koodali

Wednesday, November 26, 2014

మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయాలు..

ఇక్కడ నేను వ్రాసిన విషయాలు.. ఒకామె వ్రాసిన పుస్తకంలోని విషయాలకు నా సమాధానాలు. ఆమె పేరు రంగనాయకమ్మ అనుకుంటా..?
 
ఈ విషయాలలో అంతరార్ధాలు, ధర్మసూక్ష్మాలు.. చాలా ఉంటాయి.  అయితే, ఈ రోజుల్లో సామాన్యంగా అర్ధం అయ్యేలా వ్రాయటం జరిగింది.
 
 వాళ్ళ అభిప్రాయాలు.. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? 

anrd.. ధర్మరాజు తనకు తానై వెళ్ళలేదు. దుర్యోధనుడు కోరగా, ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు పెడతాడు పాచికలాటకు రమ్మని. పెద్దలమాట తిరస్కరించటం ఇష్టంలేని  ధర్మరాజు పాచికలాట ఆడటానికి వచ్చి  ఓడిపోయి, వనవాసం  చేస్తూ కష్టపడవలసి వచ్చింది. 


 నీతి..ఇలాంటి విషయాలలో పెద్దవాళ్ళు ఆహ్వానించినా సరే వెళ్ళకుండా ఉండటమే మంచిది.


 వాళ్ళ అభిప్రాయాలు..
వారి తల్లి కుంతి ఆజ్ఞ కదా,‘ఐదుగురూ సమానంగా పంచుకొండి’అని. మర్యాదస్తుల పద్ధతి ఇదేనా? అందుకే గదా, ఒకసారి కర్ణుడు నిండు సభలో.. (కురునందనా! స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు నిర్దేశించారు. కాని, ఈమె అనేకుల వశవర్తిని. కాబట్టి ఖచ్చితంగా ఉంపుడు కత్తే!)..అని అన్నాడు

anrd..ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండటం వెనుక అనేక కారణాలున్నాయి, వాటికి అనేక  అంతరార్ధాలూ ఉన్నాయి. ఆ కారణాలను, అంతరార్ధాలనూ అలా ఉంచి, పైకి  తెలుస్తున్న  విషయాలను బట్టి గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఒక సంసారం ఉంటేనే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎక్కువ సంసారాలు ఉంటే మరిన్ని ఎక్కువ  బాధ్యతలను నెత్తిన వేసుకోవలసి వస్తుంది.ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త వద్ద ఉండేలా  ఏర్పాటు జరిగింది.ఒక భర్త వద్ద ఉన్నప్పుడు మిగతా భర్తల సేవ కుదరదు కదా!ఇలాంటప్పుడు ఎన్నో  చిత్రమైన సమస్యలు ఎదురవుతాయి.ఇలాంటి సందర్భంలోనే అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం, సుభద్రతో వివాహం జరగటం జరిగాయి.    


నీతి: ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఎక్కువ  బాధ్యతలు, ఎక్కువ కష్టాలు వస్తాయి. అందుకే స్త్రీలైనా, పురుషులైనా ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు.


వాళ్ళ అభిప్రాయాలు..ఇటు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతూంటే అటు పాండవులు సభలో కిమ్మనకుండా కూర్చున్నారు!వాళ్ళలో పౌరుషమంటూ లేకపోయింది! 

anrd..ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఫలితంగా దుర్యోధనుడు అతని సోదరులు నాశనమై  పోయారు. ఈ సంఘటన ద్వారా ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలుసుకోవచ్చు.

పాచికలాటలో ఓడిపోయారు కాబట్టి పాండవులు మౌనంగా ఉండిపోయారు. ద్రౌపదిని పణంగా పెట్టడం తప్పే..పాండవులు కూడా జీవితంలో ఏమాత్రం సుఖపడ్డారు ?

వాళ్ళ  అభిప్రాయాలు.. పాండవుల తండ్రి పాండురాజు .. సంతానోత్పత్తి చేయడంలో అసమర్థుడు. అందువల్ల ఐదుగురు దేవతల ఆవాహన చేసి పాండవులు జన్మించేట్లు చేయడం జరిగింది. అరే, దీనికంటే పాండురాజు నిస్సంతుగా మరణించినా బాగుండేది. ఎవరికి వందమంది అన్న కుమారులున్నారో, అతడికి వంశం ఇంకా వృద్ధిచేసుకోవాలని అంత ఆరాటం ఎందుకుండాలి? అది కూడా ఇతరుల భరోసాతో! 

anrd.. వారసులు కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. పాండురాజు ఆలోచన వల్ల కుంతికి,మాద్రికి  సంతానం కలిగారు..ఈ రోజుల్లో కూడా సంతానం లేని దంపతులు కొందరు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ మరియు స్పెర్మ్ బ్యాంక్ సాయంతో సంతానాన్ని  పొందుతున్నారు కదా! 
 
