలను   క్రింద  ఇస్తున్నానండి.  దయచేసి  చదువుతారని  ఆశిస్తూ.........

 
....................

Wednesday, June 9, 2010

 
ధరలు తగ్గాలంటే ఇలా చేస్తే .........

 
ఆ మద్య నా  భర్తకు 
జీతం  పెరిగింది.  అయితే జీతాలు పెరిగిన దాని గురించి నేను పూర్తి స్తాయిలో సంతోషించలేదని వారు అన్నారు.... నాకు వారికి దీని గురించి చిన్న సంభాషణ  కూడ జరిగింది.


అసలు నేను ఏమన్నానంటే , దేశంలో ఇంతమంది పేదవారుంటే ఇంకా జీతం పెంచమనటం తప్పు అనీ,ఒక ప్రక్క వేరే దేశాలలో ఉద్యోగాలు ఊడిపోతుంటే మనం ఉద్యోగం ఉన్నందుకు సంతోషించక జీతం పెంచమనటం అన్యాయం అని ....

 

వారేమో.. ఆ.... మేము ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ ఎంతో కష్టపడుతున్నాము.  అని అన్నారు.

 

నేనేమో.... మీరు ఎ.సి రూంస్ లో పనిచేస్తూ ఇంత బాధపడుతుంటే చాలామంది కార్మికులు, కర్షకులు, చిన్నపనివారు ఎండలో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు వాళ్ళకు జీతాలు ఎవరూ పెంచరు కదా  ! అని  అన్నాను.


 అసలు నా అభిప్రయమేమిటంటేనండీ , ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలండి.

డబ్బంతా కొంతమంది జీతాలకే పోతే పేదవారు ఏమి కావాలి. వారి కష్టం కష్టం కాదా....జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ధరలు  పెరిగితే  మళ్ళీ  జీతాలు  పెంచమంటారు.  ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...ఇదొక అంతులేని కధ....ఒక ఉద్యోగికి 40వేలు నెలకు వస్తే ఒక చిన్న కార్మిక, చిన్న వ్రుత్తి వారికి 4 వేలు నెలకు వస్తే పెరిగిన జీతంవల్ల పెద్ద ఉద్యోగికి బాధ ఉండదు. కాని చిన్న ఉద్యోగి ఎలా బ్రతకాలి......? ఉద్యోగం లేని వారికి జీతాలు ఎవరు పెంచుతారు. రైతుల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారిని ఎవరూ పట్టించుకోరు. పేదవారు , కూలీలు వీరు ఈ రేట్లతో ఎలా బ్రతకాలి...? అందరి కష్టం ఒకటి కాదా.. .


జీతం పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా.. అని నా అభిప్రాయం. ...... ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు,,,స్తలములు కొనేవాళ్ళు లేక  ధరలు తగ్గాయి కదా.. ఇంటి అద్దెలు కూడా తగ్గాయి. .కొంతమంది చిన్న,మద్య తరగతి వాళ్ళు ఇళ్ళు,అవి కొనుక్కున్నారు కూడ..


అసలు ధరలు తగ్గించటం వల్ల వ్యాపారులకు కూడా లాభం. ధరలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది సరుకులు కొంటే ధరలు తగ్గిస్తే 20 మంది వస్తువులు కొనే చాన్సుంది. అందరికి అన్నీ అందుబాటులోకి వస్తాయి.


 ఏ వ్రుత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయములులలో ఇంత పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు. ఆ పరమాత్మ ద్రుష్టిలో రాజుకు, బంటుకు, ఒకే రకమయిన విలువవుంటుంది....రానురాను మన దేశంలో పేదలు మరీ పేదలుగాను, ధనికులు మరీ ధనికులు గాను అవ్వటం చూసి ఇలా నాకు తోచింది రాస్తున్నాను. నాకు ఇందులో తప్పులు ఉంటాయని భయమే కానీ నా అభిప్రాయములు మీతో చెప్పుకోవటానికి రాస్తున్నానంతేనండి. తప్పులను దయచేసి క్షమించండి..........
...............................

జూన్ 11, 2010
సుఖాలు అనుభవించే కొద్దీ.....పుణ్యక్షయం...................కష్టాలు అనుభవించే కొద్దీ....పాపక్షయం......

 
నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదే మరి.. నా వ్యాసాలను చదివి ఎవరయినా బాధ పడ్డారేమోనని కొంచెము ఫీలయ్యాను. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలలోను మంచివారు, దైవభక్తులు, సాటి ప్రజల  యందు  దయగలవారు చాలామంది ఉంటారు గదా.... వీళ్ళందరూ నన్ను అపార్ధము చేసుకోకూడదని ........... నా అభిప్రాయములు వ్యవస్త గురించె గాని ఏ వ్యక్తుల గురించి కాదని దయచేసి గ్రహించగలరు.మన వ్యవస్ధ ఇలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు , సంపద ప్రభుత్వం దగ్గర కొంత భాగం, మిగతా ప్రజల అందరి వద్దా సమానంగా ఉండాలి.ఇప్పుడేమో ప్రభుత్వం, ప్రజల వద్ద కన్నా ప్రైవేట్ కంపెనీల వద్ద ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఏ విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు?ఇవన్నీ ఆలోచించి పాత కాలం నాయకులు జమీందారీ వ్యవస్త రద్దు, భూపరిమితి చట్టం ఇలా  చేశారు. ఇప్పుడు మళ్ళీ  కొందరి  దగ్గరే   సంపద  ఉండిపోతోంది.