పాండుపుత్రుల  విషయంలో దేవతలే సంతానాన్ని ప్రసాదించారు. ఎన్నో మహిమలు కలిగిన దేవతల ద్వారా సంతానాన్ని పొందటమంటే అది మానవుల విషయంలో వలె ఉండదని మనం గ్రహించాలి.
  
వాళ్ళ అభిప్రాయాలు.. పాండురాజు కూడా ఒకవేళ భీష్ముని లాగా సంతృప్తిపడి ఉంటే, సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుని పుత్రులు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవారు.  

anrd..దుర్యోధనుడు కూడా మొత్తం రాజ్యం తనకే కావాలని అత్యాశకు పోకుండా పాండవులకు  అర్ధరాజ్యం ఇచ్చినా కూడా సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు కదా ! 
ధృతరాష్ట్రుడు అంధుడవటం వల్ల రాజ్యాన్ని పాలించలేడు కాబట్టి, పాండురాజే రాజ్యం యొక్క  బాగోగులు చూస్తూ ఎంతో అభివృద్ధి  చేసాడు. అందుకోసం అయినా పాండవులకు  రాజ్యంలో వాటా ఇవ్వాలి. 

వాళ్ళ  అభిప్రాయాలు.. జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు ఊరక పక్కన కూర్చోవలసింది. అప్పుడు కూడా సింహాసనం కావాలనుకోవడం, ఇదెక్కడి న్యాయం ..

anrd..పందెంలో అనుకున్నట్లు  అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన  తరువాతే  పాండవులు తమ రాజ్యాన్ని అడిగారు. ఇందులో అన్యాయం ఏముంది?

 
వాళ్ళ  అభిప్రాయాలు..కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు.. వీరందరి వధ ధర్మవిరుద్ధంగానే జరిగింది.

anrd..కర్ణుడు,జయద్రథుడు..అధర్మప్రవర్తనలో దుర్యోధనునికి సహకరించారు. ద్రోణుడు, భీష్ముడు వంటి  వీరుల వల్ల దుర్యోధనుని బలం పెరుగుతుంది.దుర్యోధనుని వంటి అసూయాపరుడు, అత్యాశ గలవాళ్ళ  బలం  పెరగటం  సమాజానికి  మంచిది కాదు.
 
 దుష్టుని  బలం పెరగటానికి కారణమవటం వల్ల భీష్ముని, ద్రోణుని సంహరించవలసి వచ్చింది. భీష్ముల వారికి పాండవులంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా, రాజ్యబాగోగులు చూసుకుంటూ దుర్యోధనుని వద్ద ఉండిపోవలసి వచ్చింది.

భీష్ముల వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన విషయాన్ని బట్టి..అధర్మపరుడైన దుర్యోధనుని వద్ద ఉన్నందువల్ల  భీష్ముల వారికి కష్టాలు వచ్చాయి.


నీతి:చెడ్దవాళ్ళ ప్రక్కన ఉంటే , మంచి  వారికీ  కష్టాలు తప్పవని  పెద్దలు తెలియజేసారు . 


వాళ్ళ  అభిప్రాయాలు.. దుశ్శాసనుడు ఒకే ఒక చీరను అపహరిస్తే దానిపైన మహాభారత యుద్ధం చెలరేగింది. శ్రీకృష్ణుడు అంత వస్త్రాపహరణ చేస్తే అది విశుద్ధ భాగవతమై కూర్చుంది. 

anrd.. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను దాచింది చిన్నతనంలో. ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణకు, కృష్ణుడు గోపికల వస్త్రాలను చెట్టు మీద పెట్టడానికి చాలా తేడా ఉంది.

వాళ్ళ  అభిప్రాయాలు.. కృష్ణుని భార్యలను కూడా చివర్లో దొంగలు.. కొల్లగొట్టి తీసుకుపోయారు. (దేవీ భాగవతం . 2/7) (కృష్ణావతారానంతరం అర్జునుడు కృష్ణుని భార్యలను ద్వారక నుండి హస్తినాపురం తీసుకుపోతున్న సమయంలో దారిలో దొంగలు.. వారి ధనాన్నే కాక, కృష్ణుని భార్యలను కూడా అపహరించి తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ సంరక్షకుడు అర్జునుడు అసహాయుడై చూస్తూ ఉండిపోయాడు!)

anrd..కృష్ణావతారానంతరం కృష్ణుని అష్టభార్యలు కూడా అవతారాన్ని చాలించారని  అంటారు. ఈ అష్టభార్యలు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల అవతారాలు కావచ్చని నా అభిప్రాయం.

ఇక,దొంగలు అపహరించి తీసుకుపోయినట్లుగా చెప్పబడినవారు కృష్ణుని 16 వేలమంది భార్యలు. వీరి  గురించి అనేక కధనాలు,అంతరార్ధాలు ఉన్నాయి.ఒక కధనం ప్రకారం ఈ 16వేల మంది భార్యలు దేవలోకంలోని అప్సరసలు.ఒకప్పుడు నరనారాయణులు  తపస్సు  చేసుకుంటుండగా ఈ అప్సరసలు వారి వద్దకు వెళ్ళారు. 


ఏదైనా వరం కోరుకోమని నారాయణుడు  అనగా, తమను భార్యలుగా స్వీకరించమని నారాయణుడిని వరమడిగారు. ఆ జన్మలో కాకుండా  శ్రీకృష్ణావతారంలో వారి కోరిక తీరగలదని నారాయణుడు తెలియజేసాడు.  అలా అనుకోకుండా  వారిని భార్యలుగా స్వీకరించవలసి వచ్చింది నారాయణుడికి(శ్రీకృష్ణుడికి.) 


వరం కోరుకొమ్మని అప్సరసలతో అని కష్టాలలో ఇరుక్కున్నాను ..అలా  అనకుండా మౌనంగా ఉంటే బాగుండేదని నారాయణుడు అనుకుంటారు. 
  
అప్సరసలు కూడా తపస్సు చేసుకుంటున్న వ్యక్తిని కోరరాని వరాలను కోరి ఇబ్బందిపెట్టటం సరైనది కాదు కదా !

వాళ్ళ  అభిప్రాయాలు.. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అన్నదమ్ములకు, దగ్గరి బంధువులకు మధ్య విరోధం పుట్టించి, ఒకరినొకరు చంపుకొనేట్లు చేసి భూభారం తగ్గించాడని పురాణం చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణం. కాని, ..  ఆయన యదువంశం కూడా అదే విధంగా నశించిపోయింది. 

anrd..భూభారాన్ని తగ్గించటం కోసం ఒక ప్రణాళికప్రకారం శ్రీకృష్ణ జననం  జరిగింది.  ఆదిపరాశక్తిఅయినపరమాత్మ ఈ ప్రణాళికను రచించారు. 
 
శ్రీకృష్ణునికి ధర్మాన్ని నిలబెట్టటం ముఖ్యం. ఆ విషయంలో తన,పర భేధాలను లెక్క  జేయరు.యదువంశం కూడా చాలావరకూ క్షీణించినా కృష్ణుడు పట్టించుకోలేదు.
యాదవులు  సురాపానమత్తులో మహర్షిని అవమానించి శాపానికి గురయ్యారు. 

వాళ్ళ  అభిప్రాయాలు.. (ఓ సుందరీ! ఉద్దాలకుని పుత్రుడు శ్వతకేతు ద్వారా ఇది ధర్మసమ్మతంగా చెప్పబడింది...) ఆ రోజుల్లో నియోగం ఆచారంగా ఉండేది.

anrd..పరస్త్రీని తల్లిగా భావించాలని పెద్దలు తెలియజేసిన సంస్కృతిలో..    పుత్రప్రాప్తి కోసం పర స్త్రీ పురుషుడు సంగమించడం శాస్త్రసమ్మతం కాదు.

తెలిసికానీ, తెలియకకానీ..కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తులు సనాతనధర్మాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా సమాజంలో కొన్ని చెడ్డ ఆచారాలను ప్రవేశపెట్టారు.( అయితే,ఆ ఆచారాలను  తరువాతి తరం వాళ్ళు తొలగించారు.) 


సనాతనధర్మాన్ని  సరిగ్గా అర్ధం చేసుకోని వ్యక్తులలో గొప్పవాళ్ళు కూడా ఉండవచ్చు. గొప్పవాళ్ళైనంత మాత్రాన వాళ్ళు చేసిన అధర్మపు పనులు ధర్మబద్ధమైపోవని పర్యవసానాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.