ఇలా ..పేదరికం పెరిగిపోటానికి ఎన్నో కారణాలున్నాయి.


ప్రజలలో కూడా లగ్జరీస్ అంటే వ్యామోహం బాగా పెరిగిపోయింది.  ప్రాధమిక అవసరాలు తీరని   వాళ్ళు  చాలామంది ఉన్నారు.ప్రభుత్వం ముందు
ప్రాధమిక అవసరాలకు  ప్రాముఖ్యం ఇవ్వాలి.


నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ దేవీ భాగవతములో ఇలా చెప్పారండి.

 
దేవేంద్రుడు ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు , బృహస్పతి.. దేవేంద్రుని    ఓదార్చిన సందర్భములో చెప్పిన విషయమిది.

 

ఈ విషయం గురించి ఎక్కువ వివరించే శక్తి నాకు లేదు కానీ అండి, కొంచెం చెప్పగలను. మనము సుఖములు అనుభవించేకొద్దీ మనం చేసుకున్న పుణ్యం యొక్క మొత్తం తగ్గుతూ వస్తుందట. కష్టాలు అనుభవించినప్పుడు పూర్వ జన్మలో చేసిన పాపం తగ్గుతూ వస్తుందంట. అంటే సుఖములు అనుభవించే కొద్ది వారి యొక్క పుణ్యం త్వరగా అయిపోతుంది అన్నమాట. 
మనం ఎప్పుడూ సుఖముగా ఉండాలంటే ,  ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తూనే ఉండాలి. కష్టాలలో ఉన్నవారు తమ పూర్వ జన్మ పాపం తగ్గిపోతోందని తమకు తాము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరయినా ధర్మబధ్ధమైన సుఖాలు మాత్రమే అనుభవించాలి.

 

కొద్ది మంది మహానుభావులు సాత్విక కర్మలతోసహా అన్ని కర్మలను త్యజించి దైవం ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటారంట. ఆ మహానుభావులు ఎక్కడో ఉంటారు.


తల్లి,తండ్రి చేసిన పుణ్యం,పాపం పిల్లలకు తగులుతాయంటారు. దయచేసి అందరూ తమ పిల్లల సుఖం కోసమయినా ధర్మ కార్యాలు మాత్రమే చేయ్యాలి. చెడ్డ పనులు చేసి సంపాదించిన డబ్బుతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా కష్టాలు రావచ్చని పెద్దలు చెపుతున్నారు మరి. భగవంతుడు గుడిలోనే కాదు .మన యొక్క  ధర్మ నడవడిలో కూడా ఉంటారండి........,

Friday, August 10, 2012

శ్రీ కృష్ణ.... ....

ఓం.
శ్రీ  కృష్ణ  స్తుతి
...........................

కస్తూరీతిలకం  లలాటఫలకే
        వక్షస్థలే  కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే
       వేణుం  కరే  కంకణం
సర్వాంగే  హరిచందనం  చ  కలయన్
      కంఠే  చ  ముక్తావళిం
గోప  స్త్రీ  పరివేష్టితో  విజయతే
      గోపాల  చూడామణిః

ఆదౌ  దేవకిదేవి  గర్భ  జననం  గోపీగృహే  వర్ధనం
మాయాపూతన  జీవితాపహరణం  గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన   కౌరవాది  హననం   కుంతీసుతా  పాలనం
హ్యేతద్భాగవతం  పురాణకధితం  శ్రీకృష్ణలీలామృతం....
........................................


కృష్ణజయంతి  సందర్భంగా  ఉట్లోత్సవం  జరుగుతుంది.  ఎందరో  భక్తులు  ఉత్సాహంగా  పాల్గొంటారు.   ఈ  ఉత్సవాన్ని  గమనిస్తే,  మనకు  అనేక   విషయాలు  తెలుస్తాయి. 

 ఉదా......   సమాజాన్ని   చక్కగా  తీర్చిదిద్దుకోవటంలో  వ్యక్తులు   కొన్నిసార్లు   విఫలమైనా  కూడా  ,  అందరూ  కలిసి,    మరలమరల  ప్రయత్నిస్తే  , చక్కటి   సమాజాన్ని    సాధించుకోవచ్చని     మనం  గ్రహించవచ్చు.

 

Wednesday, August 8, 2012

.ఓసోస్ !...ఇంతేనా .! .

ఒక  చిన్న  కధ  ...........
 