వాళ్ళ  అభిప్రాయాలు..(అహల్య, ద్రౌపదీ తార, కుంతి, మండోదరి ఈ పంచకన్యలను నిత్యం స్మరించినవారి పాపాలన్నీ నశించిపోతాయి.) - ..  పంచ కన్యలని ఎందుకంటున్నావు? వీళ్ళను ప్రాతఃస్మరణీయులని ఎందుకు చెప్తున్నావు? 

anrd...ఈ సంఘటనల  వెనుక అనేక  కారణాలున్నాయి, వాటికి అనేక అంతరార్ధాలూ  ఉన్నాయి. ఆ కాలంలో పతివ్రతలను కన్య అనే సంభోదనతో గౌరవించే వారని నా అభిప్రాయం.

( ఈ సంఘటనలగురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవవచ్చు.ఈ గ్రంధానికి కాపీరైట్స్ ఉన్నాయి.) 

ఇందులో అహల్య తప్పేమీ లేదు.అహల్య భర్త అయిన గౌతముని వేషం ధరించి వచ్చాడు ఇంద్రుడు.తరువాత ఏం జరిగిందో చాలామందికి తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలంటే.. శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ  చరితామృతము..గ్రంధమును చదవగలరు .


కుంతిని సంతానం పొందమని కోరినది ఆమె భర్త అయిన పాండురాజే.(ఈ రోజుల్లో  కూడా సంతానం లేని కొందరు దంపతులు టెస్ట్ట్యూబ్ మరియు స్పెర్మ్ బ్యాంక్   సాయంతో  సంతానాన్ని పొందుతున్నారు కదా! )..ద్రౌపది అయిదుగురిని వివాహం చేసుకోవటానికి వెనుక అనేక కారణాలున్నాయి.  
కుంతీదేవి  మాట కూడా ఒక కారణం.   
అనుకోకుండా అన్న మాట పాటించకపోతే తప్పేమో.. అని ఎవ్వరూ భయపడనవసరం లేదు... కొన్ని సందర్భాలలో అసత్యతా దోషం ఉండదని పెద్దలు తెలియజేసారు.
 
వాళ్ళ  అభిప్రాయాలు.. శకుంతల, దమయంతి సంగతి ...

anrd..శకుంతల, దమయంతి కధల నుంచి ఎన్నో విషయాలను  తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళకు  తెలియకుండా గాంధర్వ వివాహం లాంటివి  చేసుకుంటే ఆనక ఆ పురుషుడు మోసం చేస్తే  ఎలాంటి  పరిస్థితి వచ్చే అవకాశముందో శకుంతల కధ ద్వారా టీనేజీ అమ్మాయిలు తెలుసుకోవచ్చు.

 భార్యభర్త
కు  ఏర్పడిన  సంక్లిష్ట పరిస్థితిలో కూడా సమస్యను ఎదుర్కోవటాన్ని  దమయంతి కధ ద్వారా తెలుసుకోవచ్చు. నలదమయంతి కధలో నలుడు లఘుశంకకు వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకపోవటం వల్ల  అశుచిత్వం కలిగి, కలికి  తన ప్రభావం చూపించటానికి  అవకాశం లభించిందని అంటారు. ఆ విధంగా.. జీవితంలో శుచి, శుభ్రతను చక్కగా పాటించాలని కూడా తెలియజేసారు.

 శకుంతల, కుంతి యొక్క కధల  ద్వారా టీనేజ్  పిల్లలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలి.
 
 
మనకు అందుబాటలో ఎంత విజ్ఞానం ఉన్నాకూడా, దానిని వాడటంలో జాగ్రత్తగా ఉండాలి.  కుంతీదేవి తనకు మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించకుండా జాగ్రత్తగా ఉంటే కర్ణుని పుట్టుక జరిగేది కాదు.

 ఈ రోజుల్లో కూడా టీనేజ్ పిల్లలు ఇంటెర్నెట్, ఫోన్ల ద్వారా వచ్చే ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎన్నో చూడాలనిపించేవి ఉంటాయి. వాటిపట్ల  జాగ్రత్తగా 
ఉండాలి.
 
 వివాహానికి  ముందే  సంతానాన్ని పొందితే  ఎన్నికష్టాలు వస్తాయో వీరి  కధల  ద్వారా  పెద్దలు తెలియజేసారు. ఇలాంటి జాగ్రత్తలను పిల్లలకు చెప్పాలంటే తల్లితండ్రులకు మొహమాటం అడ్డువస్తుంది.
 
 పురాణేతిహాసాల ద్వారా  మానవబలాలనూ, బలహీనతలను  మరియు లోకంలోని రకరకాల సంఘటనలను తెలుసుకుని జాగ్రత్తపడవచ్చు. 