 ఎప్పుడూ  బిజీగా  ఉండే  ఒక  వ్యక్తి ,  అర్జంట్   పని  వల్ల  వేరే  ఊరికి  వెళ్తున్నాడు.  ఒక  పల్లెటూరి  దారిలో  వెళ్తుండగా  ఏదో  ప్రాబ్లం  వచ్చి  కారు  ఆగిపోయింది. డ్రైవర్  ఎంత  ప్రయత్నించినా  కారు  స్టార్టవలేదు. 

 

అక్కడకు  కొద్ది  దూరంలో   పశువులను  మేపుకుంటూ   ఒక  చెట్టు  క్రింద  కాలుమీద   కాలు  వేసుకుని 
కూర్చుని  హాయిగా  పాటలు  పాడుకుంటున్న  ఒక  పిల్లవాడు    ఉన్నాడు.  
 

 కారు  ఆగిపోవటం  ...   ఇదంతా    చూసి  ఆ  పిల్లవాడు  గబగబా  వచ్చి  పరామర్శించాడు.   ఊళ్ళోని   మెకానిక్  గురించిన   కొన్ని  వివరాలను  వారికి    తెలియజేశాడు. 

 

 మళ్ళీ  వెళ్ళి  చెట్టు  క్రింద  కూర్చున్నాడు.

  డ్రైవర్  మెకానిక్  కోసం  వెళ్ళాడు.

 పెద్దమనిషి  జరిగినదానికి  తిట్టుకుంటూ , విసుగ్గా  కారు   డోర్  తెరిచి  కూర్చున్నాడు. 

 

 ఏసీ    గదుల్లో  పుట్టిపెరిగిన  అతడికి  ఈ  పైరగాలి,  పచ్చదనం   గురించి  అంతగా  తెలియదు.  ఆహ్లాదకరంగా  వీస్తున్న   గాలివల్ల  , క్రమంగా  అతని  చిరాకు   తగ్గసాగింది. చిత్రంగా , పెద్దమనిషికి   ఆ  పిల్లవానితో  మాట్లాడాలనిపించింది. 
 

కారుదిగి  నిలుచుని  పిల్లవాడిని  పిలిచాడు. .......పిల్లవాడు  వచ్చాడు.

పెద్ద  మనిషి.......నువ్వు    ఎంతవరకూ  చదువుకున్నావు   ?


 
పిల్లవాడు...........చదువు  అంటే  ఏంటి  సార్  ?

 
  (  పెద్దమనిషి  తడబడ్డాడు. ) 

పెద్ద  మనిషి...........చదువు  అంటే,    ఏదన్నా  విషయాన్ని   గురించి  తెలుసుకోవటం,  నేర్చుకోవటం.

 

పిల్లవాడు.............పశువుల  ఆలనా పాలన    ,  వాటి    గురించి    తెలుసుకోవటం,  నేర్చుకోవటం ..... చదువు  కాదా  సార్ ? 


   (పిల్లవాడు  అమాయకంగా  ప్రశ్నించాడు.)
 

  (  మాట  మార్చటం  కోసం ....
పెద్దమనిషి  ,)

పెద్ద  మనిషి............. స్కూల్ కు వెళ్లి    బాగా  చదువుకోవాలి  .

 
పిల్లవాడు............బాగా   చదువుకుంటే  ఏమవుతుంది  సార్    ? 

 
పిల్లవాడు............బాగా  చదువుకుంటే  గొప్ప  ఉద్యోగం  వస్తుంది  .


 
పిల్లవాడు............పెద్ద  ఉద్యోగం  వస్తే  ? (  పిల్లవాడిలో  తెలుసుకోవాలన్న  ఉత్సాహం   పెరిగింది )


 
పెద్ద  మనిషి...........ఉద్యోగం  వస్తే,. .బాగా  డబ్బు  సంపాదించవచ్చు.

 
పిల్లవాడు.............బాగా  డబ్బు  సంపాదిస్తే  ?

 
పెద్ద  మనిషి.............బోలెడు  వస్తువులు  కొనుక్కోవచ్చు.

 
పిల్లవాడు............బోలెడు  వస్తువులు   కొనుక్కుంటే  ?


 
పెద్ద  మనిషి............బోలెడు  వస్తువులు  కొనుక్కుంటే ,..నాలా  కాలు  మీద  కాలు  వేసుకుని  హాయిగా  పాటలు  పాడుకోవచ్చు.


 
పిల్లవాడు..............ఓసోస్  !...ఇంతేనా .! ..

ఇందాకా    నేను  కూడా   కాలు  మీద  కాలు  వేసుకుని  హాయిగా  పాటలు  పాడుకుంటున్నాను  కదా  ! 
 
 (  పిల్లవాడు   తేలిగ్గా  తీసిపారేశాడు.  పెద్దమనిషి  మాటల్ని.) 

 

ఈ  కధను   ఎప్పుడో  చాలా  కాలం  క్రితం  చదివానండి.  సంభాషణలు    చదివినవి  చదివినట్లుగా   గుర్తులేవు.  నాకు  పేరు  తెలియని  ఆ   రచయితకు  నా  కృతజ్ఞతలు....