వాళ్ళ  అభిప్రాయాలు..శర్మిష్ఠ, దేవయాని పరాచికాలాడడంలో ఆధునిక యుగాన్ని కూడా హీనపరిచి వెళ్ళారు. 

anrd.. యయాతి..దేవయాని, శర్మిష్ఠల యొక్క ప్రవర్తన  ప్రభావం వారి సంతానంపై కూడా పడింది. 
 
నీతి..పెద్దవాళ్ళ ప్రవర్తన వల్ల పిల్లల జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి

వాళ్ళ  అభిప్రాయాలు.. వ్యాసుని వల్ల పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించారు. నియోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకుందట. కాబట్టి ఆమెకు జన్మాంధుడైన పుత్రుడు కలిగాడు.

anrd..వ్యాసుని ద్వారా అంబికా,అంబాలికలకు  జన్మించిన సంతానాన్ని గమనిస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. సంతానాన్ని పొందే విషయంలో జీవులు చేసిన పాపపుణ్యాల ప్రాధాన్యత ఉంటుంది. దానితో పాటూ స్త్రీ పురుషుల మనో భావాలకు గల ప్రాధాన్యతను కూడా గమనించవచ్చు. 

ఇలాంటి విషయాలను మనకు తెలియజేయటానికి వ్యాసునిద్వారా  ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన  సంఘటనను ప్రాచీనులు మనకు తెలియజేసారేమో.

ఇష్టంలేక కళ్ళు మూసుకున్న అంబికకు  గ్రుడ్డివాడైన  ధృతరాష్ట్రుడు  జన్మించాడు. భయంతో పాలిపోయిన అంబాలికకు పాండురాజు జన్మించాడు.  వ్యతిరేకత లేక  ఉన్న దాసివల్ల మంచివాడైన విదురుడు జన్మించాడు. 
 
అంబిక,అంబాలికలకు సంతానం  కలిగించే  విషయంలో వ్యాసునికి కూడా వ్యతిరేకత ఉండి ఉంటుంది . ఆధునికవిజ్ఞానం కూడా  స్త్రీపురుషుల మానసికభావాల యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. 

గర్భాన్నిధరించాలనుకునే స్త్రీ మరియు గర్భవతి అయిన స్త్రీ మంచి ఆలోచనలను చేయటం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల చక్కటి పిల్లలు పుడతారంటారు.చెడ్డ విషయాలను వినకూడదని,భయపడకూడదనీ అంటారు.


ఇంకొకవిషయమేమిటంటే, వ్యాసుడు స్త్రీసంయోగం లేకుండానే సంతానాన్ని  పొందగలిగిన  మహిమగలవాడు .

 ఉదా..వ్యాసపుత్రుడైన శుకుడు అయోనిజుడిగా జన్మించాడు..( స్త్రీపురుష  సంబంధం లేకుండానే సంతానాన్ని పొందవచ్చని ఆధునిక పరిశోధనల ద్వారా కూడా తెలుస్తోంది.)


 
వాళ్ళ  అభిప్రాయాలు..అంత పెద్ద జ్ఞాని అయి కూడా వ్యాసుడు వ్యభిచారకర్మకు ఎందుకు సిద్ధపడ్డాడు? వ్యభిచార పర్యవసానం మంచిగా ఉండదు. వ్యాసునికి కూడా తర్వాత పశ్చాత్తాపం కలిగింది - (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)

anrd... (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?)..అని వ్యాసుల వారే అనుకున్నారు కదా! ఇంకా ఇందులో మనం తప్పుపట్టవలసింది ఏముంది?

తల్లిసత్యవతి ఆజ్ఞ కాదనలేక తనకు ఇష్టం లేకపోయినా వ్యాసుడు..అంబిక, అంబాలికలకు  సంతానాన్ని ప్రసాదించారు. పర్యవసానాన్ని గమనించితే.. వ్యాసుని వల్ల జన్మించిన ధృతరాష్ట్రుని వారసులైన దుర్యోధనాదులు భారతయుద్ధంలో  మరణించారు. 

............ 
anrd.. మహాభారతంలో లేనిది ప్రపంచంలోనే లేదు. పురాణేతిహాసాల ద్వారా ఎంతో  విజ్ఞానాన్ని ప్రాచీనులు మనకు  అందించారు. దేవతలు కూడా పాత్రధారులై నడిపించిన  జీవిత కధల  ద్వారా(పురాణేతిహాసాల ద్వారా) మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
 
 ఆసక్తి  ఉన్నవారు.. అయోజనిత్వం గురించి వివరాలున్న ఈ క్రింది  లింకును కూడా  చూడగలరు . 

No comments:

Post a Comment